Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఇప్పుడు ఇదొక సాధారణ వైఖరి అయి పోయింది!'' అని డాక్టర్ పద్మనాభన్ ఇంగ్లీషులో అన్నారు. ఆయనకు తమిళం బొత్తిగా మాట్లాడ్డానికి రాదు. ''అందరికీ గ్రహాంతరవాసుల గురించి ఏదో ఒకటి చెప్పాలని ఉంటుంది. ఎగిరే పళ్లేలు, తలమీద యాంటెన్నా కలిగిన కప్ప కళ్లున్న మనుషులు. వింత కాంతులు. యాభై సంవత్సరాల క్రితం వార్తాపత్రికలు క్రమంగా హాలివుడ్ చిత్రాల ఫాంటసీతో తెరపైకి వచ్చాయి. మనుషుల్లో సగంమంది ఇప్పుడు ఈ కథల్ని నిజమని నమ్ముతున్నారు. భౌగోళిక రహస్యాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లే పనికి బదులుగా ఇలాంటి పనికిమాలిన మూఢనమ్మకాలను రేకెత్తించటమే ఇవ్వాళ శాస్త్రవేత్తలకు పెద్ద పనైపోయినట్టుంది... నేను విసిగి పోయాను.''
''ఇది అలా కాదు. మీరు మీ కళ్లతో చూస్తే నమ్ముతారు...'' అన్నారు నారా యణన్.
పద్మనాభన్ పొట్టి మనిషి. చాక్ పీస్‌లా తెల్లటి శరీరం. అతి తెల్లనైన తల వెంట్రుకలు. మీసాలు, కనుబొమ్మలు కూడా తెలుపే. అంతరిక్ష పరిశోధనలో ఆయనకు నలభైఏండ్ల అనుభవముంది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన, నోబుల్ పురస్కారం మొదలైనవి ఉన్నాయి.
''నేను పరిశోధన కోసం రాలేదు. నువ్వు నా పాత స్నేహితుడివి. నాలుగైదు రోజులు ఏదైనా ఓ కొండ ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవాలనిపించింది. అప్పుడే నీ ఉత్తరం...''
''మీరు దాన్ని చూడొచ్చు. కొండ అంచుల దాకా ఎక్కటం ఒక సాధనలాగా కూడా ఉండొచ్చేమో?''
''చూడ్డానికేమీ లేదు. అయితే ఒక తోట వ్యవసాయదారుడు అన్న పరిస్థితిలో నువ్విలాంటి పనికిమాలిన విషయాలలో భాగస్వామ్యం కాకుండా, పద్ధతిగా ఏ క్రిమికీటకాల గురించో, నూతన వ్యవసాయ పద్ధతుల గురించో పరిశోధన చేసుంటే ఎంతో బావుండేది. అయితే నీకు కాలక్షేపం అయితే చాలు. ఈ మనుషుల్లేని కొండ ప్రాంతంలో ఇలాంటి చిన్నచిన్న పుకార్లు లేకుండా బ్రతకటమూ కష్టమే...''
''రేపు ఉదయం మనం కొండను ఎక్కుతున్నాం. తోరప్పను రమ్మని చెప్పాను...''
''తోరప్ప నా?''
''ఈ కొండమీదున్న ఇడుంబర్ అన్న కొండజాతికి చెందినవాడు. వాళ్లలో ఒకడి తోడు లేకుండా కొండమీదికి దారి కనుక్కోవటం కష్టం.''
''నీ బంగళా ఎంతో అందంగా ఉంది. నువ్వొక చిన్న కొండకు అధిపతిలా ఉన్నావు.''
''కృతజ్ఞతలు.'' అన్నారు నారా యణన్. ''తేయాకు ధరలు పడిపోయాకే నేను రాజ్యం కోల్పోయిన రాజుగా తయారయ్యాను.''
''ఈ ఎగిరే పళ్ళేల కథను బాగా ప్రచారం చేసి కొండ అంచును ఒక పర్యాటక కేంద్రంగా మార్చెయ్యి. డబ్బులు రాలుతాయి. చాలామంది ఇప్పుడు అదేగా చేస్తున్నారు...''
