Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెల్లారి లేచి పళ్ళు తోముకుని గబగబా పొలానికి బయలు దేరుతున్నాడు రాఘవయ్య
''ఎందుకయ్యా అంత కంగారు.. ఇది రోజు చేసే పనే కదా? ఒకపూట వెళ్లకపోతే ఏమౌతుంది'' అంది రంగయ్యభార్య మహాలక్ష్మి.
''అలా అంటావు ఏంటి లక్ష్మి? ఇంకెన్నాళ్లు నా కొడుకు చదువు పూర్తి చేసుకుంటే నాకు కష్టాలే ఉండవు. కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు. ఇన్నాళ్లు కష్టపడ్డాను. ఇక మీదట నా కొడుకు సంపాదిస్తే కూర్చుని తింటాను. మనకు మాత్రం ఎవరున్నారు చెప్పు! ఆ భగవంతుడి దయవల్ల నా కొడుకు చదువు పూర్తయి ఉద్యోగం వస్తే చాలు మన కష్టాలన్నీ తీరిపోతాయి'' అని అన్నాడు రాఘవయ్య.
బాగుందయ్యా సంబడం. ఆడేప్పుడు చదువు పూర్తి చేస్తాడు. ఎప్పుడు ఉద్యోగం తెచ్చుకుంటాడు. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడిన డబ్బంతా వాడి చదువుకే పెడుతున్నారు. వాడేమో పట్నంలో ఎలా చదువుతున్నాడో ఏంటో అని నిట్టూర్చింది మహాలక్ష్మి.
''అలా అనకు మహాలక్ష్మి వాడు మంచి ప్రయోజకుడు అవుతాడు, మనల్ని చక్కగా చూసుకుంటాడు'' అని అన్నాడు రాఘవులు.
మహాలక్ష్మికి, రాఘవయ్యకి ఇద్దరు సంతానం. అవినాష్, సాహితీ. తమకు ఉన్నంతలో కష్టపడి కొడుకుని చదివించు కుంటున్నారు. తన కొడుకుకి ఉద్యోగం వస్తే తనలాగా ఈ పల్లెటూర్లో బతికే అవసరం ఉండదని, చక్కగా పట్నంలో ఉండొచ్చని ఎంత కష్టమైనా తను తిన్నా తినకపోయినా కొడుకు బాగుండాలని రాఘవయ్య ఆశ.
కూతుర్ని మాత్రం ఇంటర్‌తోనే చదువు మానిపించి దగ్గర బంధువులు అయినా నారాయణరావు కొడుక్కిచ్చి పెళ్ళి చేసాడు. నారాయణ రావు మహాలక్ష్మికి సొంత అన్న! నారాయణ రావు కొడుకు శేఖరు! డిగ్రీ వరకు ఊర్లోనే చదువుకొని ఆ ఊర్లో తెలుగు మాస్టారుగా పని చేస్తున్నాడు.
చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల తల్లిదండ్రులు మాటలకు ఎదురు చెప్పలేక మేనమామ కొడుకుని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది సాహితి.
అలా అవినాష్‌కీ నెలనెలా డబ్బులు పంపి పట్నంలో ఇంజనీరింగ్ కాలేజీలో చదివిస్తున్నాడు రాఘవయ్య. కానీ అవినాష్ అంత బాగా చదువుకోవడం లేదు. చెడు తిరుగుళ్ళ లకు అలవాటు పడి, చెడు స్నేహాలు పెరిగి లేనిపోని ఆర్భాటాలకు పోయి డబ్బునీ మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నాడు.
అలా తన తండ్రి పంపిన డబ్బులు కాక మళ్లీ మధ్యలో ఆ ఎగ్జామ్ ఉంది ఈ ఎగ్జామ్ ఉంది అని తండ్రి దగ్గర నుంచి లెక్కలేనంత డబ్బుని రాకోరుతున్నాడు. పట్నంలో ఉన్న కొడుకు ఏం కష్టపడుతున్నాడో అని రాఘవయ్య అడిగినప్పుడల్లా లేదనకుండా అప్పులు చేసి మరీ డబ్బులు పంపుతూ వస్తున్నాడు.
అలా నాలుగేళ్లు పూర్తయ్యాక అవినాష్ ఇంటికి వస్తున్నాడు. కొడుకు వస్తున్నాడు అన్న సంతోషంతో రాఘవయ్య కాళ్ళు చేతులు ఆడటంలేదు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు. ఊర్లో కనిపించిన వాళ్ళందరికీ నా కొడుకు ఇంజనీర్ అయిపోయాడు ఈరోజు వస్తున్నాడు అని దారి పొడుగునా చెప్పుకొని కొడుకుని ఇంటికి తీసుకు రావడానికి రైల్వే స్టేషన్‌కి వెళ్ళాడు.
