Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఇది మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం మా ప్రభుత్వం ఏం చేసినా మీ కోసమే మీ సంక్షేమం కోసమే...'' తడబాటు లేకుండా ప్రవాహంలా సాగుతోంది ఎమ్మెల్యే ప్రసంగం. టెంట్ కింద కుర్చీలల్ల కూసున్న జనం చెవులు రిక్కరించి వింటున్నారు. అక్కడ ఆడోళ్లు ముందట, మొగోళ్లు ఎన్కుండి ఎమ్మెల్యే మాటలు వినుకుంటా సప్పట్లు కొడుతున్నారు. వారికి ఎమ్మెల్యే అంటే తెలుసు కని ఎలా ఉంటాడో శానా మందికి యాదికి లేదు.
ఎమ్మెల్యే పక్కపొంటి శానా మంది చిన్న, పెద్దా లీడర్లు ఉన్నరు. ఎమ్మెల్యే ఖద్దరు అంగి తెల్లంగా మెరుస్తుంది. ఎమ్మెల్యే పక్కన నల్లని డ్రెస్ ఎస్కోని ఇద్దరు శెరోచేతిల తుపాకులు పట్టుకోని ఆ సుట్టుతా చూస్తున్నారు. ఎమ్మెల్యే పక్కనున్న ఓ లీడరు ఎమ్మెల్యే మాటలకు సప్పట్లు కొట్టండి అని శేతులతో సైగ చేసి చెప్తున్నాడు. ఎందుకొచ్చిన శిక్కని అక్కడున్న జనం అలాగే చేస్తున్నారు. మీకు ఏ సమస్యొచ్చిన మీ కొడుకులాంటోన్ని నేను ఉన్నానని మర్చిపోకండి. మీటింగ్ అయిపోదలకు వచ్చింది. మీ పనులు వదులుకోని ఇక్కడ్కోచ్చిన మీ అందరికి మరోసారి చేతులు జోడించి నమస్కరిస్తున్న అని దండంపెట్టి కారుకెలి కదిలిండు ఎమ్మెల్యే .
''ఓ సారు.. ఓ సారు.. గుంపు లోంచి ఓ పెద్ద మన్షి పిలుపు. ఎడమ భుజం మీద తువ్వాలా, మాశి పోయిన ధోతి, చిరిగిపోయిన బనీను, శేతిలో కాయితాలున్న ఒక సంచి పట్టు కోని నడ్వరాకుంటున్నా కర్రను ఆసరగా చేసుకోని అడుగులో అడుగేసుకుంట ఆయసపడ్తూ సారు...ఓ సారు... శిన్న బెర్కు అన్నది లేకుండా ఎమ్మెల్యే తాన్కి వత్తాండు రత్తయ్య''. అక్కడున్న జనమంత ఆ పెద్దమన్షికేలే సుత్తాండ్రు.
''ఏందోనే ఈ ముసలోడు శీదా ఆ పెద్ద సారు కాడ్కే పోతాండు, ఆయన పక్కపొంటి పోలీసోల్లు ఉన్నరన్న బుగులు కూడలేదు, బలే శిత్రంగా ఉందేమే'' ఇద్దరు ఆడోళ్లు మాట్లడుకుంటున్నారు.
''ఏమాయె రత్తయ్య సార్‌ను అంతగనం పిల్వబడ్తివి ఏందో నా తోని శెప్పు'' అన్నడు సప్పట్లు కొట్టమని సైగ చేసిన లీడరు. ఆయన్ను లెక్క జేయకుంటనే ముంగట్కి కదిలిండు రత్తయ్య. ఇది చూసిన గన్మెన్లు రత్తయ్యను అడ్డుకుందాన్కి ఎదురు పోతాండ్రు. అప్పట్నుంచి పోట్వాలు, ఈడియోలు తీస్తున్న విలేకర్లను గమనించిన ఎమ్మెల్యే ఏదో తేడా కొడ్తదన్న భయంతో ఆగండి ఆగండి ఆ పెద్ద మనిషి దగ్గరకు నేనే వస్తున్నా గన్మెన్లకు చెప్పుకుంట రత్తయ్యకు ఎద్రుపోతాండు ఎమ్మెల్యే.
