Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ పాము పల్లెలకు సుతా పాకుతా వుంది. ఒకప్పుడు నగరాలూ, పట్టణాలలోనే యువతపై బుసులుకొడుతూ విషం చిమ్ముతూ వుండెడిది. రవి కూడా తటిలో పాము కాటు నుంచి తప్పించుకున్నవాడే. వాళ్ల అమ్మానాన్నలు కాస్త చదువుకున్న వాళ్లయి వుండి కొడుకుపై నిఘా పెట్టిండ్రు. పిల్లలన్నంక వారిగ్గూడ కొంచెం స్వేచ్ఛనియ్యాలె. ప్రతిదానికి అనుమానిస్తే ఎట్లా? వాచ్ డాగ్‌లా వెంటపడితే ఎట్లా? అని నిష్టూరమాడిన వాళ్లూ వున్నరు. అయినా రవి తల్లిదండ్రులు ఇవేమీ లెక్క చేయలేదు. నిఘాను పెంచిండ్రు. దొంగను పట్టిండ్రు. రిహాబిలిటేషన్ సెంటర్లో ఓ ఆరునెలలు ఉంచినంక కోలుకుని మనిషైండు రవి. కాస్త ప్రశాంతత కోసం పల్లెబాట పట్టిండు. పాము తన ప్రయాణ దిశ మార్చుకుంది. ఎక్కడికెళ్లినా యువతే దాని లక్ష్యం. అదే పాము కాటేసిన పల్లెలోని తన బాల్యమిత్రుడు సంగతేందో తెలుసుకుని విషం వొళ్లంతా పాకి ప్రాణాలు హరించక ముందే కౌన్సిలింగిచ్చి కాపాడుదామని ఊరి బయటే కల్లు మండువాలోకి అడుగుపెట్టిండు రవి.
ఎప్పటిలాగే కానుగు చెట్టు నీడలో మండువా యమ సందడిగా వుంది. పొలానికి పోయే కూలీలు, పక్కనే కంచెలో పశువులు మేపుకునే కాపరులు, గొర్రె జీవాలను మల్లేసే గొల్లలు, ఎండలో పొద్దంతా కష్టించి కాస్త సేదదీరేందుకు ఒక ముంత కల్లు తాగుదామని వచ్చిన శ్రమ జీవులతో కోలాహలంగా వుంది. చెట్టు నీడలో ఒక రాయి మీద కూర్చున్నడు రవి. కొద్ది దూరంలో నేలమీద గొంతుక్కూర్చుని వున్నాడో పెద్దాయన. వయసు యాభై లోపే వుంటది. కానీ కష్టం తెచ్చిన వయసేమో మనిషి అరవై సంవత్సరాలు పైబడిన వాడిలా కనిపిస్తున్నడు. తలకున్న రుమాలు విప్పి చెవిలోంచి తీసిన బీడీ చేత్తో పట్టుకుని రవి దగ్గరకొచ్చిండు.
''అగ్గి పెట్టె వుందా సారూ?'' ఆశ్చర్యపోయిన రవి, ''నాకలవాటు లేదు పెద్దయ్యా'' అన్నడు. వెనక్కి తిరిగెళ్లి తన కల్లు ముంత, తను తాగే మోదుగాకూ తెచ్చుకుని రవి దగ్గర కూలబడ్డడు పెద్దాయిన.. ''ఏమనుకోకు బాబయ్యా. నీడుందని ఇక్కడ కూకున్నా'' అని రవి వైపు చూసిండు.
''ఫర్వలేదు పెద్దయ్యా!'' అంటూ చేతిలోకి ఓ కానుగాకును తీసుకుని దాని ఈనెలు పరిశీలిస్తూ అతన్ని ఓ కంట గమనిస్తున్నడు రవి. బీడీని చెవిలో దోపుకుని, భుజమ్మీది తువ్వాలతో కళ్లు తుడుచుకున్నడు పెద్దాయన. దేనిగురించో బాధపడుతున్నాడనిపించింది. కాసేపు శూన్యంలోకి చూసిండు. కానుగు చెట్టు ఆకులను పరిశీలిస్తా ఒక నిమిషం గడిపిండు. ఒక చేత్తో మోదుగాకును తీసుకుని దాన్ని కాలి పిక్కకి పైకీ కిందకీ రాసిండు. అదే చేత్తో ఆకును డొప్పలా మడిచిండు. మరోచేత్తో కల్లు ముంతను పైకి లేపిండు. నోటికి ఆనించుకున్న ఆకులోకి కల్లు వొంపుకుంటా మెల్లగా తాగిండు. ఒక దమ్ము పట్టినంక ముంత కిందపెట్టి తువ్వాలు అంచుతో మూతి తుడుచుకున్నడు. ఆకును పక్కనే వున్న కానుగు చెట్టు మొదట్లో వుంచిండు. పెద్దయ్య కళ్లల్లోంచి నీళ్లు బొటబొటా కారుతున్నాయి.
