Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మా మేనమామ కాలం జేసిండని ఫోను. లాక్డౌన్ యెత్తేసి పది రోజులు దాటింది. మా యింట్ల రెండు సావులు కరోన టైముల జరిగితే పోకుండ వుండుడు చాన కష్టమైంది. ఆఖరి సూపుకన్నా పోకపోతిమి. కరోనా పాడువడ. మనిషికి మనిషిని దూరం జేసెనని తిట్టుకునేది. మా మేనమామ పక్షవీతంతోని గుండె నొప్పి వచ్చి పోయినాడని తెల్సింది. బస్సులు, రైళ్ళు గూడ తిరుగుతున్నయి. అందరం మూతికి మాస్కులు గట్టుకొని, సానిటైజర్ సీసలు బెట్టుకొని దబదబ బైల్దేరి పోయినము.
మా మేనమామ మా అవ్వకు గావురాల తమ్ముడు. మా అక్క సెల్లెండ్లకు, అన్నదమ్ములకు తియ్యటి బెల్లమ్. ఒక్కడే తమ్ముదని ఐదో తరగతి దాకా సదివిచ్చిందాట మా అవ్వ. పంతులు నౌకరొస్తే... వాల్లతల్లి ''అవ్వో నౌకరద్దు ఏమద్దు వూల్లు బట్టుకొని తిరుగాలె, ఒక్కడే కొడుకు యింటి ముంగల వుండకుంట, కండ్ల ముందట లేకుండ యేడికి బోతవుర కొడుకా! యేడికి బోవద్దు కలోగంజో వున్నదో లేందో తిని యింటి ముంగటుండాలెరా, మమ్ముల యిడ్సి పెట్టి ఏ నౌకరికి బోవద్దురా' అని ఏడిస్తే నౌకరికి బోలేదట, అతని తోటోల్లు నౌకర్లు జేసి సిరిమంతులైండ్రని చెప్పుకుంటరు.
పీనిగెత్తే టైముకు సేరుకున్నము. ఎవ్వరు మాస్క్లు గట్టుకోలె. ఎవ్వలికి లేని మాస్కులు మాకెందుకని తీసేసుకున్నము. మా మేనమామను మట్టిజేసే కాడికి బొయినం. బొందల వచ్చినోల్లంత దోసిల్లతోని మట్టి బోసిండ్రు. అదొక సావు ఋణం. మట్టిజేసి ఎట్లోల్లటు బొయినంక దగ్గరి బంధువులము ఒక ఇరువైమందిమి మిగిలినము. ఆ యిరువై మందిలో ఒక యిద్దరాడోల్లను ఎప్పుడు చూడనోల్లు 'ఎవరు గీల్లు' అని మా మేనమామ బిడ్డె ఈశ్వరక్కను అడిగిన. 'అయ్యకు మొదటి సమందమ్, రెండో సమందమోల్లు. నీకు అత్తలైతరన్నది.' నేను 'అదేంది మామకు యిప్పుడున్న అత్త కన్నామ ముందు రెండు పెండ్లీలైనయా' అన్న ఆశ్చర్యంగా
ఔరా యీల్లిద్దర్ని యిడ్సి పెట్టినంక మా అవ్వను మూడో పెండ్లి జేస్కున్నడని నన్ను వాల్లకాడికి తీస్కపోయింది ఈశ్వరక్క. ఒక సుట్టదాక్కుంట వేరే సుట్టాలతోని మాట్లాడుతున్నామె దగ్గెరికి పోయి 'ఓ పోసవ్వా గా సుట్టదియ్యె, అమ్మ సీకినట్లు సుట్టదాగుతదనీ సూసిన వానె మా మేనత్త సిన్న బిడ్డె, సదువుకున్నామె, పట్నంల నౌకరి జేత్తంది' అని నన్ను సూపియ్యంగనే ఆమె సుట్ట పక్కకు బెట్టింది. 'అత్తా మంచిగున్నవా' అని మాట గలిపి కూసున్న. నాతోని ఈశ్వరక్క గూడ కూసున్నది. మా అక్కలు వేరే దిక్కు కూసొని మాట్లాడుకుంటుండ్రు.
