Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాముడంతటి పితృభక్తి కలిగిన వారు, సోదర భక్తిలో లక్ష్మణుడు, భరతుణ్ణి మించిన వారు ఇంతవరకు పుట్టనే లేదు. పాదుకల పూజా సంస్కృతిని ఆచరించే వ్యక్తులు భారతదేశంలో మినహా ప్రపంచంలో మరెక్కడా లేరు. విధాన్ బాబు ఇంట్లో సాగే ఇలాంటి పాదుకా పూజను చూసేవారు కొందరు నవ్వుకుంటారు. ఇదంతా బయటి ప్రపంచానికి చూపే భేషజం అని భావిస్తారు. పైపైకి చూపే భక్తిగా చూస్తారు. పాదుకల పూజ - అది కూడా తండ్రి పాదుకలు కావు. అలాగని తల్లివి కావు. మరి ఎవరివయ్యా అంటే తండ్రి తమ్ముడు. బాబాయివి.
తల్లిదండ్రుల పాదుకల మాట వదిలెయ్యండి. కనీసం వారి చిత్రపటాలు కూడా విధాన్బాబు ఇంటి గోడలను అలంకరించ లేదు. కానీ బాబు గారి పాదుకల పూజ మాత్రం కొనసాగుతుంది.
ఆ రోజుల్లో ఫోటోలు తీయడం ఉండేది కాదు అంటారా! అలా ఎలా అంటారు? అంత పాత మాట కాదు? విధాన్ బాబు చిన్నప్పటి మాటేనేమో! ముప్పయి, ముప్పై ఐదేళ్ల వెనకటి మాటే గదా! అప్పటికే నగరాల్లో ఫోటోలు తీయించి ఫ్రేమ్ కట్టించి వేళ్ళాడదీసే ఫ్యాషన్ మొదలైంది. కానీ అచ్చమైన పల్లెలో వుండే వారి ఇండ్లలో గోడలకు బతికి వున్నవారి ఫోటోలు తీసి వేళ్ళాడదీయ్యడం చూడలేదు. దేవుడి పటాలు తప్పించి మనుషుల ఫోటోలు పెట్టి వారిని చూడటం - ఇంత అనర్ధం ఎవరైనా చేస్తారా?! పెద్ద పెద్ద షావుకార్ల ఇండ్లలో, జమిందారీ ఇండ్లలో ఒకటి రెండు ఫోటోలు, దేవుడి పటాలు వేలాడదీయడం జరిగేది. చనిపోయినవారి పటాలైతే పూల మాల వేసి ఆగరు బత్తీలు వెలిగించేవారు పటాల ముందు. అందువల్ల విధాన్ బాబు ఇంట్లో తల్లి, తండ్రి, బాబాయి, పిన్ని అలా ఎవరి ఫోటో కూడా లేదు. అందరి మొహాలు పరలోక ప్రాప్తితో మట్టిలో కలిసిపోయాయి.
కేవలం జ్ఞాపకాల్లో ఏం మిగిలిందో అదే వుంది. ఈ మధ్యనే విధాన్ బాబు ఇంట్లో ఫోటోలు తీయించే ఫ్యాషన్ రోజు రోజుకి పెరగసాగింది. ఎంతలా అంటే తిన్న తర్వాత ఎంగిలి చేతిని కడుక్కునే దృశ్యాన్ని కూడా తీయసాగారు. తల్లి, తండ్రి బాబాయి, పిన్ని వీరి ఏ ఫోటో కూడా లేకపోవడం విధాన్ బాబుకు ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ, కేవలం బాబాయికి చెందిన రెండు తోలు చెప్పులను మాత్రం పూజాపీఠంపై పెట్టి పూజించడానికి కారణమేమై వుంటుంది? పాదుకల పూజ విషయం విధాన్బాబు బంధుమిత్రుల మధ్య ఒక చర్చా విషయమై పోయింది. బాబాయి అంటే తనకు అమితమైన ప్రేమ, భక్తి అని చూపించే ప్రయత్నం కాదు కదా! కానీ విధాన్ బాబు, పడగ్గదిలో ఓ మూల చెక్క పీట వేసి దాని పైన ఎర్రటి మఖ్మల్ గుడ్డను పరిచి వాటిపైన రెండు పాత తోలు చెప్పులు పెట్టాడు. వాటిపైన చల్లిన కొన్ని గంధపు చుక్కలు ఎండిపోయి వున్నవి. ప్రతి ఏటా బాబాయి పుణ్యతిథి రోజు చందనం, ధూపంతో పూజింపబడుతున్నాయి.
