Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఓరి నర్సిగా ఎంత వరకు వచ్చేరా వడ్ల లెక్క...ఈ యేడన్న అమ్ముతావా లేక మల్లోచ్చే ఏడు అమ్ముతావా నవ్విండు శేటు''. నువ్వు వరి గోశి ఇప్పుడైతంన్నాదిరా ..! రెండు మాసాలు దగ్గర్కి రాబట్టే నీ లాభంమంత ఈ ఎండకు ఎండుక పోయినట్టే పట్టు, ఎప్పుడైనా నేను కొన్నప్పుడు ఇంత తక్లిఫ్ వచ్చిందా...రా..!. హే ఈడైతే ప్రభుత్వం కొంటది, మరిన్ని పైసలోస్తాయి, మంచి రేటు అంటివీ ఏమాయే ఆ లాభం మందం తూకం పిక్కపాయే. ''అట్ల ఏం కాదు సేటు ప్రభుత్వం మా కొంటది, ఏదో ఆ మాయదారి కర్నోచ్చి ఓ నాలుదు దినాలు ఆల్శం అవుతుంది గని మా కొంటది సేటు..మీరు అట్ల మాట్లడాకుర్రి''. వార్ని రేషం వత్తుందేంరో... సర్లే ఈ మురిపెం ఎన్ని దినాలో చూద్దాం..
''ఓశ్నీ మీ సీరియల్లు సల్లగుండ ఎప్పుడు అదే యావనా..!.'' మల్లేదో కొత్త కర్నా వత్తందంట, వరి, వడ్ల గురించి ఏవో పంచాదులు అవుతున్నయట.. ''అట్ల బాయ్కాంచి వత్తాంటే వాళ్లు అనుకొబట్టిరి''. ఓరి పిలగా గా ఆర్తలు పెట్టురా..! అప్పుడే ఇంట్లోకొచ్చిన నర్స య్య పెండ్లం కొటమ్మ దగ్గరున్న టీవీ రిమోటు గుంజుకోని కొడుక్కు గోపి కిచ్చిండు''. ఒరో... ఎన్నడులేంది ఒక్కటే ఎగ్రుతున్నవ్ నేను సుసేది కాశేపేనాయే..ఐటంక అంత నువ్వు, నీ కొడ్కు ఇట్టమేనాయే నిట్టుర్పిచ్చింది కొటమ్మ.
ఎదో మిజిక్కు వత్తంది... టీవీల బ్రేకింగ్ ఆర్తల సౌండు రెండు ఎర్ర ప్లేట్లు గుద్దుకొని కలిశినంగా ఆటిపైనా తెల్లని అక్షరాలతో పదాలు..''వరిపై ముదురు తున్న యుద్ధం.. రైతులు పండిచిన ధాన్యాన్ని అంతా కొనుగోలు చేయాలి... ధాన్యం కొనుగోలుపై ఏదో ఒక ప్రకటన చేయాలి.. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఓ నేత ప్రకటన...''
అగ్గ్గో చుశ్నావా వరి పంటను ప్రబుత్వమే కొనాలంటా చూడు అందుకే అప్పుడప్పుడు ఆర్తలు చూడాలి పెండ్లాన్ని ఎక్కరిచ్చినట్టు చూసిండు నర్సయ్య. ''హమ్మయ్య ఎట్లైనా ఈ సారి ప్రబుత్వమే కొంటది తీరు... బయట యాపారులు అడ్డికి పావుశేరు అంటున్నరు ''. అట్ల అమ్మితే ఏం ఎవుసం జేత్తే ఏం గిట్టిపాడైతది. గవర్నమెంట్ కొంటనే ఓ నాలుగు పైసలు చేతుల కనబడ్తై లేకుంటే.. ఆ యాపారికే పాత లెక్కలు అయిఇయ్యన్ని కలిపి ఇంక నాకే రావాలంటడు. కొనాలే.. కొనాలే ప్రభుత్వమే కొనాలే... మదిలో అనుకుంటుండూ.. నర్సయ్య. ఓరు ఇంత బువ్వేస్కారాపో కొటమ్మను అన్నడు.