అవినాష్ వస్తున్న ట్రైను రెండు గంటలు లేటు. అంతలో ఏం చేయాలో తోచక పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చొని కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.
రాఘవయ్య! దూరంగా ఒక వ్యక్తి రాఘవయ్యని చూసి నవ్వుతూ పలకరించాడు. కాస్త ముసలి వయసు రావడంతో ఆ వ్యక్తి ఎవరో పోల్చుకోలేక పోయాడు రాఘవయ్య.
అతను దగ్గరికి వచ్చి ''ఏ రాఘవులు బాగున్నావా''? అని పలకరించాడు. ''అయ్యో ప్రసాదు నువ్వా? ఎలా ఉన్నావు? పోల్చుకోలేక పోయాను? ముసలి వాళ్ళం అవుతున్నాము కదా! కళ్ళు కాస్త మసకబారాయి'' అని తన చిన్ననాటి మిత్రుడితో కబుర్లలో మునిగిపోయాడు రాఘవయ్య.
తన కొడుకు ఇంజినీరింగ్ చదివి ఈ రోజే ఊరు నుండి వస్తున్నాడు అని గొప్పగా చెప్పాడు.
''మరి కూతురు ఏం చేస్తుంది'' అని అడిగాడు ప్రసాద్. అందుకు రాఘవయ్య ''కూతురుకు పెళ్లి చేసి పంపించాను'' అని చెప్పాడు.
''అదేంటి చిన్న పిల్ల కదా అప్పుడే పెళ్లి చేసావా'' అని అడిగాడు ప్రసాద్.
ఎన్నేళ్లు పెట్టుకున్నా ఆడపిల్ల గుండెల మీద కుంపటి కదా! ఆ భారం తీర్చుకుంటే ఓ పనైపోతుంది. ఎన్నాళ్ళని ఇంట్లో పెట్టుకుంటాము చెప్పు! అని నవ్వాడు రాఘవయ్య. ''మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు'' అని అడిగాడు రాఘవయ్య.
అందుకు ప్రసాదు గర్వంగా నా కూతురు ఐఏఎస్ పరీక్షకి ప్రిపేర్ అవుతుంది. కొడుకు ఇంజనీరింగ్ చదివాడు. అని చెప్పాడు ప్రసాద్. ''మరి మీ వాడికి క్యాంపస్‌లో ఉద్యోగం వచ్చిందా?'' అని అడిగాడు.
ఇప్పుడే కదా చదువు పూర్తయింది అప్పుడే ఉద్యోగం ఎట్లా వస్తుంది అని అమాయకంగా అన్నాడు రాఘవులు.
''అదేంటి రాఘవులు ప్రతి కాలేజీలోనూ 4వ సంవత్సరంలో ఉన్నప్పుడే కంపెనీ వాళ్ళు వచ్చి ఉద్యోగాలకు పరీక్ష పెట్టి ఎంపికైన వారికి ఉద్యోగాలు ఇస్తారు అని మా అబ్బాయి చెప్పాడు. వాడు రెండు మూడు కంపెనీలో సెలెక్ట్ కూడా అయ్యాను'' అని చెప్పాడు. ''మరి మీ వాడు నీకు ఏమి చెప్పలేదా?'' అని అడిగాడు ప్రసాద్.
ప్రసాద్ అలా అడిగే సరికి కొడుకు తన దగ్గర నిజాలు దాచి పెట్టాడు అని మొఖం చిన్న బుచ్చుకున్నాడు రాఘవులు. కానీ నిజం చెప్తే స్నేహితుడి దగ్గర పరువు పోతుందని ''ఆ....చెప్పే ఉంటాడు. నేనే సరిగ్గా వినలేదు'' అని కొడుకుని సమర్ధించుకున్నాడు.
అంతలో అవినాష్ ట్రైను రానే వచ్చింది. చాలా కాలం తర్వాత వచ్చిన కొడుకును చూసి సంతోషపడ్డాడు రాఘవయ్య. తన స్నేహితుడికి! కొడుకుని పరిచయం చేసే లోపునే ఫోన్లో మాట్లాడుకుంటూ అవినాశ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రసాద్ కొడుకు మాత్రం వినయంగా వచ్చి రాఘవులుకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకొని పలకరించి వెళ్ళాడు.
