Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నా చిన్నతనమంతా కష్టాలే.. నాన్న లేడు. అమ్మ పనికి వెళ్లి డబ్బులు తెస్తేనే ఆ రోజు గడిచేది. చాలా సార్లు మీ అమ్మ నీతో పాటు నాకు భోజనం పెట్టేది.. గుర్తుందా.. ఆకలే తీరని వాడికి చదువు ఎలా తలకెక్కుతుంది! ఎలాగో పది పూర్తి చేసి హైద్రాబాద్ వెళ్లి ఓ బిల్డర్ దగ్గర చేరిపోయా.. ఎలాగైనా జీవితంలో ఎదగాలని కసితో బతికా.. ఇరవై ఏళ్ల శ్రమించి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇదిగో ఇలా నీ ముందు వున్నాను.
నాన్న.. ఈ రోజు మా స్కూల్లో ఎం జరిగిందో తెల్సా! ఐదో క్లాస్ చదువుతున్న అఖిల్ అన్నాడు తండ్రి దివాకర్‌తో. పుస్తకం చదువుతున్న వాడల్లా కొడుకు వైపు తిరిగాడు.
మరేమో.. నాకు పది రూపాయల నోటు దొరికితే మా క్లాస్ టీచర్ రోజి మిస్కు ఇచ్చాను. మిస్ ''వెరీ గుడ్ బారు'' అంటు అందరి ముందు నాకు క్లాప్స్ కొట్టించింది.
చెపుతున్నప్పుడు కొడుకు కళ్ళల్లో గొప్ప పని చేశానన్న మెరుపు చూసి సంతోషపడ్డాడు తండ్రి.
చాలా మంచి పని చేశావు రా. మనది కానిది ఏది మనకొద్దు.. అంటు కొడుకును ముద్దాడి తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు మురిపెంగా.
భర్తకు టీ అందిస్తు అంది రూప... ఊరందరిది ఓ దారి.. ఉలిపి కట్టేది ఓ దారి. అందరికంటే ముందు వుండాలనే పోటీ ప్రపంచం ఇది. మీరేమో నీతి నిజాయితీ అంటూ పుస్తకాల్లో కనిపించే పదాల్ని వాడికి చెపుతారు. ఇలాగైతే రేపు వాడు ఎందుకు కొరగాకుండా పోతాడు.
భార్య మాటలకు దివాకర్ మనసు చివుక్కుమంది.
నీతి నిజాయితీ పనికిమాలిన మాటలా!.. లోకంలో మంచితనం మిగిలిందంటే అవి ఇంకా మనుషుల్లో ఉండబట్టే.
రూప నొసలు చిట్లించింది. ముందు మీ ఒంటిపై వున్న చిరుగుల బనీను చూసుకోండి. మీ స్నేహితులు, ఇరుగు పొరుగు ఎలా వున్నారో ఎప్పుడైనా పోల్చుకున్నారా! మీకేవి పట్టవు.. తొమ్మిదింటికి అఫీస్‌కు వెళ్లి ఐదింటికి రావడం. ఏదో పుస్తకం ముందేసుకుని కూర్చోవడం.. ఇంతేగా మీరు చేసేది అంది రూప.
నాన్న చెవులు మూసుకో.. అమ్మ మంత్రాలు చదవడం మొదలెట్టింది.
చెవులు మూసుకుంటున్న కొడుకును చూసి అంత కోపం లోను రూపకు నవ్వొచ్చింది. దొంగ భడువ.. వుండు నీ పని చెపుతా అంది. ఆమెను చూసి తండ్రి కొడుకు పెద్దగా నవ్వుకున్నారు. దివాకర్, రూపలది వేరు వేరు మనస్తత్వాలు. రూప అన్నిటినీ డబ్బుతోనే లెక్కిస్తుంది. కానీ దివాకర్ ఉన్నంతలో తప్తిగా బతుకుతూ నలుగురితో మంచిగా ఉండాలంటాడు. అతను చిట్‌ఫండ్ కంపెనీలో అకౌంటెంట్. ఇరవై వేల జీతం. ఆ కంపెనీలో ఓ చిట్స్‌లో చేరడంతో సగం జీతం పోను పదివేలు చేతికి వస్తాయి. వాటితోనే నెలంతా గడవాలి. కిరాణం, కూరగాయలు, వైద్య ఖర్చులు అంతా కలిపి తడిసి మోపడవుతోంది. ఆదాయం కోసం మరో మంచి ఉద్యోగం చూసుకొమంటోంది రూప. తను కూడా ఏదైనా జాబ్ చేస్తానంది. దివాకర్ దేనికి ఒప్పుకోడు.
