Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేను ఒకరోజు ఏదో పని మీద సంగారెడ్డి నుండి మెదక్ పోవాల్సి ఉండే. నేను ఎదురు చూసిన కొద్దీ సేపటికే పల్లెవెలుగు బస్సు రానే వచ్చింది. ఆ బస్సు అప్పటికే పఠాన్.చేరు నుండి వొస్తుంది. చానా మంది ఉన్నారు దాంట్ల బస్సుల ఎక్కంగానే ముందుకు చూసిన డ్రైవర్ పక్కన అంటే బస్సు అద్దాల పైన దిక్కు కాలిగా ఉన్న ప్లేస్‌ల ''డ్రైవర్ అన్న జెర భద్రం'' అని రాసి ఉంది. నేను కూడా మనసుల ''జెర భద్రమే అన్నా'' అని.. అనుకున్నా అలా పైకి ఎక్కిన పాపం కండక్టర్ కష్టం ఇగ జూడ తరం గాదు. ''లోపలకి పోండి.. గంతగనం జాగా ఉండగా గీడనే ఎందుకు పానసరం పడతారు'' అని అందరిని లోపలకి నూకుతానే ఉన్నాడు. అయిన ఎవ్వడు కదులతలే. ఎవ్వరిని జెరుగు అన్న ''నేను గీడనే దిగుతా'' ''గాడనే దిగుతా'' అని చెప్తున్నారు. నేను అప్పుడు ''ఏడ దిగుతేనేమి బస్సు అంతటా ఆపుతాడు గదా లోపలకి పోనికే ఏం రోగం'' అని అనుకున్నా.. ఇగ వీళ్ళు ఇనరు అని వాళ్ళని అందరిని పక్కకు నూకి నేను చివరకి పోయి నిలబడ్డ. ఇగ కండక్టర్ గూడా ఆయనకి అయినకాడికి అందరిని లోపలకి నూకిండు.
బస్సు కదిలింది దాంట్ల ఇంకా చీమకి గూడ జోర్రనికే జాగా లేదు అయినా గూడ అప్పటి దాకా లేని పొరగాళ్ళు ఉరికి ఒచ్చి ఎక్కింరు బస్సు కదలంగానే. యాడికెళ్లి ఒచ్చిన్రు గింత మంది అనుకున్నా నేను.. అంతే ఇంకా కండక్టర్ ఆ పొరగాళ్లని తిడతానే ఉన్నాడు. ''ఫుట్ బోర్డ్ జెయ్యకుండి కింద పడితే నా మీదకి ఒస్తది'' అని అయినా ఆ పొరగాళ్ళు ఇనలే. ఇంతలో పక్కన సీటులో ముగ్గురు కూసునే దగ్గర ఇంకో అతను వచ్చి జెర జెరుగుండి అని. వాళ్ళు నలుగురు పట్టరు అంటున్న వినకుండా సగం బయటకి సగం లోపలకి కుసున్నడు.
ఇంతలో కండక్టర్ అతి కష్టం మీద అందరిని నూకి నూకి . ''టిక్కెట్.. టిక్కెట్.. చెప్పాలమ్మ ఏడికి పోవాలే'' ''జల్దీ చెప్పుండి'' అనుకుంటూ టిక్కెట్టు తీసుకుంటున్నాడు. బస్ పాస్ ఉన్నోళ్లని పాస్ చూయించమని అడుగుతూ ఇంచుమించు అందరి పాస్ లు చూస్తూ వస్తున్నాడు. అక్కడ ఒక గమ్మత్తు అయింది ఒక ముసలవ్వ వాళ్ళ మనవడితో కలిసి ఉంది. ''టిక్కెట్ టిక్కెట్'' అని కండక్టర్ అనగానే ''ఒకటి జోగిపేట'' అని దస్తిల ఉన్న పైసలు తీసి ఇచ్చింది. కండక్టర్ ''గీ పిల్లగాడు ఎవరూ'' అని అడిగాడు. ''నా మనుమడు'' అన్నది ఆ ముసలవ్వ కొద్దిగా ఆలోచిస్తూనే. మరి ''ఈ పిల్లగాడికి టిక్కెట్టు తీసుకోవా'' అని అన్నాడు. ''చిన్న పొరగాడు ఇంకా నాలుగు ఏళ్ళు గూడ నిండలే'' అన్నది. ''పిల్లగాడు జూస్తే ఏడూ ఎనిమిది ఏళ్ళు ఉన్నట్టు ఉన్నాడు ఇంకా నాలుగు ఏళ్ళు లేవు అంటావ్ ఏం అమ్మ హాఫ్ టికెట్ తీసుకో'' అన్నాడు. ''గంత ఏం ఉండడు నా మనువడు'' అన్నది ముసలవ్వ. ''ఎన్నో క్లాసు ఈ పిల్లగాడు'' అని అడిగాడు వయస్సు తెలుసుకుందాం అని కండక్టర్. ''ఆ ముసలవ్వ ఇంకా స్కూల్ల వెయ్యలే'' అని టక్కున చెప్పింది.
