Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఓ పోరీ! నువ్వేడ్సుకుంట కూసుంటే ఎట్లయితదే? ఆ యాదిగాడు గుండ్రాయే, ఆడే మంచిగైతడు తీరు! ఇంతకీ కాశిగాడేడుండు?
''అగొందీ? ఆయనకు మోశెయ్యి గీర్క బొయ్యింది గంతంత బూకరెలం దంచుకోని రాసుకుంటుండు''.
''ఒసేరు...! పెద్ద మాల పిచ్చయ్య సూస్త లేడంట, మాట్లాడ లేడంట... పోరీ?''
''అవును పెద్దమ్మా! ఎటొచ్చి పిచ్చయ్య మామనే ఆగమయ్యిండు. ఎట్ల బైటికోస్తడో ఏమో. ఆ రంగక్క, సాలక్క, లచ్చులు మామకు గిట్ల బాగలేదు. ఏం సుట్టిర్కమో ఏమో! ఊరు గాని ఊరికి పోతిమి. జెల్టెల్డి కానియ్యమంటే ఎవ్వలిన్నరు? పూలు పండ్లు పెట్టుకోని, బువ్వలు తిని, నువ్వు బట్టు నేను బట్టు అనుకుంట నుస్మెతాల్లకు ఆడనే పొద్దుమూకె. ఆ శీకట్లిస్తుంటే ఆ డీసెం డైవర్ తాగిండని ఎవ్వలం ఎర్కబట్టలే పెద్దమ్మా!. జెర్ర శేపట్ల ఎవ్వరిండ్లకు ఆల్లం బోతుంటిమి. ఆ శీకట్ల ఏదో అడ్డమొచ్చిందని బిరేకేసిండు. సూస్త సూస్త బొత్త పడ్డది. ఒగలి మీద ఒగలం బడి ఆగమాగమైనం. సోర పోరగాల్లందరూ ఎవ్వలంతలాల్లు దునికిను. యాదిగాడు ముందల కూతున్నందుకు ఇట్లయిపాయె!''
''ఏ దావకాన్లున్నరే?''
''నల్లగొండ గవుర్మెంట్ దావకాన్లున్నరు గని అమ్మటాల్లయింది. బువ్వ తీస్క పోవాలె, పొయ్యొస్త పెద్దమ్మా''
''ఇగో పోరీ! పోదువు గానీ మన మాల మాదిగోల్లంతా మాటిమాటికీ దేవుని గుల్యకు పోతుండ్రంట. అందుకనే ఇట్లయిందని అంటున్నరే..!, ఈల్ల ఇకమతుల మీద మన్ను బొయ్య...! సోమారం సంది మనోల్లని దేవుని గుల్యకు రానియ్యరంటనే? మనమేం పాపం జేశ్నమని మనెంట బడ్జరీల్లు?''
''ఏంది పెద్దమ్మా గట్లంటున్నవ్? యాదిగాడు సర్పంచేనాయే, ఎట్టెట్ట రానియ్యరో ఇయ్యాల ఆనికి జెప్త ఉండు. ఆల్లదేమన్న గుంజుక తింటున్నమా?''
