Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఈ యడాది కూడా. చెట్లు గట్లనే ఉన్నరు కల్లు పడేది రెండు, మూడు చెట్లే మీకు రోజు కల్లు ఉత్తగా పోస్తే నాకు పూట గడవదు పటేలా'' అని దినంగా అన్నాడు. వెంటనే పటేల్‌కి రేషం పొడుసుకొచ్చింది.! ''ఎం రా... నాకొక్కనికి పోస్తానే ని సొమ్ము మొత్తం పోతుందా రా.?'' ''నాకే ఎదురు తిరిగుతున్నావ్ నీ దందా ఎట్లా నడుస్తాదో చూస్తా బిడ్డా '' అంటూ లుంగి పైకి ఎత్తి కట్టుకుంటు పొలంకి పోయిండు పటేల్.
ఎర్రటి ఎండా, సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఇంటిముందు ఉన్న గన్నేరు చెట్టు నీడలో కోలాపై నేర్సు (పాలరాతి పొడి) వేసి నిష్ఠగా 'ఉలి'ని నూరుతున్నాడు రామగౌడు.
పొడవాటి కట్టేను చేత్తో పట్టుకొని ఇంట్లో నుంచి గులుగుతూ రామగౌడు దగ్గరకు వచ్చాడు వాళ్ళ తండ్రి ఎల్లా గౌడు.
రామగౌడును చూస్తూ
''వొద్దు బిడ్డా పటెండ్లతో కయ్యం పెట్టుకునుడు మంచిది కాదురా..''
''మన 'దందా' లాస్ అయితది వొద్దు బిడ్డా నా మాట ఇను రా''
అని చెప్తున్నాడు ఎల్లాగౌడు.
''ఏ... ఎంగాదు తియ్యే నువ్వేం బయపడకు''
''వాడు ఎం పికలేడు బయపడితే గిట్లనే భయ పెట్టిస్తారు, ఎదురు తిరిగి తేనే మల్ల మన దగ్గరకు ఎవ్వలు రారు.''
అని కోపంతో తండ్రితో అంటున్నాడు రామగౌడు.
రామగౌడు మంచి 'గీతకాడు' వాని చేత్తో గీసిన కల్లు మస్తు రుషిగా ఉంటది.
వాడు ముట్టిన ఏ చేటైనా బంగారమసొంటి కల్లు పడుతడి. వాళ్ళ నాన్న నేర్పిన కల్లుగీతనే మనసు పెట్టి చేస్తూ పూట గడుపుకుంటుండు.
రామగౌడు గీసిన కల్లు అంటే సుట్టు పది ఊర్ల పెట్టు అందరికి ఎంతో పాణం.!
రామగౌడు ఉర్లే అందరితోని మంచిగానే ఉంటూ దందా చేస్కుంటుండు.
ఏమైందో ఏమో కాని కొన్ని రోజు లుగా ఊరి పెద్ద పటేల్‌కు రామగౌడు కాంట్లేపడితే సైస్తాలేదు.
ఓ రోజు రామగౌడు కల్లు గీసి వస్తూ పటేల్ పొలం కడా ఆగి పటేల్‌ని కల్లు పైసలు అడుగిండు.
రామగౌడు పైసలు అడుగుడు పటేల్‌కి అస్సలు నచ్చలేదు.
''ఎం రా రామ నన్నే పైసల్ ఆడిగేంత పెద్దినివైనవరా..?'' అని కోపంతో అన్నాడు పటేల్.
''అయ్యో అట్లగాదూ పటేలా పోయిన సారీ చెట్లు పట్టుకుంటే చెట్లు మంచిగా లేక కల్లు రాలే మస్తు లాస్ వొచ్చింది''
''ఈ యడాది కూడా. చెట్లు గట్లనే ఉన్నరు కల్లు పడేది రెండు, మూడు చెట్లే మీకు రోజు కల్లు ఉత్తగా పోస్తే నాకు పూట గడవదు పటేలా'' అని దినంగా అన్నాడు.
