Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాకు కుల ప్రమాదం ఏంటో ఎదురయ్యాకనే తెలిసొచ్చింది. కులం అనే విషంతో ఎంతటి ప్రేమనైనా బ్లాక్ మెయిల్ చేయగలరు. కుల బంధు సమేత మృత జన గణ మన పాడగలరు. నిన్ను నన్నూ సజీవ సమాధి చేయడానికి కూడా వెనుకాడరని తేలిపోయింది. నీకు నీ ప్రేమ బ్రతకడం ముఖ్యమా? ప్రేమికుడు బ్రతకడం ముఖ్యమా? అనే ప్రశ్న నా పై పిడుగులా పడడంతో నా పసి ప్రేమ ప్రేమికుడే బ్రతకాలని కోరుకుంది! ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోగం క్యాస్ట్ కాన్సరే అని అర్ధమైంది. అలా మనం విశాఖపట్నం వెళ్ళాల్సిన రెండురోజుల ముందే నేను ఇంకొకరిని చేసుకోవాలని నిర్ణయం చేసి ఒప్పించనైనది. కాబట్టి మనసులోపలి విషయం తెలపని బాధ నాకు మిగలొద్దని నీకు రాస్తున్న ప్రేమ వాంగ్మూలం ఇది.
దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 17016 సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్ళు విశాఖ ఎక్స్‌ప్రెస్ మరికొది ్దసేపట్లో ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాం మీదకు వస్తుంది. అనే ఎనౌన్స్మెంట్ వినిపిస్తుంది. కానీ అతడు ఎదురుచూస్తున్న అమ్మాయి ఇంకా రాలేదు. ఇకరాదని నిర్ణయించుకున్నాడో ఏమో! ఒక్కొక్క అడుగేస్తూ కాయిన్ బాక్స్ టెలీఫోన్ దగ్గరకెళ్ళాడు. ఒకచేతిలోకి రిసీవర్ తీసుకుని ఇంకోచేత్తో 08680 అని ఒక్కొక్క నంబర్ నొక్కుతున్నాడు. ''సిరిగల్లా భారతదేశం తమ్ముడా తాకట్టు పెట్టబడ్డది తమ్ముడా'' అని విద్యార్ధులెత్తుకున్న పాటతో రైల్వేస్టేషన్ హోరెత్తుతుంది. ఆ పాటకు పోటీపడి మోగుతుంది డప్పు. ఆ చప్పుడును మించి వినిపిస్తుంది గుండె చప్పుడు. అందుకే అవతల రింగ్ అవుతున్న ఫోన్ స్పష్టంగా వినిపించేలా రిసీవర్‌ను చెవుకు అదిమిపట్టుకున్నాడు. ఇంతలో ఫోన్ లిఫ్ట్ చేశారు.
''హలో ఎవరూ?''
దూదిపూలలాంటి పాదాలతో అటూ ఇటూ పరుగెడుతుంది ఒక చిన్నపాప. ఆ పాప కాళ్ళకున్న పట్టీలు తను అమ్మాయి అని ఇప్పటి నుంచే గుర్తుచేస్తున్నట్టు మోగుతున్నాయి. ఆ చప్పుడు వింటున్న బస్ ఎన్నో మూల మలుపులు తిరుగుతూ వెళ్తుంది. రోడ్డుకు ఇరువైపులా వేపచెట్లున్నాయి. చిక్కనైన వాటినీడ రోడ్ పై పడుతుంది. మబ్బులను చీల్చుకువెళ్ళే ఎయిర్ బస్ లాగే చెట్ల నీడల్లోనుంచి దూసుకెళ్తుంది ఎర్రబస్సు.
కాల్వ దాటి, ఏరు దాటి ఊరు
దగ్గరకు చేరింది బస్సు. అప్పటివరకు చదువుతున్న ప్రజాశక్తి పేపర్ మల్చి డైరీలో పెట్టుకుని స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో అవడంతో అక్కడే బస్ దిగాడు ప్రభాత్. పచ్చనిచెట్ల మధ్యలో ఉన్న ఫంక్షన్ హాల్ ద్వారానికి ''భారతదేశం - అమెరికాతో అణు ఒప్పందం'' సెమినార్ అని బ్యానర్ వేలాడుతోంది. ఇండియా రక్షణకు వేలాడదీసిన బుల్లెట్ ప్రూఫ్ తోరణంలా ఉంది అది. లోపలికి ఎంటర్ అవుతుండగానే సత్యం, రవి ఎదురొచ్చి వెల్కమ్ బ్రో అంటూ ఆహ్వానం పలికారు.
