Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిద్ర లేస్తుండగానే దుర్వార్త వినాల్సి వచ్చింది. మహేంద్ర కూతురు తన అత్తమామల ఇంట్లో ఆత్మహత్య చేసుకొని మరణించిందని, శవాన్ని మలక్‌పేటలోని మహేంద్ర ఇంటికి తీసుకువచ్చారని, సాయంకాలానికి దహన సంస్కారాలు జరగవచ్చని రాంచందర్ నా మొబైల్‌కు కాల్ చేసి చెప్పటంతో ఒక్క సారిగా షాక్‌కి గురయ్యాను. అర్ధగంటలో కాలకత్యాలు ముగించుకొని మలక్‌పేటలోని మహేంద్ర ఇంటికి చేరుకున్నాను. అప్పటికే ఓ ఇరవై మంది దాకా ఉన్నారు. ముందు హాల్లో శవాన్ని పండ బెట్టారు. శవం పక్కనే కూర్చున్న మహేంద్ర నన్ను చూడగానే ఒక్క ఉదుటున లేచి నన్ను కౌగలించుకొని వెక్కివెక్కి ఏడ్చాడు. అతని ఏడుపును తట్టుకోలేని నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది, నా కళ్ళ నుండి ధారగా నీళ్లు జల జలా రాలాయి. మహేంద్రను అనునయించాలని ఎంతో ప్రయత్నించాను. కానీ నా నోటి నుండి మాట పెగలట్లేదు. గొంతులో ఏదో అడ్డు పడ్డట్లు అనిపిస్తుంది. జేబులోంచి తీసిన చేతి రుమాలు నోటికి అడ్డు పెట్టుకొని స్తబ్దుగా ఉండిపోయాను.
దాదాపు ఇరవై నిమిషాల తర్వాత నిదానంగా కళ్ళు, ముక్కు తుడుచుకొని శవం వైపు తేరిపార చూశాను. ముఖంలో కళా కాంతులు లేవు. దాదాపు పదిహేనేళ్ల పాటు మా రెండు కుటుంబాలు ఒకే కుటుంబంగా గడిపాం. శ్రీముఖిని పుట్టినప్పటి నుండి మా కూతురు లాగా భావించాం. నా కళ్ళ ముందు ఆడి పాడిన శ్రీముఖి నిండా ఇరవై మూడు ఏళ్లు నిండకుండానే శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. మహేంద్రను పక్కకి లాక్కెళ్ళి శ్రీముఖి చావుకు కారణమేమిటని అడిగాను. అమాంతం రెండు చేతులు నా మెడ చుట్టూ వేసి తలని నా భుజానికి ఆనించి బోరున విలపించ సాగాడు మహేంద్ర. అతన్ని అనునయిస్తూ వీపున తడుతూ ''అసలేం జరిగిందో చెప్పు మహీ'' అన్నాను.
''నీకు తెలుసు కదా అన్నా, అత్తమామలు ఇష్టపడే నా బిడ్డను ఆ ఇంటికి కోడలిగా చేసుకున్నారు. కానీ పెళ్ళైన దగ్గర నుండి నా బిడ్డ ఆ ఇంట్లో ఎప్పుడూ సంతోషంగా గడిపింది లేదు. భర్త ఏ రోజూ ప్రేమతో చూసింది లేదు. నా బిడ్డ తన అత్తింటి విషయాలు బయటకు పొక్కకూడదనే మంచి హదయంతో మా దగ్గర చాలా విషయాలు చెప్పేది కాదు. పెళ్ళైన రెండు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా మా ఇంటికి పంపేందుకు ఒప్పుకోలేదు. నేను, నా భార్య మాత్రం ఓ మూడుసార్లు ఆ ఇంటికి వెళ్ళాము. ఆ ఇంటి పరిస్థితులను చూసిన మాకు మా బిడ్డ సంతోషంగా లేదని గమనించాం. భర్త, అత్తమామలు వరకట్నం కోసం ఆరళ్ళు పెడుతున్నారనే విషయం శ్రీముఖి ద్వారా తెలుసుకోగలిగాం. నిన్న రాత్రి పదకొండు గంటలకు నా బిడ్డ ఆరోగ్యం బాగా లేదని అత్త ఫోను చేస్తే ఉన్న పళంగా నేను, నా భార్య వెళ్ళాం. తీరా వెళ్ళేసరికి శవమై ఉంది. గత మూడు రోజులుగా కడుపు నొప్పితో బాధ పడుతుందని, ఆ బాధను భరించలేకే ఎండోసల్ఫాన్ మందు తాగి ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. వాళ్ల ప్రోద్భలంతో శవాన్ని ఇక్కడకు తీసుకవచ్చాను అన్నా'' అంటూ మహేంద్ర కన్నీటి పర్యంత మయ్యాడు.
''అత్త మామలు, నీ అల్లుడు రాలేదా మహీ'' అన్ని దిక్కులు చూస్తూ అడిగాను.
