Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఇప్పుడు చెప్పండి బాబారు.. ఊరెట్లా ఉంది?'' అన్నాడు భామమూర్తి భోజనం చేసి కూర్చున్న శివరాంకు ఎదురు పోఫాలో కూర్చుంటూ
''ఊరు గురించి చెప్పడానికి ఏముంది..? అది ఎట్లుందో అట్లే ఉంది. అయితే ఉండాల్సిన తీరైతే లేదురా భానూ..!'' అన్నాడు కాస్త మనసులో వేదనతో.
''అదేం..''
''అదే.. ప్రతియేడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది. ఒకేడు కరువు! ఒకేడేమో వరదలు. ఉంకో యేడు రోగాలు.. ! ఇట్లా ఏయేటికాయేడు జవం కష్టాల్లోనే మగ్గుతుండ్రురా...'' అన్నాడు బాధను దిగమింగుతూ.
''పల్లెటూల్లో కరువేంటి బాబారు? వాగులు వంకలేమయ్యాయి ?''
''వానలుంటేనే కదా అవి పారేది? రెండు మూడేళ్లు అసలు నీటిసుక్కే కరువైతే...! మాంకాళమ్మ తల్లి ఎందుకు కరుణిత్తలేదో మరి?''
''మాంకాళమ్మ కరుణించడమేంది బాబారు...?''
''అదేమరి.. ప్రతియేడూ మాంకాళమ్మ తల్లికి జోరుగా జాతర సేత్తునే ఉన్నరు. యాటపోతులు, దున్నపోతులు బలిత్తునే ఉన్నరు. అయినా తల్లి సల్లని సూపు పడడం లేదంటున్న..'' అని క్షణమాగి ''అన్నట్లు వచ్చే దశిమికి జాతర ఏర్పాట్లు కూడా జరుగుతున్నరు...'' అన్నాడు శివరాం ఊల్లో జరగబోయే జాతరమ గుర్తుచేసుకుంటూ.
భామమూర్తి మౌనం వహించాడు. కాసేపు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు.
అతని మౌనాన్ని వేరుగా అర్థం చేసుకున్న శివరాం ''అవి ఎప్పుడూ ఉండేటియే భానూ! చెల్లెకు పెండ్లి కుదిరింది. మీరు కుటుంబమంతా కల్సి రావాల. మనూల్లో మీ చిన్నాయన ఉన్న సంగతి మర్సిపోయి ఏడేండ్లేందనుకుంట. ఇప్పుడు తప్పక రావాల్సింది.'' అంటూ సంచిలో నుండి పెళ్లి కార్డు తీసి అందించాడు.
భామమూర్తి వైజయంతితో కలిసి పెళ్లి పత్రిక అందుకుంటూ ''తప్పకుండా వస్తాం బాబారు. మాక్కూడా పుట్టి నూరు మర్చిపోయిన భావవ రాకుండా ఉండాలంటే తప్పక రావాలి'' అన్నాడు.
''పిల్లలకి కూడా ఓసారి పల్లెటూరు వాతావరణం చూపించాలనుంది మావయ్యా. అక్కడికొస్తే అన్ని ముచ్చట్లు తీరుతాయి'' అంది వైజయంతి. ''సంతోషమమ్మా! మరి నాకు సెలవిప్పిత్తే రాత్రి బండికి ఊరెళ్లిపోతా..'' అన్నాడు శివరాం.
భానుమూర్తి నవ్వాడు. ''ఇదేం మంచిర్యాల మండి మనూరికి బస్సులో పోయినట్లు అమకుంటున్నావా బాబారు? ఇది బెంగ్లూరు. గంటలు గంటలు తిరుగుప్రయాణం చేయలేవు. రేపు హైదరాబాద్ దాకా ఫ్లైట్ బుక్ చేస్తా. అక్కన్నుండి బస్సులో వెళ్లొచ్చు'' అన్నాడు.
''అబ్బా.. విమానం ఎక్కాల్నా..? కండ్లు తిరుగుతయేమో!''
