Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాలులో నాన్న ఫోటో ముందరి నూనె దీపం చూస్తూ చెమ్మగిల్లిన కళ్ళతో ఇలా చెప్పడం ప్రారంభించింది. ''మా నాన్న ఫోటో స్టాట్ అంగడి నడుపుతూ జిరాక్స్ కాపీల ద్వారా వచ్చే ఆదాయంతో సంసారం నడిపే వాడు. ఒక రోజు అర్జెంటుగా బ్యాంకుకు వెళ్ళాల్సి రావడంతో ఫ్రెండు స్కూటర్ తీసుకుని బయలుదేరాడు. రోడ్డులో బుల్లెట్ బండి మీద వెళ్తున్న పిల్లోళ్ళు గట్టిగా హారన్ కొట్టడంతో నాయన ఉలిక్కి పడ్డాడు. బండిని షేక్ చేయడంతో డివైడర్ని 'డీ' కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. వ్యాపారం కోసం నాన్న చేసిన పది లక్షల అప్పుకు మా చిన్న సంసారం అతలా కుతలమయ్యింది.
''ఏమండీ, నేను బడికి బస్సుల్లో వెళ్లి రాలేను, నా వల్ల కావడం లేదు. ఎప్పుడూ ప్రయాaణీకులతో కిటకిట లాడే బస్సు ప్రయాణం చేయడం నా ప్రాణాల మీదికి వస్తోంది'' బ్యాగును సోఫా మీద పడేసి బాధగా చెప్పింది బబిత.
చిన్న బిడ్డ బడికి వెళ్లి రావడమంటే ఎలా ముఖం మాడ్చుకుంటుందో, అలా ముఖం పెడుతుంది. ప్రతి రోజూ ఆమె. పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి బస్సులోనే వెళ్లి వస్తుంది.
''ఏమి చేద్దాం బబిత, నా పనులు నాకు ఉంటున్నాయి. నిన్ను డ్రాప్ చేయడం, పిక్ అప్ చేసుకోవడం నాకు కుదరని పని. వచ్చే సంవత్సరం జరిగే ట్రాన్స్ఫర్స్ కౌన్సిలింగ్లో అయినా మనకు పట్టణంలో పోస్టింగ్ దొరుకుతుందేమో, వేచి చూద్దాం'' అని అన్నాడు చక్రపాణి.
గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం చేస్తోంది బబిత. పట్టణంలో పెద్ద పేరున్న ఫోటో స్టూడియో ఓనర్ చక్రపాణి.
రీడింగ్ రూమ్‌లో ఉన్న ఇంటర్ చదివే కూతురు గబగబా వచ్చి ''అమ్మకి టూ వీలర్ కొనివ్వు నాన్నా, ఎంచక్కా బండిలో సర్రున వెళ్లి వచ్చేస్తుంది'' అని ఉచిత సలహా ఒకటి ఇచ్చింది.
''అవును నిజమే, మన అమ్మాయి మంచి సలహా ఇచ్చింది. ఎంతైనా యంగ్ జనరేషన్ కదా, వారి మెదడులో నుంచి మెరుపు లాంటి థాట్స్ వస్తాయి'' అని కూతురుపై ప్రశంసల వర్షం కురిపించాడు.
''జరిగే పని చెప్పండి. ఈ యాభై ఏళ్ల వయసులో, డెబ్బై కేజీల బరువుతో, ఎప్పుడు బండి నేర్చుకునేది, బండి లైసెన్సు ఎప్పుడు తీసుకునేది?'' అని నిట్టూర్చింది బబిత.
''ముదితల్ నేర్వగ రాని విద్య గలదే ముద్దార నేర్పించినన్!'' చిలకమర్తి వారి పద్య పాదం చదివి వినిపించాడు. ''పద్యాలు చదివినంత సులువు కాదండీ, టూ వీలర్ డ్రైవింగ్ చెయ్యడం '' అంది.
''లేదు బబిత, నువ్వు 'ఊ' అను. డ్రైవింగ్ నేర్పే అమ్మాయిని ఏర్పాటు చేస్తాను. ఎంచక్కా రెండు వారాల్లో నేర్చుకోగలవు. నీకు సైక్లింగ్ బాగా తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు'' అని నచ్చ చెప్పాడు.
''అమ్మా, నువ్వే నాకు ఎన్నో సార్లు చెప్పావు, స్విమ్మింగ్, డ్రైవింగ్ లాంటివి నేర్చుకోవడం అనేది ఆస్తి లాంటిదని, అవి మనకు జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా ఉపయోగపడతాయని'' ...ఒత్తిడి చేసింది కూతురు.
