Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తండ్రి ఆనారోగ్యంగా ఉన్నాడని తెలిసి ఉన్న ఫలంగా దుబారు నుంచి వచ్చిన శంకర్‌కు లాక్ డౌన్ స్వాగతం పలికింది. విమానం ఎక్కడో కారడవిలో ల్యాండై విడిచినట్టుగా ఉంది. ఊపిరి బిగబట్టినట్లు అనిపిం చింది. జన సంచారం లేదు. మనుషులపైన అపనమ్మకం మొదటిసారి కల్గింది. దూరం దూరంగా ఉండి మాట్లాడు తున్న మనుషులు. అందరూ ఎంత సన్నిహితులైనా అపరిచిత వ్యక్తులుగా మసలుతున్నరు.మనుషుల నుంచి సహాయం ఆశించని ఆపత్కాలం. ఏవో భయాలను నిద్రలేపినట్టు ఆ రాత్రి గడిచింది.
ఇంటికి చేరిన శంకర్ ఏదో విజయం సాధించానని గర్వపడ్డాడు. ఇంటికి వచ్చినపుడు ఎన్నడూ ఇంత ఆనందపడలేదు. వందల కిలోమీటర్లు నడిచి ఇంటికి చేరుకోవడం తనకు వింత అనుభూతినిచ్చింది. అడుగడుగునా పోలీసు ప్రశ్నలను, లాఠీలను ఎదుర్కొని గమ్యాన్ని చేరాడు.
ఊరిని విడిచి తనది కాని దేశంలో బతుకుదెరువు వెతుక్కున్నడు. నాలుగు పైసలు మిగిలించుకొని ఉన్న ఊరిలోనే ఏదైనా దందా చేసుకొని బతకాలని ఉన్నా అప్పులు తీరకపోవడంతో ఆ కోరిక ఎపుడు వాయిదా పడుతోంది. తండ్రి ఆనారోగ్యంగా ఉన్నాడని తెలిసి ఉన్న ఫలంగా దుబారు నుంచి వచ్చిన శంకర్‌కు లాక్ డౌన్ స్వాగతం పలికింది. విమానం ఎక్కడో కారడవిలో ల్యాండై విడిచినట్టుగా ఉంది. ఊపిరి బిగబట్టినట్లు అనిపిం చింది. జన సంచారం లేదు. మనుషులపైన అపనమ్మకం మొదటిసారి కల్గింది. దూరం దూరంగా ఉండి మాట్లాడు తున్న మనుషులు. అందరూ ఎంత సన్నిహితులైనా అపరిచిత వ్యక్తులుగా మసలుతున్నరు. మనుషుల నుంచి సహాయం ఆశించని ఆపత్కాలం. ఏవో భయాలను నిద్రలేపినట్టు ఆ రాత్రి గడిచింది. నడక ఒక్కటే తనకు మిగిలింది. ఎంతకు ఒడువని దారి. రాత్రి పగలు నడిచాడు. మొదట తను ఒక్కడే అనుకున్నాడు. వేయిల మంది. కొన్ని లక్షల మంది. గూడు చెదిరిన పక్షులలాగా రోడ్డు మీద పడ్డారు. తనలాగే బతుకును వెతుక్కున్నోళ్లు. మల మల మాడుతూ ఇంటి ముఖం పట్టారు. తను విదేశంలో, వాళ్లు స్వదేశంలోనే. ఇద్దరు రెక్కల కష్టాన్ని నమ్మారు. నగరంలో ఏమి మిగిల్చుకోని అభాగ్యులు ఇనుప డబ్బాతో ఎట్లావచ్చారో అట్లానే తిరుగు ప్రయాణమైండ్లు. దారి వెంట హృదయ విదారక సంఘటనలు చూసిన మనసు ఇంటికి చేరుకునేసరికి స్థిమితపడ్డది. ఊరట దొరికింది.
