Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఎవడ్రా వాడు! చెట్టుకు రాళ్ళు విసిరేది! చేతిలోని వంకి కర్రను తాటిస్తూ గేటు దాకా వచ్చాడు పేరయ్య.
పేరయ్యకు ఎప్పుడో తాతల నాటి స్థలం ఓ ఐదొందల గజాలుంది. అందులో నాలుగు గదుల వెనుకటి ఇల్లు పర్ణశాలలా ఉంటుంది. ఇంటి ముందు వెనుక రకరకాల పండ్ల చెట్లు పెంచాడు. అవి పిల్లలనూ, పెద్దలనూ ఊరిస్తూ ఉంటాయి.
పెద్దలంటే మొహమాటంకొద్దీ చూసి ఊరుకుంటారు కానీ, పిల్లలెందుకు ఊరుకుంటారు. అందుకే అప్పుడప్పుడు పేరయ్య కంటపడకుండా వస్తారు. చెట్లకు రాళ్ళేసేలాంటి పనులతో ఓ నాలుగు కాయలను జేబుల్లో వేసుకుని వెళ్తుంటారు.
అది చూసి పేరయ్య భార్య అనసూయమ్మ మాత్రం ఆనందంగా నవ్వుతూ... భర్త చూడకుండా మరికొన్ని కోసి ఇస్తుంది.
ఆ దశ్యం పేరయ్య చూశాడా ఇంకేముంది 'అగ్గిమీద గుగ్గిలం' అవుతాడు. కల్లు తాగిన కోతిలా చిందులు వేస్తాడు. ''పోశమ్మ పోగు చేస్తుంటే మైసమ్మ మాయం చేసినట్టుంది'' నీ పద్ధతని నానా మాటలతో రంకెలు వేస్తాడు.
ఆయన విషయం తెలిసిందే కాబట్టి ఎన్నన్నా మౌనంగా ఉండిపోతుంది.
''చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు'' మూగి మొద్దులా ఉంటావని తిడతాడు. ఎంతన్నా పన్నెత్తి మాటనదు అనసూయమ్మ. లోలోపల మాత్రం ''ఎందుకో ఈ కాపీనం. బతికేందుకు ఇప్పుడు ఉన్నది చాలదా! పసి పిల్లలు అలా వచ్చి అడిగితే ఇచ్చి పంపొచ్చు కదా! ప్రతిదీ పైసలతో చూస్తే ఎలా! చెట్టున్నప్పుడు పక్షులు వాలక మానవు. పండ్ల చెట్లున్నప్పుడు పసి చూపులను ఆకర్షించకా మానవు'' అనుకుంటుంది.
అదే మాట ఎప్పుడన్నా సమయం చూసుకొని అన్నదా.. ''ఓ వచ్చింది ''అపర దాన కర్ణురాలు.'' రాజ వంశమాయె'' అంటూ దాన ధర్మాలు చేసి ఇల్లు గుల్ల చేయడానికే కంకణం కట్టుకున్నదని.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే భర్తను చూసి ''నీటికి నాచు తెగులు'' మాటకు మాట తెగులు.. ''గోటితో పోయేదాన్ని గొడ్డలి దాక తీసుకు రావడం ఎందుకని'' మారు మాటెత్తదు.
ఇంట్లో చెట్లకు కాసే ప్రతి పండూ పైసల రూపంలో ఆయన గల్లా పెట్టె నిండాల్సిందే.. కుక్కలా కాపలా, గద్దలా పహారా కాస్తూ అమ్ముతుంటాడు..
ఓ రోజు అలాగే చూస్తూ చూస్తూ ఉండగా పిల్లలు పండ్ల కోసం వచ్చారు. వాళ్ళు ఇచ్చిన పైసలను తీసుకుని, చిన్నా చితకా కాయలు ఇచ్చాడు. పైసలు గల్లపెట్టెలో దాయడానికి లోపలికి వెళుతూ, కాలు జారి కింద పడ్డాడు.
పిల్లలింకా వెళ్ళలేదు అక్కడే ఉండటంతో.. ''అయ్యో! తాతయ్య పడిపోయాడు రా. ఎలా రా? రండి ఒరేరు'' అని ఒకరికొకరు సాయంగా పిలుచుకుంటూ, లోపలికి పరుగెత్తి అనసూయమ్మకు చెప్పారు.. ఆమె వచ్చే లోపే తలా ఓ చెయ్యి వేసి నెమ్మదిగా నడిపించుకుంటూ లోపలికి తీసుకొని వచ్చారు. మంచం మీద కూర్చోబెట్టారు. ''తాతా! ఇక్కడేనా దెబ్బ తాకింది.. ఏం కాదు తగ్గి పోతుందిలే. మాయమ్మ మాకు నూనె రాస్తుంది.. ''మామ్మా! కొబ్బరి నూనె తే మేం రాస్తాం'' అంటూ కొందరు కాలు పైకిలేపారు. మరొకరు నెమ్మదిగా తమ చిట్టి చిట్టి చేతులతో మర్థనా చెయ్యసాగారు.
పేరయ్య కళ్ళు చెమర్చాయి. ఇంత కాలం వాళ్ళకు చచ్చు పుచ్చు పండ్లు డబ్బులకు అమ్మాడు. రాళ్ళు విసిరారని నోటికి వచ్చినట్లు తిట్టాడు. ఐనా పసిమనసులు పసి'డి' మనసులు ఎంత గొప్పవి. పిల్లలవి కల్లా కపటం తెలియని పాల మనసులు, ప్రేమ పరిమళాలు పంచే పూల మనసులు. పిల్లలను దైవ రూపాలని ఊరికే అనలేదు అనిపించింది పేరయ్యకు.
మారిపోయాడు పేరయ్య. అనసూయమ్మ చాలా సంతోషపడింది.
శేష జీవితాన్ని పిల్లలకు పండ్లూ ఫలాలు పంచుతూ, వాటితో పాటు మంచి మాటలు, కథలు చెబుతూ అందరితో పేరయ్య పేర్మిగల తాతయ్య అనిపించుకున్నాడు.
- వురిమళ్ల సునంద,
9441815722