Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూర్యుడు తూర్పు కనుమల్లోంచి ఇంకా తొంగి చూడలేదు. చేతిలో బ్యాగు పట్టుకుని ఎక్కడికో బయలు దేరినట్టున్నాడు చలపతి. భార్య లక్ష్మీ కండువా అందించింది. కొడుకు ప్రణీత్ అరుగుపై కూర్చుని చదువుకొంటున్నాడు. ముగ్గురితో కూడిన చిన్న రైతు కుటుంబం వీళ్ళది. తిన్నగా నడవడం మొదలు పెట్టాడు చలపతి. ఊరికి ఉత్తర దిక్కున చిన్న రహదారి, అటు ఇటు కంపచెట్లు.. అలానే నడుస్తూ ముందుకెళ్ళితే ఒక చిన్న దిగుడు బావి, ఒకప్పుడు ఆ బావి చుట్టూ వరి చేనులు కళకళలాడేవి, ఇప్పుడు బావి చుట్టూ దట్టమైన చీకు పొదళ్ళుతో నిండి వుంది.. చలపతి మెదడులో గత తాలూకు దొంతరలు మెల్ల మెల్లగా కదిలాయి.
వాళ్ళ నాన్న ఎర్రప్ప అంటే చుట్టుపక్కల గ్రామాల్లో పెట్టింది పేరు, మంచి వ్యసాయదారుడు. వంద పుట్లు ధాన్యం పండించే మంచి సాగు రైతంటే ఎర్రప్పను మించినోళ్ళు లేరు ఆ ఊరిలో. తలపాగా చుట్టి, మడక దున్నితే దారం పట్టినంత సక్కగా కనిపించేవి సాలళ్ళు. చాలామంది తన వద్ద అప్పులు తీసుకెళ్ళేటోళ్ళు. వర్షాలు తగ్గుముఖం పట్టి పంటలు పండక పోయే పాటికి, జనాలు వలసెళ్లే పరిస్థితి దాపురించింది. చేసేది లేక ఎర్రప్ప అప్పులు బాగా చేసి, వున్న మాగాణిలో సగం అమ్మేసి మంచాన పడ్డాడు. కాలం కలిసి రాలేదు. చివరికి కన్ను మూసాడు. ఉన్నతమైన కుటుంబం కాస్త మధ్యతరగతిలోకి చేరే పాటికి చలపతికి కష్టాలు చుట్టూ ముళ్ళుల్లా పరుచుకున్నాయి.
జ్ఞాపకాల నుండి బయటికి వచ్చేపాటికి, దిగుడు బావి దాటి అర పర్లాంగు దూరం వెళ్ళాడు, మధ్యలో బంజరు తండా.. అరుగులపై కూర్చుని వక్కాకు నములుతూ ముసలాళ్ళు, గుంపులుగా చేరి కబుర్లతో కాలక్షేపం చేస్తూ కొందరు కనిపించారు ''నువ్వు ఎర్రప్ప కొడుకు చలపతివా నాయనా..'' ఒక్కాకు పుక్కిటి మార్చుకుంటూ అడిగింది ఒక అవ్వ ''ఔను'' అన్నాడు చలపతి.
''ఎట్లా వున్నోళ్ళు ఎట్లా ఐపోతిరి నాయనా'' అంటూ చివరి పదం దీర్ఘిస్తూ సానుభూతి వ్యక్తపరిచింది అవ్వ. చలపతి మౌనం గానే వెళ్ళిపోయాడు. ఊరుదాటి కాస్త ముందుకెళ్తే.. ఒక దేవాలయం వస్తుందిజ అక్కడి నుంచి ఉత్తరం వైపు ఒక కాలి నడక దారి. నడిచి నడిచి కాళ్ళు గుంజుతున్నా కూడా నడవక తప్పలేదు. చలపతి ఎట్టకేలకు తిమ్మాపురం ఊరి వాకిట్లోకి అడుగు పెట్టాడు.
