Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సరిగా అప్పుడే ఎనుక నుంచి ఎవరో పిలుస్తున్నట్టు అనిపించి వెనక్కి మళ్ళి చూసిండు ఓబయ్యా పర్లాంగు దూరం నుంచి చేతితో సైగ చేస్తూ మస్కూరు మైవెల్లి కూతేయ సాగిండు. విని వినపడని సప్పుడికి చెవులు రిక్కించి దూరంగా ఉన్న అతని పిలుపును గ్రహించి ముందుకు కదలబోయి ఆగిండు. అతను ఒగిరిస్తు ఆయాస పడుతూ దగ్గరికి పరుగు పరుగున సమిపించిండు.
''ఏందే మైవెల్లి ఏంది సంగతి ఇట్టా ఉరుము మెరుపు లేని పిడుగులా ఊడిపడినy'' అంటూ తడుముకోకుండా ఆత్రంగా అతనివైపు చూస్తూ పలకరించిండు ఓబయ్యా.
''నీతానికే నోయి'' అంటూ ఆయాస పడుకుంటా ఓగిరిస్తూనే అతని వైపు గుడ్లు మిటకరించి పైకి కిందికి ఎగాదిగా చూస్తూ పలికిండు. ''ఎందుకో నాతోని బలే పని పడింది. జర్రాగితే నేనే ఇంటికి వొద్దును కదా'' అని తీర్వాటుగా పలికిండు ఓబయ్యా.
''ఓషి రోషినోడా అంత తీర్వాటు నాకెక్కడిది జప్పున నడువు'' అని అతని వైపు చూస్తూ రుసరుస పలికిండు.
''నాతోని ఏంపని పడ్డది మైవెల్లి'' అని అతని వైపు మళ్లీ చూస్తూ అనగానే ''ఇగో రచ్చ కచ్చిరు తాన దొర, మనూరి పట్వారి. సర్పంచి ఊల్వ జనం సగ పోగయిండ్రు నడువష జప్పున వాళ్లు పిల్సుక రమ్మన్నరు. నేను మీ ఇంటికి పోతే మీ భార్య నాంచారమ్మ పొలం పోయిండు అన్నది. నేను మీ జాడల వచ్చిన ఏదో చిన్న పంచాయితీ ముచ్చట నువ్వు గాలయ్యతో గోడవ పెట్టుకున్నావట కదా దాని ముచ్చట'' అని చేతుల వున్న కర్రతో గద్దిస్తూనే పలికిండు.
''దెశి వానితోని నాకెం పంచాతి కాలే'' అని ఓబయ్య అనగానే ''అదేందో కచ్చిరుకొచ్చి చెప్పుకో నాదేముంది నన్ను పిల్సుక రమ్మన్నరు. వచ్చిన గంతేనోయి'' అంటూ నింపాదిగా పలికిండు. ఓబయ్యా అతనితో కూడి సరసర నడుస్తూ రచ్చ కచ్చిరు వైపు కదిలిండ్రు. ఇద్దర బంధంధాటి డొంకెంట ఊరి వైపు బాట సాగిండ్రు. రచ్చ కచ్చీరు చింతకింద ఊరిదొర, కరణం పట్వారీ, సర్పంచి ఊరి పెద్దలు అందరూ అరుగు మీద కూలవడ్డరు. మస్కురు మైవల్లి వచ్చి అక్కడ నిలబడ్డడు. అతని ఎనకాల వచ్చిన ఓబయ్య వారికి చేతులు జోడించి ''దండాలు దొరవారూ'' అంటూ వినయంతో నమస్కరిస్తూ పలికిండు.
''నక్క వినయాలకు తక్కువలేదు కానీ అట్టా నిలవడు'' అంటూ కారాలు మీరాలు నూరుతూ పలికిండు. పక్కెంట కూర్చున్న పెద్దలు ఎగాదిగా చూడసాగారు. అందోళన పడుతూ వారిముందు గజం దూరంలో చేతులు కట్టుకొని ఓబయ్య నిలవడ్డడు
''ఆరీ ఓబిగా గాలిగాని తోని లడాయికి పోయిన వంట ఏంద్రా'' అని కండ్లేర్ర జేస్తు దొర అడిగిండు.
''నేనా దొర నేనా'' అని కంగారు పడుతూ అన గానే ''నువ్వేరా దొంగ లంజా
కొడకా చిన్నంత్రం పెద్దంత్రం తెల్వదురా, ఈ మజ్జే ఎవనితోని పడితే వానితొని కయ్యానికి కాలు దువ్వుతున్నవట'' అని కటువుగా గుడ్లురిమి చూస్తూ పలికిండు.