పిలగాడు అప్పుడే అన్నం తిని కొశేపు చదువుకుందానికి గొడకు శిలుకొయ్యకు తాకిచ్చిన బత్తాల సంచిలో బుక్కుల తీసుకుండు.. మా అయ్య సదువు కుంటడు ఇక టీవీలేదు గీవీ లేదు ఆ టీవీ చిచ్చు బంజేరు. పిలగాడు సదువుకుంటడు అన్నం పట్టుకొత్తున్న పెండ్లాన్కి చెప్పిండు నర్సయ్య. ఆరే గోపి నువ్వన్న జర గట్టిన సదువాలే...మా మేమంటే ఎగుడో దిగుడో ఎవుసాయం జేత్తున్నం గానీ నువ్వు నాల్గక్షరాలు నేర్సుకోని మంచిగా నల్గుర్కి సాయం చేసుకుంట బతకాలి పీట మీద కూసోని బువ్వ కల్పుకుంటున్నడు నర్సయ్య. అన్నం తినుకుంట ఒకసారి ఇల్లు మొత్తం చూసిండు.. ఇంట్లేకేలి వెన్నెల సక్క దనంగా కానొత్తంది. పిలగాడు ఎడుతు న్నడని తీస్కచ్చిన శిన్న టీవీ, సూట్టు అవో ఇవో ధాన్యం బత్తాలు, శిన్న శిన్న మూటలు దండానికి ఏలాడదీసిన ఉల్లిగడ్డలు, గోడకు తాకిచ్చిన అయ్య పోట్వా, దాని పక్కన్నే పిగాడు గీసి అంటించిన కాయితాలు, బువ్వ కోసం ఎద్రుసుశే పిల్లి, అతుకుల నవ్వారతోని కట్టిన ఓ పాత మంచం మన బతుకులు ఎప్పుడు మారుతాయేనని ఆలోచన చేస్తు ఉండగా బర్రె వర్రిన సప్పుడుకు ఈ లోకంలోకి వచ్చిండు.
ఇంకో బిడ్డ నువ్వు పొద్దుగాల ఓ పని జేయ్యాలే...ఏంది నాయిన చెప్పు ? ఏం లే బిడ్డ ఆడ గవర్నమెంటోల్లు కొంటరని వడ్లు పోశ్నాం కదా నేను ఇందాకా వచ్చేటప్పుడు వడ్ల మీద పట్టాలు కప్పిన నువ్వు పొద్దుగాల పోయి వాట్ని కశే తీసి రా బిడ్డ. నాకు రేపు శెలక కాడ పనుంది. నువ్వు ఒక్కన్వి కాకుంటే నీ దోస్తుగాడు శ్రీకాంత్ గాన్ని తీస్కపో...! అట్లనే నాయిన నాకు నిద్ర వత్తంది పోయి పడుకుంట అవ్వ దగ్గర్కి చేరిండు గోపి.
''ఓరి నర్సిగా ఎంత వరకు వచ్చేరా వడ్ల లెక్క...ఈ యేడన్న అమ్ముతావా లేక మల్లోచ్చే ఏడు అమ్ముతావా నవ్విండు శేటు''. నువ్వు వరి గోశి ఇప్పుడైతంన్నాదిరా ..! రెండు మాసాలు దగ్గర్కి రాబట్టే నీ లాభంమంత ఈ ఎండకు ఎండుక పోయినట్టే పట్టు, ఎప్పుడైనా నేను కొన్నప్పుడు ఇంత తక్లిఫ్ వచ్చిందా...రా..!. హే ఈడైతే ప్రభుత్వం కొంటది, మరిన్ని పైసలోస్తాయి, మంచి రేటు అంటివీ ఏమాయే ఆ లాభం మందం తూకం పిక్కపాయే. ''అట్ల ఏం కాదు సేటు ప్రబుత్వం మా కొంటది, ఏదో ఆ మాయదారి కర్నోచ్చి ఓ నాలుదు దినాలు ఆల్శం అవుతుంది గని మా కొంటది సేటు.. మీరు అట్ల మాట్లడాకుర్రి''. వార్ని రేషం వత్తుందేంరో... సర్లే ఈ మురిపెం ఎన్ని దినాలో చూద్దాం..