విధాన్ బాబుకు దగ్గరి మిత్రులు, బంధువులు విధాన్ బాబులోని పితృపక్షంపై వున్న లోతైన భక్తిని పాదుకా పూజలోనే కాదు - అతనిలో విచిత్ర రూపంలో వున్న దయా గుణాన్ని కూడా గమనించారు. ఎవరైనా అతని సహాయం కోరి వస్తే ముందుగా వారి కడుపు కాకుండా కాళ్ళ వైపు చూసేవాడు. ఒక దీర్ఘశ్వాస తీసుకొని సహాయం చేసినా చేయకపోయినా అడిగేవాడు - ''మీకు ఒక జత చెప్పులు కావాలా? నా చెప్పులు తీసుకుంటావా? కావాలంటే రూపాయలిస్తాను, ఒక జత చెప్పులు కొనుక్కొని తొడుక్కో! చూడు, నీ కాళ్ళు ఎంతగా అరిగి పోయాయో, ఎండలు మండుతున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదా! సిమెంటు రోడ్డు పైన, కాలుతున్న ఇసుక బాటపైన నడుస్తున్నప్పుడు... !''
రోగులకు, బిచ్చగాళ్లకు, పేద విద్యార్థులకు ఇంకా సహాయం అడగడానికి వచ్చిన వయసు పైబడిన పేద బందువులకు అందరికీ కొత్త చెప్పులు కొనిచ్చేవాడు. అడిగితే చెప్పేవాడు -''అన్నదానం, వస్త్రదానం మాత్రమే పుణ్యకార్యాలు కావు. ఎండాకాలంలో గాని, చలికాలంలో గాని చెప్పులు దానం చెయ్యడం మహా పుణ్యకార్యం, అలా అని నా చిన్నప్పుడు బాబాయి ఒకసారి చెప్పాడు...!''
తన తండ్రిలా లోకం పోకడ తెలియని వ్యక్తి బాబాయి. ఏ పని చేయాలో నిర్ణయించి అందులోకి దిగుతాడా, అక్కడ పూర్తిగా నష్టపోయే వాడు. అలా బాబాయి చేతిలో నాన్నగారి డబ్బులు చాలా మునిగి పోయాయి. అలా క్రమంగా బాబాయి అందరి దృష్టిలో ఒక పనికిమాలిన వ్యక్తిగా మిగిలిపోయాడు. బాబాయికి వ్యవసాయం పని ప్రధానంగా వుండేది. ఉమ్మడి కుటుంబం కావడంతో ఏ ఒక్కడు పనికిమాలిన వాడైనా ఆకలితో వుండకపోయేవాడు. కానీ విధాన్బాబు తన బాబాయిని వ్యర్ధ జీవిగా చూడలేదు. ఇంట్లో బాబాయి చేసినంత పని మరెవ్వరూ చేయకపోయేవారు. పిన్నికి వంటపని బాధ్యత వుండేది. ఆమె జీవితంలో చాలా సమయం వంటింట్లోనే గడిచిపోయింది. అందరూ తిన్న తర్వాత అంట్లు శుభ్రం చేసి, వంటిల్లు కడిగి అన్నీ సర్దుకునేసరికి అర్ధరాత్రి దాటేది. దాంతో పిన్నికి నడుము నొప్పితో తెల్లారే లేవడానికి కష్టమయ్యేది. బాబాయి, పిన్ని కాళ్ళు వత్తడం, మోకాళ్ళకు మర్దన చేయడం ఎన్నోసార్లు చూసాడు విధాన్బాబు. అవన్నీ పెళ్ళాం చాటు మొగుడు చేసే పనులనీ చెప్పేవారు. కానీ బాబాయి పెళ్ళానికి బానిస కాదన్న సంగతి విధాన్ బాబుకు తెలుసు. అదే నిజమైతే ఉమ్మడి కుటుంబం ఏనాడో విచ్ఛిన్నమయ్యేది. పిన్ని ఆరోగ్యంపై శ్రద్ధ బాబాయి గాక మరెవ్వరు పెట్టాలి? పిన్ని అన్ని పనులు చూసుకొని అమ్మ కాళ్లు పట్టేది. మరి పిన్ని, చిన్న కోడలు కదా!
పిన్ని ఉదయం పూట త్వరగా నిద్ర లేవలేకపోయేది. అందుకే బాబాయి తెల్లారగానే వంటిట్లోకి వెళ్లి గిన్నెలో టీ నీళ్లు పెట్టేసేవాడు. ఇంట్లో అందరికీ చివరికి నౌకర్లు, పని మనుషులందరికీ టీ ఇచ్చేవాడు. ఆ తరువాత పిల్లకు నాస్తాగా రవ్వ ఉప్మా, సాబుదానా ఖీర్, ఆడాళ్లకు జావాలాంటి వంటకం, ఒక శాకాహారం చేసేవాడు.