''నేనేమైనా పెళ్ళి కొడుకునా డియర్స్! ఈ ఎదుర్కోలు ఎందుకు?'' అని ప్రభాత్ అనడంతో నవ్వుతూ హాల్ లోపలికి వెళ్ళారు. అక్కడ ఇంకొంతమంది కార్యకర్తలు లేచి నిలబడి హలో ఇచ్చారు.
''లేచి నిలబడి హలో ఇవ్వడం గౌరవార్థం అని మీరు భావిస్తున్నారేమో. నేనుమాత్రం భానిసత్వమని భావిస్తున్నాను. దర్జాగ కూర్చొని కాలు మీద కాలేసుకుని కూడా విష్ చేయండి. లెట్స్ చేంజ్ బ్రదర్స్. అదే అందరికీ గౌరవం.'' అన్నాడు ప్రభాత్.
కొద్దిసేపట్లోనే సదస్సు ప్రారంభమైంది. సభాధ్యక్షులుగా ప్రకృతి వ్యవహరిస్తుంది. ప్రధాన వక్తగా ప్రభాత్, నాయకులు రవి, సత్యం, కాలేజీ ప్రెసిడెంట్స్ అంతా వేదిక మీదకు రావాలి అని ఆహ్వానించాడు శివ. అన్ని కాలేజీల నుంచి స్టూడెంట్స్ వచ్చారు. వారితో పాటు లెక్చరర్స్ కూడా సెమినార్ కోసమే వచ్చారు. అణు ఒప్పందం అనే అంశం దేశమంతా హాట్ టాపిక్ కదా అందుకే కావచ్చు.
అంత పెద్ద టాపిక్ ఉన్న సభకు అమ్మాయిని సభాధ్యక్షులుగా పెట్టారేంటి సరిగ్గా నడుపుతుందా! గుసగుసలాడుకుంటున్నారు కొందరు. ప్రకృతి లేచి మైక్ అందుకుంది.
''డియర్ ఫ్రెండ్స్..! ఎంతోమంది మేధావులనుకునేవారు, రాజకీయనాయకులు కూడా అర్ధంకాక జుట్టు పీక్కుంటున్న సమస్య. భారత్ - అమెరికా అణు ఒప్పందంతో దేశంలో ఏమి జరుగుతుందో తెలియక గందరగోళం ముసురుకున్నది. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల్ని చైతన్య పరిచేందుకు మన సంఘం ఈ సెమినార్ నిర్వహిస్తున్నది. దీనికి ప్రధాన వక్తగా ప్రభాత్ మాట్లాడుతారు.'' అప్పటికే ఈ అంశం తమకేమి రిలవెన్స్ కానట్టు భావిస్తున్న స్టూడెంట్స్ అంతా పిచ్చాపాటి ముచ్చట్లలో మునిగిపోయారు.