నేను సుడకపోతనా తీరు..!. కచ్చితంగా కొంటది సేటు వడ్లు కొనాల్నని అంటున్నరు. నాత్రి ఆర్తలు విన్న, ఆ ఆక్షరాలు చూసి మావోడు కూడా చెప్పిండు ఈ సారి వడ్లు కొనేదాన్కా పట్టుపడ్తాంరాట అని. వారి ఇలాంటివి ఎన్ని చూడలేదురా... ఇప్పుడు ఇంక అధ్వనంగా తయరైందిరా ఈ సమాజం సర్లే నీ నమ్మకాన్ని ఎందుకు కాదనాలే గని, అయిన నీ వడ్లు అంత గొడితే రెండు పుట్లు గూడ లేకపాయె అయిన నువ్వు ఊ.. అను ఇప్పుడే కాంటపెట్టుకోని పది రోజులల్లో డబ్బులిస్తా....అట్నే సేటు కానీరు...ఆ రేటే కట్టుకొండ్రి నెత్తికి కట్టుకున్న తువ్వాల తీసి సంకల పెట్టుకోని శెతులు కట్టుకున్నడు నర్సయ్య. అబ్బ నర్సిగా ఏం తెలివిరా... నీది నీకెదో సాయం జేద్దామంటే నా కాలువకే గండి కొట్టినట్టి మాట్లాడ్తివిరా...!. ''సర్లే నువ్వచ్చి మీరే తీసుకోండి సేటు అన్నప్పుడే తీస్కుంట తీరు...కానీ అప్పటి రేటు అప్పుడేరో...'' ఆడ్నూంచి పోయిండు సేటు.
ఏం నర్సన్న బాబారు అప్పట్నుంచి సేటుతోని ఏందో పెద్ద చర్చే పెట్టినట్టున్నవ్...! అక్కనే వడ్లు పోసిన మరో రైతు పుల్లయ్య అడిగిండు, వండ్లంటా సేటుకు అమ్మాలంటా నన్నుఎట్టైనా బోల్తాకొట్టించి వడ్లు కొనాలని చూసిండు నేనంత శిన్నగా నానుతానా...!. ఈ రేటుకే కొను అన్న మల్ల మారు మాట మాట్లాడకుండ పోతాండు సూడు. ఏందో మన సదువు రానోళ్లు ఎవుసం చేసినంత వరకే వీళ్ల సాగుబాట్లు.. మనకు నాలుగు రుపాలు ఎక్వపెట్టి కొంటాంటే ఈ సేటుకు ఇయ్యాల్నా..! మల్ల వత్తడా..పటు !. అయితేమాయే గని వడ్లు ఎట్లున్నాయె చూడాలే పిలగాడొచ్చి పట్టాలు తీసిపోయ్నట్టు ఉండుగనీ ఆటు ఇంక పోలే ఈ సెటుతో ఈడ్నే ముచ్చటైంది అట్ట పోయ్యెత్తా వత్తానప్పుడు ఇంటికి కూడ పోయిరాలేదు. కడ్పులు గాబర.. గాబర.. అయితంది అక్కడోల్లకు శెప్పి తన వడ్ల రాశికేలి కదిలిండు నర్సయ్య.
ఓ యాదన్న ఏమాయే ఎంత వరకు వచ్చింది పని. నాకేం పని నర్సయ్య ఇదేనాయే నీకన్న ముందు పోశ్నా వడ్లు వీట్ని కానే నాదుడే లేడాయే. ''అంత కొడితే పుట్టేడు గూడ లేకపాయే దీని కోసం రెండలు నెలలసంది కావాలి కాత్తున్న, ఆ గుడిశెల పొద్దుందాక ముసల్ధి ఏట్లుంటందో ఏందో...!'' .పొద్దుగాల కనవడి కనవడక ఇంత వండి నేనింత తిని దానికి గిన్నెల పెట్టి వతున్న. అది మంచాల పడి ఆరునెలలాయే దాని సూసుకుందామనుకున్న ఈ వడ్లు కొనతట్టే లేదు. పొద్దుగాల వత్తే పొద్దూకి వోతున్న తన ఎతంత శెప్పుకుంట వడ్లు నేర్పుతుండు యదయ్య.
