Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పటి మధ్య జర్మనీ రాజధానుల్లో ఒక చోట జరిగిన కూలి సంఘం తిరుగుబాటును ప్రజలింకా గుర్తుంచుకున్నారు. విప్లవానంతరం జరిగిన ఆ భయానక దమనకాండ తాలూకా జ్ఞాపకాలు వారి మనసుల్లో ఇంకా తాజాగా ఉన్నాయి. వేలాది కూలీలు మహోద్రేకంతో గుమిగూడారు. వీధుల్లో మార్చ్ చేస్తూ నినాదాలిస్తూ కదం తొక్కుతున్నారు. ఒకటి ఫిబ్రవరి ఉదయాన దట్టంగా మంచు కురుస్తున్న వేళ వీధులన్నీ కిక్కిరిసిపోయి అల్లకల్లోలంగా ప్రతిధ్వనిస్తున్నాయి. న్యాయపోరాటం సాగిస్తున్న కూలి సంఘం సభ్యులతో పాటు, కొందరు జులాయి వెధవలు, సరదా రాయుళ్ళు కూడా ఊరేగింపులో కలిశారు. ఊరేగింపును అదుపు చేయడం పోలీసులకు వశం కావడం లేదు. అది అదుపు చేయలేనంత ప్రమాదకరంగా తయారైంది. దుకాణాల, కేఫ్‌ల, హోటళ్ళ షటర్లన్నీ కిందికి దిగాయి. వెంటవెంటనే వాటికి తాళాలు పడ్డాయి. ఇండ్ల తలుపులన్నీ ధబాలుమని మూసుకుపోయాయి. ఉత్సుకతతో, ఆందోళనతో ఉన్న ముఖాలు కిటికీల గుండా కనిపిస్తున్నాయి. భయభ్రాంతులైన వారి ముఖాల్లో అభద్రత తాండవిస్తోంది. ఊరేగింపు దగ్గర పడుతున్న కొద్దీ వారు వణికిపోతున్నారు.
ఊరేగింపును గాని, అందులోని ఉద్రేకాన్ని గాని ఆపే శక్తి ఎవ్వరికీ ఉన్నట్టు లేదు. ఇండ్ల తలుపుల మీదరాళ్ళు పడుతున్నాయి. కిటికీ అద్దాలు పగిలి ఫెళఫెళమని రాలి పడుతున్నాయి. వ్యర్థ ప్రయత్నంగా అక్కడక్కడ తుపాకులు పేలుతున్నాయి. పోలీసులు లాఠీలు, కత్తులు ఏవి బయటికి తీసినా.. లాభం ఉండడం లేదు. అవి స్వయం రక్షణ కోసం వారికి పనికొస్తున్నాయేమో గాని, కూలి సంఘం సభ్యుల్ని అదుపు చేయలేకపోతున్నాయి. అరుపులు, కేకలు, నినాదాలు ఉద్రేకపూరితంగా ఉంటూ, వాతావరణాన్ని బీభత్సం చేశాయి. చేతులన్నీ పిడికిళ్ళు బిగిస్తున్నాయి. కళ్ళు కోపంతో పగతో, ప్రతీకార కాంక్షతో మండిపోతున్నాయి.
మగవాళ్ళు ముందుకు దూకడానికి దారి విడుస్తున్న స్త్రీలు తమ పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకుంటున్నారు.
గాలి అగ్నిమయమై పోయింది-
హత్యలు, లూటీలు జరగడం ఇక తప్పదన్నట్లుగా ఉంది-
అలాంటి సమయంలో ఊరేగింపును చీల్చుతూ, నగరంలోని ముఖ్య కూడలిలోకి ఒక గుర్రబ్బగ్గీ దూసుకొచ్చింది. అదేదో ఫర్నీచర్ మోసుకెళ్ళే వ్యాన్ లాగా అనిపిస్తోంది. వ్యాన్ గోడలు ఇనుపవో, చెక్కవో కావు. వదులుగా వేలాడేసిన కాన్వాసు గుడ్డవి.
నలువైపులా ఆ గుడ్డ మీద రాజచిహ్నం కనబడుతూ ఉంది. కొద్ది కాలం క్రితం వరకు ఆ దేశాన్ని పాలించిన రాజకుటుంబీకుల చిహ్నమది! ఆ చిహ్నం ఊరేగింపులోని రైతు సంఘం కార్యకర్తల్ని మరింత రెచ్చగొట్టింది. ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలిస్తున్నారో అదే ప్రభుత్వానికి చెందిన వాహనం కనబడే సరికి, వారి కోపం కట్టలు తెంచుకుంది. గుంపులు గుంపులుగా దాన్ని చుట్టుముట్టి, నాశనం చేయడానికి ప్రయత్నించారు.
మానవహారంగా ఏర్పడి వాహనాన్ని రక్షిద్దామని ప్రయత్నించిన పోలీసుల యత్నం ఫలించలేదు. ఊహించని పరిస్థితి ఎదురయ్యేసరికి గుర్రబ్బగ్గీ నడిపేవాడు బెదిరిపోయాడు. చేతిలోని కళ్ళాలు లాగి, రెండు గుర్రాల్ని అదుపు చేశాడు. అవి ఆగనైతే ఆగాయి కాని, భయంతో జనం మీదికి గెంతనారంభించాయి.