వెంటనే పటేల్‌కి రేషం పొడుసుకొచ్చింది.!
''ఎం రా... నాకొక్కనికి పోస్తానే ని సొమ్ము మొత్తం పోతుందా రా.?''
''నాకే ఎదురు తిరిగుతున్నావ్ నీ దందా ఎట్లా నడుస్తాదో చూస్తా బిడ్డా '' అంటూ లుంగి పైకి ఎత్తి కట్టుకుంటు పొలంకి పోయిండు పటేల్.
ఇదుళ్లు (ఈత చెట్లు) గీసుడు అయిపోగానే ఇంటి బాట పట్టిండు. రామ గౌడు.
ఇంట్లోకెళ్లినా తను సప్పుడు చెయ్యకుండా పెద్ద పీట మీద కుసున్నాడు.
పొయ్యి కాడి ఇంట్లోకెల్లి సుస్తున్న తన భార్య అరుణ
''ఏమైంది అయ్యా...?''
''దయ్యమోలే గట్ల సప్పుడు చెయ్యక కుసున్నావ్.?'' అని అన్నది.
ఒక్కసారిగా ఉలిక్కిపడిన రామ గౌడు పటేల్ అన్న ముచ్చట పెండ్లాంతో చెప్పిండు.
''అయ్యో పోయి పోయి గాని కంట్లనే పడ్తివా !''
''పాపపు ముండా కొడుకు ఉర్లే ఎవ్వలను నెగలనియ్యాడు''
''జర్ర మంచిగా బతికితే ఓర్వడు'' అంటూ పటేల్‌ని తిడుతూ ఉంది.
అంతలోనే బజార్లో ఎదో చాటింపు వీనిపించింది.
రామగౌడుకి ఒక్కసారిగా వెన్నులో భయం పుట్టింది.
'రేపటి నుంచి రామగౌడు దగ్గర ఎవ్వలు కల్లు తాగిన వాళ్లకు పది చెప్పు దెబ్బలు వెయ్యి రూపాలు జరిమానా అంట ఒహౌరు' అంటూ చాటింపు వేసి వెళ్ళిపోయాడు ఓ బక్క పలుచని శరీరం గల ఓ మనిషి.
రామగౌడుకి ఎం చెయ్యాలి సమజైతలేదు.!
ఆలోచిస్తూ అట్లనే మొగురంకి ఒరిగిండు.
'కల్లు పోయాలేదని నా మీద కక్ష్య కట్టుడు పటేల్‌కి న్యాయమా.?'
'నా బతుకు కూడా నేను బతకొద్దా.?'
'నేను కష్టం చేసిన సొమ్ము అడిగితే కూడా తప్పా'
అని అనుకుంటూ కోపంతో...
అర్రల ఉన్న మోకు, ముస్తాదు, ఉలి, గొడ్డలి, కత్తి,ని సదురుకుంటూ కోపంతో ఇంట్లో నుంచి బయటకు వొచ్చిండు.
మధ్యాన్నం ఈదుళ్ళకు పోయి కల్లు గీసి ఇంటికి వచ్చిండు.
మరునాడు ఉదయం ఈదుళ్లకు ఒక్కపురుగు కూడా రాలేదు కల్లు మొత్తం ఉత్తగానే పాడైపోయింది.
రోజు తాగేటోళ్ళు కూడా అంటూ మర్రిసుస్తలేరు.!
కల్లంతా.... నెలపాలు అయ్యే అంటూ ఇంటికి వచ్చి అరుణతో దుఃఖంతో చెప్తుండు రామగౌడు.
అంతలోనే వచ్చిడు సాకలి సత్తయ్య.
ఏడ్వాకు గౌడా. ఆ పటేల్‌కి భయపడి ఎవ్వలు కూడా కల్లు తగుతాందుకు ఈదుళ్ళకి వొస్తాలేరు...
