Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బద్దకంగా పేస్టనూ బ్రషనూ ఒక దగ్గరికి చేరుస్తున్నా. మూత పడుతున్న కళ్లూ... తెల్లారగట్ల సహజంగానే గాఢనిద్రను కోరుకునే శరీరం సహకరించట్లేవు. రెండు మూడు నిమిషాలన్నా అయ్యిందేమో బ్రష్ నోట్లో పెట్టుకోవడానికి. బాత్రూంలో మొహం కడుక్కుంటానంటే మాధవి ఒప్పుకోదు. నిద్రమొహంతో ఎక్కడెక్కడో ఉమ్ముతారంటుంది. పొద్దున్నే పచ్చి గాలి పీలుస్తూ నిద్రమత్తు నుండి త్వరగా బైటపడతాననేమో... అసలు మా మాధవి గొప్ప మేధా...
'అమ్మా' ఏడుపుతో కూడిన అరుపు. నా ఆలోచనలకు బ్రేక్ వేసింది. ఒకసారి ఇంట్లోకి తొంగిచూస్తే మాధవి దేవుడి దగ్గర గంట కొడుతుంది శ్రద్ధగా. అయినా తన ఏడుపు నేనెప్పుడూ చూడలేదు, వినలేదు. అది నా గొప్పతనం కాదు, తన పరిణితి.
మరెక్కడిదీ ఏడుపు? ''అమ్మో! ఓయమ్మో'' కీచుగొంతుతో ఏడుపూ అరుపూ కలగలిసి. మాధవి పూజ ముగించి 'టీ' పెట్టే పనిలో వుంది. ''వామ్మో! వాయ్యో!'' భీకరంగా ఈసారి.
''ఎక్కడ్నుంచి ఈ అరుపులు?!'' అయోమయంగా అడిగాను మాధవిని. మేముంటున్నది ఫస్ట్ ఫ్లోర్లో, కింది వాటా లోంచి అరుస్తున్నారేమోనని.
''వెనకవైపున్న గల్లీలో'' అంది కాజువల్‌గా.
ఆ వైపు తలుపు తీసి, అక్కడే ఆ చిన్న కారిడార్లోకొచ్చి నిలబడి పరిశీలనగా చూశాను. నిజానికది గల్లీ కాదు, పెద్ద నాలా మీద సిమెంట్ స్లాబు వేసి గల్లీలా మార్చారు. నాలాలోకి కొట్టుకొచ్చే ప్లాస్టిక్ వస్తువులూ ఇతరాలు ఆగిపోయేలా ఇనుపచువ్వలు అడ్డం పెట్టినందుకేమో చెత్త ఏరుకునేవాళ్లూ మున్సిపల్ సిబ్బందీ తప్ప వేరే వాళ్లెవరూ తిరుగాడని గల్లీ అది.
అరుపులకు దగ్గరగా వచ్చినందుకేమో కర్రుమంటుందో, గర్రుమంటుందో అక్షరాల్లో అనువదించలేని మొరటు స్వరంతో ఏడుస్తున్న మనిషి. పరికించి చూస్తే పరికిణీ మీద పెద్ద అంగీ వేసుకున్న ఆడపిల్ల. చింపిరి జుట్టూ, మురికి బట్టలూ, మైలపట్టిన ముఖం, భుజానికి వేలాడుతున్న పెద్ద ప్లాస్టిక్ సంచీ ఏ ఫ్రిడ్జ్ కవరో కావచ్చు తనకన్నా పెద్దగా భుజానికి వేలాడుతుంది. ఏడుస్తూ ఓ నలభై ఏళ్ల మనిషితో పోట్లాడుతుంది.
''నా డబ్బాలూ, నా సీసాలన్నీ గుంజుకున్నవ్... ఆ... ఆ... ఆ...'' ఏడుపుతో కూడి 'ఆ' అట్లా సాగుతూనే వుంది.
