Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రోజులు గడుస్తున్నారు, కళ్ళాల్లో నెలలుమారుతున్నారు, రంగు మారిపోతున్న వడ్లను చూస్తూ సోమ్లా గుండె వరికుప్పమీదే ఆగిపోయింది... కమ్లి ఇంటివద్దకు ఈసారి ప్రజాప్రతినిధులొచ్చారు..'పేరేంది'... మడత కుర్చీ మీదుంచిన ఫొటోకు గులాబీ రెక్కలు చల్లుతూ ఎమ్మెల్యే అడిగాడు.. ఆమె మాట్లాడలేదు..'అమ్మా నిన్నే.. ఈయన పేరేంది'.. ఫొటో వైపు చూస్తూ అడిగాడు 'రైతు'...అంది కమ్లి .. అర్ధం కానట్టు ఆమె ముఖంలోకి చూశాడు, 'ధాన్యపు రైతు'..ఈసారి ఇంటిపేరుతోసహా చెపుతున్నట్టు చెప్పింది ..ఎమ్మెల్యే అక్కడి నుంచి తలొంచుకొని వెళుతుండగా.. 'అన్నదాతల్ని ప్రభుత్వాలు ఇకనైనా ఆదుకోకపోతే రైతులిక యాసంగి వడ్లవుతారు.. ఎక్కడా కనిపించరు' అంది ఆవేదనగా.. ఆమాటంటున్నప్పుడామె ముఖపు గనుసుగడ్దరంగు మరింత ఎరుపెక్కింది..
'ఎట్ల చనిపోయిండు'..
ఎడారినితలపిస్తున్న వడ్లకల్లాల్లోంచి నడిచొస్తూ రెవెన్యూ అధికారడిగాడు.. ఆమెకు నోటమాట రావటంలేదు,
దుఖం మాత్రం కళ్లల్లో గొంతు విప్పుతోంది.. మెరకపొలంలో బాయి మోటర్ చాళ్లకు నీళ్ళు తోడిపోసినట్టు గుండెల్లోని గోడునంతా ఆమె కళ్ళు పూసగుచ్చినట్టు తోడిపోస్తున్నాయి..
'ఎలా చనిపోయిండు '..
మరోసారి అడగాలనుకున్నాడు కానీ 'కన్నీళ్ళు చెప్పింది అర్థమయ్యిందిలే' అనుకొని అదేనమోదు చేసుకున్నాడు.. మరో దుఖపుకుప్ప వైపు వాళ్ళు వెనుదిరిగాక
'యాడి యే' అంటూ గుండెలు బాదుకుంటు న్నప్పుడు.. ఏనుగు
దంతాల్లాంటి తనగాజుల్లో
ఆమెదుఖం భళ్లుమంతోంది.... కానీ వాళ్లదేమీ పట్టించుకోలేదు.. 'అన్నీ దుఖాలే వినపడుతున్న దింపుడు కళ్ళాల్లో ఏ దుఖాన్నని ఓదారుస్తాం' అనుకున్నారు కాబోలు....
