Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది ముప్పై ఏళ్లుగా వింటున్న ఒక పాత హిందీ సినిమా పాట. ఈ ఒక్కవారంలోనే మూడుసార్లు ఈ పాటను రేడియోలో విన్నాను.
''ఓ సుందరుడా, లోకమే నా వెనక తిరుగుతోంది - నేనేమో నీ వెంబడి తిరుగుతున్నాను- నన్ను నీ సొంతం చేసుకో- నేను నీకే అంకితం (కుర్బాన్).'' ఇదీ పాటకు పల్లవి. స్త్రీ పాడుతోంది. ఇది పంజాబీ జీవితానికి చెందినదని చెబుతారు. దీనికి సంగీతాన్ని సమకూర్చినవారు ఓ.పి.నయ్యర్ అయినప్పటికీ, పాటను రాసింది మజ్రూV్‌ా సుల్తాన్‌పురి అనే ఉత్తరప్రదేశ్ వాసి.
తమిళనాడు, కేరళల్లాగానే ఉత్తరప్రదేశ్ పంజాబూనూ! ఉత్తరప్రదేశ్ నిండా సారవంతమైన భూములు, వ్యవసాయమే ప్రధానంగా ఉంది. అక్కడ ఇండియాలోని మహత్తరమైన నదులు ప్రవహిస్తున్నాయి. కానీ పంజాబ్‌లో మాత్రం కరవు, ఎడారి, నిరంతర విదేశీ దాడులు, హత్యలు, నిర్బంధ మత మార్పిడులు జరుగుతుంటాయి! పేదరికం ఒక్కటే రెండింటికీ సమానం.
పంజాబీ పాటలను వింటుంటే... వయసులో ఉన్న మగవాళ్లు ఆడవాళ్లు కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండటమన్నది ఏదో రోజూవారి జరిగే సంఘటనలాగా అనిపిస్తుంది. అయితే, అక్కడే ఇప్పటికీ బాల్య వివాహాలు జరుగుతూ ఉండటం సర్వసాధారణ మైన విషయమై పోయింది.
ఒక అంచనా ప్రకారం కొన్ని గ్రామాలలో వందమంది పిల్లలు పుడితే అందులో ఒక్క ఆడపిల్ల కూడా ఉండదు. పోలీసులకు తెలిసేది... ఒక్క కుటుంబం పరువు హత్య గురించి మాత్రమే! అయితే నిజానికి అది పదవ సంఘటనగా జరిగి ఉంటుంది. వాళ్లు చెప్పినట్టుగా అందరూ ఏదో ఒక రకంగా వెనకబడ్డవాళ్లే. చచ్చిన దున్నపోతు తోలును తీసేవాళ్లది ఒక జాతి అయితే, ఆ తోలుతో చెప్పులు కుట్టేవాళ్లది కాస్త ఉన్నతమైన జాతి, అంతే!
ఈ రెండు వర్గాల మధ్య ఒక యువకుడూ ఒక యువతీ ఒకరినొకరు ప్రేమించుకుని, పెద్దవాళ్లుకు తెలియకుండా పెళ్లి చేసుకుంటే, ఆ ఆడపిల్లను ఆమె అన్నో తండ్రో పరువు హత్య చెయ్యటానికి ఆస్కారముంది. దున్నపోతు ఒక్కటే వాళ్లందరికీ జీవనాధారం.
మా వొంపు కొమ్ముల ఆవు ఒక మామూలు అమాయకపు ప్రాణి. యాభై రూపాయలు తిరిగివ్వటానికి వీలుకాక లేదూ మనసురాక పాలవాడు రామ్ లాల్, ఆ ఆవును ఒక రోజు ఉదయాన్నే ఎవరూ చూడకుండా మా ఇంటి వాకిలి తలుపుకు కట్టేసి వెళ్లిపోయాడు. ఇకమీదట ఆ ఆవు మాదే అన్న స్పృహతో పాటు ఆ ఆవును మేమే పెంచాలన్న బాధ్యతా మాకు కలిగింది.
