Fri 17 Apr 20:06:01.60439 2015
Mon January 19, 2015 06:51:29 pm
వైజాగ్ ఫెస్ట్ లో సుద్దాల అశోక్‌తేజ
విశాఖపట్నం : పుస్తకం అంటే వీసా లేకుండా విశ్వ సందర్శనం చేయించే అద్భుతమైన పుష్పక విమానమని సుప్రసిద్ధ సినీ గేయ రచయిత డాక్టర్ సుద్ధాల అశోక తేజ అభివర్ణించారు. వైజాగ్ ఫెస్ట్ ప్రాంగణంలోని గురజాడ సాహిత్య వేదికపై ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అశోక తేజ తన బాల్య జ్ఞాపకాలను, పుస్తకాలతో పెనవేసుకున్న అనుబంధాన్ని వల్లె వేసుకున్నారు. పుస్తకాలను శ్వాసిస్తూ పుస్తకాల్లో జీవిస్తున్న రచయితల కులం నుంచి వచ్చినవాడిగా పుస్తక ప్రాంగణంలో సందర్శకుల తాకిడికి తాను ఉబ్బి తబ్బిబ్బవుతున్నట్లు చెప్పారు. పుస్తకం క్రీస్తు పూర్వ నాటి సంగతులు, వర్తమాన పరిస్థితులు, రాబోయే కాలంలో పరిణామాలను శాస్త్రీయమైన ఊహాజనిత శక్తితో చూపించే అద్భుత గవాక్షాలని ఆయన పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా సుద్ధాల తన స్వగ్రామమని, తన ఇంట్లో చిన్నప్పుడు ఒక మంచి పుస్తకాన్ని తీసుకొని అందరు చదివేవారమని గుర్తు చేసుకున్నారు. ఫ్యూచర్ షాక్ తనకు నచ్చిన పుస్తకాల్లో ఒకటన్నారు. ఇటీవల రంగనాయకమ్మ కలం నుంచి జాలువారిన ఇదే భారతం తనను బాగా ప్రభావితం చేసిందన్నారు. 'నాన్న హనుమంతు (ప్రజాకవి, గాయకుడు), అమ్మ జానకమ్మ నేను బాల్యంలో నిదురించే ఉయ్యాలకు సుత్తి, కొడవలి ఉన్న ఎర్రజెండా వేలాడదీసేవారు. బొమ్మలుకొని వేలాడదీసే ఆర్థిక స్తోమత లేకపోవడమే కారణం. ఆ ఎర్రజెండా ప్రభావం నాపై ఉగ్గుపాల నుంచి ఉంది.' అని ఆయన చెప్పారు. తాను ఇంటర్మిడియేట్ చదిలే రోజుల్లో శని, ఆదివారాల్లో భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవాడినని అప్పట్లో రాసిన పాటను గుర్తుచేసుకున్నారు. మాక్సిమ్ గోర్కీ అమ్మ, ప్రేమ్ చంద్ రంగభూమి, తెన్నేటి హేమలతా దేవి, తదితర ఎన్నో రచనలు తన జీవితంపై గాఢంగా ప్రభావం చూపాయన్నారు.
సిపిఎం తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ మానవుడి కార్యాచరణే నిజమైన విజ్ఞానమన్నారు. ప్రతి ఒక్కరి జీవితంపైనా పుస్తకం ప్రభావం కచ్చితంగా ఉంటుందని, ఎవరి అభిరుచులను బట్టి వారి పుస్తకాల సేకరణ, పఠనం ఉంటాయన్నారు. ప్రజాశక్తి బుక్ హౌస్ జనరల్ మేనేజర్ లక్ష్మయ్య, హైదరాబాద్ బుక్ ఫెయిర్ కార్యదర్శి చంద్రమోహన్, వైజాగ్ బుక్ ఫెస్ట్ అధ్యక్షుడు హిమాంశు ప్రసాద్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. పర్సా సత్యనారాయణ రచించిన 'నేను నా జీవితం' ఇంజనీరింగ్ విద్యార్ధి, క్యాస్ట్రో కిరణ్ రచించిన 'వెన్ మినిట్స్ వెంట్ లైక్ సెకండ్స్ అండ్ హవర్స్ వెంట్ లైక్ డేస్' పుస్తకాలను ఈ సందర్భంగా అతిథులు ఆవిష్కరించారు.