Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఏ ఇంటికి వెళ్లాలి?'' అడిగాడు వాచ్‌మేన్.
''మీరు కొత్తా?''
''మీరూ కొత్తగా ఉన్నారే!''
మోహన్ తన్నుకొచ్చిన కోపాన్ని అణచుకున్నాడు. ఊళ్లో చాలా రకాల దొంగతనాలు జరుగుతున్నాయి. కొత్తగా వచ్చిన వాచ్‌మేన్ వారం పదిరోజులైనా పద్దెనిమిది కుటుంబాలు నివసించే ఆ అపార్టుమెంటులోకి వచ్చేవాళ్లు, వెళ్లేవాళ్లు ఎవరెవరని తెలుసుకోవద్దా?
''నేను బి-3 కి వెళుతున్నాను.''
''కుక్క ఇంటికా?''
''ఔను. నేను డాగ్ ట్రెయినర్‌ను.''
''మీరు రోజూ వస్తున్నారా?''
''రోజూ రెండు పూటలా వస్తున్నాను.''
''అలాగా, నేను చూడలేదే!''
''ఈ విషయాన్ని నలుగురూ వినేటట్టు అనకండి.''
వాచ్‌మేన్ ఇబ్బందిపడ్డాడు. ''పర్వాలేదు. నిన్నకూడా మిమ్మల్ని దాటుకునే వెళ్లాను.'' అలా అనేసి మోహన్ లోపలికెళ్లాడు. పద్దెనిమిది ఇండ్లకూ కార్లు ఉన్నట్టున్నాయి. కానీ, వాటిని లోపల పార్కింగ్ చెయ్యటానికి సరైన చోటులేదు. కార్ల మధ్య నుండి నడుచుకుంటూ మోహన్ లిఫ్ట్ ఎక్కి పైకి చేరుకున్నాడు. వరండాలోని బల్బు గుడ్డిగా వెలుగుతోంది
మోహన్ మొదటి అంతస్తులోని బి-3 అపార్ట్మెంట్ కాలింగ్ బెల్ నొక్కాడు. అదే సమయంలో లోపలనుండి కుక్క మొరిగే శబ్దం వినిపించింది.
ఒక మహిళ వచ్చి తలుపు తీసింది. కుక్క పరుగెత్తుకొచ్చి మోహన్మీద ముందరి కాళ్లు వేసి అతనిమీద వాలిపోయి తన ప్రేమను ప్రదర్శించింది. మోహన్ తలుపుకు పక్కనే ఉన్న చిన్న అల్మైరా నుండి కుక్కకు వేసే సంకెళ్లను, ఒక పలుచని చేతిరుమాలును తీసుకున్నాడు. కుక్క ఆ గదిలోనే కొంతసేపు అటుఇటు పరుగెత్తి మోహన్‌కు వేడుకను చూపించింది. తర్వాత అతని దగ్గరికొచ్చి నిలబడి నాలుకను వ్రేలాడదీసింది.
మోహన్ తన దగ్గరున్న ఇనుప సంకెళ్లను కుక్క మెడకున్న పట్టీకి తగిలించాడు. అతను మెట్లు దిగుతుంటే కుక్క ఉత్సాహంతో అతణ్ణి ముందుకు లాగసాగింది.
''సీజర్!'' అని మోహన్ మెల్లగా అరిచాడు. కుక్క అతని కాళ్లకు తన ఒంటిని రాసింది.
''కమాన్, కమాన్...'' అని మోహన్ మామూలుగా తిరిగే మొదట వీధిలోకే తిరిగాడు. అక్కడ రెండు వరుసల్లోనూ మొత్తం ఐదు ఇండ్లున్నాయి. ఇంటి బయటి కాంపౌండు గోడలకు పక్కగా చిక్కగా గడ్డి మొలిచి ఉంది. కుక్క ఆ గడ్డిని వాసన చూస్తూ ముందుకు నడిచింది. ఉన్నట్టుండి ఒకచోట ఆగిపోయి తన వెనక కాళ్లను వంచింది. మోహన్ ఆగాడు. కుక్క దాని అవసరాన్ని ముగించుకొని మోహన్ దగ్గరికొచ్చింది.