డా|| పద్మనాభన్ ఆ రాత్రంతా అంతరిక్ష వింతల పేరుతో జరిగే మోసాల గురించి చెబుతూనే ఉన్నారు. ''ప్రజలకు ఈ భూమ్మీద నమ్మకం పోయింది. ఇక్కడే మన జీవిత సమస్యలకు ఒక పరిష్కారం దొరుకుతుందని వాళ్లు నమ్మటంలేదు. ఆకాశం నుంచి ఎవరో వస్తారనుకుం టున్నారు. శాస్త్రవేత్తలు దేవుణ్ణి సమాధి చేసేశారు. గత శతాబ్దపు విషయాలుగా జ్యోతిష్యం, గ్రహబలం ఇవన్నీ పాతవి అయిపోయాయి. కనుక శాస్త్రవేత్తల ద్వారానే కొత్త మూఢనమ్మకాలను సృష్టిస్తున్నారు... పైన ఒక ఖాళీ ప్రదేశం ఉందని నమ్మటానికి ఎవరూ తయారుగా లేరు. కనుక కొత్త దేవతలు, కొత్త సైతాన్లు...''
''అలా అయితే అంతరిక్షంలో మనం తప్ప ఇంకెవరూ ఉండటానికి వీల్లేదని అంటున్నారా?''
''తర్కపూర్వకంగా ఆలోచిస్తే, ఉండొచ్చు. అయితే ఇవ్వాల్టి వరకూ ఒక్క ఆధారం కూడా లభించలేదు. ఒకే ఒక చిన్న ఆధారం కూడా. అతి పదునైన దుర్భిణులు యాభై ఏండ్లుగా ఆకాశాన్ని అణువణువూ పరిశీలిస్తున్నాయి. ప్రపంచంలోని అన్ని మూలలకు విరామం లేకుండా రేడియో వార్తలు పంపించటం జరుగుతోంది. ఆకాశంలోని ఉపగ్రహాలు మన సూర్యమండాలన్నీ పాలపుంతల్నీ ఎన్నో లక్షల ఛాయాచిత్రాల్ని తీసి పంపేశాయి. గురుగ్రహం మీదికి మానవ రహిత రాకెట్లు దిగిపోయాయి. ఇంతవరకూ దృష్టిని ఆకర్షించే విధంగా ఒక చిన్న ఆధారం కూడా లభించలేదు. లభించనంతవరకూ లేదని అనుకోవటమే భూగోళ న్యాయం. అందుకనీ ఈ ప్రపంచంలో మనం తప్ప ఎవరూ లేరు...''
''అలా స్పష్టంగా చెప్పలేము. మీరు దాన్ని చూస్తే...''
''నేను చాలా చూసేశాను.'' అన్నారు డాక్టర్ సహనం కోల్పోయి. ''నువ్వు చెప్పాలనుకున్న కథ ఏంటి? ఏదో అంతరిక్ష నౌక ఇక్కడ దిగింది. దాని చక్రాల గుర్తులు కొండ చివరన ఉన్నాయి అనే కదూ?''
''ఔను. అంటే...''
''నువ్వు ఎరిక్ వాన్ డానికెన్ రాసిన 'భగవంతుని రథాలు' కథను చాలాసార్లు చదువుంటావని అనుకుంటున్నాను. గ్రహాంతరవాసులు ఎందుకు ఇక్కడికి రావాలి? వచ్చాక దేన్నైనా వదిలి వెళ్లారా? తీసుకెళ్లారా? దాన్ని ఎవరైనా చూశారా? అంతా భ్రమ. భూగోళం భూగోళమే. దాన్ని కథలతో మేళవించకూడదు.''
మరుసటిరోజు తోరప్పన్ వచ్చి వాళ్లతో కలిశాడు. నోటి నుంచి తాంబూలపు రసం కారుతున్న పొట్టి నల్లటి మనిషి. బలమైన భుజాలు. తల వెంట్రుకల్ని వెనక్కి ముడివేసి చుట్టుకున్నాడు. ముక్కుకు సన్నని ఇనుప వలయం.
''ఏమయ్యా తెల్లారగట్టా వొచ్చే సమయమా ఇది?''
''సామీ, అడివిలో మంచు జాస్తి సామీ.''
