Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూలం : సింధీ కథ (ధర్తీ సే నాతా)
మూల రచయిత, హిందీ అనువాదం
: డా. మోతీలాల్ జోత్వాణి
తెలుగు అనువాదం : డా. రూప్‌కుమార్ డబ్బీకార్
బస్టాపులో జనం గుంపు పెరగసాగింది. బస్ అలా రాగానే జనం లోపలికెక్కడానికి ఒకరినొకరు తోసుకుంటూ హడావుడి చేయసాగారు. బస్సు దిగడం బసంతాణికి అతి కష్టం మీద సాధ్యమైంది. కిందికి దిగిన తర్వాత వెనక వైపుకు తిరిగి తన దష్టిని మరల్చి చూసాడు. గుంపులో కొందరు ఆడ, మగ. ఆడ, మగ కాదు కానీ నిరర్థకమైన, పనికిమాలిన ఆడంగి చేష్టలతో మానసిక రోగం పాలైన కొన్ని జంతువులు అవి.
సంధ్య వాలింది. మహానగరం సంధ్య, పల్లె సంధ్యతో పోలిస్తే పూర్తిగా వేరుపడి పోయింది. పల్లెలోని సంధ్య, క్షితిజం నుండి మెల్లమెల్లగా ఊరి కాపురాలను పలకరించి తిరిగి పొలాల మీదికి దిగుతుంది. నగరాల్లో సాయంకాలాలు ఇంటికి త్వరగా చేరుకోవాలన్న ఆత్రుత జనానికి వుండదు. చేరుకోవాలన్న ఆత్మీయత కనబడదు. చేరుకున్నా తప్తివుండదు. ఇక్కడ కరెంటు దీపాల కాంతిలో కూడా తమ వైయుక్తికమైన, వ్యక్తిగత జీవితమనే దుప్పటిని కప్పుకొని వుండి, అందరూ ఏదో కోల్పోయినట్లు బరిబత్తలతనాన్ని వెంటేసుకొని తిరుగుతూ వుంటారు.
బసంతాణి ముందుకు కదిలాడు. ఫెడరేషన్ హౌస్ ఇంకా కొద్ది దూరంలో వుంది. నగరం మధ్యలో రీగల్ సినిమా టాకీస్ దగ్గర ఫెడరేషన్ హౌస్ పేరుతో ఒక పెద్ద భవంతి వుంది. అది భారత దేశానికి ఒక చిన్న ప్రతిరూపమని చెప్పుకోవచ్చు. ఆ భవంతిలో భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి వచ్చి స్థిరపడినవారు తమ తమ సాంస్కతిక సంస్థలను నెలకొల్పి వున్నారు. ఆ భవన నిర్మాణం పూర్తికాగానే అన్ని తరగతుల, వర్గాల వారి సంస్థలు వచ్చి చేరాయి. దేశ విభజన తరువాత మా వర్గం వారి ధ్యాసంతా రోటి, కప్డా, మకాన్ నేపథ్యంలో ఉత్పన్నమైన సమస్యల పరిష్కారంలోనే మునిగిపోయి వుంది కదా అని బసంతాణి విచారించసాగాడు. లేకపోతే, నిస్సందేహంగా వారి సాంస్కతిక సంస్థకు కూడా ఈ భవంతిలో యధోచిత స్థానం దక్కేది. మా సంస్థలోని వారు ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు. వీళ్ళు అన్ని ప్రాంతాల్లో వ్యాపించియున్నారు. దేశ విభజన అనే దుస్సంఘటన కారణంగా వారికి చాలా అన్యాయం జరిగింది. ఎవరికైనా అధిక నష్టం జరిగిందంటే అది వీరికే జరిగింది. ఇంకా నయం, ఈ భవంతి పై భాగంలో టెర్రస్ పైన ఒక గది వేసుకోవచ్చని అనుమతి దొరకడం ఒక విధంగా అదష్టమే. అప్పట్నుంచి ప్రతి ఆదివారం పద్ధతి ప్రకారం తమ ఈ సంస్థ నిర్వహించే సమావేశానికి హాజరవుతూ వస్తున్నాడు బసంతాణి. నగరంలోని ఒక అద్భుతమైన ఈ భవంతిలో సాయంకాలం పూట పండగ వాతావరణంతో సందడిగా వుండి అందరూ గుమికూడుతారు. మనుషుల హడావుడి అధికంగానే వుంటుంది.