మాన ఊర్లోళ్ళు ఇంకా ఆ పటేల్ మోచేతి నీళ్లే తగుకుంటనే బతుకుతున్నారు.
''చీము, నెత్తురు లేని జనం''
''ఎవ్వలకు ధైర్నం లేదూ పటేల్‌ని ఎదిరిస్తాందుకు''
''నువ్వేం భాద పడకు ఈ రోజు కూడా పోయి కల్లు గీసి రా...''
''రేపు పొద్దుగల్ల నేనొచ్చి కల్లు తగుతా''
''పటేల్ మొఖం మీద కొట్టినట్టు చేస్తా ఎం చెస్తాడో చూస్తా'' అని ధైర్యంగా అనుకుంటూ భుజం మీద తువ్వాలను ఎస్కుంటూ ఇంట్లో నుంచి బయటకు వైపోయిండు సత్తయ్య.
రామగౌడు ఒక్కడే గన్నేరు చెట్టు నీడలు దిగులుగా కూర్చున్నాడు.
అంతలోనే వాళ్ళ నాన్న ఎల్లా గౌడు వచ్చి.
''బిడ్డా నేను పటేల్ దగ్గరకు పోయి కాళ్ళు, కడుపులు మొక్కి బతిమిలాడుతా రా.''
''కనికరిస్తాడు మన పనెందో మనం చేస్కొని బత్కలే కోపానికి పోతే పూట గడవాదు బిడ్డ'' అని రామగౌడుని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాడు ముసలాయనా.
చెట్టు నీడలో ఉన్న రామ గౌడు ఒక్కసారిగా లేసి.
''చల్ నియవ్వ వాణ్ణి బతిలాడేది లేదు ఎం లేదు''
''ఇయ్యలా పోయి కల్లు గీసుడే పొద్దుగాల్ల కల్లు అమ్ముడే''
ఇవ్వనికి భయపడేది లేదు.!
అని అనుకుంటా పనిముట్లు తీసుకొని ఈదుళ్ల దిక్కు బాట పట్టిండు.
రామగౌడు ఈదుళ్ళకి పోతుంటే చూసిన పొలంలో ఉన్న పటేల్ కండ్లు ఎర్రగా జెసి రామ గౌడుని ఉరిమి ఉరిమి సూస్తుండూ..!
ఏమి పట్టించుకోకుండా పోయి కల్లు గిసిండు రామ గౌడు.
రాత్రంతా ఇంటిల్లలూ సంగం నిద్రనే పోయిండ్రు.
తెల్లారింది రామగౌడు లేచి మబ్బులనే స్నానం చేసి కుల దైవమైన 'ఎల్లమ్మ'కు దండం పెట్టి ఈదుల్లకు పోయిండు.
ఈదుళ్లకు వస్తానన్న సాకలి సత్తయ్య రాలేదు.!
ఏమైనదో..? ఎందుకు రాలేదో..? అని చాలసేపు ఎదురుచూసిండు ఎవ్వరూ రాలేదు.
చూడంగా చూడంగా పొరుగురి నుంచి ఎవ్వరో ఓ ముసలాయన వచ్చి కల్లు ఆడిగిండు.
అంతలోనే ఈదుళ్లకు రానే వచ్చింది పటేల్.!!
''ఎం రా... లంజా కొడకా...''
''కల్లు అమ్మొద్దు అని చేప్తి కదా రా...''
''ఎందుకు అమ్ముతున్నావ్ బే...''
అని గర్జించిండు పటేల్...
''నా సొమ్ము నేను అమ్ముకుంటా బారబ్బార్ అమ్ముకుంటా నువ్వు ఎవ్వలవు ఆడిగేందుకు..?'' అని కోపంగా సమాధానం ఇచ్చిండు రామ గౌడు.!
పటేల్‌కి కోపమొచ్చింది.
ఎడమకాలుకు ఉన్న చెప్పును రామగౌడు మీదకు విసిరిండు.!!
అంతలోనే అక్కడ చుట్టుపక్కల ఉన్న జనం అంత ఈత వనంలో గుమిగూడిన్రు.
