Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక చెట్టు పైన గూడు కట్టుకుని ఒక పక్షి నివసిస్తూ వుండేది. పగలంతా మేతకు వెళ్ళి సాయంత్రానికి తిరిగి గూటికి చేరుకునేది. కొన్నాళ్ళకు ఆ పక్షి గుడ్లు పెట్టి పొదిగి ఆరు పిల్లలకు జన్మనిచ్చింది. వాటిని ఎంతో అల్లారుముద్దుగా పెంచసాగింది. కష్టపడి వాటికి తిండి సమకూర్చి బతికించుకుంటోంది. పగలంతా మేతకు వెళ్ళి రోజూలాగే సాయంత్రానికి గూటికి చేరి తెచ్చిన మేతను పిల్లలకు తినిపిస్తూ ఎంతో సంతోషంగా వుండసాగింది.
ఇలా కొన్ని రోజులు గడిచిపోయింది పిల్లలు కాస్త పెద్దవయ్యాయి. ఇక కొద్ది రోజులు గడిస్తే పిల్లలకు రెక్కల బలంతో తిన్నగా ఎగురగలవని సంబరపడిపోయింది పక్షి. రోజూలాగే ఆ రోజు కూడా మేతకు వెళ్ళింది. సాయంత్రానికి తిరిగి వచ్చేపాటికి ఆరు పిల్లల్లో ఒక పిల్ల కనిపించలేదు. పక్షికి గుండెల్లో గుబులు పుట్టింది ''నా బిడ్డ ఏమైనట్టు? ఎక్కడికి వెళ్ళినట్టు అర్థం కాలేదు?'' అని తీవ్రంగా ఆలోచిస్తూ చుట్టూ వెదికింది ఎక్కడ కనిపించలేదు. పక్షి చాలా బాధపడుతూ దుఃఖించింది. పిల్ల మీద బెంగతో తినకుండానే వుండిపోయింది.
మరుసటి రోజు తిరిగి ఎప్పట్లాగే మేతకు వెళ్ళింది. ఐనా కూడా తన మనసంతా గూటిలో వున్న పిల్లల వైపే వుంది. తొందరగా మేత సేకరించుకుని చకచకా గూడుకు చేరుకునే సరికి నాలుగు పిల్లలే వున్నాయి మరింత ఆశ్చర్యపోయింది. ''అయ్యో దేవుడా నా పిల్లలు ఒక్కొక్కటి మాయమై పోతున్నాయి ఏం చేసేది నా పిల్లలకు రక్షణ లేకపోయిందే'' అంటూ బోరుమంది. తిరిగి ఆ చెట్టు పరిసర ప్రాంతమంతా వెతికి చూసింది ఎటువంటి ఆనవాళ్ళు కనిపించలేదు ''ఏ జంతువైనా తినేసి వుంటే కనీసం ఈకలైనా కనిపించేవి వాటి శరీర భాగాల్లో ఏ ఒక్కటైనా కనిపించి ఉండేవి'' అని పలు విధాలుగా ఆలోచించింది పక్షి.
ఇలా కాదని రెండు రోజులకు సరిపడా మేత సమకూర్చుకుని ఎవరికి కానరాకుండా చెట్టు పక్కనే పొంచి కూర్చుని చూడసాగింది. ఆ దరిదాపుల్లోకి ఏ జంతువు రాలేదు. ఆ రోజు నాలుగు పిల్లలు క్షేమంగా వున్నాయి. ఆ పక్షికి దిక్కుతోచలేదు అలా రెండు రోజులు కావలి కాచింది. ఏ జంతువు తన గూడు దగ్గరకు రాకపోయేసరికి కాస్త చల్లబడింది పక్షి. తిరిగి మరుసటి రోజు యధాప్రకారం మేతకు వెళ్ళి వచ్చింది. ఈరోజు మూడు పిల్లలే వున్నాయి. మళ్ళీ గుండెలు బాదుకుంది పక్షి. అంతా వెతికింది ఎక్కడ కనిపించలేదు. తోటి మిత్ర పక్షితో చెప్పుకుని బాధపడింది. ''నువ్వు బాధపడకు నీకు ఒక ఉపాయం చెప్తాను. అలా చేస్తే నీ పిల్లలు క్షేమంగా వుంటాయి'' అంది మిత్ర పక్షి. అది చెప్పినట్టే రెండు అలా బయటికి వెళ్ళి చిన్న చిన్న ముళ్ళ కంపల్ని ఏరుకుని గూడు చుట్టూరా చిక్కగా అల్లేసాయి. మరుసటి రోజు తిరిగి ఎప్పటిలాగే మేతకు బయలుదేరి వెళ్ళింది పక్షి.
సాయంత్రం గూటికి చేరేపాటికి అక్కడ జరిగిన దృశ్యాన్ని చూసి ఆశ్చర్య పోయింది. తను లేనప్పుడు సమయం చూసుకుని లోపలికి చొరబడి పిల్లల్ని ఎత్తుకెళుతున్న ఒక పాము పక్షి కంటబడింది. గూడు చుట్టూ ముళ్ళ కంపలను పేర్చడం వలన అది గమనించని పాము పక్షి పిల్లల్ని మింగేయాలని గూడు లోపలికి వెళ్ళబోయింది. ముళ్లు తన మూతికి బలంగా గుచ్చుకోవడం వలన అక్కడే ఆగిపోయింది దానికి రక్తం కారి నొప్పికి విలవిలలాడి పోయింది. ''నీకు సరైన గుణపాఠమే జరిగింది. నీకు కావలసిన మేత ఈ అడవిలో చాలా వున్నా, సులభంగా దొరికే మేత కోసం ఇంకొకరి బాధను అర్థం చేసుకోలేదు. కష్టపడకుండా తేరగా చిక్కింది తినాలని చూస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది'' అంటూ పాముకు గుణపాఠం చెప్పింది పక్షి. ''నన్ను క్షమించు. ఇంకెప్పుడూ ఇలా చేయను'' అని పాము వేడుకోగానే తన మూతికి గుచ్చుకున్న ముళ్ళులను తప్పించి ప్రాణభిక్ష పెట్టి వదిలేసింది పక్షి.
- నరెద్దుల రాజారెడ్డి, 9666016636