Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజీ, సింధు, సమత ముగ్గురు మంచి స్నేహితులు. ముగ్గురు కలిసి మెలిసి ఉంటారు. బడిలో పాఠాలను ఎంతో శ్రద్ధగా వింటారు. ఇంటికి వెళ్ళిన తరువాత బోలెడు పనులు చేస్తారు. అమ్మానాన్నలు పనులకు వెళ్లి వచ్చే సరికి ఇంటి పనంతా చేసి, బడిలో చెప్పిన హోం వర్క్ చేసుకుంటారు. అందుకే టీచర్లకు వాళ్ళంటే చాలా ఇష్టం.
వీళ్ళ తరగతిలో జయ అనే అమ్మాయి కొత్తగా చేరింది. జయ అమ్మా నాన్న హైదరాబాద్‌లో పని కోసం వెళుతూ, అమ్మమ్మ గారి ఊరిలో ఉన్న ఈ బడిలో చేర్పించారు.
బడిలో రాజీ, సింధు, సమతతో స్నేహం కుదిరింది. కానీ వాళ్ళను టీచర్లు ఎప్పుడూ మెచ్చుకోవడం చూసి తట్టుకోలేక పోయింది. ఎలాగైనా వీళ్ళ మధ్య గొడవ పెట్టాలనుకుంది.
ఓసారి జయ అమ్మ, నాన్న జయకు రకరకాల బొమ్మలు పంపించారు. వాటిల్లోవి తెచ్చి రాజీ, సింధు, సమతకు ఒకరికి తెలియకుండా మరొకరికి ఇచ్చింది. దాచుకొమ్మని, ఎవరికీ చూపొద్దని, అవి చూసి వాళ్ళు అసూయ పడతారని చెప్పింది.
వాళ్ళలో సమత ''మాకు అలాంటి దాపరికాలు లేవని, మాలో ఎవరికి ఏమి ఇచ్చిన ఒకటే. అలా దాపరికాలు వుంటే మంచి స్నేహం అనిపించుకోదు'' అని చెప్పింది. ఆ మాటతో జయ మొహం మాడ్చుకుంది. సమత మీద కక్ష పెంచుకుని సమయం కోసం ఎదురు చూడసాగింది.
స్కూల్లో పిక్నిక్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దాని కోసం పిల్లలను కొంత డబ్బు తెచ్చుకొమ్మని చెప్పారు. రాజీ, సింధూ తెచ్చి ఇచ్చారు. కానీ సమత ఇంట్లో సమయానికి డబ్బులు లేకపోవడం వల్ల తేలేకపోయింది.
జయ వాళ్ళ అమ్మమ్మ తాతయ్యను అడిగి చాలా డబ్బు తెచ్చుకుంది. క్లాస్ టీచర్‌కు ఎంతివ్వాలో ఇచ్చింది. మిగిలిన డబ్బులు కంపాస్ బాక్స్‌లో దాచుకున్నట్టు చేసి, ఎవరూ చూడకుండా సమత బ్యాగులో పెట్టేసింది.
సాయంత్రం స్కూల్ అయిపోయే ముందు టీచర్ దగ్గరకు వెళ్ళి తన కంపాస్ బాక్స్‌లో దాచుకున్న డబ్బు పోయిందని చెప్పింది.
''నీ డబ్బు ఎక్కడికీ పోదు. అందరి బ్యాగులను వెతుకుదాం'' అనీ బ్యాగులన్నీ తన దగ్గర వరుసగా పెట్టించింది. పిల్లలందరినీ పిలిచి ''ఇతరుల వస్తువులు దొంగిలించకూడదు. చిన్న పెన్సిల్ ముక్కయినా అనుమతి లేకుండా తీసుకోవడం చాలా తప్పు. అలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు.''
కానీ మన తరగతిలో జయ డబ్బులను ఎవరో తీశారట మరి. అలా చేయడం తప్పు కదా! ఒక్కొక్కరిని వరుసగా పిలుస్తాను. నిజాయితీగా వచ్చి మీ బ్యాగ్ నా ముందే తెరిచి చూపాలి. మీరంతా సిద్ధమేనా అడిగింది. సరే టీచర్ అన్నారు పిల్లలంతా..