''ఊకోవే లమ్డీగుంట. దొంగేడుపులు ఏడవకు. నువ్వే నా సంచిల నుంచి దొంగులుకున్నవ్'' అన్నడు అతను.
మాట తీరు చూస్తే ఈ ప్రాంతం వారు కాదేమో అనిపించింది.
ఇంతలో మాధవి 'టీ' తెచ్చింది.
''ఆ అజ్ఞానపు మురికిమాటలు ఏం వింటారుగానీ లోపలికొచ్చి తాగండి. కాసేపైతే టీ కూడా సహించదు'' నిలబడలేనట్టు లోపలికి నడిచింది.
విచిత్రంగా చూశాను మాధవి వైపు. తను ఎం.ఏ. సోషల్ వర్క్ చేసి మున్సిపల్ డిపార్ట్మెంట్లో కమ్యునిటీ ఆర్గనైజర్‌గా పనిచేస్తుంది. ఎప్పుడూ మనుషుల్ని విభజించి మాట్లాడదు. జ్ఞానమూ, అజ్ఞానము అందరిలోపల సమానంగానే వుంటాయంటుంది. కాకపోతే అవి బయటపడే సందర్భాలు వేరువేరంటుంది. కరోనా కాలంలోనే మేమీ స్లమ్ ఏరియాకి మారాం. అదేమంటే నా అవసరం ఇక్కడే ఉందంటుంది. మార్పు కోరుకుంటే మమేకం అవ్వాల్సిందేనంటుంది.
అన్ని దుఃఖాలకూ కారణాలు వెతికే గుణం నాది. అందుకే ఆ అమ్మాయి ఏడవకూడదని కోరుకుంటూ రెండు గుటకలు మింగానో లేదో... సంచి లోపల్నుండి ఒక మురికి బాటిల్ తీసి తనను ఏడిపిస్తున్న మనిషి మీదకు విసిరింది ఆ అమ్మాయి.
''ఓసి నంజి నాగుంట....'' అరుస్తూ లేచి ఆ పిల్ల జుట్టు పట్టుకున్నడు.
ఆ మనిషి కూచున్నప్పుడు తెలియలేదుగానీ అతని భుజానికి పెద్ద సంచుంది. ఎరువుల సంచులు కలిపి కుట్టింది లాగుంది.
జుట్టు అతని చేతిలో వుండగానే ఆ పిల్ల లాఘవంగా వంగి కొన్ని డబ్బాలూ, సీసాలూ తన సంచిలో వేస్కుంది. అట్లా తీసుకోడానికి వంగింది కనక ఆ మనిషి వీపు మీద ఫెడీల్మని గుద్దాడేమో ''అమ్మా!'' అని అరుచుకుంటూ వీపునోసారి చరుచుకొని లేచి ఆ మనిషిని అంత దూరం నెట్టేసిందాపిల్ల.
రాత్రి తాగింది దిగలేదో, పొద్దున్నే మళ్లీ తాగాడో గానీ ఆ కాస్త బలానికే అంత దూరం పడి వగరుస్తున్నడు. లేచే ప్రయత్నమేం చెయ్యట్లేదు. దూరం నుంచి లూనా లాంటి బండొకటి కనిపించేసరికి ఆ మనిషి విచిత్రమైన శబ్దం చేసి కళ్లు మూసుకున్నట్టు చేసి మళ్లీ ఈల కాదు, అరుపు కాదు, సంకేతం లాంటిది కాబోలు... ఆ మోపెడ్ నాలా మీద మెల్లగా ప్రయాణిస్తూ అక్కడికే వచ్చింది.
నల్లగా, బక్కపలచగా ఇంకా టీనేజీ కూడా నిండనట్లున్న ఓ పదిహేడూ పద్దెనిమిదేళ్లుండే కుర్రాడొచ్చాడక్కడికి. ఆ బక్క శరీరానికి అతుక్కుపోయిన బట్టలూ, మెడలో దారాలూ దండలూ, ముంజేతికి ఏవో రంగురంగుల బ్యాండ్లూ... నాసిరకం వేషగాడిలాగా. నాకెందుకో కడుపులో తిప్పినా అతనేం చేస్తాడో చూద్దామని అక్కడే నిలబడ్డా.