ఈ సీజర్కు రోజూ ఈ ఇంటి దగ్గరకు రాగానే లఘుశంక తీర్చుకోవాలనిపిస్తుంది. అదృష్టం! ఆ ఇంట్లో ఇంకా ఎవరూ నిద్ర లేవలేదు. వాళ్లు చూశారంటే గొడవ అవుతుంది. రోజూ ఉదయాన్నే ఎవరైనా ఇంటిముందు లఘుశంక తీర్చుకుంటే ఏ ఇంటివాడు ఊరుకుంటాడు?
మోహన్ తర్ఫీదునిచ్చే ఇంకే కుక్కనైనా మైదానంలో విడిచిపెట్టగలడు. అది స్వేచ్ఛగా అక్కడికీ ఇక్కడికీ పరుగెత్తి ఆడుకున్నాక అతని దగ్గరికే వచ్చేసేది. రాకపోయినా గొంతిస్తే వెంటనే పరుగెత్తుకొచ్చేసేది. జాతి కుక్కలు, పద్ధతిగా పెంచే కుక్కలు ఎప్పుడూ ఇబ్బంది పెట్టవు. ఒక కుక్క ఇంట్లో ఉండటమంటే నలుగురు కాపలాదారులకు సమానం. అరుస్తూనే దొంగను తరిమెయ్యగలదు.
కానీ, సీజర్‌ను అలా విడిచిపెట్టటానికి వీల్లేదు. ఇక్కడ వీధికి రెండు అనాథ కుక్కలున్నాయి. గజ్జి పట్టి, వెంట్రుకలు రాలిపోయి, కాలు కుంటుకుంటూ... ఇలాగంతా ఉంటూ ఆడకుక్క అయితే ఏడాదికి రెండుసార్లు పిల్లల్ని కనేసేది.
మోహన్ సీజర్‌ను వెంటబెట్టుకొని పక్క వీధిలోకి నడిచాడు. అక్కడ ఒక పొదలాగా ఉన్న చోటుకు కుక్క అతణ్ణి లాక్కెళ్లింది. అక్కడ గడ్డిని వాసన చూసి ఒకచోట ముక్కును ఇంకా లోపలికి దోపింది. కచ్చితంగా అక్కడ ఏదైనా ఎముకలుండొచ్చు.
మనసుకు నచ్చక మోహన్ కుక్కను లాక్కుంటూ వెనక్కు వెళ్లాడు. సీజర్ కూడా మరుక్షణం తన మనసులో నుండి ఎముక ఆలోచనను పక్కనపెట్టి అతనితో పాటు ఉత్సాహంగా ముందుకు నడిచింది. ఒక వీధి కుక్క సీజర్‌ను చూసి బలహీనంగా మొరుగుతూ తోకను ముడుచుకొని ఉన్నచోటనే నక్కింది. సీజర్ దాన్ని పట్టించుకోకుండా ముందుకు నడిచింది.
క్రమంగా పొద్దు పొడవసాగింది. ఉదయపు వ్యాహ్యాళి కోసం మధ్య వయస్కులు ప్రత్యేక జోళ్లు తొడుక్కొని అక్కడొకరూ ఇక్కడొకరూ కనిపించారు. ఆడవాళ్లు వస్తూ వస్తూ తోడును కూడా తెచ్చుకున్నారు. మోహన్ సీజర్ సంకెళ్లను గట్టిగా పట్టుకొని నడిచాడు. నడుస్తున్న వాళ్లల్లో ఒకళ్లిద్దరు తమ భయాన్ని ముఖంలో కనిపించేటట్టుగా ప్రదర్శిస్తూ పక్కకు తప్పుకున్నారు. సీజరూ వాళ్లను ఒకసారి గుర్రుగా చూసింది. వీధి కుక్కల్ని ఎవరు తరిమినా అవి పరుగెత్తుకొని వెళ్లిపోతాయి. సీజర్ అలా చెయ్యదు.
సీజర్కు చెమట పట్టటం మొదలైంది. మోహన్‌కు కూడా ఇక వీధులు తిరగటం చాలనిపించింది. కుక్క రాత్రి సరిగ్గా నిద్రపోయినట్టు లేదు. కుక్కకు ఎక్కువ నిద్ర అవసరం లేకపోయినప్పటికీ కనీసపు నిద్ర అవసరం. అది లభించక పోవటంతో తొందరగా నీరసించిపోతుంది.
