Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫోన్ రింగ్ అవుతోంది వంట గదిలో నుంచి హడావుడిగా వచ్చి ఫోన్ రిసీవ్ చేసింది మీనాక్షి, ''హలో ఎవరూ'' అంటూ అడిగింది. ''హర్షిత వున్నారాండి'' అవతలి నుంచి మగ గొంతు వినిపించింది. ''మీరెవరు?'' అడిగింది మీనాక్షి. ''నా పేరు మోహనండి'' అవతలి నుండి సమాధానం వచ్చింది. ''ఎవరు మోహనా..'' అంటూ కాస్త గట్టిగా అనేపాటికి, ''లైన్లో వుండమను వస్తున్నా'' అంటూ పేరట్లో చెట్లకు నీళ్ళు పోయడం ఆపేసి క్షణాల్లో ఫోన్ ముందు వాలిపోయింది హర్షిత. మీనాక్షి చేతిలోని రిసీవర్ లాగేసుకుని చెవి దగ్గర పెట్టుకుంది. ''హారు మోహన్ ఎలా వున్నావ్? ఇప్పుడేనా రావడం. అక్కడ నీ మెకానికల్ జాబ్ ఎలా వుంది? ఇంతకూ బెంగుళూరుకు ఎప్పుడొస్తావ్'' అంటూ అడిగింది హర్షిత. ''నేను చెప్పేది విను హర్షిత'' అంటూ రిక్వెస్ట్ చేసాడు మోహన్. ''ఆ.. ఏంటీ'' అని అడిగింది. ''నువ్వు అర్జెంటుగా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చెరు'' అనేసి ఉన్నపళంగా ఫోన్ కట్ చేసాడు అతను. వెంటనే బయలు దేరింది హర్షిత. ''ఇంతకూ ఆ మోహన్ ఎవరే'' అడిగింది మీనాక్షి. ''మనం ఆంధ్రాలో ఉన్నప్పుడు పక్కింటి పంకజాక్షి లేదూ.. ఆవిడ కొడుకు'' అంటూ హర్షిత చెప్పగానే, మీనాక్షి మెదడులో బల్బు వెలిగినట్టు ''ఓహౌ ఆ బడుద్దాయా'' అంటూ దీర్ఘించింది అలవాటు ప్రకారం.
హర్షిత తండ్రి ప్రసాద్ కలప పని చేసే సాధారణ ఉద్యోగి. హర్షిత ఒక్కతే కూతురు గారాబంగా పెంచారు. ఆంధ్రాలో వేతనం చాలక సుమారు పదిహేను ఏండ్లుగా బెంగళూరు పరిధిలోని బొమ్మనహళ్ళిలో పని చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఆంధ్రాలో ఉన్న రోజుల్లో పక్కింటి పంకజాక్షి కొడుకు మోహన్ చిన్నతనం నుండి ప్రసాద్ ఇంట్లోనే బాల్యం గడిపేసాడు. హర్షిత, మోహన్ కలిసి స్కూల్‌కు వెళ్ళేవారు. కలిసి భోంచేసేవారు. కలిసి ఆడుకునేవాళ్ళు. మోహన్‌కు తండ్రి లేని కారణంగా చదువు మానేసి అల్లరిగా తిరిగేవాడు. చిన్న చిన్న దొంగతనాలు చేయడం అలవాటైపోయింది. ఒకసారి పోలీసులు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇదే విషయంలో ప్రసాద్, మోహన్ని దండించడంతో అప్పట్నుంచి వాళ్ళ ఇంటివైపు వెళ్ళడం మానేసాడు. అంతలోనే ఆంధ్రాను వదిలి సరిహద్దు రాష్ట్రమైన కర్నాటకలోని బెంగళూరుకు వెళ్ళిపోయాడు ప్రసాద్. సంపాదన ఆలోచనతో ప్రసాద్, చదువు ధ్యాసలో హర్షిత, ఇంట్లో పని హడావుడిలో మీనాక్షి లీనమై పోవడంతో మోహన్ సంగతి మరచిపోయారు.