''చిన్నా... ఈ నంజి, ఈ గుంట నా సీసాలన్నీ దొబ్బుకుందిరా'' మాట్లాడలేక రొప్పుతున్నడు.
'ఓహో! 'చిన్నా' ఏం చేస్తాడిప్పుడు?'' ఆసక్తిగా వుంది నాకు.
''ఏరు, ఎందుకు తీసుకున్నవే మా నాయన కాడ్నుంచి'' ఒక ఉరుకు ఉరికాడాపిల్ల మీదకు.
ఆ పిల్ల ముఖానికి చేతులడ్డం పెట్టుకొని వెనక్కి జరిగింది. మగపిల్లవాడైతే కలియబడేవాడేమో. కండ్లనీళ్లతో భయపడుతున్న ఆడపిల్లను చూసి ఆగాడు కాబోలు.
''ఒరేరు, నా సీసాలు తీసుకోరా'' ఉసిగొల్పుతున్నడు తండ్రి. ''ఈడ్నే వుండు వస్తా'' అని బండి స్టార్ట్ చేసుకొని పోయాడు చిన్నా.
ఆ బజార్లో మా ఇల్లే డెడ్‌ఎండ్. వెనకవైపు నుండి కూడా అదే చివరి ఇల్లు. తినడానికేమైనా పెడదామని ముందువైపుకు రమ్మన్నా. నా పిలుపుకు మొదట స్పందించినా తరువాతి పిలుపుకు స్పందించలేదు. ఇంకో ఐదు నిమిషాలు అట్లానే నిలబడి చూస్తూ నిలుచున్న. 'చిన్నా' రావడమూ అన్నిరకాల ఖాళీ మందుసీసాలను వాళ్ల నాయిన కళ్ల ముందు పెట్టడమూ జరిగిపోయింది. అన్ని సీసాలూ ఒక్కొక్కటిగా పైకెత్తి 'లక్కీడ్రాప్స్' కోసం వెతుక్కున్నాడా మనిషి.
''వుండు నాయినా'' అని చిన్నా ఆ బండికున్న బ్యాగులోంచి ఒక ప్లాస్టిక్ బాటిల్లో వున్న మద్యం తాగమని మూత తీసి చేతికిచ్చాడు. అదే అన్నమూ, నీళైనట్టు ఆబగా ఎత్తుకుని తాగుతున్నాడా మనిషి.
''కొట్టూ కొట్టు... ఈ నంజిముండను కొట్టు'' అనుకుంట భుజానికున్న సంచిని నాలా మీద పెట్టి దాన్నే ఆనుకుని కళ్లు మూసుకున్నడు. ఎదురెక్కుతున్న ఎండ సోయే లేదతనికి.
చిన్నా ఆ పిల్ల దగ్గరికెళ్లి ''ఈడిప్పుడే లేవడుగానీ నీ సంగతేందో చెప్పు'' అన్నడు నడుముల మీద చేతులుంచుకొని.
ఆ అమ్మాయి ఏడవబోయేంతలో అదే అదునుగా వాడు ఆ పిల్ల భుజం మీద చొరవగా చెయ్యేసి ''అట్టా సెయ్యొద్దురోరు'' అని చంపలు నిమిరాడు.
ఆ పిల్ల తేలికపడి నవ్విందేమో. చౌరవగా తండ్రి కాళ్ల దగ్గర వదిలేసిన మందు బాటిల్ ను ఆ పిల్లకిచ్చి తాగమన్నాడు. ఆ పిల్ల దాన్ని పక్కకు తోసి ''పొద్దున్నే యాడ తెచ్చినవ్'' అడిగింది.
''తిక్కమొకం. సిట్టింగ్ రూంలు ఊడిస్తే మందే... మందు. సీసలే... సీసలు''.
'తింటానికి' సైగ చేసి చూపింది.
