Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది భగవంతాపురం. ఒకప్పుడు చిన్న తండాగా ఉండేది. బువ్వాల్ల కావొస్తుంది. అరకకట్టినోల్లు
ఇంటికొచ్చి బువ్వతాగుతుండ్రు. బయట జీపు సప్పుడైంది. కాసేపటికి పెద్దశోకంతో శాంతమ్మ గొంతు
ఇనబడ్డది. ఏమైందాని జనం బయటకొచ్చి చూస్తుండ్రు. లక్పతి బువ్వగిన్నెతో బయటకొచ్చిండు.
''అయ్యా! నీ కాల్మొక్త... దండం పెడతా .. బాంచన్.. దయసూపురి సారు. ఆడపిల్లల తల్లిని.
మగదిక్కు లేని సంసారం...నా ఇల్లు కూల్చకురీ. జర నా తావు నిలుపురి '' తండాకొచ్చిన
రెవిన్యూ అధికారి విళంబి కాళ్ళను బిర్రుగుండ చుట్టింది శాంతమ్మ.
''వదలమ్మా! నా కాళ్ళను. నేనేం చేయలేను. పైనుంచి నాకార్డరొచ్చింది''. ''బొంత పురుగు కాలు
మీద పాకినట్టు'' కాళ్ళను బలంగా జాడిచ్చిండు విళంబి. సైగ జేయంగనే షేక్సిందు ఎంకన్న
పనోల్లకు సైగ జేసిండు. ఇంటిమీద పడ్డ గడ్డపార పోటు, శాంతమ్మ గుండెల్లో దిగబడింది. క్షణాల్లో
ఇంటితో బాటు సర్కారు బలం ముందు శాంతమ్మ సుత మొదలు నరికిన చెట్టు లెక్క ఒక్కపాలిగ
కుప్పకూలింది. లక్పతి వచ్చి శాంతమ్మను ఇంట్లకు తీసుకబోయి మంచిల్లు తాపి నిమ్మలబరిసిండు.
***
భగవంతరెడ్డి తండా సూర్యాపేటకు ముప్పై కిలోమీటర్ల దూరముంటది. ఆ తండాలో గుడిసెలు, ఎగుసాయం ఒక్కతానుంటై. ఒకప్పుడది చిన్నపల్లె. నాలుగైదు కుటుంబా లుండేవి. వాళ్ళు భగవంతరెడ్డి పటేల్ తాన జీతముండ్రు. పటేల్‌కు వందెకరాల భూమి ఉండేది. పటేల్ తాన నమ్మకంగా రెక్కలు దారబోసిండ్రు. అట్లా అట్ల నికరంగా గుడిసెలు సంపాయించుకుండ్రు. కొన్నాళ్ళు పొట్టకు బట్టకన్నట్టు సంసారం నడిసింది. మూడుతరాలు నెత్తురును నీరు చేసినాకగాని గుడిసెకో గంటెడు ఎగుసాయం జాగా కండ్లజూడలె.
పల్లెలో రాన్రాను జనం పెరిగిండ్రు. తండా భగవంతాపురం అయింది. మంద పెరిగితే యజమానికే లాభమన్నట్టు ప్రభుత్వం తండాను గ్రామ పంచాయితీగా మార్చింది. తరువాత ఆడ ఎన్నో ఇచిత్రాలు జరిగినై. కరెంటు తంబాలు రాలేగని ఇండ్లల్లకు కరెంటు బిల్లులొచ్చినై. ఇల్లు లేనోల్లకు ఇంటి పన్నులొచ్చినై. ''గిదేంది గీ అన్నాలం'' అని లక్పతడిగితే ''పోలీసులొచ్చిండ్రు.'' బిల్లులు కట్టని ఇండ్లల్ల జొరబడి తలుపులు ఊడబీక్క బోయిండ్రు. దొడ్లె గుంజకున్న దూడలనిప్పి గుంజుకబోయిండ్రు. చివరికి వాళ్ళ శరపడలేక బిల్లులు కట్టిండ్రు.
