Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా మీద నాకే అసహ్యమేసింది. గీచిగీచి బేరాలాడుతుంటే నా చెవులకు లీలగా వినిపించినా మౌనంగా వుండి చోద్యం చూడటం తప్పే కదా. ఇంతా తెలిసి వారించకపోవటం ముమ్మాటికీ తప్పే. బండి కుదుపులకు ముంజల కవరు వీపుకు తగులుతుంటే లోపల ఏదో అపరాధ భావం. అయినా చాలా దూరం వచ్చేశాం. జగదీష్‌ని తీసుకోమనకుండా. నేనే బండి స్టాండేసి వెళ్లి ముంజలు కొనాల్సింది.
*********************
జగదీష్ నేను ఒకే ఊరివాళ్లం. లాక్డౌన్ సడలింపులో కాస్త ఊరట లభించి హైదరాబాదు నుండి సొంతూరుకు బయలు దేరినం. హైవేమీద కొంత దూరం ప్రయాణం చేశాక. రోడ్డవతల ఆ అద్భుత దృశ్యాన్ని చూసి మనసాగ లేదు నాకు. వెంటనే బ్రేకేసి. ముంజలు కొనమని జగదీష్‌ని పురమాయిం చాను. తలపైన హెల్మెట్టొకటే అయితే ఫర్వాలేదు. మూతికి మాస్క్. పెట్రోల్ టాంక్ పైన కవర్లో శానిటైజర్ బాటిల్. వాటన్నిటికీ పనిచెప్పే పనెందుకులే అని వెనక కూర్చున్న జగదీష్‌ని ముంజలు కొనమని చెప్పాను. నేను బండి మీదే కూర్చుని వాడ్నో కంట కనిపెడుతూనే వున్నాను. బేరమాడుతున్నాడని అర్థమైంది. ఆ ముంజలమ్మే వారి దగ్గరకు బండి దిగి వెళ్లేటపుడే సూచన చేశాను వాడికి. బేరాలాడకుండా ఎంతడిగితే అంత ఇచ్చి లేత ముంజలుండేలా చూసుకుని రమ్మనమని. ఓ ఇరవై నిమిషాలు ముంజలమ్మే వారితో బేరాలాడే తెచ్చాడు వాడు.
''డజను ఇరవై రూపాయలన్నార్రా. అటు కొట్టి ఇటు కొట్టి పదిహేను రూపాయలకు బేరం చేసి తెచ్చా. అరే భలే కఠినంగా వున్నార్రా. అస్సలు నానట్లేదు. రేటు తగ్గదంటే తగ్గదన్నరు. చివరికి నేనే గెలిచాను. ఐదు రూపాయలు సేవ్ చేశానని'' జగదీష్ గర్వంగా చెపుతుంటే నాకు కడుపులో దేవినట్టయింది.
పాపం ఎప్పుడనగ వచ్చి కనీసం చెట్టు నీడ కూడా లేని రోడ్డు పక్కన ఎండలో మాడిపోతూ ముంజ కాయల గెలల్ని ముందేసుకుని కూర్చున్నారో. పైగా రోడ్డు పరిసర ప్రాంతాల్లో దూరంగా ఎక్కడా కూడా కనుచూపు మేరలో తాటి చెట్లున్న ఆనవాళ్లేమీ కనిపించటం లేదు. వాళ్లెంతో శ్రమకోర్చి ఎంతో దూరంనుంచి ఆ ముంజ గెలల్ని మోసుకొచ్చి రోడ్డు పక్క చేరవేసి అమ్మకానికి పెట్టి వుంటారు. హైవే పైన అడపా దడపా వెళ్లే వాహనదారులే వాళ్లకా పూటకు జీవన భృతి. వారిని చూస్తే జాలేసింది నాకు. ముంజలంటే ప్రాణమే అయినా. అప్పటికి ముంజల మీద మోజేం లేదు. నేను కొంటే వాళ్లకు కొన్ని డబ్బులందుతాయిగా అనే ఉద్దేశంతోనే జగదీష్‌ను కొనమన్నాను. వాడిలా బేరమాడి తెస్తాడనుకోలేదు.