''కంప్యూటర్స్ ఆర్ట్స్ సైన్స్ మాథ్స్ కామర్స్ ఇవన్నీ క్లాస్ రూం సబ్జక్ట్స్ ఎలాగూ తప్పని న్యూ 'సెన్సు...'' అని పాటెత్తుకున్నాడు ప్రభాత్. అంతే హాలంతా సైలెంట్ అయిపోయింది. ఫిజిక్స్ స్టూడెంట్స్, కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారిక్కడీ సబ్జెక్ట్ ఏదైనా, మీడియం ఏదైనా మీద ఎక్కి కూర్చుని మనల్ని నడిపించేది రాజ్యం. రాజకీయం. అందుకే కాసేపు సబ్జెక్ట్‌ల చూపుడువేళ్ళతో రాజకీయాలను తడిమిచూద్దాం. అణు ఒప్పందం అంటే గొప్పగా ఏం లేదు ఈ పేరుతో అమెరికాకు లొంగిపోవడమే. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళకు తెలియకుండా మనదేశం కాలుకదపడానికి కూడా వీలులేదు. వాళ్ళు ఎవరిని చంపడానికి బయలుదేరినా ఇండియా కూడా తుపాకులేసుకొని వాళ్ళ తరపున పోవాలి. ఈ ఒప్పందం వలన మన అణుశక్తి, ఆయుధ సంపదపై అధికారం అమెరికాకే ఉంటుంది. మన విదేశాంగ విధానం వారికి లోబడే ఉంది. వాళ్ళను కాదని మనం ఏమీ చేయడం లేదనే కండక్ట్ సర్టిఫికెట్ ప్రతి సంవత్సరం అమెరికాకు అందించాలి. ఇది రాముడితో శీల పరిక్షను ఎదుర్కొనేందుకు మంటల్లో దూకిన సీత తీరుకేమీ తీసిపోనిది. అందుకే అణు ఒప్పందం మన ప్రభుత్వం నమ్మ బలుకుతున్నట్టు అమెరికాతో భాగస్వామ్యం కాదు లొంగుబాటు. మనదేశ సార్వభౌమత్వాన్ని వారికి తాకట్టుపెట్టడమే. దీంతో భవిష్యత్ భారతదేశం అమెరికా అణుప్రయోగ పెరడు అయిపోయి జీవి మనుగడే కష్టంగా మారే ప్రమాదముంది. పైగా పదిహేడు శాతం మాత్రమే జల వనరులతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. ఇంకా ఎనభై మూడు శాతం జల విద్యుత్ తయారీకి ఆస్కారం ఉంది. అలాంటప్పుడు మానవాళికి అత్యంత ప్రమాదకరమైన అణు విద్యుత్ అవసరం లేదు.'' అంటూ 123 అణు ఒప్పందం, 1954 అణు ఇంధన చట్టం, హైడ్ చట్టం, యురేనియం నిల్వలు, అవసరాలు అంటూ ఇంకా ఏవేవో లెక్కలతో అణుఒప్పంద కుట్రలను యాడికాడికి పోస్టుమార్టం చేసి విద్యార్ధుల ముందుంచాడు. చప్పట్ల మధ్య సభ ముగిసింది. అణు ఒప్పందం రద్దు చేయాలి. అమెరికా దుష్ట పన్నాగం నశించాలి అని నినాదాలు ఇస్తూ విద్యార్థులు వెళ్ళిపోయారు.
ప్రకృతి సభను చాలా బాగా సమన్వయం చేసింది. సెమినార్ అవగానే స్టూడెంట్స్, లెక్చరర్స్ ప్రకృతి చుట్టూ చేరి మాట్లాడుతూ అభినందిస్తున్నారు. కొందరు అమ్మాయిలు భుజం తట్టి వెళ్తున్నారు.
ప్రకృతి తన బాక్స్ తెచ్చి ప్రభాత్‌కు తినమని ఇచ్చింది.
''మరీ నీవు తినవా ప్రకృతి?''
''పార్శిల్ తెస్తున్నారు కదా అది తింటాను ప్రభాత్''
''పరవాలేదు నేను పార్శిల్ తింటానులే.''
''అయ్యో ప్రభాత్.! మీరు రోజు బయటి ఫుడ్ కదా తినేది. ఈ రోజు మా ఇంటి బోజనం తినండి. కనీసం ఇప్పుడైనా మీ హెల్త్ కాపాడిన వాళ్ళమవుతాము. తినడం కోసం బ్రతుకుతున్నామా! ఏదో బతకాలి కాబట్టి తినాలి. అనే డైలాగ్స్ కొట్టి గ్యాస్ ట్రబుల్ తెచ్చుకున్నరట. మనవాళ్ళంత మాట్లాడుకుంటుంటే విన్నాను.''
''సరే మీరూ కొంచెం తినండి. షేర్ చేసుకుందాం. పార్శిల్ వచ్చేలోపు.''
''వద్దూ మీరు తినండి'' అంటూ ముచ్చట్లలో దించింది.
''మా ఫిజిక్స్ లెక్చరర్ ఎవరిని అంత ఈజీగా ఒప్పుకోడు. కానీ ఇందాక మిమ్మల్ని చాలా పొగుడుతూ మాట్లాడాడు. పైగా మీరు చెప్పేవి తను పేపర్‌పై ఒక స్టూడెంటులా నోట్ చేసుకున్నాడు. ఇప్పుడు మా కాలేజి స్టూడెంట్స్‌లో ఇదే పెద్దచర్చ తెలుసా.!