ఊరు చిన్నదైనా.. పెద్ద పెద్ద భూసాములు వున్న ఊరు.. నాగలి కట్ట దాటి నాలుగు అడుగులు ముందుకెళ్తే ఒక పెద్ద ప్రహరీ గోడ, మధ్యలో భవంతి, చుట్టూ నారిఖేళి వక్షాలు, ప్రహరీ గేటుకు అటూ ఇటూ ఇద్దరు కాపలాదారులు, ''ఎవర్ని కలవాలి'' అందులో ఒకడు ప్రశ్నించాడు. ''భూపతిని కలవాలి'' అన్నాడు చలపతి. ''లోపలికెళ్ళు'' అన్నాడు ఘాఢమైన స్వరంతో ఆ మనిషి. చలపతి సీదా లోపలికి వెళ్ళాడు. వాలు కుర్చీలో కూర్చుని చుట్ట కాలుస్తున్నాడు ఓ అరవై ఏళ్ళ పెద్దాయన.. ఆయనే భూపతి, చుట్టు పక్కల గ్రామాలకు తనే పెద్దమనిషి, మనిషి మంచోడే కానీ అప్పుడప్పుడూ రక్తపోటు వలన కాస్త కోపంగా కనిపిస్తాడు ''నమస్కారం పెద్దాయన'' అన్నాడు చలపతి. '' ఓహౌ.. మీరా కూర్చో చలపతి'' అంటూ చైర్ వైపు చేయి చూపించాడు భూపతి. చలపతి వెళ్ళి ఎదురు ముఖంగా కూర్చున్నాడు. ''ఏంటి సంగతులు'' అంటూ దట్టంగా పొగ వదిలాడు భూపతి. ''అబ్బాయికి రెండవ టర్మ్ ఫీజు కట్టాలి చేతిలో చిల్లిగవ్వ లేదు'' అని అంటున్న చలపతి మాట పూర్తి కాకముందే..
''అర్థమైంది.. డబ్బు కావాలంటావ్.. ఇదివరకే తీసుకున్న పైకం ఇంకా చెల్లించలేదు. మళ్లీ అప్పు మీద అప్పు కావాలంటే ఎలా చెప్పు. అసలే కరువు కాలం.. ఎలా తీరుస్తావ్. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం మీది. చిక్కిపోయాక ఇప్పుడు కూలి పనికి వెళ్ళలేరు. పంట తీయలేరు. ఇంకెలా అప్పు తీరుస్తావ్? చూడు చలపతి కూలి చేసేవాడికైనా అప్పు పుడుతుందేమో కానీ ఈ మధ్యతరగతి వాళ్ళకు పుట్టదయ్యా'' అనేసాడు భూపతి. ''ఎలాగైనా తీర్చేస్తాను పెద్దాయన, ఫీజు కట్టకపోతే కొడుకు చదువు ఆగిపోతుంది. కాస్త పెద్ద మనసు చేసుకోండి'' అంటూ ప్రాధేయపడ్డాడు చలపతి. ''ఉన్న పైకమంతా ఆ పెద్దారెడ్డికి ఇచ్చేసాను. పాతిక రూపాయలు తప్ప అనా పైసా పైగా లేదు. నువ్వు బయలుదేరు ఉన్నప్పుడు కబురు పెడతానుల'' అన్నాడు భూపతి.
అక్కడి నుండి తిన్నగా లేచి, నిరుత్సాహంతో వచ్చిన దారినే తన ప్రయాణం సాగించాడు చలపతి. ఎట్టకేలకు సూర్యుడు పడమటి కనుమల్లోకి వాలే పొద్దుకంతా.. ఇల్లు చేరుకున్నాడు ''పోయిన పని సరిపోయిందా..?'' వాకిట్లోకి అడుగు పెట్టగానే భార్య ప్రశ్న ఎదురొచ్చింది. మౌనంగా లోపలికి వెళ్లి భుజంపై వున్న కండువా తీసి పక్కనబెట్టి చైర్లో కూర్చున్నాడు, ''భూపతి పాత అప్పు తీర్చమన్నాడు. కొత్త అప్పు ఇవ్వడానికి ముఖం చాటేసాడు'' అన్నాడు చలపతి. ఈ మాటతో లక్ష్మీ ముఖంలో మునుపటి కళ చెదిరిపోయింది. ''మరిప్పుడెలా'' కంగారుగా అడిగింది లక్ష్మీ. ''ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి, ఎక్కడ సమస్య వుంటే అక్కడే పరిష్కరించుకోవాలి, వాళ్ళనే బతిమలాడుదాం'' అన్నాడు చలపతి.