''తింటానికాడేం లేవే తింగరి. ఉండు నీకే మన్న తెస్త. నువ్వీ డనే వుండు'' అని సెల్ ఫోన్లో ఏదో చూడమని చెప్పి బండిమీద రెండు నిమిషాల్లో ఇడ్లీల్లాంటివేవో తెచ్చాడు.
మందు బాటిల్ ఓపెన్ చేసి గుప్పెట్లోకి కొద్దిగా ఒంచుకొని చేతులు కడుక్కుని మురికి అంగీకి తుడుచుకొని సిగ్గుపడుతూ పొట్లం అందుకొని తినడం మొదలుపెట్టింది. చిన్నా ఆ పిల్లనే ఆనుకొని ఫోన్లో ఏదో చూపిస్తూ వెనకవైపు నించి ఆ పిల్ల ఎద మీద చేతులేస్తూ ఆక్రమిస్తున్నాడు. తన్మయంగా కళ్లు మూస్తూ తెరుస్తూ తింటూ నవ్వుతుందామె. వెనకవైపు నుండి వేసిన చేతులు పట్టుబిగిస్తున్నయి. ఏదో అఘాయిత్యం చూడాల్సి వచ్చేటట్టుందని పూలకుండిలోంచి రంగు గులకరాయి తీసి వాళ్ల దగ్గర పడేటట్టు విసిరిన.
క్షణాల్లో మోపెడ్ మాత్రం వెళ్లిపోయింది. ఆ పిల్ల పరుగెత్తుకుంటూ ఆ నాలా గల్లీ దాటిపోవడం చూసి నిట్టూర్చాను. దేవుడా! బాల్యాన్ని భద్రంగా కాపాడలేమా..!
లోపలికొచ్చి చూసిందంతా మాధవికి చెప్పిన.
''ఆ అధోజగత్ జీవితాల్లో మీరు చూసింది చాలా చిన్న విషయం. వాళ్లీ మధ్యనే అటవీ ప్రాంతం నుండి వలసొచ్చారిక్కడికి. మా ఆఫీస్ పక్కనే వున్న గ్రౌండ్లో గుడిసెలేసుకొని అద్దాలూ, పౌడర్లూ, ప్లాస్టిక్ సామానూ అమ్ముకుంటమని బండ్లు పెట్టుకున్నరు. ముందాస్థలం ఖాళీ చేయమని వార్నింగిచ్చి ఎక్కడైనా ఫుట్‌పాత్‌ల దగ్గర షెడ్లలో దుకాణం పెట్టుకోండని చెప్పా వాళ్లకు. ఒక్క గుర్తింపుకార్డు కూడా వెంట తెచ్చుకోలేదు వాళ్లు. అక్షర జ్ఞానం లేదు. చెత్త ఏరుకోవడం, మెకానిక్ షెడ్లో పనిచేయడం, మద్యం దుకాణాలు శుభ్రం చేయడం, చిన్న చిన్న ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకోవడమే గొప్ప వ్యాపారం వాళ్లకు. టీనేజ్‌లో పిల్లల్ని కనడం, ముప్పై నలభైల్లో అవ్వా, తాత అనిపించుకోవడం. యాభై దాటితే పండుముసలి వాళ్ల ప్రాణాలకు. బాహ్య ప్రపంచానికొచ్చి పనిచేసేది సెల్ ఫోన్ల కోసం, మద్యం కోసం, ఇంకా కష్టపడితే బైకుల కోసం. వర్షాలు పడ్డంక మళ్లీ అడవికెళ్లిపోతరు. చదువు నేర్చుకుందామని కోరుకోరు గానీ సెల్ ఫోన్లూ మద్యం మాత్రం కోరుకుంటరు. ఆడవాళ్లు కనీసం బట్టలూ, తినడానికి పప్పులో ఉప్పులో సంపాదించుకో వాలనుకుంటరు. ఈ వలస గుంపులో వాళ్లను నమ్మి వెంటొచ్చిన ఆడపిల్లలను వాళ్లే కాటేయడం అన్నిటికన్న పెద్ద విషాదం.'' తన బరువు దించుకొని నాకెక్కిచ్చింది మాధవి.