''ఏమయ్యింది పెద్దయ్యా? ఏదైనా గుర్తుకొచ్చిందా?'' అడిగిండు రవి. అంతే! అతని దుఃఖం కట్ట తెగిన చెరువయింది. వెక్కి వెక్కి ఏడుస్తున్నడు. ''అయ్యో గంతగనం ఏడుస్తున్నవేంది పెద్దయ్యా? ఏమయిందో చెప్పు'' మల్లా అడిగిండు. నా కొడుకును తలుసుకుంటే దుఃఖమాగుత లేదు. నాకు మందు గూడా అల్వాటు లేదయ్యా? మావాడు పోయినకానుంచి వాడు లేని బాధను మరిచి పోవటానికి తీసుకుంటున్న. ఇట్లనే కొనసాగిస్తే మా వాడిని తలవటానికి కూడా నేనుండనని డాకటేరు వార్నింగిచ్చిండు సుతా. ఎంత ప్రయత్నించినా నా వల్ల కాలే. ఆ పిచ్చి మందైతే మానేసిన. మరీ తట్టుకోలేనపుడు మాత్రం ఈ మండువకాడికొచ్చి గింత కల్లుబొట్టు తాగి, నీలాంటోళ్ల దగ్గర నా కొడుకు గోడు ఎల్ల బోసుకుంటాను బాబయ్యా. కొడుకు అన్న పదం తన్నోటి వెంట రాంగనే మల్లా పొగిలి పొగిలి వచ్చింది దుఃఖం. తువ్వాల నోటికడ్డం పెట్టుకుని ఆపుకునే విఫలయత్నం చేస్తున్నడు.
''ఊరుకో పెద్దాయనా. ఏడవకు'' అంటూ భుజమ్మీద చెయ్యేసి ఓదార్చిండు రవి. చుట్టూ మండువకాడ జనం ఎవరి సందడిలో వాళ్లున్నరు. ఈ పెద్దాయన బాగోతం రోజూ చూసేదేలే అన్నట్లుంది వాళ్ల వాలకం. ''నన్నొంపమంటవా పెద్దయ కల్లూ?'' ముంత అందుకోబోతూ అన్నడు రవి. ''అయ్యో దొరా! నీ కాళ్లు మొక్కుతా. తప్పయ్యా! మీలాంటి సదువుకున్న పెద్దోళ్లు నాకు కల్లొంపితే ఎట్లయ్యా! నేనొంచుకుంటాలే!'' అని వారించిండు. కొడుకు ముచ్చట ఆరంభించిండు.
దొరా! నా కొడుకు అచ్చం నీలెక్కనే దొరోతిగె ఉంటడయ్యా. నీ మీద ఒక పిడికెడు ఎత్తే వుంటడు. దోరజామ పండయ్యా నా కొడుకూ. అయ్యో! నా తలరాత. ఏంజెప్పనయ్యా నా కొడుకు గురించీ?'' రెండు చేతులతో తలబాదుకుంటూ మల్లా ఏడుపందుకున్నడు. రవి కళ్లల్లోనూ నీళ్లు చిప్పిల్లినయి. భుజం తట్టి అనునయిస్తూ ''కాస్త ధైర్యం తెచ్చుకో పెద్దయ్యా! మన చేతుల్లో ఏముంది? ఆ విధి ఎంత తలుచుకుంటే అంత'' వేదాంతం పలికిండు. కాళ్లు కొంచెం దగ్గరికి ముడుచుకుని మరోసారి కురుస్తున్న కన్నీళ్లను తేటగా తుడుచుకుని రవి వైపు చూసిండు పెద్దయ్య.