రకరకాల, రంగు రంగుల దుస్తులు వేసుకొని చాలా బిజీగా కనబడుతారు. కానీ, వారికి అతి దగ్గరగా, సమీపంగా వుంటూ వారి మనసులలోకి తొంగి చూస్తే మాత్రం వాళ్ళంతా తమ తమ ఖాళీ సమయాన్ని ఎలా గడపాలా? అన్న ఆలోచనలోనే మునిగివుంటారనే విషయం తెలిసివచ్చింది. ఈ రోజుల్లో మనిషికి జ్ఞానాన్ని ఆర్జించాలనే తాపత్రయంవుంది. కాని మనిషి ఎలా మారి ఎదిగిపోయాడు అంటే, తన ఖాళీ సమయాన్ని సినిమా టాకీస్‌లలో, కళారంగాల, వ్యాపార రంగాల ప్రదర్శనల వాటిల్లో గడిపి వధా చేస్తున్నాడు. తన కుటుంబం, సంసారం ఉన్నప్పటికీ, ఆ కుటుంబానికీ ఆవల జులాయిగా, సోమరిగా తిరగడానికి మాత్రం సమయం అలా సులువుగా దొరికిపోతుంది.
బసంతాణికి దాదాపుగా అరవై ఏళ్ళు వుండి వుంటాయి. కానీ, ఆయనలో ఇంకా అదే ఉత్సాహం, చురుకుదనం వుంది. అతను నగరంలోని ఒక మూల దూరంగా వున్న బస్తీలో రెండున్నర అంతస్తుల భవనంలోని 'బర్సాతి' గదిలో అద్దెకు వుంటున్నారు. సాధారణంగా స్థానికులు ఇంకా ఇంటి యజమాని కింది భాగంలో వుంటారు. నగరానికి వచ్చివుండే బయటి వాళ్ళు, దాదాపుగా క్లర్కు స్థాయిలోని ఉద్యోగాలే చేస్తున్నారు. ఈ ఇంటి 'బర్సాతి' గదుల్లో వారి జీవితాలు గడిచిపోతూ వుంటాయి. బసంతాణి స్వయంగా క్లర్కు గాదు కానీ అతనికి తెలుసు అతని సంస్థలో వేళ్ళమీద లెక్కపెట్టగలిగే కొందరు పెద్ద వ్యాపారాలు చేస్తున్నారు. మిగతా వాళ్ళు కనీసం చిన్న దుకాణపు యజమానులు లేదా కేవలం క్లర్కులయి ఉండొచ్చు. బెంగాలీలకు సగం బెంగాల్, పంజాబీలకు సగం పంజాబ్ దొరికింది. కానీ మా సింధీలకు ..ప్చ్.. మా సింథ్ పూర్తిగా పాకిస్తాన్లో కలిసిపోయింది అంటూ బసంతాణి మదనపడసాగాడు.
ఇలా ఆలోచనల్లో మునిగిపోయి అతను ఫెడరేషన్ హౌస్ బయట వాకిలి ముందుకు చేరాడు. అంతలో వెనక నుంచి ఎవరో అతని భుజం పై చెయ్యి వేశారు. వెనక్కి తిరిగి చూస్తే, మోహన్ పలకరింపుగా నవ్వుతూ, ''బసంతాణిజీ, నమస్కార్. నక్షత్రాలతో నిండిన ఆకాశం కింద, ఇంటి టెర్రస్ పైన మంచం వేసి పడుకొని ఒక అదష్ట రహస్యాన్ని కనుగొని వుంటారు. గత రాత్రి కూడా ఇలాంటిదేదో అనుభవం జరిగివుంటుంది. చెప్పకూడదూ!'' అని అడిగాడు.