బిడ్డ రాక కోసం వేయి కండ్లతో ఎదురు చూస్తున్న నర్సవ్వకొడుకు వచ్చేసరికి ఆనందంతో ఏడ్చినంత పనిచేసింది. చెల్లెలు లక్ష్మీ దూరం నుంచే ''అన్న... అమ్మ అన్నచ్చిండే...'' అవధులేని సంతోషంతో అన్నను చుట్టుకొని, భారంగా మోస్తున్న బ్యాగులను అందుకొంది లక్ష్మీ. కనుల నిండా నిండిన కన్నీళ్లను కొంగుతో అదుముకుంటూ ''బిడ్డ... శంకర్... వచ్చి నావురా...నీ కోసం ఎదురుచూసి చూసి కండ్లు కాయలు కాసినరు రా.... మాయదారి రోగమేదో వచ్చిం దని, సర్కార్ ఒక పురుగునుసుక బయటకు రానీస్తలేదని తెలిసి బుగులైం దిరా... బస్సులు, లారీలు ఏవి నడుస్తలేవు ఎట్ల అస్తవోనని పరేషాన్ అయినంరా... మీ బాపు నీకోసం కలవరించని గడి యలేదు. తిప్పలువడి ఎట్లనోవచ్చినవు బిడ'' దు:ఖంతో పూరుకపోయిన గొంతుతో కొడుకును దగ్గరకు తీసుకున్నదినర్సవ్వ.
''ఎండలవడిఅచ్చినవు. ఏమితిన్నవో ఏమో... బుక్కెడు తిని సల్లవడు'' అంటూ కొడుకుతో ఇంట్లోకి నడిచింది.
కొడుకు వచ్చిండని తెలిసి తండ్రి సంతోషానికి అవధులు లేవు. సత్తువంత కూడా తీసుకొని కొడుకుకు ఎదురచ్చిండు.
దూర తీరాలను దాటి ఇంటికి చేరుకున్న శంకర్ పాణంతిరం పట్టింది. కాని మనసులోని కలవరం మాత్రము తగ్గలేదు.''మనుషులు జీవనోపాధులు ఎందుకు ఇంత జఠిలంగా మారాయి. తమ వేళ్లను నమ్ముకొని వేల కిలోమీటర్లు దాటి ఉపాధిని వెతుక్కొంటున్నరు. కుటుంబం ఎక్కడో ఊరిలో ఉంటే, దినం రాత్రి తేడా లేకుండా రంధితో వారి కోసం కష్టపడడం బాధాకరం. పేరుకే స్వంతంత్ర దేశం. పని కల్పించని దేశం. కోట్ల మంది స్వంతంగా ఉపాధిని వెతుక్కొని జీవిస్తున్నారని సర్కార్కే తెలియకపోవడం విచిత్రం. అసమాభివృద్ధి నమోనాలో 'వలస పక్షుల్ని' తయారుచేసిన దేశం వారి శ్రమలతో బతుకీడుస్తుంది. ఎన్నో రకాల శ్రమలు నేడు ఊరి దారి పట్టాయి. పేరుకే కన్న ఊరు. బతుకియ్యని ఊరు. సాంత్వన కోసం ఊరి దారి'' ఊరిని చేరిన శంకర్ వలస దు:ఖంతో ఆలోచించాడు. వారం రోజుల యాతన తరువాత కడుపు నిండా అమ్మ చేతి కమ్మటి తిండి తిన్నాడు. సంతృప్తిగా నిద్రలోకి జారుకున్నడు.
అపుడే ఊరిన ఊట చెలిమెను కదిలించినట్టు ప్రశాంతంగా పడుకొని ఉన్న శంకర్‌ను వన్ నాట్ ఫోర్ వాహనంలో జిల్లా కేంద్రంలోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. పదనాలుగు రోజులు క్వారంటైన్లో ఉండాలనే నిబంధన ఎవరికైనా శిరోధార్యమే కదా. ఇది వైరస్ విండో పిరయడ్ ప్రకృతి ధర్మమైతే, అది సమాజ శ్రేయస్సు కోసం వ్యక్తి తీసుకునే బాధ్యత.
శంకర్‌కు ఏమి అర్థమైతలేదు. అన్ని సంఘటనలు తన ప్రమేయం లేకుండానే జరుగడంతో భయపడ్డాడు. స్కూల్ కాంప్లెక్స్‌లోని ఒక గదిలో ఒక్కడే వైరస్ ఇచ్చిన భరించలేని ఒంటరితనాన్ని భరించిండు. మాట్లాడడానికి ఎవరు లేరు. గ్రహాంతరవాసులు వచ్చినట్టుగా డాక్టర్లు, నర్సులు వచ్చి పల్స్ చెక్ చేసి, ఇతర ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైరస్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను వివరంగా చెప్పారు. అత్యవసరం అనిపిస్తే సంబంధిత సిబ్బందికి వెంటనే తెలియజేయాలని చెప్పారు.