నా ఆలోచనల్ని భంగం చేస్తూ జగదీష్ నా మెడ మీద చెవి దగ్గరకు వాడి తలను వొంచి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. గాలి వేగానికి వాడి మాటలు నా చెవిని చేరటం లేదు. ముంజల కవరు నా వీపును బండి కుదుపులకు ఆగిఆగి తాకుతోంది. బండాపమన్నట్టుగా భుజమ్మీద చెయ్యేశాడు. బ్రేకేశాను. రోడ్డు పక్క ఒక చెట్టు నీడలోకి పోనిచ్చి బండాపాను. బండి దిగుతూ జగదీషన్నాడు ''ఎంత సేపట్నుంచి అడుగుతున్నాను. నువ్వేమీ సమాధానమిస్తలేవు. గాలికి వినపడటం లేదేమోనని బండాపమని భుజం తట్టాను. పన్లో పనిగా లఘుశంక కూడా తీర్చుకోవచ్చనుకున్నానులే.'' వాడు చేసిన పనికి వాడి ముఖం సుతా చూడాలనిపించటం లేదు నాకు. ఎప్పటిలాగే నేను రెండు వైపులా కాళ్లు నేలకానించి బండి మీదే వుండిపోయాను. ముంజల కవరు నా చేతకిస్తూ వాడు చెట్టు చాటుకెళ్లి శంక తీర్చుకుని వచ్చాడు. కవరు తన చేతిలోకి తీసుకుంటూ ''ముంజలు తినేద్దాం, బండి దిగురా.'' అన్నాడు. నేనేమీ మాట్లాడక పోయేసరికి ''ఏమైందిరా నీకు? ఈ ముంజలకేమన్నా కరోనా అంటుకుందేమోనని భయమా? మన దగ్గర వాటర్ బాటిలుంది. శానిటైజర్ కూడా వుందిగా. సుబ్బరంగా కడిగే తిందాం. పాపం పల్లెటూరి వారైనా ఆ ముంజలమ్మెటోళ్లు మూతికి మాస్కు చేతులకు ప్లాస్టిక్ గ్లౌజులు పెట్టుకునే వున్నార్రా. మన పట్నపోళ్లకంటే వాళ్లే మంచి జాగ్రత్తలు పాటిస్తున్నారులా వుంది. బేరం ససేమిరా అన్నా ఐదు రూపాయలు తగ్గించి మరీ ముంజలు కొనుక్కొచ్చా.'' అన్నాడు. బేరం అనే మాట వినబడే సరికి నా కోపం తారా స్థాయికెళ్లింది.
''నోరు ముయ్యిరా!'' దాదాపు అరిచినంత పని చేశాను. ఊహించని పరిణామానికి వాడు బిక్కమొఖమేశాడు. చేతిలోని ముంజల కవరు జారి కింద పడినంత పనయింది. తమాయించుకుని ''ఏమైందిరా నీకు?'' అన్నాడు. ముంజలు బేరం చేయటం నచ్చలేదని చెపితే వాడు నవ్వుతాడని తెలుసు. ''అరేరు! ముంజలెప్పుడైనా ఎలా వస్తాయో చూసావా?'' అన్నాను.
''కొంటే వస్తాయి'' అని నవ్వాడు.
''నీ బొంద! కొనటం కాదురా. ఆ ముంజల వెనుక ఎంత శ్రమ వుంటుందో తెలుసా?''
''అయితే ముంజల వెనుక శ్రమకీ, నాపైన తమరి కోపానికీ లంకె ఏందిరా?'' అన్నాడు.
''అయితే ముంజల గురించి చెప్పాల్సిందే విను'' అన్నాను. ముంజల్ని మనసులో తలుచుకోగానే నేనే స్వయంగా ముంజకాయల బండిమీద కూర్చుని గతంలోకి వెళ్లిపోయినట్ట నిపించింది నాకు.