''ఏం కాదుగానీ ఇక రెస్టు తీసుకోండి మామయ్యా!'' అంటూ గెస్టురూంలో పడక సిద్ధం చేసింది వైజయంతి. శివరాం లేచి గదిలోకి వెళ్తూ ''మరి పిల్లలు కనిపించలేదు కదమ్మా.'' అన్నాడు.
''వాళ్లొచ్చేసరికి చీకటి పడుతుంది మావయ్యా! రేప్పొద్దున్నే కనిపిస్తారు లెండి..'' అంది వైజయంతి.
శివరాం గదిలోకి వెళ్లి మేను వాల్చాడు. రోజంతా ప్రయాణం చేసిన బడలికతో వెంటనే నిద్ర పట్టేసింది.
కార్లో తల వెనక్కి వాల్చి కూర్చున్నాడు భానుమూర్తి. వెనక సీట్లో భార్య, ఇద్దరు కూతుళ్లు సందడి చేస్తున్నారు. గంట క్రితమే హైదరాబాదులో ఫ్లైట్ దిగారు. అక్కన్నుండి టాక్సీలో వాళ్లూరు బయలుదేరారు.
మంచిర్యాల్కు ఎనభైౖ కిలోమీటర్ల దూరంలో అడవిలో ఉంటుంది వాళ్లూరు. ఆధునిక వసతులు అందుబాటు లోకొచ్చినా వ్యవపాయం, కులవత్తుల మీద ఎక్కువగా ఆధారపడే గ్రామం. సాంప్రదాయాలు, ఆచారాలకు ఏలోటూ రానీయని జనం.
భామమూర్తి పుట్టింది అక్కడే అయినా తండ్రి రఘురాంకు బెంగుళూరులో ఉద్యోగం చేయాల్సి రావడంతో భాను ఐదేళ్ల వయసున్నప్పుడే ఊరు వదిలి పెట్టాడు. తర్వాత బెంగుళూరు లోనే స్థిరపడ్డాడు. భామమూర్తికి వాళ్లూరిలో చిన్ననాటి స్మతులు పెద్దగా గుర్తులేకున్నా తన ముప్పయైదేళ్ల జీవితంలో ఓ ఐదారుసార్లు వచ్చాడంతే! ఏడేళ్ల క్రితం వాళ్ల నాన్నగారు చని పోయాక ఓ సారి వచ్చి వెళ్లాడు. మళ్లీ గాయిత్రి పెళ్లి పేరుతో ఆ ఊల్లో భార్యాబిడ్డల్తో అడుగు పెడుతున్నది ఇప్పుడే!
పెళ్లి తంతు ఘవంగా పూర్తయింది.
గాయిత్రికి పెదనాన్న కొడుగ్గా. పెళ్లిలో పెద్దన్నపాత్ర పోషించి, అన్నీ తానై చూస్తూ పెళ్లి పెద్దలాగే వ్యవహరించాడు భానుమూర్తి. ఎదుర్కోళ్ల నుండి అప్పగింతలదాకా అన్నిట్లో ముందుండి నడిపించాడు. చాలా యేళ్ల తర్వాత తమవాడైన ఓ పెద్దదిక్కు నేనున్నానని బాధ్యతలన్నీ భుజాలమీద వేసు కోవడంతో శివరాం కుటుంబం చాలా సంతోషించింది.
దూరాన ఉన్నా దగ్గరివాళ్లు దగ్గరి వాళ్లేనని భామమూర్తి నిరూపించాడు. ఊరివాళ్ల సహకారం భానుకు బాగా వచ్చింది. అడుగడుగునా 'చెప్పండయ్యా.. చెప్పండయ్యా' అంటూ తననే సలహాలు అడిగి మరీ చేయడం భానుకు బాగా ఆత్మ సంతప్తినిచ్చింది. అతని భార్యా పిల్లలు కూడా బంధువులతో పాటు ఊరివాళ్లతో కూడా బాగా కలిపి పోయారు.
