Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంతాజ్ చాలాసేపు వరకు అటువైపే చూడసాగాడు. అలా చూస్తూనే జుగల్ చేతిని తన చేతిలో తీసుకొని ఇలా అన్నాడు, ''సముద్రం ఆకాశం కలసుకోవడం... ఇది కేవలం దృష్టి దోషం. కాని చూడడానికిదెంతో అందంగా ఉంటుంది! జుగల్ మౌనంగా ఉండిపోయాడు. ఆ సమయంలో కూడా బహుష ముంతాజ్ మనసులో మస్తిష్కంలో జుగల్ చెప్పిన మాటలు...'నేనాలోచిస్తున్నాను. బహుష నేను నిన్ను చంపేయగలను' కెలుకుతున్నట్లున్నాయి. ముంతాజ్ ఓడ బార్ నుండి బ్రాందీని ఆదేశించాడు. అతను ఉదయం నుంచి ఇదే తాగుతున్నాడు.
(భారత దేశం రెండుగా విభజించబడ్డాక జరిగిన మతకల్లోల
నేపథ్యం లో రాయబడింది ఈ కథ. ప్రసిద్ద ఉర్ధూ రచయిత సాదత్ హసన్ మంటు కలం ద్వారా రచించబడింది. ఇందులో చాలా వరకు తన స్వంతానుభవమే తీసుకొని కథగా మలిచాడు మంటు. ఈ కథ పెద్ద అల్లజడి రేపింది.
కోర్ట్ కేసు వరకు వెళ్లింది. కాని చివరికీ ఆ కేసు కొట్టివేయ బడింది.)
''లక్ష మంది హిందువులు, లక్ష మంది ముస్లింలు చనిపోయారని చెప్పకండి... రెండు లక్షల మంది మను షులు చనిపోయారని చెప్పండి. రెండు లక్షల మంది మరణించడం అంత పెద్ద విషాదం కాదు. వాస్తవానికి ఈ విషాదం చనిపోయినవారు, చంపినవారు ఏ ఖాతాలోకెక్కలేదు. ''లక్ష మంది హిందువులను చంపి ముస్లింలు హిందూ మతం చనిపోయిందని అనుకున్నారేమో! కానీ అది సజీవంగా ఉంది. సజీవంగానే ఉంటుంది. అదేవిధంగా లక్ష మంది ముస్లింలను చంపిన తరువాత హిందువులు ఇస్లాం అంతమైపోయిందని జబ్బలెగురేసి ఉంటారు. కాని ఇస్లాంకు ఒరిగిందేమి లేదు. వాస్తవికత మీ ముందు ఉంది... మతాన్ని తుపాకులతో వేటాడవచ్చని భావించే వారు మూర్ఖులు. మతం, ధర్మం, విశ్వాసం, ఇవి మన శరీరంలో లేకపోయినా అవి ఆత్మలో ఇమిడి ఉన్నాయి... కత్తులు, ఖడ్గాలు, బుల్లెట్లతో ఇవి ఎలా నాశనం అవుతాయి? ''ముంతాజ్ ఆ రోజు చాలా ఉత్సాహంగా ఉన్నాడు. అతన్ని వీడ్కోలు చెప్పడానికి మేం ముగ్గురం సీ పోర్ట్ కెళ్లాం. అతడు నిర్ణయించుకోలేని సమ యం కోసం భారత దేశం వదిలి పాకిస్తాన్ వెళ్లుతున్నాడు. ఓడ ప్రయాణం. మాలో ఎవరికీ పాకిస్థాన్ ఉనికి గురించి తెలియదు. మేం ముగ్గురం హిందువులం. పశ్చిమ పంజాబ్‌లో ఉన్న మా బంధువులు చాలా ధన ప్రాణ నష్టాలకు గురైయ్యారు. బహుష ఈ కారణాలవల్లే ముంతాజ్ మా నుంచి విడిపోతున్నాడు.