*********************
సరిగ్గా గుర్తులేదు గానీ, నేను ఎనిమిదో తొమ్మిదో చదువుతున్నప్పటి కాలం. ఆ రోజు నాయిన ముంజలు కొడుతున్నాడని తెలిస్తే ఎగిరి గంతేసే వాడ్ని. పొద్దున్నే లేచీ లేవగానే గబగబా కాలకృత్యాలు తీర్చుకుని నాయినతో పాటే బొత్తళ్లకు బయలుదేరి పోయేవాడ్ని. నాయిన కొట్టిన ముంజలు తినాలన ఆనందం కన్నా నాయిన ముంజలు కొట్టే దృశ్యమే నన్నెంతో ఆకర్షించేది. ముంజలు కొట్టటంలో చాలా ప్రత్యేకమైన శైలి నాయినది. నాయిన ముస్తాదు కట్టి తాడుకి మోకేసి పై పైకి ఎక్కుతున్నపుడు ఆ చెట్టు ఎక్కటంలోని బాధ, కష్టం చూస్తే కళ్లల్లో నీళ్లు తిరిగేవి. నిజంగా అంతెత్తున్న తాటి చెట్టెక్కటం ఎంత కష్టమో అనిపించేది. త్వరత్వరగా చదివి ఉద్యోగం సంపాదించి తాటి చెట్లెక్కే శ్రమ నుంచి నాయినకు తొందరగా విముక్తి కల్పించాలని ఆరాటంగా వుండేది. కానీ విచిత్రం డెబ్భయి సంవత్సరాలు దాటినా కూడా ఇంకా చెట్లెక్కి పొట్ట పోసుకుంటున్న పెద్ద వయసున్న కొంతమంది నాయినలాంటి గీత కార్మికుల్ని చూస్తుంటే మనసు తరుక్కుపోయేది.
''ఈ వత్తికి రిటైర్మెంట్ లేదురా. ఒంట్లో సత్తువున్నంత కాలం చెట్లెక్కటమే. ముంత కల్లుంటేనే కదరా పూట గడిసేది.'' అనేవాడు నాయిన. ఆ రోజు పొద్దున్నే నాయినతో కలిసి తాళ్లవనం బాట పట్టిన. వనమంతా నిర్మానుష్యంగా వుంది. దూరంగా పొలాల్లో కొంతమంది రైతులు కనిపిస్తున్నారు. కంచెలో పశువులను మేపుతూ ఒకరో ఇద్దరు జీతగాళ్లు కనిపించారు. నాయిన ఎక్కుతున్న తాటి చెట్టు దగ్గర నేను తప్ప ఇంకే నరమానవుడూ లేడు.
''నేను చెట్టు మొగిలికి (పైకి) చేరుకున్నాక దూరం జరిగి చూస్తూ వుండు. చెట్టు దగ్గరలో నిలబడకు ముంజ గెలలు మీద పడుతరు.'' అని జాగ్రత్త చెప్పి తాటి చెట్టు మొగిలి వరకు చేరుకున్నడు నాయిన.
''అరే మహేశ్! దూరం జరుగు బిడ్డా. ముంజ గెల కొట్టేస్తున్నా.'' అన్నాడు.
చెప్పినట్టే తాటి చెట్టు మొదలు నుంచి దూరంగా జరిగి నాయిన ముంజ గెలలెలా కొట్టేస్తున్నాడా అని ఆసక్తిగా గమనిస్తున్నాను. ఒక భారీ ముంజ గెల గాలిలో అలా తేలుకుంటూ వచ్చి దభీమని నేలను తాకింది. చెట్టు చుట్టూ నేల కాస్త పొడిగా గడ్డకట్టిన రాతి నేలలా వుంది. గెల నేలను తాకగానే రెండు పల్టీలు కొట్టి పడిన చోట కాకుండా ఇంకో చోట నేలను కరుచుకుని వుండిపోయింది. గెల నుంచి విడివడిన రెండు కాయలు