ఆవుకు ఇంట్లో ఒక స్థలం ఏర్పాటు చేసి దానికి తగ్గ మేత కొనుక్కురావటానికి కొన్నాళ్లు పట్టింది. తర్వాత ఆ ఆవు పాలను తప్పనిసరిగా పితకాలనీ, ఆ పాలు ఏడెనిమిది నెలల్లో తగ్గుతూ వచ్చి, ఆ తర్వాత ఆవు దాని పొదుగును తాకటానికి కూడా అనుమతించదని తెలిసి రావటానికి మరికొంత కాలం పట్టింది. సరైన సమయంలో అది ఈనటానికి స్థలం వెతికిపెట్టాలని, అది చూలుగా ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలో, అది లేగను ఈనితే ఆవు దాని బిడ్డ మాయను తినేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలని తెలిసి రావటానికి ఓ ఏడాది కాలం పట్టింది.
ఆ ఆవును పెట్టుకుని పూర్తిగా కష్టపడ్డవాళ్లు - మా అమ్మా, నేనూ, మా పెద్ద అక్కయ్యలిద్దరూనూ. చూలు విషయంలో మాత్రం మా నాన్న అదే రామ్‌లాల్‌కు కలిసి ఏర్పాటు చేసేవాడు. పాలు పితకటానికి మొదటి ఐదారు రోజులు రామ్‌లాల్ మా ఇంటికి వచ్చాడు. తర్వాత రాలేదు. ఆవు అరవటం మొదలుపెట్టింది. మొదట్లో అమ్మే పాలు పితకటానికి అలవాటు చేసుకుంది. ఆవు కూడా అమ్మ దగ్గర పసిబిడ్డలాగా గారాలు పోయేది. పాలు పితుకుతున్నప్పుడు కావాలనే పక్కలకు కదిలేది. అమ్మ ఒక్క దెబ్బ వేసేది. ఆవు అప్పుడు కడగంటితో చూసేది. ఎప్పుడైనా దానికి గడ్డీ, తవుడూ లేకపోతే అమ్మ కూడా తపించిపోయేది. కారణం, అన్నిరోజులూ మా ఊరి మార్కెట్లో గడ్డి దొరకదు.
మనుషుల్లో ఆడపిల్లల్లాగానే పశువుల్లో పెయ్యదూడలు. పాల వ్యాపారం చేసేవాళ్లు కోడెదూడల్ని పస్తులు పెట్టి చచ్చిపోయేలా చేస్తారు. (అవి పాలు ఎక్కువ తాగటమూ ప్రమాదకరమే. నేను పితికిన ఒకరోజు కావాలనే ఎక్కువ పాలను పితకలేదు. దూడ మరుసటిరోజు తూగుతూ కనిపించింది. ఆ తర్వాత అది చావనే చచ్చింది)
మా ఇంట్లో కోడెదూడలు సగం పెద్దదయ్యేంత వరకూ ఉంటాయి. కొనుక్కుని చంపేస్తారేమోనని వాటిని అమ్మటానికి మా నాన్నకు భయం! గ్రామాలలో ఎద్దులు . ఇప్పుడు అది కూడా ట్రాక్టర్ల వల్ల తగ్గిపోయాయి.
యాభై రూపాయల బాకీకి రామ్‌లాల్ మాకిచ్చిన ఆవుకు, ఒక కొమ్ము వొంపు తిరిగి ఉందని తెలియ టానికి మాకు కొన్ని నెలలు పట్టింది. ఆవు అంటే ఆవేనని మేమనుకున్నాం. వాటికీ కొన్ని విశేష గుణాలూ, ఆకార గుర్తులూ ఉంటాయని మేము గ్రహించటానికి చాలా రోజులు పట్టాయి. మా ఆవుకు దాని ఎడమ కొమ్ము బాగా వొంపు తిరిగిన దేవర్ మగన్లా ఉంటుంది. కుడివైపున్న కొమ్ము నెత్తిమీద నుండి ముఖానికి వాలి ఉంటుంది.
ఆవుకు కొమ్ములవల్ల లాభం ఏంటి? పడుకొని ఉన్నప్పుడు కొమ్ముల అంచులతో ఒంట్లోని కొన్ని భాగాలలో గోక్కోవచ్చు. అది అడవిలో నివశిస్తే కొమ్ములు స్వీయరక్షణకు ఉపయోగ పడొచ్చు. అయితే, ఆవు కుమ్మటం అన్నది దాని తలతోటే. అందుకని కొమ్ములు ఎందుకు ఉపయోగపడతాయో మాకు తెలియలేదు.