పిన్ని నడుం నొప్పి కారణంగా ఆలస్యంగా స్నానం చేసేది. శుచి, శుభ్రత లేకుండా వంటింట్లోకి ఎలా వెళ్ళేది? బాబాయి పనికి మాలిన వాడు అనుకున్నా మగాడు కదా! స్నానపానాదులు లేకున్నా వంటింట్లోకి దూరిపోయేవాడు. కూరలు వండవచ్చు. పెళ్లి పేరంటాళ్లలో, పండుగలు పబ్బాలప్పుడు బాబాయి రాత్రిపగలు తేడా లేకుండా కజ్జకాయలు, అరిసెలు, పూర్ణాలు, బూందీ లాంటి పిండి వంటలు చేసేవాడు. ఇలాంటి పనుల్లో ఆరితేరినవాడు. పిన్ని కూడా బాబాయిలా రుచికరమైన పిండివంటలు చేయలేదు.
బాబాయి మధ్యాహ్నం అంతా పొలం పనులు చూసుకునే వాడు. వంట పూర్తయ్యే వరకు ఎవరూ కునుకుపాట్లు పడకుండా వుండాలని సాయం కాలాల్లో పిల్లలందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని కథలు చెప్పేవాడు. ఇవన్నీ కాకుండా బంధుమిత్రులను పలకరించడం, ఠాకూర్ బాడీ (హవేలీ) పర్యవేక్షించడం కూడా బాబాయి పనే. ఆవులు, ఎడ్లకు సమయానికి నీళ్లు పెట్టడం, శుభ్రంగా కడగటం, పేడ ఎత్తడం అయిందా లేదా చూడటం కూడా బాబాయి పనుల్లో ఒకటి. అందరూ పాలు, పెరుగు, నెయ్యి తిని తాగేవారు. కానీ, పేడ, విసర్జకాలు, చెత్త ఎత్తే పని ఎవరూ పట్టించుకునేవారు కారు. కుడితి గోళెం, నీళ్ల గాబు శుభ్రపరచడం, కొబ్బరికాయలు దింపడం, ఇతరులతో లావాదేవీలు జరపడం అన్నీ అనాయాసంగా చేసుకునేవాడు. కానీ ఇవన్నీ మగవాడి పనుల కింద లెక్క గట్టేవి కావు. మగాడు ఏ పనుల వల్ల రెండు రూకలు సంపాదించ లేడో, అతను చేసే పనిని శ్రమ కింద లెక్క కట్టదు సమాజం.
బాబాయికి పిల్లలంటే చాలా ప్రేమ. గుళ్ళు గోపురాలమీద పావురాలు కూర్చున్నట్లు పిల్లలు అతని భుజంమీద, వీపు మీద ఎక్కి కూర్చునేవారు. రెండు భుజాల మీద పిల్లల్ని కూర్చోబెట్టుకొని వీధుల్లో బయట తిప్పడం రోజువారి దశ్యం. పంచదార బస్తాలా పెద్ద పిల్లాడ్ని వీపు మీద మోసేవాడు. ఆ రోజుల్లో పిల్లలందరిలోకి విధాన్... ఈ రోజుకి కూడా విధాన్ బాబు అంటే బాబాయి ఎంతో ఇష్టపడేవాడు.
విధాన్ చిన్నప్పటి నుంచే శాంత స్వభావంతో, సౌమ్యంగా ఉంటాడు. చదువులో శ్రద్ధ పెట్టేవాడు. మాష్టారు బెత్తం అతని మీద పడక పోయేది. ప్రతి తరగతిలో ఫస్ట్. అందుకే విధాన్, బాబాయి మెళ్ళో హారం అయ్యేవాడు. ప్రతి క్షణం విధాన్, విధాన్ అంటూ తిరిగేవాడు. ముందు విధాన్ ఆ పిదపే విరాజ్. ఒక వేళ ముందుగా విరాజ్‌ను పలకరిస్తే, విధాన్‌తో మీ బాబాయి పక్షపాతం చూపుతున్నాడు అనేవారు బంధుమిత్రులు. కానీ విధాన్ ముందు విరాజ్ తర్వాత కావడంతో అందరూ బాబాయిని ఈ విషయంలో దైవ సమానుడిగా చూస్తున్నారు. తన స్వంత కొడుకును వెనక్కి నెట్టి తన సోదరుడి కొడుకు పైనే ప్రేమను చూపిస్తున్నాడు. తన అల్లరి చేష్టల కారణంగా విరాజ్ పై బాబాయి తరుచుగా విరుచుకుపడేవాడు. విధాన్కు ఎప్పుడూ మెప్పుకోలు, శభాషి ఇచ్చేవాడు. బహుశా ఇదే కారణం కావచ్చు విరాజ్ మంకుతనానికి. విరాజ్ అల్లరి, మంకుతనం రోజు రోజుకి పెరగసాగింది. మిగతా సోదరులందరూ అతన్ని అనుసరించసాగారు. విధాన్కు పాఠశాలలో స్కాలర్షిప్ కై పరీక్ష రాయడం కోసం ఐదు మైళ్ళ దూరంలో వున్న హరిపూర్ స్కూల్ కు వెళ్లవలిసి వుంది. కానీ ఎలా వెళ్ళాలి? ఆ రోజుల్లో ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. బాబాయికి సైకిల్ నడపడం రాకపోయేది. నాన్నకు సైకిల్ నడపడం వచ్చు. కానీ ఆఫీస్ పని వదులుకొని రాలేడు.