విసిరిన చెప్పు రామగౌడు ముఖంకి తాకింది.
ఇక్కసారిగా కోపోద్రికకుడైన రామ గౌడు. జబ్బకు ఉన్న మోకుని చేతిలిని తీసుకొని ఒక్కసారిగా పటేల్ మీదకు పోతూ...!!
''మా..కి చుత్...!!''
''ఎన్ని రోజులు బయపెడ్తావ్రా ఊరోళ్లను'' అనుకుంటూ.
మోకుతో పటేల్‌ని ఒక్క దెబ్బ గట్టిగా కొట్టిండు. నడుముకు ఉన్న పడునైన ఉలిని చేతిలోకి తీసుకొని
''చంపేస్తా బిడ్డా మళ్ళీ నా దగ్గరకు వొస్తే''
గొంతుపై పెట్టి బెదిరిస్తూ. గట్టిగా చెప్పిండు.
ఈతవనంలో ఉన్న జనాలు అందరూ పరేషాన్ అయిండ్రు.!
పటేల్ లేసి సక్కగా పోలీస్టేషన్ తొవ్వ పట్టిండు. పోతూ... పోతూ...
''అరే బిడ్డా నువ్వు శిప్ప కుడూ తినలే. చెప్తాస చెప్తా'' అనుకుంటూ
సిద్దిపేటలోని పోలీస్ స్టేషన్‌కి పోయిండు. రామగౌడు మీద దరఖాస్తు ఇచ్చి వొచ్చిండు పటేల్.
తెల్లారి పొలిసొళ్ళు దర్యాప్తుకి రానే వోచ్చున్రు.
రామగౌడు దగ్గరకు వచ్చిన పోలీసులు ఆయనను టౌన్‌కి తీసుకుపోతుంన్నారు.
ఒక్కసారిగా ఆ ఊరి జనం అందరూ పోలీస్ జీపుకు అడ్డం తిరిగిన్రు.
సాకలి సత్తయ్య ముందుకు వచ్చి...
''సారు.. ఆయానను ఎందుకు తీసుకపోతున్నారు '' అని ఆడిగిండు..
'' ఈయన పటేల్‌ని కొట్టిండు అని దరఖాస్తు ఇచ్చిండు అందుకే తీసుకుపోతున్నాం'' అన్నారు అమిన్ సాబ్.
''పటేల్‌ని కొట్టంగా ఏవ్వాళ్ళన్న సుశీండ్రా సారు''
అని ఆడిగిండు..!
అమిన్ సాబ్ నోట మాటరాలేదు.
పటేలే ఈ రామగౌడుని కొట్టిండు సారు..
మేము అందరం చూసాము అని ఊరు మొత్తం ఒక్కసారిగా చెప్పారు.
అమిన్ సాబ్ ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తూ రామగౌడుని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు.
రామగౌడు ధైర్యానికి మెచ్చుకున్నా ఉరోళ్ళందరు ఈదుళ్ళకి పటేల్ ముందునుండే పోయి కల్లు తాగుతున్నారు.! రామ గౌడు ఈతవనంలో ఈ యడాది ఎక్కువ చెట్లను గిస్తూ కల్లు అమ్ముతున్నాడు.
పటేల్ హింస తప్పిన పల్లె జనం ఎవ్వరి పనిలో వాళ్ళు మునిగిపోయారు.
రామ గౌడు కొట్టిన దెబ్బలకు ఇజ్జత్ పోయిన పటేల్ ఉరిడిసి పట్నం పరిపోయిండు.!
మరునాడు సాకలి సత్తయ్య ఈతవనం వనంలో కల్లు తాగుతూ.
''ఊరికి పట్టిన పీడ ఒక్క మోకు దెబ్బతో పోయింది''
అంటూ ఓ ముంత కల్లు ఎక్కువ తాగిండు.
- జాలిగామ భానుప్రసాద్ గౌడ్
7893575768