Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''కాలం నెత్తి మీదికొచ్చింది. తోటోల్లు చెల్కలు తేటగ జేస్కుంటున్నరు. పొద్దున లేవంగనే పోయిండు ఏడ పొంకనాలు కొడుతున్నడో ఏమో. అంబటాల్లైతున్నా జాడ లేడు.'' తన భర్తను ఏమీ అనలేని నిస్సహాయతతో తనలో తను గొనుక్కుంటుంది మంగమ్మ.
'అమ్మా పత్తి కట్టె ఎదురడానికి ఇయ్యాల నేను కూడా చెల్కలకు వస్తా.' పన్నెండేళ్ల కళ్యాణి తల్లితో అన్నది.
'అమ్మో వద్దు బిడ్డా... ఈ ఎండకు తట్టుకోలేవు. అన్నను తీసుకుపోతగని నువ్వు ఇంటిపట్టునే ఉండు'
'నేను కాలేజీల దరఖాస్తు చేయాలె. నేనేడొస్త? మా దోస్తు గాళ్లతోటి నల్లగొండ పోత. నేను చెల్కలకు రాను. నాకు ఐదొందలు కావాలె ఇయ్యమ్మా' మొన్ననే పది పాస్ అయిన కొడుకు కిరణ్ అన్నడు.
'ఇగ అయ్య ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు తిరిగి రాండ్రి. పైసలు చెట్లకు గాస్తున్నాయా? ఏడికెల్లి తేను? చేసి చేసి రెక్కలన్నీ పాడై పోతున్నయి...'
'ఏందే లొల్లి... నువ్వే కష్టం జేసి మమ్ముల సాదుతున్నట్టు...? బొడ్రాయి కాడ ఆసాములు కూడిండ్రంటె పోయిన.' అప్పుడే వచ్చిన యాదగిరి అంగి విడిచి శిలక్కొయ్య కు తగిలించుకుంట అన్నడు
'రోహిణి కార్తి ఎల్లుదలకొచ్చింది. చెల్కల ఏడి కట్టే ఆడనే ఉండే. శెల్క పొతం చేసుకోవద్దా? ముల్క శీర కార్తీ వస్తే ఉరుముతుంటే అప్పుడు ఉరుకుల బెడతవా? దూప అయినప్పుడే బాయి తొవ్వుకున్నట్టు ఉంది మన సంసారం. ఏం మీటింగ్ అంట? కూరకొచ్చేదా? బువ్వకొచ్చేదా?'
'ఈసారి పత్తి గింజలకు గుంటూరు పోతున్రట. నిరుడు అంజి రెడ్డోళ్లు ఆడనే తెచ్చిన్రట. మంచిగ కలిసొచ్చింది. అందుకే అందరం కలిసి టాటా సుమో కట్టుకొని గుంటూరు పోదాం అనుకుంటున్నరు.'
'ముందల మురిసినమ్మ పండుగ గుర్తెరగదంట. కాలం సక్కగా అయ్యి సాలేటి వాన పడితే అప్పుడు గుంటూరు కైనా పోవచ్చు బెజవాడ కైనా పోవచ్చు. ఇయ్యాల చెల్కలకు పోదాం పా. పత్తి కట్టెదురాలె.'
'నాకు పనుంది. మల్లెపల్లి కి పోవాలె. గాసం లేదని ఉన్న ఎడ్లను అమ్ముకుంటిమి. బక్కో బడుగో రెండు గొడ్లను తేవొద్దా? ధరలు ఎట్టెట్ట ఉన్నయో అర్సుకొస్తా. నువ్వు పోయి చేతనైన కాడికి ఎదురు. రేపు పొద్దున నేను పోయి తగలబెడతా. ఎనుగు అంత పోయింది. నాలుగు కంప చెట్లు నరికి ఎనుగు వేస్త.' అన్నడు యాదగిరి.
తనకున్న మూడెకరాల చెల్కనే యాదగిరి కుటుంబానికి జీవనాధారం. నీళ్లు పడతాయేమో అన్న ఆశ తోటి నాలుగు బోర్లు వేసిండు. చుక్క నీళ్ళు పడలేదు కానీ అప్పులయితే మిగిలినయి. ఇక లాభం లేదని పత్తి పంట వేయడం మొదలు పెట్టిండు. ఏ ఏడుకాయేడు ఏదో ఒక ఇబ్బంది ఎదురైతనే ఉంది. ఒకఏడు కరువొచ్చి ఇత్తులే మొలవక పాయె. మరొక
ఏడు పంట బాగా పండినా దీపావళి వానలకు చేను మీదనే పత్తి అంతా తడిచి ఆగం అయిపోయింది. ఇట్లా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏదో ఒక రోజు కలిసి రాకపోతదా అన్న ఆశతో వ్యవసాయం చేస్తున్నడు యాదగిరి.