''వస్తామన్నారు, వస్తారో రారో తెలియదు. వాళ్లలో కొంచెం కూడా బాధ కనిపించలేదు'' .
''మహీ, పోలీసు స్టేషన్‌కు వెళ్దాం పద. శ్రీముఖి అనుమానాస్పద పరిస్థితుల్లో అత్తమామల ఇంట్లో మరణించిందని నీవు ఫిర్యాదు ఇవ్వు. విచారణలో నిజమేమిటో బయటపడుతుంది'' అంటూ సలహా ఇచ్చాను.
''అసలు మనిషే పోయినాక ఫిర్యాదు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత అన్నా?''
''మహీ, చదువుకొని ఒక గౌరవ ప్రదమైన ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, తెలిసిన నేరస్తులను ఊరికే వదిలేయాలను కోవటం భావ్యం కాదు. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా భావిస్తే నేరస్తులు తప్పించు కుంటూనే ఉంటారు. పోలీసుస్టేషన్‌కు వెళ్దాం పద'' అంటూ మహేంద్ర వీపు మీద చెయ్యి వేసి అన్నాను.
''ఇప్పటికిప్పుడు అంటే ఎలా అన్నా, శవాన్ని ఇక్కడ పెట్టి బయటకు ఎలా వెళ్తాం'' అన్నాడు మహేంద్ర.
''మహీ, నేను చెప్పేది అర్థం చేసుకో. దహన సంస్కారాలు నిర్వహించక మునుపే మనం ఫిర్యాదు ఇస్తే మంచిది'' అన్నాను.
మా ఇద్దరి సంభాషణ వింటున్న ఒక పెద్ద మనిషి జోక్యం చేసుకుని ''మహేంద్రా, నీ స్నేహితుడు చెప్పిన విషయం నాకూ సబబే అనిపిస్తుంది. పోలీసు స్టేషన్ దగ్గరే కదా వెళ్ళిరా'' అన్నాడు.
ఇంటి గేటు బయటకు నడిచాను. మహేంద్ర నా వెంటే వచ్చాడు. నా మోటార్ బైకు స్టార్ట్ చేసి కూర్చో అనగానే మహేంద్ర నా వెనకాల కూర్చున్నాడు. ఐదు నిమిషాల్లో పోలీసు స్టేషన్ చేరుకున్నాం. ఇన్స్పెక్టర్కు విషయం వివరించాడు మహేంద్ర.
''అన్ని విషయాలు రాసి ఫిర్యాదు ఇవ్వండి'' అంటూ ఇన్స్పెక్టర్ ఒక తెల్ల కాగితం అందించాడు. శ్రీముఖి పెళ్లి దగ్గర నుండి చావు దాకా వివరిస్తూ రాత పూర్వక ఫిర్యాదు మహేంద్ర ఇన్స్పెక్టర్కు అందజేశాడు. ఇన్స్పెక్టర్ ఫిర్యాదును ఆమూలాగ్రం చదివి ''అమ్మాయి పెళ్ళి జరిగి రెండు సంవత్సరాలే అయింది, పైగా ఆవిడది సహజ మరణం కాదు కాబట్టి ముందుగా ప్రథమ సమాచార నివేదిక నమోదు చేసి, విచారణ జరిపి కోర్టులో తుది నివేదిక అందజేస్తాం. దానికి ముందు సహజ మరణం కాదని తెలిపే శవ పంచనామా, పోస్ట్‌మార్టం నిర్వహించవలసి ఉంటుంది. మీరు మా విచారణకు సహకరించాలి'' అన్నాడు ఇన్స్పెక్టర్.
''ఇన్స్పెక్టర్ గారూ, నేరస్తులకు శిక్షపడే అవకాశం ఉందా?'' అడిగాడు మహేంద్ర.
''ఏ వివాహిత మహిళ అయినా పెళ్ళైన ఏడు సంవత్సరాల లోపు వరకట్న వేధింపులకు గురై అనుమానాస్పద పరిస్థితుల్లో అసహజ మరణం చెందినట్లయితే, ఆమె భర్త, భర్త ఇతర బంధువులు వరకట్నం గురించి బాధించినారని లేదా క్షోభ పెట్టినారని కోర్టు భావిస్తుంది. దీనినే వరకట్న మరణం అంటారు. మరణానికి కారణం వరకట్న వేధింపులు కాదని నేరస్తులు రుజువు చేసుకోవాలి. ఇటువంటి కేసుల్లో శిక్షపడే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా మీరు కోర్టు విచారణలో కూడా నా ముందు చెప్పినట్లుగానే సాక్ష్యం చెప్పాలి.''
''అలాగే ఇన్స్పెక్టర్ గారూ, మీ విచారణకు పూర్తి సహకారం ఉంటుంది. అయినా ఇంకెన్నాళ్ళు ఈ వరకట్న వేధింపులు, హత్యలు, కొన్నిసార్లు ఆడవాళ్లే ఆడవారికి శత్రువులుగా మారుతున్నారు'' ఆవేశం కట్టలు తెంచుకుంది మహేంద్రకు.
