Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాతిరి ఒంటి గంట అయితుంది. ఎవడో ఏమో ''మాయ లేదు.. మంత్రం లేదు..'' అని గట్టిగా ఒర్లిండు నేను నిద్రలకెళ్లి లేచి కూర్చున్న నా అంగి మొత్తం తడిసింది చెమటతో ఫ్యాన్ ఫుల్‌గా ఉన్నా. బయట చూస్తే ఎవ్వరు కనిపియ్యలే. ఎవడో నా నిద్ర చెడగొట్టిండు అని తిట్టుకొని, ఆడి నుండి యింట్లకి పోయి నీళ్లు తాగి వచ్చిన. నీళ్లు తాగంగానే ఇంకా ఎక్కువ కారినరు చెమటలు కానీ ఆ చెమటలకు ఫ్యాన్ గాలి తాకగానే సల్లగా అయింది పెయ్యి అంత... ఇగ పందాం అంటే నిద్ర వొస్థలే ఎంత సేపు బొర్లినా. యాడనో పేపర్ల సప్పుడు అయింది నేను లైట్ యేసి చూసిన గూట్ల బుక్ ఫ్యాన్ గాలికి దాంట్లోని పేపర్లు ఎగురుతున్నారు. చూడడానికి చాలా పాత బుక్లా ఉంది. నా చేతిలోకి తీసుకుని చదవడం మొదలు పెట్టిన. అదేదో మన రాష్ట్రంలో నిజాంలు పరిపాలించినప్పటి చరిత్ర అనుకుంటా...
చదువుతున్న కొది సేపటికి దాంట్ల ఒక సంఘటన అప్పట్ల నిజాంకి రాజన్న అనే ఉద్యమ కారుడు ఎదురు తిరిగాడంట. వాళ్ళు చేస్తున్న అన్యాయాలు అందరికి చెప్పే ప్రయత్నం చేసాడంట. అతనికి ఎంత ధైర్యమో నిజాంకే వ్యతిరేకంగా నిలబడ్డాడు అంటే.. అని అనుకున్నా. ఆ తరువాత చదివిన కొద్దీ నాలో ఏదో తెలియని బాధ అలుముకుంది... పాపం అతన్ని రజాకార్లు నిర్దాక్షిన్యంగా అందరి ముందు కొట్టింరంట. ఆ దెబ్బలకు తట్టుకోలేక అతను అక్కడికక్కడే సచ్చిండంట. ఎంత దారుణమో అనుకుంటూ ఉండగానే మాయమ్మ నీళ్ళ కోసం లేచినట్టు ఉంది నన్ను గంత నాతిరి జూసి జడ్సుకుంది. ''ఏం రా పిచ్చిగిన లేసిందా గట్ల కుసున్నావ్''. నేను సమాధానం ఇచ్చేలోపే ''పడుకో సప్పుడు జేయకుండా'' అన్నది తిట్టినట్టు.
ఇగ నేను పడుకున్న ఎంత పడుకున్న నా దిమాక్‌ల ఆ రాజన్న సంగతే తిరుగుతుంది. మళ్ళీ ఎప్పుడు పన్ననో తెల్వదు నిద్రవోయిన. పొద్దున లేచిన, లేసి వార్తలు సదువుతుంటే దానిలో ఒక సంఘటన నాకు ఇలాంటి సంఘటన ఎక్కడో జూసినట్టు ఇనట్టు అనిపించింది. నిన్న సదివిన రాజన్న గుర్తుకొచ్చిండు. మొన్న రాజేష్ అనే ఎవరో ప్రభుత్వం చేసిన అన్యాయం బయట పెడతా అని రోడ్డెక్కితే పాపం అతన్ని చాలా కొట్టిన్రు పోలీసులు న్యూసెన్స్ చేస్తున్నాడు అని. ఎంతగనం అంటే ఆ దెబ్బలకి తట్టుకోలేక అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు అతను. అది ఏదో తెల్వక తాకింది అని కేస్ కొట్టేసిన్రు అంట మళ్ళా. ఆ వార్త చదవగానే చాలా బుగులయింది. నేను సదివింది నిజంగా అయింది ఏంది అని.. గుండె వేగం పెరిగింది నిన్న నాతిరి పట్టినట్టు చెమటలు పట్టినరు..