నల్లగొండకు ఇరవైమైళ్ళ దూరంలో ఉన్న ఆ గ్రామంలో కాశయ్య బాలమ్మల ఒకే ఒక్క కొడుకు యాదగిరి.తప్పటడుగుల రోజుల్లోనే పూరి గుడిసెల నుండి మేడలు మిద్దెల తేడాలు ఎందుకుంటాయని అమ్మను అడిగి తెలుసుకునేవాడు. ఓనమాల దశలోనే తన పేరును యాదగిరి రెడ్డి అని రాసుకునే వాడు. క్లాసు వాళ్లంతా హేళన చేస్తే ఎందుకు రాసుకో కూడదనీ, ఎక్కువ తక్కువ కులాలేందనీ తిరిగి అడిగే వాడు. పంచాయితీలు చెప్పే కచ్చిరు దగ్గర,బాగోతులు ఆడే ఆటల దగ్గర ఊరోళ్లందరూ కూర్చునే తారతమ్యాలను గమనించే వాడు.. కోమటి దుకాణం వెళ్తే సామాన్లు ముట్టుకోనీయక తక్కువ కులమని దూరంగా నిలబెట్టి అవమానిస్తే అక్కడికక్కడే ఆ తేడాలెందుకని ప్రశ్నించే వాడు. ఈ విధంగా బాల్యంలోనే ఎన్నో అనుభవాలు చవి చూసి, ఎంతో కష్టపడి పీజీ దాకా చదివాడు. ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తూనే తన గ్రామంలో తరతరాలుగా పాకిపోయిన అజ్ఞానాన్ని, దౌర్జన్యాన్ని, దళారీతనాన్ని ఎదుర్కోవడం కోసం మెల్లమెల్లగా రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. తనకు బలమైన శత్రువు చిన్ననాటి క్లాస్మేట్ అగ్రకులస్తుడు గోపి. ఆ గోపి ఒక మోనార్క్. ఆయనంటే ఊరు మొత్తం భయపడాలని ఎప్పుడు ఏదో అలజడి సష్టిస్తుంటాడు. గ్రామ ప్రత్యర్థులకు అడుగడుగునా అడ్డుపుల్లలు వేస్తూ తాను అధికారంలో ఉన్నా లేకపోయినా తన పంతమే నెగ్గాలనుకుంటాడు. కులం పలుకుబడి, పరిచయాలతో పాటు అర్థబలం, అంగబలం అధికార పార్టీ బలం ఉన్న గోపితో గత సర్పంచ్ ఎన్నికలలో జనరల్ సీటులో యాదగిరి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి గ్రామ ప్రజల ఆదరణతో రూపాయి ఖర్చు పెట్టకుండా జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలిచాడు. అప్పటి నుండి ఆధిపత్య పోరు, అనేక సంఘర్షణలు ఎదుర్కోవడం అలవాటు చేసుకున్నాడు. కానీ తమ కొడుకు గొడవలతో ఎక్కడ దూరమౌతాడో అని భయపడుతుంటే యాదగిరి ఎప్పటికప్పుడు అమ్మానాన్నలకు ధైర్యం నూరి పోస్తుంటాడు.
అన్నం తీసుకొని హాస్పిటల్‌కి వెళ్లిన బాలమ్మ ''అరె యాదీ..? ఎట్లుందిరా పానం..? నొప్పులు తగ్గినాయిర? గంతంత నోట్లేసుకుందువులే కొడుకా..!, కడుపులాసరుంటది.''
మెల్లగా మూలుగుతూ లేవబోతుంటే పక్కనే నిలబడి ఉన్న ఉప సర్పంచ్ రమేశ్, నాన్న కాశయ్య వచ్చిలేపి కూర్చోబెట్టారు. మంచానికి ఆనుకొని ఉన్న యాదగిరికి బాలమ్మ చెంచాతో తినిపిస్తుంటే నములుతూ ''ఏం జెప్పమంటవమ్మా..! అటిటు కాకుండా మోకాలి చిప్పకు దలిగిందాయే, డాక్టర్లు ఆపరేషన్ చెయ్యాలంటున్రు, ఐదు లక్షల దాక అయితదంట, ఏడ దేవాల్నో ఏమో.!''
రమేశ్ కల్పించుకొని ''యాద్గిరన్నా! నువ్వు పైసల గురించి ఫికర్ జెయ్యకు? మనూరి గుడికి వచ్చిన విరాళాలు యాభై లక్షల దాకా ఉన్నైగా ? ఐదు లక్షలు తీస్తెమాయె తీరు?''