అయ్యా! మా వాడు ఎట్లా సచ్చిపోయిండో కూడా అంతు చిక్కకుండా వుందయ్యా. చదువులో కూడా ఫస్టు మా వాడు. డిగ్రీ గా గుట్టకాడ పెద్ద కాలేజిలనే చదివిండు. డిగ్రీ అయినంక 'ఉజ్జోగం సంపాయించుకుంట నాయిన కోచింగ్ తీసుకుంటనే' అంటే సరే కొడకా అని నల్లగొండలనే మల్ల రూం తీసుకుని సదువే ఏర్పాటు కల్పించిన. ఎప్పుడూ సదువు దాసే వుండేదయ్యా నా కొడుక్కి. రెండు మూడు పరిచ్చలు రాసినా ఉజ్జోగం రాలే.
ఓసారి బోనాల పండక్కేమో ఇంటికొచ్చినపుడు ఏదో బాధ కొట్టొచ్చినట్టు కనబడింది ఆడి మొకంల. ''ఏమైంది కొడుకా ఎందుకట్లున్నవ్? ఉజ్జోగం రాట్లేదని బాధపడుతున్నవా? ఏం గాదులే బిడ్డా! నీకేందిరా నువ్వు దొరవ్. మీ తాత సంపాయించిచ్చిన రెండెకరాల భూమిని ఆరెకరాలు జేసిన. రెండెకరాలు చెల్లె పెళ్లికి పోంగ, నీకొక్కడికే ఇంకా నాలుగెకరాల భూమి వుంది. నీకేం తక్కువ కొడుకా. హాయిగా ఎవ్వరికి కౌలుకిచ్చున్నా నాలుగు పుట్ల వడ్లంటే నీ ఇంట్ల తీసుకొచ్చి పోస్తరు. దొరోలిగె బతుకొచ్చు. నీ ఉజ్జోగం పాసున దందు. వస్తెంత రాకపోతెంత బిడ్డా. నా రెక్కలు సల్లగున్నన్ని రోజులు నీకు సావు లేదు బిడ్డా. నేను, అమ్మ కాలంగూడి బొయినంక గూడా ఈ నాలుగెకరాల భూమితో నువ్వాయిగ బతుకొచ్చు. ఉజ్జోగం ఉజ్జోగమని నీమనసు పాడు జేసుకోకు కొడుకా'' అని ఎంతో నచ్చజెప్పినయ్యా. ఊ అన్లే ఆ అన్లే కొడుకు. దేని గురించో బాధపడుతున్నడని అర్థమైంది. ఏందో ఆళ్లమ్మని గూడా కనుక్కోమని చెప్పిన. నా దగ్గరేదన్న దాసినా ఆళ్లమ్మకు మాత్రం అన్నీ జెపుతడు నా కొడుకు. మా ఇంటిదాన్నిశారిస్తే ఏదీ లేదని చెప్పింది. మల్లా నల్లగొండకు బొయిండు. ఏదో బాంకు పరిచ్చ రాస్తా ఫీజూ గట్రా ఓ మూడేలు గావాలెనమ్మా, నాయిన్నడిగియ్యి అని వాళ్లమ్మతో చెపితే ఓ మూన్నెళ్ల కితం పంపిచ్చిన్నయా. నెలకో రెన్నెళ్లకో ఇంటికొచ్చి పోతనే వుండెటోడు. వాళ్లమ్మను జూడంది వుండడాడు.
ఒకసారెందుకో మూడు నెళ్లయినా ఇంటికొస్తలేడు. ఫోన్ల అడిగితే పరిచ్చ కోసం చాల సీరియస్‌గా సదుకుంటన్నానమ్మా. వచ్చేనెల మొదటి వారంల పరీక్ష వుంది రాసినంక వస్తనే అని చెప్పిండట ఫోన్ల ఆళ్లమ్మతోని. ''పోనీలేవే సదుకోనీయి. ఫోను జేసిగూడ ఆన్ని ఇబ్బంది పెట్టకు''అన్నానయ్యా నేను సుత మా ఇంటిదానితో. మల్లో నెల గడిసింది. బోనాలైపోయినంక దసర పండగ ముందల్నో ఏమో ఇంటికొచ్చిండు. ఆ రోజు నేనేమో పత్తి సేన్ల కలుపు తీపిద్దామని కూలోళ్లను తీసుకుని మా బాయికాడికి పోయిన. బువ్వాళ్లకో ఏమో ''నల్లగొండనించి నీ కొడుకొచ్చిండయ్యా. బాంకు పరిచ్చ బానే రాసిండటగనీ, ఇంకో పరిచ్చేదో వుందట. అది గూడ రాయాల్నట. ఇంకో రెండు వేలు కావాల్నంటుండు. అన్నదయ్యా మాయామె.''