''ఏంది తాత ఏదో ఆగమాగం వత్తున్నావ్ ఎవల్తోనన్న చెప్పిపంపిన నేను నీ కాడికే వద్దును ఆ పెద్దమన్శితో ఇమ్మర్సగా మాట్లాడుతుండు ఎమ్మెల్యే. ఎమ్మెల్యేను పోట్వోలు, వీడియోలు తీస్తానే ఉన్నరు విలేకర్లు. శేతికర్రను భుజాన్కి పెట్టుకోని చేయి సంచిల పట్కొచ్చిన భూమి కాయితాలు ఎమ్మెల్యేకిచ్చిండు రత్తయ్య.
పొద్దుగూకుతుంది ఆకాశంలో చుక్కలు ఒక్కొక్కటిగా దీపాలెక్క ఎల్గుతున్నరు. గొడ్డు గోదా ఇండ్లకు చేరుకుంటున్నాయి. అప్పుడే గూట్లేకు చేరిన కోళ్లు పొడ్సుకుంటు క్యార్ క్యార్ ముంటూన్నాయి. కొన్ని కోళ్లు బైట యాపశెట్టు మీద్కి శేర్నరు. బైట డప్పు సప్పుడు అయితంది. ఏందో సప్పడు అయితంది అట్లపోయి ఇనత్త దేవమ్మకు చెప్పుకుంట గుడిసెలకేలి బైటికి అడుగేయ్యబోయిండు రత్తయ్య. ''నీ డప్పు సప్పుడు సల్లగుండ శికటైతే కండ్లు కనబడవు అంటవ్, మల్లేదో ఎల్గబెట్టినట్టు బైటకి పొతున్నావ్ కిర్సనైల్ దీపం ముట్టించుకుంట అడిగింది దేవమ్మ. ఆ డప్పు సప్పుడు సాటింపు కావొచ్చు పోరు ఇంట''. ఆ.. కోట బియ్యం కోసమే కావొచ్చు తీరు సప్పుడుజేకా ఈడ్నే కూసో దీపం దుగుట్లే వెట్టింది దేవమ్మ. ''ఎహే... బియ్యం చాటింపు మొన్ననే ఏసిండ్రు అసలు కతేందో బజార్లకు కదిలిండు రత్తయ్య''.
డప్పు సప్పుడు బాగ ఇనొత్తంది, దగ్గర్కొచ్చిండు కావొచ్చు మల్ల దూరం పోతే అయింతా ఇనబడదు దబదబ బైటికొచ్చి నిలవడ్డడు రత్తయ్య. డప్పుమీద చిర్రతో నాలుగు దెబ్బలేసి ''ఇన్నోళ్లూ ఎవలో.... ఇననోళ్లూ ఎవలో..! రేపు మానూర్కి పట్వారి వత్తాండు భూమి పట్టాలు కానోళ్లు, కొంత ఎక్కినోళ్లు, శిన్న శిన్న శిక్కులు ఉన్నోళ్లు ఎవలున్నా రేపు తొమ్మిదింటోర్కు మాన పంచాతి ఆఫీస్‌కు రావాల్నో హౌ....''! మల్ల డప్పు కొట్టుకుంట ముందుకు పోతాండు చాటింపు ఏసేటాయ్నె. ఆయ్న అట్ల అందుకున్నడో లేదో పక్క బజార్న కుక్క మొర్గుడు లక్కించుకుంది. ఆయన చెప్పుడు అయిపోయ్న కూడ కుక్క మొర్గుడు ఆగుతనే లేదు. నీ కుక్క మెర్గుడు సల్లగుండా శనాల్లొచ్చేరా...! జరసేపైనంక మొర్గుతేందో..? శికాకు పడుకుంటా ఆడ్నే బజర్లనే మస్క శికట్లనే ఎవరన్నవత్తరో అని అటు ఇటు చూస్తాండు రత్తయ్య. అట్ల బాటపొంటి పోతున్న మన్షి మాటిని ఓరి ఈరన్న ఇటు రారా...!. ఏటో పోతున్నావ్ ఏందిరో.. పిలిచేసరికి రత్తయ్య దగ్గర్కి వచ్చిండు. ఏందే తాత ఎన్నడు లేంది పనిమాల పిల్సినవ్ ఏం పని పడ్డదేంది నాతోని. ''ఏం లేదురా ఆ చాటింపు ఇందామని బైటికొత్తే ఏడి కుక్కో ఏందో మొర్గేసర్కి వాడు ఏం శెప్పిండో ఏందో పో... ఏది చెవ్ల పట్లే ''అది ఏందో జరచెప్పురా ఈరన్నను అడిగిండు రత్తయ్య. అదానే మన గ్రామ పంచాతి ఆఫీస్ ఉందిగా అక్కడ్కి మానూరి పట్వారి వత్తడంట. రేపు రేపు భూమికి పట్టాలు ఇత్తరట, అందుకే కొన్న కాయితాలు గట్ల ఉంటే ఆయన రాసుకోని విచారణ చేసి మన భూమిని పట్ట చేసి ఇత్తరన్నటు.. ఈ ముచ్చట్లు ఈ మజ్జే టీవీలల్ల కూడ ఇనొత్తందే గంతే'' ఆడ్నూంచి కదిలిండు ఈరన్న.