''కొడుకుని నాలుగు జాడిస్తే సరి, ఈనికి కిలేరిగి వాత పెట్టాలి దేష్ట ముండా కొడుకు ఎట్టా బలిశిండో చూడు'' అంటూ కటువుగా పలికిండు దొర. ఆతని మాటలకు నిర్ఘాంతపోయిన ఓబయ్య తేరుకొని ''దొరా మాటలు మంచిగ మాట్లాడు నేనేం నీ జీతగాన్ని కాదు. నేను నా రెక్కల కష్టం మీద బతుకుతున్న ఎనకటి కాలంగాదు అంటే పడనికే.'' అంటూ గుడ్లురిమి చూస్తూ పలికిండు ఓబయ్య
''అందుకేరా గోర్జం బాగా పెరిగింది. బలుపు చూడరాదు మనముందే ఎదురు మాట్లాడుతుండు. తిండికి గతిలేక గడ్డి కర్సుకుంట కల్లాలెంట తిరిగిన కాలం మారింది గాని మా పెత్తనం మారలే. కాల్లిరుగగొట్టి మూలకు పండవెట్టాలే అప్పుడు గాని చిన్నా పెద్దా ఇలువ తెలువదు'' అంటూ పండ్లు పటపట కొరుకుతూ కాలు కాలిన పిల్లిలా చిందులు తొక్కుతూ పలికిండు దొర.
''నకురాలు పడుతుండు దొర వారు వీని సూపే తేడాగుంది సూడండి.'' అని కరణం అనేలోపే ''అవునవును వీడు శానా తెడాగున్నాడు'' అని పలికే దొర
''అయ్యా మీరు ఊరి పెద్దలు, ఇగ గా గాలయ్య ఏందో అతను ఎలాంటి వాడో ఊరందరికీ ఎరుకే. నేను నా పమానంగా చెబుతున్నా అతని జోలికి పోలే, ఆతని సుద్దికి నేను ఎన్నడూ పోలే నా పెండ్లాం పిల్లల తోడు'' అంటూ దీనంగా పలికిండు ఓబయ్య.
''చూసిర్రా దొర మీముందలనే ఎట్లా మాట్లాడుతుండో మొత్తం అబద్ధాలే నోరు అదుపులో పెట్టుకో, పొట్ట గోస్తే అచ్చరం ముక్కరాదు. మాటిమాటికి అబద్దాలతో మాటేస్తడు. దొంగ పమానాలు సుడుర్రి సంసారి లెక్క సగ పలుకుతడు రండకెక్కువ ముండకు తక్కువ శిడం బత్కనియ్యడు మీ ముందలనే ఎట్ట బోంకుతుండో ఊ అంటే లంజపుట్నాలు తింటడు ఊకే సతాయించుతడు. మామూలు పుల్ల కాదు బంగారు పుల్ల కల్తీ మందుతాపీ పండపెట్టాలే వీనికి ఎవడన్నా వుండా నిడలేని గాడిది ఎంతో వీడు గంతే'' అని పలికిండు గాలయ్యా. ఆతని మాటలు విన్న ఓబయ్య చెండ్ర నిప్పులు గక్కుతు గాలయ్య అంగి గల్లా పట్టిండు. అక్కడున్న పెద్దలు అవాక్కయి లేచి ఓబయ్యను సముదాయించి పక్కన నిలబెట్టి కావలిగ మస్కురును ఉంచిర్రు.
''అయ్యా దొరవారు ఓబిగాడు పతి మాటకు మాటేసినట్టు పతి పల్కుతుండు వీడు నేరనల్లి గోడబల్లిలా వుండు. ఏమెర్గనిదాన్ని నేను సంసారిని గానీ తోలుగుడు బావతోని తొమ్మండుగురు అన్నదట ఎన్నటికీ వీని మాసరిది. ఆని యవ్వారం గట్లనే వుంది.''
''అరే గాలయ్యా నువ్వు గమ్మున వుండు. ఏదన్నంటే వీడు పోలీసు నాకలకు పోయి. కులం కార్డు పట్టుకుంటడు వాని సంగతి తెల్వనిది ఎవనికి'' అని సందులో సడేమియలాగ లేని పెద్దరికం పుచ్చుకొని పలికిండు పట్వారి.
''ఓరిని తల్లి వీని జోలీ బలె గమ్మతుగ ఉందిగా. వీడిని ఊరిలో లేకుండా చేస్తే సరి. నాకురాలు గికురాలు రాలాలే అసలు వీనితోని మాటలేంది పట్వారీ కొంచపోడు కొంపకు చేటు, వీనికి దుర్గాలం దాపురించింది. అందుకే ఇట్లా చేస్తుండు. వీడిని ఏదో ఒకటి చేయాలే ఏమంటారు పట్వారీ చెప్పండి. అందరం ఒక్క మాట మీద ఉండాలే. సగం సల్లగ సగం మంట పెట్టినట్టు గాకుండ వీని ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి. లేకుంటే ఇయ్యాల ఇదయింది. రేపు ఇంకోటి అయితది మల్ల ఓబిగాడు నోరు తెరువొద్దు. ఏమంటవు పట్వారీ.'' అంటూ చేతులవున్న తువ్వాల దులుపరించి మరో చేతిలో సిగరెట్ ముక్క వెలిగించి రెండు దమ్ములు గుంజి ఓబయ్య వైపు తేరిపార చూసాడు దొర.