ఆ రోజు హనుమాన్ జయంతి. వాళ్ళ వూరు పైడిపెల్లిలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చుట్టూ పది ఊళ్ళ జనం గుడి దగ్గరే వున్నారు. ఎంపి, ఎమ్మెల్యే లాంటి రాజకీయ ప్రముఖులు ఆ రోజు దర్శనంకు వస్తారు. ఉదయం దివాకర్ కుటుంబం దేవున్ని దర్శించుకున్నారు. గుడి అవరణలో వేసిన చలువ పందిళ్ళ కింద కూర్చున్నారు. భక్తుల రద్ది బాగా వుంది. దేవుని నామస్మరణతో పరిసరాలు మారుమోగు తున్నాయి. వాళ్ళ ముందు ఓ కారోచ్చి ఆగింది. దానిలో నుండి భర్త భార్య ఇద్దరు పాపలు దిగారు. అందరు ఖరీదైన దుస్తులు, నగలతో మెరిసిపోతున్నారు. ఆ కారు వ్యక్తి గుడిలోకి వెళ్ళబోతు దివాకర్ ను చూసి టక్కున ఆగిపోయాడు. ఆ వెంటనే అతని వద్దకొచ్చి పరిశీలనగా చూస్తూ.. నువ్వు.. నువ్వు.. దివాకర్వి కదూ! అన్నాడు సంభ్రమాశ్చర్యాలతో. దివాకర్ ఆశ్చర్యపోతూ అవును అన్నాడు. ఆ వ్యక్తిని ఎక్కడో చూసినట్టు అన్పించింది. నన్ను గుర్తు పట్టావురా.. నేనురా.. చందు గాన్ని అన్నాడు చనువుగా. సంతోషంతో దివాకర్‌ను గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. దివాకర్ జ్ఞాపకాల పొరల్లో మళ్లీ వెతికాడు.
చింపిరి జుట్టు, చిరిగిన బట్టలు.. ఎప్పుడూ ముక్కు కారుతూ వుండే బక్క పలచని రూపం తళుక్కుమంది. ఆ.. ఇప్పుడు గుర్తొచ్చింది.. చందు.. నువ్వురా.. అనబోయి మీరా అన్నాడు మర్యాదగా. మీరా ఏమిటిరా ఏరా.. ఒరేయి.. అను. మనం బాల్య మిత్రులం. వాళ్ళ ఆవిడ వైపు తిరిగి దివాకర్ అనే స్నేహితుడు వుండేవాడు, వాడొక్కడే నాతో మాట్లాడే వాడని చెప్పానే... వాడే వీడు అంటు పరిచయం చేశాడు. ఇక ఇద్దరూ చిన్ననాటి ముచ్చట్లలో పడ్డారు. ఆడవాళ్ళు పిల్లలు కల్సి పోయారు. భర్తకు ఇలాంటి స్నేహితుడు ఉన్నాడంటే నమ్మ లేకపోయింది రూప. ఊ.. చెప్పరా... ఎలా వున్నావ్.. నిన్ను చూసి ఎంత కాలమైంది రా! అన్నాడు చందు ఉత్సహంగా. అతని కలుపుగోలు తనానికి కాస్త ఫ్రీగా అయ్యాడు దివాకర్.
''నా చిన్నతనమంతా కష్టాలే.. నాన్న లేడు. అమ్మ పనికి వెళ్లి డబ్బులు తెస్తేనే ఆ రోజు గడిచేది. చాలా సార్లు మీ అమ్మ నీతో పాటు నాకు భోజనం పెట్టేది.. గుర్తుందా.. ఆకలే తీరని వాడికి చదువు ఎలా తలకెక్కుతుంది! ఎలాగో పది పూర్తి చేసి హైద్రాబాద్ వెళ్లి ఓ బిల్డర్ దగ్గర చేరిపోయా.. ఎలాగైనా జీవితంలో ఎదగాలని కసితో బతికా.. ఇరవై ఏళ్ల శ్రమించి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇదిగో ఇలా నీ ముందు వున్నాను. ఇప్పుడు అక్కడ నేనో ప్రముఖ బిల్డర్‌ని. కోట్ల ఆస్తి, పెద్ద బంగళా, కారు. గతం తలుచుకుంటే అంత ఏదో కలలా వుంటుంది రా అన్నాడు చందు. అతని కళ్ళలో తడి. దివాకర్ గురించి అంతా విని చిన్నగ నిట్టూర్చాడు. ఒరేయి.. ఒక్కటి గుర్తు పెట్టుకో.. డబ్బు వుంటేనే సమాజంలో గుర్తింపు, గౌరవం. ముందు దాన్ని సంపాదించడం నేర్చుకో అన్నాడు.