''అరేరు రమేశా ! నువ్వు ఉప సర్పంచ్ వేగా? నీకు తెల్వకుంట ఈ మూడేండ్లల్ల ఏడనన్న రూపాయి తెచ్చిన్నా? గోపిని జూడు ఇప్పటికీ నెలకు అంతో ఇంతో ఏడ బత్తే ఆడ బెదిరించి వసూలు చేస్తుండట. అట్ల చేస్తే మన విలువెక్కడుంటది. ఏమన్న కానియ్యిరా ? అందిన కాడికి అప్పు తెస్తా. లేదంటే ఉన్న ఇల్లు అమ్ముతా.''
కాశయ్య కోపంతో ''ఏడంగ బన్నదిరా నీ యిల్లూ ? ఆ పొద్దటి సంది నువ్వు జెప్తే ఇంటున్నవా? ఆ పటేలోల్ల జోలి మనకొద్దురా అంటే ఎప్పుడు లొల్లేనాయే, సూస్త సూస్త సర్పంచయితివి, ఏం సక్కదనం? నూకిత్తు లేదాయె,రూపాయి రాదాయె,ఇల్లంత లూటి మాపు జేసినవ్,ఇల్లమ్మంగనె కుప్పలు కుప్పలు తుప్ప కాయలోస్తయా ! నీకు ? ఎట్లమ్ముతవో జూస్తగా?''.
కోపంతో ఊగిపోతున్న బాలమ్మ ''అబ్బో! ఇచ్చరిల్లింది తియ్యి? లెస లెస మాట్లాడుతున్నవయ్యో! నీ రెండంత్రాల బంగ్లల టుంగుటుయ్యాలలేస్కొని నిచ్చ ఊగులాడుతుంటిమి ''
మాటకు మాట పెరిగి వచ్చే ఆవేశాలు ఆపాలనుకొని రమేశ్ ''ఇగో కాశయ్య కాకా! ఊకోర్రీ? నిన్నటి సంది అన్నను జూస్తందుకు ఇరామ్ లేకుంటొస్తున్నరు. ఒట్టిగనే దవాకాన్ల లొల్లి చెయ్యకుర్రి ? పైసల సంగతి తర్వాత సూద్దాం గని''
''ఆపిరీషన్ ఎప్పుడైతదంటరా యాదీ?'' కాశయ్య ప్రశ్నకు
''ఎల్లుండైతదంట నాయినా! ఎట్లనో అట్ల నేనైతే బైట పడ గాని పిచ్చయ్య తాతెట్లుండు? ఇంక లచ్చులు తాత, రంగమ్మ పెద్దమ్మ, సాలమ్మ పెద్దమ్మ గూడ బాగలేరంటగా? (ఏడుస్తూ) నాకోసమొచ్చినోళ్లకు ఉత్త పున్యానికి దెబ్బలు దలిగిచ్చిన, ఆళ్ల పానాల మీదికి తెచ్చిన అందరికందరు అరిగోస తీస్తును''
''అందరు బాగనే ఉన్నర్రా! పిచ్చయ్య తాతకే ఎటమటంగున్నది. గని నువ్వు గుండె బల్గకు బిడ్డా! నీ కాలు ఆపిరీషన్ గానియ్యి'' తిన్న గిన్నెలు సర్దుతూ ధైర్యం చెప్పింది బాలమ్మ,
''ఏది ఎమన్న గానియ్యిర్రి!, నన్ను పానానికి పానంగ జూసుకున్న పిచ్చయ్య తాత బత్కాలే, పిచ్చయ్య తాత బత్కాలే'' యాదగిరి వెక్కి వెక్కి ఏడుస్తుంటే రమేశ్ ప్రత్యేక శ్రద్ధ చూపించి యాదగిరికి ఆ మాట ఈ మాట చెప్పి, కాలు బాగయ్యేదాకా ఏదీ పట్టించుకోవద్దని గట్టిగానే చెప్పి, అందరినీ సముదాయించాడు.