జుగల్కు లాహోర్ నుండి ఒక లేఖ వచ్చింది. ఈ మత కలహాలల్లో అతడి మామయ్య మరణించాడని. అతను చాలా బెంగపడ్డాడు. ఈ విషాదంతో కృంగి పోయాడు. ఒక రోజు అతను ముంతా జ్తో ఇలా అన్నాడు, ''మా వీధిలో అల్లర్లు మొదలైతే నేను ఏం చేస్తానో... అని
ఆలోచిస్తున్నాను.'' ముంతాజ్, ''ఏం చేయగలవు?'' అని అతన్ని అడిగాడు. ''బహుష నేను నిన్ను చంపేయగలనని అనుకుం టున్నాను'' అని జుగల్ గంభీరంగా సమాధానం ఇచ్చాడు. ఇది విన్న ముంతాజ్ పూర్తిగా మౌనం వహించాడు. ఆ మౌనం సుమారు ఎనిమిది రోజులు కొనసాగింది. ఓ రోజు,
అకస్మాత్తుగా నాలుగు గంటలకు సముద్రం ద్వారా కరాచీకి వెళ్లు తున్నట్లు చెప్పడంతో ముంతాజ్ మౌనం తెగిపోయింది. అతని ఈ నిర్ణయానికి మా ముగ్గురిలో ఎవరూ కూడా అతనితో మాట్లాడలేదు. ముంతాజ్ దేశం విడిచి వెళ్లడానికి మరో కారణం తన డైలాగ్, 'నేను నిన్ను చంపుతాను' అని జుగల్కు బాగా తెలుసు. జుగల్ తనను చంపగలడా లేడా అన్న విషయం పక్కనపెడితే... ముంతాజ్తో అలా చెప్పినవాడు తన ప్రాణ స్నేహితుడే! మా ముగ్గురిలో ముంతాజ్ చాలా సీరియస్ అయిపోయాడు. తక్కువగా మాట్లాడ సాగాడు. కానీ తను బయలుదేరే కొద్ది గంటల ముందు అసాధారణంగా మాట్లాడ సాగాడు. ఉదయం నిద్రలేవగానే తాగడం ప్రారంభించాడు. అతను ఎక్కడికో విహార యాత్రకు వెళ్లుతున్నవాడిలా తన సామానులు సర్దుకున్నాడు. తనే స్వయంగా మాట్లాడుకొంటూ నవ్వుకొంటూండేవాడు. తను బొంబాయిని వదిలి వెళ్లుతున్నందుకు అమితంగా సంతోషపడుతున్నట్లు పైకి కనిపిస్తూన్న తనలోని విషాద భావాలను అణిచి పెట్టుకొంటున్నాడని మా ముగ్గురికి అర్ధమైంది. తనకు తాను మోసపుచ్చుకొంటున్నాడు. స్వతహగా నేను ముంతాజ్‌ను ఇలా ఉన్నట్టుండి వెళ్లిపోవడానికి కారణమేమిటని అడగదలచు కున్నను. జుగల్తో కూడా సైగ చెసి చెప్పాను, విషయం రాబట్టమని. కాని ముంతాజ్ మాకావకాశమే ఇవ్వలేదు. జుగల్ మూడు నాలుగు పెగ్స్ తాగి మరింత మౌనంగా ఉండిపోయాడు. వెళ్లి మరో గదిలో పడుకున్నాడు. నేను, బ్రిజ్మోహన్ అతనితోనే ఉన్నాం. అతను చాలా బిల్లులు చెల్లించాల్సుంది. వైద్యుల ఫీజు చెల్లించాలి. లాండ్రీ నుండి బట్టలు తీసుకొనిరావాలి. అతను ఈ పనులన్నీ హుషారుగా చేయసాగాడు. కాని అతను నా కోసం సమీపంలోని హోటల్ పక్కన ఉన్న దుకాణం నుండి ఒక పాన్ తీసుకున్నప్పుడు, అతని కళ్ళలో కన్నీళ్ళు తిరిగాయి. బృజ్ మోహన్ భుజంపై చేయి వేసి, అక్కణుంచి వెళ్లుతూ మంద స్వరంతో అన్నాడు,
''గుర్తుందా బృజ్... పదేంళ్ల క్రితం మా ఆర్ధికపరిస్థితులు బాగలేనప్పుడు... గోవింద్ ఒక రుపాయి అప్పుగా ఇచ్చాడు'' అని అన్నాడు ముంతాజ్.