ఆడొచ్చిండని తెలవగానే ఎమ్మట్నే ఇంటికి బోయి కొడుకును సూడాలెనని పానం గొట్టుకులాడింది. నేను లేకపోతెనేమో ఈ కలుపు పని ఎక్కడిదక్కడ్నే ఆగిపోయెటట్టుంది. ఏం జేయాలె? అనుకుంటా, ''ఈ పూట వుండి పొమ్మన్రాదే! అంత తొందరేముంది?'' అన్న మాయామెతో ఫోన్ల.
''ససేమిరా ఎళ్లాల్సిందే నల్లగొండకు ఈ రాత్రి'' అన్నడటయ్యా మాయామెతో.
మల్లా దుఃఖం ఆగలేదు పెద్దాయనకు. ఒక నిమిషమాగి చెప్పుడు షురూ జేసిండు.
ఆ పత్తి చేను పాడుగాను. పంట పోతె పొయిందని ఉన్నఫలంగా ఇంటికొచ్చినా నా కొడుకు నాకు దక్కెటోడయ్యా ఆ రాత్రి. నా కొడుకు నాకు దక్కెటోడు. పెద్దాయన కంఠం మల్లా గద్గదమైంది.
''ఆ రాత్రి ఏం జరిగిందీ?'' ఆసక్తిగా అడిగిండు రవి.
ఆ రాత్రి ఏం జరగలేదయ్యా. ఎళ్లెటపుడు మాత్రం మాయామె రెండేలు చేతుల పెట్టి, ''భద్రం కొడుకా! ఆ ఫీజు కట్టినంక మళ్లా ఎంటనే ఇంటికి రా బిడ్డా! లేదంటే మీ నాయినను కలువకుంటనే పోతుంటివీసారి.'' అన్నదట. అప్పుడు మాత్రం మా వాడి కళ్లనిండా నీళ్లు చూసిందట మాయామె. ''అయ్యో కొడుకా! ఎందుకేడుస్తున్నవురా? ఏమైంది బిడ్డా?'' అనడిగిందట బాబుగోరూ మా ఇంటిది.
''ఏం లేదమ్మా! ఊరుకూరికెనే నాకు ఏడుపొస్తుందే. అంతలోనే కోపమొస్తుందెందుకో. ఈ జీవితమెందుకు అనిపిస్తుంది శానాసార్లు. అంతా పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. సిగరెట్ తాగినపుడు మాత్రం హాయిగా వుంటుందే అమ్మా'' అన్నడట.
అదిరిపోయిన మాయామె, ''ఏందిరా నువ్వనేది!? సిగరెట్టా? ఎప్పట్నించి? నాయినకు చెపితే ఇంకేమన్నా వుందా? నీ వీపు విమానం మోత మోగిస్తడు. సదువుకోరా అని పంపిస్తే గిట్లాంటి చెడు అలవాట్లేందిరా తండ్రీ? సదువొద్దేమొద్దు! ఈ పాట్నె ఇంటి పట్నే ఉండిపో. మా కళ్లముందు పడుంటే ఏ కలో గంజో తాగి బతుకొచ్చు. ఎవడి సావాసం పట్టినవురా నాయినా? మన వంశంలో మీ తాతల దగ్గరినుంచి ఎవరికైనా సుట్టో, బీడో, సిగరెట్టో తాగే అలవాటుందా? అట్టాంటిది నీకేందిరా ఈ దయ్యం బట్టింది?!'' అని బాగనే కోప్పడ్డదటయ్యా!.
నాగ్గూడా మానెయ్యాలనే వుందే.. ఈ ఒక్కసారికమ్మా. నాయినకు చెప్పకు. నా మీదొట్టే! ఇగ మల్ల మనూరొచ్చిన కానుంచి సిగరెట్లు మానేస్తనే. ప్లీజమ్మా! మా అమ్మవు కదూ! అని బతిలాడుకుని బ్యాగు తీసుకుని నల్లగొండ బాట బట్టిండయ్యా మావోడు ఆ రాత్రే.