*******
అనుకోకుండా ఒకరోజు ప్రసాద్‌ను కలిసాడు మోహన్, మొదట తనేనా అని నమ్మలేకపోయాడు ప్రసాద్. పర్సులో దాచుకున్న తన చిన్నప్పటి ఫోటో చూపించాడు మోహన్ ''అరెరే..! భలే బాగా గుర్తు పట్టేసావే ఎంత మారిపోయావురా మోహన్. ఇంతకీ ఇక్కడ ఏం చేస్తున్నావ్'' అడిగాడు ప్రసాద్. ''మెకానికల్ కోర్సు చేస్తున్నాను, ఎగ్జామ్స్ రాయడానికి వచ్చాను. ఇక్కడే ఫ్రెండ్ రూంలో సర్దుకుపోతున్నాను'' అన్నాడు మోహన్. ''సర్దుకుపోవడమేంట్రా చిన్నప్పటి నుండి మా ఇంట్లోనే వుండే వాడివి ఇప్పుడుగాని ఏమైంది వచ్చి వుండరాదు'' అంటూ ప్రసాద్ బలవంతం చేయడంతో చేసేది లేక రూముకెళ్ళి బ్యాగు సర్దుకుని ఉన్నఫళంగా ప్రసాద్ వెంట బయలుదేరి వెళ్ళాడు మోహన్.
ఒక పెద్ద మేడ చుట్టూ గల కాంపౌండ్‌లోకి వెళ్ళారిద్దరూ. అక్కడ వాతావరణం చూసి నివ్వెరబోయాడు మోహన్. ''ఇల్లు అద్దెకు తీసుకున్నారా? ఎంత కడుతున్నారు నెలకు'' అని మోహన్ అడగ్గానే ప్రసాద్ తిన్నగా నవ్వి ''ఇల్లు మనద'' అనేసాడు సింపుల్‌గా.. ఆశ్చర్యంగా చూసాడు మోహన్. మూడంకనాల పాత మిద్దెలో నత్తలా జీవనం సాగిస్తున్న ప్రసాద్ ఇక్కడ హైవే రోడ్డుపై ఫారెన్ కారులా కాపురం సజావుగా దూసుకెళ్తుంటే తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు. అంతలోపే ఆ బంగ్లా ప్రాంగణంలోకి కారు వచ్చి ఆగింది అందులో నుండి హర్షిత దిగగానే ఆశ్చర్యబోయాడు.
ఆమె మోహన్ని చూడగానే ''హారు మోహన్ ఎలా వున్నావ్'' అంటూ దగ్గరకు వస్తున్న హర్షితను చూస్తూ నిలుచుండి పోయాడు. ఒకప్పుడు చింపిరి జుట్టుతో చీరాగ్గా కనిపించే హర్షితను ఏడిపించేవాడు మోహన్. ఇప్పుడు హెయిర్ స్టయిల్ మారిపోయింది. ఎప్పుడూ జలుబు చేసిన ముక్కుతో చీదుకుంటూ వున్న హర్షిత ముఖంలో ఇప్పుడు పాలరాతి నునుపు కొట్టొచ్చినట్టుంది. కలిసి తిరిగి కలిసి భోంచేసిన మోహన్ ఇప్పుడు హర్షిత ముందు నిలబడ్డానికే బిడియపడుతున్నాడు. వచ్చీ రాగానే చేయి కలిపింది. ఒకప్పుడు ఎండిపోయిన ఆకులా పల్చన పడిన చేతులు ఇప్పుడు సుతి మెత్తని దూదిలా వుంటే ఆశ్చర్యబోయాడు.
