Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవీన - ప్రణీత్ ల వివాహం జరిగి ఆరు నెలలయ్యింది . ఇద్దరూ అమెరికాలోనే ఉద్యోగం చేస్తున్నారు. నవీన కుటుంబం తెలుగు వారే .. కానీ గత ముప్పయి సంవత్సరాలుగా అమెరికా లోనే స్థిరపడ్డారు. అక్కడే పుట్టి పెరగటం వలన నవీనాకు తెలుగు సరిగా రాదు. అక్కడి ఆంగ్ల భాషకే పూర్తిగా అలవాటు పడింది. తెలుగు అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తుంది. కానీ మాట్లాడటం అసలే రాదు. మ్యాట్రీమోని ద్వారా ప్రణీత్ - నవీన ల పెళ్లి కుదిరింది. ప్రణీత్ తల్లి తండ్రులు ఆన్ లైన్ లోనే అమ్మాయిని చూసారు. ఓకే అన్నారు. ప్రణీత్ అమెరికా లోనే ఉండటం వల్ల స్వయంగా కలుసుకొని పెళ్లి నిశ్చయం చేసుకున్నారు.
అమెరికాలో సెటిల్ అయిన సంబంధం అని మొదట అనుమానపడినా .. ప్రణీత్ ఇష్టపడ్డాడని అతని తల్లితండ్రులు ఒప్పుకున్నారు.
అమెరికా లోనే పెళ్లి చేయాలనుకున్నారు. సమయానికి వీసా దొరకక పోవటం వలన,మళ్ళీ సంవత్సరం వరకు ముహార్తాలు లేకపోవటం వలన, ప్రణీత్ ఆఫీస్ పని ఒత్తిడి తో ఇండియాకి రాలేకపోవటం వలన.. ప్రణీత్ అమ్మా నాన్నలు లేకుండానే హడావిడిగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది . డిసెంబర్ నెలాఖరులో లీవ్ దొరకడంతో ఇప్పుడు ఇండియా కి ప్రయాణం పెట్టుకున్నారు.
ప్రయాణం నిర్ణయించుకున్నప్పటినుండి
మొదలుపెట్టాడు ప్రణీత్ . రోజూ నవీన తో "నువ్వు తెలుగు నేర్చుకొని బాగా మాట్లాడాలి. అమ్మ వాళ్ళ దగ్గర మంచిపేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే నిన్ను స్వయంగా కలుసుకోవటం ఇదే మొదటిసారి కదా" అని చెప్పిందే మళ్ళీ చెప్పటం చూసి నవీన కు కాస్త విసుగు అనిపించినా " పోనీలే పాపం " అనుకొని "సరే ప్రణూ.. అక్కడ అందరికీ నా ప్రవర్తనతో , నా తెలుగు భాషతో ఎంత సర్ ప్రయిజ్ ఇస్తానో మీరే చూడండి" అంది నవీన .
అనుకున్న ప్రకారం బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడినుండి వరంగల్ కు ట్రైన్ లో బయలుదేరారు. కార్లో వెల్దామంటే ట్రైన్లో అయితే ఇక్కడి కల్చర్ ( సంప్రదాయం ) అంతా పరిచయమైనట్టుంటుందని నవీన అనటంతో సరే అన్నాడు ప్రణీత్ .
కాసేపటికి ప్రణీత్ అలా వెళ్లి వచ్చేసరికి నవీన ఎదుటి సీట్లోని అతనితో గొడవపడుతోంది. ఏమిటా అని చుస్తే "ఆ కిటికీ నాది .. ఆ కిటికీ నాది " అంటోంది నవీన . " అరె .. ఈ కిటికీ దగ్గరి సీట్ నాదమ్మా " అంటున్నాడు ఎదుటి వ్యక్తి. ప్రణీత్ రాగానే " చూడు ప్రణూ నా కిటికీ నాకిమ్మంటే ఇవ్వటం లేదు అతని చేతిలోనే పట్టుకున్నాడు" అనటంతో అప్పుడర్థమైంది అందరికీ అది కిటికీ కాదు టికెట్ అని. అది అనుకోకుండా బ్యాగ్ లోనుండి కిందపడటంతో అతను తీసి ఇద్దామనుకునే లోపలే ఇలా జరగటంతో ఆమె తెలుగు కు అందరూ అవాక్కయ్యారు .ఇక అక్కడి నుండి మొదలయ్యాయి తెలుగు కష్టాలు. టికెట్ ఇవ్వగానే "మద్యాదానములండి " అనగానే వాళ్ళు షాక్ అయ్యేలోగా " సారీ సార్ .. మా ఆవిడ ఉద్దేశ్యంలో ధన్యవాదములండి " అని నచ్చచెప్పాడు.
