Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంకటమ్మ సూర్యాపేటలో సినిమాహాల్ల పాయఖానాలు సాపుజేస్తది. ఎంకటమ్మకు పిల్లాజెల్లా లేరు. నెనరు కల్లది. పిల్లలు కాట్లేరని మొగడొదిలేశి ఇంకోదాన్ని చేసుకుండు. ఇంటి పక్కనున్న మస్తాన్ కాకా కొడుకు నబిపాషా. తమ్ముడు నబీతో ఎంకటమ్మ చిన్నప్పటి సంది కాసు అక్కా తమ్ముండ్లలెక్క మెలిగిండ్రు. మస్తాన్ కాక దినాం భత్తేనికి ఊర్లె ఏటల కోసి పాల్లెసేది. అయ్యలనాడే సోలిపేట చెరువుకింద ఇండ్లుపోతే పాత సూర్యాపేటకు ఎల్లొచ్చిండ్రు. ఊరి బయట నాలుగు కమ్మలేసుకొని బతుకుతుండేది. చిన్నగ చిన్నగ అది బస్తీ అయింది.
''ఉన్నప్పుడుట్ల పండుగ, లేనప్పుడు లొట్ల పండుగన్నట్టు'' అయ్య, మస్తాన్ కాకా ఏ లోటు లేకుండా సంసారాలు సాగి చ్చిండ్రు. పండుగలు పబ్బాలు కలిసి జరుపు కునేది. తమ్ముడు నబిపాషా పుట్టంగనే పిన్నీ ఏదో మానని రోగమొచ్చి మంచాన పట్టి పోయింది. తరువాత మస్తాన్ కాకా పెండ్లిజేసుకోలె. అయ్యకు కాకా తోళ్ళనిస్తే, ఆటితో అయ్య చెప్పులు కుట్టేది. ఇండ్లలెక్కనే బతుకులు ఊరికి దూరంగా ఉండేయి పడావుబడ్డట్టు. ఎట్టనో... గాళ్ళ బతుకులు గట్టా తెల్లారినై.''
నబిపాషాకు కాక చిన్నతనాన పెండ్లిజేసిండు. పెండ్లైనంక పదేళ్లకు తొల్సూరు బిడ్డ మదారి పుట్టింది. అది మర్మమెరుగని పిల్ల. దురదష్టవంతురాలు. నాలుగేళ్లప్పుడే తల్లికి దూరమయ్యింది. నబిపాషా లారీ మీదపోతడు. మదారికి తండ్రి ఉన్నా లేనట్టే. పిల్లను పట్టించుకోడు. ఆమ్దాని మస్తుగున్నా తాగుడుకు తగలేసేది. పెండ్లాం పోయినంక ''అంతమిడిశిన కుక్కోలిగ'' తాగుడుకు మరిగిండు. సంసారం గాలికొదిలేశిండు. పొద్దస్తమానం తాగడంతో కండ్లు చింతనిప్పుల్లా ఉండేయి. తండ్రిని చూస్తేచాలు పిల్ల జడుసుకునేది. దగ్గరకు సుత పోకపోయేది.
''ఆడ దిక్కులేని సంసారం. పిల్ల ఈడేరుతుంది. గట్టా తాగకు తమ్మీ..'' అని నబిపాషపై ఎంకటక్క గుస్సా చేసినా ''చెవిటోని ముందు శంఖం ఊదినట్టే''. శెవినబెట్టేటోడు కాదు. తాగితాగి ముప్పైయ్యేండ్ల నబిపాషా నలబైల కన్పడేటోడు. ''ఇంకో పెండ్లి జేసుకో తమ్మీ'' ఎంకటక్కంటే నవ్వేటోడు. ''అక్కా! నువ్వు నాకు అక్కవు గాదు, అమ్మవు. పావురం గల్ల తల్లివి''. తాగినపుడు గదుమ పట్టుకొని పావురంగ మాట్లాడేది. ఒక్కగానొక్క బిడ్డ మదారిని ఎంకటక్కకు వదిలేసి నెలలు నెలలు లారీమీద పోయేటోడు. ఇంటికి వచ్చినప్పుడు అంతో ఇంతో ఎంకటక్కకిచ్చేవాడు. పిచ్చి తాగుడు చేబట్కి యాల్లకు తిండి తిప్పలు మర్సిండు. తాగుడు తోటి కడుపు నింపుకుండు. ఆకలిని సంపుకుండు.