యాదగిరి మోకాలికి ఒకసారి చేసిన సర్జరీ ఫైలయిందని రెండోసారి చేసిన సర్జరీ పూర్తయి ఇంటికొచ్చే సరికి ఇరవై రోజులయ్యింది. సర్పంచ్ దగ్గర డబ్బులు లేవని తెలుసుకున్న యాదగిరి అభిమాన సంఘాలు, శ్రేయోభిలాషులు, గ్రామ యువజన సంఘాల సభ్యులు ముందుకు వచ్చి చందాలు వసూలు చేసి హాస్పిటల్ ఖర్చులన్నీ భరించ గలిగారు.
దాదాపు నెల రోజుల తరువాత కూడా పరామర్శకు వచ్చే వారి తాకిడి తగ్గడం లేదు. అయినా సరే పరిపాలన విషయాలు మాట్లాడుకుందామని యాదగిరి తనకు అందుబాటులో ఉన్న వారిని పిలిపించుకున్నాడు. తన ఇంటి ముందు రేకుల పందిరి కింద నులక మంచంలో యాదగిరి కూర్చున్నాడు. ఎదురుగా కుర్చీల్లో రమేశ్, ఐదుగురు వార్డు సభ్యులు కూర్చున్నారు కొందరు యూత్ పిల్లలు వారి వెనుక నిల్చున్నారు. పెద్ద వాకిలికి ఓ మూలన ఉన్న పొయ్యి దగ్గర కింద కూర్చోని బాలమ్మ చాట్ల బియ్యం ఏరుతుంది, కాశయ్య గొడ్డలితో పొయిల కట్టెలు కొడుతున్నాడు.
తెల్ల ఖద్దరు బట్టలతో పది మందికి పైగా అనుచరులతో గోపి ఇంట్లోకి వస్తూనే ''మన గ్రామ సర్పంచ్ కోలుకోవడం నాకు చాలా ఆనందంగా ఉన్నది. కంగ్రాట్స్ రా! యాద్గీరీ?'' అంటూ ఒక కుర్చీ జరుపుకొని యాదగిరికి ఎదురుగా కూర్చున్నాడు. అనుచరులు వెనుక నిలబడి ఉన్నారు.
''సరేరా గోపీ ! ఇప్పుడిప్పుడే వాకింగ్ స్టాండ్ లేకుంట నడుస్తున్న''
''ఎహే! ఏనుగే పొయ్యింది తోక కూడా పోతది తీరు రా? నీ పెండ్లి కూడా పెట్టుకోకపోయినవ్ ! మంచి రోజులన్నయంట''
''అవునవును పది రోజులే లగ్గాలున్నయంట, అత్తగారోళ్లు తొందర పెడుతున్రు. అది సరేగాని మన లీడర్లు కొత్త గుడిని ఏందాక తెచ్చిను?''
''శిన్న శిన్న పనులున్నయి, పనులన్ని పూర్తి కావటానికి రెండు నెలలు పడ్తది. ఈ పది రోజులల్ల గుడికి కొబ్బరికాయలు కొట్టుడు షురూ జెయ్యాలె. ఇగో కార్డులు కూడా కొట్టిచ్చినం ''అంటూ యాదగిరి చేతికి అందించాడు.
కొద్దిసేపు చూసిన తరువాత ''ఇదేంది ? కార్డుల నా పేరేడ కనబడ్తు లేదు, సర్పంచ్ రావద్దా ఏంది ?''
''గ్రామ సర్పంచ్ బొంబాటుగ రావచ్చంట, కానీ....! నీకింకా పెండ్లి కాలేదుగా?'' ''పెండ్లి కాలేదా? ఇంకా ఏమన్న కారణముందా? నాకు సక్కగ జెప్పురా?'' వెటకారంగా
''అవున్రా! పంతులు చెప్పిండు. పెండ్లి కాలేదనే నీ పేరొద్దన్నడు''
''ఏ పంతులు జెప్పిండు? సర్పంచ్‌కి తెల్వకుండ వార్డు నెంబర్లకి చెప్పకుంట ఎవడన్న రోషినోడు కార్డు కొట్టిస్తడా? ఏ వూళ్ల జూసినవ్...?''