ఆ రాత్రి తను కంటిపై రెప్ప వేయలేదు. ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్తు పైన దష్టి సారించాడు. మట్టిని నమ్ముకునే బతుకు వాడికి రాకూడదని, దుమ్ము నెత్తిన పోసుకునే కర్మ వాడికి పట్టకూడదని, మంచి ఉద్యోగం వస్తే.. జీవితం బాగా సాగిపోతుందని కలలు కంటున్నాడు. ఎలాగైనా ప్రణీత్‌ను మంచి స్థాయికి తీసుకురావాలని, ఆశ పడుతున్నాడు. ఇలా ఆలోచనల్లోనే రాత్రి గడిచిపోయింది. ఉదయాన్నే పనులన్నీ ముగించుకుని వసారాలోకి వచ్చాడు చలపతి, ''నాన్న.. ఈరోజు ఫీజు కట్టనే కట్టాలని సార్ చెప్పాడు, లేదంటే టి.సి ఇచ్చి పంపేస్తాడట'' ప్రణీత్ మాట తనను నిలేసినంత పనైంది, ''సరే పదా నీ వెంట నేనూ వస్తాను'' అంటూ ప్రణీత్ వెంట వెళ్ళాడు చలపతి.
సరిగ్గా సమయం పది గంటలు, విద్యార్థిని విద్యార్థులు లోపలికి వెళుతున్నారు. డ్రిల్ మాస్టర్ విజిల్ వేసాడు. అందరూ పరుగులు పెట్టారు క్లాస్ రూంలలోకి.. ప్రణీత్ తన వెనుక చలపతి నేరుగా ఆఫీస్ రూం దగ్గరకి వెళ్ళారు. లోపల మాస్టర్ ఫణికుమార్ కూర్చుని ఏవో ఫైల్స్ తిప్పుతున్నాడు. చలపతి రాకను గమనించి తలెత్తి చుసాడు ఫణికుమార్, ''చలపతి గారా రండి కూర్చోండి'' అన్నాడు ఫణి కుమార్. చలపతి చైర్లో కూర్చు న్నాడు, ''అన్నీ సరేగాని.. ఫీజు విషయంలో చాలా వెనకడుగు వేస్తున్నారు. అబ్బాయి చాలాబాగా చదువుతున్నాడు. మీరు గనక కాస్త డబ్బు పెట్టగలిగితే.. ఉన్నతమైన స్థానంలో నిలబడతాడు. సర్లేగాని ఫీజు ఇప్పుడు కట్టేస్తారా'' అన్నాడు ఫణికుమార్, చలపతి గుటకలు వేసాడు క్షణం మౌనం తర్వాత ''సార్.. ఈ ఏట పంటలు పండలేదు, రెండో టర్మ్ ఫీజు చెల్లించడానికి కొంచెం సమయం కావాలి, దయచేసి మా వాడికి టి.సి ఇవ్వద్దు'' అంటూ బతిమలాడిన ధోరణిలో అన్నాడు చలపతి. ''మీ పరిస్థితి అర్థమైంది ఇది ప్రైవేటు బడి కదా ఇలాంటి వాటికి యాజమాన్యం ఒప్పుకోదు కావాలంటే ఒక్క రోజు పర్మిషన్ ఇవ్వగలను, ఆలోగా డబ్బు కట్టేస్తే మీ అబ్బాయి హ్యాపీగా చదువుకుంటాడు ఏమంటారు'' అన్నాడు పణికుమార్. ''సరే సార్'' అంటూ బలవంతాన ఒప్పేసుకుని బయటికి వచ్చాడు. ప్రణీత్ లోపలికి వెళ్ళాడు.
నగలమ్మి కడదామంటే.. అవి కూడా బ్యాంకు ఖాతాలో తాకట్టుకు వెళ్ళాయి, ప్రణీత్ మంచి ర్యాంకు స్టూడెంట్.. ఎలాగైనా ప్రైవేటు స్కూల్ లనే చదివించాలనే తపన చలపతిలో నాటుకు పోయింది. స్కూల్‌కు డబ్బు చెల్లించాలనే ఆలోచనతో అటునుంచి అటే తన పాత స్నేహితుడు రంగప్ప వద్దకు వెళ్ళాడు. ఎప్పుడూ అతనిని డబ్బు అడగలేదు. తన పరిస్థితులే ఇంత దూరం నడిపించాయని సూచాయిగా ఒక మాట అతని చెవిలోకి వేసాడు. ఇంతవరకు ఎంతో ఆప్యాయంగా పలకరించిన రంగప్పలో మౌనం తిష్ట వేసింది. క్షణం ఆగి ''నీకు తెలియకుండా డబ్బులెక్కడివి చెప్పు.. నేను కూడా చాలా ఇబ్బంది పడుతున్నా'' అన్నాడు రంగప్ప. చలపతి తిన్నగా లేచి అక్కడి నుండి తిరుగుముఖం పట్టాడు.
