Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నడ్సుకుంట నడ్సుకుంటనే కాలిదప్పి కట్టెసర్సుక పడ్డది లచ్చవ్వ. పడ్డది పడ్డట్టే జీవిడ్శింది. దేశంబోయిన బిడ్డలు వత్తానమని మతలబు పంపియ్యంగనే లచ్చవ్వ సంబురానికి పట్టపగ్గాలు లేకుండబోయినై. చేశిన పనే నాలుగు మాట్ల జేయబట్టింది. కాలుగాలిన పిల్లిలెక్క అటీటు తిరుగుతాంది. ఇల్లంత సురువుజేశి బొట్లుబోనాలుబెట్టి మనసుల్నే మురిసి పోతాంది. ఇన్నొద్దులు కండ్లల్లనే మెదిలినోల్లు గీ పూట కండ్ల ముందుకు వొత్తరనంగనే గుండెల్నిండా గడ్డకట్టిన దుక్కం కండ్లల్లకచ్చినట్టయి అంతా మబ్బు మబ్బు అవుపడుతాంది. ఉన్నట్టుండి ఏం యాదికొచ్చిందో ఏమో.. ఇల్లు దాటి తొవ్వబట్టింది. గంతే!
ఓ అవ్వా! గిదేం అన్యాలమే... ఏం నాశినగాలం గూడిందే.. అనుకుంట ఎన్కమర్ల నుంచి సూరక్క రానే వచ్చింది. వచ్చేటాల్లకు ఏమున్నది? బొందిలపానం బోయి బెల్లంగొట్టిన రాయి తీరు పడున్నది. ఊరువూరంత జమైంది.
పొద్దుపొద్దుగాల్నే బర్లతోటొచ్చి పెండపట్క పోయింది. అలుకు జల్లి ముగ్గేసినంక తానం జేశింది. నెత్తిమీంచి పోసుకున్నట్టుంది.. కొస్సెంటికల నుంచి ఒక్కొక్క బొట్టు కారుతాంది.
మాయిల్నే ఏంబుట్టిందో జప్పజప్ప శికముడేసుకుంట బజాట్లకు నడ్శింది. ఎటుబోదామనుకున్నదో..ఏందో వున్నఫలంగ కుప్పకూలిపోయింది. జనాలు ఎవలకు తోశినట్టు వాళ్లు మాట్లాడుకుంటున్నరు.
నిన్న మాతోనే వున్నది. ఇయ్యాల సుత కైకిలికొత్తనని జెప్పింది. కూలోళ్లందరూ కూడేలోగా ఏం ముంచుకొచ్చిందని వురికొచ్చిందో.. ఏం పాడో ఇగ లేకుంటనే బోయింది. తోటోల్లు చీర కొంగును కళ్లకద్దుకుంట తలో ముచ్చట చెప్పబట్టిల్లు.
రోగం లేదు నొప్పి లేదు గదెట్ల సచ్చిందిరో అని మూలమలుపు కాంచి ఒర్రుకుంట రానే వచ్చిండు కొంరన్న. ఊళ్లె డాక్టరొచ్చి జూశిండు. గుండె నొప్పి వచ్చిందేమో.. ఎంబడే పానం బోయిందన్నడు. కొంరన్న జనాలందర్ని పక్కకు నెట్టి లచ్చవ్వ మీద పడి ఏడ్వబట్టిండు. తమ్మునిలెక్క సూసుకున్నది. ఏంరా కొంరిగా అని నోరార పిల్శేటిది. వున్నదో.. లేనిదో తొక్కో.. పులుసో దానింట్ల అది తిని మల్సుకపండేది. గిప్పుడు నేను అక్కా.. అని ఎవలబిలువ అక్కో.. మమ్మల్ని ఇడ్శిపెట్టి పోయినవా.. అక్కో అని గుండెలు బాదుకుంట ఏడ్తనే వున్నడు కొంరన్న.
మనిషో చెయ్యేశి లాబట్కపోయి అరుగు మీద పండబెట్టిల్లు. మట్టి దీపాంతల గింత నూనెసుక్కేశి పత్తినొల్శి వొత్తిజేశి దీపం ముట్టిచ్చిల్లు. కూలోల్లు సద్దులు పక్కనబెట్టి శోకాలుదీసుకుంట.. ఎగబోసుకుంట ఏడ్తనే వున్నరు.