''వడ్లు కొనలేని ప్రభుత్వం ఢాం..ఢాం...! వడ్లు కొనలేని ప్రభుత్వం ఢాం..ఢాం...! . రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనాలి.. ప్రభుత్వమే కొనాలి '' నినాదాలు చేసుకుంట ఓ పార్టోల్లు కొనుగోలు కేంద్రం దగ్గర్కి వత్తాండ్రు.. ఏందిరా నర్సన్నగా సప్పుడు వడ్లు కొనేతందుకు వతాండ్ర ఏంది..? అతృతగా అడిగిండు యదయ్య. అదేం లేదే.. ఓ పార్టోల్లు నిరసన జేత్తాండ్రు వడ్లు కొనాలాని.. నేను నిన్నన్నే జూసిన్నే ఆర్తలూ వడ్లు కొనాలని నిరసనలు జేత్తాంరట అదే కావోచ్చు ఇది. ఇక ప్రభుత్వానికి శెకొచ్చి మాగ కొంటరు తీరు ఇయ్యాల రేపట్ల. '' అగో ఇటే వత్తారే యదన్న నీ తాన్కే కావొచ్చు నీ వడ్లు ఆపీసర్లు కొన్నట్టే తీరు సంబురంగా చెప్పిండు నర్సయ్య ''. యదయ్య దగ్గర్కి రానే వచ్చిరు వాళ్లకు తన గోసం చెప్పిండు. ''ఎట్లన్న జేసి వడ్లు కొనియ్యిరయ్య నీ బాంచాన్, నీ కాల్మోక్తా ఈ ముసలి పానాన్ని గట్టేకియ్యిండ్రి వాళ్ల కాళ్ల మీద పడబోయిండు...!''. అయ్యో పెద్దయ్య లే లే.. ఏం కాదులే నీ వడ్లు కచ్చితంగా కొనిపిచ్చే పూచి మాది అందరు కల్సి యాదయ్యతోని పోట్వా, ఈడీయోలు తీస్కుంరు.. ప్రభుత్వం వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ నినాదాలు శేశిర్రు..
నాయిన నువ్వు టీవీల వచ్చినవే, అట్నే పేపర్ల సూత కనబడ్డావ్ కని చిన్న పోట్వా వచ్చింది. బల్లే మా సారు సుపెట్టిండు. '' ఓ.. ఈ సంబురాలకు తక్కువలేదు గని వడ్లు కొనేది ఉందా...? లేదా..? ఎన్ని వచ్చినా...! వడ్లు కొంటనే మనం బతికేది '' ఈ సంబరం అసలు సంబరం కాదన్నట్టు కొట్టమ్మంది. ఓ పాలి ఆర్తలు పెట్టురా...! వడ్ల గురించి ఏం నడుస్తుందో...! ఇంక మనోడ్లు ఆన్నే నాన్తూన్నరు ఏ వార్తలు పెట్టిన ఇవే ... రైతుల వడ్లు కొనాలని పొట్టు పొట్టగా లొల్లులైతున్నరు... ధర్నాలు, నిరసనలే ఎక్కువ కానోత్తున్నరు..! . ''ఇలా పది రోజుల అయితాంది గని కొనుగోలు కేంద్రాల్లో కాంటాలే కాతలేవు. ఎప్పటి లెక్కనే ఒక రోజు తన వడ్ల కాడ్కి వోయిండు నర్సయ్య.
''అగ్గొ ఇంత పొద్దుగాల ఈ ముసలాయనకు ఏం పని ఈడ శెద్దర కప్పుకోని పడుకున్నడు...'' ఓ యాదన్న..ఓ యాదన్న...ఉల్కులేదు పల్కులేదు.. అప్పట్కే అనుమానం కొడ్తుంది నర్సయ్యకు . శెద్దర పూరగా తీసిండు పానం జల్లుమన్నది నర్సయ్యకు వడ్ల పాన్పు మీదనే యాదయ్య శాశ్వాత నిద్రవోయిండు. అప్పుడు ఆ వార్త రాష్ట్రమంతట చర్చగా మారంది ఓ ఐదారు రోజులు రాష్ట్రంలో అగ్గే రాజేశింది.