పట్నంలున్న కొడుక్కు ఈ భూమి పట్టాల చాటింపు గురించి పోన్ శెపిచ్చిండు రత్తయ్య. ''హే ఊకోవే నాయ్నా అది అయ్యేది కాదు పాడు కాదు, గప్పట్ల ఉన్నోక ఎకురంన్నర భూమి కోసం తిరిగి తిరిగి ఆడిన్ని ఈడిన్ని పైసలు పెడ్తే ఓ ఇరువై గుంటలు ఎక్కిచిండ్రు. తతిమ్మది అట్లనే ఉండే ఇప్పుడు కొన్న ఇంకో ఇరువై గుంటల భూమి కలిపి మొత్తం ఎక్కియాలంటే నాతోని కాదు పో... నువ్వే ఏమైన చేస్కోవే ఈడ పని చెడగొట్టుకోని దాని కోసం తిరిగితే పని అయ్యేది ఏందో... కాంది ఏందో పో..! ఈడున్న నాలుగు పైసలన్న వత్తారు. నువ్వు అవ్వ జర పైలం పోన్ పెట్టేసిండు కొడుకు సురేష్. వీడు గిట్లంటడేంది వీందో లోకం... లోకం మీద అందరు ఎప్పుడు అదునుదొరుకుద్దా అని సూత్తాంటే వీన్కి పేను పారినట్టు కూడ లేదేంది. విస్సుకుంట ఇంటికి నడ్శిండు రత్తయ్య.
''వూర్లో అంతా చిన్నపాటి జాతర లెక్క కొడ్తాంది. వయసు పోరలు, నడీడోళ్లు, ముసలి ముత్కోళ్లు ఎవ్వలి చేతిల చూశ్నా కవర్లు, కాయితాలే కానొత్తున్నరు''. పంచాతి ఆఫీస్ తాళమే తియ్యలేదు మన్శి పోను సందులేకుంట ఆఫీసు చుట్టు ఈగలోలే ముస్రుకున్నరు జనాలు. నేను గూడ ఎవల్కన్న సద్వుకున్నోళ్లకు భూమి కాయితాలు సూపిత్తా. భూమి కాయితాలు పట్కొత్తాన్కి ఇంటికెలి కదిలిండు రత్తయ్య.
ఈ ముచ్చటంతా గుడిశెలున్న దేవమ్మకు శెప్పిండు. మంచిదే గని తెల్సినోళ్లకు సూపెట్టి ఇంత తినిపోయి ఆడకూసో ఈ పాలి అందరితోపాటు మనది సూతం కావొచ్చు తలెలో బువ్వెస్కొచ్చి రత్తయ్యకు ఇచ్చింది. తినుడు అయిపోగానే కాయితాల కవర్ పట్టుకోని పంచాయతీ ఆఫీస్కాడ్కి పోయిండు. అప్పట్కి, ఇప్పట్కి జనం ఇంకింత ఎక్కువైండ్రు. ఎవుసం చేసుకుంట భూమి పట్టకాకుండ ఇంతమంది ఉన్నరా..! ఒక్కసారే గుండె మీద చేయ్యి ఎస్కుండు రత్తయ్య. అక్కడ ఎవ్వలు మాట్లాడుకున్న నేను శానాసార్లు తిర్గిన అంటే నేను గూడ శానా సార్లు సార్ల సుట్టు తిర్గిన పట్టా కోసం అని మాట్లాడుకుంటున్నారు. అందులో కొందరు నాలుగు అక్షరాలు వచ్చినోళ్లు సుతం ఉన్నరు. వాళ్లను చూస్తాంటే మావోడు చెప్పిందే అయ్యోతట్టు కొడ్తాంది. ఇక ఈ పట్టకాదు కాబోలు అని ఆలోచనలు చేస్తుండగా డుర్ర్...మంటూ సప్పుడు చేసుకుంటా బైక్ వచ్చి ఆగింది. షేష్కందులు వచ్చి జరుగుర్రి జరుగుర్ని అని పట్వారి దగ్గర్కి వచ్చి ఆయన చేతిలో ఉన్న బ్యాగ్ అందుకోని ఆపీస్ తాళం తీసి ఆ బ్యాగ్‌ను టెబుల్ మీద పెట్టిండ్రు. పట్వారి వచ్చి కుర్చీల కూసుండు. అప్పట్కే గేటు కాడ చిన్నపాటి లొల్లే మోపయింది. ముందు నేనొచ్చిన అంటే హే.. కాదు నేనొచ్చిన అనుకుంటా జనాలు ఒకలికొగలు తోసుకుంట్రుండు. వాళ్లతో నెగులుడు శాతకాదు అనుకున్న రత్తయ్యలాంటోళ్లు అందరు పోయ్నంకనే పోదాం పట్టు అని ఒచ్చొర్కు కూసున్నారు.