ఇంటికి వెళ్లబోతున్నామని తెలియగానే సీజర్ మోహన్‌తో ఆడుకోవటం మొదలుపెట్టింది. మోహన్ సీజర్‌ను వదిలేశాడు. అది వేగంగా వంద అడుగుల దూరం పరుగెత్తగలదు. తర్వాత అంతే వేగంగా వచ్చి మోహన్‌ను గుద్దుకునేలా అతని మీదికి దూకేది. మళ్లీ పరుగెత్తేది. మళ్లీ తిరిగొచ్చి దూకేది. ఈలోపు బాగా తెల్లవారిపోయేది. పాల ప్యాకెట్లు వేసేవాళ్లూ, పేపర్ బార్సు కనిపించటం మొదలుపెట్టారు. ఒక పిల్లవాడు సీజర్‌ను పిలుస్తున్నట్టుగా శబ్దం చేశాడు. సీజర్ వాడి వైపుకు తిరిగి గుర్రుగా చూసింది. అంతే, వాడు పరుగెత్తుకొని పారిపోయాడు.
సీజర్ మోహన్‌ను ఇంకో పక్కకు లాగింది. ఇంటికి వెళుతున్నామన్న ఉత్సాహం. కానీ, ఇంటి సమీపానికి చేరుకోగానే ఇంకో రౌండు వేసొద్దాం అన్నట్టుగా పట్టుబట్టేది.
కుక్కలకూ మలబద్దకం ఏర్పడుతుంది. ఇంట్లో పెరిగే కుక్కలకు అప్పుడప్పుడూ అలా జరుగుతుంది. అప్పుడు వాటికి ఇంకా కొంతసేపు నడుద్దామనిపిస్తుంది. ఆలస్యమైనా అది మలబద్దకాన్ని తీర్చుకునే విధంగానే దాన్ని చూసుకోవలసి ఉంది.
మోహన్ సంకట పరిస్థితిలో పడ్డాడు! ఇప్పుడు బాగా తెల్లవారింది. కుక్కకు బాగా అలవాటైన చోట్లో ఇప్పుడు ఇంటి తలుపులు తెరుచుకుని ఎవరైనా ఆ ఇంటివాళ్లు బయట ఉండొచ్చు. కుక్కను ఇంకో వీధిలోకే తీసుకొని వెళ్లాలి.
మోహన్‌కు తన కొడుకు గుర్తుకొచ్చాడు. ఇవ్వాళ కొడుకును డాక్టర్ దగ్గరికి తప్పకుండా తీసుకెళ్లాలి. డాక్టర్‌కు డాగ్ ట్రెయినర్ అంటే అర్థం కాలేదు. ''అదేం, సర్కస్ కుక్కా?'' అన్నాడు.
''మనం పెంచే కుక్క ఏదైనప్పటికీ దాన్ని ట్రెయిన్ చెయ్యాలి.''
డాక్టర్‌కు అదేమీ పెద్ద విషయంగా అనిపించలేదు. ఆయన కప్పను కోసి చూసుండొచ్చు. పై తరగతుల్లో ఒక అనాథ శవాన్ని మరో నలుగురైదుగురు విద్యార్థులతో కలిసి కోసి పరిశీలించి ఉండొచ్చు. కానీ, కుక్క మనసు మనిషి మనసుకన్నా సున్నితమైనది; అది దానికి సంబంధించిన స్పందనలతో యజమాని భావాలనూ గ్రహిస్తుంది; ఒక మనిషి కుక్కను ఎంతైనా నమ్మొచ్చు. అది మోసం చెయ్యదు; ఇవన్నీ ఆయన తెలుసుకొని ఉండరు.
భార్య మరిచిపోతుంది. స్నేహితులు మరిచిపోతారు. బంధువులూ మరిచిపోతారు. అతను మంచి బట్టలు తొడుక్కున్నప్పటికీ, లేకపోయినప్పటికీ అతను పెంచే కుక్కలు అతని ప్రతి ఆజ్ఞనూ తప్పకుండా పాటిస్తుంది. అతని మానసికస్థితిని బట్టి అతనితో మురిపెంగా ఉండగలదు, ఆడగలదు, దాక్కొని ఉండగలదు. అతనూ కుక్క ముక్కును బట్టే దాని అవ్వాల్టి శారీరక స్థితిని గ్రహించగలడు.