''నువ్వేదంటే నేను అదే'' అని వంతపాడిండు కరణం పట్వారీ. కనుగుడ్ల ఏడుపు నిండుకొని కిన్నుడై దినంగా పాలిపోయిన మొకంతో ఓరగా వారివైపు చూసి తానా అంటె తందాన అన్నట్టు గంగిరెద్దోలె తల ఆడీస్తురు అని మతిల అనుకుండు ఓబయ్య
గాలయ్యా మొకం ఆనందంతో నిండి సంతోషంతో మూతి బిగియబెట్టి ముసిగా నవ్వుతూ నేలపై పుల్లతో గీతలు గిస్తు దొర అన్న మాటకు తల వూపిండు.
......
అప్పుడే అక్కడికి వచ్చిన గంగిరెద్దుల దాసు ''దండాలు మారాజా'' అంటూ పబ్బతి పట్టి ''ఎందిరా దాసు బాగున్నావా ఊరి మీదపడ్డవ్'' అని అనగానే '' అయ్య దొరవారు మీకు పది వేల వందనాలు మాల్ పటేల్ ఇంటి కాడా పండగ చేస్తురని తెల్సి వచ్చినం. ఇక్కడ మీరు కనబడ్డరు మీ దర్శనం మా భాగ్యం ఒకసారి మా ఆట పాట చూసి కలిగినదంట్ల దోసెడో సారెడో మానెడు సాటడో ఆటేడో మీ దయ'' అంటూనే ''హహ రాముడు కళ్యాణం ఎనుక ముందు ఏడుతరాల ముచ్చట ఆహా రామ తొడలవుంది మురేడు. ఎముక ఎముకల వుంది సారేడు. మూలిగ ములిగ పట్టిసూసుకొని కండ వొత్తి సూసుకొని తాటి మొకపోని వొదిలించుకొని కాటి పాపని తోని లడాయికొస్తిమి అటువంటి పాపని మనిషి చేయి పట్టలే చెప్పింది వింటివా రామన్నా అహా నా సీతమ్మ దొరవారి దయ మీదుగా కచ్చిరు ముందు కాలులేపి వంచు నోరులెని వసుదేవుడు నోరుతెరిచి అడగడుగొంతుల సరం గుంజినా గంజి నీళ్ళ దూపకు ఓ వేయి రూపాయలు చేతికిస్తె పట్టుకునేది కాదు నోరులేని వసుదేవుడు ఇప్పుడు కాలు పెట్టింది యాడ''
''గుండేల మీద'' అని కనుబొమ్మలు ఎగరేస్తు అనగానే ''దానమిచెరు ఊరంతా అదుపుల పెట్టెెచెరు నలుగురికి తొవ్వ చూపెచెరు నాలుగు ఇండ్లల్ల దీపం పెట్టెచెరు మనకు యినాంగ యిరవై ఐదువేలు ఇచ్చెచెరు తిండికి లేక గాసానికి పోతే గడ్డి గుంజుకుండు రొండు మాపులా ఆకలికి చంపిండు చేతుల చేవవుంది ఎన్నుల పట్టుంది ఎద్దును తీసుక రండి కచ్చిరుముందు తంబం పోలుకు కట్టండి చెప్పినట్టు తల ఆడించేదాక అనిచి పెట్టండి ఇంటదా ఇడిచి పెట్టండి మన చిన్ననాడు దొరగాని దొర కొడుకగాని పుట్టెడు బలగంల పుట్టిన పులిపిల్ల ఊరి ఏలుబడికి దొర ఆరోజు యాదిమీద ఆట గంగిరేద్దు అటు ఇటు తలాడించె కుసోమంటె హె కుసుంది ఆడమంటె తలవూపి కాళ్లు ఎత్తి ఆడింది పండమంటె పడుకుంది చూసినావురా లక్ష్మణ సీతమ్మ ఎమి ఎమి చెస్తుంది'' అని పలికె.