రోజులు గడుస్తున్నాయి నర్సయ్యలో బుగులు మొదల యింది. వడ్లు కొంటారా...? కొనరా..? రాత్రి నిద్రపట్టడం లేదు ఎట్లైన్న సర్కారు వడ్లు కొంటదన్న ధీమాతో ఉన్నా... ఆ దైర్యం ఇప్పుడు లేదు కాళ్లాల్లో వణుకు మొదలయ్యింది. ఏందకు నిద్ర రావడం లేదు. ఆ ఆలోచనతోనే ఎప్పుడు నిద్దురపోయిండో ఎమో పొద్దుగాలనే లేశిండు శిదా వరి కుప్ప తాన్కి పోయిండు అంతా కలియా చూసిండు ఎక్కడి రాశులు అక్కన్నే ఉన్నరు. అప్పుడో ఇప్పుడో కాంటాలు అయితున్నరు కానీ అది ఊర్లే కశే పేరునోళ్లకు.. చాలా మట్కు అట్టనే ఉన్నరు. తెల్లంగా తెల్లారింది రైతులందరు వాళ్ల వాళ్ల వడ్ల కుప్పల కాడ్కి వచ్చి సూస్కుంటున్నరు. ఏ రైతు మొఖంలో కూడ గతంలో ఉన్న కళ లేదు... అందరీ చూపులు దీనంగా ఉన్నాయి. ''ఏందే నర్సన్న ఇంక నాలుగొద్దులైతే మల్ల నారు పోత్తాం ఇంత వరకు వడ్లే ఈడ్నే ఉంటే ఏం అర్థం అయితలేదే...! అప్పులోల్లు పొద్దుకు మూడు సుట్లు తిర్గిపోతున్నరు. ఈ వడ్ల మీద అశ సన్నగిల్లుతుంది... తెచ్చిన అప్పుకు వడ్డీకి మాత్రం పెరిగిపోతుంది '' . ఇప్పుడు ఆ సేటుకే ఇద్దాం పటు.. ఆ నాలుగు పైసలన్న కండ్ల కనబడ్తాయి, అట్ట కాదురా ఈరయ్య ఇన్ని దినాలు ఆగినం ఇంకో నాలుగు రోజులు సూద్దాం పటు ఎట్లైయ్యెది ఉంటే గట్టైతతి. అయిన ఇప్పుడు గనుక మనం ఆ సేటు కిందకు పోయ్నం అనుకో అడ్డికిపావుశేరు కాదు కదా...కొసరు కూడ రాదు.
''ఏంది ఆసాములు ఏందో పెద్ద మీటింగే పెట్టినట్టున్నరు.. నేను అప్పుడే చెప్పిన ఈల్లను నమ్ముకుంటే మీరు వడ్లు బుక్కినట్టే అని, ఏదో నాలుగో రోజులు నాటకం ఆడ్తారు...అది లేదు ఇది లేదు అంటరు.. అంతకు కాకుంటే వేవే పార్టీలోల్ల పైనా తొస్తారు. ఏదనుకున్న గాని ఇప్పుడు ఎలచ్చలన్లు లేవుగా...ఇప్పుడు గన్క ఎలక్షన్లు ఉంటే పలారం లెక్కనే కోనేటోళ్లు మీ బతుకులు ఇంతే తీరు...!. అంతకో..ఇంతకో నాకు అప్పుడే అమ్మితే అయిపోయేదిగా ఇన్ని రోజులు నాన్చిరు, ఇప్పుడు అప్పుడున్న రేటు కూడ లేదు.. షాక్ కొట్టినట్టు చూస్తున్నరు రైతులు.
మన బతుకులు ఇంతేరా..!. నమ్మిచ్చి నమ్మిచ్చి నట్టేటా ముంచిండ్రు, అందరూ మంచిగానే ఉన్నరు మాన బతుకులిట్ల తాయరయ్యేరా దేవుడా మొగులుకి మొక్కిండ్రు దేవుడా బగమంతా మమల్ని నువ్వే కాపాడాలి అంటు అటు భూతల్లికి ఇటు ఆకాశానికి ఒక్కతీర్గ దండం పెడుతున్నరు. చెప్పిన వినకపోతిరి పటు మల్లోకారు నెత్తిమీద్కి వస్తుంది. ఇవి ఇక్కడే ఉంటాయి..మీరు మల్ల నాగళ్లు దున్నుకుంట ఉంటారు... పొతా పోతా ఒక్క మాట శెప్పిండు సెటు, ఇన్నాళ్లు ఆ దేవుడు మీ యదు ఉన్నడు కాబట్టే ఒక్క వాన కూడ పడలేదు...మీ గాశారం బాలేగా...! అక్కడి నుంచి వెళ్లిపోయిండు సేటు.
