Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఓ పాత బంగ్లాలో బీడీల కార్ఖన ఉంటది. ఆ... బీడీలు తీసుకపోయే మునిమ్ సాబ్ భువనగిరి నుండి రావాలి. అప్పటికే కార్ఖన మొత్తం జనం నిడిపోయిండ్రు. ఒంటిగంట అయితుంది. ఓ చిన్న వ్యాన్‌లో పెద్ద పెద్ద ఆకు డాగులు (సంచులు), తాంబాకు సంచులతో పది మంది పని వాళ్ళతో ఆయన వొచ్చిండు.
అందరూ మాపు (బీడీల లెక్కలు) పెట్టేందుకు అన్ని సదురుకుంటున్నారు. అప్పటికే అక్కడి జనాలు గోల గోల చేస్తున్నారు. ఒక్కటే లొల్లి...
నేను ముందు వొచ్చినంటే, లేదు నేనే ముందు వొచ్చిన అని అనుకుంటున్నారు. ఈ లొల్లిలో ఓ ముసల్ది లైన్లో ముందు నిల్చొని ఉన్నది.
ఆ.. ముసల్ది ముంది మాపు ఇస్తుంది.!
''శేఖరన్న నాకు ఈ సారి ఆకు పది వేలకు ఎయ్యి''
''నాకు బయటకు పనికి పో చేతగాదు''
''నీ బంఛాన్ జర పది వేలకి ఎయ్యి అన్న'' అని అంటున్న ముసల్దాని విస్కుంటూ...
''హే... పో... పో... అవ్వ ఆకు లేదు ఏమి లేదు ఐదు వేలకు ఎస్త ఇష్టముంటే తీస్కపో లేకపోతే లేద్'' అని మునిమ్ సాబ్ అంటున్నాడు.
''అయ్యో...!! గట్ల అనకు అన్న జర నా మొఖం సూడు నీ బంఛాన్ జర పది వేలకి ఆకు ఎయ్యి అన్న'' అని అంటున్న ముసల్దాని వెనక నుండి జనం తోస్తున్నారు.
అంతలోనే ఎవరో అంటున్నారు. ఆ... ముసల్దాని ముచ్చట వొడువది. ఈ... రప... రప సల్లగుండా వొచ్చినపుడల్లా ఇదే రప రప అని ఎవరో అంటున్న మాటలను విన్న ముసల్ది.
నా కడుపు కాలుతుంది నేను అడుక్కుంటున్న వీళ్ళకేమైతుందో..!! మీదేమన్న గుంజుకుంటున్నానా.? అని అరుస్తూన్నది.
''ఆరే నవీన్ ఈ... ముసల్దాని పదివేలకు ఆకు, తంబాకు ఎయ్యి పోరా'' అని చెప్పిండు.
''నీ యవ్వ.... పో ఇగ ఎస్తడు పో'' అని చెప్పడంతో ముసాలమే మొఖంలో నవ్వు కనిపించింది.
అమ్మ కూడా బీడీలు తీసుకోని లైన్లో నిల్చుంది. నేను ఇక వేచిఉండక తప్పదు అని అర్థమైంది. కార్ఖన లో ఉన్న జామ చెట్టు నీడలో కూర్చున్నాను. అప్పుడే అక్కడకు చంటి బిడ్డను ఎత్తుకున్న ఓ తల్లి వచ్చి లైన్ లో నిల్చుంది. అప్పటికే ఎండ బాగా కొడుతుంది. ఆ.. ఎండకు పాప ఏడుస్తుంది. పాపని సమాదనపరుస్తూ ఆ తల్లి లైన్ లోనే ఉన్నది. కొద్దీ సేపటికి పాప ఎడ్వడం ఆపింది. నేను వెనకనుండి పాపను చూసి నవ్వాను. నన్ను చూసి పాప నవ్వింది.
ఆ... పాపను చూస్తుంటే నా బాల్యం గుర్తొస్తుంది.
నేను శిన్నగున్నప్పటి నుండి అమ్మ బీడీలే చేసేది. బీడీలు చెయ్యడం అంటే అంత సులభమైన పని కాదు. మబ్బులనే లేసి ఆకు నానపెట్టి పొయ్యి ఆలీకి వంట చేస్తుండే. తెల్లరేసరికల్లా అన్ని పనులు పూర్తి కావాల్సిందే. అక్కకి నాకు స్నానం చేయించి స్కూల్‌కి తయారు చేస్తుండే.
ఉదయం నేను పాల వాళ్ళ ఇంటికి వెళ్లి పాలు తెస్తే అమ్మ చాయి పెడుతుండే.