సోయితప్పి తాగిన తాగుడుకు కొన్నాళ్ళకు నబిపాషా కార్జం, కిడ్నీలు పాడైనై. దాంతో మంచాల పడ్డడు. అప్పటికే పద్నాలుగేళ్ళ కొచ్చింది మదారి. అబ్బాజాన్ కడుపు నొప్పితో ''అమ్మీ... అమ్మీ !'' అని అరిసే అరుపులకు భయపడి దగ్గరికి పోవాల నంటేనే గజ్జున వణికేది. మంచానబడ్డ అబ్బాజాన్ తక్కువ రోజులే నంశిండు. అబ్బాజాన్ బాధ పడ్తుంటే మదారి చూడలేక పోయేది. ''అబ్బా..'' అంటూ కండ్లు ఉబ్బేటట్టు అబ్బాజాన్తో బాటే ఏడ్సేది. అబ్బా వైద్యానికి గరీబు సంసారం ఆన్లేదు. బేటీ కండ్లల్ల అబ్బాజాన్ మీద పావురం నబిపాషాకు అర్ధమైంది. గుండె మెలి పెట్టినట్టు అన్పించింది. ఒకనాడు మదారిని దగ్గరకు పిలిశిండు. కన్నీటితో చేతులు గట్టిగ పట్టుకొని ''మాఫ్ కరో బేటీ'' అడిగిండు. వరదకట్ట తెగినట్టు తండ్రీబిడ్డ శానాసేపు ఏడ్సిండ్రు. నబిపాషాకు రోజులు దగ్గరపడ్డై. ''దీపంలో పడ్డ పురుగు'' లెక్క తాగుడుకు బతుకు బలైందని గ్రహించిండు. బేటీ గురించే సోచాయిస్తుండు. ఎంకటక్కను పిలిపించుకుండు.
చెప్పి చెప్పి యాష్టకొచ్చిన ఎంకటక్క ''సావుదలకు బిడ్డమీద పావురం యాదికొచ్చిందారా తమ్మీ'' అంది. ''అక్కా! తోడబుట్టకున్నా నువ్వు నా అక్కకు తక్కువ కావు. నీ బిడ్డ అనుకో. కండ్లల్ల బెట్టి జూసుకో. బిడ్డ నీ జిమ్మేదారి. సచ్చి మళ్ళీ నీ కడుపున బుడతా. నీ రుడం తీసుకుంటా'' అని కాళ్ళు పట్టుకుండు. మాట తీసుకుండు. ''సరే తమ్మీ! నీకేం కాదు. దైర్నంగా ఉండు. బిడ్డ నా జిమ్మేదారి. మాటిచ్చింది ఎంకటక్క.'' అక్కమాటతో నబిపాషా కండ్లల్ల వానలేని మెరుపు మెరిసింది. మదారి కండ్లల్ల ఉరుములేని వాన కురిసింది. బిక్కసచ్చినట్టున్న మదారిని చూస్తే ''నత్తగుల్లలో ముత్తెము లెక్క'' అమాయాకంగా ఏడుస్తూ ఉంది. దగ్గరకు తీసుకొని ''నేనున్నా బిడ్డా..''అని ఓదార్చింది.