పట్నంపెళ్లీల హడావుడి కంటే పల్లెల్లో పెండ్లిల తంతు హాయిగా, ఆత్మీయంగా అనిపించింది వైజయంతికి. శివరాం కుటుంబం తనను అక్కువ చేర్చుకున్న తీరు కూడా బాగా వచ్చింది.
వచ్చే నాలుగు రోజుల్లో ఊళ్లో జాతర జరగబోతోంది.
భానుమూర్తి కుటుంబాన్ని జాతర వరకూ ఇక్కడే ఉంచాలనే ఆలోచనతో ఉన్నారు శివరాం కుటుంబ సభ్యులు. అయితే భాను కూడా జాతర చూసిపోవడానికే సిద్ధపడి వచ్చాడు. వాళ్లంతా 'జాతర వరకూ వెళ్లేది లేదు' అంటుంటే ''చిన్నప్పట్నుండీ మనూరి మాంకాళమ్మ జాతర చూసింది లేదు. అంత దూరం నుండొచ్చాం కదా! జాతర చూసే వెళ్తాం..'' అవగానే ఇంటిల్లిపాదీ సంతోషించారు. పిల్లలు కూడా ఇంకో నాల్రోజులు ఆటవిడుపు దొరికిందని ఆనందించారు.
భానుమూర్తికి వాళ్లూల్లో ప్రతియేడూ మాంకాళమ్మ జాతర జరుగుతుందని తెల్సుగానీ అదెప్పుడూ చూడలేదు. ఐదేళ్ల వయసు వరకు ఏం జరిగిందో గుర్తులేదు. జాతరకు ఎక్కడెక్కడో బంధుమిత్రులు ఆ ఊరికి వచ్చి చేరుతారని తెల్సు. తనకే అవకాశం రాలేదు. అది ఇప్పుడొచ్చింది. పైగా భార్యాపిల్లలు కూడా ఉత్సాహం చూపించడంతో ఈసారి మాంకాళమ్మ జాతర చూసి తీరాల్సిందే అని నిశ్చయానికొచ్చాడు.
అనుకున్న రోజు రానే వచ్చింది.
ఊరంతా మహా సందడిగా ఉంది. పెద్దలతో పాటు పిల్లాపాప ముసలీ ముతకా అంతా జాతర తాలూకు వేడుక లను ఆస్వాదించేందుకు సన్నద్ధమయ్యారు. ఊల్లో డప్పుల శబ్దాలు, బూరల మోతలు మారుమ్రోగుతున్నాయి. నగలూ నట్రా, కొత్తబట్టల రెపరెపలు, చుట్టాలు పక్కాలతో ఊరంతా సందడిగా ఉంది.
ఊరవతల మూడు కిలోమీటర్ల దూరంలో నున్న కొండరాతికి వెలసిన దేవత మహంకాళమ్మ. దానికి శిల్పులు మరింత రూపు కల్పించి భీకరాకతినిచ్చారు. అక్కడ ఆలయమేదీ లేదు. ఆ దేవి వెలసిన రాతిబండను మాత్రమే కప్పుతూ ఓ పెద్ద రేకులషెడ్డు వేశారు. మిగతా అంతా ఖాళీ ప్రదేశమే! విశాలమైన చెట్లు పరుచుకొని ఊరి జనమంతా వేడుక జరుపుకునేందుకు అనువుగా, ఆహ్లాదభరితంగా ఉన్న కొండ ప్రాంతం అది.
దేవీ విగ్రహానికి కొద్దిదూరం నుండి మొదలుకొని ఆ చివరి వరకూ చిరువ్యాపారులు రకరకాల దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. చెట్టు చెట్టుకూ రెండుమూడు కుటుంబాలు తిష్టవేశాయి. అమ్మోరు ముందు కోడిపిల్లో, మేకపిల్లో తెగాక వంటల కార్యక్రమం మొదలవుతుంది. ఆడవాళ్లు మాత్రం స్థలం చదును చేసుకుంటూ రాతిపొయ్యిలు ఏర్పాటు చేసుకుంటున్నారు. పిల్లా జల్లా జాతరలో ఆటవస్తువులు, తినుబండారాలు కొమక్కొంటూ ఆ అటవీ ప్రాంగణంలో ఆట పాటల్లో తేలియాడుతున్నారు.