మా నాయిన అప్పుడే ఆఫీసుకి పోతూ నన్ను చూసి '' ఏం అయింది బేటా గట్లున్నవ్'' అన్నాడు.
''ఏం లే నాయిన ఏం లే'' అన్న చెమటలు తుడుచుకుంటూ మా నాయిన పోయిండు. వెంటనే వెళ్ళి ఆ పుస్తకంలో ఉన్నది అదేనో కాదో నిర్ణయించుకున్న. అచ్చు గుద్దినట్టు గట్లనే ఉంది.. నాకు చాలా భయం భయంగా ఉంది. పుస్తకం కింద పడేసి హాల్లోకి పోయిన కొద్దిసేపు ఆగి నేను మళ్ళీ నా రూమ్‌లోకి పోయి ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్న ఇంతలో మళ్ళీ ఎవడో ''మాయ లేదు.. మంత్రం లేదు..'' అన్నాడు. చూస్తే ఎవ్వడు లేడు. ధైర్యం తెచ్చుకుని ఇంకా ఆ పుస్తకంలో ఏం ఉందో సదివిన ఇంకో సంఘటన. ఎవరో సంగయ్య అనే పాలేరు దొర దగ్గర ఎప్పటి నుండో పని జేస్తుండట. అతను తన జీతం పోను మిగిలిన పైసలు వాళ్ళ కూతురు పెళ్లికి వొస్తారు అని ఆ దొర దగ్గరనే ఉంచుమని చెప్పి దాచేవాడు. ఒక దినం వాళ్ళ కూతురుకి మంచి సంబంధం ఖాయం అయింది అని దొరని వచ్చి ''దొర మీ దగ్గర జీతం పోను దాచిన పైసలు ఇస్తే నా కూతురి పెళ్లి జేస్తా'' అన్నాడు. అంతే దొర కోపం తెచ్చుకొని కండ్లెర్ర జేసి ''ఏం రా సంగయ్య నాకాడ నువ్వెప్పుడు పైసలు పెట్టినవ్ రా'' అన్నాడు. సంగయ్యకి ఏం అర్థం కాలే ''అయ్యా కూలి జీతం పోను మిగిలిన పైసలు మీ దగ్గరే ఉంచుమని చెప్పిన కదా అయ్యా'' దొర పక్కనున్న గుమస్థాని చూస్తూ ''ఏం గుమస్తా వీడు నా దగ్గర ఏమో పైసలు పెట్టిన అంటుండు నీకేమైనా ఎరకనా'' అన్నాడు సైగ చేస్తూ.
ఆ గుమస్తా ''అదేం లేదయ్యా పొద్దున పొద్దున కల్లు తాగిండేమో'' అన్నాడు.
ఇగ సంగయ్యకి అర్థం అయింది తన కష్టం గద్దలా తన్నుకు పోతున్నాడు అని ''దొర దొర నా పిల్ల పెళ్లి దొర గట్ల అనకయ్య'' అని సంగయ్య కన్ల నీళ్లు పెట్టుకొని బతిమిలాడుతున్నాడు ''దానికి పెండ్లెందుకు రా. నేను ఉన్న గదా నేను ఉంచుకుంటా పంపు దాన్ని సుఖపెడతా రా మంచిగా'' అని దొర గర్వ స్వరంతో నవ్వాడు గట్టిగా. ఇగ సంగయ్య కోపం ఆగవట్టలేక ''ఒరేరు దొర నీ దగ్గర కుక్కలెక్క ఊడిగం జేసిన గదరా నా పిల్ల పెళ్లికని దాచిన పైసలు ఇయ్యమంటే గిట్ల అంటవా'' అని దొర మీదికి పోయిండు.
ఒక్కసారిగా దొర కాలితో వాడి డొక్క మీద తన్నిండు. సంగయ్య ఎగిరి పడ్డాడు. అక్కడున్న దొర పైల్వాన్లు వాన్ని కొట్టి బయట పడేసిన్రు.