బాబాయి చెప్పాడు- ''విచారించాల్సిన పని లేదు. విధాన్ చాలా బలహీనంగా వున్నాడు. నడవలేడు. నేను అతన్ని భుజాలపై ఎక్కించుకొని తీసుకెళ్తాను.'' కేవలం పరీక్ష రోజు మాత్రమే కాదు, ఆ నెల మొత్తం స్కాలర్షిప్ పరీక్ష కోసం ట్యూషన్ ఇచ్చే హరిపూర్‌లోని ఒక టీచర్ దగ్గరికి విధాన్ను హరిపూర్ పాఠశాలకు తీసుకొని పోయాడు. ఎండాకాలం. ఎండలకు వేడెక్కిన ఇసుక- కాళ్ళు కాలిపోతుండేవి. బాబాయికి నిజంగానే కష్టమయ్యేదేమో? ఎందుకంటే ఆయన కాళ్లకు చెప్పులు లేవు. ఆయన చెప్పులు వేసుకునేవాడు కాదు. నాన్న చెప్పులు తొడిగే వాడు. ఎందుకంటే ఆయన ఆఫీసులో పని చేసే ఉద్యోగి. పొలం పనులు చూసుకునే ఓ పల్లెటూరి బైతు ఆ రోజుల్లో చెప్పులు వేసుకునేవాడా!? ఒకవేళ ఎవరైనా వేసుకున్నా అతన్ని ఫ్యాషన్ చూపుతున్నాడు అంటూ ఎగతాళి చేసేవారు. అందుకే బాబాయి కాళ్ళు బొబ్బలెక్కినా చెప్పులు మాత్రం తొడిగేవాడు కాదు. అందుకు ఇష్టం కూడా చూపలేదు. బాబాయికి ఒక జత చెప్పులు కూడా కొనలేని స్థితి కాదు ఆ కుటుంబానిది. కానీ ఈ ఆలోచన ఎవరి తలలోకి రానే లేదు. ఎలా వస్తుంది, బాబాయి ఏమైనా సంపాదించే పని చేస్తున్నాడా? నలుగురిలో కూర్చొని లేచే వ్యక్తి కూడా కాదు. మరి చెప్పులు ఎందుకు తొడగాలి? అన్న భావన వారిలో వుండేదేమో!
విధాన్, బాబాయి భుజాలపై కూర్చున్నాడు. తలపైన గొడుగు వుంది. హరిపూర్ చేరే సరికి బాబాయి కాళ్లకు పట్టిన దుర్గతి చూడలేము. విధాన్ చదువయ్యేంత వరకు బాబాయి అక్కడే అరుగు మీద కూర్చొని సేద తీరేవాడు. విధాన్ రాగానే అతన్ని బజార్లో టిఫిన్ పెట్టించి తాను చారు మాత్రం తాగేవాడు. అప్పుడప్పుడు రెండు వడలు అవీ వాడిపోయినవి.
విధాన్ను భుజం మీద కూర్చోబెట్టుకొని తిరుగు ప్రయాణంలో అడిగేవాడు, ''ఏం పరేషాని లేదు కదా బిడ్డా?''
''నాకేం పరేషానీ, రోజూ కాలుతున్న కంకర బాటలో పది, ఇరవై మైళ్లు నడిచేది నువ్వు. నేను హాయిగా భుజం మీద కూర్చున్నాను.''
''కానీ చదివేది నువ్వేకదా. మనసు పెట్టి చదవాలంటే కష్టమైన పని! అన్న కూడా ఆఫీసులో అంతే మనసు పెట్టి పని చెయ్యాలె. నాదేం పనిలే- రావడం, పోవడం, తినడం, తాగడం అంతేకదా. బుర్ర వేడెక్కే పనంటూ ఏమీలేదు. కష్టమెందుకవుతాది?''