ట్రైన్ దిగగానే " నవీ ఏమిటిది " అనగానే " ప్రణూ ...నువ్వేగా నన్ను ఇండియా చేరగానే ఇంగ్లీషులో మాట్లాడవద్దు అన్నావు కదా " అని ఇంగ్లిష్ లోనే చెప్పింది నవీన . 'ఓకే ఓకే' అన్నాడు ప్రణీత్.
ఇంటికి వెళ్ళగానే అందరూ సంతోషంగా ఎదురొచ్చారు. కొత్త దంపతులకు హారతిచ్చి " బాగున్నావా కోడలా " అంటూ నవ్వుతూ పలకరించింది అత్తగారు. "హా..అత్తా మీ మనసు కారం ( మీకు నమస్కారంకు బదులుగా ) " అంది నవీన . నోరెళ్లబెట్టారు ఇంట్లోవారు. ఆ తప్పు పూర్తిగా బయటపడేలోపు నవీన తో కలిసి చటుక్కున వాళ్ళ కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు.
తెల్లవారి దగ్గరి వాళ్ళంతా వీరిని కలవటానికి వచ్చారు. భయపడుతూనే నవీన ను పిలిచాడు ప్రణీత్ . " అందములకు నందన వనములండీ " ( అందరికీ వందనాలండీ " కి బదులుగా ) నవ్వుతూ అంది నవీన . అంతే .. అక్కడినుండి తప్పించటానికి " నవీనా కాస్త కాఫీ చేయమ్మా " అన్నారు అత్తగారు. " ఓకే అత్తమ్మా " అంటూ వెళ్లి ' లాప్ టాప్ ' తీసుకొచ్చి ' ఏం కాపీ చేసి పోస్ట్ చేయాలి ' అంది. అది అందరూ వినేలోగానే హడావిడిగా ఏదో పని ఉన్నట్టు నవీనా ను లోపలికి పిలుస్తూ తనూ లోపలికి వెళ్ళాడు ప్రణీత్ .
వీళ్ళుండేది అపార్టుమెంట్ లో .. అక్కడ రోజు విడిచి రోజు కూరగాయల వ్యాన్ వస్తుంది . ఆ రోజు సంక్రాంతి ముందు కావటంతో వ్యాన్ నిండా కూరగాయలు .. వాటిని అమ్మటానికి ఎప్పటికంటే ముగ్గురు మనుషులు ఎక్కువే వచ్చారు . ఇక నవీన ఆగుతుందా నేనూ చూస్తానంటూ చెంగుచెంగుమని వచ్చింది . “ఏంటీ ఇవి ఇస్తున్నావు ?మీ తలకాయలివ్వండి” అంది . అందరూ వింతగా చూసారు . కూరగాయలమ్మేవాడయితే సరేసరి ...”ఏందమ్మో ఏం మాట్లాడుతున్నావ్” అంటూ గయ్యిమన్నాడు . ఇంకేముందీ మళ్ళీ ప్రణీత్ పరిగెత్తుకుంటూ వచ్చాడు .. విషయం తెలుసుకున్నాడు . ఆవిడకు తెలుగు రాదు బాబూ .. లేత కాయలనబోయి అలా అందని సర్ది చెప్పేసరికి తల ప్రాణం తోకకు వచ్చినంత పనయ్యింది . చూడు ప్రణూ.. ఎలా కరుస్తున్నాడో ( అరుస్తున్నాడో ) అంటున్న నవీన ఇంకేం మాట్లాడకుండా చూపుడు వేలితో ఆమె పెదాల్ని బంధించాడు .
ఇంతలో సంక్రాతి పండుగ వచ్చింది . వాకిట్లో గొబ్బెమ్మలను చూసి అవి ఏమిటని అత్తగారిని అడిగింది. "వాటిని గౌరమ్మలుగా భావిస్తూ పసుపు , కుంకుమ , పూలు వేసి దండం పెట్టుకుంటారు " అని చెప్పింది.