''గరీబోల్ల ఇందుకు గంపెడంత జనం'' అన్నట్టు సావుకు రానోడు కూడా దినాలకొచ్చిండ్రు. అయినవాళ్ళు, కానివాళ్ళు అందరూ వచ్చిండ్రు. నోటికి, చేతికి దూరమెక్కువ. ''కాలిన ఇంట్లే కట్టె మిగిలినా లాభమే''నని కార్యాన్ని దగ్గరుండి కతకత అన్పించింది ఎంకటమ్మ. మదారి తండ్రిపోయి యాడాదయింది. ఎన్కకు తిరిగి పిల్ల గురించి అడిగినోడు లేడు. ఎంకటమ్మ యోచన జేస్తుంది. ఎలాగైనా ముందుపడి ఓ పిలగాన్ని చూసి లగ్గం జేయాలని అనుకుంది. తెల్సిన పిలగాడు చాన్పాషా యాదికొచ్చిండు.
చాన్పాషా బుద్దిమంతుడు. అసలు పేరు చాంద్ పాషా. అమ్మీ బతికున్నప్పుడు గట్టనే పిలిశేదని సంబురంగా జెప్తడు. అమ్మీ అంటే శానా ఇష్టం. చిన్నతనానే అబ్బాజాన్ అమ్మీనోదిలేశిండు. ఇంకో నిఖా జేసుకుండు. అప్పట్నించి అమ్మీ పాత పరుపులు, దిండ్లల్ల దూదినేకే పనికిబోయి సాకింది. కాలు చేయి ముదరంగనే ఓ సైకిలు, ఐస్ క్రీం డబ్బా కొనిచ్చింది. ''బేరం మంచిగ చేయి బేటా'' అని జాగ్రత్త చెప్పింది. దానిమీద వాడవాడన తిరుగుతూ మారుబేరానికి పుల్లైస్ లనమ్మిండు. పిలగాల్ల ఇస్కూలు కాడ మస్తు గిరాకుండేది. తరువాత పోటీకి ఇంకొకలు వచ్చిండ్రు. చలికాలం రాంగనే ఐస్క్రీం డబ్బా ఆయింత మూలకు బడ్డది. ఇంతట్లనే పాడు బడ్డ దుమ్ము పీల్చిపీల్చి అమ్మీ గాలితిత్తులు పాడైనై. చాన్పాషా అప్పు కోసం ఊరంతా తిరిగిండు. యాడ అప్పు పుట్టలేదు. అమ్మీ గాలి తిత్తులకు గాలి సరిపోలేదు. చాన్పాషాకు అమ్మీ దక్కలేదు. చాన్పాషా శానా కలలు కన్నడు. చిన్నప్పటి సంది అమ్మీని మంచిగ జూసుకోవాలని దోస్తులతోని చెప్పేటోడు. ''నీటి తెప్పకు ఇగిచెదిరిన ఇసుకగూడులా'' కలలన్నీ కన్నీటిలో ఎండకు కరిగిన ఐస్ లా కరిగినై.
అమ్మీ పోయినాక చాన్పాషా నీరుగారిపోయిండు. ముందటి ఉషారు తగ్గింది. గిప్పుడు అలంకార్ టాకీస్ కాడ మాత్రమే ఐస్ క్రీం డబ్బా పెడుతుండు. ఆడ్నే పనిజేస్తున్న ఎంకటమ్మ చాన్పాషాతో చిన్నగ మాట కలిపింది. మదారి ముచ్చట ఎల్లదీసింది. ''బిడ్డా చాన్పాష ! మదారి ఏ దిక్కు లేనిది. నీ లెక్కే అమ్మ, అయ్యను పోగొట్టుకుంది. మదారిని నిఖా జేసుకో.'' అసలు ముచ్చట జెప్పింది. ఆ ముచ్చట జెప్పంగనే చాన్పాషాకు అమ్మీ యాదిలబడ్డట్టుంది. కండ్లల్ల నీళ్ళు గిర్రున తిరిగినై. ఎంకటమ్మ కష్ట, సుఖం ఎరిగిందాయే. ''బిడ్డా ! ఇయ్యాల ఇంట్లె, రేపు మంట్లె''. ఏన్నటికైనా అందరమెల్లిపోయేటోల్లమే. ఫికరు జేయకు. ఎక్కడున్నా అమ్మీ దీవెనార్తులుంటాయని నిమ్మలబరిసింది.''