లోపలికెళ్ళి చూస్తే సప్తరంగులను ఇమిడించినట్టు కొత్త కొత్త డిజైనింగ్‌లతో రంగులద్దిన గోడలు, ప్లాటినం కలర్ టెలివిజన్, రకరకాల బొమ్మలతో అలంకరించబడిన అల్మారా మొత్తం పైన ఆ భవనం చాలా బాగుంది. లోపలి నుండి మీనాక్షి హాలులోకి వచ్చింది. ఇంతకు మునుపు చిరిగిన చీరతో చింపిరి జుట్టుతో అమాయకురాలిగా కనిపించే మీనాక్షి ముఖంలో కళ ఉట్టిపడుతోంది. పట్టుచీర కట్టి నున్నగా తల దువ్వి మూరెడు మల్లెపువ్వులు కొప్పులో మిణుకు మిణుకుమంటుటే మీనాక్షిగారేనా అని సందేహం కలిగింది మోహన్‌కు. అందరూ భోజనానికి డైనింగ్ టేబుల్ ముందు హాజరయ్యారు. ''మోహన్! మీ అమ్మగారు బాగున్నారా? ఊరెళ్ళగానే మేము అడిగామని చెప్పు'' భోజనం వడ్డిస్తూ అంది మీనాక్షి. ఆ మాటకు అతని కళ్ళల్లో నుంచి అప్రయత్నంగానే నీళ్లు రాలిపోతుంటే చూసి ఆశ్చర్యబోయింది మీనాక్షి. ''ఎందుకు మోహన్ ఏడుస్తున్నావ్'' అని అడిగింది. ''అమ్మ చనిపోయి ఏడాది కావస్తోంది'' కన్నీళ్ళు తుడుచుకుంటూ అన్నాడు మోహన్. తన బాధ అర్థమైంది వాళ్ళకు తను ఇప్పుడు ఒంటరివాడు ఐనా కష్టపడి చదువుతున్నాడంటే మోహన్లో చాలా మార్పు వచ్చింది. తనకు మేడపై ఒక గది కేటాయించి ఇక్కడే వుండమన్నారు తప్పనిసరి పరిస్థితుల్లో వుండిపోయాడు.
*******
రోజులు జరగగా హర్షితకు మోహన్ బాగా దగ్గరయ్యాడు ఇద్దరూ కలిసి కారులో తిరగడం మొదలు పెట్టారు. హర్షిత ఆలోచనల్లో మార్పు మొదలైంది. ఒంటరిగా వున్నప్పుడు మోహన్ గురించే ఆలోచించడం మొదలు పెట్టింది. వారి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారిపోయింది. మోహన్ చదువు పరంగా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్ళు తనకు చోటు కల్పించినందుకు కతజ్ఞతలు చెప్పి ఉన్నఫళంగా బ్యాగ్ సర్దుకుని బయలు దేరుతుంటే హర్షిత మనసులో బాధ కన్నీళ్ళ రూపంలో తన్నుకొచ్చింది.
అలా వెళ్ళిపోయిన మోహన్ అప్పుడప్పుడు ప్రసాద్ ఇంటికి ఫోన్ చేసి అందర్నీ పలకరించేవాడు. ఇలా చాలా గ్యాప్ తర్వాత ఒక రోజు ఫోన్ చేసాడు ఊర్లో వున్న ఇల్లు మూడెకరాల మాగాణి అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో చదువుకు ఫీజు కట్టేసానని తను ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యానని వీలు దొరికితే ఎప్పుడైనా వస్తానని మోహన్ చెప్పగానే ప్రసాద్ కుటుంబం చాలా సంతోష పడింది. మోహన్ ఒక స్థాయికి ఎదిగాడనే సంబరంలో ఇద్దరి మధ్యా వున్న ప్రేమ వ్యవహారం తన తండ్రికి చెప్పేసింది హర్షిత. కోపంతో తనను మందలిస్తాడనుకుంది. సానుకూలంగా స్పందించడంతో ఎగిరి గంతేసింది. చిన్నప్పటి నుంచి తన పంచన పెరిగినవాడు తమతోనే కలిసి మెలిసి వున్నవాడు తనకు నా అనేవారు ఎవరూ లేకపోయినా కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకున్నాడని, తన భవిష్యత్తుకు ఒక మంచి మార్గం ఎన్నుకున్నాడని అందులోను చెన్నైలో ఉద్యోగమంటే మాటలా అనుకున్నాడు ప్రసాద్.
