Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూమ్మీదికి చీకటి గొంగళీ పురుగులా పాకుతున్నది. నాలుగు బజార్లూ తిరిగి నాలుగు చిత్తు కాగితాలు నమిలి కూలిన గోడల పాత ఇంటి వైపు వచ్చింది గాడిద. అప్పటికే అరుగు మీదకు చేరిన కుక్క మోర ఎత్తి బిగ్గరగా అరుస్తున్నది. దీనికేం పోయేకాలం వచ్చింది పిచ్చి కుక్కలా అరుస్తున్నది అనుకుంటూ అరుగెక్కి దాని ఎదురుగ్గా కూలబడుతూ అంది గాడిద.
ఏంట్రా వెర్రి కూతలు, పిచ్చి కూతలు తిండి తక్కువయ్యా తిండి దొరక్కా తిన్నదరక్కా అంది.
ఒక్క క్షణం మొరగడం ఆపి అంది కుక్క తిన్నదరగలేదు కనకే... అని.
అంత తిండి ఎక్కడ దొరికిందబ్బా మాంసం కొట్టు మూసే వున్నదే బిర్యానీ పొట్లమేమన్నా దొరికిందా? ఊళ్ళో మీటింగేమయినా జరిగేనా?
కరెక్టుగా 'గెస్' చేశావు గాడిదవైతేనేం. అవును సభ జరిగింది. మహాసభ. అబ్బో జనం విరగబడ్డారు. ఆకాశం ఈనిందనుకో అన్నది కుక్క.
తింటే తిన్నావు. మీటింగన్నాక బిర్యానీ పొట్లాలు దొరక్కపోవు. మరీ ఇంతగా మొరగాలా దానికి!
ఏం చెయ్యను. అక్కడ వేదిక మీద ఉపన్యాసాలు యమ దంచుడనుకో. అవి విన్నప్పట్నించీ మొరుగుతూనే ఉన్నా. ఆపాలనుకున్నా ఆపలేకపోతున్నానంటూ మళ్ళీ మొరగడం మొదలుపెట్టింది కుక్క.
ఎహె ఊరుకో! ఊరికే గొంతు చించుకోకు. మనుషుల అరుపులకూ జంతువుల అరుపులకూ తేడా లేదా?
ఏం తేడా ఉందో చెప్పు? వాళ్ళయితే ఇష్టం వచ్చినట్టు చెవులు చిల్లులు పడేట్టు అరవచ్చునేం. 'ప్రీడం ఆఫ్ స్పీచ్' వాళ్ళకేనా. మనకు లేదా అంది కుక్క లేచి నిలబడి ఆవేశంగా తోక తిప్పుతూ గిరగిరా.
మనుషుల్లా అనవసరంగా ఆవేశపడకు. నోరు పారేసుకోకు. మనకున్నది 'ఫ్రీడం ఆఫ్ సౌండ్'. దాన్ని వేస్టు చెయ్యకు.
అదికాదు డాంకీ మనమేం తక్కువ. వాళ్ళు నోటికేది వస్తే అది మాట్లాడితేదాన్ని 'స్పీచ్' అంటారా. మనం అరిస్తే అదే నేను అరిస్తే 'మొరుగుడు' అని నువ్వ అరిస్తే 'ఓండ్రపెట్టుడు' అనీ అంటారా. ఇదేం న్యాయం అంది కుక్క.
న్యాయమూ ధర్మమూ అన్యాయమూ అధర్మమూ అన్నీ మనుషుల 'తాతల సొమ్ములే'! వాళ్ళ అరుపులకు ఓ అర్థం పర్థం పరమార్థం ఉంటయి. మనవి ఒట్టి గాలి అరుపులే కదా!
ఎందుకని వాళ్ళ మొరుగుడుకీ ఓండ్రులకీ అంత 'వాల్యూ' దేనికని అంటూ మళ్ళీ లేచి నిలబడింది కుక్క ఆవేశంగా తోక తిప్పడానికి.
తిప్పావులే తోక ఊరికే ఆవేశపడక కూర్చో చెప్తా.
కుక్క ఆవేశాన్ని అణుచుకుని తోక తిప్పే ప్రోగ్రాంని 'పోస్టుపోన్' చేసుకుని బుద్ధిగా కూచుంది గాడిద చెప్పేది వినడానికి.
మనుషుల మొరగుటకీ, ఓండ్రు పెట్టుటకీ చాలా విలువ వుంది. ఆ మొరుగుడుతోనూ ఓండ్ర పెట్టుటతోనూ వాళ్ళు ఎలెక్షన్లల్లో ఓట్టు సంపాదిస్తారు. ఆ తర్వాత అధికారంలోకి వస్తారు. ఆపైన ప్రజల్ని చావ చితకబాదుతారు. మనం ఎంత అరిచి గీ పెట్టినా ఎంఎల్ఏలమూ ఎంపీలమూ కాలేం తెస్సుకో.
కుక్క బుర్రలో ఎక్కడో లైటు వెలిగింది. అవును సుమా నిజమే. వాళ్ళు అరుపుల్ని 'క్యాష్' చేసుకోగల్రు. మన అరుపులకి 'దగ్గు' తప్ప మరేమీ దక్కదు.
సరిగ్గా ఈ టయంలో మనిషి వచ్చి అరుగు ఎక్కాడు.
హేమాన్ ఉషారుగా ఉన్నావు. నిరుద్యోగ భృతి అందిందా ఏమిటి? అనడిగింది గాడిద.
పొలిటిషన్స్ ప్రామీజులు నీటిమీది రాతలని తెలీదా నీకు. ఇప్పుడు వేలూ, లక్షల్లో ఉద్యోగాలిస్తామన్నారు. పరీక్షలకి ప్రిపేరవుతున్నా. అందుకే ఈ ఉషారు అన్నాడు మనిషి సన్నగా ఈలవేస్తూ.
అనవసరంగా ఈల వెయ్యకు. పరీక్షలనేవి జరగాలి. జరిగితే ఉద్యోగం నీకు దొరికితే అప్పుడు వెయ్యి అంది కుక్క.
అవునవును 'కోర్టు'లు అడ్డం పడకపోతే నిజంగానే నియామకాలు జరిగితే అప్పుడు చెయ్యి 'తీన్మార్ డాన్సు' అంది గాడిద.
బహిరంగ సభకు వెళ్ళి వచ్చినప్పట్నించీ మొరుగుతున్నది ఈ డాగే. ఇంతకీ ఆ ఉపన్యాసాల్లో మ్యాజిక్కేమిటో అంది గాడిద.
మ్యాజిక్కాదది 'కిక్కు'. బూతు పంచాంగ శ్రవణం. ఇవతలవాడు అవతలివాడిని అవతలివాడు ఇవతలి వాడిని అనరాని వినరాని బండబూతులు తిట్టడం, బురద చల్లడం, దుమ్మెత్తిపోయడం.. అదే ఇప్పుడు 'ఫ్రీడం ఆఫ్ స్పీచ్'కి అర్థం పరమార్థం అన్నాడు మనిషి.
-చింతపట్ల సుదర్శన్, 9299809212