నా పానం ఆగక పొద్దుగాలనే ఫోన్ జేసినం కొడుకుతో మాట్లాడుదామని. ఎంత చేసినా ఫోన్ రింగయితలే. కవరేజి ఏరియాల లేదని చెబుతుంది. సరే! సిగలొస్తలేదేమోలే అనుకుని సరిపెట్టుకున్నం. మల్లా అమ్మటాళ్లపుడు గొర్రె జీవాలు దోలుకుని బాయికాడికి బోయెటపుడు మల్లా ఫోన్ జేసిన. మల్లా గట్లనే రింగయితలేదు. ఫోను మోగని పతిసారి నాకెందుకో అనుమానం పెద్దది కాసాగింది. ఇక లాభం లేదని ఆడి స్నేహితులకు ఫోన్ జేసినం. ఆడితో పాటు రూంలో వుండెటోళ్లిద్దరికి ఫోన్ జేస్తే, ఒక పిల్లోడి ఫోన్ కలిసింది. ఆత్రుతగా ఆరా తీస్తే, ''ఏదో పరీక్ష ఫీజు కట్టాల్నని పొద్దున్నే బయిటికి పొయిండంకుల్ మీవోడు.'' అన్నడు
మనసేదో కీడు శంకిస్తోంది. ఎటూ పాలు పోవటం లేదు. ఒకటే తొక్కులాట. కొడుక్కేమన్నయిందా? అని మా ఇంటిది నేను చెరో దిక్కు కూర్చుని గుండెలవిసేలా ఏడుపందుకున్నం. చుట్టుపక్కలోళ్లు ''ఏమైంది శివయ్యా? మగ పిలగాడు వాడేడకిబోతడు? ఫోన్ ఛార్జింగిట్లయిపోయిందేమో రూంకు చేరుకున్నంగ ఆడే చేస్తడ్లే ఫోన్. అధైర్యపడకుండ్రి. మీవోడికేంగాద్లే.'' అని ఇరుగుపొరుగు ఓదార్చబట్టిండ్రు. ఆ రాత్రి ఎంత పయత్నించినా నిద్రబట్లే. మా ఇంటిది నేను తప్పిపోయిన బిడ్డ కోసం తన్నుకులాడే ఆవుపెయ్యాల్లా ఇంట్లో ఆ మూలకూ ఈ మూలకూ తిరుగుతూ వుండి పోయినం. తెల్లగా తెల్లారింది.
రానే వచ్చింది కబురు. మనసు శంకించిన కీడు నిజమైంది. ఓ పోలీసాయన పొద్దున్నే మాయింటికొచ్చిండు. ''బోనగిరి ఊరుబయట రైల్వే ట్రాకు మీద ఎవరిదో వయసు పిలగాడి మతదేహం ముక్కలు ముక్కలై పడివుందట. ఒక వేళ, మీ వాడి....,'' పోలీసాయన మాట పూర్తయిందో లేదో, బోరు బోరుమని ఏడుస్తూ గుండెలు బాదుకుంటా, దేవుడా ఆ మతదేహం మావాడిది కాకూడాదు. ఏములకొండ లచ్చిమి నర్సిమ్మ సామీ! ఆ శవం మావోడిది కాకుండా సూడు తండ్రీ! నీ కొండకొచ్చి వెయ్యి కొబ్బరి కాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటం తండ్రీ! అని మొక్కుకుంట బస్సుల వడ్డం. నేనూ, మాయామె గుండెలు బాదుకుంటా ఎట్లా పోయినమో తెల్వదు. పాయె బోనగిరి రైల్వే ట్రాకు మీదకు చేరుకునే సరికి అక్కడి దశ్యాన్ని చూసి ఒక్కసారిగా మా గుండెల మీదనుంచి వంద రైళ్లు ఉరికినట్టు చెప్పలేని గోస. ఏడ్చీ ఏడ్చీ కళ్లల్లోని కన్నీళ్లన్నీ ఇంకిపోయినరు. మాయామె పిచ్చిదై సొమ్మసిల్లి రైలు పట్టాల మీదనే కొడుకు మత కళేబరం వద్ద పడిపోయింది. ఏం జరుగుతుందో అర్థం గాలేదు.
