Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాత్రవ్వకుండానే కొన్నిసార్లు మనచుట్టూ చీకటవుతుంది.. ఇదుగో ఇప్పుడు అవనిపరీస్థితీ అదే.. అవని అంటే భూమి అనుకునేరు.. అవని ఈకథలో ముఖ్యభూమిక.. మ్యాన్ హౌల్స్కు దాహమెక్కువ వరద అలికిడవగానే నోరుతెరుస్తారు అనుకుంది అవని వరద నిండుతున్న నేల సొరంగాల్ని చూసి మరింత భయపడుతూ...
ఒకటే ధాటిగా కుండపోత కొంగు తలకు అడ్డం పెట్టుకొని హండ్ బాగ్ చేతుల్లో దాచుకొని హడావిడిగా ఒక పాత ఇంటి ముందు రేకుల షెడ్ వైపు పరుగెత్తింది.. తనకు ఆయాసం తన్నుకొస్తోంది, గాలి ఆడట్లేదు... నిలువునా తడిచిపోయింది జోరువానలో, చుట్టూ వరదలో ముందుకు పోలేక ఆగింది కానీ ఆమె అనుమానం నిజమైంది అక్కడింకెవరో ఉన్నారు...
నల్ల పంజాబీ డ్రెస్‌తో ఎక్కడో చూశినట్టు అనిపిస్తొందో యువతి... ముఖం సరిగ్గా కనపడట్లేదు కాస్త లోపలికి జరిగిందీ, 'ఎక్కడో చూసిన మొఖం' అని అనుకుంటుండగా... అవనికి పొద్దున బస్‌లో సీటు కోసం ఇద్దరూ గొడవపడిన సంఘటన గుర్తొచ్చింది...
విండో పక్కన కూర్చుంది అవని.. ఇంతలో బస్ కదులుతుండగా ఎక్కింది ఆమె కన్నా కొంత చిన్న వయసున్న యువతి.. 'హలో..అది నా సీటు' అందామె అవనిని ఆచోటు ఖాళీ చేయమన్నట్టు.. 'మీపేరేంటి' అంది అవని ఆమెవైపు తిరుగుతూ.. 'ఎందుకు' అందామె సీరియస్‌గా.. 'ఇక్కడ మీపేరు రాసుందేమో చూద్దామని' అంది అవని... ౖ'సిగ్గుండాలి'.. అవనికి వినపడేలా అందామె టికెట్ తీసుకోబోతూ.. 'అవును ఉండాలి' అంది అవని పర్స్ నుంచి డబ్బు తీస్తూ... కొంతసేపటి తరువాత తను దిగిపోయిన ఆసీన్ గుర్తు తెచ్చుకుంటూ..
'కొంచమన్న కామన్ సెన్స్ లేకుండా ఎంత మాటంది నన్ను.. చీ.. వెనక్కు వెళ్ళిపోదాం' అని చూస్తే వర్షం మరింత పెద్దదయ్యింది.. చేసేదేంలేక లోనికే నడుస్తుండగా.. లోపలి నుంచి ఆమె తనవైపు వడివడిగా వస్తుండటం గమనించింది అవని.. 'కొంపతీసి తనతో గొడవపడుతుందా' అని అనుకుంటుంతూనే ఏదో పసిగట్టి ఆమె వైపుగా పరుగెత్తి వెళ్ళి తనని పక్కకు తోసింది.. ఆ వెంటనే షెడ్డు దూలం విరిగి కింద పడింది.. అవని తోసేయకపోతే అంత బరువైన కలప తన నెత్తిన పడుండేదని ఆమె గ్రహించి.. అవని వైపు కతజ్ఞతగా చూసింది..
కొంత సేపటికి షెడ్డు కూడా వరద అవుతుండటంతో.. అరగజం స్థలం మిగతాదంతా సముద్రంలా మారింది..
'నాపేరు మిహిర' అందామె చెయ్యి చాపుతూ.. 'పొద్దునడిగితే సాయంత్రానికా' అంది అవని ఏదో అర్థమైనట్టు పెద్దగా నవ్వింది మిహిర...
అంతలోనే టైం చూసుకుంటూ 'అయ్యో నా వాచ్' అంది మహిర
ఆ మాటలకు ఉలిక్కిపడి ఇక్కడే ఎక్కడో పడిపోయిందేమో వెతకండి అంది అవని...