అదే ముచ్చట నాల్రోజులకు ఇంకోపాలి ఎల్లదీసేసరికి చాన్పాషా కాదన్లేకపోయిండు. ''ఇంటికి దీపం ఇల్లాలు'' అనుకుని ఒప్పుకుండు. ఎంకటమ్మకు పానం నిమ్మలమైంది. ఎంతైనా పెంచిన పావురం గొప్పదాయే. మాదారి లగ్గమయింది. అంతాకల్సి జాన్పాడు దర్గాకు పోయిండ్రు. పొద్దూక సంబురంగా ఇల్లు జేరిండ్రు. ఎంకటమ్మ బొట్టుపెట్టెల దాసుకున్న యాభైవేల రూపాయలు, ముప్పై తులాల ఎండిని తీసి లెక్కబెట్టి చాన్పాషాకు వరదచ్చినం కింద ఇచ్చింది.
***
పెండ్లయినంక మదారి టౌన్లున్న చాన్పాషా ఇంటికి మారింది. ఎంకటమ్మ అప్పుడప్పుడూ వచ్చిపోతుంది. ఆర్నెల్లకు మదారి నీళ్ళు బోసుకుంది. అమ్మాయి పుట్టింది. అమ్మీ పుట్టిందని చాన్పాషా లెస్స సంబురపడ్డడు. పసిపిల్ల నవ్వు జూసినంక ఎంకటమ్మ దగ్గర మిగిలిన అన్నోఇన్నో కూడిన పైసలు సుత అడుగుబట్టినై. చినపిల్ల కాళ్ళకు ఎండి గొలుసులు బెట్టింది. చాన్పాషాతో మదారి జీవితం సంబురంగ సాగుతుంది. మదారికి ఎడం లేకుండా ఎంట ఎంటనే కాన్పులు జరుగుతున్నై. నల్గురు పిల్లలయ్యిండ్రు. గదిజూసి చుట్టూతున్న జనం చాన్పాషాను ''చైనాపాషా'' అని ఎక్కిరిస్తుండ్రు. ''ఉంటే అమీరు లేకపోతే ఫకీరు''. జనం నాలుకే అంత. ఎడం లేకుండా బిడ్డలయ్యేసరికి మదారి కండ్లల్ల జీవం పోయింది. కొడుకు కోసం చాన్పాషా ఎదురు జూస్తుండు. వంట్లే సత్తువ బోతుంది. చాన్పాషా మీద కోపంతో. ''మంచిగ జూసుకుంటవని భంశి పిల్లనిస్తే గిట్టా జేస్తున్నవ్. పిల్లను మింగి నీళ్ళు తాగుతవా ఏందీ'' అని ఎంకటమ్మ మందలించింది. ''ఎవలూ లేని మాకు బిడ్డలెక్కువ కావాల్నని కంటున్నామని'' అనేసరికి ఎంకటమ్మ మారు మాట్లాల్లేదు.
ఎంత సర్దుకున్నా మదారి సంసారానికి పుల్లైస్ క్రీముల మారుబేరం సరిపోతల్లేదు. ''ఏడ్చిన బిడ్డకే పాలు'' అన్నట్టు గంపెడు మంది పిల్లలకు బువ్వ పెడుతుండు. సలికాలం వస్తే ఇంకా ఎటమటమయింది. నోటికాడికి బువ్వ లేదు. అసలే ఇప్పుడు మాదారి వట్టిమనిషి కాదు. బువ్వలేక మదారి ఒంట్లె సత్తువ బిడ్డబిడ్డకు జారింది. ఒంటికున్న కండపోయి ఎండు కట్టయింది. కండ్లు బాయిల పడ్డై. చాన్పాషా పోరగాండ్లు బువ్వ లేక అప్పుడప్పుడు మట్టి బుక్కుతుండ్రు. నమ్మలేకున్నా అది నిజం. మదారికి తెలిసి అన్నానికి బదులు వాళ్లకు వాత పెట్టింది. చాన్పాషా మాటల్ల బలంపోయి బాయిల పడ్డది. డొక్క లోపలికి పీక్కపోయింది.