''అవునా! సరే కానీ తన రాసుకున్నాడు అన్నావు కదా! అది ఆయన గొప్పతనం. మనం ఆయన నుంచి అది నేర్చుకోవాలి.''
ప్రభాత్ డైరీతో పాటు రెండు పుస్తకాలున్నాయి. ఒకటి దళారి పశ్చాత్తాపం, ఇంకొకటి బంగారమ్మ కథ. వాటిని చాలాసేపటి నుంచి ప్రకృతి పట్టుకొనే ఉన్నది. ప్రభాత్ ఇవ్వమన్నా ఇవ్వడం లేదు. పోనీ పక్కన పెట్టొచ్చుకదా అంటే ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా డైరీలో. నేనేం చదవనులే అంటుంది. ఇంతలో సత్యం, రవి వచ్చారు.
''పార్శిల్స్ ఏవి?''
''ఏం పార్శిల్స్ ప్రభాత్'' అన్నారు ఆశ్చర్యపోతూ.
''మీరెక్కడికెళ్ళారు మరీ?''
''స్టూడెంట్స్‌ను పంపించడానికి వెళ్ళాం. ఇప్పటికే లేటైంది. భోజనానికి వెళ్దాం పద బ్రదర్''
''లేదు. నేను ప్రకృతి తెచ్చిన బాక్స్ తిన్నాను.''
''అవునా! ప్రకృతి బాక్స్ తిన్నావా! ఇది వండరే ప్రభాత్. బాక్స్ ఆమె ఇచ్చిందా? నువ్వే అడిగి తీసుకున్నావా?''
''తనే ఇచ్చింది రవి''
''ఇది మాత్రం చాలా విచిత్రం. తను ఎవ్వరికీ అంత తొందరగా దగ్గర కాదు. ఎవరినీ ఎక్కువగా నమ్మే రకం కాదు. ప్రోగ్రాం పూర్తవుతుందో లేదో వెళ్తా అంటుంది. అలాంటిది ఈ రోజు ఉండటం, లంచ్ బాక్స్ ఇవ్వడం అంతా కొత్తగా ఉంది. ఇంత జరిగిదంటే ఈ రోజు వర్షం వచ్చినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదేమో!'' అన్నాడు రవి.
''సరే నేను బయల్దేరుతా'' అన్నాడు ప్రభాత్
''మళ్ళీ రావడం ఎప్పుడూ!'' అన్నది ప్రకృతి.
''ఎప్పుడు అనేది తర్వాత. పార్శిల్ వస్తుంది అని అబద్దం ఎందుకు చెప్పావు?''
''అది సరే కానీ నాకు ఈ బంగారమ్మ కథ, దళారిపశ్చాత్తాపం బుక్స్ కావాలి. ఇవ్వగలరా!'' అన్నది ఆ ప్రశ్నను దాటవేస్తూ
''వాటిని పట్టుకుని వదలనప్పుడే అనుకున్న. ఇలాంటిదేదో ఉంటుంది అని.''
''ఇస్తావా ఇవ్వవా! అది చెప్పు ఫస్ట్'' అన్నది గట్టిగా. తన పై ఎదో హక్కు కలిగినదానిలా.
''ఇవ్వకుంటే లాక్కునేలా ఉన్నావు ప్రకృతి. తీసుకో. చదవాలని ఇంతబలంగా కోరుకున్నాక కాదంటానా!'' అని బయలుదేరి బస్సు ఎక్కాడు.
కిటికీ వైపున కూర్చున్న తనకు బయటకు చూస్తే ఒకవైపు నుంచి భూమి వెనక్కి పోతుంది. మరో వైపునుంచి ముందుకు వస్తుంది. భూమి గుండ్రంగా తిరుగుతుందంటే ఇదే కావచ్చు. ప్రకృతి కూడా తనను అచ్చం ఇలాగే కనిపెట్టుకుని తిరిగినట్టు అనిపించింది. చీకటిని రంగరించి చిక్కని కాటుక దిద్దుకున్న చక్కని కళ్ళు ప్రకృతివి. వాటి రెప్పల చప్పుడు చెవుల్లో గిలిగింతల శబ్దమై పరవళ్ళుతొక్కుతుంది. ఆ కళ్ళలో ఏదో అంతు చిక్కని మ్యాజిక్ ప్రభాత్ ను కట్టిపడేసింది. కోటి కనుల రాశిలో సైతం ఆ కళ్ళను కనిపెట్టేంత ప్రత్యేకమైన కళ్ళు. అవి నాగార్జున సాగరమంత విశాలంగా, కృష్ణా నదీ ప్రవాహమంత అందంగా ఉన్నాయి.