నిజమే.. నువ్వు సాధించావ్. కానీ నీలా ఎదగడానికి అవకాశం, అదష్టం కూడా కల్సి రావాలి అన్నాడు దివాకర్.
నువ్వు హైద్రాబాద్ వచ్చేయి.. అంతా నేను చూసుకుంటాను అన్నాడు చందు ధీమాగా.
దివాకర్ తల అడ్డంగా వూపి, మన ఇద్దరి ప్రపంచాలు వేరు. నువ్వింత గొప్ప స్థితిలో వుండి కూడా నన్ను గుర్తు పెట్టుకున్నావ్. అది చాలు నాకు అన్నాడు దివాకర్ తప్తిగా.
లేదు నీ పొజిషన్ మార్చుకో.. నా హెల్ప్ నీకు ఎప్పుడూ వుంటుంది అంటు తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు. మాట్లడుతున్నంత సేపు అతని సెల్ మోగుతూనే వుంది.
ఈ రోజంతా నీతో వుండాలని వుందిరా. కాని సాయంత్రం బిల్డర్స్‌తో మీటింగ్. వెళ్లక తప్పదు. మనం మళ్లీ తప్పక కలుద్దాం అంటు దివాకర్ మొబైల్ నంబర్ తీసుకొని చక చక దర్శనం వైపు వెళ్ళిపోయాడు.
ఇంటికి వెళ్ళాక రూప సైలెంట్ అయింది. దివాకర్ పిలిచిన పట్టించుకోలేదు. ''రూప నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెల్సు.. అందరు చందులా అవలేరు... వదిలేయి'' అన్నాడు
అప్పటి దాకా రూపలో వున్న ఆవేశం, దుఃఖం పొంగి పోర్లింది. ''మీరు మారకండి.. నేను నా కొడుకు అడుక్కు తింటాం.. ఎందుకు కొరగాని మీ మిత్రుడు మీరే గుర్తు పట్టనంతగా ఎదిగాడు. ఆయన భార్యను చూశారా! ఒంటి నిండా బంగారమే. ఇక నా వల్ల కాదు. హైద్రాబాద్ వెళ్లి మీత్రున్ని కలుస్తారో, మరేదైనా జాబ్ వెతుక్కుంటారో మీ ఇష్టం.. నెల రోజుల్లో ఏదో ఒకటి చెయ్యకపోతే అఖిల్‌ను తీసుకొని మా పుట్టింటికి వెళతానంటు'' బెదిరించింది రూప.
ఆ రాత్రంతా దివాకర్ నిద్ర పోలేదు. చెప్పులో రాయి, చెవిలో జోరీగ, ఇంట్లో ఇల్లాలి పోరు... చందు, రూప ఇద్దరు డబ్బే ప్రపంచం అంటున్నారు. అది వుంటే జీవితం ఎలా వుంటుందో నిజంగానే చందు చేసి చూపించాడు. తను మాత్రం అన్నింట్లో సర్దుకుపోవడం, రాజీపడడం చేస్తున్నాడు. ఇలా ఐతే తన కొడుక్కి మంచి భవిష్యత్తు ఇవ్వగలడా! చందు పిల్లల్లా తన కొడుకును చదివించి గొప్ప స్థాయికి తేగలడా!! లేదు లేదు అంటు మనసు తొలిసారిగా అతనికి ఎదురు తిరిగింది. చేతకాని తనం అంది. తన చుట్టూ వున్న ప్రపంచం ఓ వైపు... తను తన కొడుకు మరో వైపు ఒంటరి పక్షుల్లా బిక్కుబిక్కుమంటున్నట్టు తోచింది. తెల్లారే వరకు ఇవే ఆలోచనలు కందిరీగల్లా అతన్ని చుట్టుముట్టాయి.