దాంతో అవ్వ కొనిచ్చిన ఐస్క్రీం డబ్బాను మూలకేసిండు. ''పొట్ట తిప్పలకు జేరుపోతులాట.'' లారీమీద క్లీనరు పనికి కుదిరిండు. రాత్రనక పగలనక పోతుండు. ఎప్పుడో అద్దనేత్రి ఇంటికొస్తుండు. ఓనాడు తాగి ఇంటికొచ్చిండు. మదారి వణికి పోయింది. తెల్లారి పెద్దమ్మను పిలిపించింది. అరిసింది. గోలజేసింది. ఇంకెప్పుడూ తాగనని పిల్లల మీద, తన మీద ఒట్టేయించు కుంది. తరువాత ఇంకెప్పుడూ తాగలేదు. లారీ తోల నేర్సుకుండు. రాబడి పెరిగింది. సంసారం పుంజుకుంది. ఐదో సంతానం కూడా ఆడపిల్లే.
ఐదేళ్ళు నోట్లెకయితే బోతున్నై. పిలగాండ్లకు ఆకలి తెల్వనీయక పోయే సరికి మట్టి బుక్కుడు పురాగాపిండ్రు. జనంల ఇజ్జత్ పెరిగింది. ''చాంద్ పాషా..'' అని పిలుస్తుండ్రు. ఎంకటమ్మ పెద్దమ్మకు తబేదు కరాబయిందన్న ముచ్చట తెల్సి ఆలుమగలు బోయి ఇంటికి తోలుకొచ్చిండ్రు. దవాఖానాకు తీసుకుబోయిండ్రు. మంచిగ చూయించి ఇంటికి తెచ్చిండ్రు. మందులాడు తుండ్రు. పెద్దమ్మ కోలుకుంటుంది. మంచం నుండి లేశి తన పనులు సొంతంగ చేసుకుంటుంది. పురాగ కాల్జేయి స్వాదీనంలోకి రాలేదు. బిడ్డ తనకు ఆసరయినందుకు సంబురపడ్డది. బిడ్డ బువ్వ బయట పడ్డదని కండ్లనొత్తుకుంది. మదారి ముఖాన మునుపటి జీవకళోచ్చింది. నీళ్ళుబోసుకున్న ముచ్చట పెద్దమ్మ సేవినేసింది మదారి.
***
హైదరాబాదులో లోడు దించి సూర్యాపేటకు తిరిగొస్తుండు చాన్పాష. కేతేపల్లికి ముందే జోరున వానందుకుంది. ఈలోగా చీకట్లు ముసిరినై. వానతగ్గినాక పోదమని లారీని రోడ్డు పక్కన నిల్పిండు. ఎదురుగా బరువుతో వచ్చిన ఇసుకలారీ బలంగా గుద్దింది. లారీ ఎగిరి రోడ్డుకవతలున్న మడికట్లల్ల పడ్డది. క్లీనరు అక్కడికక్కడే ఊపిరిడిశిండు. లారీతోబాటు చాన్పాష బతుకు కూడా తిరగబడ్డది. కాలురెక్కలు ఇరిగినై. ఎన్నుపూసకు బలంగా దెబ్బతగిలింది. ఎంకటమ్మ మంచం చాన్పాషకొచ్చింది. ఎంకటమ్మ పని మదారి మెడకు పడ్డది. దాంతో పిల్లల నోట్లె మళ్లా మన్నుబడ్డది.
మదారికి ఇల్లు దాటక తప్పలేదు. కంటికి పుట్టెడేడ్సింది. బిడ్డ దుఃఖం చూసి ఎంకటమ్మకు కూడు సయిస్తల్లేదు. మదారిప్పుడు వట్టిమనిషి కూడా కాదు. మదారి గడప దాటకుంటే ఇల్లు గడవదు. మదారి కూడా పోరగాల్లకు ఇంత గంజి నీళ్ళు పోయాలంటే ఇల్లు దాటాలని నిర్ణయించుకుంది.