వాళ్లు ఎంత గీంలాడుతున్న సరే ఇద్దర్నిద్దర్ని మాత్రమే లోపల్కి తోలుతుండు షేష్కందు. ఒక పెద్ద బుక్కులో వాళ్లను వివరాలు అడిగి రాసుకోని వాళ్లకు మల్లోక కాయితం ఇచ్చి ఇందులో కొన్ని వివరాలు సదువుకున్నోళ్లతోని నిపించుకొని, కొన్న కాయితాలు ఏమైనా ఉంటే జీరాక్స్ పెట్టి మళ్ల తీస్కరమ్మంటున్నడు పట్వారి. శానా మంది మళ్లీ జీరాక్సుల కోసం ఆగమాగం అయితార్రు. ఊరోళ్లు కొందరు షేష్కందును బెద్రిచ్చిమరి లోపల్కి పోతారు. వాళ్లను చూసి పట్వారే నమస్తే పెడ్తుండు. లైన్ల ఉన్నోళ్లు లైన్లనే నీల్గుతూ వాళ్లకు పల్కుబడుంది కాబోలు అని దీనంగా చూస్తున్నారు. జనం వత్తాండ్రు, పోతాండ్రు అప్పట్కే టైం పగటాల్ల అయ్యింది. నిద్రలోకి జారుకున్న రత్తయ్య షేష్కందు పిలుపుతో మెలుకువలోకి వచ్చిండు. చేతిని భూమ్మిద అనిచ్చి నిమ్మలంగా లేచి పట్వారి తాన్కి పోయిండు. రత్తయ్య వివరాలు కూడ పట్వారి కాయితం ఇత్తే రాతపూత వచ్చినోళ్లతోని రాపిద్దాన్కి బైటికిపోయిన రత్తయ్య అన్ని సవరించుకోని తీస్కోని మల్లోచ్చేసార్కి గేటుకు తాళం వేస్తు కనిపించాడు షేష్కందు. ''ఏంది పట్వారి ఎటు పోయిండు అప్పుడే గేట్‌కు తాళం వేయ్యబడ్తివి షేష్కందును అడ్గుతుండు రత్తయ్య. ఆ... నువ్వు పెద్ద సార్వు వత్తన్నవని ఈడ్నే ఉంటడు... ఎప్పుడో ఇంటికి పోయిండు... రేపు రాపో. కోపగించుకుండు షేష్కందు. చేసేది ఏం లేక పాలిపోయి మొఖంతోని అడుగులో అడుగేస్తు ఇంటిదారి పట్టిండు రత్తయ్య.
రోజులు, వారాలు గడిశినయి. పట్వారి పత్తకు లేడు... ఇదే ముచ్చట షేష్కందులను అడిగితే రేపోత్తడు మాపోత్తడని పొద్దపుచ్చుతారు. ఆ పట్వారి పోయిన పోకడే కానీ ఇంత వరకు వూళ్లోకి రాలేదు. ఒకలిద్దరూ వాళ్ల వాళ్ల పట్టాలు ఎంత వరకు వచ్చినయో తెలుసుకుందాన్కి పంచాతీఆఫీస్ కాడ్కి వచ్చిన వాళ్లకు నిరాశే ఎదురైతంది.
కొందరు ఊల్లో లీడర్లను పట్టుకోని పట్నంల ఎమ్మార్వో ఆఫీస్ కాడ్కిపోయి పని చేయించుకుంటున్నరన్నా ముచ్చట రత్తయ్య చెవిలో పడింది. మల్లోసారి గుండె గుబెల్ మంది. భూమిపట్టా అయితది అనుకున్న ఆశ కూడ ఇప్పుడు లేదు రత్తయ్యకు. తనకు పెద్దగా ఏం తెల్వదు ఎవల్ని పట్టుకోని పట్టా చేయించుకోవాలో ఏం పాలుపోవడం లేదు రత్తయ్యకు.