''దాని లీలలు హె ముడుపాతీతె మూడడుగులు జరుగు అసుంట అంటె ఆరడుగులు, బిడ్డెలు బిడ్డెల దీవెన అయితే హే.. ఆటు.. దుప్పటి పర్సిన పండుకుందా'' అని ఆయన అనగానే ''పండుకుంది నాయనో... ఓ నాయనా కాడుకో... ఓ కోడుకా.... హె అయ్యా దొరవారి పేరు మీదికెళ్లి కడుపు నొచ్చిన కాళ్లూ నొచ్చిన ఏలు నొచ్చిన కాలు వాతం
కాదు కీళ్ల వాతం కాదు ఎట్టి లోకం వోట్టి ఆట గాదు పైన
తదాస్తు దేవుండ్ల దీవెనార్తితోటి మన అమ్మా వారికి గాసాం ఇచ్చారు రాములు వారికి కొత్త బట్టలు కట్టించారు ఇంటి పిల్ల జెల్లకు నోటికి ఇంత కూడు బెట్టి దూప తీర్చి మనకు ఇయ్యాల వారిపేరున ఇరవై ఐదు వేలు యినాం ఇచ్చిర్రు పూటబత్తెం బాటబత్తెం అలగ బోయిన గంగిరెద్దు బత్తెం ఇచ్చిరు .లెవులెవు లే.. లే ఇచ్చారులే నీ కాళ్లు మొక్తలే నీకు దండం పెడత లే.. లే.. దొరవారి పేరుమీది కెళ్లి ఇచ్చారు లే... లే.. లెగు లెగు లే లే పొద్దుపోతుంది లే.. లే అంటు వారిచ్చిన కానుకలు తీసుకొని అక్కడున్న దొరకు ఊరి పెద్దలకు సలాం పెట్టి వారు అక్కడినుంచి కదిలిండ్రు.....
అటు ఇటు చూస్తూ కళ్ళతో వేదకుతూ ''ఓ నాంచారమ్మ వున్నావే అమ్మా'' అని కేక వేస్తూ పిలువసాగింది పక్కింటి రామవ్వ ''ఏంది రామవ్వా ఏంది వచ్చి కాలుకాలిన దానిలెక్క చిందులేసి చిటపట లాడుతవ్'' అంటూ విప్పారిన కళ్ళతో గుడ్లప్పగించి చూస్తూ పైట సర్దుకుని బదులు అడిగింది. ''తిన్నవ్ పిల్ల తిన్నావే'' అని అనగానే ''తిన్న మీ అత్త వొడ్ల పుణ్యాన, మా అత్త ముడ్ల పుణ్యాన'' అని పలికింది. ''అది సరేకాని మీ ఆయనకు ఎట్లుంది పాణం'' ''ఇంకా కుదురుకోలే'' బట్టలు ఆరేసి వారగా చూస్తూ చేతులు కొంగుతో తుడుసుకొని బకీటులోని నీళ్ళు కింద గుమ్మరించి ఇంతలేసి కండ్లు పెద్దవి చేసి చూసింది. ''అదికాదే నీ అబ్బకున్నా... ఆడ కచ్చిరు తాన మీ ఆయిన్ని పదిమందిల నిలబెట్టిరట ఊరిలో జనం ఆడ ఈడ అనుకుంటుంటే నాతోనే మా ముసలాయన అన్నడు ఆ గాలిగాడు మీ ఎంట పడ్డడేంది బుద్ది చెప్పాలి ఎమెర్గని పిల్లలెక్క రచ్చకెక్కినాడు ఆడ దొంగ సిచ్చినోని మొఖం ఉద్దరించిందట'' అని రామవ్వ అనే లోపే ''ఏంది.. ఎవడాడు నా పెనిమిటిని నిలవెట్టింది'' అని ఊగిపోతూ పండ్లు పటపట కొరుకుతూ అడిగింది.
''అదేనే గా సదువు నేర్సిన కుక్క- సావడిల పండే దున్నపోతు రచ్చ మీద కూకునే గాడిది పతివతల్ల లంజోడూ లంజలకాడ సంసారినని పతిపల్కె బాడ్కావులు తగుదునమ్మా అని ఊరిలో పెద్దరికం ఎల్గబెడుతుర్రు'' అని మూతి విరుస్తూ పలికింది.