లి లి లి
ఆ రోజు ఆదివారం. క్లీనింగ్, మార్కెట్ పనులు, సర్దుకోవడాలూ అయ్యేసరికి పదకొండయ్యింది. అప్పుడు పెట్టాను టీవీ. నా అలవాటు ప్రకారం న్యూస్ ఛానల్సే తిప్పుతున్నా. అన్నింటా ఒకటే న్యూస్ - అనగనగా ఒక పబ్బు. నూటయాభై మంది వున్నారక్కడ. డ్రగ్స్ కూడా పట్టుబడ్డాయి. కొందరు బడాబాబుల పిల్లలు, బడాబాబులూ, బడాయి వ్యాపారులూ... గాయిగాయి... గత్తర గత్తర. మాధవితో డిస్కస్ చేద్దామంటే చీరలకు గంజి పెట్టుకుంటుంది. పలకరించి పని చెడగొట్టొద్దని అనిల్‌కు ఫోన్ కలిపిన. పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తాడతను. ఎక్స్ ట్రా ఇన్ఫర్మేషన్లో ఓ కిక్కుంటుందికదా. అదో బలహీనత. అనిల్ ఒక చిట్టా విప్పాడబ్బో.... ఎంత మందో గొప్ప బలహీనులు!
''ఎందుకిట్లా చేస్తారంటావ్'' అడిగా.
''డబ్బు నాయనా డబ్బు. డబ్బు పెద్ద జబ్బు''
''అంతా డబ్బున్న వాళ్లేనా''
''ఈ మధ్య ఒక వర్గం పొడుచుకొచ్చిందిగా సమాజంలో మిథ్యాధనవంతులు. వాళ్లు కూడా వున్నారిందులో'' అన్నాడు.
'మిథ్యాధనవంతులంటే?'' అర్థం కాలేదన్నా.
''అదే కోటి, అరకోటి ప్యాకేజీలున్న జీవులు. విచిత్రం ఏందంటే కూలిపోతే కుప్పైపోయే బ్యాచిలివి. సోపతికి పోయి ఆగమైనోళ్లనుకో''
''సోపతికి ఎవడూ డ్రగ్స్ తీసుకోడు. యిష్టముంటేనే తీసుకుంటరు'' అన్నా అది చిన్న విషయం కాదన్నట్టు.
''నేను చెప్పేది అదేరా. తొలి దొంగతనంలోనే పట్టుబడ ిపోవడం లాంటిది''
''మరి ఆడపిల్లల సంగతేంటి'' అన్నాను.
''రిలాక్స్ కావడానికొచ్చినమంటరు''
''రిలాక్స్ కావడానికి వాళ్లేమన్న వారమంత బండలు మోసిన్రా, బట్టలుతికిన్రా''
''పనిలేని బోరింగ్స్ కూడా ఒక హింసేకదా. డబ్బునీ టైంనీ ఎంతగా స్పాయిల్ చేశామనడంలో కూడా పోటీ వుంటుందేమో పై వర్గాల్లో. మనకు తెలియని అగాధాలెన్నున్నాయో వాళ్ల జీవితాల్లో కూడా'' అన్నాడు.
''ఎవరికన్నా సేవలు చెయ్యొచ్చు కదా. పదిమందికి ఫ్రీగా చదువు చెప్పొచ్చు. చిన్న కుటీర పరిశ్రమ పెట్టి పది మందికి పనివ్వొచ్చు. ఇంట్లో కూరగాయలు పండించి పదిమందికి పెట్టొచ్చు''
''ఊకోరా! ప్రపంచం నీలాగా రీజనబుల్ సక్సెస్‌ను కోరుకోదు. ఎక్స్ట్రా కోరుకుంటది. నువ్వు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూపీలాగినట్టు. హాయిగ వర్క్ ఫ్రం హోదా చేసుకోక నీకెందుకురా యివన్నీ. అయినా నీ కొడుకును దూరంగా పల్లెటూర్లో చదివిస్తున్నవ్ కదా. నీకెందుకురా భయం'' అన్నాడు.