ఈ రోజు బసంతాణి హదయం బస్సు దిగగానే అలజడితో చెదిరిపోయింది. ఎప్పుడైతే బుద్దిజీవి, విషాద క్షణాల ననుభవిస్తాడో అప్పుడు నిస్సందేహంగా అతను జీవితపు లోతుల్లో దాగిన సత్యం వరకు చేరుకుంటాడు. అతను గంభీరంగా అన్నాడు. ''నిన్నటి రాత్రి మాట వదిలేరు! ఇప్పుడు ఈ సంధ్యాకాలంలో ఎలా అనిపిస్తుందంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలాంటి సాహిత్య సమావేశాల్లో పాల్గొంటూ సమయం వధా చెయ్యాలో కదా? జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు సాధించగల ఉత్కష్ట కావ్యాలు, కతులు అందించలేమా !?''
ఆరు గంటలకు సమావేశ కార్యక్రమాలు ప్రారంభం కావడానికి రంగం సిద్ధమవుతున్నది. ఆరు గంటలు కావస్తుంది. వేరు వేరు మార్గాలనుండి జనం వచ్చి చేరారు. వారందరి కత్రిమమైన, కుత్సితమైన నవ్వుల్లో బసంతాణి మాట మరుగున పడిపోయింది.
ఫెడరేషన్ హౌస్ కింది అంతస్తులో గోష్టి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అక్కణ్ణుంచి బయటికి వస్తూ వస్తూ రామ్, మోహన్‌తో చెప్పాడు- ''మన స్వంత భాష కిచిడీ అయిపోతున్నది. ఇప్పుడు మనం ఒక ప్రాంతానికి పరిమితమై వుండక పోవడంతో మన ప్రాంతీయ భాషపై వేరే భాషల ప్రభావం పడుతున్నది. అలాంటి సందర్భంలో వారి పదాలు, మన భాష, మన కలంపై పెత్తనం చేయడం సహజమే కదా !''
మోహన్ ఎలాంటి సమాధానమివ్వలేదు. కానీ అతను లోలోపల తప్పకుండా ఉద్వేగాన్ని అనుభవిస్తున్నాడు. మన జీవితాలు చాలావరకు నగరీకరణం చెందినవి. అందుకే మన భాష, నగర వాతావరణానికి తగినట్లుగా పరిమితమై, మిశ్రమ శబ్దాల బాండాగారం అయిపొయింది. అతను తన కథలోని సారాంశంపై మనసును కేంద్రీకరించి వున్నాడు. తన సాహితీ మిత్రులకు తప్పకుండా ఈ కథ నచ్చుతుందన్న ఆశ అతనిలో పుట్టింది. తన కథానాయిక ఆధునిక జీవన సంక్లిష్టతలకు నిజమైన ప్రతినిధి అన్న భావన అతనిలో కలిగింది. తాను ఒక స్కూల్ లో ఉపాధ్యాయురాలు. కొత్తగా పెళ్లయ్యింది. కానీ, కొత్త పెళ్లికూతురు ముఖంలో వుండాల్సిన సంతోషపు ఛాయలు, కాంతి దాదాపుగా లేదనే చెప్పాలి. ఎప్పుడైతే ఆమె భర్త ఆమెను సమీపిస్తాడో, ఇద్దరూ ఒకరి బాహువుల్లో మరొకరు బందీలవుతారో ఆమెకు ఈ నెల కాకుండా వచ్చేనెలలో తనకు తానుగా పూర్తిగా సమర్పించుకోవాలి, అన్న ఆలోచన ఆమెను బాధిస్తూ వుంటుంది. ఎందుకనగా ఇలా చేయడం ద్వారా తన 'మెటర్నిటీ లీవ్' ను వేసవి సెలవులతో పాటు కలిపి పూర్తిగా నాలుగు నెలలు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చన్నది ఆమె ఆలోచన.
రామ్ అడిగాడు- ''మీరు నా ప్రశ్నకు జవాబివ్వలేదు, ఏమాలోచిస్తున్నారు?''