దారిలో ముంతాజ్ మౌనంగా ఉండిపోయాడు. ఇంటికి చేరుకున్నాక అతడు చాలా పనులు చేయడం మొదలెట్టాడు. అతని కలుపుగోరుతనానికి మేము విస్మయం చెందాం. బ్రిజ్మోహన్, నేను, జుగల్ మరియు ముంతాజ్ ఓడరేవు వైపు టాక్సీలో కెళ్లుతూన్నప్పుడు అందరం మౌనంగా ఉన్నాం. ముంతాజ్ కళ్ళు బొంబాయిలోని ఇరుకు సందులను విశాలమైన రోడ్లను వీడ్కోలు పలుకుతూన్నాయి. టాక్సీ తన గమ్యానికి చేరుకుంది. రేవు చాలా రద్దీగా ఉంది. వేల సంఖ్యలో వలసదారులున్నారు. చాలా తక్కువ మంది సంతోషంగాను, చాలా ఎక్కువ మంది బాధగాను వెళ్లుతున్నట్లనింపించింది. కాని నాకు మాత్రం కేవలం ముంతాజ్యే ఒంటరిగా వెళ్లుతున్నట్లనిపించింది. మమ్మల్ని విడిచి తెలియని ప్రదేశానికెళ్లుతున్నాడు. అక్కడ మంచి మనిషిగా వ్యవహారించ గలడా? అపరిచితుడిగానే ఉంటాడా? ఇది కేవలం నా ఆలోచనయే. మరి ముంతాజ్ ఏమాలోచిస్యున్నాడో!
క్యాబిన్లో సామానులన్నీ వెళ్లిపోయాక ముంతాజ్ మమ్మల్ని ఓడ పైకి తీసుకెళ్లాడు. అక్కడ ఆకాశం, సముద్రం ఆలింగనం చేసుకొంటున్నట్లనిపిస్తుంది. ముంతాజ్ చాలాసేపు వరకు అటువైపే చూడసాగాడు. అలా చూస్తూనే జుగల్ చేతిని తన చేతిలో తీసుకొని ఇలా అన్నాడు, ''సముద్రం ఆకాశం కలసుకోవడం... ఇది కేవలం దృష్టి దోషం. కాని చూడడానికిదెంతో అందంగా ఉంటుంది! జుగల్ మౌనంగా ఉండి పోయాడు. ఆ సమయంలో కూడా బహుష ముంతాజ్ మనసులో మస్తిష్కంలో జుగల్ చెప్పిన మాటలు...' నేనాలోచిస్తున్నాను. బహుష నేను నిన్ను చంపేయగలను' కెలుకుతున్నట్లున్నాయి. ముంతాజ్ ఓడ బార్ నుండి బ్రాందీని ఆదేశించాడు. అతను ఉదయం నుంచి ఇదే తాగుతున్నాడు. మేం నలుగురం చేతుల్లో గ్లాసులు పట్టుకొని ఓడ పిట్టగోడ నానుకొని నిలబడ్డాం. శరణార్థుల బృందాలు ఓడలో ప్రవేశించాయి. జలపక్షులు ఓడ చుట్టూ గాలిలో ప్రదక్షిణలు చేస్తున్నాయి. జుగల్ ఒకే గుక్కలో గాజు గ్లాసులోని బ్రాందిని గొంతు క్రిందికి దించుకున్నాడు. కొన్ని నిమిషాల మౌనం తర్వాత అన్నాడు, ''ముంతాజ్ నన్నుక్షమించు... ఆ రోజు నేను నిన్ను బాధించాను.'' ముంతాజ్ జుగల్ మొహంలో తేరపారి చూస్తూ, ''నేనా లోచిస్తున్నాను... బహుశ నేను నిన్ను చంపేయగలను... ఆరోజు నిజంగా నువ్విలాగే ఆలోచించావా? హృదయ సాక్షిగా నువ్వు తీసుకున్న నిర్ణయమిదేనా?'' అని ప్రశ్నించాడు. జుగల్ తల వంచుకున్నాడు. ''నేను అలా చెప్పాక చాలా బాధపడ్డాను'' అని అన్నాడు.