***
కడుపున బిడ్డనేసుకొని, ఆకలి దాసుకొని సంకన బిడ్డతో గడప దాటింది మదారి. కండ్లల్ల ఆవుసు పోయింది. పనికి బెట్టుకోడానికి టాకీసు యజమాని ఒప్పుకోలేదు. ఎంకటమ్మ జాగల ఇంకోలు పనిజేస్తుండ్రు. శానాల్లు నమ్మకంగ పంజేసిన ఎంకటమ్మ బతిమాలడంతోని ఒప్పుకుండు. మదారికి పని దొరికింది. ఏగిలిబారంగ నాలుగింటికాంచి తొమ్మిదిదాక టాకీసు ఎదురుంగున్న బస్టాండుల పాయఖానాలు కడుగేపని కూడా ఆయనే చూపిచ్చిండు. బస్టాండుల రోజుకూలీ ఇస్తమన్నరు. మొదటి దినాన ఇచ్చిన ఆ పైసలు బెట్టి బియ్యం, సరుకులు కొనుక్కొచ్చింది. ఇంటికి రాంగానే వంటికంటిన ఆసనకు పిల్లలు దూరంగా జరిగిండ్రు. తానం జేసింది. బువ్వొండి అందరికీ బెట్టింది. కడుపు నిండినట్టైంది తల్లి మనసుకు. నాల్రోజులు పని జేసినాక గానీ మదారికి అర్ధమయింది. ఎంకటమ్మ పెద్దమ్మ ఎంత బాధ నోర్సుకుందో.
''ఛీ పాడు గాను. గబ్బు.. ఆసన. ఉచ్చగచ్చు వాసన. ఆ అసనకు బిడ్డతో పాటు కడుపుల పేగులు బయట పడతాయేమో అన్నంత దుర్వాసన వస్తుంది. అల్లా..! ఏందీ నాకీ శర. ఒకడు తాగి కాండ్రించి ఊస్తడు. దవడకు తంబాకుతో ఒకడు. కిల్లితో ఒకడు. నానాచండాలం జేస్తుండ్రు.'' అనుకునేది. మొదట నాల్రోజుల దాకా కడుపుల గంటెసి దేవినట్టు బాధ పడ్డది. ఆసనకు ఊపిరాపుకొని ఆడ్నించి బయటపడేది. బువ్వ తినేటపుడు కూడా ఆ ఆసనే గుర్తొచ్చేది. తినబుద్ది కాకపోయేది. ప్రతి గంటకోసారి కడిగినా ఇంకోగంట సేపటికి అదేకత. బస్టాండుల పనికష్టంగా ఉంది. కానీ తప్పక ఆ పని చేస్తుంది మదారి. మందులాడడంతో పెద్దమ్మ తేరుకుంది. ఇంటికాడ బువ్వ వండి పిల్లలను, చాన్పాషాను జూసుకుంటుంది. రోజులు గడుస్తున్నై. మదారికిప్పుడు నెలలు. ''నేను పనికి బోతా మదారి'' అని పెద్దమ్మ అంటే, ''పురాగ కోలుకో పెద్దమ్మా''ని చెప్పి పనికి బోతుంది.