'నాయినా నల్లగొండ దాకా నేను కూడ నీ తోటి ఒస్తా. కాలేజీల షరీకయితందుకు దరఖాస్తు చేయాలె. నా దోస్తులు కూడ వస్తరంట.'
''కడుక్కోండ్రి బుక్కెడు తిందురు' అని మంగమ్మ వంటింట్లోకి పోయింది. తండ్రి కొడుకులు తిని నల్లగొండ కు పయనమైన్రు.
మల్లెపెల్లి అంగట్ల ఎడ్లకు ధరలు మండిపోతున్నయి. అమ్మేటప్పుడు అడ్డికి పావుశేరు అడిగే బేరగాళ్ళు కొనేటప్పుడు మాత్రం అదే ఎడ్లకు వేలవేల ధర చెబుతున్నరు.
'యాదగిరి బావా ! ఏం కొంటున్నవ్? అంగడికొస్తున్న అని ఒక్కమాటనవైతివి? నా కార్ ల తీసుకొస్తుంటిని గదా ! తన ఊరికే చెందిన రఘునాథం అన్నడు యాదగిరి వెనుకనుంచి భుజం మీద చెయ్యి వేస్తూ.
రఘునాథం వ్యాపారం చేస్తుంటడు. ఇతని వ్యాపారం రైతుల అవసరాలను బట్టి ఆయా కాలాలలో రూపం మార్చు కుంటుంది. ముల్కశీర కార్తి వానలు పడగానే పత్తి విత్తనాల వ్యాపారం మొదలైతది. అది పూర్తి ఐనంక పత్తి మందుల వ్యాపారం మొదలయితది. రైతుకు పత్తి చేతికి వచ్చే నాటికి పత్తి కొనుగోలు వ్యాపారిగా అవతారమెత్తుతడు. ఇట్ల రైతుల అవసరాలు రఘునాథం వ్యాపారానికి పెట్టుబడిగా మారు తయి. రైతులతో వరుసలు కలుపుకుంటూ మాట్లాడుతూనే రైతుల కష్టార్జితాన్ని దోచుకుంటడు అనే చెడ్డ పేరు కూడా రఘునాథానికి ఉంది. రైతులు విధిలేని పరిస్థితులలో అతన్ని ఆశ్రయించి ఆర్థిక సహాయం పొందుతూ ఉంటారు.
ఏమున్నది బావ మొన్న ఉగాది అప్పుడు గొడ్లకు గాసం లేక అమ్ముకుంటి. ఇప్పుడు కొందామంటే కటికోడు కూడా వల్లని దానికి మస్తు ధర చెబుతున్నరు. ఏం కొనేటట్టు ఉన్నది? ఏడనన్న రెండు బక్కెడ్లు దొరకక పోతయా అని వచ్చిన. అని యాదగిరి తన బాధనంత చెప్పిండు. పెట్టుబడి యాళ్ల గింత ధరలు పెట్టి పానం లేని గొడ్లను కొని ఏం ఫాయిదా? నా ట్రాక్టర్ లేదా? నేను దున్నను అంటినా? అనవసరంగా ఖర్చు ఎందుకు? ఎడ్లు వద్దు ఏం వద్దు పోదాం పా... అన్నడు రఘునాథం. యాదగిరికి కూడా ఈ ఆలోచన మంచి గా అనిపించింది. పిల్లల పుస్తకాలు బడి ఫీజుల ఖర్చులు వ్యవసాయం పెట్టుబడి ఈ కర్సులన్నీ తలుచుకుంటే ఎడ్లు కొనక పోయినా ఏమి లేదు పత్తి చేతికి వచ్చినంక అవే పైసలు రఘునాథానికి ఇస్తే సరిపోతుంది. అనుకున్నడు.