''కానీ బాబయ్, నీ కాళ్లకు కష్టమైతది కదా. వేడెక్కిన ఇసుకపై నడక వల్ల చూడు నీ కాళ్ళు బొబ్బలెక్కాయి కూడా''
నవ్వుతూ అన్నాడు-''ఏం పర్వాలేదు, ఈ కష్టాలు ఎప్పుడూ ఉంటాయా, నీ పరీక్షలు ఆయిపోవచ్చాయి. స్కాలర్ షిప్ రాగానే వెంటనే నువ్వు హరిపూర్ హాస్టల్లో చేరి చదువుకుంటావు. పెద్ద ఆఫీసరు అవుతావు భవిష్యత్తులో. మన వంశం పేరు నిలబెడతావు.''
విధాన్ ఆర్ద్రమైన స్వరంతో అన్నాడు- కానీ బాబారు నన్ను భుజాలపై మోస్తూ మోస్తూ నీ రెండు కాళ్ళు బొబ్బలెక్కడం నేను చూడలేకపోతున్నాను''
''బాధ ఎందుకురా పిచ్చోడా! పెద్ద ఉద్యోగం వచ్చాక నాకు ఒక జత చెప్పులు కొనివ్వలేవా?'' బాబాయ్ బదులిచ్చాడు.
ఆశ్చర్యపోతూ, ఆనందంతో విధాన్ అడిగాడు, ''చెప్పులు కొనిస్తే నువ్వు తొడుగుతావు కదా బాబాయి''
''ఎందుకు తొడగన్రా, డబ్బు సంపాదించనంత మాత్రాన మరెవరైనా చెప్పులు కొనిస్తే ఎవరెందుకు నవ్వుతారు.'' ఎంతో ఆత్మ విశ్వాసంతో జవాబిచ్చాడు బాబాయి.
విధాన్కు స్కాలర్ షిప్ వచ్చింది. చిన్నపల్లె, అందులో చిన్న వీధిలో అది పెద్ద వార్త అయ్యింది. మహంతి కుటుంబంలోని పిల్లాడికి స్కాలర్ షిప్ వచ్చిందన్న వార్త. నాన్నగారికి మాలిష్ చేస్తూ చేస్తూ నాహూ అడిగాడు - ''మాలిక్, మీ తమ్ముని కొడుక్కి స్కాలర్ షిప్ వచ్చిందని విన్నాను. ఏమైనా కానివ్వండి మాలిక్, వంశం పేరు నిలబెట్టాడు.''
నాన్నగారు ఒక్కసారిగా నాహూ చెంప చెళ్లుమనిపించారు. కళ్ళెర్ర జెసి ''ఏంరా సాలె, ఈ రోజుదాకా తెలియలేదా విధాన్ నా కొడుకని, తమ్ముని కొడుకంటావా? పో, వీధిలోకి వెళ్లి అందరితో చెప్పు విధాన్ నా కొడుకని, అతనికి స్కాలర్షిప్ వచ్చిందని...''
నాన్న బక్షీస్గా పది రూపాయలను నాహూ కిచ్చారు. నాహూ పళ్ళికిలిస్తూ అన్నాడు, ''చిన్నదొర తన భుజాలపై కూర్చోబెట్టుకొని హరిపూర్ తీసుకెళ్లేవారు కదా! అందుకే అలా అనుకున్నాను మాలిక్ ...''
''ఐతే ఏమైంది? కొడుక్కి, అన్న కొడుక్కి మధ్య తేడా ఏముందని? అన్న కొడుకుని భుజాలపై కూర్చో బెట్టుకొని పోగూడదా? నాకు తీరిక ఎక్కడిది?'' అని నాన్నగారు కోపంతో ఊగిపోయారు.
బాబాయి ఈ సంఘటన విని ఒకటే నవ్వుతూ ఇలా చెప్పారు, ''విధాన్ పుట్టినప్పుడు వదిన ఇక బతకదేమోనని గొడవ చేశారు. అన్న స్వయంగా నా భార్యను పిలిచి చెప్పారు, ఇక నుంచి ఈ పిల్లాడి బాధ్యత నీదే, ముందుగా నీ పిల్లాడు, తరువాతే అందరూ. పసికందు తల్లి బతికి బట్టకట్టే నమ్మకం లేదు. ఈ రోజు విధాన్కు స్కాలర్ షిప్ దొరకగానే విధాన్ నా కొడుకు అని చెప్తున్నాడు. అదృష్టం బాగుండి వదిన బతికి పోయింది. కానీ అన్నగారిచ్చిన మాట ప్రకారం విధాన్ ముందు నాకు చెందిన వాడు, తరువాతనే అందరూ.''