వాడ్ని విసిగించడం నాకిష్టం లేదు. అందుకే ఫోన్ కట్ చేశా.
వార్తా ప్రవాహం సాగుతూనే వుంది. ఎన్నో లంకెలు, ఎన్నెన్నో లింకులు. ''మా పిల్లలు మంచివాళ్లు, అమాయకులు...'' అవును అందరూ శాకాహారులే. కానీ కోడి బొక్కలెందుకు దొరికినయో... ఛానళ్ల దాహం తీరుతున్నట్లుంది. డబ్బు సంపాదనలో వున్న శ్రద్ధ పిల్లల మీద లేదని విశ్లేషణ చేస్తున్నరు...
హాల్లోకొచ్చిన మాధవి కాసేపు న్యూస్ చూసి టీవీ బంద్ చేసింది.
''అదేంది, ఇంపార్టెంట్ న్యూసొ స్తుంటే''
''ఎవరికి ఇంపా ర్టెంట్... మీకా?'' నేనేం మాట్లాడలేదు.
''మా ఫ్రెండ్ కొడుకూ, వాళ్ల కజిన్ కూతురూ వున్నారందులో. మా గ్రూప్‌లో మెసేజ్ పెట్టింది'' అంది మాధవి.
''ఏమని''
''మా పిల్లలున్నారని ఎవరేమీ అనుకోవద్దు. మా పిల్లల ప్రైవసీని మేమడ్డుకోం. ఎదురుదెబ్బలు తింటేనే గట్టిగైతరనుకుంటున్నం'' అని పెట్టింది.
వాళ్ల గురించి ఆలోచించడం కందకులేని దురద కత్తిపీటకన్నట్లుంది.
''యువతను పెడదోవ పట్టిస్తున్నరు కదా. పైవాళ్లను చూసి మధ్యతరగతి పిల్లలూ నాశనమైపోతున్నరు కదా'' అన్నాను బాధగా.
'' 'నాశనం' అన్న తరువాత పైతరగతీ, మధ్యతరగతీ, మీరిందాక చూసిన దిగువ తరగతనేం లేవండీ. దీంట్లో చిక్కుకున్న తరువాత వాళ్ల భవిష్యత్తు ఎంత ఒత్తిడికి గురవుతుందో ఊహించలేము'' తనూ బాధపడుతూనే అంది.
''కాలాన్ని కాస్త స్పెషల్‌గా కరిగించాలనుకోవడమే వాళ్ల సమస్య కావచ్చు''
''కావచ్చు''
''మరి మంచి కాలక్షేపం కోసం ఏం చెయ్యాలి''
''మీలాగా వర్ ఫ్రం హోం చెయ్యాలి. మంచి పుస్తకాలు ముందేసుకుని చదవాలి'' అరుదైన మందహాసం చేసింది మాధవి.
మరుసటి రోజు పొద్దున్నే వెనకవైపు మళ్లీ గొడవ వినపడింది.
''చిన్నా... చిన్నా'' అరుస్తోందాపిల్ల.
చిన్నా మోపెడ్ మీదొచ్చి తండ్రిని దూరంగా తరిమి వెనక్కొచ్చాడు.
ఆ పిల్ల ముద్దుగా నవ్వింది. చిన్నా ఆ పిల్ల వెనకవైపుకు చేరి ఎదపై చేతులేసి కావలసిందేదో వెతుక్కుంటున్నడు.
అంతకన్నా 'దిగజారు' చూసే సంస్కారం నాకు లేదు గానీ ఎవడైతేనేం... ఎచటైతేనేం... ఎప్పుడైతేనేం.... పోటీపడి దిగజారా... జారా... జారా...
- కోట్ల వనజాత