ఐదెకరాల ఆసామి లక్పతి. ''నేను కట్టనని'' పోలీసులకు మర్లపడ్డడు. లక్పతిని జీపులెక్కించుకొని నాల్రోజులైనంక దించిపోయిండ్రు పోలీసులు. వాళ్ళ పిచ్చికొట్టుడుకు మంచాన ఆర్నెల్లు నమిశిండు లక్పతి. లాభం లేదని పెద్దాసుపత్రికి తీసుకబోతే పోలీసులు కొట్టిన దెబ్బలకు కార్జం దెబ్బతిన్నదని చెప్పిండ్రు. రెండెకరాలు అమ్మినాక గాని మనిషి మనిశైండు.
***
భగవంతాపురం తండా గ్రామపంచాయితీగ మారినంక ''ఊరికి స్మశానం కట్టమని సర్కారు హుకుమిచ్చిండ్రు''. దాంతో రెవెన్యూ అధికారి విళంబి సర్వేకోసం వచ్చిండు. సర్వే చేసిండు. పంచాయితీ కార్యాలయం తాన ''స్మశానం కోసం ఎంచిన భూమి నాలుగెకరాలల్ల శాంతమ్మకున్న ఇల్లు, రెండెకరాల భూమి సుత ఉంది'' అని నోటీసు అంటించిండు. నాల్రోజులకొచ్చి ఇల్లు కూల్చడానికి మనుషుల తీసుకొనొచ్చిండు. ఎంట పోలీసులున్నరు. ''ఎంకిపెళ్లి సుబ్బిచావు కొచ్చినట్టయింది''. గీ ముచ్చట తెల్సుకున్న శాంతమ్మ, బాయికాడ చేస్తున్న పనొదిలి ఉరుక్కుంటొచ్చింది. ఆఫీసరు విళంబి కాళ్ళు పట్టుకొని గోడంత ఎల్లబోసుకుంటుంది. ఉండ తావులేదు. ''అదెరువు లేదు. దయచూపురి సారూ. నా ఇల్లు కూల్చకుర్రీ, నీ కాల్మొక్త బాంచన్'' అని కాళ్ళు పట్టుకుంది.
''మొగుడు పోయిన శాంతమ్మకు గా రెండెకరాల భూమి, ఇల్లే ఆదెరువు'' ఎట్టానన్న దయసూపురి సారూ అన్న ఊరి పెద్ద నోరు నొక్కిండు అధికారి.
***
''వదులు కాళ్ళను'' కోపంగా చెప్పిండు విళంబి. శాంతమ్మ మొండిది. ఇడ్వలె.
''అయ్యా నీ దండం పెడతా. నాది పట్టాభూమి. రెండు పంటలు పండుతై. మగదిక్కులేని సంసారం. ఆడపిల్లలు గల్లదాన్ని. మీకు కావాల్నంటే ముందుకుబోతే దొరుకుతది. గాడ చాలామంది పటేండ్ల భూములున్నై. ఇరవై ఎకరాల పెద్దాసాములుండ్రు. వాళ్లై తీసుకొండ్రి. చేసే దిక్కులేక గా శెల్కలు పడావుబడ్డై. ఆ శెల్కలల్ల రాళ్ళు బోళ్లున్నై. పంట పండదు. గయి తీసుకోరి. మా కడుపు కొట్టకురి సారు. నీ... కాల్మొక్త.. నీ... దండం బెడ్త...'' ఒత్తిపలుకుతూ బతిలాడుతుంది.''
గదేందమ్మా ! ఊరు హద్దుకు బయటున్న భూములయి. గాల్లెందుకిస్తరు?''. ''గయి నాకు తెల్వదు దొర. నీ బాంచన్. నాకుండ తావు లేదు. బొందలగడ్డ నా జాగన కడ్తే నాకున్న ఎకరం పది గుంటలతో బాటు ఇల్లు కూడా పోద్ది. దిక్కులేని దాన్నయిత. నా బిడ్డలనాదలైతరు. నెనరు చూపురి. నీ కాల్మొక్త. దండం పెడత.'' రెండుజేతులా మొక్కుతూ కాల్లిడవలె శాంతమ్మ.