నెల రోజులలోపే ఇరవై వేలు తెచ్చి రూప చేతిలో పెట్టాడు దివాకర్. ఇంత డబ్బు ఎక్కడిదండి! మెరిసే కళ్ళతో వాటిని కళ్ళకు అధ్దుకుంది రూప.
ఎక్కడిదైతే ఎందుకులే. దొంగతనం చెయ్యలేదు అన్నాడు దివాకర్ వెటకారంగా. ఆ మాటలకు చిన్న బుచ్చుకుంది. అవి ఓ ప్లాట్ అమ్మిపెడితే వచ్చిన కమిషన్! తన ఒక నెల జీతం. అందుకే ఆమెలో అంతా ఆశ్చర్యం! నాన్న అంటు అఖిల్ రావడంతో కొడుకును దగ్గరకు తీసుకొని చేతిలో స్వీట్ బాక్స్ పెట్టాడు. దివాకర్ టైం టేబుల్ మారింది. అఫీస్ నుండి రాగానే ప్లాట్ల డాక్యుమెంట్లు ముందేసుకుని పోన్లు చేస్తాడు. బైటికెల్లి లేటుగా వస్తాడు. ఒక్కోసారి పొద్దున్నే ఎవరో వచ్చి కార్లో తీసుకెళ్లే వారు. భూముల మార్కెట్ విలువ పై అవగాహన, మాటకారితనం, సర్కిల్ పెంచుకోవడంతో కొద్ది కాలంలోనే రియల్ ఎస్టేట్ రంగంపై పట్టు సాధించాడు. సిటీలోని ఒకరిద్దరు బ్యాంక్ మేనేజర్లతో మంచి సంబధాలున్నాయి. దాంతో కమిషన్‌తో ప్లాట్లు అమ్మి పెట్టడంతో మొదలైన దివాకర్ ప్రస్థానం ఐదేళ్లు తిరక్కుండానే బ్యాంక్ లోన్లతో సిటీలో రెండు చోట్ల అఖిల్ అపార్ట్మెంట్లు కట్టి లక్షలు ఆర్జించాడు. ఉద్యోగం ఎప్పుడో మానేశాడు. వూరి నుండి సిటీకి మారాడు. పెద్ద ఇల్లు, కారు కొన్నాడు. రూప ఒంటి మీదికి నగలోచ్చాయి. ఆమె ఆనందానికి అంతే లేదు. నగలు అలంకరించుకొని గంటల కొద్ది అద్దం ముందు కూర్చుంటోంది. అఖిల్ ఆ సిటీలో టాప్ వన్ స్కూల్లో చదువుతున్నాడు. అతనిప్పుడు పదో క్లాస్. మొదటి నుంచి వాళ్ళ నాన్నంటే చాలా ఇష్టం. అతను చెప్పే మాటలు, కథలు మరీ ఇష్టం. కానీ ఇప్పుడు నాన్న తనతో మునుపటిలా వుండడం లేదు, దగ్గరికి తీసుకోవడం లేదు. ఎప్పుడూ తను నిద్ర పోయాకే వస్తాడు. అమ్మ షాపింగ్ లంటు బైటికెళ్ళిద్ది. అఖిల్ పనులన్నీ వంట మనిషి చేసి పెడుతోంది. అతనిలో ఆలోచనల్ని, సంతోషాలను షేర్ చేసుకునే వారు లేక అమ్మ నాన్న తీరు అర్థంకాక గందరగోళంలో పడ్డాడు. క్రమంగా ఒంటరితనం, దిగులు అలుముకున్నాయి. లంకంత కొంప. ఎవరి గదులు వాళ్ళవి. అఖిల్ బస్‌లో స్కూల్‌కి వెళ్లి రావడం, హౌం వర్క్ చేసి కొంతసేపు టీవీ చూశాక బోర్ కొట్టేది. గదిలోకి వెళ్లి తలుపేసుకొని తన ఒంటరితనానన్ని గుర్తు చేసుకొని వెక్కివెక్కి ఏడ్చేవాడు. అలా ఏడుస్తూనే నిద్రలోకి జారుకునే వాడు. స్కూల్లో ఒకరిద్దరు పిల్లలు అతనితో బాగా వుండేవారు. వాళ్ళు రహస్యంగా ఫోన్లు