Tue 14 Apr 00:09:45.702506 2015
Mon January 19, 2015 06:51:29 pm
సాహిత్య సభలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య
విశాఖపట్నం : ప్రపంచీకరణ అన్న నినాదం పుట్టి 25ఏళ్లు పూర్తయిందని, పార్లమెంట్‌కు ఎన్నిక కావడానికి రూ.కోట్లు కావాల్సిన పరిస్థితిని ప్రపంచీకరణ తెచ్చిపెట్టిందని ప్రముఖ విద్యావేత్త ఉద్ఘాటించారు. ప్రపంచంలో ప్రజల సంపదను ధ్వంసం చేసేంతగా ఈ ప్రపంచీకరణ విధాన ఫలాలున్నాయని అన్నారు. సోమవారం సాయంత్రం వైజాగ్ ఫెస్ట్-2015లో భాగంగా గురజాడ సాహిత్య వేదికపై 'ప్రపంచీకరణ- సంస్కృతి' అన్న అంశంపై జరిగిన కవితా సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అపారమైన ప్రకృతి వనరులు, సంపదపై ప్రజలకు హక్కులేకుండా చేసే ప్రపంచీకరణతో అనేక దేశాలకు నష్టం జరిగిందన్నారు. గతంలో మన్మోహన్ సింగ్ మౌనంగా ఉండి ప్రజలను ప్రపంచీకరణకు అప్పగిస్తే... నేడు మోడీ ప్రపంచం అంతా తిరుగుతూ మరింత వేగంగా ప్రపంచీకరణ విధానాలకు ఆజ్యం పోస్తున్నారన్నారు. వామపక్ష పార్టీలు ఈ ప్రపంచీకరణ దుష్పరిణామాలపై అనేకేళ్లుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణ ప్రాంతంలో నేను చిన్నతనంలో ఉండగా 1955 ఎన్నికల్లో బిడి దేశ్ పాండేను ఎంపీగా అత్యంత నిరాడంబరంగా గెలిపించి పంపించామని, నేడు పార్లమెంట్‌కు వెళ్లడానికి రూ.35కోట్లు పైగా ఖర్చుపెడుతున్నవారిని చూస్తున్నామని, ఇదే ప్రపంచీకరణ కల్చర్ అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం నేడు ఆర్థిక నినాదంగా మారిపోయిందన్నారు. పార్లమెంట్‌ను మార్చాలన్నా ప్రజా ఉద్యమాలు తప్పవని ఉద్ఘాటించారు. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో విశాఖపట్నంలో ఫెస్ట్, సిపిఐఎం 21వ మహాసభలకు విశాఖ ఆతిథ్యం పలకడం ముదావహమన్నారు. ఈ వేదికపై కవులు, రచయితలు డాక్టర్ అద్దేపల్లి రామ్మెహనరావు, తెలకపల్లి రవి, ఉప్పలఅప్పలరాజు తదితరులు ప్రసంగించారు. అనంతరం గవిడి శ్రీనివాస్ కవితా సంపుటి వలసపాటను చుక్కారామయ్య ఆవిష్కరించారు.