భూమి పట్టాలకోసమే పట్వార్ని కలుద్దానికి ఒకసారి పట్నం పోయిండు రత్తయ్య. దీనంగా మండలం ఆఫీస్‌ల కానుగశెట్టు కింద బండ మీద కూసోని ఆలోచన చేస్తాండు. రత్తయ్యను ఎవ్వల్లు పట్టించుకోవడం లేదు. ఎవల్ని అడగాల్నో ఏం అర్థఅయిత లేదు. ''దీనవ్వ పట్టలేదు గిట్టలేదు నేను మేడి పట్టినకాంచి పట్టాలేంది పని చేయలేదా..? పట్టా లేని భూమి పంట పండను అన్నదా..? ఈ పట్టా అయితే ఏంది కాకూంటే ఏంది ఇంతతిని కూసోకా ఎందుకు నాకు ఈ చిక్కు'' గుండె దైర్యం తెచ్చుకోని ఇంటితొవ్వ పడ్దాన్కి లేచి నాలుగు అడుగులు వేసిండో లేదో... ఎవరో తెల్లబట్టలు, జేబులో పెన్ను పెట్టుకున్నన వ్యక్తి ఇంకో వ్యక్తి మాట్లాడుకుంటున్న మాటలు వినపడి వినపడనట్టుగా వినిసిస్తున్నాయి ఏందో అని చెవులు రెట్టింటి కొంచెం వాళ్లకు దగ్గరకు జరిగాడు రత్తయ్య.
''ఏందన్న ఎన్నడు లేంది జనాలు ఒక్కటే భూమి పట్టాలు అని ముసలి ముత్కా అంతా కలిసి ఇక్కడ పడ్డారు ఆశ్చర్చంగా అడిగాడు ఒక వ్యక్తి. అదా...! ఏం లేదురా భూమి పట్టాలు ఉన్నోళ్లకే లోన్లు గట్టా ఇత్తున్నారు కదా. దాంతో పాటు ప్రభుత్వం కూడ ఏదో కొత్త పథకం పెట్టిందంటా. దాని కోసం కూడ భూమిపట్టా అయితేనే ఈ పథకం వర్తిస్తదట చెప్తుండు తెలిసిన వ్యక్తి. అది కాదు అన్నా.. ఎవ్వలు కూడ అనుకోలేదు కదా...!. ఇదింక పూర్తిగా ఎవ్వలకు తెల్వదు త్వరలోనే ప్రకటిస్తారంట అనుకుంటుండ్రు. అందుకే సర్కార్ పనిగట్టుకోని దీన్మిద పడ్డది కావొచ్చు..!. ఇంత కత ఉందన్న. ఆ... మరి ఏమనుకున్నావ్ ఇంగో ఆ చెవ్వు ఇటేరు ''పట్టా కోసం జనాలు ఎన్ని పైసలన్న ఇచ్చి శేపిచ్చుకుటున్నరు. పైసలు తీసుకునుడు తప్పు కదన్న.. ఏహే వాళ్లు సూత ఏమ్ అడ్గుతలేరు జనాలే మాది తొందర కావాలంటే మాది తొందర కావాలని డబ్బులిత్తాండ్రు. కొందరు దీన్నే ఆసరగా తీసుకోని పైసలు తీసుకోనే పని జేత్తాండ్రు... ఆ అది సంగతి. ఇంగో కొందరు రైతులు ఒకలు జేపిచ్చుకుంటారు అని ఒకలు వత్తాండ్రు అసలు ముచ్చట పైసలోచ్చే పని అన్నట్టు...!'' మాట్లాడుకుంట మాట్లాడుకుంటా ఆడ్నూంచి కదిలిండ్రు.
ఇదంతా విన్న రత్తయ్య మళ్లీ ఆలోచనలో మునిగి పోయిండు. ఉత్తప్పుడు పట్టా చేద్దాన్కే మా వోడు డబ్బులిచ్చిండు అంటే ఇప్పుడు ఏవో డబ్బులు, లోన్లు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటుండ్రు. ఇయ్యాల పట్వారి కల్వనే లేదు. రేపోద్దున ఏట్టైనా కల్సి బతిమాలో బామాలో కాళ్లన్న పట్టుకోని పట్టా చేయించుకోవాలే. ఇంటికి పోదాన్కి ఆటో కోసం తొవ్వ పట్టిండు రత్తయ్య.