అతని భార్యకూ, అత్తకూ అతని ఉద్యోగం గురించి ఆలోచించినప్పుడల్లా అతనికి ఆదాయం అధికంగా లభించదని తెలియదు. రక్షణ శాఖలో బాగా సంపాదించవచ్చు. కానీ వాటి కోసం ఓపిక వహించాలి. కానీ, అతనికి అలాంటి పనులు నచ్చవు. పెంపుడు జంతువుల అంగడి లాంటిదాన్ని ఒకటి ప్రారంభించాలి. జంతువులకు వైద్యులున్నారు. కానీ, మరెవరో కుక్క నోటిని కట్టేసి మేజామీద పడుకోబెడితే ఆ తర్వాత వాళ్లు వైద్యం చేస్తారు.
సీజర్ ఇప్పుడు ఇంటికి వెళ్లటానికి తయారైంది. మోహన్‌కు కాఫీ తాగాలని ఉంది. సీజర్‌ను దాని ఇంటికి చేర్చి బయటికొచ్చి అతను మోటార్‌సైకిల్‌ను స్టార్ట్ చేశాడు. ఇంట్లో నుండి సీజర్ మొరిగే శబ్దం వినిపించింది.
కుక్కలు మనుషుల్ని మరిచిపోవని మోహన్ అనుకున్నాడు.
లిలిలి
ఉదయం అల్పాహారం తిన్నాక మోహన్ మళ్లీ మోటార్‌సైకిల్‌ను స్టార్ట్ చేశాడు.
ఆ ఇల్లు నగర పరిధిలోనే ఉన్నప్పటికీ అది ఫామ్‌హౌస్‌గా మార్చబడింది. ఆ ఇంటిని ఒకడు ఎప్పుడో చాలా చౌకగా కొన్నాడు. అతనే కట్టుకున్న ఇల్లు. వెలుతురు కోసం ఇంటి పైకప్పుకు మూడు చోట్ల వెంటిలేషన్ రంధ్రాలు చెయ్యబడ్డాయి. అతని కుటుంబ సభ్యులు ఎంతో బలవంతం చేసి ఆ మూడు రంధ్రాలకూ ఇనుప చువ్వల్ని ఏర్పాటు చెయ్యించారు. ఆయన ఒక కుక్క ఉంటే చాలనుకున్నాడు. ఆ కుక్కకూ ఇప్పుడు వయసైపోయింది. మొరుగుతుంది, కానీ మునుపటి వేగం లేదు. తన యజమానిని కాక మోహన్ ఒక్కడినే తన తోకలో ఉన్న కీటకాలను వదిలించటానికి అది అనుమతిస్తుంది.
అది చిన్నపిల్లగా ఉన్నప్పుడు మోహన్‌ను కరిచింది. వెంటనే తాను పెద్ద తప్పు చేశానని కళ్లతోటే క్షమించమన్నట్టుగా అతడికేసి చూసింది. ఆ ఇంటి యజమాని మోహన్‌ను, కుక్కను తన కారులోనే జంతువుల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు.
మోహన్కూ, కుక్కకూ ఇద్దరికీ ఇంజెక్షన్స్ వేశారు. ఇబ్బందులేవీ కలగలేదు. కానీ కుక్కే నేర భావనతో మోహన్‌ను చూడగానే తన తోకను కాళ్ల మధ్య దాచుకునేది. దాన్ని ఎంతగా బుజ్జగించినప్పటికీ అది కాస్త దూరం దూరంగానే ఉండేది. ఎవరైనా గోడెక్కి దూకారంటే మొరుగుతూ అతని కాలిని మాత్రమే పట్టుకోవాలి, కరవకూడదని మోహన్ అలవాటు చెయ్యించాడు. ఆ ఇల్లున్న చోటూ రద్దీగా మారటంతో ఇంటి ముందు చాలా మంది అటు ఇటు నడుస్తుంటారు. దాంతో కుక్కను కట్టేయాల్సి వస్తోంది.
మోహన్ మోటార్ సైకిల్ శబ్దం వినగానే కుక్క లేచి నిలబడి ఒంటిని విదుల్చుకునేది. బయటి గేటుకు తాళం వెయ్యబడి ఉంది. మోహన్ గేటు పక్కనే ఉన్న కాలింగ్‌బెల్‌ను నొక్కాడు. ఐదు నిమిషాలైనప్పటికీ ఎవరూ రాలేదు. మోహన్ 'టైగర్' అని రెండుసార్లు పిలిచాడు. ఒక పనివాడు తాళం చెవి తీసుకొచ్చి గేటు తాళాన్ని తీశాడు. మోహన్ మోటార్‌సైకిల్‌తో సహా లోపలికి రాగానే పనివాడు మళ్లీ గేటుకు తాళం పెట్టాడు.
ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అందరూ ఉన్నారు. యజమానురాలికి ఆరోగ్యం బాగాలేదు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లటానికి ఇంట్లోవాళ్లు తయారుగా ఉన్నప్పటికీ, ఆమె మాత్రం తన ప్రాణం ఇంట్లోనే పోవాలన్న దృఢ నిశ్చయంతో ఉంది.
మోహన్ కుక్క దగ్గరికి వెళ్లాడు. కుక్క లేచి నిలబడి తోకను ఊపింది. కానీ వెంటనే పడుకుంది. కుక్కకు లైట్‌గా జ్వరం కాస్తున్నట్టుంది. ముక్కు ఎండిపోయి కనిపించింది.
మోహన్ కుక్కను మృదువుగా తడిమి యజమానురాలు ఉన్న గదిలోకి వెళ్లాడు. ''షూస్‌ను తీసేసి లోపలికి రండి.'' అంది నర్సు. అతను తెల్ల జోళ్లను ధరించి ఉన్నాడు.
''ఏంటి మోహన్?'' అని యజమానురాలు మెల్లగా అడిగింది. దగ్గరకు రమ్మన్నట్టుగా చేతిని కదిలించింది. ''నన్ను ఎక్కడికీ తీసుకెళ్లొద్దని చెప్పు.'' అని చెప్పింది. ఆమె ముఖం తేటగా కనిపించింది. కళ్లు మాత్రం నీటితో నిండి ఉన్నాయి.
మోహన్ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని మృదువుగా తట్టాడు. ఆమెకు కుక్కమీద ప్రత్యేకమైన ప్రేమ లేకపోయినప్పటికీ మోహన్ వచ్చాడంటే అతణ్ణి ఆహ్వానించి ఏదో ఒకటి తినమని చెప్పేది. ఒకసారి అతని ఇంటికి వెళ్లి అతని భార్యాబిడ్డలకు బట్టలు, పండ్లు ఇచ్చి అర్థగంట వరకూ అక్కడే మాట్లాడుతూ ఉండిపోయింది. ఇప్పుడు కాస్త దిగులుగానే ఉంది.
''కుక్కను చూశావా?'' అని అడిగింది.
''అది కూడా పడుకుందమ్మా. దాని రక్త ప్రసరణ సరిగాలేదు.''
ఆమె మౌనం వహించింది.
''అంతా మనుషుల్లాగానే కదా?''
''ఉంటుందంటారు. నేను దాన్ని ప్రేమగా చూసుకున్నదే లేదు. ఇక్కడికి తీసుకు రాగలవా?''
మోహన్ నర్సు దగ్గరికి వెళ్లి అడిగాడు.
''రెండే సెకన్లు. కానీ అమ్మను నాకటానికి అనుమతించకండి.'' అని వెంటనే ''కుక్కను తలుపు దగ్గరే ఉంచండి.'' అంది.
మోహన్ కుక్క మెడ పట్టీని పట్టుకొని లేపాడు. కుక్క నిలబడింది. ''రా, అమ్మను చూద్దాం.'' అని చెప్పి తీసుకెళ్లాడు.
యజమానురాలు కళ్లు మూసుకొని పడుకొని ఉంది. ''అమ్మా...'' అని మోహన్ గొంతిచ్చాడు. మళ్లీ కాస్త గట్టిగా ''అమ్మా'' అన్నాడు.
నర్సు యజమానురాలి తలను తలగడతో సహా కొద్దిగా పైకెత్తింది. యజమానురాలు కుక్కను చూసింది. కుక్క తోకను ఊపింది.
యజమానురాలు మళ్లీ కళ్లు మూసుకుంది. కుక్క మెల్లగా దాని చోటులోకి వెళ్లింది. వెళ్లి వెంటనే పడుకుంది.
ఆమె పెద్దకొడుకు మోహన్ కోసం ఎదురుచూస్తున్నాడు. ''మీరు చెప్పండి. అమ్మ వింటుంది.'' అన్నాడు.
''ఏం చెప్పాలి?''
''నర్సింగ్ హోమ్‌కు వెళదామని. ఇక్కడ రోజంతా ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ నర్సుకు ఏమీ తెలియనట్టుంది.''
''గదిని శుభ్రంగా ఉంచాలం టోంది. అమ్మకు ట్యూబులు ఏమైనా పెట్టిందా?''
