Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారదుడు తంబూర దీస్కుండు. చిర్తలు దీస్కోని ఒకపారి కొట్టి జూస్కుండు. యాడికి బోవాలె. యాడ్కిబోతె బాగుంటదని జెరసేపు సోంచాయించిండు. యాడికో ఎందుకు ?ఎప్పటి తీర్గనే యాద్గిరి గుట్టకు బోతె బాగుంటదని అనుకుండు. అనుకోని మొగులు మీదికెల్లి ఎల్లిండు. నారాయన, నారాయన అన్కుంట గాయిన యాద్గిరిగుట్ట దిక్కు రాబట్టిండు.
నడిరాత్రి. అందరు పండుకున్నరు. కొందరు కల్వరిస్తున్నరు. కొందరు కలల బజార్ల దిర్గుతున్నరు. యాడ సప్పుడు లేదు. నారదుడు గుట్టమీద దిగిండు. గుడికి తాలం ఏసి ఉన్నది. నారదుడు మాయమైండు. గుల్లెకు బోయిండు.నర్సిమ్మ సామి ముంగట్కి బోయి -
''నారాయన; నారాయన; అన్నడు.
''నువ్వా నారదా! యాల్ల గాని యాల్ల వొచ్చిన వేంది?'' అని నర్సిమ్మ సామి అడిగిండు.
''పగటీల మీకు పుర్సత్ ఉండదు గదా''
''ఆర్టీసీ హర్తాల్ ఉండె బట్కె నా గుడికి ఎక్వ మంది వొస్తలేదు. నాకు ఎసువంటి పని లేదు''
''హార్తాల్ దెబ్బ మీకు గూడ దాకిందా?''
''అవ్. బస్సులు లేకుంటె నా తాన్కి ఎవ్వరొస్తరు. ఇగ దాంతోని పగటీల గుడ్క నేను పంటున్న''
''ఆర్టీసీ హర్తాల్‌ను ఆపెతందుకు సర్కార్ ఏం జేస్తలేదా?''
''టిఆర్ఎస్ సర్కార్ ఆర్టీసీ జీతగాల్ల లీడర్లను బిల్సి మాట్లాడ్తలేదు. మీదికెల్లి హర్తాల్ జేస్తున్న ఆర్టీసి జీతగాల్ల కొల్వులు బోయినయని ముక్యమంత్రి అన్నడు''
''పనులకు రాని ఆర్టీసీ జీతగాల్ల కొల్వులు బోతె. గిన్ని దినాల సంది సెక్రెటేరియట్‌కు రాని కెసిఆర్సార్ ముక్యమంత్రి కొల్వు బోలేదా?''
''రెండోసారి గెల్వంగనే కెసిఆర్ రాజననుకుంటున్నడు. గాయిన ఏం జేసినా నడుస్తదనుకుంటున్నడు. తమిలనాడుల జయలలిత ముక్యమంత్రిగ ఉండంగ హర్తాల్ జేస్తున్న లచ్చమంది సర్కార్ జీతగాల్లను డిస్మిస్ జేసింది. గని ఎలచ్చన్ల జెనం గామెను డిస్మిస్ జేసిండ్రు''
''దినాం హర్తాల్ జేస్తున్న ఆర్టీసీ జీతగాల్లు ఏం జేస్తున్నరు''
''దర్నలు జేస్తున్నరు. రాస్తారోకోలు జేస్తున్నరు. కెసిఆర్ దిస్టి బొమ్మలను తల్గబెడ్తున్నరు. గుండ్లు గొర్గిచ్చుకుంటున్నరు. టిఆర్ఎస్ సర్కార్‌కు పిండాలు బెడ్తున్నరు. డిపొల కాడ బత్కమ్మ ఆడ్తున్నరు. తొవ్వల మీద వంటావార్పు జేస్తున్నరు. కొంతమంది కాల్లల్ల ముల్లు ఇర్కిచ్చుకోని పండ్లతోని ముక్యమంత్రి దియ్యాలంటున్నరు. జీతాలు ఇస్తలేరని మొత్తుకుంటున్నరు''
''కొంతమంది అదాలత్‌ల కేసు ఏసిండ్రట గదా''
''అవ్. బస్సులు నడ్వకుండ బట్కె జెనంకు తక్లీబైతున్నది. బల్లకు ఎక్వ దినాలు తాతీల్ ఇస్తున్నరు. ఇగ దాంతోని పోరగాల్ల సద్వులు కరాబైతున్నయని కొంతమంది అదాలత్‌ల కేసులు ఏసిండ్రు''
''అదాలత్ ఏమన్నది? అని నారదుడు అడిగిండు.