ప్రసాద్లో నమ్మకం పొడచూపింది, ఇంతకంటే మంచి గుణం కలవాడు ఉద్యోగం కలవాడు కాబట్టి మన స్టేటస్‌కు ఏ మాత్రం తీసిపోడని ఒక నమ్మకాన్ని గట్టిగా పునాది వేసుకున్నాడు ప్రసాద్. ఎలాగూ హర్షిత మోహన్ ఇద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి పెళ్లి చేసేస్తే ఒక కార్యం ముగించినవాణ్ణి అవుతానని భావించి మోహన్‌కు ఫోన్ కలిపి తన అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నాడు ప్రసాద్. తను సరే అనడంతో పూర్తి విషయాన్ని మాట్లాడేందుకు బెంగళూరు రమ్మని చెప్పగానే వచ్చి ఫోన్ చేశాడు మోహన్. పేరట్లో నుండి హడావుడిగా వచ్చిన హర్షిత ఫోన్ రిసీవ్ చేసింది. హర్షిత ఎయిర్ పోర్ట్‌కు ఆత్రుతగా బయలుదేరి వెళ్ళింది.
*******
సాయంత్రానికి మోహన్ని ఇంటికి తీసుకుని వచ్చింది హర్షిత. ఈసారి మోహన్ ముఖంలో కళ లేదు ఏదో విచారపు నీడ కమ్మేసింది. తను సోపాలో కూర్చుని కాఫీ తాగుతున్నాడన్న మాటేగాని ఏదో అంతర్మథనం మొదలైంది తనలో.. పెళ్లి విషయం ఇరు పెద్దలు చర్చించుకోవడం ఆనవాయితీ. మోహన్ తరపున బంధువులు ఎవరూ రాలేదు కాబట్టి అన్ని నిర్ణయాలు ప్రసాదే తీసుకున్నాడు. కొంతమంది పెద్దలు కొందరు ఆడవాళ్లతో కార్యం తలపెట్టాడు. పంతులు పంచాంగం పేజీలు ఒక్కొక్కటి తిప్పుతున్నాడు ముహూర్తం కుదరక అప్పుడప్పుడు చేతి వేళ్లు పదే పదే లెక్కపెడుతున్నాడు ''ఈ మాసంలో చెప్పుకోదగ్గ ముహూర్తం లేదండి. రేపు నెల పదిహేను బ్రహ్మాండమైన ముహూర్తం వుంది పెట్టమంటారా'' అడిగాడు పంతులు. ''అలాగే పంతులుగారు'' అన్నాడు ప్రసాద్ వెంటనే. లగపత్రిక రాయడానికి సంసిద్ధమయ్యాడు పురోహితుడు. పెళ్లి ముహూర్తం ఖాయం అయిపోగానే తిరిగి చెన్నైకు ప్రయాణమైనాడు మోహన్.
ఆగమేఘాలపైన పెళ్లి పత్రికలు అచ్చు వేయించాడు ప్రసాద్. ఒకసారి మోహన్ దగ్గరికెళ్ళి పెళ్ళి సంగతులు చర్చించుకుని అలాగే పెళ్ళికి కావాల్సిన బట్టలు వగైరా వస్తువులు కొనుగోలు చేసి వద్దామని అనుకున్నాడు. ముందుగా మోహన్‌కు కాల్ చేసి వెళ్దామని ఫోన్ చేసాడు పని చేయలేదు ఎలాగూ వెళ్తున్నాము కదా అని తను ఇచ్చిన కంపెనీ అడ్రస్ కార్డ్ జేబులో పెట్టుకుని చెన్నైకు కారులో బయలుదేరి వెళ్ళాడు. కంపెనీ దగ్గరకు చేరుకునే పాటికి సాయంత్రం అయింది కార్డులో వున్న అడ్రస్ వేరు తను పని చేస్తున్న కంపెనీ వేరు ఐనా రెండు పక్క పక్కనే వుండడం వలన దొరికింది.