విళంబికి నిదానిచ్చి చెప్పే ఓపిక తగ్గింది. కాళ్ళను ఒక్కపాలి విదిల్చిండు. మోకాలు శాంతమ్మ నోటికి బలంగా తగిలింది. శాంతమ్మ ఆక్రోశం లెక్కనే నోటినిండా బుక్కెడు నెత్తురు బయటకొచ్చింది. శాంతమ్మ జుట్టు కొప్పు ఇడివడి ఆమె బతుకుల్లెక్క ఇగి చెదిరిపొయినై. జరిగేదంతా బెదిరిపోయి చూస్తున్న పన్నెండేళ్ళ రాజ్యం, పదేళ్ళ లక్ష్మిలు ''అమ్మా!..'' అనుకుంట శాంతమ్మ తానకు ఉరుకుతొచ్చిండ్రు. నెత్తురు జూసినాక విళంబికి గాబరా మొదలైంది. శేక్సిందు ఎంకన్నకు సైగ జేసిండు. శాంతమ్మను రెక్కబట్టి లాగి దూరంగా కూసోబెట్టిండు ఎంకన్న. శాంతమ్మ గోస అధికారులకు ''చెవిటోని ముందు శంఖం ఊదినట్టైంది''. దాంతో శాంతమ్మ విళంబి కాళ్ళను వదిలేసినట్టుగానే, ఇంటిని తరువాత భూమినీ వదిలేసింది. ''సింహం వేటు పడ్డ జింకలెక్క'' శాంతమ్మ మది గింజుకుంటుంది. ''దూరంగా నిలబడున్న జింకల్లెక్క'' తండా జనం బెదిరిపోయి దూరంగా నిలబడి చూస్తుండ్రు. వేట ముగిసింది. ఏలిముద్ర లేసుకొని అధికారి, పోలీసులు ఎల్లిపోయిండ్రు. లక్పతి శాంతమ్మను ఇంట్లెకు తీసుకుబోయినాక జనం చుట్టూ చేరిండ్రు. గట్టు తెగిన శాంతమ్మ శోకాన్ని ఆగబట్టుడు అక్కడెవరికీ వశపడతలేదు.
***
మొన్న గాలివానకు శాంతమ్మ గుడిసె కప్పు లేసిపోయింది. ఆడపిల్లలెదిగొస్తుండ్రని సాటు కావాల్నని అప్పుజేసి మరీ నాలుగు రేకులేసుకుంది. కట్టుబడికి కూలీలెల్లక, కూలికి పోయి సుతార్లకు డబ్బులు కట్టింది. గూడు నిలబడ్డదన్న సంబురం నాల్గుదినాలు నిల్వలే. ఇల్లుపోయింది. ఎగుసాయానికి, ఇంటికి జేసిన అప్పు మిగిలింది. ''అన్నేలానికి ఆకలెక్కువ''. అది శాంతమ్మ బిడ్డల నోటికాడ బువ్వకాశపడ్డట్టుంది. ముచ్చట తెల్సిన అప్పులిచ్చినోల్లు ఆగలే. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం వచ్చినాక ఇస్తనని నచ్చచెప్పింది.
'ఆ పైసలు వచ్చినా చేతిల పైస మిగలదు. ఏడబోదు. ఏం జెద్దూ. నామర్దాతో బతుకుడు కంటే సచ్చుడు నయం.' శాంతమ్మకు రేయింబగలు ఇదే యోచన. తావుతో బాటు దైర్నం పోగొట్టుకుంది. కంటిమీద కునుకు కరువయింది. దాంతో బతుకు బరువై నట్టు కడుపుకు బువ్వ సైస్తల్లేదు. ఆకరికి ఒక యోచనకొచ్చింది.