''మహేంద్ర గారూ, మేము ఎన్నో కేసులు చూస్తున్నాం. కేసు కోర్టు విచారణకు వచ్చేసరికి ముఖ్య సాక్షులు కూడా నేరస్తులతో రాజీపడి లేదా ప్రలోభాలకు లొంగి కేసును నీరు కారుస్తున్నారు. పోలీసులు, కోర్టులు కేవలం ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తుంది'' .
ఇన్స్పెక్టర్ మాతో మాట్లాడుతూనే ప్రథమ సమాచార నివేదిక నమోదు చేసి, మహేంద్రకు ఒక కాపీ ఇచ్చి సంతకం తీసుకొని, ''మీ ఇంటికి వెళ్దాం పదండి, మేమూ మీ వెనకాలే బయలు దేరుతున్నాము'' అంటూ ఇన్నోవా కారు వైపు వడివడిగా అడుగులు వేశాడు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అతడిని అనుసరించారు.
మహేంద్ర ఇంటికి చేరుకున్న ఇన్స్పెక్టర్ తన బందం సహాయంతో ఒక అర్థగంటలో శవ పంచనామా జరిపాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేయసాగాడు.
మహేంద్ర ఫిర్యాదు చేసిన విషయం, ఇన్స్పెక్టర్ మహేంద్ర ఇంటికి చేరుకున్న విషయం తెలిసి శ్రీముఖి భర్త, అత్త మామలు అక్కడికి చేరుకొని కారులో నుండి దిగి, పరుగెత్తుకుంటూ వెళ్ళి డెడ్ బాడీ మీద పడి ఏడవ సాగారు.
''ఇన్స్పెక్టర్ గారూ, ఏమిటి ఈ హడావిడి, పోస్ట్‌మార్టం చేయవలసిన ఆగత్యం ఎందుకు. శవాన్ని ముక్కలుగా చేస్తారా! మేము చెబుతున్నాం కదా కడుపు నొప్పి భరించలేక మా కోడలు ఆత్మహత్యకు పాల్పడిందని'' ప్రశ్నించాడు శ్రీముఖి మామ.
నేనేం చేయాలో మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. చనిపోయిన అమ్మాయి తండ్రి ఫిర్యాదు ఇచ్చాడు కాబట్టి దర్యాప్తు ప్రారంభించాను. దర్యాప్తులో తెలిసిన వివరాల ప్రకారం తుది నివేదిక కోర్టుకు అందజేయాల్సి న బాధ్యత నా మీద ఉంది'' జవాబిచ్చాడు ఇన్స్పెక్టర్.
''ఇన్స్పెక్టర్ గారూ, ఇంతకూ మహేంద్ర ఏమని ఫిర్యాదు ఇచ్చాడు'' అడిగాడు శ్రీముఖి మామ.
''ఆత్మహత్యకు మీరే ప్రేరేపించినట్లు ఇచ్చాడు. ఆ వివరాలు నిదానంగా మాట్లాడుకుందాం. నాకు ఎటువంటి శ్రమ లేకుండా వెదక బోయిన తీగ కాలికి తగిలింది అన్నట్లు మీరు ముగ్గురు నా దగ్గరికి వచ్చారు. ముగ్గురు నాతో పాటు పోలీసు స్టేషన్‌కు నడవండి'' అంటూ ముందుకు కదిలాడు ఇన్స్పెక్టర్.
''ఇన్స్పెక్టర్ గారూ, మేము ఎటువంటి నేరం చేయలేదని చెబుతున్నాను. కోడలిని పోగొట్టుకున్న బాధతో మేముంటే మమ్మల్ని ఇంకా బాధ పెట్టాలనుకోవటం మీకు భావ్య మేనా?''
''చూడండి, మీరు నేరం చేశారా లేదా అనే విషయం పోలీసు స్టేషన్లో తేలుస్తాను. అనవసరమైన వాదన ఆపి పోలీసు స్టేషన్‌కి నడవండి'' అంటూ తన వ్యాను వైపు దారి చూపించాడు.
''కోటేశ్వరరావు, నేను స్టేషన్‌కు వెళ్తున్నాను. మీరిద్దరూ డెడ్ బాడీని హాస్పిటల్‌కు తరలించి, పోస్ట్‌మార్టం నిర్వహించిన పిదప డెడ్‌బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించండి'' అంటూ తన సిబ్బందికి పురమాయిస్తు వ్యాన్ ఎక్కాడు ఇన్స్పెక్టర్.
తప్పదన్నట్లు శ్రీముఖి భర్త, అత్త మామలు పోలీసు వ్యాను ఎక్కారు.
- తడకమళ్ళ మురళీధర్, 9848545970