''అంతేనా ఏంబుట్టింది. దేష్టమ్మోరు నెత్తిన కుసుందా ఏంది శనిజాలక మేముంటే దయ్యమొల్గే మాయెంట పడ్డరూ అసలే ఆయిన ప్రాణం సుత బాగలేని మనిష.ి నాతిరి బాగా నిద్రలున్నం ఏదో గుబిక్కున కిందపడ్డట్టు సప్పుడైంది. ఉలికి పడి లేసిన ఆ సప్పుడు గుండెలో రాయి పడ్డట్టయింది. చిన్నగా నుసులుకుంటా కండ్లు నల్సుకుంటా ఏందే నిద్ర చెడకొడతవ్'' అని ఆవలించుకుంటూ లేసిండు ఏదో సప్పుడైందయ్య బయట అని నేను తిన్నగా గుసగుసగా అన్న అప్పుడే ఉరుమురిమి మంగలం మీద పడ్డటూ తలుపు మీద దమిదమీన గుద్దినట్టు తలుపు సప్పుడైంది. ఆయన చిడుగునలేసి మూలకున్న మళ్ళు గర్ర అందుకున్నడు. ఇటు చూస్తే పిల్లలు ఆగమరచి నిద్రపోతున్నరు. నేను సడీ చప్పుడు కాకుండా గొల్లెం తీసిన ఆయన బయటకు నడిసిండు కండ్లు దీపాంతలు పెట్టుకొని అటిటు వెతికిండు పాలు తాగిన పిల్లిలెక్క చిన్నగా అంగలో అంగెసుకుంటా దొంగ పిల్లిలా అటుఇటు చూసి చిన్నగా జారుకుంటుండు ''ఎవడ్రా ఎవడాడు'' అని ఆయన సరాయించుకుంటా గొంతు పెద్దగా పెంచి గద్దించిండు. ఆ కాంపౌండు గోడమోటున చీకట్ల ఎవడో తారాడుతూ అవతలికి గోడ దుంకబోయిండు దొంగ సచ్చినోడు. ఎడంగా వచ్చిండని చేతులున్న ముళ్ళుకర్రతో పెడిపెడిన వెనుకంగా రెండంటుకుండు. చేతులెత్తి వాడు నన్ను కొట్టకు నన్ను కొట్టుకు అని దుల్పాయించుకొని గోడ దూకి చీకట్లకు మాయమైండు. మొఖం సరిగా కనిపించలే అనుమానం ఉంది పొద్దూకులు పెద్ద మనిషిలెక్క ఊరిలో తిర్గుడు రేత్రయితే గోడలు దూంకుడు ఇది పాపిస్టోని బతుకు. దిష్టికండ్లోడు నాశనమైపోను. ఆడు పటుక్కున సావ'' అని గులుగుతూ పలికింది నాంచారమ్మ ''అంతేనానే మమ్ములను పిలవొద్దే నిద్రలో ఉంటే లేపొద్దా'' ''అద్దమనేతిరి అమాస చీకటి మిమ్ముల లేపిన ఆ చీకట్ల వాడు దొరకడు''. ''ఏంకాదు తీయ్యే ఎంత దూరం పోతడు చిక్కడా వానికి మూడుతది. అగో గసోంటి ఇర్కులు వస్తయి'' అని అన్నది. ఇయాల రేకల వారంగ శల్కలకు దూడ మేతకు పోయిండు. ఇంకా రాలేదేందని నేను ఎద్రు జూస్తున్నా'' అంటూ కంగారు పడుతునే నిలకడలేక ఉన్నపలంగా ఇంతలేసి అంగవేసి కచ్చీరు వైపు పరుగందుకుంది. ఆమె ఎనకమర్ల తెప్పలి రామవ్వ అటువైపు కదిలింది. ......
''అయ్యా దొరవారు వాని సంగతి తర్వాత సూద్దురు గాని ముందు వేడి వేడిగ గింత ఛాయసుక్క తాగండి. ఒళ్లు ఎచ్చగుంటది జరంతా ఆకలి దూప తీరినట్టుంటది'' అంటూ సరాయించుకుంటా చాయ గిలాస చేతికి అందించిండు కరణం శాస్త్రి .
''చాయ రుచి పచిగా ఉందా'' అడిగిండు దొర చాయ గ్లాసు అందుకుంటూ. ''దొరవారు చారు సప్పరించి చూడండి రుచి ఎట్లుందో మీరే సెలవియ్యాలి'' తలతిప్పి చూస్తూ కరణం పలికిండు ''ఆ.. రుచిగానే వుందయ్యో కరణం'' అంటూ పలికిండు దొర
''దొరవారు ఓబిగానికి నీళ్లు పాలు ఎట్టుంటయో ఎరుగనోడు... ఎరుగనూర్లే మొరుగని కుక్క ఎంతో వాడు అంతే వానికి రుశా పశా ఎట్టున్నా దిగమింగుడే'' అనే కరణం ఓబయ్య వైపు చూస్తు ''అసలు నీళ్ళెట్టుంటయో తెల్వదు. నీళ్ళు కుండల పోస్తే ఉంటరు. చెరువు కట్ట వేస్తె ఉంటరు గాని వాటి రంగులు, రుచులు చెప్తరు, ఎద్దు ఎట్లా ఉందంటే దాని వన్నె రంగు చెప్తరు కట్టేస్తే వుంటదని తెలువని పెద్దలకు ఏం చెప్పాలి. నా ఎనక ఏముందో నా ముందు ఏముందో చెప్పుమంటే నోరెళ్ల బెడుతరు. గీళ్లు నన్ను సుద్దుల పట్టి అడుగుతుర్రు ఏం చెప్పాలే'' అని వారివైపు చూస్తూ తనలో తేనే గొనిగిండు.
ఏంటి కరణం ఏదో పేపరు తిరగేస్తు అలా గుడ్లప్పగించి చూస్తున్నవ్, మాకు చెప్పు ఏముందో కాస్త మేమూ! చూసి తరిస్తం. అత్రుతగా పలికిండు దొర
''అయ్యా మావాడి పరీక్ష ఫలితాలు వచ్చినరు వారం రోజులకింద ఆ రోజు పేపర్ తెప్పించుకొని చూస్తున్న''
''అలాగ యింతకూ బైట పడిండా, గంతేసిండా'' చమత్కారంగా పలికిండు దొర.