తెచ్చుకొని గేమ్‌లు ఆడేవారు. అలా ఆడడం తప్పని గతంలో నాన్న చెప్పడంతో చాలా రోజులు వాటి జోలికి వెళ్లలేదు. కానీ ఓ రోజు మనసంతా చిరాగ్గా వుండడంతో వాళ్ళు ఆడే గేమ్ చూశాడు. అతనికి చాలా నచ్చింది. ఇక వాళ్ళతో పాటు తాను కూడా ఆడడం మొదలెట్టాడు. సెలవు రోజుల్లో తల్లిని డబ్బులు అడిగి ఆ స్నేహితులకు బేకరి ఫుడ్ తినిపించేవాడు. గేమ్‌లు ఆడుతూ ఆ రోజంతా ఎంజారు చేసేవాడు. కానీ ఎక్కడో తప్పు చేస్తున్నానన్న ఫీలింగ్ కలిగేది. కానీ ఎప్పుడూ సరదాగా, సందడిగా వుండడంతో ఇక ఇదే తన ప్రపంచం అనుకున్నాడు. ఆన్లైన్ క్లాసుల కోసం ఖరీదైన మొబైల్ కొన్నాడు దివాకర్. అఖిల్ ఆనందం అంతా ఇంతా కాదు. యూట్యూబ్, వాట్సప్, ఫేస్ బుక్ లతో బిజీ బిజీ.
వాడు ఎప్పుడూ ఫోన్‌తోనే కనిపిస్తున్నాడు గమనించావా అన్నాడు దివాకర్ భార్యతో. ఇప్పుడు చదువంతా దానిలోనే కదండీ. వాడు బంగారమండి అంది రూప. అప్పుడప్పుడు దివాకర్ రిపోర్ట్ కార్డు చూసి మార్కుల తక్కువ గురించి అడిగేవాడు. అఖిల్ ఏవో సాకులు చెప్పేవాడు. తన రూంలో ఎప్పుడూ సెల్‌తో గడిపేవాడు. చూస్తుండగానే ఐదేళ్లు కాల ప్రవాహంలో కొట్టుకు పోయాయి. అఖిల్ చదువు సహజంగానే కొండేక్కింది. పదోక్లాస్, ఇంటర్ అత్తెసరు మార్కులతో బైటపడ్డాడు. పేమెంట్ కోటాలో బీటెక్‌లో చేరి సెమిస్టర్లన్నీ ఫెయిలయ్యి ఇంట్లో కూర్చున్నాడు. ఇక చదవనని మొండికేశాడు.
చదువు తోనేరా విలువ.. మంచి జాబ్.. లైపంత హాయిగా బతికేయచ్చు అన్నాడు దివాకర్ బాధగా.
ఇప్పుడు నాకు అన్నీ వున్నాయి. చదువు నా ఒంటికి పడదు. నన్ను ఒదిలేయండి అన్నాడు అఖిల్ కరాఖండిగా.
కనీసం బీటెక్ పూర్తి చేయి.. నచ్చ చెప్పాడు దివాకర్. ససేమిరా అన్నాడు అఖిల్. కోపంతో చెయ్యి ఎత్తబోయిన తండ్రి వైపు ఉరిమి ఉరిమి చూశాడు. రూప కంగారు పడింది. ఒక్క క్షణం ఎత్తిన చెయ్యి దించి విసురుగా బైటికెళ్ళి పోయాడు దివాకర్. కారులో వెళుతు కొడుకు తన వైపు చూసిన చూపులు గుర్తు చేసుకున్నాడు. అవి అతని మనసుని సూదుల్ల గుచ్చుకో సాగాయి. వాడి చూపులు అలా నిరసనగా వున్నాయి ఏంటి!.. ఇన్ని రోజులూ ఈ డబ్బు, ఆస్తి చూసి రూపలాగానే వాడు కూడా సంతోషంగా ఉన్నాడనుకున్నాను. కానీ అలా లేడు... వాని విషయంలో తప్పు చేశానా!! చాలా సంవత్సరాల తర్వాత దివాకర్‌లో అంతర్మధనం మొదలైంది. చిన్నారి అఖిల్‌తో తన మధుర స్మతులు ఒక్కొక్కటి గుర్తొచ్చి అతని గుండె చెరువైంది.