శంకర్‌కు భారంగా రోజు గడవడంతో గంటలను, నిమిషాలను లెక్కిస్తూ పొద్దు ఎపుడు పోతుందా... పొద్దు పోతే రాత్రి ఎపుడైతుందా... రాత్రి ఎపుడు తెలవారుతుందా అనే ధ్యాసలో కాలంతో పాటు ప్రయాణించాడు. కాని కొందరు ఓడిపోతున్నరు. పల్స్ రేటు పడి పోయినవారిని స్ట్రెచర్ పైన ఆసుపత్రికి తరలించారు. అది చూసి కొందరి గుండెలు అదిరిపడ్డాయి.
ఇది చూసి శంకర్ ఎపుడు ఏమౌతుందోనని తన శరీరంలోని మార్పులను గమనించిండు. తాను ఎవరితో అతి సమీపంగా మెలి గాడో మననం చేశాడు. ''సమీపంగా మెలగకపోతే వ్యాధి రాదు'' తనకు తాను ఊరడించు కుండు. ఇంకా అన్వేషణ సాగింది. ఇండియాకు రాక ముందు, తన మిత్రులతో కలిసి ఉంటున్న చిన్న గది కళ్లలో మెదిలింది. ''ఎపుడు రద్దీగా ఉంటుంది. పది ఇరవై మందికి షెల్టర్. అహోరాత్రులు తమ వారికోసం కష్టపడుతూ కాసింత సమయం సేదతీరే ఒకానొక విశ్రాంతి గది. ఈ క్లాసు రూములో సగానికి సగం ఉన్న రూము తమకు ఆదరువు. రాత్రి పగలు లైట్ వెలుగుతుంది. పది మంది పని నుంచి వస్తారు. మరో పది మంది పనికి పోతారు'' శంకర్ దిగులుగా తలపట్టుకుండు. ''అందరితో దెగ్గరగానే మెలిగాను'' అనే అంతిమ సత్యం తనను కంపింప చేసింది.''మహమ్మారి కోవిడ్-19 నుంచి తప్పించుకోలేనా'' అనే సందిగ్ధం తనను వెంటాడింది.
శంకర్ ఒక్కసారిగా ఉలిక్కిపడిండు. అవ్వ, బాపు యాదికి రావడంతో కండ్లల్ల నీళ్లు తిరిగినై.ఉన్నమతి పోయింది. ''తను భారతదేశం వచ్చి క్షమింపరాని తప్పు చేశాన? ఏమి అర్థం కావడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితి తను ఎపుడు ఎదుర్కోలేదు. ఒక వేళ వారికి ఏమన్న జగిగితే నన్ను నేను క్షమించుకోలేను'' బాధతో కన్నీళ్లను తుడిచాడు.
శంకర్ అనుమానాన్ని నిజం చేస్తూ, నిశ్శబ్దంగా ఉన్న గదిని రంపంతో చీల్చినట్టుగా సెల్ మోగింది. విచలితుడైన శంకర్ భయపడుతూ మొబైల్‌ను అందుకున్నడు. తన ఇంటి నుంచి. వాట్సప్ వీడియో కాల్. మొబైల్ స్క్రీన్‌ను టచ్ చేసేలోగా అవతలి నుంచి బోరున ఏడుపు వినిపించింది. ''చెల్లె... లక్ష్మీ... ఏమైందే...'' శంకర్ గొంతు దు:ఖంతో పూడుకుంది. ఏ వార్త వినవలసి వస్తోందోనని అనుమానించిండు.
''అన్న... బాపు... బాపు...'' అంటూ ఏడ్చింది. ఇంకా ఏ పదాలు తన గొంతు దాటి రాలేదు. ప్రయత్నం చేయలేదు. ఆమె నుంచి కాస్త ధైర్యంగా మొబైల్ తీసుకొన్న మేన మామ నర్సయ్య ఏమి చెప్పలేక బోరున ఏడ్చాడు. అక్కడ జరుగుతున్న సంఘటనను చూపిండు.