దొర్లుకుంటూ వెళ్లి ఒకటేమో పక్కనే వున్న వరి పొలంలో పడింది. మరోటి కాస్త దూరంలో వున్న ముళ్ల పొదల్లో చిక్కుకుని ఆగిపోయింది. ఒకసారి తలెత్తి నాయిన వైపు చూశాను. ఇంకో గెలేదీ కొట్టేయటం లేదని నిర్ధారించుకున్నంక. చెట్టు కింద నుంచి పరుగెత్తి ఎదురుగా వున్న వరిపోలంలోని ముంజకాయను తెచ్చి తాటి చెట్టుకు ఓ పక్కగా వున్న కానుగు చెట్టు నీడలో పెట్టాను. తర్వాత ముళ్ల పొదల్లో వున్న కాయను కూడా జాగ్రత్తగా పొదను పక్కకు తప్పించి తెచ్చి కానుగు చెట్టు నీడలో పెట్టాను. మిగతా కాయలతో చాలా బరువుగా వున్న ముంజగెలను మోయలేక రెండు చేతులతో ఈడ్చుకొచ్చి కానుగు చెట్టు నీడలోకే తరలించాను. గెల నుంచి ఊడిపడిన ముంజ కాయల్లో ఒకటి పగిలి మెత్తని ముంజ గుజ్జు బయటకు కనిపిస్తోంది. ముంజలోని నీళ్లు కూడా బయట కొచ్చినట్టున్నాయి. ముంజకాయ చారలు కట్టి తడితడిగా వుంది. పగిలిన నెర్రెలో చూపుడు వేలు పెట్టి లాగితే మెత్తని ముంజ చేతికి తగిలింది. నాలుక మీదేసుకుని చప్పరించాను. ఎంత మధురంగా వుందో. చెట్టుపై నుంచి మరో ముంజ గెల జారవిడుస్తున్నట్టు నాయిన నుంచి పిలుపొచ్చింది. పగిలిన ముంజకాయను గెలకు ఆనించి ఎప్పటిలాగే దూరం జరిగి నిలబడ్డాను. దభీమని మరో ముంజ గెల. ఈ సారి ఒక్క కాయ మాత్రమే గెల నుంచి విడివడి కానుగు చెట్టు నీడలోకే దొర్లి ముందున్న గెలకి తగిలి ఆగిపోయింది. నాకు పోగేసుకొచ్చే పని తగ్గించింది. మరో ఐదు నిమిషాలు చెట్టు మొగిల్లో చుట్టూ తిరిగి మరో గెలను వెనక ముస్తాదు కొక్కేనికి తగిలించుకుని మెల్లగా తాటి చెట్టు దిగుతున్నాడు నాయిన. తలెత్తి ఒకసారి చుట్టూ చూశాను. ఇందాక దూరంగా పొలాల్లో కనిపించిన రైతులక్కడ లేరు. దూరంగా కంచెలో గడ్డి మేస్తున్న పశువులు మాత్రమే వున్నాయి. జీతగాళ్లేమయారబ్బా? అనుకుంటుండగానే.
''ఏంరో! ముంజలు గొడుతున్నార్ర మీ అయ్య!'' అనుకుంట నారయ పటేల్ రానే వచ్చిండు తాటి చెట్టుకాడికి. పశువుల కాపరులతో పాటూ మరో ఇద్దరు రైతులు, ఆసాములూ కానుగ చెట్టు కిందికి చేరే పోయారు. ఎట్లా పసిగడతారో తెలియదు గానీ బెల్లం ముక్క చుట్టూ ఈగలు చేరిపోయినట్లు తాటి గెల చుట్టూ తేనెటీగలు చేరినట్లు. నాయిన ఎప్పుడు ఏడ ముంజలు కొట్టినా. అప్పటిదాకా ఆ చుట్టుపక్కలెక్కడా కనిపించని మనుషులు హఠాత్తుగా ముంజగెలల చుట్టూ మూగిపోతారు.