తన కొడుక్కి, స్నేహితుడి కొడుక్కి ఉన్న వ్యత్యాసాన్ని చూసి మనసులో చిన్నబుచ్చుకున్నాడు రాఘవులు. కానీ బయట పడకుండా నవ్వుతూ సర్దిచెప్పుకొని ఇంటికి వెళ్లిపోయాడు. మహాలక్ష్మి కొడుకు వచ్చాడని, కొడుకుకి ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టింది. అన్నయ్య వచ్చాడు కదా! అని ఆనందంతో సాహితీ అవినాష్‌ని చూడటానికి ఇంటికి వచ్చింది.
కానీ అవినాష్ ఎవరితోనూ కలివిడిగా లేకుండా ఫోన్ పట్టుకొని ఎప్పుడూ ఏదో మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు.
వచ్చినప్పటి నుంచి కొడుకు ప్రవర్తనను గమనించిన రాఘవులు కొడుకుని నిలదీశాడు. ప్రసాద్ కొడుకుకి ఉద్యోగం వచ్చింది అంట. ''మరి నీ సంగతేంటి'' అని అడిగాడు రాఘవులు.
''నువ్వు చదివించిన కాలేజీకి క్యాంపస్ ఇంటర్వ్యూలు లేవు'' అని సమాధానం ఇచ్చాడు అవినాష్.
''అదే ఏంట్రా ఆ రోజు గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే అది మంచి కాలేజీ కాదు, ఉద్యోగం రాదు అని ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అయ్యావు కదా!. మరి ఇప్పుడు అలా మాట్లాడుతున్నావ్ ఏంటి?'' అని అడిగాడు రాఘవులు.
అందుకు బదులుగా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయాడు అవినాష్. గట్టిగా అడిగేసరికి సబ్జెక్టులు ఉండిపోయాయని చేదు నిజాన్ని చల్లగా చెప్పాడు.
ఆ మాటలు విని రాఘవులు కుప్పకూలిపోయాడు. అడిగిన వెంటనే కాదనకుండా కోరినంత పంపించాడు. కొడుకు ప్రయోజకుడు అయితే కాలు మీద కాలేసుకుని సంతోషంగా ఉండొచ్చు అని భ్రమ పడ్డాడు.
కానీ రాఘవయ్య ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఊర్లో అందరితో కొడుకు గొప్ప ఇంజనీర్ అయ్యాడని చెప్పుకుని తిరిగాడు. ఇప్పుడు ఊర్లో వారికి తన మొహం ఎలా చూపించుకోవాలి అని సిగ్గుతో ఏడుస్తున్నాడు.
కానీ అవినాష్ మాత్రం ఏదీ పట్టనట్టు తన ధ్యాసలోనే తను ఉంటూ 24 గంటలు ఆ ఫోన్‌తోనే గడుపుతున్నాడు.
అలా ఒక ఏడాది గడిచింది. అవినాష్ తన సబ్జెక్టు పూర్తి చేయలేక పోయాడు. ఇంట్లోనే పని పాట లేకుండా కూర్చొని తింటున్నాడు. అలా కొన్నాళ్ళు చూసి రాఘవయ్య ''మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు'' అని అడిగాడు.
''బిజినెస్ చేసుకుంటాను'' అని చెప్పాడు అవినాష్.
''బిజినెస్ అంటే మాటలా కోట్లల్లో పెట్టుబడి పెట్టాలి. అయినా ఏ వ్యాపారం చేస్తావ్'' అని అడిగాడు రాఘవులు.
తన స్నేహితుడికి పట్నంలో హాస్టల్ బిజినెస్ ఉందని, ఆ బిజినెస్ చాలా బాగుంటుందని చెప్పాడు. ఉద్యోగాలు చేసుకునే అమ్మాయిలు అబ్బాయిలు హాస్టల్లో ఉండి చదువుకునే వారందరూ ఈ హాస్టలోనే వసతి చేస్తారు. కనుక ఇప్పుడు ఆ బిజినెస్ బాగా నడుస్తుంది. నేను నా స్నేహితులతో కలిసి అదే బిజినెస్ చేయాలనుకుంటున్నాను అని సమాధాన మిచ్చాడు అవినాష్. అందుకు తనకు డబ్బు కావాలని అడిగాడు.
అవినాష్ కొడుకు మాటలు విని మతి పోగొట్టుకున్నాడు రాఘవయ్య. ఇప్పటికే తన చదువుకి చాలా అప్పులు చేశాడు. ఇప్పుడు బిజినెస్‌కి అంత డబ్బు ఎక్కడ నుండి తేవాలి? అని దీర్ఘాలోచనలో పడ్డాడు రాఘవయ్య.