మొబైల్ చూస్తున్న శంకర్ ఒక్కసారిగా నిశ్చేష్టుడై కుప్పకూలిండు. తన తండ్రి కర్మకాండ నిర్వహిస్తున్న చెల్లి కనపడింది. తన తండ్రి ముఖంను చూయిస్తూ... మామ నర్సయ్య తన చెల్లిని ఒకవైపు ఓదారుస్తూ... ''అరె... శంకర్ అంత అయిపాయెరా...చూడురా...'' చూపిస్తూ బోరున ఏడ్చాడు. వారి మధ్య మాటలు లేవు. ధారాపాతంగా సాగుతున్న కన్నీరు వరదైంది. ఒకవైపు తల్లి ఆక్రందన మిన్నును అంటింది. శంకర్ నాలుగు గోడల మధ్య గుండెలు బాదుకుంటు ఏడ్చాడు. తనకు చివరి చూపుకు కూడా నోచుకోకుండ చేసిన ఊరి ప్రజలను తిట్టిండు. పగలు రాత్రి ఏకమయ్యేలా దు:ఖిస్తున్న శంకర్‌ను ఓదార్చే నాథుడు లేడు. కిందపడి అలానే శోకించిండు. క్వారంటైన్లో ఉన్న కొందరు దూరం నుంచి చూస్తూ... 'ఏమైందో పాపం' అని అన్నారు. దెగ్గరకచ్చి తెలుసుకునే ధైర్యం చేయలేదు. వారికి వారే జవాబు చెప్పుకొని అక్కడి నుంచి కదిలారు.
శంకర్ ఆ రోజు ఇంటికి వచ్చినపుడు తన బాపు రూపం కండ్లలో మెదిలింది. మంచంలో లేవలేని స్థితిలో ఉన్నా కొడుకు వచ్చిండని బలవంతంగా లేచి శంకర్‌కు ఎదురచ్చిండు. ''బాపు మెల్లంగనే...''అంటూ తన తండ్రిని దగ్గరకు తీసుకుండు శంకర్.
''బగ్గజ్వరమున్నదే బాపు... పెయి కాలుతుంది'' తండ్రి చేతులను పట్టుకొని అంటే ''నువ్వు వచ్చినవు కదరా... తగ్గి పోతది''అని తననే ఓదార్చిండు.
''ఇయ్యల్లనే కొంచెం తక్కువ ఉన్నది నువ్వు అస్తున్నవని. నాలుగైదు రోజుల నుంచి అగ్గిలెక్క జరం ఉండె. తగ్గుడేలేదురా...'' అని నర్సవ్వ అంటుంటే గాబరా పడుతున్న శంకర్‌ను ''అది అట్లనే అంటదిరా... తగ్గిపోతది. నువ్వేమి పరేషాన్గాకు బిడ్డ'' అని ధైర్యాన్నిచ్చాడు. తన తండ్రిని చివరిగా చూసిన రోజును తలచుకోవడంతో శంకర్‌కు ఇంకా దు:ఖం ముంచుకొచ్చింది. తనకు ఆసరాగా ఎవరు లేరు. ఒకవేళ దు:ఖాన్ని పంచుకోడానికి ఎవరైనా ఉన్నా శంకర్‌ను ఆపడం వారి వశం కాకపోయేది.
క్వారంటైన్లో లేకుంటే తన తండ్రికి మంచి వైద్యం చేయిస్తుంటి. మాయదారి రోగమచ్చి తన తండ్రిని ఎడబాపింది. బాధతో తన స్థితిని తిట్టుకున్నడు శంకర్.
ఆ రోజు తన ఊరి ప్రజలు ప్రవర్తించిన తీరు మర్చిపోలేని సంఘటనగా గర్తుకు వచ్చింది. ''ఎట్లా తెలిసింది ఏమో, నేను వచ్చిన వార్త దావానంలా వ్యాపించింది. పిడుగులాంటి వార్త విని ఊరు ఊరంతా భయం గుప్పిట్లోకి పోయింది. ఇంటి ముందు జనం. శంకర్‌ను ఊర్లో ఉంచద్దు. పంపియ్యాల. ఊరు పాణాలకు ముప్పు, వీడు అందరిని చంపడానికే మస్కట్ నుంచి వచ్చిండు. వీడితో రోగం ఊరంతవ్యాపిస్తది అంటు ఊరి ప్రజలు గుసగుసగా మాట్లాడిండ్లు. ఒక విధమైన భయం వారిలో పోగుపడ్డది. దేశంలోకి కరోనా వైరస్ కంటే ముందే దాని భయం వాడ వాడనా, నరనరాలలోకి పాకింది. భయమే పెద్ద ముప్పుగా పరిణమించి కరోనా వైరస్ వల్ల సంభవించే మరణాలను రెట్టింపు చేసింది.
