Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువరాజులంగారు తెల్లవారు జామున పెళ్లి చూపులకు బయలు దేరారు. చక్కగా ముస్తాబై రథం మీద పాదం మోపబోయే సరికల్లా, గాడిద ఓండ్రింపు వినిపించింది.
''అపశకునం..... అపశకునం.....'' అని చెవులు మూసుకుంటూ, కాలు వెనక్కు తీసుకుని వెనుదిరిగాడు.
వెంటనే ఆస్థాన జ్యోతిష్యులను పిలిపించి, సమస్య చెప్పాడు. ''ఆ గాడిదలు దివ్యజ్ఞాన సంపన్నులు. మీరు బయలు దేరే ముందు అరిచిందంటే, మీకు కలుగబోయే ఆపద గురించి హెచ్చరించిందన్నమాట. అసలే మబ్బులు పట్టి ఉంది ఆకాశం. ఆగిపోవడం ఎంతైనా మంచిది'' అన్నాడు మొదటి జ్యోతిష్యుడు
''మనుషులకంటే జంతువులకు, అదే కుక్కలు మొదలగు వాటికి గ్రహణశక్తి ఎక్కువ ఉండడం మనం చూస్తున్నదే గదా. ఏవో దుష్ట శక్తులు మీ వెంట ఉన్నాయి. అవి తొలగిపోయాక వెళ్లడం మంచిదని దాని అరుపు సూచిస్తోంది. రేపు పంచమ, మంగళవారం. రేపు బయలు దేరడం ఎంతైనా శ్రేయస్కరం'' అన్నాడు రెండో జ్యోతిష్యుడు..
పండితులు హితవు చెప్పంగ వెళ్లకూడదని, ఆగిపోయాడు . ఆ రోజంతా రాకుమారిని తలుచుకుంటూ, అద్దంతో ఆడుకుంటూ గడిపేశాడు.
మరుసటి రోజు మనుషులు లేవకముందే, అపశకునం ఎదురు కాకముందే బయలు దేరుదామని లేచి తయారయ్యాడు. భవనం నుంచి కాలు బయట పెడుతున్నాడో లేదో మళ్లీ గాడిద అరుపు పెద్దగా వినిపించింది. అరుపు విని అటేన్షన్లో అమాంతం నిలబడి పోయాడు. మనిషి కుదేలై పోయి, కుర్చీలో కూలబడి పోయాడు. పట్టలేని కోపం వచ్చింది. ''అసలీ గాడిద ఉద్దేశ్యమేంది? నేను బయలుదేరే ముందే, ఎందుకు ఓండ్ర పెడుతుంది? ఈ సంగతేందో కనుక్కోవాల్సిందే'' అనుకున్నాడు. వెంటనే భటుల్ని పిలిచి, ''ఉత్తరం దిక్కున ఓండ్ర పెట్టే గాడిదను, దాని యజమానిని వెంటనే లాక్కురండి'' అని ఆజ్ఞ వేశాడు.
భటులు పరుగున వెళ్లి, గూడెంలో వున్న మడేలు మల్లయ్యను పట్టుకున్నారు.
యువరాజావారు పెండ్లిచూపులకు వెళుతున్న సంగతంతా చెప్పి, ''రాజు ముందు సరిగా సమాధానం చెప్పుకోలేక పోయావో, నీ గాడిదతో పాటు, నీకూ మూడిందే'' అన్నారు కాస్త దయతో భటులు-
''అయ్యా .. నేను తెల్లవారు జామున లేచి, పశువుల పాకను శుభ్రం చేస్తాను. అప్పుడీగాడిదను పాక నుండి తీసి, ఇంటి ముందు వేప చెట్టుకు కట్టేస్తాను. దీన్ని కొత్తగా కొన్నాను. దీని తోడు గతంలో మరోగాడిద ఉండేది. ఇది ఒంటరిగా ఉండలేక, ఊరికే లాక్కుంటుండేది. కాలికి తాడుతో కట్టేయడం వల్ల, తాడు ఒరుసుకుని గాయమైంది. తాడును కదిలించినప్పుడల్లా అది బాధతో అరుస్తుంది. ఇందులో నా తప్పేం లేదు. నా గాడిదకు దివ్య శక్తులు ఏవీ లేవు. మన్నించి మమ్మల్ని వదిలి పెట్టండి. బట్టలు ఉతుక్కుంటూ భద్రంగా బతికే పేదవాడ్ని'' అన్నాడు భయం భయంగా.
