అమ్మాయిల నవ్వులు, అబ్బాయిల అల్లర్లతో యూనివర్సిటీ కళకళలాడుతుంది. ఆ రంగుల కళకళల గలగలల్ని తమ హదయాల్లో నింపుకొని వారు చేసే ఎంజారు అంతా ఇంతా కాదు. ఎప్పుడో తప్ప చదవని పేపర్. చదివినా సినిమా పేజీ, స్పోర్ట్స్ పేజీ. మొత్తం పేపర్లో ఇవి మాత్రమే మనకు పనికొచ్చేవి అనుకునే ఓ తొట్టిగ్యాంగ్. సాయిపల్లవి మొటిమెలు, సమంత నవ్వులు, అనుష్క హైట్, తమన్న వైట్ ఇవే వారి టైం పాస్ ముచ్చట్లు. ఇక్కడే ఇంకొకటి చెప్పాలి. అదే ఇందాక స్పోర్ట్స్ పేజీ అనుకున్నాం కదా! దాన్ని కొంచెం సవరించుకుని క్రికెట్ పేజీ అని చదువుకోవాలి. ఇది కొంతమేరకే! ఇప్పుడు అంతా నయాజమాన. ఆటలైనా, పాటలైనా, బొమ్మలైనా, రెమ్మలైనా అన్నీ ఫోన్లోనే. నోటిఫికేషన్ వచ్చుడూ నోరు తెరిచి చూసుడు.
క్లాస్ రూమ్‌లో కూర్చున్నారు అందరూ. ఇంకా ప్రొఫెసర్ రాలేదు. ఈలోపే క్లాసులోకి ఒక అమ్మాయిల గుంపు వచ్చింది.
''ఫ్రెండ్స్ విరు ఆర్ కమింగ్ ఫ్రమ్ సేవ్ నల్లమల మూమెంట్. రోజు రోజుకు వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్నది. కారణం అడవులు అంతమవడమే. ప్రపంచ విస్తీర్ణంలో అడవులు 32 శాతం ఉండాలి. కానీ 30 శాతంగానే ఉన్నది. 1952 అటవీ చట్టం ప్రకారం మన దేశ విస్తీర్ణంలో 33 శాతం అడవులుండాలి. కానీ 21.67 శాతం అడవులు మాత్రమే ఉన్నాయి. అందులో మన తెలంగాణాలో 18.36 శాతం మాత్రమే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో తెలుగు నేల పీల్చుకుంటున్న దాంట్లో సగానికి పైగా ఆక్సిజన్ అందించగలిగేవి నల్లమల అడవులు. అలాంటి అడవును యురేనియం మైనింగ్ చేసి ధ్వంసం చేయబో తున్నాయి ప్రభుత్వాలు. ఆ అడవుల్లో ఆదిమజాతి అయిన చెంచులు ఉన్నారు. అత్యంత జీవ వైవిధ్య సంపద ఉన్నది. అది వదిలేసి యురేనియం కోసం నల్లమలకు ఉరేయ పూనుకు న్నారు. ఇలాంటి ప్రమాదకర చర్యలకు వ్యతిరేకంగా విశ్వవిద్యా లయ విద్యార్ధులుగా మనం స్పందించాలి. లేదంటే రేపటి తరం మాకు ఆక్సీజన్ ఇచ్చే అడవుల్ని మిగిలించలేకపోయారా! ఆ అడ వుల్ని తొవ్వి పారేస్తుంటే ఆపలేని చదువులు మీకెందుకని అడిగితే! మనం నేరస్తుల్లా వాళ్ళ ముందు నిలబడుదామా? ఆలోచించండి.'' అని బ్లాక్ జీన్స్ రెడ్‌షర్ట్ వేసుకున్న అమ్మాయి గలగలా మాట్లాడుతుంది.
''ఈ సోది మనకెందుకురా! బయటకు వెళ్లాం పదా'' అన్నాడు ఒకడు.
''అరేరు ఆగురా ఆ అమ్మాయి చాలా బాగుంది. పైగా ఫారెస్ట్, ఆక్సీజన్, నల్లమల అని ఏదో చెప్తుంది విందాం.'' అన్నాడు సాహస్.
ఎత్తైన మనిషి, ఒత్తైన జుట్టు, ఆకాశం లాంటి కళ్ళు, లోతైన చూపులు, సూటైన పలుకులు, ఘాటైన మాటలు. మట్టి గంధాన్ని ఫౌడర్లా పూసుకుని, అచ్చం పచ్చని అడవే క్లాసులోకి వచ్చినట్టుంది. పాతాళ గంగ పరవళ్ళలా, మల్లెలతీర్ధం జల పాతంలా మాట్లాడుతుంది. ఆ అమ్మాయి వెళ్ళిపోయి చాలా సేపయింది. కానీ సాహస్ ఐ స్క్రీన్ మీద ఇంకా ఆ అమ్మాయే కనిపిస్తుంది.
విద్యార్థులంతా కథలు రాయాలనీ, అలా రాసిన కథల్ని యూనివర్సిటీ మ్యాగజైన్లో ముద్రిస్తామని ప్రకటిస్తూ క్లాస్‌లో నోటీస్ చదివి వినిపించారు. ఎలాగైనా ఆ అమ్మాయికి నచ్చేలా కథరాసి తన దష్టిలో పడాలని అనుకున్నాడు. ఎంజారు చేయడమే లైఫ్ అని ఎగిరిదునికే జీవితానికి కథ రాయడం ఓ పెద్ద టాస్క్. నాలుగు రోజులైతున్నా పెన్ను కదలడం లేదు.
ఆలోచనలు ఊయలలా ఊగుతున్నాయి కానీ ఊపిరి పోసుకొని రావడం లేదు. ఎటూ తోచక టీ తాగుదామని రోడ్ మీదకి నడిచాడు. రోడ్డు మొత్తం కార్లు, బైక్ లతో నిండి ఉన్నది. మనిషి నడవడానికి కొంచెం కూడా ప్లేస్ లేదు. ఫూట్ పాత్ అనేది చిన్నప్పుడు ఎప్పుడో ఆరో తరగతి సోషల్ బుక్ లో ట్రాఫిక్ చాప్టర్ లో చదువుకున్న గుర్తు.
కానీ ఇప్పుడు అలాంటి ఫూట్ పాత్ ఏదీ కనిపించడం లేదు. అచ్చం వైకుంఠపాళిలో పాములను తప్పించుకున్నట్టే వచ్చి పోయే వాహనాలను తప్పించుకుంటూ నడుస్తున్నాడు సాహస్. ప్రతి రోజు బైక్‌పై తిరుగుతుంటే ఏమీ అర్ధం కాలేదు. రోజూ నడిచేవాళ్ళ పరిస్థితి ఇంత దారుణమా! అని అనుకుంటుండగానే ఫోన్ రింగ్ అయింది.
''హలో.. హా.. నేను కూడా అక్కడికే వస్తున్న టీ తాగడానికి. ఉండండి సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గరకి వచ్చిన.'' ఆన్సర్ చేశాడు సాహస్.