''ముక్యమంత్రి గాయిన పానానికి రాజననుకుంటున్నడు. గిది రాస్ట్రం. రాజ్జెం గాదు. గాయిన రాజు గాదు. రాస్ట్రం గాయిన జాగీర్ గాదు. ఆర్టీసి జీతగాల్లు గాయిన ఫాంహౌజ్‌ల పని జేసేటి కూలోల్లు గాదు. ఆర్టీసీ హర్తాల్ జెయ్యబట్కె జెనం సస్తున్నరు. ఆదిలాబాద్ జిల్లల బస్సులు లేకుండ బట్కె జెనమే దవకాన్లకు బొవొస్తలేదు. రోగాలు తక్వగాక జెనం సస్తున్నరు. ఎసి అర్రల గూసోని ఆర్టీసి హర్తాల్ గురించి మాట్లాడితె ఎట్ల? జెనం తక్లీబు గురించి సోంచాయిస్తె ఎట్ల? కెనడాల జీతాలు బెంచాలని జీతగాల్లు హర్తాల్ జేస్తె సర్కార్ సప్పుడు జెయ్యలేదు. అటెంకలైన ఎలచ్చన్ల గా సర్కార్ కూలిపోయింది. పిలిప్ఫీన్స్ల గూడ సర్కార్ గిసువంటి లెక్కలు జేస్తేనే జెనం మర్లబడ్డరు అని అదాలత్ జెప్పింది'' అని నర్సిమ్మ సామి అన్నడు.
''అదాలత్ గిట్లజెప్తె కెసిఆర్ ఏమన్నడు?
''హర్తాల్ జేసి ఆర్టీసీ జీతగాల్లు ఆల్లకు ఆల్లే డిస్మిస్ జేసుకుండ్రు. కొల్వులు బోయిన ఆర్టీసి జీతగాల్లతోని మాట్లాడే ముచ్చటేలేదు. కుక్క తోకను ఊప్తది. గని తోకనే కుక్కను ఊపదు. సర్కార్ జెప్పినట్లు ఆర్టీసి జీతగాల్లు ఇనాలె. ఆర్టీసి జీతగాల్లు జెప్పినట్లు సర్కార్ ఇనదు. నా జాత్కం బట్టి జూస్తె ఇప్పట్ల మంచి మూర్తం లేదు. మంచి మూర్తంలనే నేను మాట్లాడ్త. మంచి మూర్తం లేకుండ బట్కె హుజూర్ నగర్‌కు నేను బోలేదు. బై ఎలచ్చన్ల ప్రచారం జెయ్యలేదు. కాలేస్వరం ప్రాజెక్టు నక్ష నేనే దించిన రెవెన్యూ చట్టంల పతొక్క వాక్యం నేనే రాసిన. ఆర్టీసిని ప్రైవేట్ జేసెతందుకు గిప్పుడు నక్ష దించుతున్న. ఇంట్ల కుండలు కొట్లాడితె కడ్పుల ఎల్కలు దుంకులాడితె ఆర్టీసీ జీతగాల్లు హర్తాల్ బంద్ జేస్తరు. తెలంగాన జాతిపిత కెసిఆర్ అన్కుంట నా ఫోట్వకు పాలాబిసేకం జేస్తరు అని కెసిఆర్ అన్నడు'' అని నర్సిమ్మ స్వామి జెప్పిండు.
ఇంతల తెల్లారింది
''వొస్త దేవా'' అన్కుంట నారదుడు మాయమై మొగులు మీద్కి బోయిండు.
- తెలిదేవర భానుమూర్తి
సెల్: 9959150491