Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందగోకులం అందమైన పల్లెటూరు. ఎక్కువ మంది వ్యవసాయం చేసేవారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, అందరూ కలిసి మెలిసి ఉండే వారు. వరి కోతలు పూర్తిచేసి, ధాన్యాన్ని రోడ్ల పైన కుప్పలుగా పోసి ఆర పెడుతున్నారు. ప్రధాన రహదారిపై ఎక్కడ చూసినా వరిధాన్యం కనిపిస్తూ ఉంది. రోడ్డుపైన వాహనాలు వెళ్లడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. ఎవరూ పట్టించుకునే వారు కాదు. ఉదయం నుండి సాయంకాలం వరకు ఆరబోసి, రాత్రివేళల్లో కుప్పలుగా పోసి, ధాన్యపు కుప్పలపై సంచులను కప్పి తమ, తమ ఇళ్లకు వెళ్లిపోయే వారు.
సూర్య తేజకు పాతికేళ్ళ వయసు. ఇటీవలే కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. దీపావళి పండుగకు అత్తవారింటికి వెళ్ళి సరదాగా రెండు రోజులు గడిపి, తిరిగి తన సొంత ఊరికి రాత్రిపూట ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఎంతో ఆనందంగా బయలుదేరిన సూర్యతేజ ఇంకో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటానని చరవాణి ద్వారా తన తల్లిదండ్రులకు తెలియజేశాడు. ఇంతలోనే అనుకోని ఉపద్రవం ముంచుకు వచ్చింది. రోడ్డుపైన కుప్పలుగా పోసిన ధాన్యాన్ని సరిగ్గా చూసుకోక తన ద్విచక్ర వాహనం ధాన్యం కుప్పలపైకి దూసుకొచ్చింది. ఫలితంగా సూర్యతేజ స్పహ తప్పి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయాలు తగిలాయి.
రోడ్డుమీద అపస్మారక స్థితిలో ఉన్న సూర్య తేజను చూసి అక్కడున్న ప్రజలు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎన్నో రకాల ప్రయత్నాలు చేసిన సూర్యతేజలో ఎలాంటి మార్పు రాలేదు. భార్య, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తాము ఏమి చేయలేని పరిస్థితి అని వైద్యులు తేల్చి చెప్పారు. ఇంటికి తీసుకెళ్లమని సలహా ఇచ్చారు.
అచేతనంగా పడి ఉన్న సూర్యతేజకు భార్య, తల్లిదండ్రులు ప్రతిరోజు ఎన్నో సపర్యలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. మందులు వేసినా ఫలితం లేదు. చివరికి అతని మెదడు పని చేయడం తగ్గిపోయి, పూర్తిగా అన్ని మర్చిపోయి చిన్నపిల్లాడిలా మారిపోయాడు. అతని పరిస్థితి ఆ కుటుంబాన్ని ఎంతో కుంగదీసింది. రోడ్డుమీద ఉన్న ధాన్యపు కుప్పల వల్లే తమ కొడుకు అచేతన స్థితిలో ఉన్నడని ఇకపై, ఆలాంటి ప్రమాదాలు జరగకూడదని రోడ్డుమీద ఎవరు ధాన్యాన్ని ఆర పెట్టకూడదని గ్రామస్తులను సూర్య తేజ తల్లిదండ్రులు వేడుకున్నారు. గ్రామస్తులందరూ సరేనని ధాన్యాన్ని రోడ్డు మీద ఆర బెట్టడం మానేశారు.
నీతి : రోడ్డు మీద ధాన్యం కుప్పలు వద్దు, విలువైన జీవితం ముద్దు
- యాడవరం చంద్రకాంత్ గౌడ్, 9441762105