వారు కలుసుకున్న ప్రతిసారి ప్రకృతి ప్రభాత్ కోసమే వచ్చినట్టు ఉంటుంది. తను వచ్చిన్నుంచి భూమి సూర్యుని చుట్టు తిరిగినట్టే ప్రకృతి ప్రభాత్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఏమైనా వారిద్దరున్నచోట చూపుల వసంతమే. ఆ కనుల జతలు బతుకమ్మలై పండుగ చేసుకుంటాయి. అలా వారి చూపుల సాంగత్యం ఆ ప్రాంగణమంతా మల్లెతీగలా. అల్లుకుంటుంది. విరభూసిన వారి కనుపాపలు అచ్చం గడ్డిపూలు మాట్లాడు కుంటున్నట్టే కనిపిస్తాయి. మట్టిగంధం పరిమళాన్ని 'వర్షమూ నేల' కలగలిసి పంచుకుంటున్నట్టు వాళ్ళు కనులతో ఆశయాల సువాసనలను తర్జూమా చేసుకుంటున్నారేమో! నిజానికి మొదటిసారి సెమినార్లో కలిసిన తర్వాత వాళ్ళు నోటితో మాట్లాడుకున్నది చాలా తక్కువే. అలా వాళ్ళు రెండేండ్లు కళ్ళనే పెదవుల్లా, చూపులనే మాటలుగా, ప్రేమలుగా మార్చుకున్నట్లనిపిస్తుంది. వారి ప్రేమ గాలిలో తేమ లాంటిదేమో! విలియంహార్వే తప్ప మరెవరూ కనుగొనలేని ప్రేమ ప్రవాహం కావచ్చు. వారెప్పుడూ తమ ప్రేమను బయటకు చెప్పు కోలేదు. తింటున్నప్పుడల్లా అన్నం పంచుకోవడంనో, నడుస్తున్నప్పుడల్లా అడుగులు పెంచుకోవడంనో, మాట్లాడుతున్నపుడల్లా అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకుంటున్నప్పుడల్లా పసిగట్టగలిగిన వారికి మాత్రమే వారి అప్రకటిత ప్రేమ అర్థమైతుంది. మూన్ పై దారి తప్పిన ఆస్ట్రోనాట్ ల్లా, జోరు వర్షంలో చిక్కుకుని సైతం తడవని పచ్చనాకుల్లా వారి ప్రేమ వ్యక్తావ్యక్త మధుర భావమో! సమ్మోహనా కావ్యమో! సామిప్య సంకటమో!
''హలో ఎవరూ!'' అదే దృఢమైన కంఠధ్వని
''ఆ.. ప్రకృతీ నేనూ ప్రభాత్''
''ఓ..నువ్వా చెప్పు'' పొడిపొడిగా
''విశాఖ క్యాంప్‌కు తప్పకుండా వస్తా అన్నావు. నీకోసం రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాం. మరి రాలేదేంటి! ''
''ఊ''
''ఊ.. ఏంటీ ప్రకృతి?''
''రావడం కుదరటం లేదు ప్రభాత్. అయితే ఏంటిప్పుడు?'' మాట్లాడే కాసేపైనా గలగలా మాట్లాడే తను మాటలకోసం వెతుక్కుంటుంది.
''ఏమైంది ప్రకృతి?''
''ఏం కాలేదు''
''ఏదో జరగకపోతే రాంగ్ కాల్ అటెంప్ట్ చేసినట్టు డౌటుగా మాట్లాడుతున్నావు ఎందుకు?''
''అదేంలేదు. నేనిక రాలేను. మనము కలుసుకోలేము. అన్నీ తర్వాత చెప్తాను.''
ఆ మాటలు వింటుంటే విధ్వంస శకటమేదో సరాసరి గుండెల్లోకే దూసుకొచ్చినట్టు అనిపించింది ప్రభాత్కి. అంతలోనే ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం పైకి ట్రైన్ వచ్చింది. ఇలా వచ్చిందో లేదో! బయలుదేరుటకు సిద్ధంగా ఉందని ఓ ఎనౌన్స్మెంట్. దాన్ని కూడా భరించలేనంత బరువైన హృదయంతో వచ్చి ట్రైన్ ఎక్కి కూర్చున్నాడు.