ఇవేమి తెలియని నేను పోశెట్టి మామ, ఇస్తారి కాక, భోజన్న అందరు ఎందుకచ్చిండ్లో పలుకరిద్దామని బయటకు నడుస్తుంటే అవ్వ వారితో కొట్లాడుతున్నది. 'ఆన్నే ఆగు...' కొందరు పెద్ద మనుషులు చేతులతో సైగ చేస్తూ నన్ను ఇంటి వాకిలి తొక్కనీయలేదు.
'ఏమిరా శంకర్... ఎప్పుడు రానిది గీ కరోనా కాలంలవచ్చినవ్. ఊరు ప్రశాంతంగా ఉండుడు ఇష్టం లేదా?' ఇస్తారికాక అనేసరికి నాకు అర్థం కాలేదు.
ఎందుకే... కాకగట్ల అంటున్నవ్. నేనేమి చేసిన్నే అని అడిగితే, పోశెట్టి మామ కోపంగా ఏమి తెలనట్లుమాట్లాడుతవ్ ఏందిరా... అందరి కంటే తెలివిమంతుడివి, పది మందికి చెప్పేటోడివి అనుకుంటే... అందరి లెక్కనే జేస్తున్నవ్' అని కోపంగా పండ్లు కొరికే.
అరె... నీ యవ్వ ఇపుడేమైందే... నేనేటు తిరిగిన. పొద్దుగల్లపొద్దుగల్ల నన్ను పట్టుకున్నరు బాధతో అంటే, 'ఒక్కరోజుకెళ్లె రోగం అంటు కుంటదా...ఉత్తగా పరేషాన్జేస్తున్నరు. ఆడు ఎటు తిరగలే. అచ్చుడే నిన్నచ్చిండు. ఇంటి గడప దాటలే. గప్పుడేఊరంత రోగం అచ్చినట్లు అణికిపోతున్నరు' అని అవ్వ అనంగనే అపుడు నాకు సమజైంది.
అవుటాఫ్కెళ్లి వచ్చిన నన్ను వీళ్లు పురుగు కంటే హీనంగా చూస్తున్నరని అర్థమైంది. నా వల్ల కరోనా వస్తుందని భయపడ్డరు. నాకు ఏమిమాట్లాడలో అర్థం కాలేదు.
'నువ్వు ఆగు అక్క. నీకు తెలదు. గా కరోనా రోగం అవుటాఫ్పోయినోళ్లతోనే అస్తున్నది. గందుకే ఆళ్లను ఊర్ల ఉంచుకొనుడు బందే. సర్కార్ ఆళ్ల కోసం దవాఖాన పెట్టింది' పోశెట్టి మామ ముక్కుసూటిగా చెప్పిండు. ఎపుడు దుబారు కెళ్లి అచ్చిన ఎంతో ప్రేమతో పలకరించే పోశెట్టి మామ, అవుటాఫ్కెళ్లి అచ్చేటపుడు నాకు గిదితేరా... గదితేరా... అని అడిగే పోశెట్టి మామ గిట్లమాట్లాడుతున్నడా? గీ కరోనా ఎవరికి ఎవరు కారని మంచిగనే చెప్పింది. 'గట్ల... గట్ల... సరు మాట చెప్పినవ్బాపు...' భోజన్నపోశెట్టికి తాళం ఏసిండు. ఎంత లంగగాడు ఈ భోజన్న అవుటాఫ్ నేను సుక వస్తనంటే ఎన్ని సార్లు వీసా తీయదల్గి సాయం జేసిన. నియ్యత్ లేదు. బద్మాష్.
పెద్ద లస్మన్న ఎదురుగా నున్న సర్పంచ్‌ను ఎక్కిస్తూ... 'అవ్ పిల్లగా... నువు అచ్చేటపుడు సర్పంచుకైనా, గ్రామ కార్యదర్శికైనా చెప్పితే ఏమైతుండే... గిపుడు ఊరంత అచ్చి నిన్ను ఎందుకు అడుగుతుండే' పెద్దరికం చూపెట్టె.