నాన్నగారు పోయిన చాలా రోజుల తరువాత కూడా బాబాయి, నాహూ చెంప దెబ్బలు జ్ఞప్తికి దెచ్చుకొని ముసి ముసిగా నవ్వుకుంటాడు. ఒక దీర్ఘ శ్వాస తీసుకుంటూ ''విధాన్ ఎంత కష్టజీవి. మనసు పెట్టి చది వాడు. పెద్ద ఆఫీసరయ్యాడు. వేల రూపాయలు సంపా దిస్తున్నాడు. అన్న గారికి చూసే అదష్టం లేకుండా పోయింది'' అని వాపోయే వాడు. నిజానికి విధాన్ బాబు వయసు పదమూడు లేదా పద్నాలుగేళ్ళ వయస్సు. దాని తరువాత తాను శ్రద్ధగా, బుద్ధిబలంతో చదువుపై దష్టి పెట్టి పేరు సంపాదించాడు. ఉన్నతమైన హోదాలో వున్నాడు. మరి బాబాయి ఏమి చేయలేదని చెప్పగలమా? విధాన్ బాబుకు స్కాలర్ షిప్ దొరికిన విషయం వాస్తవమే. కానీ అందులోనే వారి జీవితాలు గడిచిపోయాయా? బాబాయి ఊర్లోకెళ్లి బియ్యం, అటుకులు, బెల్లం, కొబ్బరికాయలు, నెయ్యిలాంటి వస్తువులు తీసుకొచ్చే వాడు. విధాన్ బాబు మెస్ సిద్ధం చేసి వుంచేవాడు. ఉద్యోగం దొరికిన తరువాత కూడా విధాన్ బాబు బియ్యం తేవడం ఆపలేదు. విధాన్ బాబుకు బాబాయి పైన ఎంతో నమ్మకం, విశ్వాసం. బాబాయికి శ్వాస సంబంధ రోగం వున్నందుకు చ్యవనప్రాశ్, విటమిన్ మాత్రలతో పాటు మిఠాయి, పండ్లు ఊరికి పంపేవాడు. బాబారు అందులోనే ఆనందించే వాడు. ఆశీర్వాదాలు కుమ్మరించేసే వాడు బాబు మీద.
చూస్తూ చూస్తుండగానే విధాన్బాబు ముసలివాడై పోయాడు. బాబాయి పండు ముదుసలి. ఇప్పుడు నగరానికి పోలేని పరిస్థితి. కొడుకు, కోడలు ఎంత శ్రద్ధ పెట్టి చేయాలో అంత సేవ అందడంలేదు. రోజు రోజు ఎవ్వరడుగుతారు ముసలి వాళ్ళను. విధాన్ బాబు కూడా ఉద్యోగరీత్యా పెళ్ళాం బిడ్డలతో ఈ రోజు కటక్‌లో ఉంటే మర్నాడు కోరాపుట్‌లో ఉండేవాడు. ముసలాయన, ముసలమ్మను తీసుకొని ఎన్ని వూర్లని తిరుగుతాడు. బాబాయి, పిన్ని కూడా ఊరొదిలి నగరానికి శాశ్వతంగా పోలేరు. వాళ్లకు నగరం నచ్చుతుందా? ఈ రోజుల్లో బాబాయిది నడవలేని పరిస్థితి. పిన్ని అతన్ని చూడసాగింది. ఆస్త్మా పెరిగిపోయింది. శరీరం బలహీనపడింది. వృద్ధాప్యం పై బడింది. పండిపోయిన మామిడి పండులా శరీరం మెత్తబడింది. విధాన్ బాబు కూడా బాధ్యతలు వదులుకొని ఊర్లో నెల పదిహేను రోజులు ఉండలేక పోతున్నాడు. మిఠాయిలు తీసుకొని ఊరికొస్తాడు. రెండో రోజే తిరుగు ప్రయాణం కడతాడు. పోయినసారి బాబాయి బాగా లేకుండే. ఇరుగు పొరుగు, బంధువులు, మిత్రులు అతన్ని పరామర్శించడానికి వచ్చే వారు. వస్తూ వస్తూ మంచి తినుబండారాలు వెంట తెచ్చేవారు. దీని అర్ధం ఏమిటంటే పై నుండి ఇక చివరి పిలుపు వచ్చే సమయం ఆసన్నమైందని భావించే వారు. సమాచారం అందగానే విధాన్ బాబు కూడా వచ్చేసాడు. కందర్పూర్ నుండి ఒక రసగుల్లాలా కుండను వెంట తీసుకెళ్లాడు. బాబాయి రస గుల్లాలంటే ఎంతో ఇష్ట పడతాడు. కానీ బాబాయి వంతు రస గుల్లాలు విధాన్ బాబునే తినాల్సి వచ్చింది. చిత్ర, బాబాయి దగ్గర కూర్చొని తినిపించసాగింది. రసగుల్లాను నోట్లోకి తీసుకోవడానికి ముందు బాబాయి అడిగాడు, ''విధాన్ బాబుకు రసగుల్లా ఇచ్చావుగదా?'' విధాన్ బాబు ఇంకా పిల్లవాడే అనుకుంటున్నాడు. విధాన్ కళ్ళు చెమ్మగిల్లాయి.