తెల్లారింది ఇయ్యాల పట్వారి ఊల్లేకు వత్తాడో రాడో కనుక్కోని రాడని తెల్సినంక పట్నం పోవాలని కవర్లో పట్వారి అప్పట్లో చెప్పంగ రాయించుకోచి వచ్చిన కాయింతం, జీరాక్సులు తీసుకోని ఆటో ఎక్కిండు రత్తయ్య. ఎమ్మార్వో ఆఫీస్‌లోకి అడుగుపెట్టిండో లేదో అదష్టం తన కోసమే ఎదురొస్తుంది అన్నట్టుగా పట్వారి ఎదురైండు. దండం పెట్టి ''ఇగ్గో సారు నీ కోసం వారం దినాల సంది చూస్తున్న అస్సలు ఉర్లకే వత్తలేదు.. ఇక్కడికే వచ్చి ఇద్దామని నిన్న వచ్చిన మీరు మీటింగ్‌కు పోయిండ్రని ఇగ వత్తారో.. అగొత్తరో అని చూసి చూసి ఇంటితొవ్వ పట్టిన నా అదట్టం కొద్ది దేవుని లెక్క మీరే ఎదురొచ్చిండ్రు''. ఇగోండి సార్ కాగితాలు.. తీస్కోని పరిశీలించినట్టు చూసిండు పట్వారి. అంతా బాగానే ఉందయ్యా నాల్గురోజులు ఆగాక ఊల్లేకొత్తా అప్పుడు సాక్షి సంతకాలు కావాలె, అయ్యి అయితే అప్పుడు నీ భూమి పట్టా అవ్వడం ఖాయం. చెప్పకనే చెప్పిండు పట్వారి అట్నే సారు పోయ్యొత్తా. ''ఇంత జల్దిన అయ్యేదాన్కి వాళ్ల మాటల విని ఏందో అనుకున్న లంచాలు అని ఏవో పెద్ద మాటలు విన్న అవన్నీ ఉత్తారు గాలి మాటలు అనుకోని భూమి పట్టా అయితదన్న సంబురంతో తనలో తాను మాట్లాడుకుంటుటా ఇంటి బాట పట్టిండు రత్తయ్య.
నెల రోజులు దాట్నారు. మళ్లీ పాత కత అయింది అనుకుండు రత్తయ్య. పట్వారి నుంచి ఎటువంటి మతలాబు లేదు ఏం లేదు..!. ఎవరో చెప్తే ఆరోజే తెలిసింది ఊర్లో ఒకలిద్దరి లీడర్లింటికే వచ్చి రహస్యంగా పోతండు అని అట్నే వాళ్లు చెప్పెటోళ్లకే పట్టాలు ఎలాంటి విచారణ అన్నది లేకుండా చేస్తాండు అని. తను ఏం చేయ్యాలో పాలు పోవడం లేదు. ఆరోజు ఎమ్మార్వో ఆఫీస్‌లో వాళ్లు మాట్లాడిన మాటలే గుర్తోచ్చాయి అదే ఇప్పుడు అసలు నిజం అని తెలిపోయింది రత్తయ్యకు. ''ఏందో అని పట్వారి వచ్చిపోయే లీడర్ల ఇంటికి పోయి తన పట్టా గురించే చెప్పిండు. వాళ్లు ఏమాత్రం మోహమాటం, సిగ్గు లేకుండా పైసలిత్తనే పట్టాలు అయితున్నాయని ఖరాకండిగా చెప్పిర్రు. అండ్ల ఆ లీడలర్లకు ఇంత కమిషన్ అంటా..!''. ఆ మాట వినగానే రత్తయ్య మొఖం వాలిపోయింది. ఏదో తెలియని భయం వంట్లో జొరబడ్డది. సర్కార్ చెప్పింది కావట్టి పుణ్యానికే చేస్తుండ్రు అందుకే ఇంతకాలం పడుతుంది అనుకున్నా? కానీ ఇది అసలు మర్మం అని అర్థమైంది రత్తయ్యకు.