''నాల్గు లెమన్ టీ విత్ హనీ'' ఆర్డర్ చేశారు ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఆస్వాదిస్తూ అమతం లెక్క తాగుతున్నారు. ఇంత లోనే బ్లాక్ షర్ట్ బ్లూ జీన్స్ వేసుకుని, లీవ్ చేసిన హెయిర్‌ను సవరిస్తూ అక్కడికి ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్‌తో వచ్చి 'త్రీ లెమన్'' ఆర్డర్ చేసింది. ''హారు.. మొన్న మీ స్పీచ్ బాగుంది. మై నేమ్ ఈజ్ సాహస్. యువర్ నేమ్?''
''థాంక్యూ. నా పేరు సహజ'' ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. టీ తీసుకుని తన ఫ్రెండ్స్‌తో ముచ్చట్లలో మునిగిపోయింది సహజ. ''ఈ టైమ్‌కు మన గర్ల్స్ బ్యాచ్ పార్క్‌కు వస్తామన్నారు. వెల్దాం పద'' అన్నారు సాహస్ ఫ్రెండ్స్. ''లేదు నేను పక్కన లైబ్రరీకి వెళ్ళాలి. ఆ తర్వాత రూమ్‌కు వెళ్తాను'' అన్నాడు సాహస్. ''వీడికేదో అయిందిరా బాబోరు. ప్రతిసారి పార్క్ ఎప్పుడు వెళ్తాం అనేవాడు. కొత్తగా ఈ లైబ్రరీ ఏందిరా బాబు! కొంచెం అతి అనిపించడం లేదా?'' అడిగారు. ''అతి లేదు గితి లేదు. మీరు వెళ్ళండి.'' లైబ్రరీలోకి నడిచాడు.
పుస్తకాల్లో పుస్తకమై, అక్షరాల్లో అక్షరంలా కలిసిపోయాడు సాహస్. అలా ఎంతసేపు ఉన్నాడో ఏమో తనని తాను మర్చిపోయాడు. ''సర్ టైం అయిపోయింది'' అన్నాడు లైబ్రేరియన్ దగ్గరికొచ్చి. లేచి బయటకు నడుస్తుండగా టేబుల్ మీద పడి ఉన్న నవతెలంగాణ పేపర్లో 'అడవిలో కుట్ర' యురేనియం కోసం అడవి బిడ్డల తరలించే ప్రయత్నం అని పతాక శీర్షికగా వచ్చిన వార్త చూసి ఆగిపోయాడు సాహస్.
సాహస్ తన మిత్రులతో కలిసి ఎన్సీసి గేటు ముందు చారు తాగి బయలుదేరి ఆర్ట్స్ కాలేజీ వైపు వెళ్తున్నారు. కాలేజీ దగ్గరికి వెళ్తా ఉంటే ఏదో ఉపన్యాస ధ్వని వారి చెవులకు తాకుతుంది. దాంతో గాలి ముచ్చట్లాపి, గాలి వాటానికి చెవొగ్గి నడుస్తున్నారు. ఓ సన్నని పదునైన గొంతు వారికి వినిపిస్తుంది. అక్కడ మాట్లాడుతున్నది ఎవరో కానీ పొత్తిళ్ళలో బిడ్డలకు తన తల్లి జోలపాడుతూ రేపటి కర్తవ్యాన్ని హితబోధ చేస్తున్నట్టున్నది. హాస్టల్ పోవాల్సిన వారు ఆర్ట్స్ కాలేజీ వైపు నడిచారు. వరి మడిలోకి నీరు పారిస్తున్నప్పుడు వచ్చే మెది చప్పుడులా ఓ బక్క పలచని ప్రొఫెసర్ ప్రసంగ ప్రవాహం శబ్ద తరంగమై ఉత్తేజపరుస్తుంది. రాత్రి పదవుతున్నా విద్యార్థులంతా సేవ్ నల్లమల ప్లకార్డ్స్ పట్టుకుని గుంపులుగా ఉన్నారు.
''మా రక్తం మరుగుతోంది సలసల కాపాడుకుందాం రారా నల్లమల ఈ నేల ఈ గాలి ఈ మట్టిని వదిలి రాను రానంటుంది మా పాదం కదిలి...'' పాట బ్యా క్లౌండ్ లో వినిపిస్తుండగా ఫ్లాష్ మాబ్ వేస్తున్నారు. నల్లమల జింకలా ఎగిరి దునుకుతుంది సహజ. సాహస్ చూపంతా సహజపైనే ఉంది. మూలవాసుల ధ్వనిని వినిపించేందుకే ఉన్న గుబురు గడ్డం ముసలాయన మాట్లాడాక సభ ముగిసింది.
''హలో మేడం! మీరు ఉపన్యాసమే కాదు డాన్స్ కూడా చేస్తారా?''
''హారు సాహస్! పాటలు కూడా పాడుతా నీకేమన్నా అభ్యంతరమా!''
''అయితే సహజ గారు ఆల్ రౌండర్ అన్నమాట''
''అఫ్కోర్స్'' ''సహజ గారు వి వాంట్ టూ జాయిన్ యువర్ యాక్టివిటీస్'' ''వై నాట్ ఫ్రెండ్! బట్ యూ స్టాప్ గారూ ఓకేనా! త్వరలో నల్లమల మోటర్ సైకిల్ యాత్ర ఉంది. వివరాలు మీకు తెలియజేస్తాము. మీ పేర్లు, ఫోన్ నంబర్స్ ఈ నోట్‌బుక్‌లో రాసి వెళ్ళండి.''
లక్షల మంది చదువుల సావిత్రిబాయి. తాజ్‌మహల్‌ను మించిన ప్రేమల చిహ్నం. వందలాది నెత్తుటి పోరాటాల నిలువెత్తు సాక్ష్యం. వందేళ్ళ అక్షర మహావక్షం ఆర్ట్స్ కాలేజీ సాక్షిగ సహజతో కలిసి పనిచేస్తానని చెప్పడం, తను ఒప్పుకోవడం జరిగిపోయింది. పైగా ఫ్రెండ్ అని దగ్గరగా సంబోధించడంతో సాహస్ ఆనందానికి హద్దులు లేవు. తన ఫ్రెండ్స్‌ను కూడా నల్లమల యాక్టివిటీలో పాల్గొనమన్నాడు. నీవంటే సహజ కోసం పార్టిసిపేట్ చేస్తావురా. మాకేం అవసరం అని ఆట పట్టిస్తున్నాడు తన ఫ్రెండ్ అజరు.
''రేరు సహజ కోసం స్టార్ట్ అయిన మాట వాస్తవమే కావచ్చు. కానీ ఇందాకటి సభలో పాల్గొన్నాక, ప్లాష్ మాబ్ చూశాక సిన్సియర్ గానే ఆ ఫైట్‌లో నేనూ ఉండాలని నిర్ణయించుకున్నా.'' ఫ్రెండ్స్‌కు తేల్చి చెప్పేశాడు సాహస్.