గుర్రబ్బగ్గీ వెనక నుంచి ఒక సాయుధుడైన సైనికుడు కిందికి దూకాదు. రైఫిల్ ఎక్కుపెట్టి కాల్చడానికి ప్రయత్నించాడు. యుద్ధానికి రంగర సిద్ధమైంది. కాని, ఎవరో మెరుపుదాడి చేశారు. సాయుధుణ్ణి క్షణంలో మట్టి కరిపించారు. బండి వాడి ఆర్తనాదాలు ఎవరూ వినిపించుకోలేదు.
జనం కాన్వాసు గుడ్డ లాగేసారు. పీలికలు, పీలికలుగా చిన్న చిన్న ముక్కలుగా గుడ్డని చించేశారు-
ఫ్రేం నుంచి గుడ్డ లాగేయగానే మహా మహా బలశాలురు సైతం భయంతో కంపించి పోయారు. దగ్గరున్న వారి ప్రాణాలు పైపైనే పోయాయి. దూరం ఉన్న వారి కళ్ళు సైతం ఆరిపొయ్యాయి. అందరి నోళ్ళూ ఎండిపోయాయి.
అందుకు కారణం - నమీబియన్ సింహం!
గుర్రబ్బగ్గీలో ఉన్నది నమీబియన్ సింహం- చుట్టూ ఉన్న కాన్వాసు లాగేయగానే లోపల ఉన్న సింహం జూలు విదిలించి లేచి నిలబడింది! రాయల్ జులాజికల్ పార్క్ నుంచి దానిని తీసుకొస్తున్నారు. దానికి పెట్టే తిండి ఖర్చు విపరీతంగా ఉండడం వల్ల, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం దాన్ని మరో దేశానికి అమ్మేస్తోంది. ఆ ప్రక్రియలో భాగంగా దాన్ని రైల్వే స్టేషనుకు పంపుతున్నారు.
చుట్టూ వేల జనం ఉన్నా, నిశ్శబ్దంగా కదలకుండా ఉండడాన్ని సింహం గమనించింది. మనుషులు శ్వాస తీసుకుంటున్న చప్పుడు కూడా వినిపించడం లేదు. మెరుస్తున్న సింహం కళ్ళలో ఒక కొత్త ప్రపంచం తళుక్కుమంది. కృత్రిమంగా భయంతో బిగుసుకుపోయిన ప్రపంచం. హద్దుల్లేని ప్రజా సందోహం. వింత వాహనాల ప్రపంచం. బండలాగా, చల్లగా గడ్డ కట్టుకుపోయిన ప్రపంచం-
సింహం మనసులో ఏముందో ఎవరికీ ఏమీ తెలియదు. దానిలో క్రూరమైన కోర్కెలేవైనా తలెత్తు తున్నాయా? జనంలోని నిశ్వాస నిస్పృహలు దానికి ఏమైనా తెలుసా? అసలు ముఖాలను అది గుర్తు పట్టగలుగుతోందా? లేక, పళ్ళు, కళ్ళు, చెంపలు గల మాంసపు ముద్దలనుకుంటోందా? ఏమో తెలియదు.
చుట్టూ ఉన్న మానవ సమూహం అనుకుంటున్నది వేరు. అది సింహానికి తెలియదు|
వారు ఉంటున్న ఇరుకు కొంపల గురించి, వారి చంటి పిల్లల అనారోగ్యం గురించి, పేదరికం గురించి, వారికి జరిగిన అన్యాయాల గురించి, వారు భరించిన అణిచివేత గురించి, వారి వేదనలు, ఆక్రోశాల గురించి, వారి ఆశల గురించి, ఆశయాల గురించి, కలల గురించి, భావనల గురించి, సింహాపిరూయీ తెలియదు. అది వాటన్నిటికీ అతీతమైన ప్రకృతి సృష్టి!.... వారి ప్రపంచానికి అందని స్థాయిలో ఆ మహాసృష్ఠి నిలబడి ఉంది-
ఆ ప్రపంచాన్ని భయం కబళించింది. అందరి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. ఎవరికీ కాళ్ళూ చేతులు కదలడం మౌనం మృత్యుప్రాయమవుతుందో లేక మృత్యువే మౌనంగా నుంచుందో తెలియదు. కొద్దిసేపటికి గుంపులో అక్కడక్కడా ఖాళీ ఏర్పడింది. క్రమక్రమంగా ఖాళీ ప్రదేశం పెరగనారంభించింది. అప్పుడు గాని, ప్రభుత్వ యంత్రాంగానికి పని చేయడానికి వీలు చిక్కలేదు.
పోలీసులు కార్యకర్తల్ని, ఉద్యమ కారుల్ని వెంటనే అరెస్టు చేసి, తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఉద్యమం తాత్కాలికంగా విఫలమైంది-
ఒక ఉద్యమం వెనుక ఎంతటి న్యాయమైన కోర్కెలు ఉన్నా.. విజయపు అంచును తాకడానికి ఎన్నో వైఫల్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రభుత్వాలు, రాజసింహాలై జనాన్ని భయపెట్టొచ్చు-
అది తాత్కాలికం!!
జర్మన్ మూలం : జూకబ్ వస్సెర్మన్
తెలుగు : డా.దేవరాజు మహారాజు