సంగయ్య ఇంటికి పోయే ధైర్నం చేయక అటు నుంచి అటే పోయి బాయిల దుంకి ఆత్మహత్య చేసుకున్నాడు..
ఇంతలో నాకు ఫోన్ వచ్చింది మా దోస్తు గాడు ''అరేరు ఎక్కడ ఉన్నావ్'' అని.
''ఇంట్లో ఉన్న'' అని చెప్పిన.
''తొందరగా మహేష్ వాళ్ళ ఇంటికి రా'' అన్నాడు.
''ఎందుకు'' అని అడిగిన వాళ్ళ నాయిన చనిపోయాడు అన్నాడు.
నేను వెంటనే వెళ్లిన వెళ్లే దారిలో ఒక దిక్కు సంగయ్య పాత్ర గుర్తొస్తుంది. ఇంకో దిక్కు అసలు మహేష్ వాళ్ళ నాన్నకి ఇంత సడన్‌గా ఏం అయిందో అని ఆలోచన. వాళ్ళ ఇంటికి పోయిన. అక్కడ అందరూ ఏడుస్తున్నారు. మొత్తం పరిసరప్రాంతం విషాదంలో మునిగిపోయింది. నేను పోయి మా దోస్తు గాని దగ్గర నిలవడ్డ..
''ఏం అయింది''అని అడిగాను. వాడు మెల్లిగా ''ఆత్మహత్య'' అన్నాడు. నాకు మైండ్ల గిర్రుమని సంగయ్య గుర్తొచ్చిండు. కొద్దిగా టెన్షన్‌తో ''కారణం ఏంటి'' అన్నాను. అంకుల్ పని చేసే కంపెనీలో వాళ్ళ కూతురి పెళ్లి కోసమని ూఖీ పైసలు ఉంచిండంట. ఇప్పుడు సంబంధం వచ్చింది పెళ్లి చేద్దాం అని పైసలు ఇయ్యమంటే అసలు నీకు ూఖీ ఎక్కడిది అన్నారంట. ఎక్కువ మాట్లాడితే కొట్టి పంపించారంట. ఆ బాధ భరించలేక చెరువులో దుంకి ఆత్మహత్య చేసుకున్నాడు అన్నాడు.
ఇది విన్న నాకు చెమటలు కారుతున్నారు. మొకంలో హావభావాలు మారిపోయినరు. నా గుండె వేగం అంతకంతకు పెరిగి పెరిగి పోతుంది. చివరి గా ''వాళ్ళ నాయిన పేరు ఏంది'' అని అడిగాను. వాడు ''సంగమేశ్వర్'' అన్నాడు.. ఇంకా నాకు భయం వెయ్యడంతో పాటు బాధ కలిగింది. అక్కడ కార్యక్రమం అయినంక ఇంటికి వెళ్ళాను. అక్కడ ఉన్నంత సేపు అసలు నేను ఎట్లా ఉన్ననో కూడా నాకు తెల్వదు. నేను అక్కడి నుండి పోయినక ఆ బుక్ తీయాలి అంటే బుగులు అయింది. ఆ బుక్‌లో మాయ ఏం అన్న ఉన్నదేమో అని నేను సదివిన విషయాలు నిజంగా జరగడం ఏంటి. అలా ఆ బుక్ చూస్తూ ఎంత సేపు కూసున్నానో నాకే తెల్వలే. ఇగ మా అమ్మ పిలిస్తే పోయి తిన్నా అది కూడా బలవంతాన. పందాం అని రూమ్‌లోకి వచ్చిన. మళ్ళీ ఆ బుక్ తీయకుండా ఉండలేకపోయాను. నాతిరి ఒంటి గంటన్నర అయితుంది. పక్క మీద పండి బొర్లుతూన్న కానీ నిద్ర ఒస్తలే బుక్ ఏమో పక్కనే ఉంది. మళ్ళీ అదే గొంతు తో ''మాయ లేదు.. మంత్రం లేదు..'' అని అరుపు.. ఈసారి ఉరికి చూసిన