''ప్రభాత్ కాయిన్ బాక్స్ ఫోన్‌కు నీకు ఏమైనా గొడవా ఏంటి!'' అన్నాడు మహేష్
''ఎందుకు అలా అడిగావు'' అన్నాడు ప్రభాత్
''అక్కడి నుంచి వచ్చాక పత్రహరితం కోల్పోయిన ఆకులా ఉంది నీ ఫేస్''
''అదేం లేదు మహేష్''
''నీ మనసులో భావాలకు నీ ముఖమే ప్రతినిధి. నువ్వు చెప్పకున్నా నీ కళ్ళు చెప్తున్నాయి ప్రభాత్''
''కళ్ళతో చెప్పే ఇంతవరకు వచ్చిందన్నా. ఇంక నువ్వు కూడా కళ్ళే అంటే ఎలా!''
''ఒకటి చెప్పనా ప్రభాత్! నీవు కులం లేదని భావించినా నీ పుట్టుక బి.సి కులంలో సంబవించింది. ప్రకృతి రెడ్డి కులంలో పుట్టింది. మీ కులాలమధ్య చాలా పెద్ద అంతరం ఉంది. నీతో చివరివరకూ నడుస్తుందని ఎలా అనుకున్నావు?'' అని మాట్లాడుతుండగానే ప్రభాత్ అడ్డుకున్నాడు.
''ప్రకృతికి క్యాస్ట్ ఫీలింగ్ లేదన్నా''
''తనకి ఉన్నా లేకున్నా ప్రేమకు అడ్డురాని కులం పెళ్ళి దగ్గరకొచ్చేసరికి పెద్ద అడ్డుగోడైతుంది. తన కుటుంబం, తను పెరిగిన వాతావరణం, తన లైఫ్ స్టైల్, అంతకుమించి మన చుట్టూ ఉన్న ఈ ఫ్యూడల్ కల్చర్ తనని కట్టిపడేస్తాయి. తన తెగింపును ఒక్కదెబ్బకు చంపేస్తాయి''
'' లేదన్నా తను దృఢమైన విశ్వాసం కలది.''
''నువ్వేమైనా 2025 సంవత్సరంలో ఉన్నా ననుకుంటున్నావా? ఇది 2005 తమ్మి. మీరిద్దరూ లవ్ చేసుకుంటున్నారని నాకు ఎప్పుడో అర్ధమైంది. ఎందుకైనా మంచిదీ, పరిస్థితి తెలుసుకుందామని నేను వాళ్ళింటికి కూడా వెళ్ళొచ్చాను. అన్నీ పరిశీలించి, ఆలోచించి చెప్తున్న మనల్ని నిరాకరించే విషయాలకు మనం దూరంగా ఉండటం మంచిది.''
''అంటే ఈ కాలంలో కులాంతర వివాహాలే జరగడం లేదా అన్నా?''
''జరుగుతున్నాయి. వాటికి ఒక బలమైన తెగింపు కావాలి. లేదా అంతకుమించిన బలమైన ఆకర్షణ అయినా కావాలి. అసలే మనది ఓ బ్లాక్ అండ్ వైట్ లైఫ్. పైగా మన కులం బలహీనమైనది. ఒకవేళ తను తెగించి వచ్చినా నువ్వు ఎలా సాధుతావు? డబ్బులు, ఉద్యోగాలు, ఆస్తిపాస్తులు, ఇవన్ని కాలిక్యులేట్ చేసుకుంటారు. ప్రేమలో కనిపించని ఎన్నో విషయాలు పెళ్ళి అనేసరికి ముందుకొస్తాయి. అసలు ప్రేమంటేనే ఓ ఆకర్షణ కదా! ఏ విధంగా చూసినా మనవి పెద్దగా ఆకర్షించగలిగే జీవితాలూ కావూ''
అని ఇంకా ఏవేవో మాట్లాడుతుండగా వాటిపై ప్రభాత్ కౌంటర్ చర్చ చేస్తున్నాడు. బొగ్గుతో నడిచే రైలింజన్లా ప్రభాత్ కుతకుత ఉడుకుతున్నాడు లోపల. దాని తాలూకు పొగలు కళ్ళలో స్పష్టంగా కలుస్తున్నాయి. ట్రైన్ వాడపల్లి బ్రిడ్జీ, ప్రకాశం బ్యారేజీ, అతిపెద్ద రాజమండ్రి బ్రిడ్జీ దాటి పరుగులెత్తుతూ తూరుపు నవ్వుతుండగా విశాఖపట్నం చేరుకుంది. ఎర్రెర్రని భూమిలో నల్లమద్ది మానులా ఆంధ్రా విశ్వకళా పరిషత్ స్వాగతం పలికింది.