ఇంతలో పక్క నుంచి ''నాయనమ్మ నేను స్కూల్ పోతున్న గదనే మూడో క్లాసు నేను'' అని అన్నాడు ఆ పోరడు పక్కనుంచి. ''అయిపాయే'' పాపం ఆ ముసలవ్వ చేసిన యాక్టింగ్ అంత వేస్ట్ చేసిండు గీ పోరడు అనుకున్న నేను నవ్వుకుంటూ. ఇగ ఆ ముసలవ్వకి టిక్కెట్టు తీసుకోక తప్పింది కాదు. వీళ్ళ లొల్లి చూస్తూ ఉన్న ఇంతట్ల వెనక సీటులో ఉన్న ఒకతను దిగాడు నేను కుసున్న. కుసున్న కాడి నుండి... పక్కన ఉన్న ఒకతను నా మీద ఒరిగి పంటున్నాడు. అతని నిద్ర చెడిపోకుండా చాలా సార్లు అతని నెత్తి అట్లా పక్కకు జేరిపినా అయిన మళ్ళా రెండు నిమిషాల్లో నా మీద పడుతున్నాడు. ఇట్లా బానే సార్లు జేసిన ఏం లాభం లేకపోయింది. ఛీ! ఛీ! అని అనుకోని ఉండగానే. ముందల కూర్చున్న ఒకతను సీటులో కూర్చొని ఫోన్ పట్టుకొని ఏదో టెన్షన్లో ఉన్నాడు.. ఏమో ఏదైనా అర్జంట్ పని ఉందొ లేకపోతే పెళ్ళాం ఫోన్ చేసి ఇంటికి తొందరగా రాకపోతే కూడు పెట్టా అన్నదేమో అని అనుకుంటూ ఉన్నాను. ఇంతలో నా ముంగట సీటులకెళ్ళి గట్టిగా ఒకతను అరిచాడు ఎందుకా అని చూస్తే.. అది అరుపు కాదు. అతనెవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. చిన్నగా నవ్వుకుని ఈయనకి ఫోన్ ఎందుకు బస్సు ఎక్కి మాట్లాడితే నేరుగా ఏ ఊరు అయిన ఈయన వాయిస్‌కి ఇనవడతది కదా అని అనుకున్న. ఇంతలో ఒక అమ్మాయి బస్సు ఎక్కింది. అక్కడ అప్పటికే బస్సులో చాలా మంది ఆడోళ్ళు ఉన్నారు. పాపం అప్పటికే బస్సు అంత నిండుగా ఉండటం చేత.. ఎవ్వరికీ కూసోనికే జాగా గూడ లేదు. అయిన అక్కడ కొంతమంది మొగోళ్ళు స్త్రీలకి కేటాయించిన సీటులో కూర్చున్నారు. అక్కడ స్త్రీలు నిలబడి ఉన్న వాళ్ళకి సీటు ఇవ్వట్లే.. వీళ్ళకి అస్సలు బుద్ధి లేదు అనుకోని.. నేను ఇద్దాం కూర్చోండి అందాం అంటే.. నేను చివరలో ఉన్న అంత దూరం ఆడవాళ్ళు అందరిని నూకి రాలేరు అని ఉరుకున్నా.. ఆ అమ్మాయి కూడా ఎవరిని ఏం అనకుండా. ఫోన్లో పాటలు వింటూ నిలబడే ఉంది. అలా దష్టి కొద్దిగా ముందుకు వాల్చ. అక్కడ ప్రేమ జంట అనుకుంటా.. లోకాన్ని మరిచి చూపులతో ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు. అసలు వాళ్ళకి ఈ బస్సులో అయ్యే ఏ ఒక్క విషయం తెలియదు. నా నమ్మకం ఏంటి అంటే అసలు వాళ్ళు బస్సులో ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలిసినట్టు లేదు. అంత మంది ఉన్నప్పటికి వాళ్ళ చూపు మాత్రం పక్కకి పోతలేదు. అలా చూసుకుంటూనే ఉన్నారు. ఎంత గాఢమైనదో మరి వాళ్ళ ప్రేమ. ఇట్లా ఉండగానే వాడేవడో బాంబు పేలినట్టు చైనా ఫోన్లో సౌండు పెట్టాడు. గుండె జల్లుమన్నది. వాడేమి చూస్తున్నాడో అని చూస్తే ఏదో కామెడి షో అంత మందిలో కూడా