''అయ్యా ఏదో తమరి దయ పాసయిండు తిన్నగా పలికిండు.
''అరే పక్క పేజీల ఏదో రామాయణం అచ్చరాలు కనిపిస్తున్నాయి కరణం''
'అయ్యా అది సాహిత్య పేజీ అండి''
''అలాగా ఇంతకు నీకు సాహిత్యం ఎరుకేనా''
''అదేనండి హితేన సహితం సాహిత్యం ఓ చాటుకవి కవితా కన్యకు నల్గురు / కవి జనకుడు బట్టుదాది / నవరసరసికుడే పెనిమిటి / అవివేకియే తోబుటువున్ - అంటాడండి''
'ఏంరా ఓబిగా అట్ల సూస్తవు, నీ పిల్లగాడు ఏం చదివిండురా '' అడిగిండు దొర.
''నా పిలగాడు పదిల పస్టు వొచ్చిండయా'' జీరబోయిన కంఠంతో తిన్నగా పలికిండు ఓబయ్య.
కంగుతిన్న కరణం ''పస్ట్ క్లాసు అంటే ఏందిరా'' అని అడిగే సరికి ఏమి చెప్పాలో పాలుపోక దిగాలుగా నేల చూపులు చూస్తూనే వుండు ఓబయ్య..
.......
''ఏందిరా ఓబయ్యా సాంతిమి దరువుషెడ్డవ్ ఇగ సూడు మోకాన అయిసు లేదు నాయిన సిక్కిపోయి మొకం బొక్కలు తేలినరు పాతికెండ్ల కొడుకు రాయి తొక్కితే పదారు పచ్చలు గావాలే. అయ్యో మొత్తం పిర్సుక పోయినవ్ ఎందయ్యా నీకేం బిమారి'' అంటూ కండ్ల అలుగు పారంగ కొంగుతో తుడ్సుకుంట పలికింది రామవ్వ. ఓబయ్య ఆమెను లీలగా కనుబొమ్మలు నిలిపి చూసిండు. అతని పెదాలు ఎండుక పోయినయి చెంపలు లొట్టలపొయి చేెతపడితే బిస్కని దండ రెట్ట మీద వొట్టిపోయిన చేయి పైకెత్తి ''దూప దూప'' అన్నట్టు సైగ చేసిండు
''పాణం గావారయితున్నాది చాయ సుక్క తాగితే పానం జరంత కుదురుకుంటది సుక్క తాగయ్య'' అంటూ ఛాయ గ్లాసు చేతికిచ్చింది. అతను ఉఫ్ఫా ఉఫ్ఫా ఉదుకుంట చాయ తాగిండు
''ఎట్టుంది యిప్పుడు'' అంటూ పాలిపోయిన మొకంతో ఓబయ్యను చూస్తూ తిన్నగా అడిగింది భార్య నాంచారమ్మ. పరవాలేదు అన్నట్టు చేతితో సైగ చేసిండు. అతని ఆలతి జూపి నాంచారమ్మకు కోపం నషాలానికి ఎక్కింది.
బాగా విసిగి వేసారి ఆమె ఉండ బట్ట లేక మీరేం పెద్దమనుషులు అయ్యా ఎవంది తప్పో ఎవంది ఒప్పో తెలుసుకోరే. నిజ నిర్ధారణ చేయరా. తరికా తెల్వదా గిదేం పద్ధతి. ఏమయింది ఏమయింది అంటే తడిసి మోపయింది, తింటే ఓర్శరాయే తాగితే ఓర్శరాయే కట్టే బట్టకు ఓర్శరాయే, ఇంత పొడుగు అంత పొడుగు దెన్... సచ్చే పొడుగు. పాతికేళ్ళ వొయిసు మనిషిని నిలబెడతారు కింద కుసోబెడతారు'' రుసరుసలాడుతూ పలికింది.