ఆ పోసత్త దగ్గెర కూసోని ఆ మాటీమాట నా గురించి, నా కుటింబమ్ గురించి మాటాడుకున్నంక, మాటలు మా యిద్దరికీ మంచిగ కల్సినంక 'అత్తా నువ్వు మామను ఎందుకుడ్సి పెట్టినవత్తా' అని ప్రేమగా అడిగిన దగ్గెరికి జరిగి. నేనా నేనెందుకు యిడ్సిపెడ్త, మీ మామే యిడ్సిపెట్టిండురా సుట్ట దాగుతున్ననని. గీ సుట్టలువాటు పాడు మా తాత గాడ్ది అలువాటు జేసిండు. గీ సుట్టజెయ్యబట్టి నన్సిడ్సిపెట్టిండు. యేందో యెడ్డికాలమ్ తెలువని కాలమ్! పొయికికాల్లు నిద్రదన్ని సుట్ట దాక్కుంట బువ్వండిన్నాట. మీ మామ సదువుకున్నోడాయె నన్ను సుట్ట బందువెట్టమంటే పెట్టలే... సుట్టదాగేది నాకద్దని యిడ్సి పెట్టిండురా బిడ్డా! యిగ మీ మామపేరు మీన్నే వున్న రాయేసున్ని నమ్ముకొని మల్ల పెండ్లి జేస్కోలె. నన్ను మంచిగనే సూస్కుండు. గీ సుట్టజెయ్యబట్టి నా బత్కు తెర్లాయె' అని కండ్లు తూడ్సుకొని ముక్కు సీదింది.
ఆ రాత్రి అన్నము, వుల్లిగడ్డల పులుసండితె అందరం తిన్నం. ఎవ్వరు నిద్రబోదలేరు. మా మేనమామ సమ్మన్న గురించే మాట్లాడుకుంటుండ్రు. ఈశ్వరక్క 'పోసవ్వతోనే కల్సినవు. మా యింకో సమందవ్వ మల్లవ్వను కలువవా' అని పక్కనే శారీజుగ ఒంటరిగా తన నిద్ర బోయే బిడ్డ పక్కనకూసున్న మల్లత్త దగ్గర కూసున్నము. నేనెవరో చెప్పింది. 'అవునా బిడ్డా! నిన్నెప్పుడు సూడలేదు రా ఏమనుకోకు' 'తెలువదిగదత్తా ఏమనుకోను'
నువ్వు నోటి నిండ అత్తని పిల్సుడు మంచిగున్నదిరా! మీ అక్కలు, అన్నలు గూడా మంచిగ కడుపు నిండ మాట్లా డ్తరు గదేసాలు. మీ మామ జెర గండ్రగొండోడైనా మీ కుటుం బంలనే వుందును. మీ మామ నల్క పోవాకసోంటోడు. సప్పిడి మిన్సి, మేదుగుడు గందికే ఎటుగాకుంట ఆగమైన 'అనం గనే ఆ పక్కనే కూసున్న మా పెద్దవ్వ 'దెహే వూకుండు నా తమ్ముడు సప్పిడోడయితే శాతగానోడయితే నలు గురు పిల్లలన కని పెద్దజేసి పెండ్లి జేసిండానె' అని ఆకుసుట్ట నోట్లె బెట్టుకున్నది. గీల్ల మాటలేమర్తంగాలె. 'మల్లత్తా, నువు సాప్సీదగ జెప్పు, మా కుటింబమ్ నుంచి ఎందుకెల్లిపోయినవు జెరీ పురీగ జెప్పు' అని అనంగనే.... లోకానికంత యెర్కున్నముచ్చటేనాయె గిండ్ల దాస్కున్నదే మున్నది బిడ్డా! మా వూరు పక్కపోంటె మీ మామోల్ల వూరు. మొదటి సమందమ్ సిట్టిపోయింది. సదువుకున్నోడు మంచి కుటింబమ్, మంచోడు అనీ బూమి జాగలేకున్నా రాయేసురాలు గాకముందే పెండ్లి జేసిండ్రు మా వోల్లు.
వూల్లె వాడల నన్ను పనికల్లదనీ, కడగల్లమొకమనీ, గున్నమామిడోలె వుండననీ అల్లనేరేడు పండోలె సక్కదనం గున్ననని వూరు, వాడ సెప్పుకునేది. కలుపులు నాట్లు, కొయ్య బోవుడు ఏ కూలికంటె, ఆ కూలికి బోదును. అట్ల అందరి కండ్లల్ల బడేది. గా మాదిగోల్ల పోరి పని సక్కదనమే మనిషి సక్కదనమేనని కన్నార్పకుంట సూద్దురు. సేండ్లల్ల పనికి బోయిన కాడ పల్లికాయలు, జొన్న కంకులు, వూసబియ్యం, కందికాయలు, పెసరు గాయలు, దోసకాయలు, తమాట కాయలు ఏద్దొరికినా బరికేది ఆకలికి. అందరు మాదిగా డోల్లున్నట్లే వుంటిని గానీ జెర సీరె, రైకె సుబ్బురంగ వుంచుకునేది. మీ మామ సదువుకున్నోడాయె లేకి లేకిగ సిప్పిరెంటికల శివసత్తోలె, మాసిన బట్టలతోని గాయిది గర్కాసిగ వుండక పోయేది. గిట్లుండుడు నాకు ముప్పచ్చింది పటేలు గానితోని. అనంగనే మా పెద్దవ్వందుకొని 'వో అరిగోసగా పటేలు, దొరగాడ్ది కొడుకులతోని, 'అరె మైసిగా, అరే ఎల్లిగా వూల్లె ఎవరెవరు ఆడోల్లు జెర నదురుగుండెటోల్లున్నర్రా... ఎవరంకుతర్రా అని తోలెటోడు సుంకరోల్లను. ఎవ్వలు మంచిగ లేరు దొరా అంటే రోజు తానం జేసే గూడోపాడోల్లు ఎవరున్నర్రా' అని అడిగెటోడాట. యీ సుంకరోల్లు రైక మాసిన, సిప్పిరెంటికలోల్లని, చెమట వాసనతోనున్న ఆడోల్లను తీస్కపోతే దూరం నుంచే యీ వూరి పటేలు గాడిది కొడుకులకుమ రోజుకో ఆడిది గావాలనేది బిడ్డా! మాగ సచ్చిండ్రు మనాడోల్లసలు దాకి పురుగులబడి సచ్చిండ్రు థూ.... అని మల్లా సుట్టనోట్లెబెట్టుకున్నది మా పెద్దవ్వ.