ఇంటికి వెళ్ళకుండా అటు నుంచి అటే.. ఈ మధ్య కొత్తగా పరిచయం అయిన నారప్పను కలవడానికి పక్కూరికి నడిచి వెళ్ళేపాటికి మధ్యాహ్నం కావచ్చింది. నారప్ప కూడా సమయానికి ఊరిలో లేడు. సాయంత్రానికి వచ్చాడు. వచ్చి రావడంతోనే చలపతిని ఆప్యాయంగా పలకరించి, తగు మర్యాద ఇచ్చాడు. చలపతి వచ్చిన విషయం చెప్పాడు. ''అయ్యో పాపం ఎప్పుడూ అడగలేదు. నా దగ్గర లేనప్పుడే అడిగావు. ఏం చేయను'' అన్నాడు నారప్ప. ఆ రాత్రి అక్కడే బస చేసి, ఉదయాన్నే ఊరికి బయలుదేరాడు చలపతి. ఇంటికి చేరేపాటికి సాయంత్రం అయింది. వసారాలో దిగాలుగా కూర్చుని ఏదో తీవ్రంగా ఆలోచిస్తోంది లక్ష్మీ.. ఎప్పుడు ఇంటికి వచ్చినా ''పని సరిపోయిందా?'' అని తిన్నగా అడిగే లక్ష్మి ఈ రోజు మౌనంగా వుంటే అర్థం కాలేదు చలపతికి. చెప్పులు పక్కన వదిలేసి నేరుగా లోపలికి నడిచాడు.
ఒక మూలన కూర్చుని ఏడుస్తున్నాడు ప్రణీత్ ''ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావ్'' అని అడిగాడు ఆత్రుతగా ''ఫీజు చెప్పిన సమయానికి ఇవ్వలేదని టి.సి ఇచ్చి పంపేసారు'' కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు ప్రణీత్. బదులు మాట్లాడ్డానికి చలపతి నోరు పెగల్లేదు ''అన్ని చోట్లా ప్రయత్నించాను. పైసా కూడా చేతికి రాలేదు'' అంటూ తన కళ్ళల్లో ఉబికి వస్తున్న కన్నీళ్ళను బలవంతంగా ఆపుకునే ప్రయత్నం చేసాడు చలపతి. ''ప్రైవేటు చదువులు ఖరీదైనవి మనం కొనలేము. ఆ సర్కారు బడికే పంపుదాం. అబ్బాయి ఎలాగు బాగా చదువుతాడు బంగారు ఎక్కడ వున్నా దాని విలువ పడిపోదు'' లోపలికి వస్తూ అంది లక్ష్మి, ఈ మాటతో ఏకీభవించాడు చలపతి.
ఆలస్యం చేస్తే అమతం కూడా విషం అవుతుందని గ్రహించి, వెంటనే ప్రణీత్‌ని సర్కారు బడిలో చేర్పించేసాడు. ఆ ఏట పరీక్షలో బోలెడు మార్కులు సంపాదించాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా కొద్ది రోజులు గడిచిపోయాక, తనకు టి.సి ఇచ్చి పంపివేసిన టీచర్ ఫణికుమార్‌కు ఉద్యోగం పోయిందని తెలిసింది. మరో ఉద్యోగంలో చేరడం కోసం, తీవ్రమైన ప్రయత్నంలో ఉన్నాడని తెలిసింది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కష్టంలో సుఖం కూడా దాగుంటుందని, దుఃఖంలో ఆనందం కూడా కలిసి వుంటుందని, శ్రమలో ఫలితం మిళితమై వుంటుందని, చలపతికి బాగా నిరూపణ అయింది. అన్నిట్లోను మంచి ర్యాంకు సంపాదించిన ప్రణీత్ అనతి కాలంలోనే.. చిన్న వయసులోనే మంచి ఉద్యోగాన్ని సంపాదించాడు.
''చూసారా.. సర్కారు బడిలో బండరాయికి ప్రాణం పోసి విద్య నేర్పుతారు. అదే ప్రైవేటు కొలువులో ప్రాణం, విద్య రెండూ వున్న వాటికే విలువ ఇస్తారు. సర్కారు బడిలో చేర్పించి చాలా మంచి పని చేసారు'' అన్నాడు పక్కింటి వెంకట్రావు. ఇప్పుడు చలపతి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వుంటే అక్కడేమో ఉద్యోగం ఊడిపోయిన ఫణికుమార్ జీవితం క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. కూతురి పెళ్లి పది రోజులే వుంది. ఒక్క రూపాయి కూడా తన ఖాతాలో లేదు, వయసుకొచ్చిన కూతురు ఇంట్లో వుంటే సమాజం చిన్న చూపు చూస్తుందని, వచ్చిన సంబంధాన్ని ఒప్పేసుకున్నాడు. ఫీజులు సరిగ్గా వసూలు చేయలేదనే నెపంతో తనని ఉద్యోగం నుంచి తీసివేయడమే కాకుండా ఐదు నెలలు జీతం కూడా ఇవ్వకుండా పోయారు.