''ఎవ్వరికేందిరా జెప్పేదీ? డబ్బులు వసూల్ చేసింది నేను, గుడి కట్టించింది నేను, ఆ గుడిని ఓపెన్ చేసేది కూడా నేనే, కుదరదంటే ఇంకెవరన్న పెద్ద కులపోట్లే వుండాలే !''
''నువ్వొకనివి నాలుగు లక్షలు తేంగనే అయ్యిందా? మరి మేం నలభై లక్షల దాకా తెచ్చినం, నువ్వొక్కనివెట్ల ఓపెన్ చేస్తవో నేనూ చూస్తగా? గ్రామానికి సర్పంచే పెద్దాడని లోకమంతెరుకే, నువ్వెంత?'' అని ఆవేశంతో గొంతు పెంచి రమేశ్ హెచ్చరించాడు.
''నువ్వు సర్పంచు గురించి ఎన్నైనా చెప్పు. ఈడొవ్వడు వణుకుతలేడు. గెలిచినంక అందిన కాడికి ఎవ్వడెంత తింటున్నడో అందరికేరికే, నువ్వేందిరా? లెసలెస నీల్గుతున్నవూ?
ఆ మాటలు భరించని కొందరు యాదగిరి యువ అనుచరులు ఆవేశంతో ''ఏరు ! మాటలు సక్కగ రానిరు..?'' అంటూ రమేశ్‌తో గొంతు కలిపి ముందుకు కదిలారు.
యాదగిరి ఎవ్వరినీ తొందర పడొద్దని సైగ చేసి అందరినీ ఒక్క మాటలో నచ్చజెప్పి, శాంతింప జేసి, ఎర్రబడ్డ ముఖంతో ''అరేరు! నువ్వురా నీల్గేదీ! నియ్యేరా దొంగ లెక్కలన్నీ?, ఎవ్వడు తింటుండో, ఎవ్వడు తింటలేడో మన రామన్నపేట మండలంల రాళ్ళనడుగురా తెలుస్తదీ, రేపే గ్రామసభ పెడుతున్న, అన్ని లెక్కలు చూపిస్తా, ఎవ్వరొచ్చినా, ఎందరొచ్చినా సరే, ఆడనే తేల్చుకుందాం రారా?''
అంతా చూస్తూ తట్టుకోలేక కాశయ్య ''ఇగో సూడు సిన్న పటేలా? మావోని పెండ్లి పట్టుమని పది రోజులు కూడా లేదు. జెర మీ కొట్లాటలు ఆపుండ్రి, ముందుగాల ఆని పెండ్లి కానియ్యి! నీ కాలు మొక్కుత పటేలా..!''
''నాయనా! నువ్వు మధ్యలో రాకు? అమ్మా! నువ్వేం భయపడకు? నేను శిన్నప్పటినుంచే ఎవ్వనికి భయపడనోన్ని, గోపి గాడొక లెక్కనా నాకు? ఈడో పెద్ద బొకరుగాడు. నీకే కాదు మనోళ్ళందరికీ చెప్తున్నా ముందుగాల ఇట్లాంటోల్లను పటేలనుడు మానుకోవాలె. మనం వొంగినంత కాలం వొంగబెడ్తనే ఉంటరు. కాలం మారింది నిటారుగ నిలబడడం అలవాటు చేసుకోవాల్సిందే.''
సహనం నశించిన గోపి అనుచరులు కాశయ్య కొడుతున్న కట్టెల్లో దొడ్డు కంప కట్టెలతో యాదగిరిని కొట్టడానికి ముందుకొస్తుంటే గోపి వాళ్ళను ఆపి ''నీ సంగతి తరువాత జూస్తరా..!''