అఖిల్ విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తున్నాడు. ఫ్రెండ్స్‌తో పార్టీలంటూ లేటుగా వస్తున్నాడు. తల్లి నిలదీస్తే ఇంట్లో నుంచి వెళ్లిపోతానని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు తనేం చెయ్యాలి!.. భర్తతో చెబితే గొడువ. ఇలా భయపడి దాచడమే తన కొంప ముంచిందా!! కొడుకును ఎలా చక్కదిద్దాలో అర్ధంగాక లోలోపల చాలా నలిగి పోయింది రూప. చివరికి ఆలోచించి పెళ్ళి చేస్తే మారుతాడనుకొంది. భర్తతో మాట్లాడింది.
''వాడికి చదువు లేదు, ఇంకా సెటిల్ కాలేదు. పెళ్ళి ఎలా చేస్తాం!'' అన్నాడు దివాకర్.
ఇప్పుడు వాడికి పాతికేళ్ళు. ఈ కోట్ల ఆస్తికి వాడే ఏకైక వారసుడు. ఇంతకంటే ఏం కావాలి! మొన్న ఫంక్షన్లో ఓ అమ్మాయిని చూశాడు. అదే ప్రసాదరావు గారి అమ్మాయి శతి. వాడికి నచ్చింది. ఓ సారి వాళ్ళను అడిగి చూడండి అంది రూప.
దివాకర్ ఆలోచించి... సరే..సరే.. అలాగే చేస్తాను. కానీ ఓ కండీషన్. వాడు మన చిట్‌ఫండ్ కంపెనీ వ్యవహారాల చూసుకోవాలి. నువ్వే వాడిని ఒప్పించాలి. అబ్బాయి ఏం చేస్తాడంటే మనం కూడా ఆన్సర్ చెయ్యాలి కదా అన్నాడు.
సరేనంది రూప సంతోషంగా.
శతి అందమైన, తెలివైన అమ్మాయి. ముగ్గురు ఆడపిల్లల్లో తనే పెద్దది. తండ్రి ప్రసాదరావు అర్ధాంతరంగా చనిపోవడంతో తల్లి అన్ని కష్టాలకు ఓర్చి పిల్లల్ని బాగా చదివించింది. ప్రస్తుతం శతి హైదరాబాద్‌లో మంచి ప్యాకేజీతో సాప్ట్వేర్ జాబ్ చేస్తుంది. తల్లి ద్వారా అఖిల్ విషయం తెలుసుకొని బాగా ఆలోచించింది. మరుసటి రోజు ఓకె చెప్పింది. ముహూర్తాలు కూడా కుదరడంతో శతి అఖిల్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సిటీలోని ప్రముఖులంతా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇకనైనా కొడుకు ప్రెండ్స్ అంటూ బయట తిరగకుండా ఇంటి పట్టున వుంటే అంతే చాలనుకుంది రూప. అన్నట్టుగానే అఖిల్ రోజూ ఆఫీస్‌కి వెళ్ళడం, సాయంత్రం ఇంట్లోనే వుంటు భార్యతో కబుర్లు చెప్పడం చూసి అనందించింది. కొద్ది రోజుల తర్వాత వున్నట్టుండి దివాకర్‌ను ఒక్కసారిగా ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. చాలా ఏళ్ళు విపరీతంగా శ్రమించడంతో బీపీ షుగర్ కిడ్నీ సమస్యలు తలెత్తాయి. డాక్టర్లు పూర్తి విశ్రాంతి కావాలన్నారు. దాంతో దివాకర్ ఆందోళన పడ్డాడు. ఇంతకాలం అన్ని తానై చూసుకున్నాడు. తను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ''అఖిల్ హౌమ్స్'' లో ప్లాట్ల అమ్మకాలు మొదలయ్యాయి. ఇప్పుడిలా తను బెడ్ మీద వుండి పోతే ఎలా! అఖిల్‌కు చిట్‌ఫండ్ వ్యవహారాలే కష్టంగా ఉన్నాయి. అందుకే తప్పని పరిస్థితుల్లో కోడలు శతి సాయం కోరాడు.
ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్న శతి వచ్చిన అవకాశాన్ని అందుకోంది. స్వంతంగా తెలివైనది కావడంతో అఖిల్ హౌమ్స్ తో పాటు క్రమంగా అన్ని ఆర్ధిక వ్యవహారాల్లో పట్టు బిగించింది. నాలుగు నెలల విశ్రాంతి తర్వాత దివాకర్ ఆరోగ్యం కుదుటపడింది.
ఓ రోజున ''మేం పైడిపెల్లి నుండి వచ్చమమ్మా.. దివాకర్ గారిని కలవాలి'' అంటు ఉత్సవ కమిటీ వాళ్ళు వచ్చారు. శతి వాళ్ళను కూర్చోమంది. దివాకర్ వచ్చి అందరినీ ఆత్మీయంగా పలకరించాడు. ఊరు గురించి, ఉత్సవాల గురించి అడిగాడు. అప్పటికప్పుడు చెక్ బుక్ తీసి లక్ష రూపాయలు రాసి వారికి అందించాడు.
''మీరు ధర్మాత్ములు బాబు.. పది సంవత్సరాలుగా మన ఊరి ఉత్సవాలు ఘనంగా జరగడానికి తోడ్పడుతున్నారు'' అంటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కుటుంబసమేతంగా ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు.
ఆ రాత్రి బెడ్ రూం లో భర్తను నిలదీసింది శతి.
ఏంటండి మామయ్య గారు.. అలా లక్షల లక్షలు దానం చేసుకుంటూ పోతే ఇక మనకేం మిగులుతుంది.
ఓ.. అదా.. ప్రతి సంవత్సరం నాన్న ఆనవాయితీగా ఇచ్చేదే కదా! అన్నాడు అఖిల్.
మరీ ఇంతలా డబ్బు దుబారా చేస్తారా ఎవరైనా? శతి అంది.
ఇంటికొచ్చిన వారితో మొఖం మీద లేవని చెప్పలేం కదా... పైగా దేవుడి కోసం అన్నాడు అఖిల్.
పది సంవత్సరాలుగా పది లక్షలు... అమ్మో అంది గుండెలు బాదుకుంటూ.
మరి ఇప్పుడు ఎం చేయాలి!... వెళ్లి నాన్నను నిలదీయమంటవా!! అన్నాడు కోపంగా.
అతని స్వరం పెరగడం చూసి శతి తగ్గింది. గట్టిగా ఒత్తిడి చేస్తే చెల్లెళ్ళ పెళ్ళి కోసం తను వాడుకున్న డబ్బుల లెక్కలు అడుగుతాడనుకుంది. అప్పుడు ఊరుకుంది కానీ తర్వాత చెయ్యాల్సింది అంతా చేసింది.
''అవునమ్మా నాన్న వథాగా డబ్బు తగలేస్తున్నారు. ఆయనకు నువ్వు గట్టిగా చెప్పాలి... అంతేకాదు.. ఇక ఆస్తులన్నీ నా పేరున రాయించాలి అన్నాడు అఖిల్.
కొడుకు నోటి వెంట ఆ మాటలు విని షాక్ తింది రూప. అదేమిట్రా.. అలా అనేశావ్.. ఉన్నదంతా నీదే కదా! అంది.
అడిగిన వాళ్ళందరికీ దానం చేసుకుంటూ పోతే ఇక నాకేం మిగులుతుంది.. చిప్ప.. నిష్టూరంగా అన్నాడు అఖిల్.
ఇది వీడికి పుట్టిన బుద్ది కాదు, కోడలు పని. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కోరిందట అంటు భాద పడింది.
రెండు రోజుల తర్వాత తల్లితో ఓపెన్‌గా చెప్పేశాడు. నువ్వేమో నాన్నని అడగవ్.. శతి రోజు నన్ను చంపుక తింటోంది. ఇవన్నీ భరించే కంటే నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతా అంటు బ్లాక్ మెయిలింగ్ అస్త్రం వదిలాడు. అది పని చేసింది.
దివాకర్ తన్ గదిలో డాక్యుమెంట్లు చూస్తున్నాడు. రూపను చూసి ఇలా వచ్చి కూర్చో అన్నాడు. ఆమె కొడుకు విషయం చెప్పబోతుంటే అఖిల్ మాటలు నేను విన్నాను.. ఎప్పటికైనా ఈ ఆస్తి వాడిదేగా.. ఇచ్చేస్తే ఓ పనై పోతుంది. ఇవి మన ఆస్తులకు సంబంధించిన పత్రాలు. నేను సంతకం చేశాను.. నువ్వూ చేసెరు అన్నాడు. ఆయన కళ్ళలో కన్నీటి పొర. భర్తను చూస్తూ వస్తున్న దుఃఖాన్ని దిగమింగి వణికే చేతులతో సంతకం చేసింది.