జొన్న రొట్టెలకమ్మటి గాలి ఇంటింటి సుగంధమై తండాంతట వ్యాపిస్తోంది.. 'గంగమ్మ దయవల్ల ఈఏడు పంట బాగపండింది.. ఎకరానికి పాతిక, ముప్పరు బస్తాలకు తక్కువకావు.. డబ్బు చేతికొచ్చినంక పిల్లపెండ్లి కుదురిచ్చు కుందం' పొలానికి బయల్దేరబోతూ సోమ్లానాయక్ తన భార్యతో అంటుండగా.. తలదువ్వు కుంటున్న కమ్లి కళ్లల్లో ఆనందం పొంగింది.. 'రాత్రి టీవీ వార్తల్ల ఇన్న నాయినా.. ఆహార ధాన్యాల కొరత ఉన్నదేశాల్ల మనదేశం గూడ ఉన్నదంట'.. అని కట్టెలపొయ్యికాడ రొట్టెలుకాలుస్తున్న బిడ్డ ద్వాళి అనగానే 'అయితే'..అన్నడు సోమ్లా అర్థంకాక.. అద్దంలోకి సూసు కుంట అర్ద రూపాయంత కుంకుమ బొట్టుదిద్దుకుం టున్న కమ్లి కూడా ఆగి అయోమయంగా
చూసింది. 'అట్ల ఉన్నప్పుడు ఆహార పంటలకు దేశంలోనే కాక అంతర్జాతీయంగా కూడా డిమాండ్ ఉంటది.. వరిఅ ంటే ఆహారపంటే కాబట్టి మనపంటకి గిట్టుబాటు రేటొస్తది'.. అనేసరికి..' మాయమ్మే ఎంత సల్లటి వార్తచెప్పినవే, అట్టనే జరిగితే సీత్లా భవానికాడ యాటనికోద్దాం' అంటూ కొబ్బరినూనె రాసుకున్న చేతులతో మెటికలువిరిచింది కమ్లి..
గనుసుగడ్ద ఎరుపు సోమ్లాది.. అతనేకాదు ఆతండాలో చాలామందిదీ అదేరంగు..
'గతంలో తండా అంతా గనుసుగడ్దలే పండించేటోళ్ళు కదా.. ఆపంట ఎరుపే మీకొచ్చినట్టుంది' అంటరు పట్నంలో చాలామంది అతన్ని చూసి.. దేశానికి అన్నం పండించాలన్న ఆశ తనది.. ముతక గుడ్దతో కుట్టిచ్చు కున్న జబ్బల బనీను, ముతకపంచె తలకు
కండువా ధరిస్తాడు.. పట్నం పనులకో, శుభకార్యాలకో పోయేటప్పుడు మాత్రం తెల్లటి పొడుగు చేతుల చొక్కా, తళతళలాడే పంచె, వీపు మీదకు వేళాడే తమ సంప్రదాయ తలపాగా ధరిస్తాడు.. వానా కాలంలో తన మూడె కరాలతోపాటు మరో రొండె కరాలపొలం దత్తుకుతీసుకొని వరిసాగుచేశాడు.. 'మంచి ధరిస్తం పొలం అమ్ముతవా' అని నాలుగైదేళ్ల నుంచి రియల్ ఎస్టేటోళ్లు వెంటపడినప్పుడల్లా.. 'ఉన్నపొలం అమ్ముకుంటే ఇగనన్ను రైతంటరా.. రైతు అన్నపదంలో ఎంతో గౌరవం ఉంది దర్జా ఉంది అది ఈనేలతల్లే మాకు కట్టబెట్టింది, దాన్నొదులుకోమంటరా'.. తలపాగా బిగచుట్టుకుంటూ ధీమాగా అనేవాడు.. అంతేకాదు సంప్రదాయ వ్యవసాయం బతకాలన్న పంజాబ్ రైతుల డిమాండ్‌కు తనవంతు మద్దతు తెలిపాడు, అమలు చేయజూసిన సాగు చట్టాలను వ్యతిరేకించాడు..
గూళ్లు కొట్టినంక ఒకరోజు.. 'చల్ పోయినేడు కంటే వంద రొండందలు ఎక్కువ ధరిస్తే కొను లేదంటే లేదుపో'.. అని కసిరాడు.. వడ్లు అడ్దీకి పావుసేరు లెక్క అడిగిన దళారి రాములును 'దళారోళ్లుకాకుంటే గవుర్మెంట్ కొంటది.. గవుర్మెంటు కొనుగోలు కేంద్రాలు తెరిస్తే రాములు లాంటి బోకరోళ్లు, మారుబేరగాళ్లు ఎంఎస్పీ కంటే ఎక్కువ రేటిస్తమని రైతుల చుట్టూ తిరుగుతారని సోమ్లాకు నమ్మకం..