వాళ్లను వీళ్లను అడిగిండు ఎవ్వలూ చూద్దాం అంటున్నరు గని ఎవరు ముందట పడేత్తలేరు. ఆశలు సన్నగీల్లాయి. పట్వారి జాడ కూడ లేదు. ఆయన తీసుకున్న కాయితాలు ఎటు పోయాయో ఏమో. అని ఇంకో రెండు సార్లు అదే ఎమ్మార్వో ఆఫీస్‌కు పోయిండు ఎవ్వరో తెలిసిన వ్యక్తి ఉండి ఎమ్మార్వోని కలిస్తే నీకు ఏదో ఒక పరిష్కారం దొరుకుతదని చెప్పిండు. ఆ ఎమ్మార్వో కాడ్కి పోదామంటే తలుపుకాడున్న అటెండర్లు అస్సలు పోనియ్యలేదు. కనీసం పట్వార్నన్న కలిపియ్యమంటే ఎవ్వరు సప్పుడు జేత్తల్లేరు. ఏంది బయట ఏదో సప్పుడు లోపలి నుంచి ఎమ్మార్వో.. ఏం లేదు సారు, ఎవడో ఎంతశెప్పిన ఇనిపించుకోట్లే అన్నరు బైటున్నోళ్లు. ఆకర్కి ఒక్కసారి ఏదో సాయం చేయమని వాళ్ల కాళ్ల మీద పడ్డడు రత్తయ్య. ఇంత కనికరం లేకుండా బైటికి తోసిండ్రు. చేసేది ఏమి లేక కళ్ల నీళ్లు తీసుకుంటా సతంత్రమోచ్చి ఇన్ని ఏండ్లు అయిన నాలాంటి ముసలోడు వత్తే ఇంత కనీకరం లేకుండా తోసేస్తారా..!. ఈ పట్టా బుక్కుల మీద మన్నువడ, కాలిపోను. నేను ఎవుసాం చేసినప్పుడైనా ఇన్ని తిప్పలు పడలేదు కంట నీరు కారుతూనే ఉంది. అదే భూమికాయితం తెచ్చిన కవరు పట్టుకోని నీరు కారుతున్న కండ్లను తువ్వాలతో వత్తుకుంటా ఇగ మా బతుకులు ఎప్పుడు బాగుతాయో అని బాధనంతా గుండెలో మోసుకంటు, తూలుతునే మళ్లీ ఇంటి తొవ్వ పట్టిండు.
ఊర్లోకి రాగానే ఊరి పొలిమేర కాంచి ఏవో ఫోట్వాలు, అక్షరాలున్న వాటిని గోడలకు, రోడ్డుపైన అటు ఇటు దారాలు వెలాడదీసి కట్టిండ్రు. అందులో కొన్నిటిలో వాల్ల ఊరోల్ల పోట్వాలు కూడా ఉన్నాయి... ఏందో ఏమో ఏం జేత్తారో అనుకున్నడు ఆలోచన చేస్తు ఉండగా రత్తయ్య దిగాల్సిన తావు రానే వచ్చింది. అవే ఆలోచనలోని ఆటో దిగబోతుండే జారి కిందపడ్డడు. ఆ సడక్ పక్కన కూసున్నోళ్లు అందరూ ఒక్కపాలిగా లేచి వచ్చి లేపిండ్రు. అందరు పట్టుకోని పోయి ఇంటికాడ మంచంల పడుకొబెట్టింర్రు. అప్పట్కే పొద్దు గూకుతుంది ముసల్ది రాగానే చెప్పి ఎక్కడోళ్లు అక్కడ పోయిర్రు. ముసల్ది చూసి నాలుగు దులుపులు దులిపింది.. ఏం పట్టో పాడో, పుసుక్కున జారి పడ్డప్పుడు కాలో, చెయ్యి ఇర్గిందనుకో ఏంగాను దెబ్బ తాకిన కాలుకు కరంటు వాయిలు రాసింది దేవమ్మ.
చీకటి పడింది. మల్ల డప్పు సప్పుడు ఇన్నోళ్లూ ఎవరో... ఇనానోళ్లు ఎవరో రేపు మానూర్కి ఎమ్మెల్యేగారు వత్తున్నరు అందరు రావాల్నో హో....! చెప్పుకుంట పోతాండు చాటింపు వేసే వ్యక్తి. ఏదో పని మీద రత్తయ్య ఇంటికొచ్చిన ఈరన్న ఆయన పరిస్థితి చూసి ఏందన్నట్టు అడిగిండు. రత్తయ్య జరిగిదంతా చెప్పిండు, అన్ని విన్న వీరన్న ''రేపు మనూర్కి ఎమ్మెల్యే వస్తాండంటా...! శీదా కాయితాలు పట్టుకపోయి నీ బాధంతా ఆయనతో చెప్పు ఏమైనా న్యాయం జరిగితే జరగోచ్చు మల్ల ఎమ్మెల్యేను కలవా లంటే మన వల్ల కాదు వచ్చిన పని చూసుకోని ఆడ్నూంచి కదిలిండు వీరన్న. ఇంత తిని పడుకున్నరు రత్తయ్య దంపతులు.