''ఇంటిలోన టీ.వి విషం చిమ్ముతున్నది
బహుళజాతి సంస్థలకు పనిముట్టుగ మారింది''
అంటూ ఓ నల్లటి బుడ్డోడు ముద్దుగా తయారై వేదికపై పాట పాడుతున్నాడు. అలా ఆట పాటలు, ఐడియాలజీ చర్చల మధ్య విశాఖ క్యాంప్ సాగింది. ఒట్టి శ్రీరంగం శ్రీనివాసరావు అనే మనిషిని మహాకవి శ్రీశ్రీగా మలచిన ఆంధ్రా యూనివర్సిటీ పొత్తిళ్ళలో పదిరోజులు గడిచిపోయాయి. తిరిగి రావడానికి అందరూ ర్యాలీగా బయలుదేరారు.
''సిరిగల్లా భారతదేశం తమ్ముడా తాకట్టు పెట్టబడ్డది తమ్ముడా/ గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లు, రామగుండం ఎన్టీపీసి, ఆల్విన్ ఆజంజాహి మిల్లులను మూసేసిండ్రు/ ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును తమ్ముడా/ తెగనమ్ముకుంటున్నర్రా తమ్ముడా'' పాట పాడుకుంటూ రైల్వే స్టేషన్ చేరుకున్నారు. ''హలో కాస్తా ఆపేస్తారా! ఎక్కడ ఎప్పుడమ్ముకుంతున్నారేటీ విశాఖ ఉక్కును? అలగెలా పాడుతారేటి? అసలు స్టూడెంట్స్ ఎలగుండాలి! స్టూడెంట్స్ స్టూడెంట్స్ లాగ ఉండాలి. ఇలా విప్లవకారుల్లా పాడుకుంతుంటే ఇదిగో ఇలానే ఉత్తి ఆవేదనే మిగలగలదు మరీ.'' అంటూ రైల్వే స్టేషన్లో టక్ చేసుకుని ఆఫీసర్ లాగ ఉన్నతను ఆవేశపడి మాట్లాడు తున్నాడు. భూకంపం, తుఫాను లాంటి ప్రకృతి విపత్తులు వచ్చే ముందు ప్రకృతిలో జీవులకు ఎలా తెలుస్తుంది! అలాగే ప్రజల సంపదను పాలకులు పెట్టుబడిదారులకు కట్టబెట్టే విధానాలు తీసుకుంటే కమ్యూనిస్టులకు అలాగే తెలుస్తుంది. అని తనకి సమాధానం చెప్పడానికి మహేష్ గట్టిగానే ఎత్తు కున్నాడు. ఇంతలోనే ట్రైన్ వచ్చింది. ఇదిగో భవిష్యత్‌లో ఈ ట్రైన్‌ను కూడా అమ్మేస్తారు గుర్తుంచుకోండి. అని ఆ సార్‌ను హెచ్చరిస్తూ ట్రైన్ ఎక్కి బయలుదేరారు.
ప్రభాత్ విశాఖ నుంచి తిరిగొచ్చేసరికి ఇంటికి చేరుకుందో లెటర్. దాని మీది అక్షరాలు చూడగానే ఎక్కడినుంచి వచ్చిందో అర్ధం అయిపోయింది. ఓపెన్ చేశాడు.
డియర్ ప్రభాత్.!