'డియర్ ఫ్రెండ్స్! ఎల్లుండి నుంచి నల్లమల మోటార్ సైకిల్ యాత్ర స్టార్ట్ అవుతుంది. అన్ని చెంచు పెంటలను చుడుతూ సాగే ఈ కార్యక్రమం మన్ననూర్‌లో స్టార్ట్ అయ్యి నాగార్జున సాగర్‌లో ముగుస్తుంది. అటవీ రక్షణ కోసం అభిరుచి కలిగిన వారందరినీ ఆహ్వానిస్తున్నాం' అని మెసేజ్ వచ్చింది. ఎలా పోవాలి? ఎప్పుడు పోవాలి? ఎక్కడ కలుసుకోవాలి? అనే ఆత్రుతతో ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురుచూస్తున్నాడు సాహస్. కానీ పోలీసులకు రేయిపగలుకు తేడా లేదు కదా! ప్రోగ్రాం జరగకుండా ఉండేందుకు హాస్టల్స్ మీదపడి ముఖ్యమైన క్యాడర్‌ను ఎత్తుకపోయారు. తెల్లారింది కానీ ఆర్ట్స్ కాలేజీ ముందు ఆర్గనైజర్స్ ఎవరూ కనపడట్లేదు. మెసేజ్ వచ్చిన నంబర్‌కు ఫోన్ ట్రై చేయగా చేయగా సాయంత్రం కలిసింది.
''హలో.. నేను సాహస్. సిగల్ సరిగా లేనట్లుంది. క్యాంపస్ లో ఉన్న. ఇక్కడ సిగల్ సరిగా రాదు కదా!'' ''హా..సరే మీ నంబర్ ఉంది. చెప్పు'' అన్నది సహజ. తన వాయిస్ గుర్తు పట్టాడు. ''నేను రేపు నల్లమలకు రావాలనుకుంటున్నాను. ఎక్కడకి రావాలి? ఎప్పుడు బయలుదేరాలి?'' ''అది తర్వాత ఇప్పుడయితే రివోల్ట్ కేఫ్ ఇందిరాపార్క్ దగ్గరికి రండి!'' ''ఆ వస్తాను'' సాహస్ కేఫ్ దగ్గరికి వెళ్ళాడు.
కానీ అక్కడ సహజ లేదు. ఫోన్ కలవడం లేదు. అటూ ఇటూ ఎటుచూసినా తనక్కావలసిన వాళ్ళెవరూ కనపడట్లేరు. ఎదురుగా రోడ్‌కి అవతలివైపు పానీపురీ బండి దగ్గర ఆకలి పేగులను సమాధానపరుస్తూ సాహస్ను అబ్జర్వ్ చేస్తుంది. అక్కడ నుంచి మెరుపు వేగంతో వచ్చింది సహజ. ''చలో సాహస్ బండి తిరు వెళ్దాం. ఇవి బండి కవర్లో పెట్టి బండి స్టార్ట్ చెరు'' అన్నది స్కార్ఫ్ కట్టుకుంటూ. ''ఎక్కడికి?''
''చెప్తా ముందు స్టార్ట్ చెరు'' బుల్లెట్ ఎక్కి కూర్చున్నది. నడుపుతున్నది సాహస్ అయినా సహజ డైరెక్షన్లో బండిపోతూనే ఉన్నది. సాహస్ ఫోన్ తీసుకుని కాల్స్ మాట్లాడుతున్నది. శ్రీశైలం రూట్‌కి వెళ్ళేసరికి ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గర దూరంగా కొన్ని బైక్స్ కనిపిస్తున్నాయి. ఆకాశం మబ్బుల బిస్కెట్స్ తింటుంటే పొడి రాలినట్లు వర్షం చినుకులు రాలుతున్నాయి. అంతలోపే ఒక ఫిజియోథెరపి డాక్టర్, అగ్రికల్చర్, హార్టికల్చర్ యూనివర్సిటీ స్టూడెంట్స్, కొన్ని జిల్లాల క్యాడర్స్ అందరూ అక్కడికి చేరుకుని ఉన్నారు. బైక్ వాళ్ళ దగ్గరికి చేరుకుని ఆగింది. గిర్రున కాలు తిప్పి దిగిన సహజ వారితో మాట్లాడుతూ స్కార్ఫ్ విప్పింది. ఆకాశానికి ఐబ్రోస్ గీసినట్లు, అమాయకత్వానికి ఫేషియల్ చేసినట్లు, అడవికి కాటుక దిద్దినట్లు, ప్రేమకు గోరింటాకు అద్దినట్లు కనిపిస్తుంది సహజ ఆ వర్షం తుంపర్లలో.
''ఫ్రెండ్స్ ఇతను సాహస్. ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఇతను కలిసి వచ్చాం. మనం ఈ వర్షాన్ని దాటుకుని, పోలీసులను తప్పించుకుంటూ ఈ రాత్రికే మన్ననూర్ చేరుకోవాలి. సూర్యుడితో పోటీపడి పొద్దున్నే చెంచు పెంటల్లో ఉండాలి. మనవాళ్ళను ఎంత మందిని అరెస్ట్ చేసినా మన కార్యక్రమం మాత్రం ఆపకుండా కొనసాగించాలి. యురేనియం తొవ్వితే ఏమవుద్దీ చెప్పి ఇక్కడి ప్రజలందరినీ చైతన్యం చేయడమే ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం. దానికి సంబంధించిన ఫోటోస్, మెటీరియల్ మా బైక్‌లో ఉన్నాయి. మనం ఒకేసారి గుంపుగా వెళితే పోలీసులు కందు కూరు, ఆమనగల్, డిండీలలో మనకోసం కాపుకాస్తారు. కాబట్టి నేను సాహస్ ముందు వెళ్తూ వాట్సప్ గ్రూప్‌లో అప్డేట్ చేస్తుంటాం. మీరు ఒక్కో బైక్‌కు కిలోమీటరు డిస్టెన్స్ మెయింటెన్ చేస్తూ రండి.'' అని చెప్పి సహజ, సాహస్ బయలుదేరారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా కందుకూరు, ఆమనగల్ దాటారు. చెక్ పోస్టుల దగ్గర పోలీసులున్నా డిస్టెన్స్ ఎత్తుగడ సక్సెస్ అవడంతో ఆపలేదు.
కానీ డిండీలోకి ఎంటర్ అవుతుండగానే పొలీసుల మోహరింపు ఎక్కువగా ఉన్నది. ''సహజ ముందు పోలీసులు న్నారు ఏం చేద్దాం?''
''సహజ.. ఊ.. ఏంటి సహజ! చెప్పు సహజ.'' ''వెనక్కి తిరిగి చూడకుండా వెళ్తూనే ఉండు సాహస్. ఒక వేళ వాళ్ళాపితే మాత్రం ఆపు. మిగతాది నేను చూసుకుంట. నువ్వేమీ మాట్లాడకు.''
