Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంధాలు అనుబంధాలు కరువై ఆస్తికోసం తల్లిదండ్రులను వీధిపాలు చేస్తున్న కథనాలు ఎన్నో. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టించుకోని వైనం. వారిని మభ్యపెట్టి, ఆశపెట్టి ఆస్తులు తమపేర రాయించుకొని రోడ్డుపాలు చేస్తున్న దుస్థితి. మరోకోణంలో వంతులవారీగా నెల రోజులు ఒకరివద్ద, మరో నెల రోజులు వేరొకరివద్ద పంచుకుంటున్నారు. సంబంధీకులు సైతం వారి కున్న ఆస్తిని వారికి చెప్పకుండా మోసపూరితంగా వారి ప్రమేయం లేకుండా పట్టాదారు పాసుపుస్తకాలు చేయించుకున్న కథనాలు. వృద్ధాప్య దశలో వాటి మార్పుల కోసం అధికారుల వెంట ఆ కేసుల వెంట కాళ్లు అరిగేలా తిరిగే వైనం. అక్రమ సంబంధాల మాటున కన్న బిడ్డలనే అంతమొందిస్తున్న తీరూ. ప్రభుత్వ ఉద్యోగాలు పొందేందుకుగాను తల్లిదండ్రులను హతమార్చే సంఘటనలు. కన్న కూతురినే కామంతో కాటువేసే తండ్రులు. దందాలతో, రౌడీయిజంతో రాజకీయ పలుకుబడితో అమాయకుల భూమిని కబ్జా చేసే దాగాకోరులు. ప్రేమ పేరిట మోసంచేసి ఆపై మొఖం చాటువేయటం లేదా అంతమొందించటం వంటి వైనాలు. డబ్బుల కక్కుర్తి కోసం అద్దె గర్బాలు దాల్చటం వంటి వింతపోకడలు. సహజీవనం మాటున అక్రమ సంబంధాలు, పతనమవుతున్న ఎన్నో కుటుంబాలు. అందరి వద్ద అప్పులు చేసి చివరకు ఐపీ పెట్టి ఎందరినో మోసం చేసే వైనాలు. చిట్టీల పేరిట, చిట్ఫండ్ పేరిట సంస్థలను స్థాపించటం, ఆపై బోర్డులు తిప్పేయటం. చట్టాలు పటిష్టంగా ఉన్న వాటి అమలులో లొసుగుల వల్ల తప్పించుకునే వైనం. శిక్షలు వేయకుండా విచారణ పేరుతో కాలయాపన. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను సైతం కూల్చివేస్తూ కుట్రలు చేస్తున్న కొన్ని పార్టీలు. విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ. ప్రజాస్వామ్యం అపహాస్యంపాలు. నూతన చట్టాలు తేవాలి త్వరితగతిన శిక్షలు వేగవంతం చేయాలి. ఓటరులో మార్పులు రావాలి. రానంత వరకు మార్పు అసాధ్యం. -అయినం రఘురామారావు, ఖమ్మం.