''రూపా... ఇక ఈ ఇంట్లో నా స్థానం మారింది. ఈ డబ్బు, హౌదా నాకు తప్తిని ఇవ్వలేకపోయాయి. ఎందుకంటే వీటి మాయలోపడి నా ప్రియమైన అఖిల్‌ను దూరం చేసుకున్నాను. వాడి భవిష్యత్ నిర్మించడానికి కోట్లు కూడ బెట్టాను.. కానీ వాని వ్యక్తిత్వ నిర్మాణాన్ని పది రూపాయల నోటు దగ్గరే ఆపేశాను. నిన్ను సంతోష పరచి భర్తగా గెలిచానేమో... కానీ ఓ తండ్రిగా ఘోరంగా ఓడిపోయాను'' ఉబికివస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ అన్నాడు దివాకర్.
లేదండీ. మీరు అలా అనకండి . పాపిష్టి దాన్ని. అన్నింటికీ నేనే కారణం. దయచేసి నన్ను క్షమించండి అంటు భర్త కంట నీరు తుడుస్తూ అతని భుజాలపై వాలి వలవలా ఏడ్చింది రూప. మరుసటి రోజు లేచేసరికి ఆమెకు భర్త కన్పించలేదు.
దివాకర్ వాళ్ళ వూరి గుడి వద్ద కూర్చున్నాడు. ఉత్సవాలకు మరో రెండు రోజులుంది. గుడిని ముస్తాబు చేస్తున్నారు. తెల్లని గెడ్డం, మాసిన దుస్తులతో కొళాయి దగ్గర నీళ్ళు తాగుతున్న వ్యక్తిని చూశాడు. ఇద్దరి చూపులు కలిశాయి. వెంటనే అతను చూపు తిప్పుకొని వెళ్ళబోయాడు.
దివాకర్ వడివడిగా వెళ్లి చెయ్యి అందుకొని చందు అన్నాడు ఆశ్చర్యంగా. అంతే.. దివాకర్‌ను పట్టుకొని భోరు మన్నాడు చందు.
''ఏం చెప్పమంటవురా! అంతా నా తల రాత. నా భార్య చనిపోయింది. కూతుళ్ళు అల్లుళ్ళు ఏకమై నన్ను నమ్మించి నా ఆస్తులన్నీ లాగేసుకుని ఇంట్లోంచి గెంటేశారు. ఫోన్ కూడా వాళ్ళ దగ్గరే వుండి పోయింది. కట్టుకున్న భార్య పోయింది.. సంపాదించిన ఆస్తి దూరమైంది... వైకుఠపాళిలో లాగా ఎక్కడ నుంచి బయలు దేరానో తిరిగి అక్కడే వచ్చి పడ్డాను'' అన్నాడు దీనంగా.
చందును ఓదార్చాడు దివాకర్. ''మనం పిల్లలకు ఆస్తులు ఇచ్చాం.. అలా ఇవ్వడం మహా గొప్ప అనుకున్నాం... కానీ వాటి మాయలోపడి వారికి వ్యక్తిత్వాలు, విలువలు నేర్పడం మర్చిపోయాం. చాలా మంది తల్లిదండ్రులు ఇలాగే చేస్తున్నారు. ఇదిగో ఇలా చివరి దశలో మనలా రోడ్డున పడుతున్నారు. మనం ఇవ్వగలిగే నిజమైన వారసత్వ సంపద, కేవలం అస్తులే కాదు. మంచి వ్యక్తిత్వం, విలువలు పిల్లలకు అందించడమే. ఇతరులతో ప్రేమ, సహనం తో మెలగడం వారికి నేర్పాలి. చివరగా సంపాదన మత్తులో మునిగి తమ పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తున్న ఎంతో మంది తల్లితండ్రులకు మన జీవితాలు ఒక పెద్ద గుణపాఠం'' అన్నాడు దివాకర్ విచారంగా.
- కశివొజ్జల భాస్కరాచారి