మోహన్ అతనికి తన కథలోని సమస్యతో పరిచయం చేసాడు. దగ్గర్లోనే వున్న మెట్ల రెయిలింగ్‌ను పట్టుకొని బసంతాణి గారు నెమ్మదినెమ్మదిగా పైకెక్కసాగారు. భవనంలోని రెండవ అంతస్తుకు రాగానే రామ్ తన సిగరెట్టు చివరి దమ్ములాగి మిగిలిన సగం సిగరెట్టు ముక్కను ఆర్పేస్తూ అడిగాడు- ''మోహన్, నా కథలో కూడా ఇలాగే ఒక 'టెన్షన్' వుంది. కానీ, ఆ కథను హిందీ మూలభాషగా రాసాను. మిత్రమా, నేను హిందీ సాహిత్య రంగంలో ప్రముఖుణ్ణి కావాలనుకుంటున్నాను'' అని చెప్పి సగం కాలిన సిగరెట్టు ముక్కను పారేసి రెండవ అంతస్తులో జరుగుతున్న హిందీ సాహిత్య సమావేశానికి వెళ్ళిపోయాడు. మోహన్ ఆలోచనలో పడిపోయాడు. దేశ విభజనలో మా హస్తం ఏమీ లేదు గదా! మరి ఎందుకు రామ్ నుండి అతని అసలైన, ప్రామాణికమైన మాధ్యమం అతనినుండి దూరమవుతుంది. ఒక రామ్ హిందీ సాహిత్య రంగంలో విజయం సాధించవచ్చుగాక ! మిగతా వారి జన్మతః వచ్చిన శక్తి సామర్ధ్యాల విషయం గురించి ఏమిటి? కేవలం మేము మామూలు చిన్న వ్యాపారులుగానే వుండిపోతామా?
బసంతాణి అనాయాసంగానే ఒక దీర్ఘమైన శ్వాస తీసుకున్నాడు. వెనకాల వున్న ఒకరిద్దరు దగ్గరవుతున్న ఫీలింగ్. హరి దగ్గరికి వచ్చి బసంతాణితో అన్నాడు- ''ఏం దాదా, ఈ రోజు మిమ్ముల్ని ఈ విధంగా, నెమ్మది నెమ్మదిగా మెట్లెక్కుతూ వుంటే మీరు నిజంగానే ముసలివాళ్లై పోతున్నారని నాకనిపిస్తుంది.''
జవాబుగా బసంతాణి ముఖంపై మెట్లమీద వెలుగుతున్న 'జీరో పవర్' బల్బులా పేలవంగా ఓ జీవం లేని నవ్వు వెలిగింది.
భవనంపై కప్పుకు చేరగానే, ఒక కార్పెట్ పరచబడివున్న దశ్యం కనబడింది. ఎంతో కాలం నుంచి ఆ సంస్థ సభ్యులు, ఇతర సంస్థలకు చేసిన సహాయంలా మాకు గ్రాంటు మంజూరు చేసి ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా లాభం లేకుండా పోయింది. కనీసం కార్పెట్‌కు బదులుగా కుర్చీలు, ఒక మెజా బల్ల వేసుకునే వాళ్ళం కదా! కానీ, మా బాధ ఎవరు పట్టించుకుంటారు?
ఇప్పుడు మా సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను కాపాడుకోవడానికి కూడా రాజకీయ అధికారంపై ఆధారపడే స్థితికి వచ్చింది. వారి అధికార మార్పిడి సమయంలోనూ మమ్ముల్ని పట్టించుకున్నవారు లేరు.
వచ్చిన వారు తమ తమ చెప్పులు, బూట్లను తమ అభిరుచులతో పాటు వదిలి ఒక మూలన బెట్టి కూర్చుండి పోయారు. బసంతాణికి కూర్చోవాలన్న మనసొప్పడం లేదు. లోపలి గదిలోకి వెళ్లి అక్కడ గోడకు వేళ్ళాడుతున్న షాహ లతీఫ్, సచల్, సామి వేసినటువంటి తైలవర్ణ చిత్రాలు చూస్తుండి పోయాడు. ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ చిత్రాలన్నీ చిత్రకారుల అద్భుత కల్పనా శక్తికి ప్రతీకలు. పూర్వ కాలంలోని కవుల, రచయితల చిత్రాలు ఒక ఎత్తు, కాని వారు చివరికి తమ జీవిత వివరాలను, విశేషణాలను కూడా వదిలి వెళ్లలేదు. ఈ రోజు అలా కాదు. వర్తమాన కవులు, రచయితల చిత్రాలు కాల ప్రవాహంలో సురక్షితంగా ఉంటున్నాయి. అతను బయటికి వచ్చి టెర్రస్ పైన పెట్టిన పూలమొక్కల కుండీలను చూస్తూ అలా వుండిపోయాడు. కుండీల్లో 'సదా బహార్' పూలు వికసించి వున్నాయి. చాలా అందంగా వున్నాయి.