అనుకున్నట్టే సమయానికి వర్షాలు పడ్డయి. రైతులు ఆనందం తోటి చెలకల బాటపట్టిన్రు. ఎర్ర చెలకలు కుంకుమోలె కండ్ల సంబురంగా ఉన్నయి. చేతుల పైసల్ ఉన్నోళ్లు గుంటూరుకు పోయి విత్తనాలు తెచ్చుకున్రు. రఘునాథం మాటలు నమ్మి యాదగిరి విత్తనాలు, అడుగు మందు, రఘునాథం దగ్గరే తెచ్చిండు. ఎనిమిది నెలల తర్వాత వచ్చే పైకం... రఘునాథం వడ్డీ తన లాభం కలిపి ముందే ఖాతా బుక్కుల లెక్క రాశిపెట్టిండు. వేలిముద్ర వేసిండు యాదగిరి. పత్తిత్తులు పెట్టినంక పది పదిహేను రోజుల్లోనే మళ్లీ రెండు వానలు పడ్డయి. పత్తి గింజలు మంచిగ మొలిచినరు. యాదగిరి సంబరపడ్డడు. ఈ ఏడు పంట మంచిగ పండి అప్పులు తీరితే ధర్వేశిపురం ఎల్లమ్మ కు బోనం, కోడి పుంజును పెడతనని మొక్కుకున్నడు. చేన్ల గడ్డి తీపిస్తందుకు కూలోల్లకు ఐదు వేలరూపాయలు అవసరం పడితే రఘునాథం ఖాత బుక్కుల రాసుకుని ఇచ్చిండు. రఘునాథం కూడా యాదగిరి పంట మంచిగ పండుతుంది అని సంతోషపడుతున్నడు. అడుగు మందు సంచులు కూడా ఖాతా బుక్కుల రాసుకుని ఇచ్చిండు. చేను ఎదిగి వస్తుంది. తెగులు సోకిందని యాదగిరి రఘునాథం దగ్గరకు పోయిండు. 'నా దగ్గర మొహమాటం ఎందుకు బావ? నువ్వు అడిగితే ఎప్పుడన్నా కాదన్నానా? మీ దగ్గర డబ్బులు ఎటు పోతయి చెప్పు? నన్ను కాదని నువ్వు పత్తి అమ్ముకోవు కదా' అనుకుంట పురుగుల మందులు కూడా ఇచ్చిండు. యాదగిరి రాత్రింబవళ్ళు కష్టపడ్డడు. చేనును పసిపిల్ల లెక్క సాదిండు. దసరా దీపావళి ఎల్లుదలకే కాయ పగులుడు మొదలైంది. మల్లె పూల పందిరి లెక్క చేను చూస్తందుకు కండ్ల సంబూరంగ కనబడుతున్నది.
'రేపు దశమి మంచిగున్నదంట. పత్తి ఏరుడు మొదలు పెడదాం. చెలకల ఉన్న మైసమ్మ కాడ కోడిపుంజును కోసుకొని వస్త. ఊళ్లెకు పోయి పదిమంది కూలోళ్లను మాట్లాడు' పొద్దుగాలనే మొదలు పెట్టాలె ' భార్య మంగమ్మ తోటి అన్నడు యాదగిరి.
'మీనక్కా... ఉన్నవా....?' మంగమ్మ కూలీల మేస్త్రి మీనమ్మ ఇంటి ముందు నిలబడి పిలిచింది.
'ఆ.. ఏంది చెల్లె? ఇసుంట రారాదు ఆకిట్లనే నిలవడితివి' ఇంటి వెనుక జాలాట్ల నుంచి పైట కొంగు నడుముకు చెక్కుకుంటూ వస్తూ అన్నది మీనమ్మ.
'పోవాలె అక్కా ఇంక ఏడిపని ఆన్నే ఉంది. మీ మరిది శెల్కలకు పోయిండు. ఇయ్యాల మంచి రోజంట.పత్తి ఏరాలె. ఓ పదిమంది కావాలె ఒస్తరా అక్కా.'
'అందరూ ఇయ్యాలనే పిలుస్తున్నరు. ఒవల్ని కాదన్నా కష్టమే ఉంది. ఐదుగురిని పంపిస్త చెల్లె. నీకు తెల్వనిది ఏముంది? కూళ్లకు అంటే ఎవరు వస్తలేరు. కిలల లెక్క. కిలో పత్తి కి పది రూపాయలు. లోకం తోపాటు నువ్వు. సరేనంటే పంపిస్తా.' అన్నది మీనమ్మ.