బబితకు ఒప్పుకోక తప్పింది కాదు.
మరునాడే చక్రపాణి తన హుండాయి కారులో వెళ్లి టూ వీలర్ షో రూమ్ వారిని కలిసాడు. తన వద్ద టీవి ఎస్ జుపిటర్ బండి ఉందని, తన భార్యకు డ్రైవింగ్ నేర్పడానికి అమ్మాయి కావాలని అడిగాడు.
గతంలో తమ సంస్థ వారే అలాంటి సౌకర్యం ఏర్పాటు చేసేవారని, అయితే అది గిట్టుబాటు వ్యవహారం కాకపోవ డంతో ప్రస్తుతానికి ఆ సౌకర్యం కల్పించ లేక పోతున్నామని సమాధానమిచ్చారు. అయితే పట్టణంలోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్ వద్ద అశ్విని అనే అమ్మాయి కొందరికి డ్రైవింగ్ నేర్పిస్తోందని విన్నామని, వెళ్లి ప్రయత్నించమని సలహా ఇచ్చారు.
అప్పుడప్పుడే తెల్లారుతోంది.
ఎర్రటి మట్టి, అక్కడక్కడ పచ్చ గడ్డి ఉన్న గ్రౌండ్లో అయిదు మంది అమ్మాయిలకు అశ్విని టూ వీలర్ డ్రైవింగ్ నేర్పుతోంది. ఎంతో చలాకీగా ఓపికగా, వారికి సూచనలిస్తోంది.
మెయిన్ రోడ్డులో, చిన్న సందుల్లో ఎలా బండి నడపాలో చెబుతోంది. బండి సిగల్స్‌ను ఎలా ఉపయోగించాలి, రోడ్డు సిగల్స్‌ను ఎలా అర్ధం చేసుకోవాలి లాంటివి కూడా వివరిస్తోంది. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చేసి చూపిస్తోంది. లెర్నింగ్ ప్రాక్టీసు కోసం వచ్చిన అమ్మాయిలంతా ఎంతో ఆసక్తిగా వింటున్నారు.
చిన్నగా ఆమె దగ్గరికి వెళ్లి తనని పరిచయం చేసుకున్నాడు. మా ఆవిడకు డ్రైవింగ్ నేర్పించాలని అడిగాడు. సంతోషంగా ఒప్పుకుంది.
''ఫీజు ఎంత'' అని అడిగాడు.
''మీరు ఇచ్చినంత'' అని గలగల నవ్వుతూ ''రేపటి నుండి మీ ఇంటికే వచ్చి నేర్పిస్తాను'' అని చెప్పి అడ్రసు తీసుకుని తన పాత సైకిల్లో సర్రున వెళ్ళిపోయింది.
ప్రతి రోజు ఉదయం ఆరింటికే ఇంటి వద్దకి వచ్చేది అశ్విని. బండి తీసుకుని బబిత బయలుదేరుతుంటే ఇరుగు పొరుగు అమ్మలక్కలు సినిమా షూటింగ్ చూసినట్లు చూసేవారు. మొదటి మూడు రోజులు వారి చూపులకు తట్టుకోలేక భర్తతో చెప్పి బాధ పడింది. ''లోకులు పలు కాకులు, పట్టించుకోవద్దు'' అని భర్త ధైర్యం చెప్పాడు. నాలుగు రోజుల తర్వాత ఆ ఇరుగు పొరుగే చిన్నగా చేయి ఊపుతూ టాటాలు చెప్పారు. వారం తర్వాత ''మీరు సూపర్ ఆంటీ, భలే డ్రైవింగ్ చేస్తున్నారు'' అని పొగడ్తల వర్షం కురిపించారు. మనసులోనే నవ్వుకుంది బబిత.
గంట సేపు కాలేజీ గ్రౌండ్ లోనూ, మెయిన్ రోడ్డు లోనూ, చిన్న సందుల్లోనూ, తిప్పి తిప్పి ...ఎలాగోలా బబితకు రెండు వారాలకు బండి నేర్పించేసింది అశ్విని.
ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత సంతోషమైన ముఖంతో, బబిత బండిని 'రురు రురు' అని నడపడం చూసి ఇంట్లో వారు మురిసిపోయేవారు. 'అవసరమే ఎవరినైనా ఐన్‌స్టీన్‌ను చేస్తుంది' అన్న ఓ పెద్దాయన మాటలు గుర్తుకు తెచ్చుకున్న చక్రపాణి ముసిముసి నవ్వులు నవ్వాడు. పనిలో పనిగా డ్రైవింగ్ లైసెన్స్ ప్రాసెస్ కూడా ప్రారంభించారు.
ప్రాక్టీసు గ్లాసుల చివరి రోజు మెయిన్ రోడ్డులో బబిత బండిని డ్రైవ్ చేస్తోంది. వెనుకన అశ్విని కూర్చుని ఉంది. రోడ్డులో పెద్ద గుంత ఉండడం గమనించని బబిత, బండిని గుంతలోకి దించడంతో బండి ఎగిరి పడింది. బండితో పాటు ఇద్దరూ రోడ్డు మీద పడ్డారు. బబితకు గాయలేమీ తగల లేదు. అశ్వినికి మాత్రం కాలు బెణికింది.
విషయం తెలిసి చక్రపాణి భార్యతో పాటు గబగబా అశ్వినిని ఆటోలో తీసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. అప్పటికే వందమంది స్టూడెంట్స్ అక్కడికి చేరి ఉన్నారు. వారు గబగబా ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డు లోకి అశ్వినిని తీసుకెళ్ళారు.
''ఈమె వెనుక ఇంత మంది ఉన్నారా'' అని ఆశ్చర్య పోయారు చక్రపాణి దంపతులు. ఇంకా మరికొంత మంది స్టూడెంట్స్ అక్కడికి చేరి అశ్విని బాగోగులు విచారిస్తున్నారు. తమ టూ వీలర్లకు 'ఎల్' బోర్డు తగిలించుకుని వచ్చిన అయిదు మంది అమ్మాయిలు ''మేడమ్ కి ఏమీ కాలేదు కదా'' అని రిసెప్షన్ వారిని అడుగుతున్నారు.
ఇంతలో ఒక వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసిన కుర్రాడు ''సార్, నేను ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్‌ను. మా కాలేజీ ఫైనల్ ఇయర్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అశ్వినిని సకాలంలో హాస్పిటల్లో చేర్చారు, మీకు చాలా థ్యాంక్స్ అండీ'' అన్నాడు.
తమకు డ్రైవింగ్ నేర్పించే అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతోందని, పార్ట్ టైంగా ఈ పని చేస్తోందని తెలిసి చక్రపాణి దంపతులు ఆశ్చర్యపోయారు.
మూడు నెలలు గడిచిపోయాయి.
బబితకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరయ్యింది. అశ్వినికి బెణికిన కాలు కూడా బాగయ్యింది.
ఒక చల్లటి సాయంత్రం కారులో చక్రపాణి, బబిత, వారి అమ్మాయి పూలు పండ్లు తీసుకుని అశ్విని ఇంటికి వెళ్లారు.
ఇంటి ముందర తన పాత సైకిల్ని అశ్విని నీళ్లేసి కడుగుతోంది. చక్రపాణి ఫ్యామిలీని అభిమానంగా ఇంట్లోకి ఆహ్వానించింది అశ్విని అమ్మ. మంచి చెడ్డలు మాట్లాడాక ''ఇంజనీరింగ్ చదువుతున్న నీవు డ్రైవింగ్ నేర్పే వృత్తిని ఎందుకు ఎన్నుకున్నావు'' అని అశ్వినిని అడిగాడు చక్రపాణి.
హాలులో నాన్న ఫోటో ముందరి నూనె దీపం చూస్తూ చెమ్మగిల్లిన కళ్ళతో ఇలా చెప్పడం ప్రారంభించింది.
''మా నాన్న ఫోటో స్టాట్ అంగడి నడుపుతూ జిరాక్స్ కాపీల ద్వారా వచ్చే ఆదాయంతో సంసారం నడిపే వాడు. ఒక రోజు అర్జెంటుగా బ్యాంకుకు వెళ్ళాల్సి రావడంతో ఫ్రెండు స్కూటర్ తీసుకుని బయలుదేరాడు. రోడ్డులో బుల్లెట్ బండి మీద వెళ్తున్న పిల్లోళ్ళు గట్టిగా హారన్ కొట్టడంతో నాయన ఉలిక్కి పడ్డాడు. బండిని షేక్ చేయడంతో డివైడర్ని 'డీ' కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు.