శివరాం కుటుంబంలోని ఆడవాళ్లతో కలిపి భానుమూర్తి కూడా మహంకాళి క్షేత్రానికి చేరుకున్నాడు. ఉత్సవాలు ప్రారంభం కాకమునుపే భార్యాపిల్లలతో మహంకాళమ్మ దర్శనమూ చేసుకున్నాడు.
ఈలోపు ఊరి చావడి నుండి ఊరేగింపు బయలుదేరింది. డప్పుచప్పుళ్లు, భాకా ధ్వనుల మధ్య ప్రతి ఇంటి నుండీ ఓ ఆడపడుచు బోనమెత్తుకొని కదిలింది. మహిళల్తో పాటు కోళ్లు, గొర్లు మేకపొటేళ్లు పురుషుల వెంట కోనకు తరలుతున్నాయి. డప్పుల సూరు ప్రతిధ్వనిస్తుంది.
జాతర నిర్వాహకులైన ఊరిపెద్దలు, ఉత్సవ కమిటీ పెద్ద కనకరాజూ ముందు నడుస్తుండగా అమ్మవారికి సమర్పించబోయే యాటపోతులూ, కల్లుకుండలు వెన్నంటి కదిలి వస్తున్నాయి. పోతరాజుల భయానక నత్యాలు, శివసత్తుల చిందులు, డప్పుసప్పుడుల దరువులు, ద్యావటి పాటలు, కొండజనులు కోలాటాలు అంతా.. అంతా ఆ అడవి తల్లికి కొత్త సందడిని తెచ్చి పెడుతుంటే.. కొత్తవాళ్లు కొంచెం చిత్రంగా కొంచెం ఆత్రంగా చూస్తున్నారు.
మాంకాళి సన్నిధిలో ఉన్న భానుమూర్తి కదిలివస్తున్న ఊరేగింపును పరిశీలిస్తున్నాడు. పిల్లలు ఊరేగింపును పట్టించుకునే స్థితిలో లేరు. మిగతా ఆడవాళ్లు మాత్రం దేవికి త్వరగా ఆరబోస్తే పొయిరాళ్ల మీదకు వంట గిన్నెలు ఎక్కించొచ్చనే ధ్యాసతో, తరలివస్తున్న గుంపుమ ఉత్సుకతగా చూస్తున్నారు.
ఈలోపు అరుపులు శబ్దాలతో ఊరేగింపు బందం నేరుగా మహంకాళి విగ్రహం ముందుకు చేరింది. డప్పుల శబ్దాలు, బాకాల ధ్వనులు మిన్నుముట్టాయి. జనమంతా మహంకాళికి ఎదురుగా అర్థచంద్రాకారంలో గుమిగూడారు. పోతరాజుల్లో ఒకరు దేవికి పూజాకార్యక్రమం మొదలెట్టాడు. పసుపు కుంకుమలు పైకెగసాయి. బయటకు చాచివట్లుగా ఉన్న దేవి పొడవాటి నాలుకపై కుంకుమ పడి మరింత ఎర్రగా కనిపిస్తుంది. విగ్రహ భాగమంతా పసుపుతో పులమబడి ఉంది. కళ్లు కాంతి పుంజాల్లా మెరుస్తున్నాయి.