ఎవరో ముఖం మీద నీళ్లు చల్లి మాయామెను స్పహలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నరు. నేను పురాగ బేవోసైపోయిన. ముక్కలైన దేహాన్ని ఒకచోట చేర్చి శవం మావాడిదేనని పోలీసులు ధవీకరించిండ్రు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పిటల్కి తరలించిండ్రు. మూడ్రోజుల కితం ఇంట్లకల్లి దొరలా పోయిన కొడుకు రైలు పట్టాల మీద ముక్కలై కనిపించిండు. ఈ ముసలి జీవితాలకు జీవితాంతం తీరని దుఃఖాన్ని మిగిల్చిండయ్యా! తీరని దుఃఖాన్ని మిగిల్చిండు.'' పెద్దాయన గుండెలవిసేలా ఏడ్చిండు.
''యాక్సిడెంటా పెద్దయ్యా? లేదా ఆత్మహత్యా?'' అడిగిండు రవి దీర్ఘంగా నిట్టూర్చి.
పోలీసుల విచారణలో ఆళ్లేదో చెప్పారయ్యా నాకర్థం కాలేదు. ముక్కు చీదుకుంటూ కళ్లొత్తుకుని, తువ్వాలని తల మీద కప్పుకుని పెద్దాయన గొంతు విప్పిండు మల్లా.
ఆ సిగరెట్లే, ఆని పానాలు తీసినయటయ్యా..!
''సిగరెట్లా? అదెట్లా?'' అర్థం గాక ఆశ్చర్యచకితుడైండు రవి.
ఏవేవో మాటలు చెప్పి మా ఇంటిదాన్ని ఒప్పించి నా దగ్గర తీసుకుపోయిన పైసలన్నీ పెట్టి సిగరెట్లు తాగటానికి అలవాటు పడ్డడటయ్యా. అదేదో తెల్ల పౌడరోతిగె వుంటదట గదా! చేతి మీద ఏసుకుని సిగరెట్టు
మీద పెట్టి ముక్కుతో పీల్చుతరట గదయ్యా! గాదాని వల్లే మావాడి పానాలు బోయినయటయ్యా! ఏం జేస్తున్నడో తెల్వని మత్తుల పాము కాటేసిన మనిషి లెక్క రైలు పట్టాలకేసి ఉరికిండంట.'' తువ్వాలని రెండు చేతులతో ముఖానికి అదిమిపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తా వున్నడు పెద్దాయన. రవి కళ్లల్లోనూ ధారాపాతంగా నీళ్లు. పాము విషం వొళ్లంతా పాకి ప్రాణాలు తీయకముందే కౌన్సిలింగిచ్చి కాపాడుదామని వస్తే, కానరాని లోకాలకు వెళ్లిపోయిన తన బాల్యమిత్రుడు ఈ పెద్దాయన కొడుకు ప్రసాద్ కథే వినాల్సి వచ్చిందే అన్న బాధతో వణుకుతున్న పెద్దాయన భుజాలను గట్టిగా పట్టుకుండు రవి.
@@@
మండువాలో ఏదో కలకలం. కానుగు చెట్టు కొమ్మల్లోంచి రెండు నల్ల పక్షులేవో టప టపా రెక్కలు కొట్టుకుంటూ పైకి లేచినరు. చెట్టు మొదట్లోంచి పైకెగబాకుతూ వుందో నల్లని పాము. పెద్దాయిన ఎప్పుడు చూసిండో ఏమో, తన చేతిలో వున్న దుడ్డు కర్రతో ఒక్కటిచ్చిండు. అంతే! పాము రెండు ముక్కలై నేల రాలింది. చెట్టు కింద కలకలమూ సద్దుమణిగింది. నల్ల పక్షులు ఊపిరి పీల్చుకుని మల్లా కానుగు చెట్టు కొమ్మల్లోని గూడు మీద వాలే ప్రయత్నం చేస్తున్నరు. ''అంత దుఃఖంలోనూ పల్లె ప్రకతిలోని పాము పనిపట్టగలిగిన తన బాల్యమిత్రుడు ప్రసాద్ తండ్రయిన ఈ పెద్దాయన పట్నం నుండి పాకుతూ వచ్చి తన కొడుకును కాటేసిన ప్యాకెట్లోని గోధుమ రంగు పామును మాత్రం పసిగట్టలేక పోయిండు అనుకుండు రవి.
- చిత్తలూరి సత్యనారాయణ, 8247432521