పోలీసులున్నది ముందే గమనించిన సహజ మెరుపు వేగంతో వెనుక తన సమయస్ఫూర్తికి సాన పెడుతుంది. ఒకవైపు సాహస్ ప్రశ్నలకి సమాధానం చెప్తూనే హెయిర్ లీవ్ చేసింది. పైనున్న జీన్స్ షర్ట్ తీసి స్లీవ్ లెస్ టీ షర్ట్లోకి మారిపోయింది. ఎక్కన్నుంచి తీసిందో తెలియదు కానీ గాగుల్స్ పెట్టుకుని మోడ్రన్‌గా తయారైంది. అంతకు ముందే వాట్సప్ గ్రూప్‌లో యీ అని మెసేజ్ పెట్టేసింది. ఇంతలోనే పోలీసులు బైక్ ఆపమని చెరు చూపుతున్నారు. సాహస్ టెన్షన్‌కు గురైతుండగానే సహజ రెండు చేతులు భుజాల మీదుగా సాహస్ మెడను చుట్టుకున్నాయి.
''హేరు ఆపండి.. ఆపండి.. ఓ అమ్మాయి ఉందా! ఇంత నైట్ ఎటు వెళ్తున్నారు?'' ''చందంపేట అంకుల్. ఇంటికి వెళ్తున్నం'' అన్నది సహజ ''వెళ్ళండి..వెళ్ళండమ్మా. ఇంత లేటుగా వస్తారా! ఇప్పటికే చాలా లేటైంది త్వరగా వెళ్ళండి.'' అని చెప్పి పంపించారు పోలీసులు. డిండి ప్రాజెక్ట్ దాటి కొద్ది దూరం వచ్చాక పక్కకు బైక్ ఆపి వెనుక వచ్చేవారికి ఫోన్ చేసింది సహజ.
''డిండి రాకముందే వచ్చే ఎక్స్‌రోడ్ దగ్గర లెఫ్ట్ తీసుకుని దేవరకొండ మీదుగా బొమ్మెనపల్లికి సైదులు వాళ్ళ ఇంటికి వచ్చేయండి. లొకేషన్ షేర్ చేస్తాను.''
ఒకరినొకరు చూసుకుంటున్నారు. జుట్టు ముడేసుకుని నిండుగా ఉన్న పొద్దు తిరుగుడు పూవులా, మోచేతుల వరకు షర్ట్ హాండ్స్ మలుచుకున్న మొక్క జొన్న పొత్తిలా, శత్రువు నుంచి తప్పించుకునే చాకచక్యం ఒడిసిపట్టుకున్న పదునైన కత్తిలా ఉంది సహజ. వేటగాడి ఉచ్చు నుంచి తప్పించుకున్న జింకలా, కచ్చు వలకు చిక్కబోయి మిస్ అయిన చేపలా సాహస్ ఉన్నాడు. కాసేపు సాహస్కు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలో మాత్రం అర్థం అయింది.
''సహజ! సమాజంలో మంచి చేయడానికి ఇంత కష్టపడాలా? అడవుల్ని రక్షించడానికి ఇంత నిర్భంధం ఎదుర్కోవాలా? అయినా ఇందాక పోలీసులు మనల్ని బైక్ దిగమని చెక్ చేస్తే ఏంటీ పరిస్థితి?'' ''ఏముంది సాహస్. మా అంటే అరెస్ట్ చేసేవాళ్ళు లే. కానీ బైక్ తీస్తావా! తీయాలా?'' ''సహజ బైక్ కూడా నడుపుతుందా! అది కూడా బుల్లెట్టా!'' ''ఏదైనా బైక్ యే సాహస్. ఎక్కికూర్చో.'' అంటు స్టార్ట్ చేసింది. ''అసలేంటి సహజ నువ్వూ! మాలాంటి దానివేనా లేదా ప్రత్యేకంగా తయారు చేయబడ్డావా! ఒక్కో సీన్లో ఒక్కో సినిమా చూపిస్తున్నావ్ పో ఈ రోజు. ఏంటీ! మీ ఊరేది? అంకుల్ చందంపేట అని చెప్తున్నావ్! ఇక్కడంతా తెలుసా నీకు? వేరే రూట్స్ కుడా చెప్తున్నావ్?''
''డియర్ సాహస్ ఎందుకు టెన్షన్? ఒక పని చేయాలను కున్నప్పుడు ఎదురయ్యే సమస్యల్ని ఊహించి, ఆల్టర్నేట్ ప్లాన్ చేసుకొని ఉండడం మన సహజమైన పని.''
''అవును..అవును.. సహజ అనేది మైనా కాదు సివంగి అని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది.''
''ఏంటీ సాహస్ ఏమో గులుగుతున్నావేంటి!'' ''నథింగ్'' ''ఓV్‌ా.... నీకు నత్తి ఉందా!'' ''హలో నాకు నత్తేమీ లేదు. కానీ నీ దగ్గర గాగుల్స్ ఉన్నాయా!'' ''నీకెలా తెలుసు?'' ''ఇందాక మిర్రర్ లో చూసినప్పుడు నువ్వు పెట్టుకున్నట్లనిపించి అడిగాను. ఆ పోలీసుల కంగారులో సరిగా గుర్తులేదు.'' ''గుర్తులేకపోవడమే బెటర్. ఒక వేళ ఏమైనా గుర్తున్నా మర్చిపోవడమే మంచిది లే. కానీ బొమ్మెనపల్లి వచ్చింది.'' అని బైక్ ఆపింది.
తెల్లవారుతుండగానే ఒక్కో బైక్ మద్దిమడుగు చేరుకున్నాయి. మద్దిమడుగులో లోకల్ ప్రజాప్రతినిధులతో మాట్లాడి ర్యాలీ ప్రారంభించేలా చేసింది సహజ. ఇప్పటికే యురేనియం మైనింగ్ జరుగుతున్న ప్రాంతాల పరిస్థితి, పర్యావసానాలు, నష్టాలను కళ్ళకు కట్టినట్టు చూయించే ఫోటోస్ చూయిస్తూ, కరపత్రాలు పంచి, ప్రజలకు అర్థమయ్యే భాషలో మాట్లాడే ప్రయత్నం జరిగింది. పిల్లిగుండ్లపెంటలో చెంచులను, వారి గుడిసెలను చూసి అసలు మనమెక్కడున్నాం! ఇన్నేండ్ల స్వాతంత్య్రం ఎక్కడ కులుకుతుందసలూ! అన్నట్లున్నది వచ్చిన విద్యార్థులందరి ఫేసులు చూస్తుంటే. అక్కడి మట్టిని తీసుకుని కుంకుమే బొట్టు పెట్టుకుంటది కావచ్చు అన్నట్టున్నది ఆ నేల ఎర్రదనం. ఓ గుడిసె ముందు గుంజకు కట్టేసిన లేగదూడ చెంగడబింగడ ఎగురుతుంది. ఒక తాత వెళ్ళి దాన్ని విప్పగానే అది తన తల్లి దగ్గరకెళ్ళి పాలు తాగుతుంది.