సత్తె దాన్లెక్కనే సావాల్నే. మంచానపడితే ఇయ్యాల్రేపు ఎవలర్సుకుంటాల్లు. మంచిగ బతికున్నప్పుడే కానుతలేరు. అడ్డంబడితే ఎవలుజేత్తరు? లచ్చవ్వ సక్కదనాల సావు సచ్చింది.. ఎందుకు ఏడుత్తార్రే.. అని సుట్టను గట్టిగ ఓ దమ్ము పీల్శి న్యాలకు ఇసిరికొట్టి తుపుకు తుపుక్కని ఊంచిండు ఎల్లయ్య తాత.
ఇంటిముంగటి యాపశెట్టు నీడల వొచ్చినోల్లు వొచ్చినట్టు నిలబడి సూత్తాన్లు. కాశెంత సేపుంటె ఆ మాత్రం నీడసుత పోయెటట్టున్నది. కొంరన్నకు ఏడ్శిఏడ్శి నాల్కె పిడ్సగట్టుకపోయి నట్టున్నది. మాటలు పెకుల్తలెవ్వు. సూరక్క షెంబుల నీళ్లు పట్కచ్చి తాపిచ్చింది. తోడబుట్టకపోయినా అక్కాతమ్ముళ్లలెక్క కలిసి బతికిల్లు. రేపట్నుంచి ఎవలను అక్కా.. అని పిల్తవురో.. అని సూరక్క కొంరన్న మీదపడి ఏడ్వబట్టింది. పక్కపొంటి వున్నోళ్లు సుత రాగం అందుకున్నరు. సావుకాడ సంగీతకచేరీ లెక్క లచ్చవ్వ పనితనాన్ని, ఎట్ల బత్కిందో, ఏం జేశిందో ఒగలెన్క ఒగలు మునుంబెట్టినట్టు అప్పజెప్పుతాల్లు.
బువ్వాల్లయింది. నడినెత్తిమీద సూరన్న దరువేత్తాండు. ఎల్లయ్యతాత కట్టెబట్టుకొని కొంరన్న, సూరక్కల దగ్గరికి వచ్చి ఎవలతోటన్న మతలబు పంపిండ్లానే.. ఎవలుగానొత్తలేరని ఉండబట్టలేక అడిగిండు. సూత్తానికి వత్తాన్లనే సంబురంతోటే అది గుండెపలిగి సచ్చిందిగాదె.. నడిమిట్లకు రాంగనే మతలబు అందిందట.. ఈ పాటికి పొలిమేర దాటొచ్చు అని సూరక్క జెప్పింది.
ఊరు ఊరంతా లచ్చవ్వకాన్నే వున్నరు. ఎర్రటి ఎండ. సూర్ర సుర్ర కాళ్లుగాల్తానై. ఇంతల్నే బుర్రు బుర్రుమని రెండు కార్లు దుబ్బ లేపుకుంట రానే వచ్చినై. కొడుకూ.. బిడ్డా.. తొందర్నే వచ్చిల్లే అని గుసగుసలు సురువైనై. నిన్న కైకిలికొచ్చినప్పుడే లచ్చవ్వ జెప్పింది.. రేపు నా కొడుకు బిడ్డ నన్ను సూత్తానికి వత్తాండ్లని! దాని కండ్లల్ల మెరుపుజూడాల్నే.. పాపం ఎంత కొట్టుకున్నదో పానం. ఆఖరి సూపుకన్న అందిడ్లు తీయి. సచ్చినా దాని మొఖంల ఎంత సులుకున్నదే, సచ్చినట్టె లేదు. నిదురబోతానట్టె అనిపిత్తాంది. తలో తీరు మాటగలుపుతాన్లు.
రాకరాక కొడుకచ్చిండే లచ్చవ్వా.. కాళ్లు కడుక్కుంటానికి నీళ్లిద్దువు లేరాదె అవ్వ.. పచ్చగూరేశి బువ్వపెడ్తనంటివి గదనే అవ్వ.. కొడుకా కొడుకా అని కలువరిత్తివిగదనే అవ్వ.. కొడుకు రావంగనే మాట్లాడుతాన్లేవేందే అవ్వ.. అలిగి పండుకున్నవానే లచ్చవ్వ.. ఊరు ఊరంత కదిలొచ్చింది గాదె అవ్వా.. నీ బలగమంతా నీ సుట్టే వున్నరు గదనే అవ్వో..అవ్వ..