అంతలో కష్ణ వచ్చి అతని ఏకాగ్రతను భగం చేసాడు. కష్ణ ముఖం మీద ఎప్పుడూ చిరునవ్వులు నాట్యమాడుతూ వుంటాయి. ఆ నవ్వుల్లో ఇతరుల కష్టాల మీద దయాగుణం, కొన్నిసార్లు తన మీద తనకే జాలి, అలా భిన్న భావాలు ముప్పిరిగొని వుంటాయి. అతను నమస్కారంలో తన నవ్వును మార్మికం చేస్తూ బసంతాణితో చెప్పాడు- ''ఎందుకు, బసంతాణి గారు, ఇక్కడ నిలబడ్డారు? రండి వచ్చి కూర్చోండి?''
బసంతాణి కూడా జవాబులో ప్రశ్నను మిళితం చేసి- ''ఎలా వున్నారు, కష్ణా? ఇక్కడ ఈ రోజు సింధీలో వినిపిస్తారు గదా? 'కాఫీ'లేదా 'వాఈ' వినాలనే ఇష్టంతో వచ్చాను'' అన్నాడు.
కష్ణ చెప్పాడు- ''కాఫీ లేదా 'వాఈ'లో సింధీ లోయ విస్తతి వుండాలి. వర్తమానంలో మనం నగరపు ఇరుకు సందుల్లో వచ్చి జీవిస్తున్నాము. ఈ రోజుల్లో ఆ చిన్న చిన్న గజల్ లు కూడా బరువెక్కి మన ఇరుకు జీవితాలతో మమేకమై పోతున్నాయి.''
బసంతాణి నిరుత్సాహంగా అన్నాడు, ''ఐతే ఈ రోజు కూడా నువ్వు గజల్ వినిపిస్తావన్న మాట?''
కష్ణ, ''ఔను, ఆధునికం, ఆధునిక గజళ్ళు. లయాత్మకంగా, మార్మికంగా వుంటూ జీవితం బరువును భుజాలపై మోసుకెళ్తుంది. మీకు తెలుసా, నేను ఈ రోజు చదవబోయే నా గజల్ లోని ఒక 'షేర్' లో ఏమని చెప్పానో''
బసంతాణికి తెలుసు, కష్ణ హదయం ఎంత సంవేదనా భరితమో, ''ఏమిటది'' అడిగాడు.
కష్ణ బదులిచ్చాడు, ''ఇప్పుడు, సంతానం పితరుణం తీర్చుకోవాలి అన్న కాంక్షతో పిల్లల్ని కనడంలేదు. అలాంటి భావనలు అస్సలు లేవు. పిల్లలు వద్దనుకున్నా, కేవలం యవ్వన వాంఛలు తీర్చుకోవాలన్న తపనలో పిల్లలు పుట్టుకొస్తున్నారు. మరి, ఈ పిల్లలు ముందుకు నడిచి మన ఆకాంక్షల మేరకు నడుచుకోక, తమ కర్తవ్యాన్ని నెరవేర్చకపోతే అందులో వాళ్ళ తప్పేముంది.''