ఎవ్వడు లేడాయే మళ్ళా.. బుగులు తోనే ఒకసారి చదివి దాని సంగతేందో చూద్దాం అని వణుకుతున్న చేతులతో బుక్ తీసుకున్న. అది ఎవరు రాసినరో అని చూసిన. ఆ బుక్ చాలా పాతది దాంట్లో గట్లాంటి వివరాలు ఏం లేవు. మళ్ళీ సదువుడు షురూ చేసిన అప్పట్ల ఒక దొర బాగా పైసలు ఉండి ఊర్ల అందరినీ అతని గుప్పిట్లో ఉంచుకునేటోడంట. అతనికి ఒక కొడుకు వాడు చాలా దుర్మార్గుడు. వాడికి నచ్చినట్టు చేసేటోడంట. ఒకరోజు బయటకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద మనిషి దారిల ఉంటే నా బండికే అడ్డం వస్తడా అని వాన్ని బండితో తొకించి చంపాడంట. ఇది చదవగానే ఇంకా బుగులు అయింది. అట్లా రేపు ఏం అయితదో అని అప్పటికే అలసిపోయి ఉన్న అట్లనే ఒరిగిన నిద్ర ఒచ్చింది. పొద్దున లేచి న్యూస్ పేపర్ చూసా అలాంటి న్యూస్ ఏం లేదు. హమ్మయ్య అనుకున్న.
మా అమ్మ ''ఈ రోజు ఎక్కడికో వెళ్తా అన్నావ్ కదా రా'' అని అడిగింది కాఫీ ఇస్తూ ''పోతున్న అమ్మ'' అని నేను కాఫీ తాగేసి రెడీ అయ్యి పోయిన. మా దోస్తు కోసం సూస్తున్నా. ఇంతలో ట్రాఫిక్ సిగల్ పడింది అని కొంతమంది రోడ్డు దాటుతున్నారు. నాకు మళ్ళీ నిన్న చదివిన సంఘటన గుర్తొచ్చింది. అక్కడ నడిచే వాళ్ళన్నీ గమనించి చూసా. ముసలి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఎవరు కనపడలేదు. మళ్ళీ వెంటనే వాళ్ళ అందరి వెనక ఎవరో వస్తుంటే చూసిన. ఒక పెద్దాయన మెల్లిగా రోడ్డు దాటుతున్నడు. నాకు భయం వేసింది. అతన్ని దబాల్న రోడ్డు దాటించాలి అని ఉరికిన. ఇంతలో ఒక పెద్ద కార్ మస్తు వేగంగా వచ్చి ఆ పెద్దాయనను గుద్దేసింది నా కన్ల ముందు. నేను అలాగే ఆగిపోయిన ఆ క్షణం. నన్ను నూక్కోని చాలా మంది అతని దగ్గరకు వెళ్లారు కానీ నాకు ఏం జెయ్యాల్నో అర్థం గాక అట్లనే ఉండిపోయిన. ఆ తరువాత మా దోస్తూగాడు ఒచ్చి నన్ను అక్కడి నుండి తీసుకుపోయిండు. ఇంటికి వెళ్ళాక రెండు రోజులకి ఆ ఆక్సిడెంట్ చేసినోడు బాగా డబ్బున్నోడు అయ్యేసరికి వాడిని ఎవ్వరూ ఏం చేయలేక పోయిన్రు అని వార్తల్లో చెప్పగా విన్నా. అప్పుడు ఆ బుక్ పైన కోపం వచ్చింది దాన్ని కాల్చేయాలి అనుకున్న. నా వల్లే ఆ రోజు ఆ పెద్దాయన చనిపోయాడు అని కుంగిపోయాను కానీ తరువాత ఏం జరుగుతుందో అన్న ఆందోళన.