రకరకాల పూలతో దేవికి అర్చన మొదలైంది. పూజారి పాత్ర నిర్వహిస్తున్న పోతరాజుల్లో ఒకరు మంత్రాలకంటే ఎక్కువగా మహంకాళిని 'అమ్మా.. మారెమ్మా, మైసమ్మా..' వంటి రకరకాల పేర్లతో స్తుతిస్తున్నాడు. మధ్య మధ్యలో ''తల్లీ.. మాంకాళమ్మా... కాపాడమ్మా..'' అని గట్టిగా అరుస్తూ పసుపు కుంకుమలు పైకి విసురుతున్నాడు. కొందరు మహిళలు పూనకం వచ్చినట్లుగా విగ్రహం ముందు తూలుతున్నారు. డప్పుల మోత మరింత పెరిగింది. అక్కడ జరుగుచున్న తంతును జనం భక్తి శ్రద్ధలతో తిలకిస్తున్నారు.
భానుమూర్తి దష్టి మహంకాళి విగ్రహానికి ముందు కుప్పగా పోసిన అన్నపురాసి పైన బడింది. అయితే అతను చూస్తున్నది అది కూడా కాదు.
అన్నపు రాసి ముందు ఐదు యాటపోతులు, వాటి మధ్యలో పెద్ద దున్నపోతు అలంకరించబడి దేవికి అభిముఖంగా నిలబెట్టబడి ఉన్నాయి బలిపశువుల్లా.
పోతరాజు నోట మాంకాళి స్తుతి మరింత పెరిగింది. ఈళలు దరువులు, అరుపులు మిన్నంటాయి.
ఒక పోతరాజు మంత్రించిన సర్పంలా ఆ మహిషం ముందుకొచ్చాడు. చేతిలో పెద్ద పటకా కత్తి పైకి లేచింది. చూస్తున్న జనమంతా ఊపిరి బిగబట్టారు.
మరో క్షణంలో వేటు పడడం, ఆ మహిషం తల తెగి పడడం, దాని రక్తం ఫౌంటెన్లో పొంగి ఆ అన్నపు రాసిని తడిపి రక్తాన్నంగా మార్చడం జరిగి ఉండేది.
సరిగ్గా అప్పుడు పరుగెత్తుకొచ్చాడు భానుమూర్తి పోతరాజు ముందటికి. ''ఆగండీ...'' అని గట్టిగా అరిచాడు రెండు చేతులెత్తి.
ఎత్తిపట్టిన కత్తిని అట్లాగే నిలిపి శిలావిగ్రహంలా నిలిచి పోయాడు పోతరాజు. బిగబట్టిన ఊపిరిని వదులుతూ ఏం జరుగుతుందా అని ఉత్కంఠగా చూశారు జనం. దప్పుల దరువులు, శివసత్తుల నత్యాలు ఆగాయి. ఊరి పెద్దలకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.
ఉత్సవ పెద్ద కవకరాజు వెంటనే కల్పించుకొన్నాడు. ''ఏందయ్యా.. ! ఒవలయ్యా నువ్వు..? ఏడికెళ్లిచ్చినవ్? దేవికిచ్చే బలిని ఆపుతుండవా..? ఏం జరుగుతదో తెల్సా..?'' ఉరుముతున్నట్టు అన్నాడు.
''ఏం జరుగుతుంది? '' ప్రశ్నించాడు భానుమూర్తి. ఆయన భార్య, పిల్లల్తో పాటు శివరాం కుటుంబ సభ్యులూ బిత్తరవోయి చూస్తున్నారు.
''ఈడొవడయ్యా? ఏం జరుగుతదంటడు? ఇది మా ఊరికి ఏండ్ల తరబడి వత్తున్న ఆచారం. దీన్ని ఆపితే ఆపినోడికే కాదు.. ఊరికే పెద్ద అరిష్టం..'' అన్నాడు ఉత్సవ పెద్ద.
భానుమూర్తి వెమకడుగు వేయలేదు. ''ఊరి పెద్దలారా! నా మాటలు కొంచెం ప్రశాంతంగా వివండి. తర్వాత మీ ఇష్టం. నేను ఎక్కడివాన్నో కాదు. మీ ఊరివాన్నే. ఈ ఊరి నుండి ఇంజనీరైన రఘురాంగారి కొడుకుని. ఊరి జాతర చూద్దామని బెంగుళూరు నుండి వచ్చాము. ఇక్కడేమో ఇంత దారుణంగా అమాయక మూగజీవాల్ని బలివ్వడానికి సిద్ధమయ్యారు. ఇంటింటికి కోళ్లు గొర్రెల్ని కోతకు సిద్ధం చేసింది కాక నిలువెత్తు దున్నపోతును కూడా నరకడానికి సిద్ధ పడుతున్నారు. ఇదేం ఆచారం సామీ..?''