''మంచివాళ్లేనూ. అయితే ఏ పద్ధతులకూ లొంగనివాళ్లు.'' అన్నారు నారాయణన్. ''అడవిలో తిరిగే పనికి తప్ప ఇక ఎందుకూ ప్రయోజనం లేనివాళ్లు...''
''అందుకు కారణం వాళ్ల పనికిమాలిన ఊహలు, దేవుళ్లూ దెయ్యాలూనూ. వాస్తవ స్పృహ ఆదివాసీల మధ్య చాలా చాలా తక్కువ. ఇక వెళదామా?''
''నేను తయారు. రేరు, అయ్యగారి సంచీ తీసుకో.'' అన్నారు నారాయణన్.
''మంచి నిటారైన కొండ. పైకి వెళ్లటానికి ఒక చిన్న దారి మాత్రమే ఉంది. అది వీళ్లకు మాత్రమే తెలుసు...''
తోరప్పన్ సంచితో ముందుకు నడిచాడు. వాళ్లు అనుసరించారు. దట్టమైన అడవికి మించిన పర్వతాన్ని చూసిన డాక్టర్ ఆశ్చర్యపోయారు. అలాంటి ఒక నిటారైన కొండను ఆయన అప్పటివరకూ చూళ్లేదు.
''దాని పేరేంటి?''
''తెల్లవాడు పెట్టిన పేరు డెవిల్స్ డోమ్. వీళ్ల భాషలో 'కల్లన్ మలై' ''
''కల్లన్ మలై అంటే ఏమిటర్థం?''
''వీళ్ల దేవుడొకరు కొండమీదున్నాడు. కల్లన్సామి.''
''మీరు అప్పుడప్పుడూ వెళుతుంటారా?'' తోరప్పన్ను అడిగారు డాక్టర్.
''అవును సామీ.''
''ఎప్పుడెప్పుడు కల్లన్సామిని మొక్కుతారు?''
''సామీ అది చైత్రమాసం ఆరో దినాన. అయ్యాల మాత్రమే మొగోళ్లుగా పుట్టినోళ్లంతా కొండెక్కి సామికి మొక్కి బలిస్తాం.''
''ఆడవాళ్లుగా పుట్టినవాళ్లు?''
''రాకూడదు సామీ. వొస్తే కల్లన్ సామికి కోపమొచ్చి ఆళ్లను ఆకసంలోకి ఎత్తుకెళ్లిపోతాడుగా.''
''దీని పైకి ఎలా ఎక్కటం?''
''మానుంటింది సామీ.'' అన్నాడు తోరప్పన్.
కొండ నిజానికి ఒక పెద్ద బండరాయి. దాని పగుళ్లలో మొలకెత్తిన చెట్ల వేర్లను తొక్కుతూ, తోసుకుంటూ ఎక్కాల్సి వచ్చింది. డాక్టర్ కొంచెం ఇబ్బందిపడ్డాడు.
''ఇది లావా రాక్ కావొచ్చు.'' అన్నారు డాక్టర్. ''గట్టి నల్లబండరాయి. దక్షిణ తమిళనాడులోని అనేక కొండలలో ఇవి మాత్రమే ఘనమైన రాళ్లు.''
''పైన అంచుల దాకా ఇలాంటి నల్లటి బండే ఉంది. ఏనుగు చర్మం లాగా.''
మేము పైకెక్కి వెళ్లినప్పుడు ఎండ తీవ్రంగా కాస్తోంది. నాలుగు పక్కలా ఆకాశం బోర్లించిన గిన్నెలా ఉండి వెలుతురు కళ్లను మండించింది. కానీ చల్లని గాలులు శరీరానికి తాకి హాయిగా అనిపించింది.
''ఇక్కడ నిలబడితే వంద కిలోమీటర్ల దూరం వరకూ చూడ్డానికి వీలవుతుంది. నిజానికి పడమటి పర్వతశ్రేణులలో ఇదే ఎత్తయిన శిఖరం. సముద్రమట్టం లెక్కల ప్రకారం అయితే వేరే పర్వతాల్ని చెబుతారు.'' అన్నారు నారాయణన్. ''కొసకు వెళదామా...''
''కచ్చితంగా!'' అన్నారు డాక్టర్.