బీడీల చాటలో ఉండే చిల్లర పైసలతో అక్క నేను కోమటి దుకాండ్లకు పోయి ఛాయిలోకి బిస్కిట్లు తెచ్చుకొని ఛాయి తాగి స్కూల్‌కి పోతుంటిమి. మమ్మల్ని స్కూల్‌కి పంపి అమ్మ చాట ముందు పెట్టుకొని బీడీలు చేస్తుండే ఉదయం తొందరగా పని పూర్తైనన్నాడు రాత్రి వారకు వెయ్యి బీడీ చేస్తుండే.
తంబాకు ఘాటైన వాసనకి, కొన్ని సార్లు అమ్మకు వాంతులు వచ్చినట్టు, కళ్ళు తిరిగినట్టు అయితుండే అయిన అమ్మ జిద్దుతో బీడీలు చేస్తుండే. మధ్యాహ్నం అక్క నేను స్కూల్ నుండి భోజనం కోసం వచ్చినప్పుడు కొన్ని సార్లు అమ్మ బీడీలు చేస్తూ ఏడుస్తుండేది.
అమ్మ ఎందుకు ఏడుస్తుందో.. అక్కకు నాకు అర్థం కాకపోతుండే కొన్ని సార్లు నన్ను పట్టుకొని ఏడుస్తుండే.
''నువ్వు బాగా సదువుకోవలరా బిడ్డా''
''నువ్వు ఎప్పుడు పెద్దగైతావో నా కష్టాలు ఎప్పుడు తీరుతాయో.'' అని ఏడుస్తుండే.
అక్క నేను స్కూల్ నుండి వచ్చాక నేను హోమ్ వర్క్ చేస్కుంటుంటి. అక్క వచ్చి ఇంట్లో చిన్న చిన్న పనులు సగవేడుతుండే. అక్క పనిచేస్తే అమ్మ ఎక్కువ బీడీలు చేసేది. వంద బీడీలు చేసిన ఎంతో నయ్యం ఉంటది అని అమ్మ అంటుండే. అట్ల అనుకుంటా... రాత్రి దాకా బీడీలు చేస్తుండే.
ఎందుకో ఏమో అమ్మ పడుకుంటేనే నాకు నిద్ర వచ్చేది. అమ్మ బీడీలు చేస్తుంటే నిద్ర వచ్చేది కాదు.!
అక్క, నేను ''పడుకో అమ్మ..'' అని ఆడిగేవాళ్ళం.
''గీ కొన్ని బీడీిలే ఉన్నారు కట్టలు కట్టి పడుకుందాం'' అని అమ్మ అంటే అక్క నేను బీడీలు వరుసగా ఓ క్రమపద్ధతిలో అమర్చి అమ్మకు సాయం చేసే వాళ్ళం.
అమ్మ ఎంతో సంతోషించి అక్కకు నాకు ముద్దు పెట్టి ఎంతో మురిసిపోయేది. బాపు పొద్దంతా పనికి పోయివచ్చి పడుకుంటుండే. అమ్మే ఆల్చంగా పడుకుంటుండే.
శుక్రవారం వస్తే అమ్మ ఎర్రమన్నుతో ఇల్లు అలుకుతుండే. ఆ.. రోజు తొందరగా పనీ తీరకపోతుండే. ఆ రోజు అమ్మ తక్కువ బీడీలు చేస్తుండే. అయితారం వస్తే అక్క నేను హోమ్ వర్క్ చేసుకున్నాక అమ్మకి సహాయం చేసేవాళ్ళం.
అమ్మ బీడీలకు చుట్టే దారంని అక్క నేను ఓ ప్రయోగం చేసి తొందగా దారం చుట్టి అమ్మకు ఇచ్చే వాళ్ళం. అయితారం నాడు బాపు పనికి పోకపోతుండే. ఆ... రోజు బాపు సైకిల్ ఇంటి దగ్గరే ఉంటది.
అక్క నేను కలసి. రెండు పెద్ద చెంబుల్లో నీళ్లు పోసి దానికి దారం పొట్టే రెండు వైపులా పెట్టి బింగిరిని సైకిల్ టైర్ కి అనిస్తే బింగిరి గిర్రున తిరిగి దారం దానికి చుట్టుకుంటాది. పది పది నిమిషాల్లో ఐదు, ఆరు, బిగిరిలకు దారం చుట్టే వాళ్ళం. అలా సైకిల్‌తో బింగిరికి దారం చూడితే అక్కకి నాకు మస్తూ సంబురమైతుండే. మాకు అదో ఆటల అనిపిస్తుండే.!
అమ్మ బీడీల పైసల్తో చిట్టీలు ఏసింది. అక్క పెళ్ళి కోసం జమ చేస్తున్న అని అంటుండే. కానీ బాపుకి పానం బాగలేనప్పుడు దవాఖానల చుట్టూ తిరిగితే ఆ చిట్టీల పైసలు అన్ని అయిపోయాయి.
