Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక అడవిలో సింహం నివసిస్తూ వుండేది. దానికి పొగరు ఎక్కువ యుక్త వయసులో వున్నాననే గర్వంతో వ్యవహరించేది. సాటి జంతువులకు కొంచెం కూడా మర్యాద ఇచ్చేది కాదు. ఎవరూ తనను అడవికి రాజుగా నియమించకపోయినా కూడా తానే రాజునని విర్రవీగేది. నిస్సహాయ స్థితిలో కదలలేక పడున్న ముసలి జంతువులను కూడా చంపి తినేసేది ''మగరాజా! యుక్త వయసులో బాగా శక్తి కలిగి వున్నానని, ఇలా విచక్షణ రహితంగా జీవించడం మంచిది కాదు. మంచి ఉడుకు రక్తంతో వున్నావు. నీ శక్తిని బలాన్ని ఏవైనా మంచి పనులకు ఉపయోగించు. అంతేగాని నన్ను ఎవరూ ఏం చేయలేరనే అహంతో వ్యవహరిస్తే నీకే మంచిది కాదు బాగా ఆలోచించు'' అంటూ హితోపదేశం చేసిన జంతువుల్ని చిత్రహింసలు పెట్టి చంపేది.
ఆ సింహాన్ని చూస్తేనే అడవిలో జంతువులన్నీ భయపడ సాగాయి. ఒకరోజు ఒక దారి మార్గాన వెళుతూ వుంది సింహం. ఒక జింక తన పిల్లలను వెంటబెట్టుకుని మేతకు వచ్చింది. సింహాన్ని చూడగానే జింక భయపడింది. పిల్లల్ని భయంతో తన దగ్గరకు తీసుకుంది. ఐనా వదల్లేదు సింహం ఒక పిల్లను లాక్కుంది. ''మగరాజా! నువ్వు చాలా బలమైనదానివి. నీ నుండి ఎవరూ తప్పించుకోలేరు. పాపం అది పసిబిడ్డ. దాన్ని వదిలెరు కావాలంటే నన్ను తిను నీకు దణ్ణం పెడతాను'' అంటూ వేడుకుంది జింక. ''నేను దేన్ని తినాలనిపిస్తే దాన్నే తింటాన'' అంటూ గర్జించింది సింహం. ''కొంచెమైనా దయ చూపండి. అవి ఇప్పుడిప్పుడే ఈ ప్రపంచాన్ని చూస్తున్నాయి. అంతలోనే దాని ప్రాణాల్ని తీసేస్తే అది నీకే మంచిది కాదు, ఆలోచించండి'' అంటూ మరొక్కసారి వేడుకుంది జింక. ఐనా వినకుండా జింక పిల్లను నోట కరుచుకుని చెట్ల మాటుకు వెళ్ళిపోయింది సింహం. జింక చాలా బాధపడింది కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
ఒకరోజు అడవిలో జంతువులన్నీ చేరి ఒకచోట రహస్యంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నాయి ''గర్వంతో సింహం చేసే ఆగడాలు మితిమీరి పోయాయి. మనందరం ఇలాగే వుంటే దాని అహంకారానికి బలైపోతాం. ఎలాగైనా దాని పొగరు అణచాలి'' అంది ఏనుగు. ''దానికి భయపడి బయట తిరగడమే మానేసాము. ఆహారం దొరకక కొన్ని జంతువులు ప్రాణాలు కోల్పోయాయి. ఏదైనా ఉపాయం ఆలోచించండి'' అంది దుప్పి. అన్ని చర్చించుకున్న తర్వాత ఈ బాధ్యతను నక్కకు అప్పగించాయి.
నక్క బాగా ఆలోచించింది సింహం కదలికలను పసిగట్టింది. అది వున్న స్థానాన్ని బాగా గమనించింది. ఒకరోజు బాగా పొద్దుపోయాక అక్కడికి తనతో పాటుగా ఇంకా ముగ్గుర్ని తీసుకెళ్ళింది నక్క. సింహం బాగా నిద్రలో వుంది. పక్కనే ఉన్న రాతి బండను ఆ నాలుగు కలిసి సింహం కాళ్ళపై పడేలా తోసి పారిపోయాయి. బండ కింద సింహం కాళ్ళు ఇరుక్కున్నాయి. ఎంత లాగినా కూడా బయటికి రాలేదు. అలా ఒకరోజు గడిచిపోయింది ఎవరు కూడా అటు పక్కకి వెళ్ళకపోవడంతో సింహం ఆహారం లేక బాగా నీరసించింది ''నన్ను ఎవరు రక్షించేవారే లేరా'' అంటూ తనకు తానే అనుకుని ఏడ్చుకుంది.
ఒకరోజు సాయంత్రం జంతువులన్నీ అడవి నుంచి బయటకు పారిపోతున్నాయి ''పారిపోండీ అడవికి ఎవరో నిప్పు పెట్టారు అది అడవి మొత్తం వ్యాపిస్తోంది. మనం ఇక్కడే వుంటే మాడి మసైపోతాం'' అంటూ నక్క అరుస్తుంటే జంతువులన్నీ పారి పోతున్నాయి. సింహానికి భయం పుట్టుకుంది. ప్రాణ బీతి కలిగింది ''కాపాడండీ'' అంటూ ఏడ్చి మొత్తుకుంటున్నా, ఎవరూ పట్టించుకోలేదు. బండ కింద ఇరుక్కుపోయిన కాళ్ళు ఎంత లాగినా బయటికి రాలేదు. దగ్గరగా వెళుతున్న నక్కను ప్రాధేయపడింది ''మిత్రమా నన్ను కాపాడు, భయంగా వుంది'' అంటూ ఏడ్చింది సింహం. ''ప్రాణభయం అంటే ఏంటో ఇప్పుడు తెలిసిందా? యుక్త వయసులో వున్నాను కదాని విర్రవీగావు. ఇప్పుడేమైంది నీ శక్తి. ఎల్లప్పుడూ సమయం నీవైపే వుండదు. నీ బలాన్ని శక్తిని పదిమంది మంచి కోసం ఉపయోగించు. నిన్ను దేవుని లెక్కన కొలుస్తారు. నీకు బుద్ధి చెప్పడం కోసమే మేమందరం కలిసి ఈ పని చేశాం. అడవికి నిప్పు ఎవరూ పెట్టలేదు. ఇకనైనా మంచిగా జీవించు'' అంటూ సింహం కాళ్ళపై వేసిన రాతి బండను తోటి స్నేహితుల సాయంతో తొలిగించింది నక్క. సింహం లేచి కూర్చుని ''నన్ను క్షమించండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఇంకెప్పుడూ ఒకరికి హాని చేయను'' అంటూ క్షమాపణ కోరుకుంది సింహం. ఆ రోజు నుంచి మంచి పనులకు శ్రీకారం చుట్టింది.
- నరెద్దుల రాజారెడ్డి, 9666016636