***
రాత్రి రెండోజాము దాటుతున్న ట్టుంది. నిద్రపట్టని శాంతమ్మ బయటకొచ్చి చూసింది. తండా మొత్తం నిద్రలున్నది. దూరంగా నక్కలు, ఆకలితో వూలలు పెడ్తున్నై. పిల్లగాండ్లను నిద్ర లేపింది. వాళ్ళు మంచి నిద్రలుండ్రు. బువ్వలేక పోరగాండ్లు అటు నుసిలి, ఇటు నుసిలి ఏ రేత్రికాడనో పండుకుండ్రు. నిద్ర చాలక ''నిద్దరొస్తుందమ్మా..!'' అనుకుంట చిన్నది లేస్తల్లేదు. తరువాత రాజ్యం లేసింది. ఆవులించుకుంట ''హా...ఏందమ్మా గిప్పుడు లేపినవ్?'' అనడిగింది. ''చెప్తగని సెల్లెను లేపు బిడ్డా !'' రాజ్యం నిద్రమొకానున్నె చెల్లెను నిద్రలేపింది. శాంతమ్మ దేనికోసమో దోలాడుతుంది. కొంచెం సేపటికి దొరకబట్టింది. అది నీళ్ళ బకెట్. దానికున్న చేంతాడిప్పింది. కొడవలితో బారెడు పొడవుతో ముక్కలు చేసింది. చేతుల తాళ్ళను పట్టుకుని పిల్లలతో బాటు బయటకు నడ్సింది శాంతమ్మ.
***
శాంతమ్మ పిల్లలతోని ఊరిబయట మోటబాయికాడికి తోవ దీసింది. పిల్లలు ఈత కొట్టడానికి ఆ బాయికాడికి ఇంతకు ముందు ఎన్నోతేపల వచ్చిండ్రు. కానీ అమ్మ ఈనేత్రికాడ ఎందుకు బాయికాడికి తీసుకొచ్చిందన్నది తెల్వలేదు.
''అమ్మా..! ఆకలైతుంది'' లక్ష్మికి నడ్సేసరికి ఆకలి యాదికొచ్చింది. రాజ్యం అమ్మనే చూస్తుంది. అమ్మ బదులియ్యలె. అమ్మ కండ్లు ఏడ్చి ఏడ్చి ఉబ్బినై. మొకం ఉద్దరకిచ్చింది. అమ్మ ఒళ్ళు మసిలిపోతుంది. రాజ్యానికి అమ్మ ఆలోచన కొంచెం కొంచెం మతికి తెలుస్తుంది.
శాంతమ్మ పిల్లల్ని తీసుకొని మోటబాయి తానకి చేరుకుంది. మోటతోలే తంబాలకాడికి పోయి బాయిలకు జూసింది. బాయిలో నీళ్ళు వాళ్ళ బతుకులో ఆశలలెక్క లోతులో కనబడ్తున్నై. బాయిల చందమామ పెంకమీద కాలిన జొన్నరొట్టే తీరుగ తేటగా, ఓ దరికి కన్పడుతుంది. శాంతమ్మ ఎంటతెచ్చిన చేంతాడు ముక్కలలో ఒకటి తీసి లక్ష్మి చేతులకి, కాళ్ళకు కట్టింది. తరువాత రాజ్యం కాళ్ళకు, చేతులకు కట్టింది. రాజ్యం అమ్మ ఆలోచన గ్రహించింది. ఏడ్సు కుంట ''అమ్మా ఏం జేస్తున్నవే. మమ్మల్ని సంపుతున్నవా ఏందీ? మాకు బతకాలని ఉందమ్మా. అమ్మా! దండం బెడతా! వదు లమ్మా'' బతిలాడుతుంది. ఇన్పిం చుకోలేదు శాంతమ్మ. ''మనం బతికి చేసేదేం లేదు బిడ్డా. మనకు బతికే బాగ్గెంలేదు. మన కర్మ గింతే. నేను కూడా మీతో పాటే బాయిల దూకుతా. బిడ్డా ! భయపడకురి'' సావు దైర్నం నూరిపోస్తుంది. బిడ్డల మొకంల భయం చూడంగనే శాంతమ్మకు పురిటినొప్పులు యాదికొచ్చినై. శోకం రెండింతలైంది. అప్పులు మదిల బడ్డై. అంతే. పిల్లల నమాంతం బాయిలకు తోసింది. రాజ్యం, లక్ష్మిలు కాళ్ళు చేతులు ఆడిస్తే బతుకుతరు. ఏటినైనా ఎదు రీదే ఆ చిట్టికాళ్ళు, చేతులకు తాళ్ళు అడ్డుపడ్డై. శాంతమ్మ నడుముకు పెద్దబండ కట్టుకుంది. పైకి జూస్తూ దండంపెట్టి గబుక్కున బాయిల దూకింది.