అక్క పదో తరగతి చివరి పరీక్ష రాసిన తెల్లారే లగ్గం అయ్యింది. పెళ్లప్పుడు అక్క ''నాకు లగ్గం వొద్దు అమ్మ'' అని మస్తూ ఏడ్చింది.
''మంచి సంబంధం మళ్ళీ పోతే దొరకదు'' అని నచ్చజెప్పి అక్కకు బల్మీటికి లగ్గం చేసిండ్రు.
లగ్గంకి మస్తు అప్పులు చేసిండ్రు. అవి ఎట్లా కట్టలో బాపుకి అర్థమైతలేదు. రోజు అమ్మ పొద్దున రాత్రి బీడీలు చేస్తుంది. బాపుకి వొచ్చిన జీతం మిత్తిలకి సరిపోతాలేదు.! ఇంట్లో తిందామంటే బియ్యం కుడా లేకుండా అయ్యింది.
రెండు ఏండ్లు అప్పులకి మిత్తిలు కట్టలేక మస్తూ ఇబ్బంది పడ్డారు.
అప్పుడే నా ఇంటర్ అయిపోయింది. నేను బిఎస్సి నర్సింగ్ చేస్తాని ఇంట్లో చెప్పాను. నర్సింగ్‌లో జాయిన్ అయ్యాక హాస్టల్ ఫీజు ముప్పై వేలు అని చెప్పారు. బాపు కొన్ని రోజులు పైసల్ పంపిండు. కానీ వాళ్ళతొని అయితలేదు.
పైసల్ పంపుడు ఆగిపోయింది. బాపు జీతం మిత్తిలకె సరిపోతుంది. అమ్మ బీడీల పైసల్ చిన్న చిన్న పద్దులు కడుతుంది.
హాస్టల్ ఫీజు కట్టకుండా ఆక్కడ ఉండడం సరికాదని కాలేజ్ మానేసాను.
తిరిగి ఇంటికి వచ్చిన నేను ఓ మెడికల్ షాప్‌ల పనికి కుదిరాను. నెలల నాకొచ్చే జీతం, అమ్మ, బాపు, పైసలతో ఉన్న అప్పులు కొద్దీ కొద్దిగా తగ్గుతూ వచ్చాయి. అప్పుడే అక్కకు కొడుకు పుట్టడంతో ఒడిబియ్యం, తొట్టెల దావత్‌కి మళ్ళీ అప్పులే అయ్యాయి.
ఎట్లో అట్లా... అప్పులు అన్ని తేర్చామూ. మళ్ళీ నాకు చదువుకోవాలని ఆశ కలిగింది. ఫార్మసీ పూర్తి చేసి సొంత మెడికల్ షాప్ పెట్టాను.
షాప్ సావకుంట బత్కకుంట నడుస్తుంది. ఏదో ఒక ఉపాధి అయితే ఉన్నది అని భరోసా మాత్రం కల్గింది.
అమ్మను ఎన్ని సార్ల బీడీలు బంద్ చెరు అని చెప్పిన వినదు.!
''గీ బీడీలు చేస్తేనే ఇప్పటిదాక మన పుట గడ్చింది'' అని నవ్వుతూ అంటుంది. అలా... జామ చెట్టు నీడలో ఆలోచనల్లో ఉన్న నా దగ్గరకు అమ్మ ఆకు, తంబాకు సంచిలో ముందుకు వొచ్చి ''పోదామా...? ఇగ'' అంటున్నది.
అంగడిలో ఉన్నత రద్దీగా ఉన్న మనుషుల మధ్యలో నుండి సంచితో అమ్మ నేను ఇంటికి వొచ్చాము.
ఇంటికి వచ్చిన తరువాత అమ్మ మళ్ళీ బీడీల చాట ముందు పెట్టుకొని బీడీలు చుడుతూ చాట అంచున ఉన్న 'బింగిరి' కి ఉన్న దారంతో బీడీలకు దారం కడుతుంది..
నేను శిన్నగున్నప్పటి నుండి ఆ... బింగిరి తిరుగుతానే ఉన్నది. ఆ... బింగిరి తిరగకపోతే మా జీవితం కూడా ఆగిపోతుండే అని నా మనసులో అనిపించింది.
సాయంత్రం కావడంతో నేను తిరిగి షాప్‌కి వెళ్ళిపోయాను. నేను తిరిగి ఏ రాత్రో ఇంటికి తిరిగి వెళ్లేదాక ఆ.... బింగిరికి ఇరామ్ లేకుండా తిరుగుతూనే ఉంటుంది.
- భానుప్రసాద్ గౌడ్ జాలిగామ,
7893575768