ఒకరోజు నాతిరి 9 గంటలకు ఆ బుక్ మళ్ళీ తీశాను. మళ్ళీ అదే సౌండ్ ''మాయ లేదు.. మంత్రం లేదు..'' అని. వాడు ఎట్లా అయిన బయటకుపోతే ఉండడు మనసులనే తిట్టుకున్న. చేతులలో బలం లేకపోయినా పట్టుకున్న ఆ బుక్‌ని గుండె నిబ్బరం జేసుకొని చదువుతున్న ఈసారి సంఘటనకి నాకు వొళ్లంతా జలతరించింది నిజాం రాజ్యంలోని రజాకార్లు ఊర్ల మీద పడి దోచుకునేటోళ్లు. అట్ల ఒకనాడు పట్టపగలు రోడ్డు మీన తాగి ఉన్న రజాకార్లు ఒక అమ్మాయిని అతిదారుణగా మానభంగం చేసింరంట. తర్వాత ఆ అమ్మాయిని కాల్చి బూడిద జేసిన్రు అని ఉంది. ఆ సంఘటన చదువుతుంటేనే నాకు కన్ల నుండి నీళ్ళు కారుతూనే ఉన్నారు. ఇంతట్ల హాల్ నుండి మా నాయిన టివి సౌండ్ ఎక్కువ పెట్టిండు నేను ''ఏంది మీ లొల్లి'' అని వెళ్ళిన. వెళ్ళిన నేను నిర్ఘాంతపోయాను. నా చేయిలకెళ్లి బుక్ జారిపోయింది. నేను ఉన్నటుండి కూలవడ్డ. మా అమ్మ నాయిన ''ఏం అయింది రా'' అని నా దగ్గరకు వచ్చారు. నేను మాత్రం టివి లో వచ్చే న్యూస్ చూస్తూ ఉన్న ఆ న్యూస్‌లో ఒక అమ్మాయిని మానభంగం చేసి కాల్చేసి రింగ్ రోడ్డు పక్కన పడేసిన్రు అని వస్తుంది. నేను మూర్ఛపోయిన. ఇగ జరిగిన సంగతి అంతా మా అమ్మ నాయినకి చెప్పిన. మా అమ్మ నాయిన చాలా గుడిలకు తీసుకుపోయిన్రు. కానీ నేను ఆ డిప్రెషన్ నుండి బయటకు రాలేక పోయాను. నేను ఆ బుక్‌ని ఎప్పుడు నా వెంబడే ఉంచుకుంటుండే మళ్ళా దాంట్లకెళ్ళి ఎవరైనా చదువుతే అది జరిగి ఎవరైనా చనిపోతారు అని. ఇంకా నా పరిస్థితి చూసి మా అమ్మ నాయినకి మా చుట్టాలు మానసిక వైద్యునికి చూపించండి అంటే మా వాళ్ళు డాక్టర్ దగ్గరకు తీసుకపోయిన్రు. అక్కడ ఉన్న డాక్టర్ నా పరిస్థితి అర్థం చేసుకొని ''అసలు నువ్ ఎందుకు అలా ఫీల్ అవుతున్నావ్'' అన్నాడు. నేను అన్న ''డాక్టర్ వాళ్ళు నా వల్లనే సచ్చిపోయిన్రు నేను ఆ బుక్ సదవకపోతే బ్రతికేటోళ్లు'' అన్నా.
డాక్టర్ చిన్నగా నవ్వి ''ఆ బుక్ ఇవ్వు'' అని అడిగాడు.
నేను ''వొద్దు డాక్టర్ నువ్ గిప్పుడు సదివితే దాంట్లో ఎవరో ఒకరు సస్తారు అది నిజంగానే అయితది'' అన్నాను.
ఆ డాక్టర్ బుక్ ఓపెన్ చేయకుండా ''ఇప్పుడు నేను ఆ బుక్ చదవకుండా దాంట్లో ఉన్న విషయం చెప్తా సూడు'' అని అన్నాడు. నేను సూద్దాం ఏం చేస్తాడో అని సూస్తున్న. అతని ముంగట టెబుల్ పైన ఉన్న న్యూస్ పేపర్ తీసి దాంట్లో ''దొంగ దగ్గర దోచుకున్న పోలీసులు'' అన్న న్యూస్ చదివి వినిపించాడు ఇప్పుడు ఇదే విషయం ఆ బుక్‌లో చూపిస్తా అని ఆ బుక్ ఓపెన్ చేసి అలాంటి సంఘటన ఒకటి చూయించాడు. అప్పట్లో దొరల కింద పని చేసే పోలీసులు కూడా ఎవడో ఊర్ల దొంగతనం చేస్తే వాణ్ని పట్టుకొని వాడి దగ్గర డబ్బు మొత్తం గుంజుకొని వాన్ని కొట్టి పంపించారు అని ఉంది. అప్పుడు డాక్టర్ నా దిక్కు సూస్తూ ''అలాంటి సంఘటనలు నిత్యం అవుతూనే ఉంటారు నువ్ వాటిని ఆ బుక్కి అన్వయించుకున్నావ్ అంతే'' అన్నాడు.