ఇద్దరూ ఒకరి నొకరు చూసుకు న్నారు.. 'అదన్నమాట మీపేరు' అంది అవని.. పొద్దుటి గొడవ మర్చిపోయి ప్రశాంతమైన మొహంతో
'హా..మహీ' అంటారు అంతా అంది మరి మీ పేరు అని అనగానే..
'అవనీ అంటూనే.. మీ ఫోన్ పని చేస్తుందా' అంది అవని
'లేదండీ బాగా తడిచింది' అంది మహిర... 'మీ రింగ్ టోన్ ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా'.. అంది అవని.. మళ్ళీపెద్దగా నవ్వింది మిహిర.. కానీ అవనీ టెన్షన్ పడుతూ అటువైపు తిరిగి మరోసారి కంట్లో నీళ్ళు తుడుచుకుంటుంది...
ఇద్దరి మాటలు మళ్ళీ మొదలయ్యాయి..
'సారీ అండ్ బిగ్ థాంక్స్'..
'సారీ ఎందుకు'..
'బస్‌లో మీకన్నా ముందు నేనేసిన కర్చిఫ్ సీటు మీద కాకుండా కిందపడి పోయిందట.. మీరు దిగి వెళ్తుండగా వెనుక సీట్లో కూర్చున్న మామ్మగారు చెప్పారు'..
'ఇట్స్ ఓకే'..
'ఎక్కడికెళ్ళాలి మీరు'
'చాలా దూరం'..
'ఎప్పటికీ తగ్గుతుందో పాప ఏడుస్తుందేమో.. వాళ్ళ నాన్న చూసుకుంటారు సాయంత్రం దాకా తరు వాత గొడవ చేస్తుంది నేను లేకుంటే ఆకలేస్తుం దేమో పాపం' ఏడుస్తూ చెప్పింది అవని 'వాళ్ళ నాన్న ఉన్నారుగా బాటిల్ పాలు పట్టరా' అంది మహిర కాస్త అమాయకంగా... 'ఏమో పిల్లని అతని చేతికిచ్చి వచ్చా దుర్మార్గురాలిని రోజూ అమ్మ చూసుకుంటుంది ఇవాళ అమ్మకు కాస్త నలతగా ఉందని అతని దగ్గర వదిలేసా, అప్ప టికి లీవ్‌కు అప్లై చేశా. అర్జంట్ వర్క్ అని రమ్మంటే'....అని చేతులు నలుపుకుంటూ చెబుతోంది అవని..
'వాళ్ళ నాన్న సరిగ్గా చూసుకోరా అంది మహిర మానాన్న నన్ను ఎంత బాగా చూసుకుంటారో' అంటూ.. ధార ఎక్కువై షెడ్ తడికెలు జారిపోతున్నాయి 'కాస్త పక్కకు రండి ఇంకా తడిస్తే నిమ్మొస్తుంది' అంది మహిర అవనిని పిలుస్తూ.. 'పోనీ పోతే పోనీ ఈ ప్రాణం ఆ పిల్ల పుట్టకున్నా బాగుండేది ఏమైపోయినా నేను అడిగేవారు లేరు' అంది అవని... ఇంతలా నవ్వించే అవనిలో ఇంత విషాదముందా అని ఆశ్చర్యపోతూనే 'అలా అనొద్దు ప్లీజ్ ముందు మీరు ఏడుపాపండి...బాధలు లేనోళ్లు ఎవరు చెప్పండి. నాకు అమ్మ ప్రేమ తెలీదు. మిమ్ముల్ని చూస్తుంటే నా అమ్మకూడా మీలాగే ఉండేదేమో అనిపిస్తుంది' అంది మహిర
'అమ్మ లేదా' అంది అవని కళ్ళు తుడుచుకుంటూ.. పుట్టగానే చనిపోయింది.. అంటుండగా.. మరి మీరెలా పుట్టారు అన్నట్టు చూసింది అవని.. ఆ చూపులో అర్థం గ్రహించి మరో సారి నవ్వింది మిహిర.. భలేవారండీ మీరు.. అమ్మ పుట్టగానే చనిపోలేదు నేను పుడుతుండగా చనిపోయింది అంది మిహిర.. 'అమ్మమ్మ దగ్గర పెరిగా. నాన్నకు నేనటే ఇష్టం ఆయ నకు రెండోభార్య వచ్చేదాక ఉంది.. పిన్నికి నేనంటే పెద్ద పట్టింపు ఉండదు... తమ్ముళ్ళని కూడా దగ్గరకు రానివ్వదు 'అంది మహిర తనమాట కొనసాగింపుగా..