వడ్లు కొనుగోలు చేస్తామని మరో రోజు పట్నం బేరగాళ్లొచ్చారు.. కుప్పల్లోని వడ్లను వాళ్లవెంట తెచ్చుకున్న చిన్న మిషన్లోపోసి చూస్తూ.. 'మాయిశ్చర్ పర్సంటేజ్ ఎక్కువున్నది పదిరోజులాగొస్తాం ఎండబెట్టండి అని వెళ్లిపోబోతుండగా... 'దయుంచి ధాన్యం కొనండయ్యా వానో, వరుపో ఏరోజెట్లుంటదో' అని బతిమాలినా వినిపించుకోకుండా వెళ్లిపోయారు..
అప్పటిదాకా ధైర్యంగానే ఉన్నా ఎందుకో పట్నం బేరగాళ్ల తిరస్కారం తరువాత భయం ఆవరిస్తున్నట్టనిపిస్తోందతనికి..
ఆకాశంలో జాబిలి ఆరాత్రి తండా లోకి తొంగిచూస్తూ గుడిసెల్లో అచ్చుదిగుతున్న తన పోటీ జాబిళ్లను చూసి అసూయపడుతుంటే.. బోర్లించిన పళ్లెంమీద తను నిండు జాబిలి రూపం పొందుతున్నందుకు జొన్నపిండి కమ్లి రవిక అద్దాల్లో తననితాను చూసుకుంటూ మురిసి పోతోంది.... 'రైతులు గుండెల్లో తేమ గల్లోల్లని అందరూ అంటుంటే పొంగి పోతుంటిమి.. పల్లెల్లో ప్రతి ఇంటిగడపల్లో దానం, ధర్మం మొలకెత్తేదందుకేనని గర్వ పడుతుంటిమి.. మనం పుట్టించిన ఈవడ్లకూ మనసాలే వచ్చినట్లుందే.. వీటికీ తేమ ఎక్కువేనంట'.. వడ్లను చేతుల్లోకి తీసుకొని కిందికి ధారపోస్తూ అన్నాడు సోమ్లాబాధగా.. 'నీళ్లుతాగి నీళ్ళుతిని ఎదిగిన పంటగదూ.. తేమగాక ఇంకే ముంటది.. అయినా ఎండ దేవుడు కళ్లుతెరవాలె గాని ఆరబెట్టుడెంత సేపు.. వానల కాలం తీరిపాయెగద మంచు రేత్తిరుంటే ఉన్నది పగులైతే ఎండనే ఉంటది.. పండగలప్పుడు గడపలకి తోరణపాకు కట్టినట్టు, ఊళ్ళె కొచ్చే పెద్దోళ్లను ఆహ్వానిం చేందుకు తివాచీ పరిచినట్టు.. ఎండ తండ్రిని ఆహ్వానిస్తన్నట్టుగ వడ్లు పరుద్దాం' అంది కుప్పపక్కనే పొయ్యిరాళ్లమీద రొట్టెలు చేస్తున్న కమ్లి ధీమాగా..
'ఆరబొయ్యాల్నంటే ఊళ్లె యాడైతది.. అన్ని మట్టిరోడ్లు, జానెడు, బెత్తెడు సిమెంటు రోడ్లాయె.. ఎంత పట్టాపరిచి ఆరబోసినా మట్టికి మరింత దబునెక్కుతయి వడ్లు' అని భర్త అంటుండగా..' మరే మట్టికిగూడ మనసుంటి తేమ గుణమేనాయె అంది కమ్లి...