''అదేంది తాతా అట్ల విడిచిపెట్టిర్రు!'' అడిగాడు వెంకట్ ''ఇషిపెట్టకేంజెయ్యాలె దుడ్డెకు ఆకలైతుందిగదా!'' ''అదిగాదే మీరు పాలు పిండుకోరా?'' ''ఎందుకు పిండాలె? మన తల్లి పాలు మనమే తాగినట్టు దాని తల్లి పాలు అది తాగాలె గదా! మనమెట్ల పిండుతం? తప్పుగాదు! '' అన్నాడు ఆ తాత.
''చెంచు తాత చెప్పిన ప్రకతి సూత్రం నాగరీకులని విర్రవీగుతూ అనాగరికంగా ప్రవర్తించే మన చెంప చెల్లుమనిపిం చినట్లే ఉంది కదా!'' అన్నది సహజ. తాత సమాధానానికి వెంకట్ కి నోట మాటాగిపోయి అక్కన్నుంచి కదలడం లేదు. ఆ పెంటలో ఉన్న ప్రజల్లో తొంభై శాతం మందికి హైదరాబాద్ అంటే ఏంటో కూడా తెలియదు. ఆమ్రాబాద్, మన్ననూరే వాళ్ళ రాజధాని. పుల్లని చీమల నుంచి పులి మా మేనమామ అంటూ ఎన్నో విషయాలను చెంచులు తెలియజెప్పారు. తిరుగు ప్రయాణమయ్యారు. వెనకబడిన వారికోసమని అడవి మధ్యలో ఆగారు. సహజ పక్కనే ఉన్న చెట్లలోకెళ్ళి కేకేసింది. అందరూ వెళ్ళేసరికి ఏదో చెట్టు మీద చిన్న చిన్న పండ్లను తెంపుతూ తింటుంది. ''కమాన్ అందరూ తెంపుకోని తినండి. వీటిని జానపండ్లు అంటారు'' అనడంతో అందరూ చెట్టుకొకరు ఎగబడి తింటున్నారు. సాహస్ మాత్రం సహజ ఉన్న చెట్టుకే తెంపుకుంటున్నాడు. ''సహజ! నేను ఇవి తినడం ఫస్ట్ టైం తెలుసా!'' ''అవునా! ఎలా ఉన్నాయి సాహస్? పుల్లగా ఉన్నాయా తియ్యగా ఉన్నాయా?'' ''నిజం చెప్పాలంటే అచ్చం నీలాగే ఉన్నాయి.'' ''అంటే నల్లగనా!''
''ఆ అవును.. కాదు కాదు.. పుల్లగ.. లేదు తియ్యగా..''
ఓరు ఆపుతావా ఇక. ఇటు రా. చెరు చాపు. ఫస్ట్ టైం అన్నావుగా ఇవిగో ఇవన్నీ తినూ.'' అని చేతిలో పిడికెడు జానపండ్లు పోసింది. మరిన్ని యేరి వెనుకొచ్చిన వాళ్ళకు తలా కొన్ని ఇచ్చింది. వెళుతూ వెళుతూ ఉడిమిల్ల, వంకేశ్వరం, పదర, తిరుమలాపూర్, వటవర్లపల్లెల్లో యురేనియం నిల్వలను చెక్ చేసేందుకు వేల ఫీట్ల లోతు బోర్లు వేసి బిగించిన బాక్స్‌లను పరిశీలించారు. ప్రజల అనుమతులు లేకుండా వారి భూముల్లో దొంగల్లా రాత్రికి రాత్రే బోర్లు వేశారని చెంచులు వివరించారు. వెళ్ళిన ప్రతి ఊర్లో విద్యార్థులు యురేనియం తొవ్వకాలను వ్యతిరేకిస్తూ ప్రజల సంతకాలను సేకరించారు. మధ్యలో సేవ్ నల్లమల, మట్టిమనుషులు కూడా విద్యార్థులకు దారి చూపుతూ, మద్దతునిస్తూ యాత్రలో పాలుపంచుకున్నారు.
''అణు విద్యుత్ అవసరం ఈ దేశానికి ఎంతో ఉంది. దాన్ని గుర్తించకుండా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?'' ఈ యాత్ర గురించి తెలుసుకుని వచ్చిన ఒక విలేఖరి సహజను ప్రశ్నించాడు.
''నిజానికి అణు విద్యుత్ అవసరం మన దేశానికి లేదు. ఎందుకంటే మొత్తం మనకున్న జలవిద్యుత్‌కు అవకాశాల్లో ఇప్పుడు మనం వాడుకుంటున్నది కేవలం పదిహేడు శాతం మాత్రమే. ఇంకా ఎనభై మూడు శాతం జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉన్నది. ప్రపంచ విండ్ పవర్ లభ్యతలో నాలుగవ స్థానం ఉన్న ఇండియా దాన్ని వాడుకునే అవకాశం ఉంది. సంవత్సరానికి మూడు వందల రోజులు ఎండలు కాసే దేశం మనది. సోలార్ పవర్‌కు కోదవలేదు. ప్రపంచలోని బొగ్గు నిల్వల్లో పది శాతం మన దగ్గరే ఉన్నవి. థర్మల్ విద్యుత్‌కి కూడా కొరతలేదు. పైన అన్ని ఉత్పత్తులకి అణు విద్యుత్ ఉత్పత్తికంటే కూడా ఖర్చు చాలా తక్కువ అని మరిచిపోరాదు. ఇలా ఇన్ని అవకాశాలు ఉండగా యురేనియం జోలికి పోడమంటే చావు నోట్లో తలబెట్టడమే. భవిష్యత్‌ను అమెరికన్ సామ్రాజ్యవాదానికి, దాని మల్టీనేషనల్ కంపెనీలకు కుదవబెట్టడమే. కాబట్టి రేపటికి హామీపడ్డ నేడుకు బాధ్యత వహిస్తూ మేము పోరాడుతున్నాం.'' ప్రెస్ మీట్ ముగిసింది.
మోటార్ సైకిల్ యాత్రను నల్లమలలోకి రానివ్వొద్దని అప్పాపూర్ అప్పర్ ప్లాట్ ఎంట్రన్స్‌లో పోలీసులు పహారా కాస్తున్నారు. వారికి కౌంటర్‌గానే అటు వెళ్ళాల్సిన విద్యార్థి సంఘం వాళ్ళు తూర్పు భాగం పెంటలల్లోకి వెళ్ళారు. ఇక్కడ ఉన్నారని ఎలాగో సమాచారం చేరింది. ఆ పోలీసులు వచ్చేలోపే విద్యార్థి సంఘ కార్యకర్తలను చెంచుసంఘం పెద్దలు మన్ననూరు దాటించారు. అలా నాగార్జునసాగర్ ఫారెస్ట్ రేంజ్‌లోకి ఎంటరయ్యారు.