అనారోగ్యంతో బాధపడుతున్న ఓబయ్య నీరసిస్తూ కూర్చున్న చోటనే కూలబడిండు పక్కెంట నిలబడ్డ మస్కూరు కలవరపడుతూ కంగారు కంగారుగా ఓబయ్యను పైకిలేపే ప్రయత్నం చేసిండు. పైమీది బట్ట పామై కరుసుద్దా. ఊ అంటారా ఉలిక్కి పడతారా. ఇదేనా మన ఊరు న్యాయం. తీర్పు చెబితే పిల్ల పిల్ల తరం తలువాలే. నాలుగు కాలాలు మీ పేరు చెప్పుకోవాలి కానీ గిదేం న్యాయం. తెంపరిగల్ల అత్త కొడలుకు బుద్దిచెప్పి తెడ్డు నాకిందట. మీకి సదువెస్తే వున్న మతి పోయింది మీకు బుర్ర వుందా అసలు. గద్దె ఎక్కంగనే ఎక్వ తక్వ కులాలంటరు. కిందొడు లేనిది మిదంగ ఎట్టా ఉషి పడ్డవ్. తల్లికి పిల్లకు తేడా తెల్వదా. ఇడువా గుంజుతా నలుగుట్లకు నడువు తడిబట్ట తానం చెయ్యి రా కొట్టు. మాది తప్పయితే కాళ్ళకింద ఈగిపోతా రండోళ్ళ మారా రెక్కల మీద బతుకుతున్న మా ఇడుపుల పట్టుకొని అడ్కతింటలేము. నేను కులం కారట పడుతాను నా కులం ఊరికి తెలువదా నేను ఊరి నుంచి ఎల్లాలేనా. నువ్వు పొత్తి పోషి కట్టినావు ఊరు నీదా.. రా.. మాకు గోస దీపిస్తావు. తాత ముత్తాతల గోత్రాలు తవ్వుదాం. ఎవని నియ్యతి ఎంతో తేలుద్దాం.. సదువు అబ్బినొడ నా ఎనుక ఏముంది నా ముంగల ఏముంది చెప్పు పసురం ఎట్టుంటది ఆకాకున పూలు తిగే కాయలు లేవు ఆలాగున దీనియర్థం బ్రహ్మ తరమా చెప్పు.. బుద్దిగల్ల బుర్క పచ్చనాకు సాక్షి మొక్కాలే దీపం పెట్టాలే పబ్బతి పట్టి ఆకు పట్టాలే ముడుపు కట్టాలే ఆయన ఎవడో తెల్వదా. రోకలి ఓబవ్వకూ ముని ముని మనువడని తెలువదు. తెప్పలి రామవ్వ ఎవరూ మల్ల కన్నమ దాసయ్య ఎవరో తెలువదా. నువ్వేం మడికట్టుకున్నవు.
వీర వల్లుని వంశం పట్టుకొని ఎనకా ముందు ఎవడు లేదంటావు. తురుక రాజు కొలువుల బాశింగం కట్టుకున్న హెలమ్మా (హెలావతి) ఎవరో తెలువదా, మాయింటి ఆడిపిల్ల కాదు. రేచర్ల బీజం యాడ మొదలైంది. మా రోటికాడ తౌడు బుక్కి రచ్చబండ నాదంటావు. తలకు తిమ్మిరి ఎక్కింది ఎవనికి గుణాఢ్యుడు అడిగితే దయదలిచి మా యింటి పిల్లల కథ జెప్పినమ్ శ్రీనాథుడయ్య గీములాడితే పల్నాటోళ్ళ (పల్నాటి వీర చరిత్ర వీరులు) పురండం చెప్పినం. రమ్మను ఎంతలావు మోగాయిన వొస్తాడో రావాలే పానం బాగా లేని సందుజూసి పరేషాన్ జేస్తావ్. మీరెందో మేమెందో తియ్యి... పంటికింది ఎంటిక పేరు తెలువనోనివి నువ్వా నాకు జెప్పేది. కావలోన్ని పంపుతావు ఎట్టెట్ట పంపినవో తియ్యి. ఆడ పెట్టూ ఆవలిస్తే పేగులు లెక్కేస్త ఏర్కలేదా.. మేతకు పోయిండు యింకా రాలేదని సుస్తున్నా. మీరేమో తమాషా చేస్తున్నారు.. రాస్త రాస్తా అంటావు నేలరారు.. ఎనకట కూడుకు తొక్కులాడుతుంటే హరిశ్చంద్రమహారాజు ఆకలి తిర్సినం. సోయి దెచ్చుకో శ్మశానం కావాలిగా హరిశ్చంద్ర మారాజుకెక్కడిది ఋజువు కావల్నా మిమ్ములను తలువాల్నా నెత్తికి జుట్టా ఇంటికి పేరా మీరెంత మీ లెక్కెంత. యిలువ లేని మాటలంటవు అర్జులవట్టి రేవణం ఎంతవు. నాకు లేదు సరే మరీ మీరు పెద్దలుకారు మీకు ఏది, మీ బుద్ది గడ్డి మేసినాది ? నేను కచ్చిరుల తప్పించుకొనికే తంటాలు పడుతున్నాను పాబంది పలుకు, నావి లంజ కథలా, పుట్టి బుద్దెరిగిన కానుంచి మీ కండ్ల ముంగల పెరిగితే, మీ ముంగల బతికి బట్ట కడితే ఓర్వవా.. మానం మర్యాద లేదా, హీనంగా జుస్తావ్, మీకూ పుట్టిన నాడు పురుటి నీళ్ళు ఎవడు సల్లిండు.. ఉగ్గు పాలనాడు తాగిన దొండాకు పసరు గాక్కాలే.. తెరువు నోరు.. ఇజ్జతి పజ్జతి లేదు బట్ట యిడిసి తిరుగుతున్నమా.. కండ్ల పశ్రీకలు కమ్మినాయి.''