'ఇన్నిజేస్తన్నరు గానీ రైతులు ధాన్యం ఆరబోసుకునేందుకు ప్రతి ఊళ్ళె ఒక పదెకరాల షెడ్లు నిర్మించాలన్న ఆలోచన రావటం లేదెందుకో ఈగవుర్మెంటోల్లకి'.. తలకండువా విప్పుతూ అన్నాడు సోమ్లా మరుసటిరోజు.. 'నిజమే అయ్యెట్టుండాలంటే.. పైనుంచి ఎండమాత్రమే వచ్చేవిధంగ అద్దాలమాదిరి రేకులెయ్యాలె.. అట్లజేస్తే రైతుల గోస తప్పుతది' అంటున్న భార్యను చూస్తూ... 'నువ్వు ముక్కెమంత్రివైతే బాగుండిపోనూ' అన్నాడు నవ్వుతూ..
ఆరోజే తండా దాటుతూ పొలిమేర్లలోని సీత్లాభవానికి మొక్కుకొని ఊరిబయట మెయిన్ రోడ్దుకు ఒకపక్కన ధాన్యం ఆరబోసుకున్నాడు.. ఒకర్ని చూసి మరొకరు తమ ధాన్యాన్ని తోలుకొచ్చి అలాగే ఆరబోసుకోవటంతో దారిపొడవునా పదికిలోమీటర్ల వరకు ధాన్యపుటెడారి వెలసింది.. రైతులవెంట వాళ్లభార్యో, కుటుంభ సభ్యుల్లో మరొకరెవరో రావటంతో ఆదారి మరో తండాగ మారింది..
ఎద్దుల్లేనిబండిని రోడ్దువారగా నిలిపి బండికింద, బండిపైనా ఎరువుబస్తాల సంచులు కలిపి కుట్టించిన పట్టాలు కప్పుకున్నాడు.. కింద వంటచేసుకుంటూ పైన కాపలా కూర్చుంటూ.. అక్కడున్న రైతులందరు పాట్లుపడుతున్నారు..
'ఎవుడికి పుట్టినబిడ్డ అని ఎక్కెక్కి పడుదును అన్నదంట ఎనకటికెవరో ఒకామె.. గట్లున్నది ఈగవుర్మెంటోళ్ల వరస'... అన్నడు వీర్యానాయక్ సోమ్లా దగ్గర నిప్పడుక్కొని చుట్ట వెలిగించు కుంటూ.. 'మరె..సూడబోతె అట్టనే గానొస్తున్నది' అన్నడు కీమానాయక్.. 'అటు కేంద్రమోళ్లు, ఇటు రాష్ట్రమోళ్లు వడ్లు గొనాల్సింది నువ్వంటె, నువ్వని వాదులాడుకుంటన్నరు.. ఒకళ్ల మీదికి ఇంకొకళ్ళు తప్పు నెట్టుకుంట చేతులు దులుపుకుంటన్నరు.. మధ్య మనమే నష్టపోయెటట్టున్నం' అన్నడు సోమ్లా.. కూతురు ఇంటినుంచి సద్ది తెచ్చింది గమనిస్తూ తన కుప్పవైపెళుతూ.. ' ఓట్లప్పుడు మనల్ని రొండువేల నోటుకు కొనుక్కుంటామన్న ధీమా వీళ్లకు.. అందుకే మన కష్టం తీర్చటం లేదు..ఆ ఓట్లేవో ఇప్పుడొచ్చుంటె అట్టనన్న కొనుగోలు కేంద్రాలు తెరిశెటోళ్ళు' ... ఆక్రోషం వ్యక్తం చేసిండు వీర్యా..
'వానొచ్చినరోజు కందిమొరం చేనులా ఉంటుందీ... జొన్నన్నంలో పెరుగు కలుపుకున్న ప్పుడల్లా సోమ్లాకు గుర్తొచ్చే పోలిక.. 'రాతి గుండ్లలాంటి ఈ అన్నం తింటున్నందుకే మేమింకా ఇంతగట్టిగున్నాం' అని అనుకునే వాడు.. 'ఇప్పటిదాకా ఆసుపత్రికి పోయింది లేదు ఒక్క మందుబిళ్ల మింగిందిలేదు'.. వేళ్లు జుర్రుకుంటూ తన వంటిసత్తువకు కారణమైన తన సంప్రదాయ ఆహారాన్ని కీర్తించాడు.. టైం ఎంతయ్యింది అనే గంటలకాలం వాళ్లుమరిచిపోయి రోజులవుతోంది.. అయితే పగలు, లేదంటే రాత్రి.. చీకటిపడిఅ ప్పటికి చాలాసేపయ్యింది..