''ఎహే ! సర్పంచ్ ఓట్లప్పుడే పొట్టు పొట్టు కొట్టుకున్నం, ఎవ్వనికేమయ్యిందో అప్పుడే మర్సిపొయినవా? ఏం చేసుకుంటవో చేస్కో పో?''
''పవర్లకొచ్చినంక ఎంత పొగరొచ్చిందిరా నీకూ..?'' అని తన అనుచరులతో తిరుగు ముఖం పట్టాడు.
మరునాడు గ్రామసభ ఏర్పాటు చేసి పూర్తి అయిన పనులు పూర్తి కాని పనుల వివరాలు, గుడి కోసం ఎవరెవరు ఎంతెంత ఇచ్చిండే స్పష్టంగా వివరించాడు. ఏది ఏమైనా గోపి నిర్ణయించిన ముహుర్తానికే కొత్త గుడి ప్రారంభం చేద్దామని తీర్మానం చేయించాడు. అదే రోజు జరిగే తన వివాహానికి అందరూ రావాలని ఆహ్వానించాడు. కానీ గ్రామస్తులందరి ఉమ్మడి ప్రశ్నకి జవాబు దొరకడం లేదు. గుడి ప్రారంభానికి ముందు కొబ్బరికాయ కొట్టేది ఎవరని. గోపీ దంపతులు ప్రారంభిస్తారా? సర్పంచ్ యాదగిరి ప్రారంభం చేస్తారా? ఎవరు? ఎవరు? ఎవరని ఎన్నో సందేహాలు. కానీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, అధికార పార్టీ పరంగా చూస్తే గోపికే ఎక్కువ అవకాశాలున్నవి. సర్పంచ్ యాదగిరి అధికార పార్టీ కాదు, పెళ్లి కాలేదు. మరొక కారణం, తక్కువ కులమని ఇంకొక కారణం చూపిస్తూ యాదగిరిని బలహీన పరుస్తున్నారు. యాదగిరికి పెద్ద ప్రమాదం జరిగినప్పటి నుండీ యాదగిరి సన్నిహిత యువకులకు గోపి జల్సా ఖర్చులు చేసి తన మాటను వినేటట్టు మార్చుకున్న ప్రభావంతో కొందరక్కడనీ, మరికొందరిక్కడనీ రెండు వర్గాలుగా విడిపోయిన బలహీన క్షణాల్లో యాదగిరి ఎటూ తేల్చకోలేక చర్చను మరునాటికి వాయిదా వేయించాడు.
పంచాయతీ చర్చలతో వేడెక్కిన తల బరువుతో యాదగిరి కొందరు వార్డు మెంబెర్లతో, యువ అనుచరులతో రమేశ్‌తో కలిసి ఇంటికి వచ్చే సరికి ఇంటి ముందు కూర్చోని శోకాలు పెట్టి ఏడుస్తుంది బాలమ్మ.
''సర్పంచ్‌ని చేస్తనంటివి మావో.... ఓ మావా,
పెండ్లి గూడ జూస్తనంటివి మావో.... ఓ మావా,
ఏం పాపం చేస్తిమయ్య మావో... ఓ మావా
ఆగం బతుకు అయ్యిపాయే మావో... ఓ మావా,''
''ఏమైంది అమ్మా? పిచ్చయ్య తాత గిట్ల సచ్చిపోయిండా, ఏందీ?''
ఏడుపు ఆపి ''అవును కొడుకా! నీ ఫోన్‌కి చేస్తే కలవలేదంట. ఇప్పుడే నాయనకు జేసిన్రు. శీకటిమోకాన సచ్చిపొతె మనకిప్పుడెర్కయింది, ఇయ్యాల్నే సావు చేస్తారంట. రంగక్క, సాలక్క, లచ్చులు మామ గిట్ల అందరూ లేశి నడుస్తుంటే పిచ్చయ్య మామ గూడ బతుకుతడనుకున్న. గింతల్నే మాయమై పోతడనుకోలే !, నా పిచ్చయ్యమావో ఓ పిచ్చయ్య మావా'' అని మళ్ళీ ఏడుపు మొదలు పెట్టింది.