సర్పంచ్ రమేషన్న అందుకొని 'లేదురా శంకర్... నువు ఊళ్ల ఉండుడు మంచిది కాదురా. ఊరికే కాదు. మీ ఇంటోళ్లకే మంచిది కాదు. ఆళ్లపాణాలును క్సాన్ల ఏసినవ్. ఆళ్లు కూడా ఇంట్లకెళ్లి బయటకు ఏళ్లద్దు. సర్కార్ ఏర్పాటు చేసిన దవాఖాన లేకుంటే క్వారంటెన్ కేంద్రాలల్ల ఉంచుతరు. ఇపుడు సర్కార్ బ్రిటీష్ కాలం నాటి కానూన్ను గట్టిగ అమలు చేస్తున్నది. ఎదురు తిరిగితే జైలే. అంటు రోగాలు ఫయిలాంచకుండా సర్కార్ జాగ్రత్తగా పడుతున్నది' సర్పంచ్ ఒకవైపు మెత్తగా చెపుతూనే భయపెట్టిండు.
గిపుడు నన్నేం చేయమంటరే... ఇంటికి రాదల్గి ఎన్ని తిప్పలు వడ్డనో మీ కెరుకలేదు. బాపుకు పాణం మంచిగ లేదంటే అచ్చిన. పని ఇడస పెట్టుకొని ఎందుకస్తనే. బాపు ఆరోగ్యం మంచిగైనంకనే నెందుకుంట. నా ఇంటి సమస్యలే తీరుతలేవంటే ఇపుడు ఊరంతా కలసి ఇంటి మీద పడ్డరని వేడుకున్న ఒక్కడు వినలేదు. వైరస్ భయంతో మనుషుల ప్రవర్తన మారింది. ఇది వారి తప్పు కాదు. ఏమిచేస్తం. ఎవరిని తప్పుపట్టేటట్లు లేదు. తప్పదు అనుకున్న.
బాపుకు ఎపుడు ఏమైతదనే ఆలోచనతో మనసు మనసుల లేదు. అయినా క్వారంటైన్‌కు ఒప్పుకున్న'' బాపు మరణం, ఊరి ప్రజల మాటలు తలచుకొని బాధపడ్డాడు శంకర్.
వ్యాధి నిర్ధారణ కాక ముందే తన కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేయడం వల్ల చెప్పరానంత వేదనకు గురైండు శంకర్.
''ఊరి ప్రజలు ఇంత జాలి, దయ లేకుంట ఎందుకు ప్రవర్తించిండ్లు. తనకు వైరస్ ఉందో లేదో తెలియదు. ఉంటే చికిత్స తీసుకోడానికి తను ఎందుకు వెనుకాడతాడు. కనీసం బాపు మీద గౌరవం చూపియ్యలే. కరోనాతోనే రోగం ఎక్కువై చనిపోయిండని అనుమానించిండ్లు. చెల్లె, అవ్వ ఇద్దరే కష్టపడి పుట్టెడు దు:ఖంతో పనికానిచ్చుండ్లు'' అనుకుంటూ శంకర్రోదించిండు.
అందరు క్వారంటైన్లో బలమైన తిండి తినడం వల్ల రోగనిరోధక పెరుగుతుందని కంకకంక బలిశారు. కాని శంకర్ ఇంకా బక్కపలచగా తయారైండు. క్వారంటైన్ పూర్తిచేసి రెండు రిపోర్టులను బేరీజు వేసిన డాక్టర్లు శంకర్ నెగటివ్ అని తేల్చారు.
శంకర్ నిరాశగా ఇంటికి చేరాడు. తనకు నెగటివ్ వచ్చిందని ఉప్పొంగి పోలేదు. లాక్డౌన్ నెగటివ్ వ్యూహంగా వలస బతుకులను చిధ్రం చేసింది. ఇపుడు తనకు కొత్తగా జీవనో పాధిసమస్య. పరాయి దేశం నుంచి సాగిన పయనం 'తీరని వెతని' మిగిల్చింది. అది క్వారంటైన్‌తో ముగిసింది. శంకర్ ఎవరిని తప్పుపట్టలేడు. ముందు చూపులేని ప్రభుత్వాన్ని నిందించినా ప్రయోజనం శూన్యం.
చిక్కిన బిడ్డను చూసి నర్సవ్వ గొడగొడ ఏడ్చింది. అమ్మ స్పర్శ. ఆత్మీయ పలుకు తనను మేలుకొల్పింది. మనుషులను కలవక ఎన్ని రోజులైంది. ఎన్నో ఏండ్లయినట్టుగా ఉంది. ఆత్మీయుల ఆలింగనాలు అసలే లేవు. మనుషుల మధ్య బతకాలని తపించిన హృదయం ఇంటికి చేరడంతో కాస్త ఊరట చెందింది.
- బి.వేణుగోపాల్ రెడ్డి, 9908171441