తప్పని పరిస్థితిలో సరే పంపమని చెప్పింది మంగమ్మ.
పత్తి బోరాలు నిండుతున్నయి. కూల్లకే వేలకు వేలు కావలసి వస్తుంది. యాదగిరి దగ్గర లేకపోవడం వల్ల రఘునాథం ఇస్తున్నడు. ఖాతాల రాస్తున్నడు.
చిట్యాల పత్తి మిల్లు కాడ ధర ఐదు వేల ఐదు వందలు పలుకుతుందట. ఈ మాట విన్నప్పటినుంచి యాదగిరి ఈ అప్పులు తీరుతయి తేటగ అయిత.నాల్గుట్ల గలుస్త అని సంబర పడుతున్నడు. సొంతంగ పెట్టుబడి పెట్టుకున్నోళ్ళు పత్తి ట్రాక్టర్ల తొక్కుకొని చిట్యాల కు పోయి అమ్ముకొని వస్తున్నరు. యాదగిరి చేను కూడా పత్తి ఏరడం దగ్గర పడ్డది. ఒక నాడు రఘునాథం దగ్గరకు పోయి పత్తి కాంట పెట్టుకోవడానికి రమ్మని పిలిచిండు.
తెల్లవారి రఘునాథం మనుషులు కాంట, బాట్లు తీసుకొని యాదగిరి ఇంటి ముందుకు వచ్చినారు.
'యాదగిరి బావ ఉన్నవా!' పిలిచిండు రఘునాథం.
ఆ వస్తున్న బావ అని శిలక్కొయ్య కు తగిలించిన అంగి తొడుక్కుని బయటకు వచ్చిండు యాదగిరి.
'కళ్యాణీ! మామయ్యకు కుర్చీ తీసుకురా' బిడ్డను పిలిచిండు యాదగిరి.
కళ్యాణి కుర్చీ తెచ్చి వేసింది. రఘునాథం కూర్చున్నడు.
'బావా! చెప్పలేదు అనొద్దు. ధర నీకు తెలుసు కదా మూడు వేల ఎనిమిది వందలు. పత్తి మొత్తం కాంటా అయినంక లెక్క చూసుకుందాం' అన్నడు రఘునాథం.
ఒక్కసారే గుండె గుభేలుమంది యాదగిరికి.
'చిట్యాల కాడ ఐదు వేల ఐదు వందలు పలుకుతుందట కదా బావ.. గింత తేడా ఉంటదా? జర చూడున్రి. బతిమాలినట్టే అన్నడు యాదగిరి.
ఎవలన్నరు? హమాలి ఖర్చు, ట్రాక్టర్ కిరాయి, తరుగు ఇయన్నీ ఊకెనే ఎల్తయా? నీ ఒక్కడి కాడనే కాదు. ఊళ్లే నా ఆసాములు అందర్నీ అడుగు. ఒకటే ధర. ఇంకో మాట లేదు. తేల్చి చెప్పిండు రఘునాథం. విధిలేని పరిస్థితుల్లో తన ఏడాది రెక్కల కష్టాన్ని రఘునాథం చేతిలో ధారపోసిండు యాదగిరి. తరువాత తను తీసుకున్న పెట్టుబడి ఖర్చు లెక్క చూసిండు. అన్నీ పోను పదిహేను వేల రూపాయలు యాదగిరి చేతిలో పెట్టిండు. తన కాళ్ళ కింది భూమి కదిలి పోయినట్లు, తన కలల గూడు చెదిరి పోయినట్లు తీవ్ర ఆవేదనకు లోనయిండు యాదగిరి. తన కళ్ళ ముందట సైకిల్ పై తిరిగిన రఘునాథం పెద్ద భవంతి ఎట్ల కట్టుకున్నడో ఖరీదైన కారు ఎట్ల కొనుక్కున్నడో ఇన్నాళ్లు అర్థం కాలేదు గాని ఇప్పుడు లెక్క చూసిన తర్వాత యాదగిరికి ఒక స్పష్టత వచ్చినట్లయింది. బాధ, దుఃఖం, ఆవేశం, ఆవేదనతో శరీరం వణికిపోతోంది. ఎన్నుగర్ర విరిగిన గుడిసె లెక్క దేశానికి వెన్నెముక నేలపై కూలిపోయింది.
- సాగర్ల సత్తయ్య, 7989117415