ఏగిలిబారంగ బస్టాండుకు పోయింది. దొడ్లను కడిగే పనిలో ఉండగా పైసలు వసూలు జేసుకునే తమ్ముడు శీనుగాడు వచ్చిండు. ''అక్కా అవ్వకు బాలేదు. ఇంటికి పోతున్న. తొమ్మిదికి వస్తా. గల్లా జూసుకో'' అని చెప్పిపోయిండు. బస్టాండు కాడున్న మసీదులోంచి మైకుల నమాజు చదువుతుండ్రు. గొడ్డు మాదిరున్న నడీడు మనిషి ఒకడొచ్చిండు. లోపలికి పోవడానికి రూపాయిచ్చిండు. బాగా తాగినట్టుండు. రాత్రి తాగిన తాగుడుకు కడుపుల పులిసిన ఆసన అంతదూరం నుండి గుప్పున ఆసనోస్తుంది. దాన్ని సొరుగులేసింది. దొడ్లకు బోయిండు. ఇది కడగలేదు. వచ్చి కడగమని కరుకుగా చెప్పిండు. నీళ్ళు బోసి కడుగుతుంటే ఎనుక నుండి వచ్చి, ఎలుగు బట్టినట్టు బట్టిండు. ''కామానికి కన్ను లేదు''. అరవబోయిన నోటిని అరజేత నొక్కి పట్టిండు. వాని ఆరాటం ముందు మదారి యాతన పెద్దది. ఒక్కసారిగా చేతులతో వాన్ని తన్ని అక్కడి నుండి పారిపోవాలని ప్రయత్నం జేసింది. వాడు మదారి తలను ఒక్కసారి గోడకు బాదడంతో కండ్లు మస్కలు బారినై. తెలివి తప్పింది. మదారి కడుపుల బిడ్డ కళ్ళు తెరవక ముందే కండ్లు మూసుకుపోయిన కామానికి, సచ్చిన బిడ్డ కడుపులోంచి జారి పాకీ కాలువల బడ్డడు. ఈసారి సచ్చిపుట్టిన బిడ్డ మగబిడ్డ.
నెత్తుటి మడుగునున్న మదారిని పుణ్యాత్ముడేవరో గవర్నమెంటు ఆసుపత్రిల షెరీక జేసిండ్రు. గా ముచ్చటంతా చెప్పి పెద్దమ్మతో కండ్లనీళ్ళు బెట్టుకుంటుంది మదారి. డాక్సారు రాకతో ఆలోచనల్లోంచి బయటపడ్డది ఎంకటమ్మ.
***
నాల్రోజులైనంక ఎంకటమ్మ బిడ్డ మదారిని బాగైనంక ఇంటికి తీసుకొచ్చింది. ''పేదవాని ఆకలి ఆకాశమంత, గొంతు సూది బెజ్జమంత''. ఆ అన్నేలాన్ని అడిగినవారే లేరు. మదారి పెద్దబిడ్డ సల్మా. పన్నెండేల్లకొచ్చింది. ఇంటి పరిస్థితులు అర్ధం జేసుకుంటుంది. మదారి మనసుపై పడ్డ గాయం మానలేదు. అయినా సంసారం కోసం పాయఖానాలున్న ఏర్గును తలమీద నెత్తుకొని ఎత్తిబోస్తునే ఉంది. మదారి జీవితంలో మార్పు లేదు. మొగడు, సంసారం తిరిగి బాగైతయని ఆశతోని కాలాన్ని కష్టంగా ఎల్లదీస్తుంది. ''అదష్టం చెప్పి రాదు, దురదష్టం చెప్పి పోదు''. అయ్యాల బుధారం. మదారి అంగడికి పోయింది. అమ్మీ జిలేబీలు కొనుక్కొస్తదని పిల్లలు, మందుల కోసం చాన్పాషలెదురు జూస్తుండ్రు.
మదారి వయసు ముప్పై రాకముందే ముసలిదానిలా అయిపొయింది. రెండుసంచులు చేతుల బట్టుకొని ఈడ్సుకుంట వచ్చింది. ''అమ్మీ..ఇటియ్యి సంచులు'' అనుకుంట ఎదురొచ్చింది సల్మా. అమ్మీతో ''బస్టాండు ఎదురుగా సులభ్ కాంప్లెక్స్ బడ్డది. పాయఖాన కడగడానికి మనుషులు కావాలని శీనుమామ చెప్పిండనన్నది సల్మా''. మదారికి సల్మా మనసు అర్ధమయ్యింది. కష్టే ఫలి. సల్మా పాకీపనిలో పుట్టిన పాకీజలా కాకుండా బురదలో పుట్టిన తామరలా కన్పించింది. సల్మా చేతులున్న సంచులనందుకున్నాక మాదారి బరువు దిగింది.
- శీలం భద్రయ్య, 9885838288
******