''నువ్వు నన్ను చంపినట్లయితే చాలా విచారించేవాడివి.'' ముంతాజ్ తాత్వికంగా చెప్పాడు. ''అలాంటి పరిస్థితుల్లో... ఒకవేళా నువ్వాలోచిస్తే... నువ్వు ముంతాజ్‌ను... ఓ ముస్లింను... ఓ స్నేహితుడిని కాదు కాని ఓ మానవున్ని చంపావు. ఒకవేళా వాడు నీచుడైతే వాడి నీచత్వాన్ని కాదు కాని స్వయంగా అతన్ని చంపావు. ఒక వేళ వాడు ముస్లిమైతే నువ్వతని ముస్లిమత్వాన్ని కాదు వాడి అస్తిత్వాన్ని నాశనం జేశావు... ఒకవేళ అతని శవం ముస్లిముల చేతికందుతే సమాధులలో ఒక సమాధి ఎక్కువవుతుంది. కాని ప్రపంచంలో ఓక మనిషి తక్కువవుతాడు.'' కొద్దిసేపు మౌనంగా ఉండి, కాసేపు ఆలోచించి, మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టాడు, ''బహుశా, నా తోటి మతం నన్ను అమరవీరుడు అని పిలుస్తుంది, కాని దేవుని మీద ప్రమాణం చేసి చెప్పుతున్నాను నేను సమాధిని చీల్చుకొని బయటికొచ్చి బిగ్గరగా అరుస్తూ 'అమరవీరుడి' ఈ డిగ్రీ నేను స్వీకరంచలేను. దానికి నేనెలాంటి పరీక్షే ఇవ్వలేదు. ''లాహోర్‌లో మీ పినతండ్రిని ఓ ముస్లిం చంపేశాడు. నువ్వీ వార్తను బొంబాయిలో విన్నావు. ఫలితంగా నన్ను హత్య చేశావు. నువ్వే చెప్పు మనం ఏలాంటి పతకానికి అరుÛ్హలం. లాహోర్‌లో హత్యకాబడిన నీ పినతండ్రి, హాంతకుడు ఏ బిరుదుకు హక్కుదారుడు. నా దృష్టిలో అయితే చచ్చిన వాళ్లు కుక్క చావు చచ్చారు. చంపినవాళ్లు అనవసరంగా... వందశాతం అన వసరంగా తమ చేతులను రక్తంతో పులుముకున్నారు. ''ముంతాజ్ మాట్లాడుతూన్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాడు. కానీ ముంతాజ్‌లో వారి కోసం అమితమైన వాత్సల్యం తొంగిచూడసాగింది. నా గుండెలో అతని మాటలు ముద్రలేసు కున్నాయి. ముఖ్యంగా అతను చెప్పిన మతం, ధర్మం, విశ్వాసం, నమ్మకం లాంటివి మన దేహాంలో కాకుండా మన ఆత్మలో ఉంటాయి. వీటిని కత్తులు కటారులు, తుపాకీ గోలీలతో జయించలేం. లేదా వీటిని మనం లోబరచుకోలేం. నేనతనితో చెప్పాను, '' నువ్వు చెప్పింది నిజమే'' అని. ఇది విన్నాక ముంతాజ్ పునర్వాలోచన చేసి, ''లేదు. అదంతా నిజం కాదు...'' తడబడుతు మళ్లీ అన్నాడు,... ''అంటే ఇదంతా నిజమే కాని నేను చెప్పదలచుకుంది... బహుశ మీతో సరిగా చెప్పలేక పోయానేమో. నా ఉద్దేశంలో మతం అంటే ఆ మతం... ఆ ధర్మం కాదు. ఎందులోనైతే తొంభై శాతం దాన్ని పాటిస్తు న్నారో... నాఉద్దేశంలో