ఫణికుమార్ లోనుకు అప్లై చేసుకున్నాడు. మెయిన్ ఆఫీసర్ సంతకం చేస్తే నాలుగు రోజుల్లో డబ్బు చేతికి అందుతుంది. లేకుంటే పరిస్థితి తల్లకిందులౌతుంది. ''ఐనా.. ఫణికుమార్.. లంచం లేంది పెన్ను ముట్టుకోరండి. వ్యవస్థ అలా తగలడింది'' అన్నాడు ఫణికుమార్ ఇంటి ఓనర్ శ్రీరాములు. నిజమే ఇప్పుడు అతనికి ఇవ్వడానికి తన దగ్గర డబ్బులు లేవు. ఫణికుమార్ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఒకవేళ కూతురి పెళ్లి ఆగిపోతే తను బతికి సుఖం లేదని భావించుకుని బయలుదేరాడు ఆఫీసుకు.
తను పత్రాలు పట్టుకుని వెళుతున్నాడన్న మాటేగాని, మనసంతా కూతురి పెళ్లి చుట్టూ తిరుగుతోంది. అలా అడుగులు వేస్తూ ఆఫీసు గేటు దగ్గర అడుగు పెట్టాడు. ''లోపల సార్ వున్నారా'' అడిగాడు అక్కడ అసిస్టెంట్ పురుషోత్తంను ''వున్నారు వెళ్ళండి'' అన్నాడు పురుషోత్తం. పణికుమార్ లోపలికి వెళ్ళాడు. ఆఫీసర్ ఏవో ఫైల్స్ తిప్పుతూ తల వంచుకుని కూర్చున్నాడు. పిలవడానికి ఫణికుమార్ క్షణం ఆలోచించాడు. తిన్నగా ''నమస్తే సార్'' అన్నాడు.
''ఎవరూ'' అంటూ ఫైల్ మూసివేసి తల ఎత్తి చూసాడు ఆఫీసర్.. అంతే షాకయ్యాడు ఫణికుమార్.. ఆ ఆఫీసర్ ఎవరో కాదు, రెండవ టర్మ్ ఫీజు కట్టలేదని బయట ఎండలో గంటసేపు నిలబెట్టి టి.సి ఇచ్చి పంపించిన ప్రణీత్.. ఇంత స్థాయికి ఎదగడం చూసి తన కళ్ళను తనే నమ్మలేక పోయాడు ఫణికుమార్. చదువు చెప్పిన మాస్టర్‌కు గౌరవం ఇస్తూ లేచి నిలబడి నమస్కరించాడు ప్రణీత్.. ఏం మాట్లాడాలో తెలియని ఫణికుమార్ క్షణం మౌనం పాటించాడు. ''రండి సార్ కూర్చోండి'' అంటూ తను నిలబడే ఎంతో వినయంగా ఆహ్వానిస్తుంటే అప్రయత్నంగానే ఫణికుమార్ కంట్లో నీళ్ళు ఒలికాయి..
''నిన్ను స్కూల్ నుంచి తీసివేసారనే బాధకంటే.. నువ్వు ఈ స్థాయికి ఎదిగావన్న ఆనందమే ఎక్కువగా వుంది ప్రణీత్.. ఊహించలేకపోయాను. ప్రస్తుతం స్థాయి కొలుస్తున్నామే కానీ. తర్వాత స్థానం గ్రహించలేకపోతున్నాం. చాలా సంతోషం'' అంటూ కళ్ళల్లో నీళ్ళు తుడుచుకున్నారు ఫణికుమార్. స్కూల్ లో తను ఇచ్చిన పనిష్మెంట్కు ప్రణీత్ కోప్పడతాడని అనుకున్నాడు. రెట్టింపు గౌరవం ఇచ్చి, పత్రాలపై సంతకం చేసి, ఖర్చుల నిమిత్తం కాస్త డబ్బు చేతిలో పెట్టిన ప్రణీత్‌కు ఎలా కతజ్ఞత చెప్పాలో తెలియక.. రెండు చేతులు జోడించాడు ఫణికుమార్.
- రజిత కొండసాని, 9949295459