అది విని భటులిద్దరూ పెళ్లున నవ్వారు.
''మహారాజు గారు, ఆస్థాన జ్యోతిష్యులు నీ గాడిదకు బ్రహ్మాండమైన జ్ఞానం ఉందని నమ్ముతుంటే, నువ్వు లేదంటే సరిపోద్దా? ఉన్నాయనే ఏదో కథ చెప్పు. లేకుంటే, నేను బయలు దేరే సమయానికే దాని గాయాన్నెందుకు కెలికావు అని నీకు శిక్ష విధించొచ్చు. ఆలోచించుకో'' అని హెచ్చరించారు..
''పుట్టిన పొద్దు అబద్దమాడని వాడిని. ప్రాణాన్ని రక్షించు కోవడం కోసం అబద్దమాడవలసి వస్తోంది'' అనుకున్నాడు పైకే.
భటులు సభా ప్రాంగణంలోనికి తీసుకొచ్చారులః. గాడిద కాలిని వేలితో నొక్కి, అరిచేలా చేశాడు.. ''మహారాజా జయం. జయం. మడేలు మల్లయ్య ప్రణామాలతో పాటు, గాడిద గంధర్వయ్య నమస్సులు స్వీకరించండి.. తమను చూడగానే, రాజు గారని గుర్తు పట్టి తమకు దండాలు సమర్పించింది నా దివ్య జ్ఞానం గల గాడిద'' అన్నాడు తొట్రు పడకుండా...
గాడిద కూడ తనను గుర్తు పట్టి, నమస్కారం చేసిందనగానే, మనసులో పొంగిపోయాడు. ముఖంలోని ప్రసన్నత కనిపెట్టాడు మల్లయ్య.
''మహరాజా నా గాడిదకు దివ్య జ్ఞానముంది. దానికి భగవంతుడు పుట్టుకతోనే ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని. కొంతమంది నమ్మకపోవచ్చు. కానీ మీ ముందే నా గాడిద జ్ఞానాన్ని ప్రదర్శిస్తాను'' అని తల మీది తువ్వాలు తీశాడు. గాడిద ముఖం మీదుగా కాళ్ల వరకూ కప్పి, అందులో తానూ దూరాడు.
''ఓ దివ్య జ్ఞాని గార్దభ రాజమా? మా యువరాజు గారి గురించి, వియ్యాల వారు ఏమనుకుంటున్నారు? ఒకసారి చెబితే రాజు గారు కూడా సంతోషిస్తారు'' అన్నాడు కాలి వేలితో గాయాన్ని గట్టిగా నొక్కి.
గాడిద పెద్దగా ఓండ్ర పెట్టింది .
కండువా దాని ముఖం మీద నుంచి తీసి, భుజం మీద వేసుకుంటూ ''మహారాజా తమరి అందాన్ని, శౌర్య ప్రతాపాల్ని అంతఃపుర స్త్రీలు, యువరాణితో చెబుతుంటే, వినుకుంటూ సిగ్గు మొగ్గలవుతోంది. తమరి రాక కోసం వేయి కన్నులతో ఎదురు చూస్తుంది అని నా గాడిద తన జ్ఞానంతో అక్కడ జరిగే సంగతంతా చెప్పింది రాజా'' అన్నాడు.
''నువ్వు చెప్పింది నిజం. నాకు వేగుల ద్వారా కూడా ఇదే సమాచారం అందింది . నిజంగానే నీ గాడిదకు దివ్య జ్ఞానమేదో ఉంది'' అన్నాడు సంతోషపడుతూ.
''తమరు నా గాడిద ప్రతిభను గుర్తించినందుకు ప్రణామాలు మహారాజా'' అని వినయంగా వంగి నమస్కరించాడు.