రఘురాం పేరు చెప్పగానే కనకరాజుతో పాటు ఊరి పెద్దలూ కొద్దిగా శాంతించారు. ఊరి జనం కూడా కొంత ప్రసన్నంగా మారినట్లనిపించింది. రఘురాం ఆ ఊరికి చేసిన అభివద్ధి దష్ట్యా జనానికి ఆయన మీద ఇంకా అభిమానం తగ్గలేదు. అయినా ఉత్సవ పెద్ద గొంతు సవరించుకొని ''మీరు కొత్తగ వచ్చినోళ్లు బాపూ! ఈ ఊరి ఆచారం మీకు తెల్వక పోవచ్చు. దీన్ని ఆపడం ఎంతమాత్రం మంచిది కాదు'' అన్నాడు.
''నాకు ఓ జవాబు చెప్పండి. ఈ మూగ ప్రాణాల్ని ఇక్కడ బలివ్వకుంటే జరిగేదేంటి?'' అన్నాడు సూటిగా.
''మళ్లీ సెబుతున్నామయ్యా! పతియేడూ ఐదు యాట పోతుల్తో పాటు దున్నపోతును బలియ్యడం ఈ ఊరి ఆచారం. అది ఏండ్ల తరబడి వత్తుంది. ఇప్పుడది మార్సితే కష్టాల బడతది, సెప్పరాని ఆపదలత్తయి.. ఇగ ఇంటింటికీ కోళ్లు గొర్లు బలియ్యడం అది ఆళ్ల సొంత ఇస్వాసం..''
భాను క్షణమాగి అన్నాడు. ''మీరన్నది సరైందే కావచ్చు. కానీ గత పదేండ్ల ఊరి చరిత్ర తిరగేసుకోండి. ఇంత పెద్ద అటవీ ప్రాంతమైనా మీ ఊళ్లో ఏ యేడూ చక్కగా వర్షాలు పడలేదు. మూడేండ్లు వరుసగా వర్షాలు లేక వాగులు, చెరువులు ఎండిపోయి కరువొచ్చింది. అసలు పంటలే పండలేదు. ఆ పైన రెండేండ్లు భారీ వర్షాలకు పండిన కొద్ది పంటలూ నాశనమైనవి. వాగులమ్మ పొంగి ఊరిజనం నలబైరెండు మంది కొట్టుకు పోయారు. ఉన్న ఏడువందల ఇండ్లలో వంద ఇండ్లు కూలి పోయినరు. ఇప్పుడు ఈ రెండేళ్ల నుండీ మళ్లీ వర్షాలు లేవు. సాగు, తాగునీరు కూడా కరువైతుంది. పోయినేడు అర్థంకాని వ్యాధితో ఊల్లో అరవై డెబ్బై పశువులు చనిపోయాయి. ఇంతకంటే ఊరికి ఆపదలేముంటాయి? ఎందుకు చెబుతున్నానంటే.. మీరు ప్రతియేడూ మాంకాళమ్మకు ఇన్ని ప్రాణుల్ని బలి పేరుతో సమర్పిస్తున్నారు కదా! మరి తల్లి ఎందుకు కరుణించడం లేదు?'' ఆలోచించండన్నట్లు కొన్ని క్షణాలు ఆగాడు.
ఔను కదా..! అన్నట్లు జనం కాసేపు మీమాంసలో పడ్డారు.
భానుమూర్తి కొనసాగిస్తూ ''ఎందుకంటే మీరు చేస్తున్న పని తల్లికి సంతప్తిని కలిగించకపోగా కోపాన్ని కలిగిస్తుందన్న మాట! ఔనా...కాదా?''