'పాపాలు దాగుతయాక్క. సుంకరో ల్లను నమ్మక ఆని పొలంల పంజేసే ఆడోల్లను ఓపారి సూసుకొని పోయి పిల్సుకుంటడు. గట్లా గాని కండ్లల్ల దొరికిపోయిన. వాని సూపుకు గడగడ వనికి పోయినక్కా. వాని నదరునబడ్డ ఆడదాన్ని యిడ్సి పెట్టకపోదురు దొరలు పటేండ్లు, యిగ మాదిగా డోల్లంటె యింక గడ్డిపోసలే దొంగ బాడ్కావులకు' అని ఆగింది మల్లత్త. ఈశ్వరక్క, పెద్దవ్వ మాట గలుప బోతే... ఎహె మల్లక్కను సెప్పనియ్యుండ్రె, దాని కట్టమ్ ఎవలికి రావద్దు దాని సొద సెప్ప నియ్యుండ్రి' అని మా పోంటి కూసున్న ఆడోల్లు గదుమా యించిండ్రు.
మల్లత్త మల్లా సెప్పుడు మొదలు పెట్టింది 'ఓ నాడు నాటుకు బొయొచ్చి యింట్ల బియ్యమ్ లేకుంటే పెసరు గాయలుడ్కపెట్టుకొని మా అత్తమామ మీ మామ నేను అందరర గవ్వే తిని పండుకున్నము. సుట్టుపక్కలిండ్లల్ల అందరి అలికిడి యినబడ్తంది. ఎవ్వరు సద్దుమనగలే. ఎవరో ఆకిటి ముంగటి తడ్క దీసిన సప్పుడైంది. వచ్చిన మనిషి సరాయించుకుంట 'సమ్మన్నా, ఓ సమ్మన్నా అని మెల్లంగ పిలిసిండు. నేను సుంకరి బాలన్న నౌ' అని సెప్పిండు. 'పటేలు కాడ వున్నోనికి నాతోనేంపని' అనుకుంట తలుపుదీసీ బైటికి బోయిండు. 'ఏందట సుంకరోడు గీ పొద్దు ఎందుకచ్చిండాట'
ఏం జెప్పాల్నే మల్లూ! పటేలు గాడు నిన్ను రమ్మనుమని తోలిండాటనే అని గుసగుసగా నసుగుతుండు. ముసలోల్లు యింటెన్క పాకల బండుకుండ్రు. యినద్దని మెల్లగ సెప్తండు. 'గాని కండ్లల్ల యెందుకు వడ్డవే మల్లూ, ఏం జేద్దును, యాడికి బోదామ్ పల్లెవానిదని, వూరువానిదని ఆనికెదురేలేకపాయె. ఆనిది శీతకన్ను గాదె, మాదిగోనికి మంచి పెండ్లముండద్దా, లమిడికొడుకు, లేక కొడుకనీ తలంత కొట్టుకుంటుండు.
నాకు కడుపంత అగులు బుగులైతంది. 'సుంకరోనికి ఏం జెప్పి తోలి నవు?' 'జెరమచ్చింది బాలేద'ని తోలిన్నే.
'ఇయ్యాలంటె యిట్ల జెప్పి తప్పిత్తివి మరి రేపెట్ల! ఎటన్న ఎల్లిపోదామ్'
'తెల్లారనీ అవ్వయ్యకు జెప్పి వాల్లను సమజ్జేసి పోదాము' అని చెప్పిండు. ఆ రాత్రంత బుగులు పడుకుంట మాట్లాడు కున్నము. కోడికి మాకు తెల్లారింది.