వాళ్ళందరి ముఖాలు చూసింది టీచర్. ఎవరో ఆ దొంగ తెలుసుకోవాలని ఉత్సాహంగా కనిపించారంతా. జయ వైపు చూసింది. డబ్బు పోయిన బాధ లేకుండా మిగతా వాళ్ళ కంటే ఎక్కువ సంతోషంగా ఉండటం మాటిమాటికీ ముగ్గురు స్నేహితుల వైపు చూడటం గమనించింది. వెంటనే పిల్లలతో ''ముందు నేను చెక్ చేస్తాను'' అంటూ పిల్లలందరినీ తరగతి బయటే వుండండని చెప్పి, ఒక్కొక్కరి బ్యాగ్ వెదకసాగింది. సమత బ్యాగ్ లోపల డబ్బులు కనిపించడంతో టీచర్ ఉలిక్కి పడింది. ఆ అమ్మాయి అలాంటిది కాదని తనకు తెలుసు. మరి ఈ డబ్బు ఇందులోకి ఎలా వచ్చిందో ఆలోచించింది. ఎంతో లెక్క పెట్టి అంతే డబ్బు తన పర్సు లోనుంచి తీసి జయ బ్యాగ్‌లో పెట్టి బయటకు వచ్చింది. ''అయినా నేనెందుకు చూడటం మీరే చూపించండి'' అంటూ పిల్లలందరినీ పిలిచి గుండ్రంగా కూర్చోబెట్టింది.ఆ తర్వాత ఒక్కొక్కరు వచ్చి అందరి ముందు వాళ్ళ బ్యాగును తెరిచి చూపించమంది. అలా చేస్తూ వుంటే సమత వంతు వచ్చింది. తన బ్యాగ్ దులిపేసరికి అందులో నుండి డబ్బులు కింద పడ్డాయి. వాటిని చూసి పాముని చూసి భయపడినంతగా బెదిరిపోతూ ''టీచర్! నేను తీయలేదు టీచర్!'' అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. అందరూ సమత వైపు దోషిగా చూస్తుంటే తట్టుకోలేక పోతోంది ఆ పసి హదయం. జయ లేచి ''టీచర్! పిక్నిక్ కోసమే తీసుకుని వుంటుంది. నేను అడిగి ఇస్తానంటేనేమో వద్దంది. ఇప్పుడేమో ఇలా చేసింది. అని ఇంకా ఏవేవో చెప్పబోతుంటే ''ఇంకా అందరివి చూడటం కాలేదుగా జయా! అందరివీ చూద్దాం'' అంటూ మిగిలిన వారందరి బ్యాగులను దులిపించ సాగింది.
చివర్లో ''జయా! నీ బ్యాగ్ కూడా దులుపు'' అనగానే 'పోయినవి నా డబ్బులేగా టీచర్! నా బ్యాగ్‌లో ఎందుకుంటాయి? అంది.
''సరే కానీ అమ్మడూ! నువ్వు కూడా దులిపి చూపించు అందరిలా''
''ఎందుకు దులపను టీచర్! ఇదిగో'' అంటూ బ్యాగ్ ను అందరి ముందు నవ్వు మొహంతో తీసుకుని వచ్చి దులప సాగింది. లోపలి నుండి డబ్బులు కింద రాలేసరికి తెల్లబోయింది. అందరిలో ఆశ్చర్యం. ఆనందం. సమత దొంగ కానందుకు. మరి సమత బ్యాగులోకి డబ్బులెలా వచ్చాయో?'' అర్థం కాలేదు.
సమత వచ్చి 'టీచర్! ఈ డబ్బులు నావి కావు టీచర్ ! పొరపాటున ఎవరైనా వాళ్ళ బ్యాగ్ అనుకొని, నా బ్యాగ్‌లో పెట్టారేమో తెలుసుకోండి టీచర్! అని ఏడుస్తుంది.
ఏడుస్తున్న సమతను దగ్గరకు తీసుకొని ''చూశారా ! సమత నిజాయితీ, జయ డబ్బు దొరికిందని తెలిసి కూడా తనవి కాని డబ్బుల గురించి ఎంత భయపడుతుందో! ఇలా సమతలా నిజాయితీగా ఉండాలి మీరంతా''
''ఈ డబ్బు ఎవరిదో రేపు తెలుసుకొని చెబుతా! అమ్మడూ! అవి నీ దగ్గరే ఉంచు'' అంటున్న టీచర్ మాటలకు అడ్డొచ్చి ''అమ్మో వద్దు టీచర్! పరుల సొమ్ము పాము వంటిదని మీరు ఎన్నో సార్లు చెప్పారు. పాపం ! ఈ డబ్బు ఎవరిదో? ఇచ్చేయండి. ఇంటికెళితే వాళ్ళ అమ్మా నాన్నలు కోపం చేస్తుండొచ్చు'' అంటున్న సమత గొప్ప మనసు ముందు వెలవెల బోయింది జయ.
ఇంటికి వెళ్ళేటప్పుడు సమత చేతులు పట్టుకుని ''తప్పైందని'' క్షమాపణ కోరింది.
''జయకు ఇది మంచి పాఠమే కాదు. గుణపాఠం కూడా! ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయదు'' అనుకుంటూ సమత ఇచ్చిన డబ్బులను టీచర్ పర్సులో పెట్టుకుంది.
- వురిమళ్ల సునంద, 9441815722