మానాయినకి ఎంత ఓపికో. ఎవరొచ్చినా కాదనడు. కొట్టిన ముంజలు సరిపోకపోతే మరో చెట్టెక్కయినా తన్ను నమ్మి వచ్చి చేరిన వాళ్లందరకీ ముంజలు కొట్టి పెడతాడు గానీ. లేవని చెప్పి ఉత్త చేతులతో ఎప్పుడూ పంపియ్యడు. దూరంగా తాటి చెట్టు మీద మా నాయిన కనిపిస్తే చాలు. జొన్న చేను చుట్టూ పిట్టల్లా చేరిపోతారందుకే. ఒక్కోసారి నాయిన ఉదారత మీద కోపం వచ్చేది నాకు. అంత శ్రమకోర్చి అన్ని ముంజలు కొట్టిచ్చి ఆసాముల కడుపు నింపినా. పొలంలో తాటి జగ్గలు పడుతున్నాయనీ, ముంజలు గాలికి రాలిపడి వరి పొలం పాడైపోతుందనీ, ఈ తాటి చెట్టు పొలంలో లేకుండా చేస్తామనీ, ఇంకో రెండ్రోజుల్లో మా పొలంలోని చెట్టుకు పన్ను కట్టకపోతే తాడెక్కి కల్లు గీయటానికి వీల్లేదనీ, ఆసాములు కనికరం లేకుండా ఎన్నిసార్లు బెదిరిస్తూ వుంటారో. అవన్నీ ఏమీ పట్టించుకోకుండా, అడిగినప్పుడల్లా ముంజలు కొట్టించిన కతజ్ఞత కూడా చూపరు ఆసాములు. గెల చుట్టూ ఈగల్లా చేరినపుడల్లా నా కోపం నషాలానికంటుతుందందుకే. నాయిన తాడు దిగి ముస్తాదులో కత్తిని సరి చేసుకుంటూ గెలలు పోగేసిన కాడికి వచ్చిండు. ఒక రాయిని దొర్లించి దాని పైన గొంతుక్కూర్చుని గెల నుండి ముంజలు విడదీసి కొట్టటానికి సంసిద్ధమయ్యాడు.
''ముంజలంటే నర్సిమ్మ కొడుతుంటెనే చూడాల్నే. పట్నం నుంచి కొడుకొచ్చిండుగా ప్రేమగా ముంజలు కొడుతుండు చూడు.'' వెంకట్ రెడ్డి మామ నాయిననుద్దేశించి రాంరెడ్డి పటేలుతో అంటుండు.
యాదిరెడ్డి పటేలు జీతగాడు ముత్తయ్య కూడా మాటలు కలుపుతూ, ''అవును పటేలా! ఈ నర్సన్న ముంజలు కొట్టినట్టుగా ఊల్లెకల్లి ఇంకెవలకీ ఇంత బాగ సేతగాదు. నర్సన్న చెయ్యి గూడ పెద్దది. ఎవ్వలకు లేదనకుంట ముంజలు కొట్టిస్తడు.'' అన్నడు. ఇవన్నీ ముంజల మహిమతో వచ్చే మాటలా? గుండెల్లోంచి వచ్చేవేనా? అనే అనుమానం నాది. నాయిన చిరునవ్వు నవ్వుతూ,
''ఎప్పుడూ ఈ భూమ్మీద బతుకొచ్చినాంరా. ఉన్నన్ని రోజులు నలుగురి కడుపు నింపేపని చేయడమే నాకిష్టం. నాకు తెలిసిన విద్యేదో నా చేతుల్లోనే వుంది కాబట్టి ఈ ముంజలు కొట్టిస్తున్న మీకు. నేనేమైనా ఎకరాలు రాసిస్తున్ననా?'' అని జీవనతత్వాన్ని చెపుతూ ముంజగెల నుంచి కొడవలితో ఒక పోటు పొడిచి ముంజకాయను గెల నుండి విడదీసిండు. అదలాగే కత్తి మొనకు అంటుకుని వుంది. ఎడమ చేతిలోకి కాయను తీసుకుని కుడి చేతిలోని కొడవలితో మెల్లగా తాటిస్తున్నడు. కత్తి ముంజకాయలో కాస్త లోతుకు దిగగానే కత్తితో మెల్లగా మెటికిచ్చిండు. చెక్క పేడులాగా ముంజకాయ పై పెంకు కొద్దిగాపైకి లేచింది. ఎడమ చేతితో కాయను పైకెగరేసిండు. స్థాన భ్రంశం చెంది నునుపు నునుపు తలం పైకి తిరిగింది. కుడి చేయిలోని కొడవలితో మరో వేటు. మళ్లా మెటికివ్వగానే కాయపై తోలు కొద్దిగా పక్కకు తొలిగి చీలినట్లయింది. ఎడమ చేతితో కాయను ఎగరేయటం, కుడి చేతిలోని కొడవలితో కాయ తోలును కొద్దికొద్దిగా చుట్టూ కత్తిరించటం ఒక క్రమ పద్ధతిలో జరుగుతోంది. కాయ చేతిలో ఒక చుట్టు పూర్తి చేసుకున్నాక. కాయ మెడ చుట్టూ చెదిరిన దాని తోలు డొప్పలాగా పైకి లేచింది. దాన్ని కొడవలితో కొద్దిగా మెటికిచ్చి కాయ పై భాగాన్ని కోసిండు నాయిన.