ఏమైనా కావాలంటే, కోరికలుంటే మనసు విప్పి చెప్పు, విధాన్ బాబు వచ్చాడు. పైసలకేం కొదవ లేదు. ఏం కావాలన్నా కటక్ నుండి తీసుకొస్తాడు. కార్లో వచ్చాడు, చింతపడవలసిన అవసరం లేదు.'' ఇరుగుపొరుగు ముసలాయనకు సలహాలివ్వసాగారు.
బాబాయి కళ్ళలో దాగిన ప్రేమ కన్నీటి రూపంలో ఉబికివచ్చింది. వణుకుతున్న స్వరంతో అన్నాడు, ''విధాన్ బాబు నా అన్న కొడుకు కాదు, నా కొడుకు. అన్నకు కూడా కొడుకే. అతను కొడుకే కాగలడు. మరింకేమి కాడు.''
''సరే, అలాగే కానివ్వు, అతను నీ కొడుకే. అది లోకానికంతా తెలుసు. ఈ వీధి, వాడంతా తెలుసు. అందుకే నాహూ మీ అన్నగారి చేత్తో చెంపదెబ్బ తిన్నాడు. గుర్తులేదా?'' పిన్ని చెప్పింది.
బాబాయి ముఖం మీద నవ్వు వెల్లివిరిసింది. గతాన్ని గుర్తు చేసుకుంటూ అన్నాడు, ''అన్న కూడా పిల్లలకు మంచి పాఠం నేర్పించాడు ఆ రోజు..''
''సరే ఇప్పుడు చెప్పు, నీ కోరికేమిటో?'' ఎవరో అడిగారు.
''కోరికనా! ఔను, చాలా కాలం నుండి ఒక కోరిక వుండే, ఒక జత చెప్పులు తొడగాలని. అన్నలా నేను కాలేను. కానీ ఆయనలా ఒక జత చెప్పులు తొడిగి నడవాలని ఉండేది. విధాన్ అన్నాడు, చిన్నప్పటి మాట, బహుశా మర్చిపోయి వుంటాడు. లేకపోతే ఒక జత మామూలు చెప్పులు కొనలేడా? ఇప్పుడేం చేయగలను? కాళ్లు వాచి ఇంత లావయ్యాయి, ఇప్పుడు చెప్పుల్లోకి దూరలేవు. వాపు తగ్గవచ్చు, అని డాక్టర్ ఐతే అన్నాడు గదా.. !''
బాబాయి మాటలు వినగానే విధాన్ బాబు మనసు లోలోపలే విలవిల్లాడింది. నిజమే, బాబారు పూర్తి జీవిత కాలంలో ఒక జత చెప్పులు కొనలేకపోయాడు.
విధాన్ బాబు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. చెప్పులు కొనడం మర్చిపోయానన్నది విషయం కాదు, నిజానికి ఎలా మర్చిపోగలను? బాబాయి భుజాలెక్కి పరీక్ష రాయడానికి వెళ్లిన విషయం, స్కాలర్ షిప్ రావడానికి ప్రధాన కారకుడైన వ్యక్తిని ఎలా మరిచిపోగలను. కానీ ఎప్పుడూ ఆ దిశగా ఆలోచనే చేయలేదు - ఆయన మనసులో చెప్పులు తొడగాలనే కోరిక వుందన్న విషయం. పిల్లల మనసు పెట్టడానికి అలా అన్నాడేమో అన్న భావనలో వున్నాను.
నిజానికి బాబాయి మనసులో ఈ కోరిక ఉంటే కనీసం విధాన్ బాబుకు గాని, చిత్రకు గాని గుర్తు ఎందుకు చేయలేదు? పిన్ని ఐతే అన్ని విషయాలు దాపరికం లేకుండా మాట్లాడుతుంది. ఉన్ని దుప్పటి, మందులు, గొడుగు ఇలా ఏది కావాలన్న గుర్తు చేసేది మరి. విధాన్ బాబు స్వంత కొడుకు కాదు, అన్నకొడుకు గదాయని బహుశా సంకోచించి వుంటుంది. కొడుకైతేనే అడిగేవాడా? విధాన్ బాబు కూడా ఒకటి రెండు సార్లు చెప్పులు కొనాలని అనుకున్నాడు. మళ్ళీ అనుకున్నాడు బాబాయి చెప్పులు తొడిగి ఇప్పుడెక్కడికి వెళ్తాడు? నిజంగా తొడిగేవాడా? విధాన్ బాబు కూడా అందరిలా మనసులో భావించాడా, బాబాయి లాంటి వ్యర్ధజీవికి చెప్పుల అవసరం ఏముంది అని'' ప్రమాణం చేసి చెప్పులు కొనకపోవడం ద్వారా విధాన్ బాబు, బాబాయిని తన తండ్రికన్నా తక్కువ స్థాయిలోకి నెట్టి వేసాడన్న దానికి సాక్ష్యం కాదా?. అదే రోజు బాబాయికి ఒక జత చెప్పులు కూడా కొని తెచ్చాడు. భగవంతుడు దయ జూపితే కాళ్ల వాపు తగ్గిపోతుంది. కనీసం ఒక్కసారైనా కాళ్లకు చెప్పులు తొడుగుతాడు కదా!