''సహజ నీకు ఈ దారులు, ఇంతమంది మనుషులు ఎలా తెలుసు?'' ''తిరిగితే తెలుస్తుంది. కదలకుండా ఉంటే ఎలా తెలుస్తుంది సాహస్! ఏమీ తెలియవు. ఎవరూ తెలియరు. అమ్మాయిల చుట్టే కాదు అప్పుడప్పుడు అడవుల చుట్టు కూడా తిరుగు. నీక్కూడా అన్ని తెలుస్తాయి.'' ''నేనా అమ్మాయిల చుట్టా!'' ''ఆ..హా..హా.. ఏమీ ఎరుగని అమ్మాయకుడిలా యాక్ట్ చేయకు బాబు. పిల్లల కోడిలా తమరి చుట్టెప్పుడూ అమ్మాయిలుంటారని నాకు తెలియదనుకోకు.'' ''నీకెలా తెలుసు! నేను నీకు ముందే తెలుసా!'' ''నీవేమైనా చంద్రమండలం నుంచి ఊడిపడ్డావా ఏంటి? ఒకటే కాలేజీ కదా! పైగా ఆర్గనైజేషన్‌లో పని చేస్తూ ఉన్న నాకు ఏవరేంటని ఆమాత్రం తెలియకపోతే ఎలా!'' ''వామ్మో నువ్ నిజంగా మామూలుదానివి కాదు పో. కానీ నీకు హానెస్టీగా ఒక విషయం చెప్పనా! నేనిప్పుడు ఇంతకు ముందటి సాహస్ను కాదు సహజ.'' ''అది నాకు తెలుసు సాహస్. అందుకే కదా నువ్విక్కడున్నావ్.'' ''తెలుసా! వామ్మో నాకు భయమేస్తుంది సహజ.'' ''భయమెందుకు నేనున్నా కదా!'' ''అందుకే కదా భయమేస్తున్నది.'' ''హలో.. యాక్టింగ్ చాలు ఆపు.'' ''ఆపుతా కానీ.. మళ్ళీ పోలీసులు ఎప్పుడొస్తారు సహజ?'' ''ఎందుకు'' ''వస్తే బాగుంటుంది కదా!'' ''ఏరు..'' ''అది కాదూ.. వాళ్ళు వస్తే మనం ఏంచక్కా తప్పించుకోవచ్చు. అలా వాళ్ళను మాయజేసి తప్పించు కోవడంలో ఓ మజా, ఓ కొత్త అనుభూతి ఉన్నది సహజ.'' ''ఓరు.. నీ కథలు నాకు తెలుసు కానీ ఆపురా.'' వీపుపై ఒక్కటేసింది. ''మజా లేదు గిజా లేదు. ఒకసారి దొరికితే కూజాలిర్రగొడతారు. అప్పుడు తెలుస్తుంది మజా అంటే ఏంటో.'' ''నీవుండగా దొరకడమా! అది అసాధ్యం .'' ''మనకెప్పుడూ ఆ ఓవర్ కాంఫిడెన్స్ ఉండకూడదు సాహస్'' ''నువ్ పక్కనుంటే దొరికినా, కష్టాల్లో ఇరికినా, దెబ్బలు తిన్నా, మక్కెలిరిగినా పరవాలేదు సహజ'' ''అంత ఓవరాక్షన్ అవసరం లేదు సాహస్. కవిత్వం లెస్స తన్నుకొస్తుంది కదా నీకు. ఎప్పుడూ ఎవ్వరూ పక్కనుండరూ. చూసావు కదా ఈ కార్యక్రమం ఎన్ని నిర్భంధాల మధ్య కొనసాగు తుందో! మన పక్కన ఉండా ల్సిన వారెవరూలేరు. అయినా అనుకున్న కార్యక్ర మాన్ని ఆపకుండా నడుపు తున్నాం. ఏదైనా అంతే అనుకున్నవేవి అనుకున్నట్లు జరగవు. ఉన్నవాళ్ళం అయినా సమయస్ఫూర్తితో ఉంటూ నడి పించడం చాలా ముఖ్యం. గుర్తు పెట్టుకో సాహస్ నువ్వూ నేనూ వ్యక్తు లమే కావచ్చు కానీ వ్యవస్థకున్నంత బాధ్యతతో అప్రమత్తంగా ఉండాలి. అప్పుడే ఎక్కువ మంది కోసం పని చేయగలం.''
మాటల్లో మునిగి తేలుతూ నాగార్జున సాగర్ వెనుక వైపున్న పెద్దగట్టుకు చేరుకున్నారు. వీళ్ళు చేరుకునే లోపే యాత్ర వస్తుందని తెలుసుకుని ఆ ప్రాతానికి చెందిన సూర్యానాయక్ తన టీంతో కొన్ని బైకులు తీసుకొని వచ్చారు. అమ్రాబాద్ ఫారెస్ట్‌లో చెంచులుంటే ఇక్కడ లంబాడీలు ఉన్నారు. సహజ ఉపన్యాసం దంచుతుంది. సూర్యా నాయక్ వాళ్ళ భాషలో చెప్తున్నాడు. తర్వాత గ్రామ సర్పంచ్ మాట్లాడుతున్నాడు.
''నిజానికి ఇదంతా అడివే. నాగార్జునసాగర్ కట్టినంక మా ఊరు అందులో మునిగింది. అప్పుడు ఆనుంచి లేసొచ్చి ఈడ కట్టుకున్నం. ఆఖరికి నష్ట పరియారం గూడ ఇయ్యలే. ఇప్పుడు పారెస్టోర్ళొచ్చి ఉరేనియం కోసం ఈనుంచి కూడ పొమ్మంటే మేం యాడికిపోయేది. సావనైన సస్తంగానీ యాడికి పోం. ఈన్నే ఉంటం.''
యాత్ర ముగించుకుని ఎక్కడివారక్కడికి బయలుదేరారు. యురేనియం మైనింగ్‌ను వ్యతిరేకిస్తూ ప్రజలు చేసిన సంతకాలను తీసుకుని సహజ, సాహస్ సూర్యానాయక్తో కలిసి నల్లగొండ కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి బయలుదేరారు.
రైల్వేస్టేషన్ ముందు గొడవ జరుగుతుంది. ఏమిటా అని చూస్తే భక్తులు. నల్ల ద్రాక్షలు, నల్లచేపలు మాకెలా ఎదురొస్తాయి? మమ్మల్నెలా ముట్టుకుంటారు? అని ఒకటే గొడవ. కమలా పండు పట్టుకుని నాగాపూర్ నుంచి ట్రైన్ దిగిన వారు ఈ గొడవ చేస్తున్నారు. ధర్మశాస్త్ర ఆచారాల ప్రకారం ఎవరి పని వారు చేయాలి. ఎక్కడి వారు అక్కడ ఉండాలని వారు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఆ గొడవతో ఆగిన ట్రాఫిక్ నుంచి బయటపడి వచ్చిన సామాన్యుడు టి.వి. ఆన్ చేసాడు.
''ఇందుమూలంగా యావన్మందికి తెలియజేయునదేమనగా బ్లాక్లేక్ను, అందులో చేపలను అభివద్ధి పరచాలని రాజ్య పీఠాధిపతులవారు నిర్ణయం తీసుకున్నారండహెరీ..'' ఆస్థాన మీడియా చాటింపు తిరగేసి మరగేసి ఊదరగొడుతుంది.