వ్యాపారం కోసం నాన్న చేసిన పది లక్షల అప్పుకు మా చిన్న సంసారం అతలా కుతలమయ్యింది. అప్పుల వాళ్ళు చుట్టు ముట్టారు. ఏమి చెయ్యాల్నో మాకు దిక్కుతోచ లేదు. అయిదు లక్షల ఇన్సూరెన్స్ పాలసీ గుర్తుకొచ్చింది. సాధారణ మరణమైతే అయిదు లక్షలు, యాక్సిడెంట్ మరణమైతే పది లక్షలు వస్తాయని విని ఉన్నాము.
ఇన్సూరెన్స్ అధికారులను కలిసాము. లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేస్తూ చనిపోయాడు కాబట్టి అయిదు లక్షలు మాత్రమే ఇస్తామన్నారు. యాక్సిడెంట్ మరణంకి అదనంగా ఇచ్చే అయిదు లక్షలు ఇవ్వలేమని చెప్పారు.
అప్పులిచ్చిన వారిని ఇంటికి పిలిచి నిదానంగా అయినా అప్పులు తీరుస్తామని అందరికీ నచ్చ చెప్పి, మా వద్ద ఉన్న డబ్బులిచ్చి ఒప్పించాము.
ప్రాణ నష్టంతో పాటు ఆర్థిక నష్టం జరగడంతో సంసారాన్ని ఎలా నడపాలని మా ఫ్యామిలీ అంతా కూర్చుని మాట్లాడు కున్నాము. డ్రైవింగ్ తెలిసి లైసెన్సు వున్న నేను ఈ వృత్తిని ఎన్నుకున్నాను. దీనిని ఎంపిక చేసుకోవడంలో నాకు ఎంతో కసి వుంది. లైసెన్సు లేకుండా డ్రైవింగ్ చేసినందువల్ల కదా, మాకు యాక్సిడెంట్ డబ్బులు రాలేదు. లైసెన్సు లేకుండా ఎవ్వరూ బండిని రోడ్డు మీదికి తీసుకు రాకుండా నా వంతు ప్రయత్నం చేయాలని నిర్ణయించుకున్నాను.
మొదట్లో ''ఆడపిల్ల మగరాయుడులాగా డ్రైవింగ్ నేర్పడ మేమిటి'' అని కొందరు కామెంట్లు చేశారు. అయినా నేను వాటిని పట్టించుకోలేదు. మరింత పట్టుదలతో ఎక్కువ మందికి డ్రైవింగ్ నేర్పించడమే ధ్యేయంగా చేసుకున్నాను. డబ్బులు ఇంత ఇవ్వాలని నేను ఎవ్వరినీ గట్టిగా పట్టుపట్టి అడగలేదు. ఇచ్చింది తీసుకుంటున్నాను. దీని ద్వారా వచ్చే ఆదాయంతో మా సంసారం నడుస్తోంది, చిన్నగా అప్పులు తీర్చేస్తున్నాము. నాకు ఉద్యోగం ఏదైనా దొరికినా ఈ వృత్తి మాత్రం మానను, ఎందుకంటే డ్రైవింగ్, లైసెన్స్‌ల విలువ నాకు తెలుసు కాబట్టి''
''చాలా గొప్ప పని చేస్తున్నావమ్మా'' అని అభినందించారు చక్రపాణి దంపతులు. చిన్నగా లేచి కారు వద్దకు చేరారు.
''అశ్వినీ, వచ్చే బుధవారం కళ్యాణ మండపాల వద్ద ఉన్న టూ వీలర్ షో రూమ్‌కి నీవు రావాలి''
''ఏమి సార్.. విశేషం, మేడమ్ కొత్త బండి ఏమైనా కొంటున్నారా'' అని అడిగింది. ''అవును, కొంటున్నాము, ఆమెతో పాటు నీకు కూడా'' ''నాకెందుకు సార్''
''ఇది మేము నీకు ఇచ్చే గిఫ్ట్, కాదనవద్దు. నీలాంటి గొప్ప ఆలోచనలు ఉన్న అమ్మాయిలు ఈ సమాజానికి కావాలి'' అని చెప్పి కారులో సర్రున వెళ్ళిపోయారు.
పమిట కొంగుతో తడి కళ్ళను తుడుచుకుంటోంది అశ్విని అమ్మ. ఫోటోలోని నాన్న నవ్వుతూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అశ్విని క్లాస్ మెట్ బండి మీద వున్న 'ఎల్' బోర్డు మిలమిలా మెరుస్తోంది.
- ఆర్ సి కృష్ణ స్వామి రాజు, 9393662821