ఒక మనిషిని మరో మనిషితో సత్సంబంధం కలిపి ఉంచే ప్రత్యేకమైన యధార్ధం. కాని ఏమిటా యధార్ధం? నా దురదృష్టమేమిటంటే నేను దాన్ని నా అరచేతిలో పెట్టి చూపించలేను!'' అలా చెప్పుతూండగా అతని కళ్లలో ఓ మెరుపు లాంటిది మెరిసింది. తనలో తానే ప్రశ్నించుకొంటున్నట్లు ప్రశ్నించాడు, ''కాని వాడిలో ఉన్న ప్రత్యేకతేమిటీ? మౌలికవాది హిందూవా?...వృత్తి నీచమైనదే అయినా అతని ఆత్మ దేదీప్యమానంగా వెలగసాగింది?'' ''ఎవరిది?'' అని నేనడిగాను.
''ఓ భడవాది!''
మేం ముగ్గురం ఆశ్చర్యపోయాం. ముంతాజ్ గొంతులో ఏలాంటి మొహమాట లేదు.
నేను కొంచెం సీరియస్‌గా అడిగాను, ''ఓ దుర్మార్గుడిదా?'' ''అతనెలాంటి వ్యక్తని నేనాశ్చర్యపోతున్నాను. పైగా ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే అతను మహిళలను వేశ్యవృత్తిలో దింపేవాడు. మహిళల బ్రోకర్... పింప్. కాని మంచి మనసుగలవాడు!'' తలాడిస్తూ
చెప్పాడు ముంతాజ్. ముంతాజ్ కొద్దిసేపు ఆగిపోయాడు యేవో పాత సంఘటన లను స్మరిస్తూన్నట్లుగా. కొద్ది క్షణాల తర్వాత అతను
మళ్లీ మాట్లాడటం ప్రారంభించాడు, ''అతని పూర్తి పేరు నాకు సరిగా గుర్తులేదు... ఏదో సహారు... బనారస్ నివాసి.
చాలా శుభ్రంగా ఉండేవాడు. అతను నివసించే చోటు చాలా ఇరుకుగా ఉండేది. కానీ దాన్నిచక్కగా వివిధ అరలలో
అమర్చాడు.... పర్దా కూడా వేసి ఉండేది. ''మంచాలు, పడకలు లేవు కానీ గుడ్డపీలికలతో చేసిన పెద్ద పరుపులు, వాటిపైన దిండ్లు ఉండేవి. దుప్పట్లు ఎప్పుడూ తెల్లగానే ఉంటాయి. పనిమనిషి ఉన్న తనే స్వయంగా తన చేతులతో ఇంటిని శుభ్రపరిచేవాడు. తన భుజాలపై ఉన్న తన బాధ్యతల నుంచి ఎప్పుడు తప్పుకోలేదు. దగా, మోసం చేయలేదు. ''అర్ధ రాత్రి దాటిన తర్వాత చుట్టూప్రక్కల నీళ్లు కలిపిన సార దొరికేది. అతడు అలాంటి సారా కొనుక్కొని డబ్బులు వృధా చేయకండని చెప్పుతూండేవాడు. అంతేకాదు అతను మూడు సంవత్సరాల వ్యవధిలో ఇరవైవేల రూపాయలు సంపాదించాడని కూడా అతను నాతో చెప్పాడు. ''అతను ప్రతి పదిలో రెండున్నర కమీషన్ తీసుకొనే వాడు. అలా పదివేల రూపాయలు కూడబెట్టుకున్నాడు. అలా మొత్తం ముప్పై వేల రూపాయలు జమ అయ్యాక తను తిరిగి బెనారస్ వెళ్తానని చెప్పాడు. అక్కడ ఒక బట్టల దుకాణాన్ని తెరుస్తానన్నాడు. తను బట్టల దుకాణన్ని మాత్రమే తెరవడానికి ఎందుకు ఆసక్తి చూపుతున్నాడో నేను చెప్పలేను.