తెల్లారంగనే మా అత్త ముసలామె అడుగనే అడిగింది 'ఏందే రాత్రంత యింల్ల మాటలిన వడ్తన్నయి నిద్రవోలే దానె, ఏమైందిరా' అన్నది అనుమానంగ.
'అవ్వా యీ వూల్లె బత్కలేమే అని పటేలు సుంకరోన్ని తోలిన సంగతి జెప్పిండు'
'ఓ కొడుకా గట్లెట్ల యెల్లి పోతర్రా కన్నోల్లందరు పోంగ, పోంగ నువ్వు అక్కదక్కితిరి. అక్క అత్తగారింటికి బాయె. వున్న నువ్వన్న కండ్ల ముందట లేకుంట బోతే... యెట్ల బత్కాలెరా గొడ్లోలె అని బొచ్చెకొట్టుకుంటా ఏడ్సింది. ఆ పటేలు గాని కాళ్ళ మీద బడి బతిలాడుకుంటమ్ రా యాడికి బోవద్దని బతిలాడింది.
ఆకాన్నుంచి పటేలు పొలాలల్ల పనికి బోవుడు బందు పెట్టిన. యింట్ల గూసుంటెల్లుతదా. పంజేసుకొని బతికెటోల్ల మాయె. వూల్లె సిన్న సిన్న సూదరి రైతుల సేండ్లల్లకు కూలికి బోదును. కాల్వలన్ని సెర్ల జేరినట్లు వూరి సంగతులన్ని పటేలు సెవుల జేరేయి. యింట్ల పండుకోకుండ ఆల్లిండ్లల్ల, యీల్లిండ్ల పండుకుందుము బయపడి. తల్లిగారింటికి కొన్ని రోజులు బోయిన. ఆని తల పండు వల్ల ఆన్నెత్క కట్కపోను. పటేలుగాని పగ పామ్ పగంటరు. ఆడు పగవట్టినట్టే నా యెంటబడ్డడు. నా బతుకు బజార్ జేసిండు.
ఓ నాడు మీ మామ నేను కూలికి బోయత్తన్నము. అప్పుడు నాకు ఎనిమిది నెల్ల పొట్ట. పటేలు గాడు ఆని మన్సులతోని యెదురైండ్రు. 'అరె దాన్ని పట్టుకోర్ర' అని పటేలు అనంగనే ఆల్లు నన్ను గట్టిగ బట్టుకొని గొర్రగొర్ర గుంజుకపోయిండ్రు. మీ మామను బురుదలేసి బుగ్గగొట్టిండ్రు. అల్లు గుంజకపోయి ఏదో యేరే వూర్ల ఆని పొలంల గుడిసేసి వుంచిండు. అట్లా పోయిన పోవుడుమేల్లా మల్లా నా యింటికి నన్ను రానియ్యలే. మీ మామ బిడ్డ యిగో గీనిర్దబోతన్న పిల్లను ఆని గుడిసెల్నే కన్న. అప్పుడు 'గిదన్నాలం' అన్న మనిషి బుట్టలేదు. దాదు లేదు పిరాదు లేదు. మీ మామ సచ్చెటోడే ఎట్లనో బత్కి శాన రోజులకు గిప్పుడేపకప మీ అత్తను జేస్కున్నడు.
నా తీరు శానామంది ఆడోల్లను ఆని పొలంల గుడిసెలేసి వుంచుకున్న గీ పటేలు గాని పంగలు పల్లదియ్యక పాయె మీ మామ అని కోపమచ్చేది మీ మామ మీద. గందికే సప్పిడోడన్న.
వొయిసు మీదున్నన్ని రోజులుంచుకొని యెల్లగొట్టిండు. నా పెండ్లి పేరంటమ్ సేసుకున్న మొగడేడబోయిండోగాని 'పటేలుంచుకున్న మాదిగదనే' అంటరు. సమ్మయ్య సచ్చి పోయిండని తెల్సి మన్సాగక ఆకరి సూపు కండ్లనిండ సూసుకొని బొందలింత మట్టేసే ఋడమ్ కోసమొచ్చిన' అని యెక్కెక్కి పడి మల్లత్త యేడుస్తాంటె కూసున్నోల్లమంతా వూకుంచి ఆమె కాన్నే పండుకున్నము. కానీ మల్లత్త, మల్లత్తసోంటి ఆడోల్లు బడ్డ అవుమానాలు, బలమున్న బలుపులు బలవంతంగా తోల్కపోయి బత్కులను బజారు పాలు జేసిన అన్యాయాలు నన్ను నిద్రోనియ్యలే. మనసంతా పగిలిన పచ్చిపుండయింది.
- జూపాక సుభద్ర,
సెల్: 9441091305