***
రోజులు గడిచినై. భగవంతాపురం బాగా పెరిగింది. దగ్గరలో పరిశ్రమలు పడ్డై. భూములకు రెక్కలొచ్చినై. ఊరు గుండా నాలుగు వరుసల సడక్ మంజూరైంది. సర్వే మొదలైంది. సర్వే చేసిన కాయితంలో రోడ్డుకు దగ్గరున్న ఇండ్లు, పంట చెల్కల భుములున్నై. ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తామన్నారు. బయట మార్కెట్ విలువలో అది పదో పైసలు కూడా కాదు. వాళ్ళంతా తమ తావు పోతుంటే చూస్కుంట ఆగబట్టలేక ఎమ్మెల్యే రాజిరెడ్డిని కలిసిండ్రు. ''అయ్యా ! ఇది మా తావు. ఇదొదిలి మేం యాడబోదుము? ఎట్టనన్న దీన్ని ఆపురని'' బతిలాడిండ్రు.
కోట్ల విలువైన భూమది. దానిపై రాజిరెడ్డి కన్నుబడ్డది. దాంతో ఇంజనీరును పిలిపించుకుండు. భూముల కబ్జా చేసిండు. తరువాత మ్యాపులో రూటు మార్పించే ఒప్పందం చేసుకుండు. అంతకుముందేగా భూములను దక్కించుకోవాలని చూసిండు. ''పైసలిస్త మీ భూములు నాకియ్యమని'' అడిగిండు. నాయకుని మాట విని నివ్వెరబోయిండ్రు. ''కంచే చేను మేస్తే కావలెవరు?'' అనుకుండ్రు. ఆయనకు ఎదురుమాట్లాడితే శాల్తీల్లేకుండా చేస్తడని భయపడ్డరు. కొందరొప్పుకుండ్రు. ఏ అదెరువు లేనోల్లకు అది మింగుడుపడలేదు. తెగువ చూపిండ్రు. తమ ఇండ్లను భూములను వదిలిపెట్టదలుచుకోలే. బలానికి, బలగానికి ఎదురుతిరిగిండ్రు. దాంతో వాళ్ళ ఇండ్లకు నీళ్ళు బందైనై. ఇంట్లో కరెంటు తీగలు వంట్లో నరాలు తెగినై. అయినా వాళ్ళు దారికి రాలేదు. మరోవైపు మొదట భూములు ఇస్తామని ఒప్పుకున్న జనం తిరుగుబాటు దారులకు మద్దతు తెలిపిండ్రు. జనాన్ని దారిలోకి తేవ డానికి పోలీసులొచ్చిండ్రు. నచ్చజెప్పిండ్రు. భయపెట్టిండ్రు. జనం వినలే.