తెల్లవారి సంక్రాతి నోముల పండుగ. దేవుడి దగ్గర నోములన్నీ రెడీగా పెట్టి , నవీనా తో "అమ్మా ! ఇక్కడ గౌరమ్మను పెట్టి మనం నోముకోవాలి .. నువ్వు ఇక్కడ కూర్చో .. నేను పూలు తీసుకొని వస్తాను " అని వెళ్ళింది. తిరిగి వచ్చి అక్కడి పరిస్థితి చూసి షాక్ అయ్యి పడబోయిన అత్తమ్మను పట్టుకుంది. దేవుడి దగ్గరి గొబ్బెమ్మను చూపిస్తూ మీకు హెల్ప్ అవుతుందని నేను ముందే తెచ్చి పెట్టాను " అంటున్న నవీన ను చూస్తూ .. పసుపు గౌరమ్మకు బదులుగా పేడ తో చేసి పెట్టిన గొబ్బెమ్మను చూస్తూ .. నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు అత్తగారికి.
ఇదంతా చూసిన ప్రణీత్ బెడ్ రూమ్ లోకి వెళ్లి తల పట్టుకున్నాడు. “ఇండియా కు వచ్చేముందు ఎన్ని అనుకున్నాను. అమ్మ వాళ్లకు నచ్చే విధంగా ఉన్న కోడల్ని తీసుకొచ్చానని చెబుతూ ఇండియా లో రిసెప్షన్ ఏర్పాటు చేసి తనను ముత్యాల పల్లకిలో ఊరేగించి తీసుకెళ్లాలన్న తన ఊహల్ని తలకిందులు చేసి నా ఊహల పల్లకిని విరిచేస్తోంది . అమెరికా లో ఎంత బాగా మాట్లాడేది ఇంగ్లీష్ లో .. ఎంత బాగా కలిసుండేవాళ్ళం. ఇప్పుడు తన తెలుగు భాషతో , ప్రవర్తనతో పరేషాన్ చేస్తున్నది” అనుకుంటూ అలా బెడ్ పై వాలిపోయాడు. ఇంతలో " ప్రణూ" ..అంటూ వచ్చిన నవీన ను చూస్తూ ఎన్నడూ లేని చికాకుతో " ఏం పిల్లో ఏమో ..నీ మొహం తగలెయ్య " అంటూ విసుక్కున్నాడు. వెంటనే నవీన పిల్లో ( తలగడ ) తీసి ప్రణీత్ మొఖం మీద వేసింది. ఆశ్ఛర్యంగా చూసాడు ప్రణీత్ . " నువ్వేగా పిల్లో మొఖం మీద తగలెయ్యమన్నావు " అంది మొఖం అమాయకంగా పెడుతూ. " వామ్మో " అంటూ అరిచాడు ప్రణీత్ . భరించలేక అటు తిరిగి పడుకున్నాడు. ముసిముసిగా నవ్వుకుంది నవీన .
చివరికి సంక్రాతి తరువాత నవీన ను తెలుగు లో మాట్లాడవద్దని నచ్చచెప్పి ఒప్పించి రెసెప్షన్ ఏర్పాటు చేసారు. అక్కడ అందరూ కొత్త కోడలు మాట్లాడాలని పట్టుపట్టటడంతో నవీన లేచి " అందరికీ నమస్కారం " అనగానే కుటుంబ సభ్యులందరి గుండెల్లో జల్లుమంది . కానీ ఆశ్ఛర్యం అచ్చ తెలుగు లో అందరికీ ధన్యవాదాలు .. అభివందనాలు తెలుపుతూ అద్భుతంగా మాట్లాడి చివరగా ఒక తెలుగు పాట కూడా పాడి అందరినీ మైమరిపించింది.
ఇంటికొచ్చాక .. ఆశర్యపోతున్న అత్తమ్మను చూసి "అత్తమ్మా ! నన్ను క్షమించండి . నేను ఇండియా ప్రోగ్రాం ఫిక్స్ కాగానే ' ముప్పయి రోజుల్లో తెలుగు నేర్చుకోవడం ఎలా ' పుస్తకం చదివి మొత్తం నేర్చుకున్నాను . మీ అబ్బాయిని అట పట్టించాలని ఇలా చేస్తూ అప్పుడప్పుడు మిమ్మల్నీ ఇందులో ఇరికించక తప్పలేదు " అంటూ ఇదే నా సర్ ప్రయిజ్ అన్నట్టుగా శ్రీవారి వైపు చిలిపిగా చూసింది .
- మాదారపు వాణీశ్రీ
హన్మకొండ
9247286668