యాదగిరి కూడా పక్కనే ఉన్న రమేశ్‌ను అల్లుకొని పెద్దగా ఏడుస్తుంటే కాశయ్య ఓదార్చి ఇన్ని మంచి నీళ్లు తాగించి ఇంటి ముందు వేప చెట్టు కింద కుర్చీల కూర్చో పెట్టాడు.
ఆపుకో లేని దుఃఖ భారంతో వెక్కి వెక్కి ఏడుస్తూ ''పిచ్చయ్య తాత నన్ను ఇంటోల్లకంటే ఎక్కువ జూసిండు. పైసలు లేనోన్ని బబ్కోని సర్పంచుని జేసిండు. అల్లు ఈల్లు అనకుండా నన్ను ఏంటేసుకొని ఇల్లిల్లు దిరిగి అందరు కులపోల్లని కలుపుకొని నన్ను గెలిపించిండు. నన్ను రాజకీయంగ ఇంకా పెద్ద పదవిల చూసిందాక నిద్ర పొననేటోడు. కానీ ఇప్పుడు పర్మినెంటుగ నిద్ర పొయ్యిండు.''
రమేశ్ అందరినీ ఓదార్చే ప్రయత్నంలో ''అరె ఊకో! పెద్దమ్మా? ఊకో యాదగిరన్నా? ఇప్పుడు సోకాలు పెట్టుకుంట ఏడిస్తే పిచ్చయ్య తాత దిగొస్తడా ఏందీ? ఎట్లయ్యేదుంటె అట్లయితది. అసలే రేపు పంచాయితుంది. మనమిప్పుడు గీట్లనే సల్ల బడ్తమా? ఆ గోపీ గానోళ్లు ఆగమాగం జేస్తరు. ఇప్పటికే సర్పంచంటే ఇలువ లేకుంట దొంగ శేతలు జేసుకుంట ఉల్టా బద్నాం జేస్తున్నరు.
''అరేరు రమేశ్! ఏదేమన్న కానియ్యిరా? ఈ గొడవలన్నింటికి దూరంగ ఉంటా. నా ఉద్యమ రాజకీయ గురువు పిచ్చయ్య తాతే పోయినంక ఈ రాజకీయాలు నాకెందుకురా?''
''పిచ్చయ్య తాత సాయం చేసిండన్నా!, నేను కాదంటలే, కానీ నీ మొకం జూసి కూడా జనం ఓట్లేసిన్రు. ప్రతీ సమస్యకి పరిష్కారం ఉన్నది. సదువుకున్నోనివి నీగ్గూడా ఎర్కే. ఇప్పటికీ మనూరి గుడిలకు మనోల్లను రానియ్యరు. అధికారంలకు రానియ్యరు. మనోల్లు ఏ చిన్న సన్న పదవిలో ఉన్నా నెగలనియ్యరు. ఇట్లా నడువొద్దనే కదా! పిచ్చయ్య తాత నిన్ను సర్పంచుగ చూడాలనుకున్నడు. రేపు పంచాయతీల ఆ గోపీగానితో గట్టిగ కొట్లాడుదామన్నా !''.
ఇదంతా వింటున్న కాశయ్య ఆవేశంతో ''అరేరు రమేశా! ఆని పెండ్లి దగ్గరికొస్తుంది. ఇంకా ఈ కొట్లాటలెందుకురా?''.
బాధనుండి కొద్దిగా తేరుకున్న యాదగిరి ''నాయినా! మన రమేశ్ ఉన్నదున్నట్లు చెప్పిండు. నేనూ జూస్తున్న. మనూర్ల ఎక్కడ ఏం జరిగినా నన్ను ఆమడ దూరం పెడున్నరు. కాలం మారింది నాయినా! మనమిప్పుడే కాదు ముందు ముందు కూడా తెలివితో అడుగులెయ్యకపోతే పిచ్చయ్య తాత కష్టమంతా ఉత్తదైతది''.