గురగుర చప్పుడుతో అప్పటిదాక ఏదో మాట్లాడిన రేడియో.. 'వాతావరణ హెచ్చరిక' అనేసరికి సోమ్లా రేడియోను చేతుల్లోకి తీసుకొని చప్పుడు తగ్గించేందుకు స్టేషన్‌ను సరిచేస్తున్నాడు...
'ఇంటికిపొయి తానంజేసి, గుడ్డలు మార్సుకొని రారాదూ' మురికిగా మారిన మొగుడి వైపు చూస్తూ అంది .. 'ష్..వాత్ మత్' అంటూ రేడియోను మరింత దగ్గరగా చెవికతికిం చుకున్నాడు.. అతను వార్తలు వింటుండగా ఆమె రాతెండి బొచ్చెలు రుద్దేపనిలో నిమగమయ్యింది..
వడ్ల కుప్పమీద మునగదీసుకున్నడు సోమ్లా, బండి మీదొరిగింది కమ్లి.. ఉన్నట్టుండి చినుకులు మొదలవగానే లేచి బండికిందకు చేరుకున్నాడు ఆమె కూడా బండిదిగొచ్చింది.. పైన ఆకాశం ఉరుముతుంటే అతని గుండెల్లో పిడుగుపడుతోంది.. ఉరుములుంటే రాదులే వాన తేలిపోద్దిలే ధైర్యం భార్య చెబుతోంది.. తనమాట పూర్తవుతుండగానే పెద్దశబ్దంతో వాన విరుచుకుపడుతోంది.. నిముషాల వ్యవధిలో పంట కుప్పవైపుచూస్తూ 'హే.. బాపురే'..అని గుండెలు బాదుకుంటూ.. అటువైపురికాడు సోమ్లా.. అక్కడ అంతమంది సహరైతు లున్నా ఎవరూ సహాయానికి వచ్చే పరిస్థితిలేదు ఎవరికివారు తమ పంటను కాపాడుకోవటంలోనే ఉరుకులు పరుగులు తీస్తున్నారు.. వానలో నిలువునా తడుస్తూనే వరదకు కొట్టుకుపోతున్నవడ్లకు చేతులడ్దం పెడుతూ కాళ్లడ్దంపెడుతున్నా అవి కొట్టుకుపోతున్నాయి.. ఇంతలో కమ్లి వెదురు తట్ట తీసుకు రావటంతో దానితో వడ్లను ఎత్తి కుప్పలోపోస్తున్నాడు.. రొండు గంటలపాటు వాన కసి చూపాక శాంతించింది.. మట్టిలో కలిసి అప్పటికే కొంతదూరం పోయిన వడ్లను ఏరితెచ్చేపనిలో వాళ్లిద్దరితోపాటు మిగతా రైతులూ నిమగమయ్యారు..
ఎండకోసం రైతులెదురు చూస్తే ఆ అహ్వానన్ని వాన అదుకున్నట్టుంది.. తుఫాను ముసురు కావటంతో రోజుల తరబడి వానకురుస్తోంది.. వచ్చిన చుట్టాన్ని పొమ్మనే అలవాటు పల్లెకుండదని వానకూ తెలుసు.. ఏకంగా వారం రోజులుంది..