గీబాజు శోకాలు మొగులును ముట్టిచ్చుకున్నయి. ఆకాశం బలబల సప్పుడైంది. ఒక్కొక్క చినుకు వరదైంది. వాతావరణం మారిపోయింది. అందరూ కన్నీళ్లతో తడిసి ముద్దయిండ్లు.
ఎల్లయ్య తాత కనబడ్డోళ్లందరికీ లచ్చవ్వ పురాణం జెప్పబట్టిండు. లచ్చవ్వ కడుపుకూడగట్టుకుని పిల్లల్ని సాదింది. తాగుబోతు పెనిమిటి నడిమిట్లనే ఆగంజేశిపోతే సంసారాన్ని ఒక్కత్తె నెట్టుకొచ్చింది. నలుగుట్ల నారాజ్ గాకుంట పెంచింది. ఎవుసం పనులకు పెయ్యి దాసుకోకుంట కట్టపడ్డది. పెద్ద పెద్ద సదువులు సదిచ్చింది. వాళ్ల నసీబ్ ఎంత మంచిగున్నదంటే పిల్లలిద్దరికీ ఒక్కపాలే కొలువులొచ్చినై. ఇంతకాలం పడ్డ కట్టానికి అయ్యలేకున్నా ఒంటరి ఆడది ఏంచెయ్యగలదో.. ఊళ్లె అందరికీ ధైర్నాన్నిచ్చింది. ఎవలు ముందుబడకున్నా మంచి సంబంధాలు వాటంతటవే నడుసుకుంట వచ్చినై. ఒక్క పంది ట్లనే రెండు పెండ్లిళ్లు జరిగినై. ఇగ లచ్చవ్వ ఒంటరిదైంది.
రెక్కలొచ్చిన పిట్టలు ఎగిరి పోయినై. అప్పుడ ప్పుడు పలకరించేటోల్లు. రానురాను పని ఒత్తిడిల పడి అవ్వను పురాగ మర్శి పోయిన్లు. పిల్లా.. జెల్లా తోటి వాళ్ల సంసారం వాళ్లకైంది. అసలు వాళ్ల కోసమే బతికున్న ఒక మని షున్నదని వాళ్లకు గుర్తే లేదు. అవ్వ ఎట్టున్నది? బత్కిందా.. సచ్చిందా.. ఏం తింటాంది? ఎవలు పెడుతాన్లు.. అని పట్టింపే లేదు. పుట్టమీది కర్ర లెక్క గావురంగ పెంచుకున్నది. మురిపెంగ సూసుకున్నది. ఇగో ఇప్పుడు ఊశిపడ్డరు. వాళ్లయ్య బతికున్నా ఈ స్థితిల వుండేటోల్లే కారు. నలుగురు నాలుగు రకాలుగా ఊ.. కొడుతాన్లు. ఆ నోటా ఈ నోటా కొడుక్కి.. బిడ్డక్కి షెవులబడ్డయి.
కుడితిలపడ్డ ఎలుకల్లెక్క మొఖంబెట్టి ఒగలనొగలు సూసుకున్నరు. పసితనమంతా గిర్రుమని కండ్ల ముంగట తిరిగినట్టనిపించింది. అయ్య పోయినప్పుడు ఇద్దరిని సాదుతానికి అవ్వ ఎంత కట్టపడ్డదో... ఎవలకు ఆశ పడకుంట ఎట్ల పెంచిందో.. ఎన్ని సుద్దులు జెప్పిందో.. ఎట్ల వుండాల్నో.. ఎట్ల వుండద్దో.. నలుగుట్ల ఎట్ల మెదులాల్నో.. బతుక్కి తొవ్వ జూపెట్టిన అవ్వను మేమెట్ల మర్శిపోయినమో అని.. కండ్లపొంటి రెండు ధారలుగట్టంగ అవ్వ మీద పడి ఒక్కతీరుగ ఏడ్వబట్టిల్లు. సూశెటోల్లకే కడుపుతరుక్కపోతాంది.. ఆ దశ్యం. డబ్బు మోజులపడి అవ్వను మర్శిపోయినం అని ఒక్కొక్క సంఘటనను నెమరేసుకుంట పొగిలి పొగిలి ఏడ్వబట్టిల్లు. జోరు మీదున్న వాన లగాంఛి కొట్టబట్టింది.
- బండారి రాజ్ కుమార్
9959914956, 8919556560