ఎంతో ధైర్యంగా అంత పెద్ద సౌండ్‌తో చూస్తున్నాడు. నాకు అయితే దాంట్లో ఒక్క జోక్‌కి కూడా నవ్వు రాలేదు కానీ వాడు మాత్రం పగలబడి నవ్వుతున్నాడు. ఏందో ఏమో అనుకుంటూ.. కొద్దిగా ముంగటికి చూసిన అక్కడ కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు అనుకుంటా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని కుసున్నారు. ఇది బస్సు అనుకుంటున్నారో వాళ్ళ ఇల్లు అనుకుంటున్నారో వాళ్ళ రొమాన్స్ చూడలేక చస్తున్నారు అందరూ. అయిన వాళ్ళకి మాత్రం ఎటువంటి పట్టింపు లేదు. ఇలా చూస్తూ ఉన్న ఇంతలో ''రంగంపేట'' వచ్చింది బస్సు ఆగింది. దిగాల్సినోళ్లు దిగిన్రు. ఎక్కేటోళ్లు ఎక్కింరు దాంట్లో ఒక ప్రెగెంట్ ఆవిడ బస్సు ఎక్కింది. బస్సు మాత్రం కాళీ లేదు. ఆమె ఎక్కిన తరువాత కూడా అక్కడ స్త్రీల సీటులో కుసున్న వాళ్ళు ఎవ్వరూ లేవలేదు. నాకు అయితే చాలా కోపం వచ్చింది. కానీ ఏం చేయాలి ఏం చేయలేక పోయినా నేను మాత్రం చెప్తే వాళ్ళు వింటారా ఇంతకు ముందు ఒక అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి చెవిలోంచి ఇయర్ ఫోన్స్ తీసి చాలా కోపంగా ఉంది. ఇంతలో దారిలో భారీ మలుపు వచ్చింది. ఒక్కసారిగా గట్టిగా ''స్త్రీలకు కేటాయించిన సీట్లలో వాళ్లనే కూర్చొనిద్దాం'' అని చాలా గట్టిగా అరిచింది ఆ అమ్మాయి. బస్సు సడెన్‌గా ఆగింది. అందరూ అమ్మాయినే చూస్తున్నారు.
కండక్టర్ ఆ అమ్మాయిని ''ఏం అయింది అమ్మా'' అని అడిగాడు.
''నాకు ఏం అయింది అక్కడ రాసి ఉన్నది చదివాను'' అన్నది ఎంతో స్పష్టంగా.
''అది అందరికీ తెలుసు కదా అన్నాడు'' కండక్టర్.
''ఇక్కడ ఉన్న వాళ్లకు చదువు వచ్చో రాదో అని చదివాను''. అన్నది ఆ అమ్మాయి మళ్ళీ సీటులో కూర్చున్న వాళ్ళని చూస్తూ.
డ్రైవర్‌కి కండక్టర్ సైగ చేసాడు పోనిరు అని. డ్రైవర్ బస్ స్టార్ట్ చేసి మెల్లిగా తీసుకెళ్తున్నాడు.
''అదేంటి అమ్మాయి అలా అంటున్నావు'' అని అడిగాడు పక్కన ఉన్న ఒకతను.
''లేకపోతే ఏంది నేను ఎక్కినప్పుడు ఎవ్వడు లేవలేదు సరే నాకు ఏం అయింది మంచిగానే ఉన్న కదా అని నిలబడే ఉన్న.. ఆ తరువాత నాలాగా చాలా మంది ఎక్కింరు అయిన స్త్రీల సీటులకెల్లి ఎవ్వడు లేవలేదు. సరే అది పోనీ ఆ తరువాత ఒక ముసలవ్వ ఎక్కింది ఆమెకి కనీసం సీటు కూడా ఇయ్యలే. ఏం పౌరుషం దగ్గరనే మొగతనం చూపిస్తారా.. ఇలాంటి వాటి దగ్గర మొగోళ్ళ మొగతనం ఎక్కడ పోయింది. అది కూడా పోనీ.. ఇగో ఇప్పుడు ఈ అక్క నిండు గర్భంతో బస్సు ఎక్కింది. అయిన కూడా మీకు కనీసం జాలి కలగలేదు. అసలు బాధ్యత అనేది ఉంటే కదా''.. అని అందరి ముఖాలు చూసింది. దాంట్లో చాలా మంది నిస్సహాయంగా చూస్తున్నారు.