''మన శాస్త్రాలు, పురాణాలు నమ్మకాల పునాదుల మీదనే కదా నిలిచింది. మునులు, ఋషులు ఎంతో సాధన చేసి, జ్యోతిషాన్ని వద్ధి చేశారు. అందుకే జ్యోతిష్యాన్ని అందరూ నమ్మాలని శాసనం చేశాను. శకునాలు కూడా అంతే. అందుకే నిన్ను పిలిపించాను. చెప్పు. నిన్న, ఈ రోజు నేను ప్రయాణమై, రథం మీద కాలు మోపబోయే సరికి, నీ గాడిద ఎందుకు అరిచింది. దాని అరుపుకు అర్ధమేంది? సరైన సమాధానం చెప్పక పోయావో, జాగ్రత్త'' అని హెచ్చరించాడు.
''మహారాజా నేనూ ఆశ్చర్యపడ్డాను. వేళకాని వేళలో ఎందుకు అరిచిందా అని. నాతో రహస్యం చెప్పింది. కానీ ఇంత మంది ముందూ, మరోసారి దాన్నే అడుగుదాం వివరంగా చెబుతుంది'' అని గాడిద ముఖం మీద నుంచి కింది వరకూ కండువ కప్పి, తనూ అందులో తల దూర్చాడు.
అందరికీ వినపడేలా! ''నిన్న, నేడు రాజుగారు యువరాణి గారి దగ్గరకు వెళ్లే సమయంలోనే ఎందుకు అరిచావో, రాజు గారు తెలుసుకోవాలనుకుంటున్నారు. దయచేసి చెప్పండి గాడిద గంధర్వయ్య గారు'' అన్నాడు అందరికీ వినపడేలాగు. అలా మాట్లాడుతూనే కాలును మెల్లగా దాని ముందు కాలి గాయం దగ్గరకు చేర్చి వేలితో దాన్ని నొక్కాడు. గాడిద ఎప్పటిలాగే ఓండ్ర పెట్టింది.
''మహారాజా. తమకు అంతా శుభమే'' అని, చేతులు గాల్లోకి విసురుతూ ''ఓ దుష్ట శక్తులారా. తొలగిపొండి. మా మహారాజు గారు అందంలో మన్మధుడు. శౌర్య పరాక్రమాల్లో విక్రమాదిత్యుడు. దానంలో అపర కర్ణుడు. అలాంటి రాజు గారు తను వలచిన సౌందర్యవతియైన యువరాణి గారి కోసం మధురా నగరం వెళుతున్నారు. అతనికే జయం పలకండి అని అరిచానని చెప్పింది మహారాజా. గాడిద కూడా మీ ప్రతిభను గుర్తించింది . కనుక మీకిక అంతా జయమే. తమరు తక్షణమే బయలు దేరవచ్చు.'' అన్నాడు తల వంచి వినయంగా.
''సరిగ్గా చెప్పారు. నా మనసుకు తగ్గట్లు. ఎవరక్కడీ ఈ మల్లయ్యను, గాడిద గంధర్వయ్యను తక్షణమే సన్మానించడానికి తగిన ఏర్పాట్లు చేయండి అన్నాడు.
నిమిషాల మీద అన్నీ సిద్ధం చేశారు. గాడిద గంధర్వయ్యకు జ్యోతిష్యరత్న బిరుదుతో పాటు మెడకో బంగారు పట్టెడ తగిలించాడు. మల్లయ్యకు శాలువా కప్పి, వెయ్యి వరహాలు నజరానాగా ఇచ్చాడు. వెంటనే రథం మీద యువరాణి దగ్గరకు దూకుల మీద వెళ్లాడు.
గండం గడిచింది. మళ్లీ గాడిద ఎందుకు అరిచిందంటే, అబద్దం చెప్పలేక చావాలి. ఈ వేలి నొక్కుడు రాజు చూస్తే, మరణమే గతి అనుకున్నాడు. వెంటనే ఇంటికి వెళ్లే దారిలోనే, సంతలో గాడిదను తెగనమ్మాడు. రాజధానికి దూరంగా భూమి, ఎద్దులు కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటూ సుఖంగా బతికాడు మలయ్య.
- పుప్పాల కష్ణమూర్తి, 9912359345