''సామీ, మన కల్లన్సామి...'' అని తోరప్పన్ చెయ్యి చాపి చూపించాడు. కొండ పగుళ్లలోని ఒక చెట్టుక్రింద నల్లటి రాయి ఒకటి ఇంకో చదునైన రాతిమీద ప్రతిష్టించబడి ఉంది.
''సరే, నువ్వెళ్లి మొక్కుకుని రా!'' అన్నారు నారాయణన్. ''రండి డాక్టర్‌గారూ...''
కొండ అంచున దాదాపు నాలుగెకరాల స్థలం మాత్రం ఉంది. ''ఇదిగో... ఇదే నేను చెప్పింది.'' అన్నారు నారాయణన్.
శుభ్రంగా తవ్వబడిన ఒక కాలువ అది. ఎనిమిది అడుగుల వెడల్పు, మూడడుగుల లోతుంది.
''కాలువ.''
''కాదు. అదిగో చూడండి...''
ఇరవై అడుగుల తర్వాత అదేలాంటి ఇంకో కాలువ జంటగా కనిపించింది.
''దీన్నే ఒక అంతరిక్ష నౌకకు సంబంధించిన చక్రాల గుర్తులంటున్నారా?'' అన్నారు డాక్టర్.
ఆ గుర్తులు కొంత దూరం వెళ్లి, నిలువుగా చీలినట్టు కిందికి దిగిన కొండ పగుళ్లలోకి దూకి, ఆకాశాన్ని తాకుతోంది.
''పురుగుమందులు స్ప్రే చేసే హెలికాప్టర్ నుంచి మొదటిసారిగా దీన్ని చూసినపుడు నిర్ఘాంతపోయాను. ఒక టైర్ గుర్తు లాగానే...''
''భ్రమే.''
''ఎందుకలా ఉండకూడదు? ఎలా ఇక్కడ, ఈ శిఖరాగ్రాన, ఇలాంటి ఒక గుర్తు ఏర్పడగలదు? సాధ్యం కాదు...''
''ఎన్నో అవకాశాలున్నాయి. ఒకటి ఈ అడవి మనుషులు చెక్కి ఉండొచ్చు.''
''వీళ్ల వద్ద అలాంటి కథే లేదు. వీళ్లు ఎక్కడా అలాంటి ఒక పనిని చెయ్యటమూ నేను చూడలేదు.''
''సహజంగానే కూడా ఏర్పడి ఉండొచ్చు. బండ అనేక రకాల ఖనిజాల మిశ్రమం. ఒక కనిజం కాలక్రమంలో వర్షానికో, ఎండకో కరిగిపోయి ఉండొచ్చు.''
''ఇంత కచ్చితంగానా?''
''ఇంతకన్నా కచ్చితమైన రూపాలన్నీ ప్రకృతిలో కనుగొనబడ్డాయి. బహుళస్థాయి రాతి త్రోవ(ట్రాక్)లు ఉన్నాయి. ఒకట్రెండు ఇలాగూ ఉండొచ్చు. కానీ అవి ప్రాచీన మానవజాతి ఏదో ఒక ప్రయోజనం కోసం వీటిని రూపొందించినట్టుగా భావించాలి. అదే ఉత్తమమైన ఊహ.''
''డాక్టర్, ఇదొక అంతరిక్ష నౌక చక్రపు గుర్తు అన్న ఊహను మీరెందుకు మొండిగా తిరస్కరిస్తున్నారు?''
''ఎందుకంటే అందులో ఉన్నది మన ఇష్టం లేదూ ఊహ మాత్రమే. ఇంతవరకూ ఒక్క గుర్తుకూడా కనిపించని స్థితిలో అలాంటి ఒక నిర్ణయానికి మనం సులభంగా వచ్చేయకూడదు. పైగా ఇందులో ఒక ముఖ్యమైన సమస్య కూడా ఉంది...''
''ఏంటదీ?''