ఇంతవరకు విన్న తర్వాత నా నోటి నుంచి, ''విచిత్రమైన మనిషి'' అని వెలువడింది. ముంతాజ్ తన సంభాషణను కొనసాగించాడు, ''అతను గొప్పలు పలుకుతున్నాడనుకున్నాను. నేనతన్ని ఓ పెద్ద మోసకారి అని అనుకున్నాను. అతని వ్యాపారంలో పాలుపంచుకున్న అమ్మాయిలందర్ని కూతురుల్లా చూసుకొంటున్నానని చెప్పితే ఎవరు నమ్ముతారు? ఆ సమయంలో అతను ప్రతి అమ్మాయి పేరు మీద
పోస్టాఫీసులో పొదుపు ఖాతా తెరిచి, ప్రతి నెల మొత్తం ఆదాయాన్ని వారివారి ఖాతాలల్లో డిపాజిట్ చేయడం
నాకు వింతగా అనిపించింది. ''అతని మాటలు నాకు పూర్తిగా నమ్మశక్యం కాలేదు.. అతను పది-పన్నెండు మంది బాలికల భోజనానికి తన జేబులో నుండి చెల్లించడం... అతని ప్రతి మాట మితిమీరినట్లుగా అనిపిస్తుంది. ఓ రోజు నేను అతని దగ్గరికెళ్లాను. మీనా, సకినా ఇద్దరు సెలవులో ఉన్నారని చెప్పాడు. అంతేకాదు వారిద్దరికీ వారంలో ఒక రోజు సెలవు ఇస్తానని చెప్పాడు. వారు బయటకు వెళ్లి ఏదో ఒక హోటల్లో మాంసం తినొచ్చు! ఇక్కడ అందరూ శాకాహారులని మీకు తెలుసే కదా.'' అతని మాటలు విన్నాక నేను నా హృదయంలో నవ్వుకున్నాను. నన్ను మూర్ఖుడనుకొంటున్నాడేమో!. ఒక రోజు అతను నాతో, 'అహ్మదాబాద్‌లో ఉండే ఒక హిందూ అమ్మాయి పెండ్లి తన ముస్లిం క్లైంట్తో చేయించానని చెప్పాడు. అతడు లాహోర్ నుండి ఒక లేఖ రాశాడని అందులో దాతా సాహెబ్ దర్బారులో ఓ వరం కోరుకున్నానని , అది నెరవేరిందని చెప్పాడు. సహారు కోసం తొందరగా ముప్పైవేల రూపాయల బందోబస్తూ అయిపోవాలని, అతడు బనారస్ వచ్చి బట్టల దుకాణం తెరవాలని ఆ దర్బారులో కోరుకున్నాని కూడా చెప్పాడు. ఇది విన్నాక నేను నవ్వు ఆపుకోలేక పోయాను. నేను ముస్లిం కావడం వల్ల నన్ను సంతోషపరచడానికి అలా ప్రయత్నిస్తున్నాడ నుకున్నాను. నేను ముంతాజ్తో అన్నాను, ''నీ ఆలోచన తప్పేమో?'' నని.
''ఊ...అలాంటిదేమి లేదు! అతడి వ్యవహారంలో ఏలాంటి లోపం లేదు. బహుశ అతని జీవితం లో ఏమైన సమస్యలుండి ఉంటాయి... కాని అతనో మంచిమనిషి.
''నీకిదెలా తెలుసు?'' అని జుగల్ ప్రశ్నించాడు. ''అతని చావు వల్ల'' అని సమాధానమిచ్చి కొన్ని క్షణాల వరకు మౌనం వహించాడు. ఆకాశం, సముద్రం దట్టమైన పొగ మంచులో నిర్బంధించబడి ఉన్నట్లు గోచరమవుతోంది.