అంతే! కాయ చుట్టూ లేత గులాబీ రంగులో ఉంగరంలో పొదిగిన వజ్రాల్లా నాలుగు వైపులా నాలుగు ముంజలు తళ తళ మెరుస్తూ సూర్య కాంతిలో గులాబీ నూగులా మెరుస్తున్నాయి. లేత ముంజ అంచున లోపలికి కొడవలి కత్తి మొనను సున్నితంగా జొప్పించి. కొడవలిని మెటికిచ్చిండు నాయిన. అంతే పెంకు నుండి ముత్యం విడివడ్డట్టుగా ముంజ నా చాచిన అరచేతిలో పడింది. ముంజ చల్లదనం గులాబీ వర్ణంతో కలిసిపోయి మెరుపులీనుతోంది. తెల్లగా పాలిపోయి వున్న నా అరచేయి గులాబీ వర్ణం దాల్చింది. నోటితో కొరికాను. ముంజలోని నీళ్లు చల్లగా తియ్యగా గొంతులోకి దిగుతుంటే అమృతం తాగినంత అనుభూతి కలుగుతోంది. నాయిన పడ్డ కష్టమంతా చిటికెలో ఆ ముంజ రుచిలో మాయమైనట్టయింది. కొన్ని కాయల్ని అంతే కళాత్మకంగా రెండు చేతుల విన్యాసంతో కాయ నుండి మెత్తని దూది పువ్వుల్లాంటి లేలేత ముంజలను వెలికి తీస్తూ చుట్టూ చేరిన నలుగురి చేతుల్లో పెడుతుంటే హాయిగా లొట్టలేసుకుంటూ తింటున్నారందరూ.
ముంజ పెకిలి రాలేని కొన్ని లేత కాయలను పై డొప్ప తొలగించి తలను అడ్డంగా కొబ్బరి బొండాం నరికినట్టు కొడవలితో నరికి చేతికందిస్తున్నాడు. వాటిని జుర్రుడు కాయలంటారు. అలాంటిదే నా చేతికోటిచ్చి తినమన్నాడు నాయిన. ముంజకాయ పైన మూడు వైపులా పై డిప్ప కోసేయటం వల్ల పైకి తేలిన ముంజలు ప్రేమ సంకేతం ఆకారంలో కనిపించి మరింత ఊరిస్తున్నాయి. ఎడమ అరచేతిలో ముంజకాయ నుంచి, కుడి చేతి బొటన వేలిని ముంజలోకి జొనిపాను. మదువైన భాగంలోకి వేలు దిగబడగానే చివ్వున పైకి లేచిన ముంజనీటి ధార చెంపల పైనా, ముక్కు పైనా చింది గిలిగింతలు పెట్టింది. నోటికి దగ్గరగా పెట్టి మిగతా నీటిని జుర్రుతుంటే ఆ రుచీ ఆ ఆనందమే వేరు. బొటనవేలిని మెల్లగా తాటిస్తూ ముంజలోని మదువైన పదార్థాన్ని సాంతం పెకలించి తిన్నాక ముంజ కాయకు క్రమ పద్ధతిలో మూడు వైపులా ఖాళీ అయిన మూడు రంధ్రాలు ఆకర్షణీయంగా వుండేవి. ముంజలోని నీటిని, ముంజ గుజ్జుని ఖాళీ చేసినంక మిగిలిన ఆ బుర్రలు ముంజలు తిన్న ఆనందం కంటే మరింత ఆనందిస్తాయి పిల్లలకు. ముఖ్యంగా వాటికి ఒక కట్టె పుల్లను గుచ్చి రెండు చక్రాలుగా మార్చి మరో పొడవైన కర్రతో దొర్లించుకుంటూ వెళుతుంటే చీకి పారేసిన ముంజకాయలు మా బాల్యానందాలకు బండి చక్రాల్లా అమరి ముందుకు సాగే దృశ్యాలు ఇప్పటికీ నా స్మృతి పథంలోంచి చెరిగి పోలేదురా జగదీష్. అని ముగించాను.