''రైతుల గుండె ఒక్కసారే ఎవ్వరో గడ్డపార పెట్టి పెకిలించినట్టు అయ్యింది''. అందర్కి వరి రాశిమీద జీవిడ్శిన యాదయ్య యాదికొచ్చిండు.. గుండె ల్లోంచి దుఖం తన్నుకొచ్చింది. రెండు రోజులు, నాలుగు రోజులు, పది రోజులు అయింది. చూద్దమన్న రైతుల గోస గురించి ఒక్క వార్త కూడ కనబడ్తలేదు. అందరూ మర్శినట్టు ఉన్నరు... కొనుగోలు కేంద్రంలో ధాన్యం సేకరణ సరిగ్గా జరగడం లేదు. గట్టిన అడిగితే ఉంచుతే ఉంచు లేకుంటే బయట అమ్ము కొమ్ముంటున్నరు.. పెద్దగా సదువుకోలేదు నర్సయ్య. ''ఏవల్ని కలసి తన గోడు ఇనిపియ్యాల్నో అర్థం అయిలేదు. ఆ రైతుల గోస చూసి ధాన్యంపు కుప్పలు చెమ్మగిల్లుతున్నాయి''. మల్లో పంటకు సాగుబాటు చేయ్యాలే.. వీళ్లు కొనమన్న అయిపోవు.. కష్టమో నష్టమో... ఆ యాపారులకు అమ్ముకున్న ఇన్న డబ్బులన్న వచ్చు... ఇక్కడ పోసుడు ఏంది మమ్మల్ని కానాకపోవుడేంది.. రోజు పనిశెడగొట్టుకోని ఇక్కడ కావాలి ఉండుడు ఏందో అస్సలు మనసుల పడ్తలేదు నర్సయ్యకు.. అప్పుడోచ్చిన పార్టీలోల్లు ఇప్పుడు తోక చుక్క లెక్కన్న రాకపోతరి అప్పుడోచ్చి వాళ్లు ఎల్గబెట్టింది ఏంది.. ? . తీవ్ర ఆలోచనలు శెదలు కట్టేలను తొలిచినట్టే ఆలోచనలు మనస్సును తొలుస్తున్నాయి. బువ్వబుగ్గి లేకుండ పొద్దుకీందాకా ఆ వడ్ల కుప్ప కాన్నే కూసున్నడు సుక్క పొడుస్తుంది ఇంట్లోకి చేరుకుండు... కాళ్లు చేతులు కడుక్కోని మంచంల వోరిగిండు ఏదో కీడు శంకించినట్టు కొట్టింది నర్సయ్యకు .. బయట ఏదో శబ్ధం. నర్సయ్య గుండెల్లో పిడుగు పడ్డట్టు అయ్యింది. '' ఇన్నాళ్లు తనలో దాచుకున్న తల్లి పిల్లను ప్రసవించినట్టు మేఘాలు ఒక్కసారిగా వర్షాన్ని కుమ్మరించాయి...'' ఎదో ఆలోచనలు.. బయటికి పోయే తావు కనబడ్తలేదు. ఎందుకో ఈ సారి వరి కుప్పపై పట్టాలు కప్పడం మరిచిపోయాడు గాశారం కాబోలు. తన కంటనీరు వర్షాన్ని మించిపోయింది అదే ఆ రైతు ఆఖని కష్టల కన్నీరుగా....మారింది.
అప్పుడే పెద్ద సప్పుడుతో టీవీలో రెండు ఎర్ర పెట్లు గుద్దుకోని తెల్లని అక్షరాలు పడుతున్నాయి. అక్షరాలు కొటమ్మకు అర్థం అయితలేవు.. దాని వెనుక గద్గర స్వరంలో మాటలు... రోజు రోజుకు పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలు... ఈ గడ్డు కాలం ఇంక ఎన్నాళ్లూ...!. రైతు నర్సయ్య ఇక లేడని ఏడుస్తున్న ఏడుపు, కురుస్తున్న వర్షాన్ని తలపించినా... కొడుకు, కొటమ్మ దుఖం ఆ బ్రేకింగ్ న్యూస్లో కలసిపోయింది..
- బద్ది గణేష్, 8106684729