''అల్లర్లు మొదలైయ్యాయి...నేను ఉదయమే లేచి భేండి బజార్లో నుంచి వెళ్లసాగాను... కర్ఫ్యూ ఉండడం వల్ల జన రద్దీ చాలా తక్కువగా ఉంది. ట్రామ్ కూడా నడవడం లేదు... నేను టాక్సీ కోసం కోసుల దూరం నడుస్తూ జె జె హాస్పిటల్ వరకు చేరుకున్నాను. అక్కడ ఓ మూలన కాళ్లు చేతులు ముడుచుకొని పడుకున్నవాడెవడో పడి ఉన్నాడు. కూలి నాలి పని చేసుకునేవాడేమోననుకున్నాను. కాని అక్కడక్కడ నేల మీద రక్తం బొట్లు చూసి ఆగిపోయాను. తీక్షణంగా నేల మీద చూపులానించి చూడగా రక్తం మడుగు కనిపించింది... ఇదేదో హత్యగొడవలా ఉందనుకున్నాను. తోకమలచి వెళ్లిపోదా మనుకుంటుండగా నిర్జీవంగా పడిఉన్న వాడిలో చలనం కనిపించింది. నేను ఆగిపోయాను. వంగి అతని మొహంలో చూడసాగాను.
తెలిసిన మొహంలా ఉంది. తేరపారి చుశాను. సహారు మొహంలా ఉంది. రక్తంతో మొహం పులిమి ఉంది. అతని దగ్గర ఫుట్ పాత్ మీద కూర్చున్నాను. తదేకంగా అతన్ని చూడసాగాను. అతను వేసుకునే తెల్లని కమీజు ఎప్పుడు ఏలాంటి మరకలు లేకుండా ఉంటుంది. అదిప్పుడు రక్తంలో తడిసి ఉంది. గాయాలు బహుశ ఛాతీ పై ఉన్నట్లున్నాయి. అతడు నెమ్మదిగా మూలుగ సాగాడు. నేనతని భుజాన్ని పట్టుకొని కదిపాను. నిద్రబోతూన్న వాడిని లేపుతున్నట్లు. ఓ రెండుసార్లు నేనతన్ని పేరుపెట్టి పిలిచాను...అతడు ఊ...ఆ...అని కూడా పలక లేదు. నేను లేచి వెళ్లబోతూండగా అతడు కండ్లు తెరిచాడు. చాలా సేపువరకు అతడు అరతెరచిన కండ్లతో నా వైపు చూడసాగాడు. అలా కొంచం సేపువరకు చూడసాగాడు. అతని శరీరంలో శక్తి పుంజు కొచ్చినట్లైంది. నన్ను గుర్తుపట్టి, ''మీరు..మీరు'' అని అన్నాడు. నేనతనితో ప్రశ్నలడగసాగాను. 'ఇక్కడికెందుకొచ్చావు? ఎలా వచ్చావు? ఎవరు నిన్ను గాయపరిచారు? ఎప్పట్నుంచి ఫుట్ పాత్ మీద పడి ఉన్నావు? ఎదురుగా హాస్పిటల్ ఉంది. అంబులెన్స్ తెప్పించన...?' అని అడిగాను.