ఎవ్వరూ మాట్లాడలేదు.
''వేడి రక్తాన్ని కోరుకునే తల్లి చల్లని చూపు ఎట్లా ఇస్తుందనుకుంటున్నారు..?'' అతను సూటిగా ప్రశ్నించాడు.
అందరూ శిలా ప్రతిమల్లా చూస్తుండిపోయారు.
''అయితే ఇప్పుడేం చేయాలంటావ్..?'' అన్నాడు కనకరాజు ఉత్సవ కమిటీ పెద్దగా.
''మనం భక్తితో దేవికి ఏది సమర్పిస్తే తిరిగి అమ్మవారు మనకు అదే ఇస్తుంది. కనుక ఈ మూగజీవాల రక్తంతో అభిషేకించే బదులు, దేవి చల్లని చూపు ప్రసరించేలా స్వచ్ఛమైన పాలతో అభిషేకించండి.. పాడిపరిశ్రమ అభివద్ధి చెందుతుంది. మీకు వచ్చిన ధాన్యంతో అభిషేకించండి.. ధాన్యరాసులు వద్ధి చెందుతాయి. చక్కని నీటితో అభిషే కించండి.. జలరాసులు పొంగిపొర్లుతాయి. అంతేకాని రక్తాన్ని చిందిస్తే తిరిగి రక్తపు మరకలే అంటుకుంటాయి కదా ఊరికి..'' అన్నాడు గట్టిగా.
జనం సందిగ్ధ స్థితిలోకి నెట్టివేయబడ్డారు. ఒకరికొకరూ చర్చించుకోవడం మొదలు పెట్టారు.
నిర్వాహకులు కూడా సమాలోచనలో పడ్డారు. భానుమూర్తి చెప్పింది వాస్తవంలానే తోస్తుంది కమిటీ పెద్దలకు. ఈ సారి అతను చెప్పిన పద్ధతినే అవలంభించి చూస్తే...?!
అందరూ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఉత్సవ పెద్ద జనాన్ని ఉద్దేశించి ప్రకటించాడు. ''ప్రజలారా! అందరికీ వేడుకుంటున్న. మనూరు సల్లగుండాలంటే ఈ అయ్య సెప్పినట్టు ఈసారి మాంకాళమ్మ తల్లికి నెత్తురు సిందించకుండా పాలు, నీళ్లు, ధాన్యంతో అభిసేకాలు, సంతర్పణలు సేద్దాం! అమ్మ ఈ పూటన్నా కరుణించి వావలు పడి, పంటలు పండి, ఏ కట్టాలూ రాకుండ సూసిందంటే.. ఇగ అచ్చేయేడు మంచి మూగజీవాల బలిని మానేత్తాం. పతియేడూ ఇట్టానే జీవాల నెత్తురు సిందకుండా జాతర జరిపిత్తాం.. సమ్మతవేనా...??'' జనాన్ని ఉద్దేశించి అరిచాడు.
అందరూ తమ సమ్మతాన్ని తెల్పుతున్నట్లు ఈలలూ.. చప్పట్లతో మారుమోగి పోయింది కోన. డప్పులు మోగివరు. బాకాలు వాయించబడ్డారు.
అంతే! మహంకాళికి రక్తరహిత అభిషేకాలు మొదలైనాయి.
భానుమూర్తి కుటుంబంతో సహా దేవి ముందు మోకరిల్లాడు. 'తల్లీ...! వచ్చే యేటి నుండి నీ జీవాల్ని ఇంక నువ్వే రక్షించుకోవాలి' అని మాత్రమే మనసులో విన్నవించుకున్నాడు.
అతని అభ్యర్థనను మన్నిస్తున్నట్లుగా మహంకాళి విగ్రహం పై నుండి ఓ పుష్పం రాలి అతని తలపైన బడింది.
- కటుకోజ్వల మనోహరాచారి
సెల్: 9441023599