కాసేపటి తర్వాత ఓ డిబేట్ మొదలైంది. నిలువు నామాలు పెట్టుకుని, ఓ కర్ర పట్టుకుని ఒకాయన మాట్లాడుతున్నాడు. ''ఏవండీ.. చేపలు ప్రాణులు కాదా! అవి మాత్రం ఇంకెంత కాలం నీళ్ళలో మగ్గి చావాలండి? వాటిని కాపాడాల్సిన బాధ్యత మనకు లేదా అండీ! వాటిని అభివద్ధి చేసి ఆధునికీకరించాల్సిన అవసరం లేదా అండి! అందుకే రాజ్య పీఠాధుపతులవారు అలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించే వాళ్ళంతా అభివద్ధి వ్యతిరేకులు, దేశ ద్రోహులు'' తీర్పు ఇచ్చాడు.
పొద్దున ఎవరి గొడవ వలన ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాడో ఆ సామాన్యుడికి షాక్ కొట్టినంత పని అయింది. వారు పొద్దున రైల్వే స్టేషన్ ముందు ఎత్తుకున్న రాగమేంది, ఇప్పుడు పాడుతున్న పాట ఏంది అని అర్ధంకాక తలపట్టుకున్నాడు. ఇంతలో వాళ్ళావిడ వచ్చి రిమోట్ తీసుకుని ఛానల్ మార్చింది. ఆలస్యం అయిదేమో ఆ ప్రోగ్రాం అప్పటికే సగానికి వచ్చినట్లుంది. స్క్రీన్ మీద ఓ చెరువు కలర్ఫుల్గా ఉంది. అక్కడ ఇద్దరు యు.ఎస్. పోలో బ్రాండ్ దుస్తులు ధరించి కూర్చుని మాటాడుకుంటున్న సీన్ వస్తుంది.
''నీళ్ళలో తడిచి తడిచి చేపలకు చలేస్తుంది. జలుబు కుడా చేస్తుంది. నిమోనియా కూడా ఎటాక్ అయ్యే ప్రమాదముంది. కాబట్టి మైక్రో ఓవెన్లో పెట్టి వాటి ఆరోగ్యం అభివద్ధి చేయకపోతే ప్రమాదమే ముంచుకొస్తుంది. అంతరిక్షం, అంగారక గ్రహం, చంద్ర మండలాలు జీవన స్థలాలుగా అభివద్ధి కాబోతున్నాయి. చేపలు మాత్రం తరతరాలుగా ఇంకా అలాగే మురికి నీటిలో ఉండిపోతే ఎలా! అవి అభివద్ధికి దూరమై అంతరించిపోవా! సంథింగ్ ఈజ్ ఫిషీ. ఇంకా ఎంతకాలం ఈ బ్లాక్ ఫిష్‌లు వెనుకబడి ఉండాలి! ఎలాగైనా చేపల జాతిని అభివద్ధి చేయాలి. కనీసం మన ఇళ్ళలో ఉన్న స్విమ్మింగ్ ఫూల్స్ లోకి అయినా తీసుకెళ్ళి అభివద్ధి చేద్దాం.'' అని కొచ్చటి గాలం పట్టుకుని కూర్చున్న ఆ ఎమ్మెన్సీ ఫిష్ హుక్ గాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం ఆ చెరువులోకి బోటింగ్ కోసం వచ్చిన మల్టిప్లెక్స్ ఫ్యామిలీ చెవిలో పడింది.
''అయ్యో పాపం చేపలు చ్..చ్.. అంటూ జాలిపడుతున్నారు. వారిద్దరు నోరు లేని ఆ మూగ జీవాలను మురికి నీటిలోనుంచి స్విమ్మింగ్ ఫూల్లోకి తీసుకెళ్ళాలని అంతగా ఆలోచించడం ఎంత గొప్ప విషయమో కదా!'' ఆ ఫ్యామిలీ ఫిష్ హుక్ గాళ్ళను తెగ పొగుడుతూ మాట్లాడుకుంటున్నారు.
''డ్రైవర్ జీతం కూడా పెంచని వారు, తినే చేతితో కాకిని కూడా కొట్టనివారు చేపలను స్విమ్మింగ్ ఫూల్ కి తెచ్చి ఆయుష్షు పెంచి అభివద్ధి చేస్తారట. ఇలాంటి వీళ్ళు చేపలను అభివద్ధి చేయడమంటే వాటిని నిలువునా కోసి, ఫ్రై చేసుకుని దిగమింగడమే అని ఆ మల్టీప్లెక్స్ ఫ్యామిలి అర్ధం చేసుకోలేదేమో కానీ నేను అర్థం చేసుకోగలను'' అని అక్కడ కారు తూడ్చుకుంటూ ఓ యువ డ్రైవర్ గులుక్కుంటూ ఆవేశపడుతుండగా ఆ ప్రోగ్రాం ఎండ్ అవుతుంది.
కథా రచయిత సాహస్. అని కింద పేరు చూసి ఆశ్చర్యపోయిన సహజ సాహస్కు ఫోన్ చేస్తుంది. కానీ సాహాస్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రేరు నువ్ దొంగవు రా. ఇఫ్ యూ ఆర్ ఫ్రీ, కమ్ టూ లాండ్ స్కేప్ పార్క్ ఇన్ ది ఈవినింగ్. అని మెసేజ్ వచ్చింది.
పైన ఆకాశం మబ్బులు పట్టి చల్లగాలితో సయ్యాటలా డుతుంది. కింద రెండు నెమళ్ళు కోటి వయ్యారాలు పోతున్నాయి. క్లైమేట్‌ను ఎంజారు చేస్తూ దూరంగా వాకర్స్ నడుస్తున్నారు. సహజ ఎదురుచూస్తుండగా సాహస్ రానే వచ్చాడు.
''రేరు నువ్వు సూపర్ రా'' అని హగ్ చేసుకుని అభినందించింది. ''ఏంటి సహజ! ఈ ఆనందమేంటీ, ఈ అభినందనలేంటీ, ఏమైంది నీకూ!'' ''యూనివర్సిటీ మ్యాగజైన్లో నీ కథ చదివానురా. ఇప్పుడు యూనివర్సిటీ అంత నీ కథ గురించే చర్చ. చాలా బాగా రాశావురా. నీలో మంచి సర్క్యాస్టికి రైటర్ ఉన్నాడు. వాణ్ణిక నిద్రపోనీయకు. సరేనా. రేరు నాకు ఒక్క మాటకూడా చెప్పలేదేంటిరా?'' ''చెప్తే ఈ ఆలింగనాభినందన దొరికేవి కాదుగా! జస్ట్ సప్రైజ్ ఇద్దామని చెప్పలేదు.'' ''నువ్వు ఎక్స్ప్రెసీవ్ అనుకున్నా కానీ సర్పైసీవా!'' ''సహజ ఈ వాతావరణం కారణమేమో కాస్త ఎక్కువ పొగుడుతున్నట్టున్నావ్!'' ''రేరు.. ఒక్క స్టోరీ రాసి నాకే క్లాస్ చెప్తున్నావా'' ''నాకంత లేదు సహజ. ఇక వదిలేరు'' ''అది సరే కానీ ఛలో డిల్లీకి పిలుపొచ్చింది. యురేనియం మైనింగ్ ఆపే వరకు పార్లమెంట్ స్ట్రీట్‌లోనే ధర్నా చేయాలి. ఇక ఎక్కువ మందిని సమీకరించే పనిలో ఉండాలి సాహాస్.
