Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అరణ్యపురి రాజ్యానికి రాజు సింహం. ఆ అరణ్యంలో పండ్లకూ, నీటికి కొదువ లేదు. రాజు మిగతా జంతువులన్నిటినీ తన కుటుంబసభ్యుల వలె చూసేది. ఎవరికి ఏ ఆపద వచ్చినా వెంటనే తన మంత్రి అయిన ఏనుగును పంపించి సమస్యను వెంటనే పరిష్కరించేది. రాజుగారి పాలనలో జంతువులన్నీ సంతోషంగా ఉన్నాయి. 'యథా రాజా తథా ప్రజా' అన్నట్లు అరణ్యంలోని జంతువులన్నీ చాలా సంతోషంగా గడిపేవి.
కుందేలు, తాబేలు పొద్దస్తమానం ఆడుకొని సరస్సు దగ్గరికి చేరాయి. 'ఏం ప్రియమిత్రులారా ! మీరిద్దరే ఆడుకోకపోతే నన్నూ మీతో చేర్చుకోవచ్చు గదా!' అని కోతి బావ అడిగింది. ''సరే రేపటి నుండి మాతో కలిసి ఆడుకుందువు లే! కానీ.. సాయంత్రం వరకు ఇక్కడ ఏం చేస్తున్నావు??''
''ఏమీ లేదు కాసేపు సరస్సు పక్కన చల్లటి గాలికి సేదతీరడానికి వచ్చాను''
''సరే కోతిబావా! రేపు సాయంత్రానికి ఇక్కడికి రా కలిసి ఆడుకుందాం''!అని అక్కడి నుండి వెళ్ళాయి.
మరుసటి రోజు సాయంత్రం కోతి బావ వచ్చి మిత్రుల కోసం ఎదురుచూస్తుంది. తాబేలుని చూడగానే ''ఏంటి మిత్రమా! ఒక్క దానివే వస్తున్నావు? మిత్రుడు కుందేలు ఎక్కడీ''
''నాతో వస్తా అనే చెప్పాడు! ఎక్కడకు వెళ్ళాడో ఏమో?''.
కాసేపు సరదాగా తాబేలు, కోతి బావ సరస్సు తీరాన ఆడు కొని వెలుతున్నాయి. దారి మధ్యలో కుందేలు ఎదురైతే ''మిత్రమా! సరస్సు వద్దకు రాలేదు ఎక్కడికెళ్ళావు?. నెమలి నాట్యం చేస్తుంటే చూస్తూ అక్కడే ఉండిపోయాను. అందుకే రాలేకపోయాను.
కాలం గడుస్తుంది. తాబేలు అరణ్యపురి రాజ్యంలోనే ఇంటర్నెట్ షాపును పెట్టుకొని, తోటి జంతువులకు సహాయ పడుతూ ఉండేది. కుందేలు అరణ్యపురి రాజ్యానికి దగ్గరలో ఉన్న ఇంద్రపురి పట్టణానికి వెళ్ళి అక్కడ ఒక సూపర్ మార్కెట్ వ్యాపారం పెట్టింది. ఒక మిత్రుని సలహామేరకు ''ఈ సూపర్ మార్కెట్ వ్యాపారం కంటె పండ్ల వ్యాపారంలో బాగా లాభాలు ఉన్నాయి'' అని మిత్రుడు చెప్పగానే పండ్ల వ్యాపారం మొదలు పెట్టింది. కొంత కాలం తర్వాత మరో మిత్రుడు వచ్చి ''ఈ మధ్య కాలంలో భూములకు రెక్కలొచ్చి రేట్లు బాగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే బాగా లాభాలొస్తాయి'' అని చెప్పింది. కుందేలు బాగా ఆలోచించి పండ్ల వ్యాపారాన్ని మానేసి రియల్ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అలా రకరకాల వ్యాపారాలు చేస్తూ ఇంద్రపురిలో జీవించేది.
ఒకనాడు మహామంత్రి ఏనుగు రాజు వద్దకు వచ్చి ''మహారాజా! నాకు వయసు మీదపడింది. శరీరం నాకు సహకరించడం లేదు. ఈ మంత్రి పదవి బాధ్యతలు ఎవరికైనా అప్పగించండి'' అని వేడుకుంది. మంత్రి పరిస్థితిని అర్థం చేసుకున్న రాజుగారు ''సరే మంత్రివర్యా! మన రాజ్యంలో మంత్రి పదవి కోసం అర్హులైన వారిని ఎంపిక చేద్దాం. డప్పు చాటింపు వేయించండి. అరణ్యపురి రాజ్యంలో ఉన్నత చదువులు చదివిన యువకులందరినీ రప్పించండి'' అని ఆజ్ఞ వేశారు రాజుగారు.
ఆ విషయం ఇంద్రపురిలో ఉన్న కుందేలు, అరణ్యపురి రాజ్యంలోనే ఉన్న తాబేలుకు తెలిసింది. మరుసటి రోజు కుందేలు, తాబేలుతో పాటు రాజ్యంలో ఉన్న జంతువులన్నీ రాజుగారి కోటకు చేరుకున్నాయి. సింహారాజు గారి సమక్షంలో ఆ యవకులందరికీ వివిధ పోటీలు నిర్వహించారు. చివరకు కుందేలు, తాబేలు ఆ పోటీల్లో సమ ఉజ్జీవులుగా నిలిచాయి..
రాజుగారికి ఆ ఇద్దరిలో ఎవరిని మంత్రిగా నియమించాలో అర్ధం కాలేదు. మంత్రి ఏనుగు సలహా కోరగా ''మహారాజా! వీరిద్దరూ అన్ని పరీక్షల్లో సమ ఉజ్జీవులుగా నిలిచిన మాట వాస్తవమే. కానీ తాబేలు అరణ్యపురిలోనే ఉంటూ వ్యాపారంలో నష్టం వచ్చినా, లాభం వచ్చినా ఆ వ్యాపారాన్నే నమ్ముకొని జీవితాన్ని కొనసాగిస్తూ మన జంతువులకు సహాయ సహకారాలు అందించేది''.
కుందేలు మాత్రం పక్కనే ఉన్న పట్టణానికి వెళ్ళి ఏ మిత్రుడు ఏది చెప్పినా విని వాటిలో మంచీ చెడులూ ఆలోచించకుండా రకరకాల వ్యాపారాలు చేసేది.. దీన్ని బట్టి చూస్తే కుందేలుకు స్వంత ఆలోచన, స్థిరమైన మనసు లేదు అనిపి స్తుంది. స్థిరమైన మనసు లేని వారు ఖచ్చిత మైన నిర్ణయాలు తీసుకోలేరు. కాబట్టి స్థిర మనసు, సహాయం చేసే గుణం కలిగిన తాబేలు అన్నివిధాలా ఈ మంత్రి పదవికి అర్హుడు'' అని నా అభిప్రాయం.
మంత్రి ఏనుగు ఆలోచనకు సింహారాజు చాలా సంతోషించి తాబేలుకు మంత్రి పదవిని ఇచ్చాడు. కుందేలు మంత్రి ఏనుగు మాటలకు తలదించుకొని నేనూ స్థిరమైన మనసును కలిగి ఉండాలి అని మనసులో అనుకొని అప్పటి నుండి అరణ్యపురి రాజ్యంలోనే ఉంటూ తోటి జంతువులకు సహాయపడుతూ ఉంది.
- ఎమ్.జానకీరామ్, 6305393291