కష్ణ గట్టిగా నవ్వసాగాడు. కానీ ఎందుకో బసంతాణి ఆ నవ్వులో భాగస్వామి కాలేకపోయాడు. అతని కనిపించింది, రాజధాని లేదా రాజధాని లాంటి పెద్ద నగరాలలోని జీవితం సగటు భారతీయుడి జీవితాన్ని దర్షింపజేయదు. ఈ నగరం పల్లెకు పై 'టెర్రస్' లాంటిది. మనం ఇంటి పై కప్పు మీద కాలక్షేపానికి చేరతాము. ఫలితంగా నేలతో మన సంబంధం తెగిపోతుంది. ఈ రోజు ఒక శ్రామికుడు, రైతు కూడా ఇలా అర్ధ రహితమైన, నిరర్ధకమైన జీవితాన్ని గడుపుతున్నాడా? రైతు తన ఎడ్లను తన సంతానం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అతనికి కూడా ఈ ఎడ్లను చూసుకోవడానికి ఒక కొడుకు అఖ్ఖర్లేదా? అతనికి కూడా కొడుకు పుట్టుకొస్తాడు. నాలుగు కాళ్ళ జంతువులైన మేకలు, గొర్రెలను పోషిస్తూ తమ సంతాన మనుకునే ఈ 'గడరియా'లు తమకు సంతానం కావాలని ఆశించరా?
అతను కష్ణతో అన్నాడు, ''నువ్వు పూల మొక్కలతో వున్న ఈ కుండీలను చూసావా?''
కష్ణ, ఆశ్చర్యంతో పూలకుండీ వైపు చూడసాగాడు.
బసంతాణి- ''మనమంతా ఈ టెర్రస్ పైన వున్న ఈ కుండీల్లోని పూల మొక్కల్లాంటి వాళ్ళం. వేరు, వేరు కుండీల్లో వేరు వేరు ప్రాంతాల నుండి వచ్చి ఆవాసమేర్పరచుకున్న 'సదాబహార్'లా మన కళాపరిమళం, సౌందర్యం నిస్సందేహంగా వికసిస్తూ వుంది. కానీ ఈ పూల మొక్కలు కుండీలకే పరిమితమై పోయాయి. మరి ఈ కుండీలు నేలకు దూరంగా ఎక్కడో టెర్రస్ మీద వుంచబడి వున్నాయి. అంతేగాదు, అలాగే మన సంబంధం కూడా ఈ నేలతో తెగిపోయివుంది. అందువల్ల మన ద్వారా రచింపబడిన భూమిక, పాత్ర కత్రిమమైనది.న్యూ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ కావచ్చు, ముంబాయిలోని ఫ్లోరా ఫౌంటెన్ ప్రదేశంలో తిరిగే జనం కావచ్చు, ఆ పాత్రధారులందరి ముఖాలు, అస్తిత్వాలు చెరిపేయబడినాయి. ''ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేస్ లెస్''. వారికి ఏమైనా ప్రత్యేక గుర్తింపుగాని, వ్యక్తిత్వంగాని వుందా? అందరూ ఈ జన సమూహంలో కాటగలిసి పోయారు .
కష్ణ అతని వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు. బసంతాణి ఒక దీర్ఘ శ్వాస తీసుకొని, ''ఈ రోజు టెర్రస్ మీద ఈ సమావేశంలో పాల్గొనాలని వున్నా, మనసొప్పడం లేదు'' అని చెప్పి పెద్ద పెద్ద అంగలు వేస్తూ, కిందికి దిగడానికి మెట్ల వైపుకు తిరిగాడు. కష్ణ మెదడులో ఒక రోమాంచితమైన ఆలోచన మెరుపులా మెరిసి మాయమయ్యింది. ''అరే, రేపటి సమాచార పత్రికలో ఈ వార్త చదివాల్సి వస్తుందేమో, నేలతో పేగుబంధం ముడివేసే ఆలోచనతో ఒక సింధీ రచయిత ఫెడరేషన్ హౌస్ భవనపు టెర్రస్ మీద నుండి వేగంగా మెట్లు దిగే సమయంలో అకాల మత్యువుకు గురయ్యారు ''అన్న వార్త వినాల్సి వస్తుందా!'' వెంటనే మరుక్షణంలో అతనూ ఇలాంటి మత్యువు నిరీక్షణలో వున్న భ్రాంతికి లోనయ్యాడు.
(బర్సాతి - భవంతి టెర్రస్ పైన కిచెన్, టాయిలెట్ లేకుండా వుండే చిన్న గది.)