''కాదు డాక్టర్ నిజంగా ఏదో మాయ ఉంది. ఆ బుక్కి వాటిలో ఉన్న పేర్లే నిజంగా కూడా ఉన్నారు'' అని అన్న ముక్త కంఠంతో.
అప్పుడు డాక్టర్ ''అయిన ఈ కాలంలో కూడా మాయలు, మంత్రాలు అని భయపడతావ్ ఏంటి'' అని అన్నాడు.
''నిజం డాక్టర్'' అన్నాను నేను.
''అయిన నువ్వు నిద్రలో చదవడం దానికి తోడు నీకు ఆ పాత్రల పేర్లు నువ్వు చూసిన మనుషుల పేర్లు ఒకటే అవ్వడం నీకు అలా అనిపించింది'' అన్నాడు డాక్టర్.
నేను మౌనంగా ఉన్నాను.
మళ్ళీ డాక్టర్ నాతో ''నీకో విషయం చెప్పాలి రాజేష్ అనే వ్యక్తి ఇప్ఫడు కాదు చాలా సంవత్సరాల నుంచి అలాంటి వ్యతిరేక పోరాటాలు చేసాడు. మీ స్నేహితుని నాన్నకు మాత్రమే కాదు ఆ కంపెనీలో పని చేసే చాలా మందికి ూఖీ ఇవ్వలేదు. దాంట్లో చాలా మంది ఆ బాధతో కంగిపోయారు. నువ్వు చూసిన యాక్సిడెంట్ ఉంది చూడు వాడు ఇంతకు ముందు అలాంటివి చాలా చేసాడు. మొన్న చూసిన గ్యాంగ్ రేప్ అంటవా అది కూడా ఇలాగే కో-ఇన్సిడెంన్స్'' నేను అలా డాక్టర్ వైపు సూస్తనే ఉన్న. నాకు అంతకు ముందు జరిగిన సంఘటనలు అన్ని గుర్తుకు వచ్చాయి. అప్పుడు నాకు అనిపించింది డాక్టర్ చెప్పేది కూడా నమ్మే విధంగానే ఉంది అని. కొన్ని క్షణాలు శూన్యంలోకి వెళ్ళాను.. అప్పుడు అంతా అర్థమైంది. నేను బయటకు వచ్చాను. అప్పుడే ఒక పిచ్చి వాడు ''మాయ.. లేదు.. మంత్రం లేదు..'' అన్నాడు ఈసారి అది నాకు నిజంగా అనిపించింది. ఆ బుక్‌లో ఎలాంటి మాయ లేదు.. మంత్రం లేదు.. అవన్నీ ఆ నిరంకుశ పాలనలో జరిగినరు ఈ స్వతంత్ర సొంత రాష్ట్రంలో కూడా అయితున్నారు.. అసలు తేడా ఎక్కడ ఉంది.. అప్పుడు నేను ''అంటే మనకి దొరల కాలం పోయిన దొరల పాలన మాత్రం పోలేదు అంటే ఇప్పుడు మనది రాజాకార్లా కాలమేనా''.. ''అసలు ప్రత్యేక రాష్ట్రాన మనం సాధించిందేంటి'' అని మనసులో అనుకున్న. నా ముఖం పైనకి ఒక నిస్సహాయపు నవ్వు వచ్చింది.
(నాటి నేటి తెలంగాణ పరిస్థితులు ఒకే విధమైనవి)
- సాయికిరణ్ నేత (అసుర), 9533146760