ఇద్దరు అనుచరులు ఆవేశంతో ''అవును యాడ్డారన్నా! ఆల్లతో రేపు తాడో పేడో తేలాలే. మన ఊర్ల అందరు యూత్ లీడర్లను తీసుకొస్తం''
మరునాడు ఉదయం గోపి వర్గం, యాదగిరి వర్గం గ్రామ పంచాయతీల నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ వాదంలో బలాబలాలు చూపించుకుంటున్నారు. వాడి వేడి వాతావరణం మధ్యాహ్నం వరకూ చల్లబడలేదు. పరిష్కారం ఎటూ తేలలేదు.
తక్కువ కులం సర్పంచ్ యాదగిరిని తప్పకుండా దూరం పెట్టాలని భావించిన గోపి వర్గం సమస్యను సరికొత్త ఎత్తుగడలతో తన సామాజిక వర్గానికే చెందిన ఎమ్మెల్యే గారి చేతుల్లో పెట్టారు. అదే రోజు సాయంత్రం ఎమ్మెల్యే గారు తన పార్టీలోనే ఉన్న గోపి వర్గంలోని నమ్మకమైన ఇద్దరు దళితుల నుండి, యాదగిరి వర్గం లోని నమ్మదగిన ఇద్దరు దళితుల నుండి కావలిసిన సమాచారం తెప్పించకున్నాడు. వెంటనే గోపి, యాదగిరిలలో ఎవరి వల్ల ఓట్ల బలం పెరుగుతుందో అంచనా వేసుకున్నాడు. ఓట్ల బాలన్స్ షీట్ ఎట్లా ఉందో సరి చూసుకున్నాడు. ఆ తరువాత రోజే గ్రామానికి వచ్చి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసాడు. ఇరు వర్గాలతో కొన్ని గంటల పాటు చర్చించి, లోలోన సమీక్ష చేసుకొని తీర్పునిచ్చాడు. పోటీలో ఏ సామాజిక వర్గం వారున్నా దళిత ఓటు బ్యాంకు చైతన్యంతో నిండి దళిత ఓటు దళితుడికే వేసుకునే పరిస్థితి వచ్చినపుడు ఎదుటివారు కూడా దళితుడి వైపే మొగ్గుతారని, మెజారిటీ ఓటు ఎటు వైపుంటే బలం లేదా బలవంతుడు అటు వైపే అనుకూలంగా ఓటు వేస్తూ తప్పక తీర్పునిస్తాడని, ఓటు విలువే ఎప్పటికీ గెలుస్తుందని ఎమ్మెల్యే గారు నిరూపించారు.
పిచ్చయ్య తాత చనిపోయిన సంఘటనతో యాదగిరి వ్యక్తిగా బాగా కుంగిపోయినా సర్పంచ్‌గా గ్రామ ప్రజల్లో పెరిగిన సానుభూతితో నాయకుడిగా మరింత బలం పెంచుకున్నాడు. ఈ అంచనాలన్నీ పసిగట్టిన ఎమ్మెల్యే గారు యాదగిరికి అనుకూలంగా ఇచ్చిన తీర్పును కుల మతాలకతీతంగా గ్రామ ప్రజలందరూ ఎంతో సంతోషంతో స్వాగతించారు. అనుకున్న ముహుర్తానికే యాదగిరి - లక్ష్మి వివాహం జరిగింది. అనుకున్న సమయానికే గోపీ వర్గం, గ్రామ ప్రజల అందరి సమక్షంలో గర్భ గుడిలో సర్పంచ్ యాదగిరి లక్ష్మి దంపతుల చేతిలో తొలి కొబ్బరికాయ పగలడానికి సిద్ధమైనది.
- డాక్టర్ మండల స్వామి
సెల్: 9177607603