తెల్లారి వీరన్న చెప్పినట్టు ఎమ్మెల్యే మీటింగ్కచ్చి మాట్లాడుడు అయిపోగానే ఎమ్మెల్యే కాడ్కి పోయిండు రత్తయ్య. రత్తయ్య ఇచ్చిన కాయితాన్ని చూసిండు ఎమ్మెల్యే. అక్కడ్నే ఉన్న పట్వార్ని, ఎమ్మార్వోని పిల్చిండు. రత్తయ్య కేలి కోపంగా చూస్తాండ్రు చప్పట్లు కొట్టమన్న వ్యక్తి, పట్వారి. అధికార్లకు చెప్పిండు ఈ పట్టా సంగతి ఏందో చూడమని ఎమ్మెల్యే. తాను పడ్డ బాధనంతా చెప్పిండు రత్తయ్య పూర్తిగా విన్న ఎమ్మెల్యే ఇలాంటి సమస్యలు ఎవలెవలకు ఉన్నాయే కనుక్కోమని ఆఫీసర్లకు ఆర్డరేసిండు, విలేకర్లు పోట్వాలు తీసిండ్రు. ఆరోజు ఊరంతా ఇదే ముచ్చట మీద మాట్లాడుకున్నారు. మరుసటి రోజు పేపర్ల ఇదే వార్త వచ్చింది. అందరు చూసి మురుస్తున్నరు. ఎమ్మెల్యే చెప్పిన తర్వాత రెండు రోజులు ఆఫీసర్లు ఆ వూరోళ్లనే మకాం వేసిండ్రు. భూములు కొలవడాలు మళ్ల ఫిర్యాదులు తీసుకోవడాలు అంతా హడవుడిగా ఉంది. ఇదంతా చూసి ఆవుల్లో కొందరి లీడర్ల కళ్లుమండుతున్నరు. భూమి పట్టాలు అయితాయని సంబురంగా ఉన్నారు జనాలు, మా ఎమ్మెల్యేది మా దండి గుణం అనుకున్నరు ఆ వూరోళ్లు. మళ్లీ నెలలు గడిచాయి. ఏ ఉల్కు లేదు, పల్కులేదు. అధికార్లు లేరు, ఏం లేరు మల్ల పాత పద్దతే కొసాగుతోంది..!
అప్పట్కే రెండ్లేడ్లు గడిచాయి.
అక్కడున్న అందరీ కండ్లల్లో నీళ్లు, పట్నంలో ఉన్న కొడుక్కి మతలాబు పంపిండ్ర ఓ పెద్దమన్శి. దగ్గరిపట్లకు వచ్చినాలె సమాధానం. ఆడోళ్లు కొంగు అడ్డం పెట్టుకోని ఏడుస్తున్నారు, మూసలోల్లు చేతికర్ర దవడకు పెట్టుకోని దీనంగా చూస్తున్నరు. ఊర్లో కొందరు లీడర్లు వచ్చి బాధపడ్డట్టు నటిస్తున్నరు. ఊరంతా విషాదంగా ఉంది, భార్య దేవమ్మ కండ్లల్లో కన్నీరు ఇంకి పోయింది. రత్తయ్య భూమి పట్టాను కండ్లారా చూసుకోను లేదు, ఏం మంచి మనిషి అవ్వా..! ఎవ్వరు దైర్యం చేయకున్నా సీదా ఎమ్మెల్యే తాన్కి పోయిండు. మా బాధలు కూడ తీర్తయని అనుకున్న మని రత్తయ్య గొప్పతనాన్ని పలువురు యాదిజేస్కుంటున్నరు. రత్తయ్య తలకాయకడ పెట్టిన దీపం ప్రకాశవంతంగా వెలుగుతోంది.
నెలలు గడిచాయి మళ్లీ అదే ప్రసంగం అవే మాటలు.. ఇది మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం మా ప్రభుత్వం ఏం చేసిన మీ కోసమే మీ సంక్షేమం కోసమే తడబాటు అనేది లేకుండా ఒక ప్రవాహంలా ఎమ్మెల్యే ప్రసంగం సాగుతుంది.....
- బద్ది గణేష్, 8106684729