*********************
అప్పటిదాకా నేను చెప్పేదంతా సినిమా చూస్తున్నట్టు ట్రాన్సులో వుండి పోయాడేమో. చేతిపై గిల్లగానే ఈ లోకంలోకి వచ్చిండు జగదీష్. ''నగర శివార్లో మనం చూసే ముంజకాయల వెనుక ఇంత కఠోర పరిశ్రమ, ఇంత చక్కని ప్రాకృతిక జీవన శైలి వుందా?'' అని ఆశ్చర్యపోయిండు.
''ఈ సారి బండి నేను నడుపుతా లేరా'' అంటూ తిరుగు ప్రయాణంలో ఊరి నుండి హైదరాబాదుకు వాడే బండి నడుపుతానన్నాడు. అట్లాగే అని నా హెల్మెట్ బండి కీస్ జగదీష్ చేతికిచ్చి వెనుక కూర్చుండి పోయాను. బండి వేగంగా వెళుతోంది. ఇద్దరి మధ్యా మాటల్లేవు. ఒకటి రెండు సార్లు నేనే వాడి చెవి దగ్గరగా తల వొంచి ఏదో చెప్పాలని చూశాను. ఎప్పటిలాగే వేగంగా వీస్తున్న గాలి నా మాటల్ని వాడి చెవిదాకా చేరనివ్వలేదు. నేను మాత్రం వాడి భుజమ్మీద చెయ్యేసి ఆపే ప్రయత్నం చేయలేదు. ఓ గంట ప్రయాణం తరువాత నిన్న ఉదయం మేము ముంజలు కొన్న ప్రదేశానికి రాగానే వాడు సడెన్‌గా బ్రేకేసి బండాపాడు. ఆశ్చర్యపోయిన నేను ''అదేమిట్రా మళ్లీ బేరాలాడుతావా? నిన్న నాకు కోపం తెప్పించింది సరిపోలేదా?'' అన్నాను బండి దిగుతూ. హెల్మెట్ తీసి నా చేతికిస్తూ, బండి కీస్ చేతిలో పట్టుకుని బండి సైడ్ స్టాండేసి. రోడ్డవతలి వైపుకి చూస్తూ నన్ను ఫాలో అమ్మన్నాడు. వీడి విచిత్ర ధోరణి అర్థం కాక అనుసరించాను. నిన్నటిలాగే ఓ నాలుగైదు ముంజగెలలు సిద్ధంగా వున్నాయి. వాటి పక్కనే కాస్త దూరంగా ముంజలు కొట్టినంక మిగిలిన చెత్త పోగుపడి వుంది. వాళ్లిద్దరూ భార్యాభర్తలని తెలుస్తూనే వుంది. భర్త ముంజలు కొట్టి కవర్లో వేస్తుంటే, భార్య గెల నుంచి కాయల్ని తొలగించి భర్త చేతికందిస్తూ సాయపడుతోంది. వారి వెనుక సగం కూలిపోయిన తాటి పాకొకటున్నది. దాని లోపల కూడా ఓ నాలుగు ముంజ గెలలున్నాయి. వాటి పక్కనే చిన్న కర్రపుల్లను మట్టిలో గీస్తూ ఆడకుంటోంది ఒక పాప. బహుశా వాళ్ల పాపయ్యుంటుంది. మా ముందో కారాగి వుంది. వాళ్లు చేతులతో పట్టుకున్న కవర్లో తాజా ముంజలు కొట్టి వేస్తున్నాడు భర్త. వాళ్లిచ్చిన డబ్బులు తీసుకుని పక్కనే వున్న ఓ గుడ్డముక్క కింద దాచి పెట్టి మళ్లీ ముంజకాయలందించటంలో సాయ పడుతోంది భార్య. ముంజల జిడ్డంతా బట్టలకూ, దేహాలకూ అంటుకుని వాళ్లు నల్లగా ముంజకాయల రంగులోనే ఎండ పొడలో మెరిసిపోతున్నారు.
''పెద్దాయనా! ఈ సారి నాకు నాలుగు డజన్ల ముంజలు కావాలె. త్వరగా కొట్టి ఓ కవర్లో వేయి.'' కవరు ముందుకు సాచాడు. వాడి వింత ప్రవర్తనకి నేనే ఆశ్చర్యపోతుంటే వాడు చాచిన కవరు వంక వాడి ముఖం వంక ముభావంగా చూస్తున్నడు ముంజలు కొడుతున్న పెద్దాయన. బేర మాడకుండా నాలుగు డజన్లు ముంజలు కావాలనగానే పెద్దాయనకూ అనుమానమొచ్చినట్టుంది.