పోలీసులు రెండోపాలి అద్దరాత్రి ఊరు చేరిండ్రు. ఆ రాత్రికి గుండె లేనట్టుంది. బూటుకాలు కిందపడి రక్తసిక్తమైంది. లక్పతి కొడుకు భీక్యా ఎదురు తిరిగిండు. ''మీరు దొంగలకు సద్దులు మోస్తుండ్రు'' అని పోలీసులనంటే వాళ్ళు కోపంతో మక్కెలిరగ దన్నిండ్రు. భీక్యా పెండ్లాం లచ్చుంబాయి అడ్డం పడ్డది. ''అయ్యా! కాల్మొక్త బాంచన్! మా ఎంబడి బడకురి. నా మొగున్ని ఇడిసిపెట్టండి. మీకు దండం బెడ్తా. కాల్మొక్తా.. బాంచన్! ఈ జాగాలు కబ్జా పెట్టుకున్నది కాదు. కష్టపడి కొనుక్కున్నం. మా ఇండ్లు కూల్చకురి''. గోడు గోడున గోడునెల్లబోసుకుంది. ''ఏడనన్నా మనుషుల సంపి అందంగా బొందలగడ్డ కడ్తరా అయ్యా?'' అని అడ్డం పడ్డది. ''లేబరి ముండా! మాకే అడ్డమొస్తవా'' అని లచ్చుంబాయి జుట్టుపట్టి ఈడ్చి డొక్కల తన్నిండు అమీసాబు. గొంతున్న వాళ్ళను ఎత్తుకబోయి జీపుల్ల కుక్కిండ్రు. జనాల నోట్లె మన్ను కొట్టి, జీపు వేగంగా పోయినై.
దాంతో జనం ఆ తావు మీద ఆశలొదిలేసుకుండ్రు. బతుకు తావు చుట్టూ ముండ్ల కంచె పడ్డది. ఇండ్లన్నీ నేలమట్టమై వాళ్ళ జీవితాల్లాగే ఇబ్రీకంగ మార్నై. ఈ అరాచకం బయటకు పోక్కనీయలేదు ఎమ్మెల్యే రాజిరెడ్డి. అధికారం, డబ్బుతో నోరు మూయించిండు. దస్త్రాల మీద వేలిముద్రల నేయించుకొని టేషన్లున్న జనాన్ని వదిలిపెట్టిండ్రు. ఇప్పుడు వాళ్ళు సొంత జాగను కంటితో చూసినా ఒంటిమీద లాఠీ తయ్యినాడుతుంది.
పోలీసుల దెబ్బలకు భీక్య తబేదు కరాబయ్యింది. పెద్దాసు పత్రికి పట్నం పోతే భీక్య పెండ్లానికి శాంతమ్మ కలిసింది. కావలించుకొని రోడ్డు మీదనే పట్టుకొని ఏడ్సింది లచ్చుంబాయి. జరిగినందంతా చెప్పింది. ఆమెను నిమ్మలబరిచి ఇంటికి తీసుకబోయింది శాంతమ్మ. చేతనైనంత డబ్బుసాయం చేసింది శాంతమ్మ. భీక్య ఆరోగ్యం కుదుటబల్లేదు. రోజురోజుకు దిగ జారింది. తన పాలుకొచ్చిన రెండెకరాల్లో ఎకరన్నర రోడ్డుకు పోగా మిగిలిన అరెకరం అమ్మినా మనిషి దక్కలే. శాంతమ్మ పిల్ల లతో బాటు భీక్య పీనిగను తీసుకొని ఊరుజేరింది. లక్పతి శాంత మ్మను బట్టుకొని అమ్మా అనుకుంట శోకాన్ని పంచుకుండు. కార్యం అయిపోయాక పిల్లలనాడు అమ్మ తీసుకున్న ఊరి బకాయిలను తీర్చారు. తరువాత పట్నం బయలు దేరిండ్రు.