బాబాయి కాళ్ళ వాపు నిజంగానే తగ్గిపోయింది. వాపు తగ్గిన తన పాదాలను చూసుకొని మురిసి పోసాగాడు. విధాన్ బాబు, బాబాయి కాళ్లకు చెప్పులు తొడగడం చూసి మనవలు, మనవరాండ్రు అల్లరి చేస్తూ నవ్వసాగారు. అందులో ఒకరు, ''తాత, చేతికర్ర పట్టుకొని ఇప్పుడు ఆఫీసు కచేరీకి వెళ్తారు...'' అంటూ సరదాగా నవ్వుకున్నారు.
అదృష్టం బాగుండి బాబాయికి సరిగా వినబడదు. కానీ ఆడాళ్ళు మాత్రం పెదాలు అదిమిపట్టి నెమ్మదిగా నవ్వసాగారు. ''ముసలాడికి చచ్చేముందు షోకు ఎక్కువైంది..'' అని గుసగుసలు పోయారు ఒకరిద్దరు ఆడాళ్ళు.
విధాన్ బాబు స్వయంగా అపరాధ భావనతో వున్నాడు. వాళ్లు ఎందుకు ఇలా పరిహాసాలాడుతున్నారు. తనకు తానుగా అపరాధ భావన నుండి విముక్తి పొందడానికి చెప్పులు కొని తెచ్చాడని, బాబాయికి తొడిగించడానికి కాదు అని ఈ విషయం తనకు మాత్రమే కాదు అక్కడ వున్న వారందరికీ స్పష్టంగా తెలుస్తుంది. ఏమవసరమొచ్చింది, చావుకు దగ్గరగా వున్నవ్యక్తికి చెప్పులు కొని తేవడం?
బాబాయి ఈ లోకం విడిచి వెళ్లారు. చెప్పుల జత అక్కడే కాళ్ళ దగ్గర పెట్టి వున్నాయి. చనిపోయే కొన్ని క్షణాల ముందు కూడా పలవరించసాగాడు, ''అవి అక్కడే ఉండనివ్వండి, నా విధాన్ కొనిచ్చాడు.'' బహుశా తిరిగి లేచి నడవగలిగితే! ఒకవేళ విధాన్ కొన్నచెప్పులు తొడిగి నడవడానికి భగవంతుడు నన్ను బతికిస్తే'' చనిపోయే ముందు బతకాలనే ఆశతో ఎంతో అలజడికి గురయ్యేవాడు. కానీ బాబాయి తిరిగి రాని లోకాలకు వెళ్లే బండిని ఆపగలిగే శక్తి విధాన్ బాబు కొన్న ఆ చెప్పులకు ఎక్కడిది?
ఏ చెప్పులకైతే ఒక్కసారి మాత్రమే బాబాయి పాదాల స్పర్శ అందిందో ఆ చెప్పులను, బాబాయి అంత్యక్రియల తర్వాత విధాన్ బాబు తలవంచి నమస్కరించి, భుజాలపై అక్కణ్ణుంచి తీసుకొచ్చాడు.
పద్నాలుగు సంవత్సరాల తర్వాత తిరిగి వస్తానని భరతుడితో ప్రమాణం చేసాడు శ్రీ రామచంద్రుడు. బాబాయి ఇలాంటి ఏ ప్రమాణం చేయలేదు. కానీ విషాదం నిండిన గ్రీష్మపు మధ్యాహ్నం ఎండలకు, నేల మలమల మాడుతున్న సమయంలో బాబాయి అవే చెప్పులు తొడిగి థప్ - థప్ అని శబ్దం చేస్తూ విధాన్ బాబు గుండెలపై నడుస్తూ వుంటాడు!
ఒరియా కథ - పాదుకా పూజన్
రచయిత్రి : డా. ప్రతిభా రారు (జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత)
హిందీ అనువాదం: రాజేంద్ర ప్రసాద్ మిశ్రా
తెలుగు అనువాదం: డా. రూప్ కుమార్ డబ్బీకార్
99088 40186