పైన పట్టాలు కప్పి ఉంచినా వాన రోజూధాన్యాన్ని తడిపేస్తోంది.. వరదలు కావటంతో అడుగు నుంచీ వడ్లు తడిచాయి.. తడుస్తున్న కుప్పల్లో కాల్వలు తీయటం వరదను వెళ్లగొడుతుండటం చేసినా.. ఎండ జాడలేక పోవటంతో.. ఆరబెట్టటం సాధ్యం కాలేదు..
వారం రోజుల తరువాత.. 'మనొడ్లు నిఖార్సైనవేనే.. అదిగో సూడు అన్నీ ఎలా మొలకలొచ్చాయో' అని చూపుతూ వెర్రివాడిలా నవ్వుతున్న మొగుడ్ని చూస్తూ ..'యాడియే'..అని నెత్తిబాదుకుంటూ ఆ బురదలోనే కిందకు కూలబడింది కమ్లి..
నారుకోసం పోసిన వడ్లన్నీ మొలకలొస్తే ఎంతో సంతోషపడే వాడు సోమ్లా.. సీత్లా భవానికి కోడ్నికోసేవాడు.. వరి మొలకలు ఎప్పుడూ పచ్చగా, ఆహ్లాదంగా అనిపిస్తారు ఈసారి వడ్లను చీల్చుకోని వస్తున్న తెల్లటి వేర్లు అతన్ని ఉరితాళ్లలా భయపెడుతున్నారు..
క్రమంగా ఎండకాస్తోంది వడ్లను ఆరబోసి మొలకల్ని నాశనం చేస్తున్నా.. 'నాణ్యతలేని వడ్లు మాకొద్దు 'అంటూ వ్యాపారులు ముఖం చాటేస్తున్నారు..
వరదధాటికి ధ్వంసమైన రైల్వేట్రాక్‌ను 48 గంటల్లో పునరుద్ధరించి రికార్డు సష్టించాం అని ప్రభుత్వం ఒకవైపు గొప్పగా ప్రకటించింది.. యాసంగిలో వరి సాగుచేయొద్దన్న హెచ్చరిక మినహా రైతును గండం గట్టెక్కించేందుకు తడిచిన పంటను కొనుగోలుచేస్తామని ప్రకటనేదీ వెలువడలేదు.. వరిధాన్యం సేకరణపై కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాల బాధ్యతా రాహిత్యం ఇంకా కొనసాగుతూనే ఉంది.. రోజులు గడుస్తున్నారు, కళ్ళాల్లో నెలలుమారుతున్నారు, రంగు మారిపోతున్న వడ్లను చూస్తూ సోమ్లా గుండె వరికుప్పమీదే ఆగిపోయింది...
కమ్లి ఇంటివద్దకు ఈసారి ప్రజాప్రతినిధులొచ్చారు..
'పేరేంది'...
మడత కుర్చీ మీదుంచిన ఫొటోకు గులాబీ రెక్కలు చల్లుతూ ఎమ్మెల్యే అడిగాడు..
ఆమె మాట్లాడలేదు..
'అమ్మా నిన్నే.. ఈయన పేరేంది'.. ఫొటో వైపుచూస్తూ అడిగాడు
'రైతు'...అంది కమ్లి ..
అర్ధం కానట్టు ఆమె ముఖంలోకి చూశాడు,
'ధాన్యపు రైతు'..ఈసారి ఇంటిపేరుతోసహా చెపుతున్నట్టు చెప్పింది ..
ఎమ్మెల్యే అక్కడి నుంచి తలొంచుకొని వెళుతుండగా.. 'అన్నదాతల్ని ప్రభుత్వాలు ఇకనైనా ఆదుకోకపోతే రైతులిక యాసంగి వడ్లవుతారు.. ఎక్కడా కనిపించరు' అంది ఆవేదనగా.. ఆమాటంటున్నప్పుడామె ముఖపు గనుసుగడ్దరంగు మరింత ఎరుపెక్కింది..
- శ్రీనివాస్ సూఫీ, 9346611455