''డజనెంత పెద్దాయనా?'' అడగనే అడిగిండు జగదీష్. గుండెలో రాయి పడింది. వీడు మళ్లీ బేరానికి దిగుతాడని నేనూ, వీడెవడో గీచి గీచి బేరమాడితే గానీ నా దగ్గర ముంజలు కొనే బాపతి కాదు అని, ఆ పెద్దాయనా ఏకకాలంలో మనసులో అనుకుంటున్నట్లు మా ముఖాలు చూస్తే తెలిసి పోతుందెవరికైనా.
''నిన్న తీసుకున్నరు గద సారూ! గదే ఇరవై రూపాలకు డజను.'' అన్నాడు అనుమానం పూచిన కళ్లతో పెద్దాయన.
''ఒకే ఒకే! నాలుగు డజన్లకు నాలుగు ఇరవైలు ఎనభై రూపాలు. ఇంద!'' అంటూ ఆ పెద్దాయన భార్య చేతికి వంద నోటు అందించాడు జగదీష్. అనుమానంతో కూడిన ఆశ్చర్యంతో ఆమె కళ్లు పెద్దవయ్యాయి. ఆమె ఎనభై పోను మిగతా ఇరవై గుడ్డ ముక్కను తొలగించి తిరిగివ్వబోతుంటే. ''వద్దమ్మా! వంద వుంచండి.'' అన్నాడు జగదీష్. నిన్న ఆ రకంగా బేరమాడి మీకు చిరాకు తెప్పించినందుకు సారీ పెద్దాయనా! నువ్వు ముంజలు కొట్టటం చాలా అద్భుతంగా వుంది. నీ ముంజలు కూడా చాలా రుచిగా వున్నాయి. అంటూ నా వైపు చూసి కన్ను గీటి ముంజల కవరు పట్టుకుని రోడ్డు దాటాడు జగదీష్. నా కళ్లల్లోని ఆశ్చర్యాన్ని గమనించినవాడిలా
''ఒరేరు! నగరంలో పెద్ద పెద్ద షాపింగ్ మాళ్లకు పోయినప్పుడు మనం వస్తువుల మీద ఎంత రేటు వుంటే అంత రేటు, నోరు మూసుకుని క్యూలో నిలబడి మరీ, చెల్లించి తెచ్చుకుంటాం. అదే తోపుడు బళ్ల దగ్గరా, రోడ్డు పక్క పల్లె కారులు అమ్మే నిత్యావసర ప్రకృతి పదార్థాల దగ్గర మాత్రం గంటలు గంటలు గీచి గీచి బేరమాడుతాం. ఎంతో శ్రమకోర్చి పల్లెనుంచి పట్నం దాకా స్వచ్ఛమైన పుట్ట తేనెలాంటి ఆహార పదార్థాలను, పండ్లను కూరగాయలను మనకోసం తెచ్చి అమ్మి పొట్ట పోసుకునే పల్లెకారులకు ఓ ఐదు రూపాయలు ఎక్కువిస్తే మన సొమ్మేం పోతుంది. నీ ముంజల అనుభవం విన్నాక నా మీద నాకే అసహ్యమేసిందిరా. డజను ముంజకాయల కోసం ఐదు రూపాయల దగ్గర అరగంట బేరమాడిన నా కురచ బుద్ధిని చూస్తే నాకే అసహ్యమేసింది. ఐలవ్ యూ డియర్ ఫ్రెండ్.ఈసారి మన ఊళ్లో మీ నాయిన లెక్క ఎవరైనా ముంజలు కొట్టేవాళ్లు కనబడితే తనివితీరా చూసి, ఓ బండెడు ముంజకాయలు కొనుక్కొచ్చి పట్నంలో మన స్నేహితులందరికీ పంచి పెడదాం. ఏమంటావ్?'' అంటూ చేయి కలపబోయి ఆగి నమస్కరించాడు. కరోనా కాలం కదా!
-చిత్తలూరి, 8247432521