''స్త్రీలకు సమాన హక్కులు ఇచ్చినం అని అరవడం కాదు ముందు వాళ్ళకి కేటాయించిన సీటులో వాళ్ళని కూర్చునే విధంగా చూడండి'' అని అన్నది ఆ అమ్మాయి. బస్సు అంతా నిశ్శబ్దం ఎంత నిశ్శబ్దం అంటే బస్సులో తెరిచి ఉన్న కిటికీ నుంచి వచ్చే గాలి శబ్దం తప్ప ఇంకేం వినిపించట్లేదు. ఇంతలో ఒక చంటి పిల్ల ఏడుపు అందరూ మళ్ళీ మాములు అయ్యారు. నాకు ఎందుకో ఆ అమ్మాయిని చూడగానే చాలా ఆనందంగా అనిపించింది. ఇంఫాక్ట్ చాలా గర్వంగా కూడా అనిపించింది. అందరూ ఆ అమ్మాయిని చూస్తూనే ఉన్నారు. ఈ దెబ్బతో అక్కడ స్త్రీల సీటులో కూర్చున్న వాళ్ళు లేచి ఆ ప్రెగెంట్ ఆవిడకి ఆ ముసలవ్వకి అమ్మాయికి సీటు ఇచ్చి వాళ్ళు నిలబడ్డారు.
నేను ఆ అమ్మాయి మాటలకు ముగ్దున్నయ్యి అప్రయత్నంగా చప్పట్లు కొట్టాను. నన్ను చూసి అందరూ చప్పట్లు కొట్టారు. ఆ అమ్మాయి నా వైపు తిరిగి ''ఈ పని మీరు ముందే చేసి ఉండొచ్చు కదా! అలా చేయరు ఎవరైనా చేస్తే నాటకం చూసినట్టు చూస్తారు'' అని అన్నది. నేను మాత్రం అవేమి పట్టించుకోకుండా. ఆ అమ్మాయిని అలా చూస్తూ ఉండిపోయా. అప్పుడే మనసులో ''చెప్తే వినే లోకం ఎప్పుడే చేజారిపోయింది. ఇప్పుడు అంతా అనుభవిస్తేనే తెలుస్తుంది''. ఎవ్వరికి అయిన అనుకుని. లోపల నవ్వుకున్నా. ఇంకా అందరూ దిగే లాస్ట్ స్టాప్ మెదక్ వచ్చింది. అమ్మాయి దిగిపోయి వెళ్లే ముందు అక్కడ సీటులో కూర్చున్న ముసలవ్వ ఆ అమ్మాయికి చెంప పైన ముద్దు పెట్టి ఆ అమ్మాయిని ఆశీర్వదించి.. తన రెండు చేతులను ఆ అమ్మాయి తల చుట్టూ తిప్పి చేతులు విరిచి దిష్టి తీసింది. ఇది చూసి అందరూ ఆనందించారు. అందరితో పాటు నేను కూడా దిగి వెళ్ళిపోయాను. కొన్ని ఏళ్ళ తరువాత నా గ్రహాలు అనుకూలించి నా ప్రయత్నం ఫలించి ఆ అమ్మాయిని వెతికి పట్టుకొని పెళ్ళి చేసుకున్నాను. తనకి ఆ రోజు బస్సులో ఉన్నది నేనె అని తెలియదు. తను చాలా సార్లు అడిగింది నన్ను.. నేను అంటే ఎందుకు అంత ఇష్టం అని. కానీ నేను చెప్పలేదు. అప్పటికి ఏవేవో కారణాలు చెప్తూ ఉండేవాడిని. ఇప్పుడూ కూడా ఈ కథ తనతో కాకుండా అందరితో పంచుకుంటా.. ఏదో ఒకరోజు తనకి చెప్పి నా కూతురిని నీ లాగే పెంచూ అని గర్వంగా చెప్తాను. ఇలా మలుపులో ముడిపడింది మా బంధం. ఇలాంటివి ఎన్నెన్నో మలుపులు. ప్రతీ మలుపుకి ఓ కథ. నా మలుపు కథ ఇది.
- సాయి కిరణ్ నేత (అసుర)