ఇంట్లో భార్య బంగారమంతా అమ్మి తన పొలం తాకట్టు పెట్టి కొంత డబ్బు ఏర్పాటు చేశాడు. ఆ డబ్బులు పట్టుకొని అవినాష్ బెంగళూరు వెళ్ళాడు. తన స్నేహితుడికి డబ్బు అంతా ముట్ట చెప్పాడు. అలా రెండు నెలలు గడిచినా తన స్నేహితుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అవినాష్‌కి.
అనుమానం వచ్చిన అవినాష్ తన స్నేహితుడిని నిలదీశాడు. ''పాట్నర్‌షిప్ అన్నావు కదా! నా వాటా ఏది?'' అని.
అందుకు తన స్నేహితుడు ''నీకు పాట్నర్‌షిప్ అని ఎప్పుడు చెప్పాను? నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను, వెళ్లి పని చూసుకో'' అని మాట మార్చాడు.
అంత ఘోరంగా తన స్నేహితుడు మోసం చేసినందుకు తట్టుకోలేక కొట్లాటకు దిగాడు అవినాష్. అందుకు కోపగించుకున్న తన స్నేహితుడు రౌడీలతో కొట్టించి ''ఒక్క రూపాయి కూడా ఇవ్వను ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో'' అని వదిలేశాడు.
మోసపోయిన అవినాష్ తన మొహం తండ్రికి చూపించలేక ఉద్యోగం తెచ్చుకోలేక తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకున్నందుకు సిగ్గుతో ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. కానీ అదష్టవశాత్తు అవినాష్ ఆత్మహత్య చేసుకున్న సమయానికి పక్క రూములో వాళ్ళు చూసి రక్షించారు. ఇంటికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పారు. ఈ సంగతి తెలిసిన రాఘవులు పరుగుపరుగున గుండెలు బాదుకుంటూ వచ్చాడు. తండ్రిని చూసి సిగ్గుతో తల దించుకున్నాడు అవినాష్. కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న రాఘవయ్య కొడుకు అసమర్ధతను చూసి కుంగిపోయాడు. ఏమి మాట్లాడకుండా ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు.
ఇంటికి వెళ్లేసరికి అల్లుడు శేఖర్, కూతురు సాహితీ స్వీట్ బాక్స్ పట్టుకొని ఇంటికి వచ్చారు. సాహితీ భర్త ప్రోత్సాహంతో కరెస్పాండెన్స్లో డిగ్రీ పూర్తి చేసుకొని, గ్రూప్ 2 ఎగ్జామ్‌లో తాను సెలెక్ట్ అయ్యి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని చల్లని కబురు తల్లిదండ్రులకి చెప్పాలని వచ్చింది.
గుండెల మీద కుంపటి గావించిన రాఘవయ్య కూతురు ఉన్నతిని చూసి సిగ్గుపడ్డాడు. ఆడపిల్లని తక్కువగా చేసి మాట్లాడినందుకు తనని తానే దూషించుకున్నాడు. మగ పిల్లాడు కుటుంబాన్ని ఉద్ధరిస్తాడు అని అపనమ్మకంతో ఉన్నదంతా ఊడ్చి పెట్టి అప్పులు చేసి చదివిస్తే ఈ రోజు వాడు ఒక అసమర్థుడై పిరికివాడిలా ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు. అదే కూతురికి చిన్న వయసులోనే పెళ్లి చేసి పంపించినా పల్లెత్తి మాట కూడా ఎదురు చెప్పకుండా తలవంచుకుని వెళ్ళిన కూతురు ఈ రోజు తన తండ్రి తలెత్తుకునేలా చేసిందని ఆనంద భాష్పాలు కురిపించాడు.
తల్లిదండ్రులకు పిల్లల మీద నమ్మకం ఉండొచ్చు. కానీ అతి నమ్మకం ఉండకూడదు. ఆడపిల్లయినా మగ పిల్లవాడైన ఇద్దరినీ సమానంగా చదివించాలి. పిల్లల్లో తారతమ్యాలు తల్లిదండ్రులే చూపిస్తే సమాజంలో ఆ బిడ్డలు ఎలా బతకగలరు? భర్త మంచి వాడైతే ఆడపిల్ల తన జీవితాన్ని చక్కబెట్టుకోగలదు. అదే భర్త వ్యసనపరుడు అయితే చేతిలో చదువు లేకపోతే సమాజంలో బతకడం చాలా కష్టం. అదేవిధంగా కొందరు తల్లిదండ్రులు పిల్లలు కోరితే ఏదైనా తెచ్చి పెడుతున్నారు.
అడిగిన అంతా డబ్బులు ఇస్తున్నారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఎలా చదువుతున్నారు? అని పట్టించుకోకపోవడం వల్లే అవినాష్ లాంటి అబ్బాయిలు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.
- మువ్వల జ్యోతి
సెల్: 9008083344