..'అబ్బా నొప్పి' అంటూ
గుండెల్ని పట్టుకొని బాధపడుతున్న అవనిని చూస్తూ 'ఏమైంది ఎందుకు నొప్పి హార్ట్ సమస్య నా' అంది మహీర.. 'కాదు పాలు తాగలేదు. పిల్ల రోజూ ఈ సమయానికి పాలిస్తా, అవి బరువెక్కి తట్టుకోలేని సలుపు' అంది అవని... 'అవునా నాకు ఇవేమీ తెలీదు పాలు తాగిందే లేదు అమ్మ దగ్గర' అంటూ నిట్టూర్చింది మహిర... పూర్తిగా చీకటి పడిపోయింది వర్షం ఇంకా జోరందుకుంది 'టైం ఏడయ్యుంటుంది ఎలా తప్పించు కోవడం ఈ సమయాన్ని ఎలా దక్కించుకోవడం' అంది అవని...
'టెన్షన్ పడకండి ఓర్పుతో ఉండండి' అంది మహిర...
'లేదమ్మా మా ఆయనకు అనుమానం ఎక్కువ ఏదో ఒకటి అంటాడు ఆ మాటలు నేను పడలేను మొన్నటికి మొన్న ఆఫీస్ ఫోన్ ఇంట్లో ఉన్నప్పుడు వచ్చింది. ఆయన ఊరెళ్ళాడు అప్పుడు ఊరు నుండి ఫోన్ చేసినప్పుడు ఒక్క నిమిషం ఎంగేజ్ వచ్చిందని ఎన్ని మాటలో నేనూ తిరిగి అన్నాను కాని ఎన్ని అన్నా మళ్లీ అతనితోనే ఉండాలి. ఇవాళ నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే ఇంకెన్ని మాటలో ఎన్ని రోజులు గొడవలో' అంది అవని.
'చలికి తట్టుకోలేని స్థితిలో... నాతోనే ఉన్నావని చెబుతాను భయపడకండి అయినా ఉద్యోగానికి పోయిన భార్యని నమ్మనోడు మనిషెలా అవుతాడు చీ' అంది మహిర....
'బస్టాప్ కన్నా పోతా నేను. నా వల్ల కాదు అంది అవని నేనూ వస్తా ఇంకాసేపు ఆగుదరు.
'బస్టాప్‌కు వెళ్ళడం మీరు చెప్పినంత సులువు కాదు ఏదన్నా వెహికల్ వస్తుందేమో చూద్దాం' అంది మహిర పెద్ద ఉరుములు మెరుపులు శబ్దం వినవస్తుండటంతో.. 'నా బిడ్డ ఎంత ఏడుస్తుందో నేనేమైనా పర్లేదు వెళ్ళిపోతా నన్ను వెళ్లనివ్వు మహిర' అంది అవని...
'అవును నువ్వు మరీ అంది ఏదో గుర్తొచ్చినట్లు నా కోసం చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటాను ఈ రాత్రికి ఇక్కడే తెల్లారుద్దేమో అంది' విరక్తిగా నవ్వుతూ..
'ఆడపిల్లవు ఒంటరిగా వద్దమ్మా వద్దు అందరూ మగాలే రాత్రయితే నిన్ను బతకనియ్యరు నువ్వు రా నాతో' అంటూ చేయి పట్టుకొని గుంజింది అవని.
'బిడ్డని కన్న అమ్మవుగా ఆ మాత్రం భయం ఉంటుంది మీకు నాకు ఈ రాత్రుళ్ళు అలవాటే మగరాయుడిలా పెరిగా కొంచెం ఆస్తమా ఉంది. ఎప్పుడు మౌత్ స్ప్రే ఉండాల్సిందే ఇప్పటికే తడిచిపోయి బతికేలా లేను ఇంకా తడిచి వద్దు మీరెళ్ళండి' అంది మహిర...
అంతలో.. దూరంగా ఎవరో గొడుగుతో రావడం చూసారు ఇద్దరూ.. ఇద్దరి కళ్ళలో ఆశలు మొలకెత్తారు. ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకొని వచ్చే ఆ వ్యక్తిని కేకేయడానికి ఆప్రమత్తమౌతున్నరు..
- సుభాషిణి తోట, 9502818774