''ఔను. పడకలో సెప్టిక్ సంచీ ఉందే.''
''ఇలాంటి విషయాల్లో మనుషుల మనసుల్ని అర్థం చేసుకోవటం కష్టం. ఉన్నట్టుండి ఈ రోజు కుక్కను చూపమంది.''
''నాకు సెలవు లేదు. నర్సింగ్ హోమ్‌లో చేర్పిస్తే నేను ఆఫీసులో తల చూపించొచ్చు.''
మోహన్ బదులివ్వకుండా ఉండిపోయాడు. ''నేను బయలుదేరుతాను. ఏమైనా ఎవరితోనైనా చెప్పాలంటే చెప్పేసి వెళతాను.''
''లేదు, ఏమీ వద్దు. కుక్క నిన్నటి నుండి ఎందుకు తినట్లేదు.''
''దానికీ జ్వరం. మధ్యాహ్నం ఉన్నచోటే చుట్టూ తిరిగింది. దాన్ని విడిచి పెట్టొచ్చు. కానీ దానికి నిలబడ్డానికే శక్తిలేదు.''
లిలిలి
ఇంట్లో అత్తయ్య ఒక్కతే ఉంది.
''అముదా ఎక్కడీ'' అని మోహన్ అడిగాడు.
''డాక్టర్ దగ్గరికెళ్లింది.''
''వెళ్లాక ఫోన్ చేసిందా?''
''డాక్టర్‌ను కలిసిందిట. గుండెల్లో నెమ్ము. ఇరవై నాలుగ్గంటలూ బిడ్డను ఇంట్లోనే ఉండనివ్వద్దన్నార్ట.''
దీన్నే మోహన్ చెప్పాడంటే వినే వాళ్లు లేరు. ఇప్పుడు గుండెల్లో నెమ్ము చేరింది.
''మీరు వెళ్లే ఒకింట్లో ఆ పెద్దమ్మకు ఒంట్లో బాగా లేదన్నారుగా. ఇప్పుడు ఎలా ఉంది, పర్వాలేదా?''
''ఆ ఇంటి చుట్టూ ఏవేవో మొక్కలూ తీగలూ పెరిగాయి. పెద్దాయన ఏదో ఆలోచనతో పెంచాడు. మొక్కలు పెంచవలసిందే. కానీ ఇంటి గోడమీదికి వాటిని ప్రాకనిస్తే ఏవేవో పురుగూపుట్రా వచ్చేస్తాయి. అక్కడ కుక్కకూ ఒంట్లో బాగాలేదు.''
మోహన్ భార్య మందులు కొనుక్కుని ఇంటికొచ్చి నేలమీద గుడ్డను పరిచి దానిమీద బిడ్డను పడుకోబెట్టింది. అంత నెమ్ములోనూ బిడ్డ హాయిగా నిద్రపోతోంది.
''విక్స్ పూసి గొంతువరకూ ఒఠి తువ్వాలును కప్పి పెట్టు. కంబళ్లు ఏమీ వద్దు.''
అముదా మోహన్‌ను చూసింది. ''మీరూ వచ్చుండొచ్చు కదా?''
''వచ్చుండొచ్చు. కానీ నువ్వొక్కతే వెళ్లటం మంచిదేగా. నేను వెళితే రెండే రెండు మాటలు చెప్పి వెళ్లమని చెప్పి ఉండే వాడు.''
అముదా మొదట బదులేమీ ఇవ్వలేదు. తర్వాత చటుక్కున, ''ఇక మీదట మీరు బిడ్డకు టీషర్ట్ వెయ్యకండి.'' అంది.
బిడ్డకు అతను ఎప్పుడూ బట్టలు తొడిగింది లేదు. బాగున్నాయని పదిరోజుల క్రితం రెండు టీ షర్టులు కొన్నాడు. అముదానే బిడ్డకు టీ షర్ట్‌ను మార్చి మార్చి వేసింది.
''సరే, నేను బిడ్డ దగ్గర ఉంటాను. నీకు పనేమైనా ఉంటే వెళ్లి చూడు.''
అముదా లేచి లోపలికి వెళ్లింది. మోహన్ మొబైల్ రింగైంది. మోహన్ దాన్ని చెవికి ఆనించుకున్నాడు. టైగర్ చచ్చిపోయింది.
తమిళ మూలం: అశోకమిత్రన్
అనువాదం : జిల్లేళ్ళ బాలాజీ,
73820 08979 .