***
భూమి, కాలం తిరుగుబోతులు. శాంతమ్మకు మొదటిది గాయాన్ని చేస్తే, రెండోది మాన్పింది. లక్పతి వరుసకన్నవుతడు. సచ్చిపోదామనుకున్న ఆ రాత్రి శాంతమ్మను, పిల్లలను భీక్యా కాపాడిండు. ఆ రోజు భీక్య మోట తోలడానికని బాయికాడికి పోతుండు. మోట బాయికాడికి రాంగానే పెద్ద సప్పుడు ఇనబడింది. దబదబ ఆడికి ఉరికిండు. అప్పటికే పిల్లలను బాయిల తోసి దుంకుతున్న శాంతమ్మను జూసిండు. ఎంటనే బాయిల దుంకి అందరినీ కాపాడిండు. దైర్నం చెప్పిండు. శాంతమ్మకు పైసల సాయం రాకున్నా మాట సాయం అందింది. భీక్య జమానతుతో అప్పులోల్లు మానవత్వం చూపిండ్రు. మిత్తీ వద్దన్నరు. శాంతమ్మ పట్నం పోయి కంపెన్ల పనికి కుదిరింది. చెమట దారపోసి పిల్లల సదివించింది. రాజ్యంను లాయరు చదివించింది. చిన్నది జర్నలిజం చదివింది. అమ్మ కష్టం చూసి పిల్లలు పెరిగిండ్రు. శాంతమ్మ కష్టం పిల్లల భవిష్యత్తుకు అక్కరకొచ్చింది. బువ్వ బయటపడ్డది. అమ్మను కష్టం మర్సిపోయేటట్టు చూసుకుంటుండ్రు. శాంతమ్మ పిల్లలకు జరిగిందంతా చెప్పి, ''అమ్మా! మీ చదువు భీక్యకు, మన ఊరోల్ల తావు నిలపడానికి ఉపయోగించండి'' అన్నది.
***
జర్నలిజం చదువుకున్న లక్ష్మి పెద్ద వార్తాఛానల్లో పనిజేస్తుంది. అప్పటికే ఆ ఛానల్లో స్టింగ్ ఆపరేషన్ల ద్వారా లక్ష్మికి మంచి పేరుంది. స్థానిక ఎమెల్యే రాజిరెడ్డిపై స్టింగ్ ఆపరేషన్ ప్రారంభించింది. చట్టానికి కావాల్సిన సాక్ష్యాలు సేకరించింది. ఎమెల్యే అక్రమాలన్నీ పత్రికలో బయటపెట్టింది. ఆ వార్తలను కబ్జాదారులు లేక్కజేయలేదు. అధికార పార్టీ ఎమెల్యే కావడంతో పార్టీ సహకారం తీసుకుండు. వాళ్ళు కూడా ''తేలుకుట్టిన దొంగలాగ'' బయటపడలేదు. పైగా ఆ భూమి ప్రభుత్వం భూమని పత్రికల్లో తప్పుడు ప్రకటనలు చేసిండ్రు.
మరోవైపు రాజ్యం నల్లకోటు తండావాసులకు ధైర్యం కల్పించింది. వారితో కేసు రిజిస్టరు చేయించింది. అటువైపు పెద్ద పెద్ద లాయర్లు రంగంలోకి దిగారు. కోర్టు హాలులో వాదనలు జరుగుతున్నై. అది ప్రభుత్వ భూమి అని అడ్డంగా వాదించారు. తరువాత రాత్రికి రాత్రే వాళ్ళు అక్కడ ఇల్లు కట్టారని అధికారులు అబద్దం చెప్పారు.
రాజ్యం కోర్టు హాలులో విశ్వరూపం చూపింది. ''యువరానర్! అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల దుర్వినియోగం ఫలితంగా ముప్పై నాలుగు కుటుంబాలు అనాధలయ్యాయి. ఉండ తావు కోల్పోయినై. ఆ కుటుంబాలు రెండు తరాలుగా గ్రామ పంచాయితీకి కట్టిన ఇంటిపన్ను, భూమి పన్ను రసీదులను పరిశీలించాలని'' కోరింది. ''కాయ చిన్నదైతే కారం తక్కువవుతుందా?''. ధర్మం గెలిచింది. ధర్మ దేవత మూడో కన్ను తెరిచింది. ''ఎమెల్యేను కటకటాల లోపలికి నెట్టి, సంబంధమున్న అధికారులను తక్షణమే ఉద్యోగాల నుండి తొలగించి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని'' ఆదేశించింది. తరువాత గ్రామస్తులకు జరిగిన నష్టాన్ని కట్టియ్యమని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కూలగొట్టిన ఇండ్లమట్టినెత్తి నీళ్ళులేని మోటబాయిని పూడ్చిపెట్టారు.
- శీలం భద్రయ్య, 9885838288