మా ఆవు 'వొంపు తిరిగిన కొమ్ము కలిగినది' అని తెలిసిన వాళ్లు దాన్ని వెంటనే గుర్తుపట్టగలరు. మా ఆవు అప్పుడప్పుడూ తప్పిపోయేది. నిజానికి అలా చెప్పటం సరికాదు. దాని స్వేచ్ఛను ఉపయోగించుకొని అది కొత్త కొత్త ప్రదేశాలను చూడ్డానికి విహారానికి వెళ్లిందని చెప్పటమే సరైనది. అది విహారానికి ఎంచుకునే ప్రదేశాలు ఏమిటంటే... కాపలాదారుల్ని ఏర్పాటు చేసుకొని బాగా పెంచుతున్న తోటలే. ఆ తోటలందరూ స్వేచ్ఛ గా వెళ్లి రాదగిన ప్రదేశాలు కావు. పెద్దపెద్ద పోలీసు అధికా రులు, కాన్వెంట్ పాఠశాలలు, తర్వాత మేరిమాత కోవెలలు.
అప్పుడు మేము నివసించిన ఊళ్లో దాదాపు పెద్దపెద్ద పోలీసు అధికారులందరూ మహమ్మదీయులే. కాన్వెంట్ పాఠశాలలు, మేరీమాత కోవెలలు క్రైస్తవ మతానికి చెందినవి. అరవై డెభ్బై ఏళ్లక్రితమే మా వొంపు కొమ్ముల ఆవు 'సర్వ మతాలూ సమ్మతమే' అని బతికింది. మాకూ పెద్దగా బేధాభిప్రాయాలు లేనప్పటికీ, పోలీసు అధికారుల ఇండ్లల్లో ఉన్నవాళ్లతో 'ఆవును విడిచి పెట్టండి' అని అర్థించటం, సైగలతోటే ఉండేవి. వాళ్లు మాట్లాడే ఉర్దూ భాషకు జవాబివ్వటం చాలా కష్టం. వాళ్లు కాసర బీసర అంటూ తిట్టటం నన్నా, మా ఆవునా అని తెలుసుకోవటమూ కష్టమే. దాన్ని 'దున్నపోతు' అనటంకన్నా ఇంకో కఠినమైన మాట ఈ ఇలలో ఉంటుందా?
మా ఇంటికి దగ్గరగా ముగ్గురు పోలీసు అధికారులు, రెండు మేరీమాత కోవెలలు ఉన్నాయి. ఆవు మళ్లీమళ్లీ ఈ ఐదు ప్రదేశాలకూ వెళ్లటం వల్ల నాకు ఈ మొత్తం పోలీసు అధికారుల కుటుంబాలతో పరిచయమయ్యాయి. చిన్నపిల్లలు తిట్టరు. కానీ వాళ్ల అమ్మను పిలుచుకొచ్చేవాళ్లు. ఆ అమ్మ - ఆవు నోరుపెట్టిన మొక్కలను చూపించి తిట్టేది. ఆవును గాడిద, కుక్క అని తిట్టటంలో ప్రయోజనం ఉందా? ఆమె తిడుతున్నప్పుడు ఆ ఇంటి చిన్నపిల్లలు నన్నే చూస్తూ ఉండేవాళ్లు. తిట్టి ముగించాక ఆ ఆవును విడిచిపెట్టేవాళ్లు. ఆ బంగళా బయటి గేటు వరకూ నాతో పాటు వచ్చేవాళ్లు. గేటును మూసి గెడియ పెట్టేవాళ్లు. నేను ఆవును ఇంటికి లాక్కెళ్లటానికి పడే అవస్థల్ని చూస్తూ ఉండేవాళ్లు. అది అవమానకరంగా ఉండేది. ఓదార్పుగానూ ఉండేది.
మేరీమాత కోవెల అనుభవం మరో విధంగా ఉంది. ఆవును కట్టేసిన మనిషిని వెళ్లి అడిగితే 'పెద్ద ఫాదర్‌ను కలువు!' అని బదులొచ్చేది. ఆ విధంగా నా మొదటి మేరీమాత కోవెల ప్రవేశం జరిగింది. అది ప్రొటెస్టెంట్ కోవెల కావటంతో అక్కడ ఒక పెద్ద శిలువ మాత్రం ఉండేది.
పెద్ద ఫాదర్‌కు నేను ఏం చెప్పానో ఆయనకు అర్థంకాలేదు. నేను నాల్గవ తరగతి చదువుతున్నాను. నాకు ఆవు పేరు మాత్రమే తెలుసు. ఆయన 'అక్కడికి ఆవు ఎందుకు రావాలి?' అని అడిగినట్టున్నారు.