ఆ రోజు నీ ఫోన్ కాల్ వస్తే బాగుండు అనే బలమైన కోరికతో ఫోన్ దగ్గరే కూర్చున్నాను. ఎలాగో నువ్వు ఫోన్ చేశావు. అప్పుడు నేనేమీ మాట్లాడే పరిస్థితుల్లో లేను. కానీ చివరిగా ఒకసారి నీ వాయిస్ వినడం కోసం ఎదురుచూశాను. మనం ఒకరినొకరం ఎంతగా ఇష్టపడ్డామో! కాదు. నేను నిన్ను ఎంతగా ఇష్టపడ్డానో! ఆ ఇష్టాన్ని మనసు పొరలువిప్పి కళ్ళతో ఎన్ని సార్లు వివరించే ప్రయత్నం చేశానో! అవి ఇంకా నా కళ్ళ ముందు కదిలాడుతూనే ఉన్నాయి. నా ప్రేమను ఎన్నెన్నిసార్లు నీకు వ్యక్తపరిచే ప్రయత్నం చేశానో! అది నీకు అర్ధమైందో లేదో! ఒక్కోసారి నువ్వు నన్ను దృడంగా ప్రేమిస్తున్నట్టు అనిపించేది. ఇంకోసారి అది ప్రేమో, కామ్రేడ్ షిప్ అర్ధం కాక సతమతమయ్యేదాన్ని. నువ్వు కూడా నిజంగా నన్ను ప్రేమించావు కదా! ఆ రోజు కాల్ చేసింది నాకోసమా! నీ విశాఖ క్యాంప్ కోసమా!
నిన్ను ఎంత పిచ్చిగా ప్రేమించానో! మరణం అంచుల్లో నిలబడిన చివరి ఘడియల్లో మర్చిపోలేనంత, ప్రాణం పోతున్న మైకంలో కూడా కలవరించేంత ఎక్కువగా ప్రేమించాను. నీ స్పీడ్, నీ నడక, నీదైన దూకుడు, నీ తిరుగుబాటు స్వభావం చూసి. అన్నింటికి మించి నీ కళ్ళు, అవి మాట్లాడే విషయాలు నాకు చాలా ఇష్టం. నువ్వు నడుస్తున్నప్పుడు నీతో పరుగెత్తుతూ నడవడంలో ఓ ఆనందం ఉంటుంది. సముద్ర కెరటంతో పోటీపడుతున్నట్టు అనిపిస్తుంటది. అది ఇంకా ఇష్టం. నువ్వు పోలీసులతో తలపడే తీరు ఒక హీరోలా ఉంటుంది. అందుకేనేమో మన మీటింగ్స్‌లో ఇచ్చే ప్రతి క్రెడెన్షియల్ ఫాంలో నచ్చిన నాయకుడు, ఇష్టమైన హీరో అనే కాలమ్‌లో ప్రభాత్ అనే రాసేంతగా ప్రేమించాను.
ఇక్కడ కొంత మంది లెక్కించుకుంటున్నట్టు నా ప్రేమ కుల గోత్రాలో, ఆస్తిపాస్తులో చూసుకుని పుట్టింది కాదు. నిన్ను మాత్రమే చూసి పుట్టింది. కులం గురించి ఎవరైనా మాట్లాడినా నాకు చిరాకోచ్చేది. వారి మాటల్ని పట్టించు కోపోయేదాన్ని. అలాంటి నాకు కుల ప్రమాదం ఏంటో ఎదురయ్యాకనే తెలిసొచ్చింది. కులం అనే విషంతో ఎంతటి ప్రేమనైనా బ్లాక్ మెయిల్ చేయగలరు. కుల బంధు సమేత మృత జన గణ మన పాడగలరు. నిన్ను నన్నూ సజీవ సమాధి చేయడానికి కూడా వెనుకాడరని తేలిపోయింది. నీకు నీ ప్రేమ బ్రతకడం ముఖ్యమా? ప్రేమికుడు బ్రతకడం ముఖ్యమా? అనే ప్రశ్న నా పై పిడుగులా పడడంతో నా పసి ప్రేమ ప్రేమికుడే బ్రతకాలని కోరుకుంది! ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన రోగం క్యాస్ట్ కాన్సరే అని అర్ధమైంది. అలా మనం విశాఖపట్నం వెళ్ళాల్సిన రెండు రోజుల ముందే నేను ఇంకొకరిని చేసుకోవాలని నిర్ణయం చేసి ఒప్పించనైనది. కాబట్టి మనసులోపలి విషయం తెలపని బాధ నాకు మిగలొద్దని నీకు రాస్తున్న ప్రేమ వాంగ్మూలం ఇది.
ఇట్లు
కులరహిత లోకాన్ని కలగనే
కంటి స్పర్శతో.. ప్రకృతి.
- ఎం. విప్లవ కుమార్, 9515225658