''పండ్లో అంట అమ్మినా పల్లారం చేసి అమ్మినా తప్పు చేసినోల్లే నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అని తుడుసుక తిరుగుతుంటే మనకేంది వోయినానికి ఎడుస్తవా వొందనానికి ఎడుస్తవా గానీ వుకోవే పిల్లా యిది అమ్మొంక రాలే అయ్యొంక రాలే మద్యల వొచ్చింది మద్యలనే పోతది గాని ఉకోవే.. నా మాటిను సాలించు నీ పూజా శిట్లు శిట్లు పుట్టేడయితయి, పెంట కెలగిస్తే పెంకిసలు ఎల్తనే వుంటయి'' అని అనగానే ''అదికాదు రామవ్వ ఈదమ్మొలే ఇత్తుఇత్తూ పోగేస్తే మారెమొచ్చి మాయం చేసి పోయిందట. చెప్పుడు మాటలకు చేతులెత్తుతారు. మంది మాటలు విని మారు మనుంబోతే మల్లొచ్చే వరకు ఇల్లు ఆగమయిందట, ముక్కు గోసినా మునుపటోడే మేలని తెలియదా రచ్చ మీద కుసోని ఆడింది ఆట పాడింది పాటగా ఎందరి నోళ్ళు ముయిస్తవ్. మనిషి వేష భాషలు చూసి మోసపోవద్దు, గుణాన్ని మించిన ధనం ఏముంది తియ్యి. కొక్కిరిచ్చినామే కుడికన్ను పోయిందట ఎక్కిరిచ్చినామే ఎడమకన్ను పోయిందట గానీ ఊకోవే లోకంలో కుక్క అరిచింది కరిచింది అంటరు గాని దానిని మించిన విశ్వాసం ఎవరికుంది మన యింట్ల బుడ్డెడు తాగి మన రేవణం ఎంతరు లోకం కాకులై పొడ్సుక తింటరు గాని మన నియతి మన బర్కతి తియ్యి. గని ఉకోవే ఆళ్ళకు చెప్పిందొకటే గోడకు చెప్పింది ఒకటే వీళ్ళకు ఎంత చెప్పినా దున్నపోతు మీద వాన కురిసినట్టే వీళ్ళకు పులిజూదం ఆట ఒక్కటే తక్కువ అన్నట్టు ఆడుతుండ్రు'' అంటూ కటువుగా పలికి నాంచారమ్మను ఊకుంచసాగింది.
మస్కూరు మైవెల్లి ఓబయ్యను పక్కవారి సహాయంతో కూర్చుండ బెట్టి కాసిన్ని మంచినీళ్ళు తాపిండు. అతను కూర్చునే సత్తవ లేక పక్కనే ఉన్న చింతమాను మొదలు దాపుకు వొరిగిండు.
నాంచారమ్మ మాటలకు ఉండలేక తిన్నగా జారుకుండు కరణం చడి చప్పుడు కాకుండా. దొర అక్కడి నుంచి పక్కకు తప్పుకుండు. ముందే ఆమె రాకను పసిగట్టిన గాలయ్య గాలికంటె వేగంగా అక్కడి నుంచి మాయమైండు
సర్పంచి చేతులు పిసుకుంటూ ''నాకేమెర్క లేదు నాంచారమ్మో రమ్మంటే వచ్చిన సర్కారు మనిషిని కావటిక కూసున్న. నేను నీ పెనిమిటిని నల్లతెల్లని ఒక్కమాట కూడా అనలేదు నాకేమెర్కలేదు. నన్ను సాపించకమ్మ. నేను వీళ్ళ తతంగమంతా గమనిస్తూనే ఉన్న వీరు ఇంకా ఏమేం చేస్తరో చూద్దామని. నాకు తెలవదా నీ పెనిమిటి ఓబయ్య గురించి. గీళ్ళ తమషా పది మందికి ఎరుకకావాలి అని గమ్మున ఉన్నా. మీ ఆయన పసిపోరనిగా పాలుచీకే వయస్సు నుంచి చూస్తున్న. ఏవి నీళ్ళు ఏవి పాలు నాకు తెలవదా. వారి బుద్దులు ఇన్నొద్దులకు బయటపడ్డయి. గద్దెలు కూల్చాలి గని వీరు ఆంబోతుకు ముక్కుసీక్కం వేసి గంగిరెద్దు చేసి ఆటాడించినట్టు ఊరందరిని వీరు చేస్తురు. ఆ ఉసురు ఊకే పోతాది పాపం పండింది. నేలారాలింది తిరు'' అంటూ వేడుకోలుగా పలికిండు అటూ ఇటూ చూస్తాలికే రచ్చబండ కచ్చిరు ఖాళీ అయ్యింది. అరచి అరచి గొంతు సరం గుంజి పెనిమిటి ఓబయ్య దాపుకు చేరి నిట్టూర్చింది నాంచారమ్మ. ముగ్గురూ కూడి వారి ఇంటి వైపు కదిలారు.
- భూతం ముత్యాలు, 00000000