''అరేరు అజరు ఇంకో ఆరుగురు బుక్ చేసుకుంటే వంద మంది అవుతారురా. ఇంకా రాగలిగే వారు ఎవరున్నారు?'' ''ఇంకా పిండాలని చూడకురా సాహస్ ప్లీజ్. అందరిని డిల్లీ వచ్చేలా కన్వెన్స్ చేయడం, వారి నుంచే టికెట్ రిజర్వేషన్కి డబ్బులు వసూలు చేయడం. బాగుందిరా నీ కథ. ఇంత చెడదొబ్బిందేంటిరా ఆ అమ్మాయి నిన్నూ! ఇంకా మనం ఎక్కువ ట్రై చేస్తే మనల్ని చూసి పారిపోతారురా.'' ''అరేరు జోకులాపరా. ఆ అమ్మాయి నన్నే కాదురా మనందరినీ ప్రకతీకరించిందిరా.'' ''అరేరు ఒప్పుకుంటు న్నలేరా మళ్ళీ క్లాసు పీకకు. ఈ సాహిత్యం, ఆ ఉద్యమం అంటుకున్నప్పటి నుంచి సొల్లు కబుర్లు పాయే.. ఉల్ఫా తిరుగుడు పాయే.. పుస్తకాలు, క్లాసులు, చర్చల కోసం రాత్రులకు రాత్రులు తగలబెట్టి వెలుగులు రాజేస్తివి కదరా! మళ్ళీ మొదలు పెట్టకు నాయనా. నీకేం కావాలి ఇంకో ఆరుగురు కావాలి అంతే కదా!''
మొత్తానికి సాహస్, తన మిత్రులు కలిసి నూట పద్నాలుగు మందిని రైలెక్కించారు. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో వెయ్యి మంది డిల్లీకి బయలుదేరారు. సాహస్ మిత్రులంతా ఒక దగ్గర జేరి డప్పు కొడుతూ పాటలు పాడుతున్నారు. ''నల్లమల నల్లమల మా ఎల్లలు నీవే నల్లమల.. నల్లమల నల్లమల మా తల్లివి నీవే నల్లమల.. ఊరినడుగు సెలయేరునడుగు ఈ నేల దిగిన ప్రతి వేరునడుగు అడుగు దాటితే పడిపోతామే నీడ లేక మేము వెల్లకిలా...'' సహజ కూడా వచ్చి వారితో గొంతు కలిపింది. ఇలా పాటల ప్రవాహం సాగి సాగి ఆగింది. ట్రైన్ కూడా న్యూడిల్లీలో ఆగింది. అక్కడ అందరూ మెట్రో ఎక్కి పటేల్ చౌక్ మెట్రోస్టేషన్లో దిగి బయలుదేరి పార్లమెంట్ స్ట్రీట్‌లో ప్లకార్డులు, జెండాలై మెరుపు ర్యాలీకి దిగారు.
''సేవ్ నల్లమల-సేవ్ నేచర్, విరు అప్పోస్ నల్లమల యురేనియం మైనింగ్, సేవ్ నల్లమల-సేవ్ చెంచు ట్రైబ్స్'' నినాద శబ్దమై, రేపటి జనరేషన్ రక్షణ తరంగమై పార్లమెంట్ వైపు దూసుకుపోతున్నారు. రంగప్రవేశం చేసిన పోలీసులు బారికేడ్స్ పెట్టి ఆపేశారు. ఆపేసిన దగ్గరే విద్యార్థులు కూర్చున్నారు. అంతలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి కొంత మంది విద్యార్థులు వచ్చి తోడయ్యారు. రెండో రోజు సాయంత్రంలోపు పార్లమెంట్లో చర్చ జరిగింది. నల్లమలలో యురేనియం మైనింగ్‌కు ఎలాంటి అనుమతులు లేవని, ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నామని పర్యా వరణ శాఖా మంత్రి ప్రకటించాడు. రాజకీయ నాయకులు పోరాడాల్సిన ఓ సమస్యను విద్యార్థి సంఘం చేపట్టి విజయం సాధించినందుకు విద్యార్థులు ఆనందంలో మునిగిపోయి తిరుగు ప్రయాణమై రైల్వే స్టేషన్ చేరుకున్నారు.
''సాహస్'' గట్టిగా పిలిచింది. దూరంగా ఉన్న సహజ. ఏంటీ అన్నట్లు చూసిన సాహస్ను దగ్గరికి రమ్మన్నట్లు చేయి ఊపింది.
''సాహస్ నీకో విషయం చెప్పాలి. నేను హైదరాబాద్ రావడం లేదు.'' ''ఎందుకు చుట్టాలింటికి వెళ్తున్నావా'' ''లేదూ.. నాకు జేఎన్‌యూలో సీటు వచ్చింది. వచ్చేప్పుడే అన్ని సర్దుకుని వచ్చేశాను. అందుకే ఇక ఇక్కడే ఉండిపోతాను.'' ''ఆ.. ఐతే! ఇప్పుడా చెప్పేది? నాకు ముందు చెప్తే నేనూ ఎంట్రన్స్ రాసేవాన్ని కదా! అయినా నాకెందుకు చెప్తున్నావు మరీ ఆ..!'' ''రేరు నేను చెప్పేది వినురా.'' ''చెప్పేది వినాలట చెప్పేది. ఇంక ఏముంది చెప్పడానికి?'' ''ప్లీజ్ రా'' ''ఉఫ్.. దీనికేం తక్కువ లేదు. చెప్పు వింటా చెప్పు.'' ''మీరంతా అనుకుంటున్నట్టు ఇవాళ మంత్రి ప్రకటనతో నల్లమలలో మైనింగ్ ఆగుతుందని నమ్మలేము. ఇవాళ చేసిన ప్రకటన తాత్కాలికమే. అడవుల నెత్తి మీద, ఆదివాసుల గొంతు మీద కత్తి నిత్యం వేలాడుతూనే ఉంటుంది. ఏ క్షణమైనా పులుల పేరుతోనో, అభివద్ధి పేరుతోనో అడవులను ఖాళీ చేయిస్తారు. మైనింగ్ స్టార్ట్ చేస్తారు. అందుకే కమిట్మెంట్ ఉండి ఎంతో మందిని తయారు చేసే నీలాంటి వారి అవసరం అక్కడ ఉంది. నోరులేని చెంచులను, అడవులను రక్షించాలి. అందుకోసం కనురెప్ప ఆర్పకుండా కనిపెట్టుకునేలా నీవక్కడ ఉండక తప్పదు. మిస్ యూ రా.''
- ఎం. విప్లవ కుమార్,
9515225658
Authorization