నేను బయటికి చేతిని చాపి ఆవును కట్టేసిన చెట్టును చూపించాను. ఫాదర్, ''అది అసలు పశువే కాదు.'' అన్నట్టుగా అనిపించింది.
నేను 'అది మా ఆవు' అన్నట్టుగా సైగ చేశాను. తీసుకెళ్లు అన్నట్టుగా చెప్పారు. నేను ఆవును విడిపిస్తున్నప్పుడు తోటమాలి ''ఇంకోసారి వచ్చావంటే పోలీసులకు పట్టిస్తా.'' అన్నాడు. నేను 'పెద్ద ఫాదర్‌తో చెప్పు' అని చెప్పుండొచ్చు. అయితే, నాకు వొంపు కొమ్ము ఆవుమీద నమ్మకం లేదు. ఇంట్లో ఏ రకంగా దాన్ని కట్టేసి పెరటి తలుపుకు గెడియపెట్టి వెళ్లినా అది ఫాదర్ ఇంటికి వెళ్లిపోయేది! దానికి మన హిందూ మతం నచ్చలేదేమో?
అలాంటి ఆవుకూ ఆరోగ్యం బాగా లేకుండా పోయింది. రెండుమూడు రోజులు వరుసగా గడ్డి తినలేదు, పాలూ ఇవ్వలేదు. లేగను దగ్గరకు రానివ్వలేదు. కడుపు బానలా ఉబ్బరించసాగింది.
పశువుల డాక్టర్‌ను పిలుచుకొచ్చేసరికి, ఆవు పడకేసింది. పిల్లల్ని దూరంగా వెళ్లమన్నారు. నేను కిటికీ గుండా చూడసాగాను. వైద్యుడు ఆయన బ్యాగునుండి ఒక పెద్ద సూదిని తీశారు. ఆవు కడుపును తడిమి చూసి ఏదో ఒక చోటును నిర్ణయించుకొని ఆ ప్రాంతంలో సూదిని గుచ్చాడు. తర్వాత సూదిలోకి కొక్కెంలాంటి గొట్టాన్ని అమర్చి బయటికి లాగాడు. ఆయన గుచ్చిన గొట్టం నుండి బుస్ మంటూ గాలి బయటికొచ్చి ఆవు కడుపు లోనికెళ్లటం మొదలెట్టింది. అయితే, వైద్యుడు ఆవు కడుపులో అలుముకొని ఉన్న గాలినంతా బయటికి వెళ్లనీయలేదు. అలా చేస్తే ఆవు అప్పుడే చచ్చిపోతుందని చెప్పాడు.
వైద్యుడు వెళ్లిపోయాక ఆవు లేచి నిలబడింది. దానికి కొంచెం బెల్లం పెట్టాం. అది వాసన చూసింది. కానీ తినలేదు. అలాగే నిలబడింది. మాకు మరింత ఆవేదనను కలిగించ కూడదని ఆ రాత్రే చనిపోయింది.
మేమందరమూ ఆవును కౌగిలించుకొని ఏడ్చాము. మా ఆవు చనిపోయిందని ఎలాగో ఒక వ్యక్తి తెలుసుకొని మానాన్నతో మాట్లాడాడు. అర్థగంటకంతా అతను ఒక చెక్కబండిని తీసుకొచ్చాడు.
ఇద్దరు ముగ్గురు కలిసి ఆవు కాళ్లనూ తోకనూ పట్టుకొని పైకెత్తి బండ్లో పడేసినపుడు మేము చలించిపోయాము. ''దానికి నొప్పి కలగదు.'' అని నవ్వుతూ ఆ వ్యక్తి చెప్పాడు. అయితే, మాకు నొప్పి కలిగింది. మరుసటి రోజు లేగనూ ఆ వ్యక్తి తోలుకెళ్లిపోయాడు. పోలీసు అధికారుల ఇండ్ల తోటలు మిసమిసలాడి ఉండాలి. లేవు...
వొంపు కొమ్ముల ఆవు చనిపోయిన తర్వాత ఒకరోజు బడికి వెళుతుంటే ఒక పోలీసు అధికారి ఇంట్లో అధికారి భార్య కోపంగా అరుస్తోంది. ఏమై ఉంటుందాని చూశాను. ఇంకో ఆవు తోటను రుచిచూసినట్టుంది. దాని కొమ్ములు చక్కగాఉన్నాయి.
- తమిళ మూలం: అశోకమిత్రన్
అనువాదం: జిల్లేళ్ల బాలాజీ
73820 08979