''ఈ బాట మూడడుగుల లోతుంది. ఇది చిన్న రాపిడి గుర్తో రక్కిన గుర్తో కాదు. ఇలా బండమీద లోతుగా ముద్ర పడాలంటే ఆ నౌక ఎంతో బరువుగలదై ఉండాలి. అలాంటి ఒక బరువైన నౌక మెరుపు వేగంతో ఎగరాలంటే అది ఎలాంటి లోహంతో తయారయినదై ఉండాలి? ఆ లోహపు సాంధ్రత మనకు తెలిసిన ఏ లోహం కంటే కూడా ఎక్కువగానే ఉంటుంది కదా? అలాంటి ఒక లోహపు మూలకం గుర్తు మాత్రమే బండరాయిమీద ఇంత లోతుగా పడగలదు. బురదలో ఇనుప గుర్తులు పడ్డట్టుగా...''
''ఔను.''
''అలాంటి ఏ మూలకాలూ ఇప్పటివరకూ కనిపెట్టబడలేదు. ఎన్నో వేల ఉల్కల్ని పరీక్షించటం జరిగింది. గ్రహాల నుంచి ఉపగ్రహాల నుంచీ నమూనా అంశాలను సేకరించాం. తోకచుక్క నుంచి కూడా అంశాలను సేకరించి విశ్లేషించాము. ఇంత ఎక్కువ సాంద్రత కలిగిన మూలకం ఉండటానికి అసలు అవకాశమే లేదు...''
''ఎక్కడైనా ఉండొచ్చుగా... అంతరిక్షంలో ఎక్కడైనా...''
''లేదు. అణువుల నిర్మాణం గురించి మనకు ఇప్పటివరకూ ఉన్న జ్ఞానమంతా అలాంటి ఒక మూలకం ఉండే అవకాశాన్నే తిరస్కరిస్తోంది. ఒక నిర్ణయించిన కాలం, స్థలం పరిమాణంలో అణువుల అనుసంధానానికి ఒక పరిమితి కచ్చితంగా ఉంటుంది. అది అనంతం కాదు. ఎందుకంటే అది భౌతికత్వం. అందుకనీ అనుసంధానం కోసం ఒక గరిష్ఠ సంఖ్య ఉండాలి. ఇవ్వాళ మనం కొంతవరకూ విభజించగల అంశమే అది. బహుశా అది విశ్వం యొక్క మూల నియమాలలో ఒకటై ఉండొచ్చు. కాబట్టి ఇది సాధ్యం కాదు. మీరు కావాలంటే వీటి ఆధారంతో ఒక సైన్స్ ఫిక్షన్ నవల రాయొచ్చు. అంతకన్నా విలువైనది ఏమీ లేదు. క్షమించండి...''
నారాయణన్, ''పరవాలేదు. నాకొక అనుమానం ఉండేది. దాన్ని తీర్చుకోవటమూ మంచిదే.'' అన్నారు.
''తాగటానికి మంచినీళ్లు ఇటివ్వు?''
కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక మళ్లీ బయలుదేరారు.
''రేరు తోరప్పా!''
''సామీ...''
''ఇంతసేపు ఏం చేశావురా?''
''దేముడికి మొక్కాను సామీ...''
''రా, వెళదాం.''
''పోదాం సామీ...'' అంటూ తోరప్పన్ కాస్త జంకుతూ అన్నాడు: ''సామీ, కల్లన్సామిని మొక్కోని ఎల్లండి సామీ!''
''సమయమైంది రారా. ఇక ఎండ నడినెత్తిమీదికి వచ్చేస్తుంది.'' అన్నారు నారాయణన్.
''ఏమంటున్నాడు?''
''కల్లన్సామిని మొక్కటానికి పిలుస్తున్నాడు. వీళ్లకు అడివంతా దేవుడే. రాయి, మట్టి, చెట్టు అన్నీ దేవుళ్లే...''
వాళ్లు తోరప్పన్ను వెంటబెట్టుకొని దిగి వెళుతున్నారు. ఎండ నడినెత్తిమీదికి రాగానే గాలులు వీచినపుడు కల్లన్సామిగా నిలబెట్టిన నల్లటిరాయి నుండి సన్నని కాంతి ప్రసరింపసాగింది. పచ్చా, నీలమూ కలయికతో ఉన్న దాని కిరణాల కొసలు ఎంతో పదునుగా మెరుస్తున్నాయి.
- తమిళ మూలం: జయమోహన్
అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ,
73820 08979