అతనిలో మాట్లాడే శక్తి లేదు. నేనడిగిన ప్రశ్నలకు, మూలుగుతు అతి కష్టం మీద అన్నాడు,''నా రోజులు పూర్తయ్యాయి... దేవుడిలా రాసి పెట్టాడు.'' దేవుడేమి రాసిపెట్టాడోగాని.. నాకైతే మంచిగా అనిపించలేదు. నేనో ముస్లిమై ఉండి, ముస్లిముల ప్రాంతంలో, అతడు హిందువు అని తెలిసి... అతన్ని హత్య చేసినవాడు ముస్లిం... అతని జీవితపు చివరి ఘడియల్లో అతనికి దగ్గరున్నవాడు కూడా ముస్లిమే. నేను పిరికిపందనైతే కాదు. కాని అప్పుడు నా స్థితి పిరికివాడికన్న అధ్వానంగా ఉంది. ఓ వైపు మనసులో భయం గూడుకట్టుకొని ఉంది. బహుశ నేను పట్టుబడిపోతానేమో! రెండోవైపు పట్టుకోబడకపోతే ఆరా తీయడానికైన నేను పిలవబడుతానేమో? ఒకవేళ అతన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లితే... నన్ను ఇరికించడానికి ఏదైన పన్నాగం పన్నితే! కాని మరోసారి ఆలోచించాను. ఏలాగైన చావాల్సిందేగా. వీడితో కలసే చచ్చి పోదా మనుకున్నాను. ఇలా ఆలోచించుకొంటు వెళ్లుతూండగానే... మరోవిధంగా చెప్పాలంటే పలాయన మంత్రం పఠిస్తూండగ... సహరు నన్ను పిలిచాడు... నేను ఆగిపోయాను...అసలు ఆగాలని అనుకోలేదు... కాని ఆగిపోయాను.
అతని వైపు చూశాను... చెప్పేదేదో త్వరగా చెప్పేరు అన్నట్లు. అతడు నొప్పుల బాధతో అతి కష్టంగా తన కమీజ్
బొత్తాలు విడదీసి తన చేతిని కమీజ్‌లో దొప్పాడు. కాని అతడు తన చేతిని ఆడించే శక్తి కోల్పోవడంతో, ''కమీజ్ లోపలి జేబులో కొన్ని ఆభరణాలు మరియు పండేండు వందల రూపాయలున్నాయి... ఇవి... ఇవి సుల్తాన కోసం...ఈ రోజు ఆమెకు పంపించాల్సింది... కాని... కాని అపాయం పెరిగిపోయిన సంగతి నీకు తెలుసేకదా... మీరు ఆమెకు అందజేయగలరు... వెంటనే వెళ్లిపొమ్మని చెప్పండి. మీరు జాగ్రత్త పాటించండి'' అని అన్నాడు. ముంతాజ్ నోట్లో మాటల్లేవు. జె.జె హాస్పిటల్ ఫుట్ పాత్‌పై ఉబికొచ్చిన ముంతాజ్ గొంతును... ఉవ్వెత్తున లేచిన సహారు గొంతును గమనిస్తే దూరంగా అతిదూరంగా... ఎక్కడైతే ఆకాశం, సముద్రం ఆలింగనం చేసుకొంటున్నాయో... వాటి నిగుడార్ధం... అర్ధం అవుతున్నాయి! ఓడ విజిల్ ఇచ్చింది.
''నేను సుల్తానాతో కలిశాను... ఆమెకు జ్యూలెరీ, డబ్బులిచ్చాను. ఆమె కండ్లలో నీళ్లు తిరిగాయి.'' అని ముంతాజ్ చెప్పాడు. మేము ముంతాజ్‌కు వీడ్కోలు ఇచ్చి ఓడ నుంచి క్రిందికి దిగాం. ముంతాజ్ ఓడపై ఉన్న పిట్టగోడనానుకొని నిలబడి ఉన్నాడు. మావైపే చూస్తున్నాడు, తన కుడిచేతిని ఊపుతూ. నేను జుగల్ మొహం వైపు చూస్తూ అన్నాను, ''ముంతాజ్, సహారు ఆత్మను పిలుస్తున్నట్లని పించడం లేదా... తన తోటి ప్రయాణికుడికోసం!? జుగల్ ఓ పెద్ద నిశ్వాస తీస్తూ ముక్తసరిగా చెప్పాడు, ''ఒకవేళ... నేను సహారు ఆత్మనైతే ధన్యుడైపోయేవాడిని.''
ఉర్దూ మూలం : సాదత్ హసన్ మంటు
తెలుగు అనువాదం: అమ్జద్