పెద్ద బిల్డింగ్ దానికి ముందు భాగంలో చాలా కార్లు నిలిపి వుంచారు ''ఈ కార్లన్నీ ఇంజనీర్లవి కాబోలు'' అని మనసులో అనుకుంటూ కాస్త ముందుకెళ్ళాడు. ఒక అబ్బాయి ఏదో బెల్ట్ లాంటిది చేతిలో పట్టుకుని ఎదురొచ్చాడు ''బాబూ! మోహన్ వున్నాడా'' అనడిగాడు ప్రసాద్. మోహన్ అనగానే లోపలికి వెళ్ళండి అన్నట్టు చేయి చూపించాడు ఆ అబ్బాయి. నేరుగా లోపలికి వెళ్ళాడు ప్రసాద్ ఆ పక్క ఈ పక్క రెండు స్టాండ్లు బిగించి పైన కారు నిలబెట్టి వున్నారు ఆ కారు అడుగు భాగాన ఏదో రిపేరు చేస్తూ కనిపించాడు మోహన్. మాసిపోయిన దుస్తుల్తో చిందరవందరగా వున్న జుట్టుతో అయిల్ పూసుకుని నల్లగా కనిపిస్తున్నాడు. ఒకతను స్పీడుగా అక్కడికి వచ్చి ''రేరు ఎంతసేపురా పని చేసేది త్వరగా కానిచ్చు షెడ్లో ఇంకా రెండు కార్లు వున్నాయి అవి ఎప్పుడు కానిస్తావ్'' అంటూ అతను మోహన్‌ను పురమాయిస్తుంటే మునుపటి కళ చెదిరిపోయింది ప్రసాద్లో. తిన్నగా వెనక్కి తిరిగాడు ఒకతను ఎదురొచ్చి ''ఎవరి కోసం వచ్చారు'' అని అడిగాడు అతను లోపలి నుండి ఉబికి వస్తున్న బాధని బలవంతాన దిగమింగుతూ వచ్చి విషయం చెప్పాడు ప్రసాద్.
అతను మోహన్‌కు బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. అక్కడున్నది ఇంజనీర్లు కాదు ఇంజన్ రిపేరు చేసే సాధారణ మెకానిక్‌లు చేతిలో స్క్రూ డ్రైవర్ ఆడితేగాని తిండికి సంపాదించలేని పరిస్థితి తన స్నేహితుడు అంతా చెప్పాడు. ''నేను వచ్చిన సంగతి మోహన్ కు చెప్పకు'' అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ వెనక్కి తిరిగాడు ప్రసాద్. కళ్లముందే పెరిగినవాడు కదా తన కళ్ళు కప్పేయడులే అనుకున్నాడు. ఇంటి ముందు ఆడుకున్న వాడు కదా మాతో ఆడుకోడులే అనుకున్నాడు ప్రసాద్.
తన ఆగడాలు భరించలేక వాళ్ళమ్మ మనో చింతనతో కన్ను మూసిందట. దూరపు కొండలు నునుపు అనిన మాట స్పురణకు వచ్చింది తనకు. చాలా మదనపడ్డాడు. ఈ విషయం ఇంట్లో తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పెళ్ళి పత్రికలు అందరికీ పంచేసారు పెళ్ళి వారం రోజులే వుంది ఒక్కసారి ఆలోచించారు అందరూ. ఇప్పటికే లక్ష రూపాయల దాకా ఏవో కుంటి సాకులు చెప్పి లాగేసుకున్నాడు మోహన్. పైగా తన అల్లుడు ఇంజనీర్ అని ఊరంతా చాటింపేసుకున్నాడు ప్రసాద్. ఇక చేసేది లేక ఎలాగు వంటరివాడు తను తోడు నీడ లేనివాడు వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలంటారు మోహన్ ఆడింది కూడా అబద్ధమే జరిగిందేదో జరిగిపోయింది, మాట ప్రకారం హర్షితను మోహన్‌కు ఇచ్చి పెళ్ళి చేస్తే ఒక అనాధకు జీవితం ఇచ్చినవాన్ని అవుతానని జీవితంలో ఇంతకన్నా పుణ్యం మరొకటి లేదని భావించి పెద్దమనసుతో హర్షితను మోహన్‌కు ఇచ్చి వివాహం జరిపించాడు. తను తప్పు చేసినా కూడా ప్రసాద్ చూపిన దయకు మోహన్ పశ్చాత్తాపం చెందాడు.
- నరెద్దుల రాజారెడ్డి, 966601663