Thu 16 Apr 14:43:56.589842 2015
Mon January 19, 2015 06:51:29 pm
కార్టూన్ చిత్రాల విజేతలకు బహుమతులందజేసిన రాఘవులు
విశాఖపట్నం : ఉత్తరాంధ్ర విశిష్టతను, సంస్కృతి సంప్రదాయాలను చాటిచెప్పేందుకు నిర్వహించిన వైజాగ్ ఫెస్ట్ 2015కు వచ్చిన స్పందన అపూర్వమని, ఈ ఫెస్ట్ యువతలో మార్పునకు సంకేతమని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు అభిప్రాయపడ్డారు. చిన్నా పెద్దా తేడాలేకుండా వైజాగ్ ఫెస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ సంతోషంగా గడుపుతున్నారని చెప్పారు. వైజాగ్ ఫెస్ట్ లో భాగంగా చార్లీచాప్లిన్ ఇంటర్నేషనల్ థియేటర్లో ఏర్పాటు చేసిన కార్టూన్ ప్రదర్శనలోని విజేతలకు గురువారం బహుమతులు ప్రదానం చేశారు. మొదటి, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన వారి పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాఘవులు మాట్లాడుతూ... సిపిఎం 21వ అఖిల భారత మహాసభ సందర్భంగా ఈ ఫెస్ట్ ఏర్పాటు చేసినట్లు, ఇతర ఏ పార్టీలు ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించలేవని చెప్పారు. ఫెస్ట్ లో యువత ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, వారు తరలిరావడం మార్పునకు సంకేతమని అన్నారు. ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం మహాసభలో చర్చిస్తున్నట్లు, అందరినీ కలుపుకుని సమస్యలపై పోరాడతామని అన్నారు. భవిష్యత్ కార్యచరణపై మహాసభలో చర్చలు సాగుతున్నాయన్నారు. సాహితీవేత్త తెలకపల్లి రవి కథలు, నవలల పోటీల్లో విజేతలను ప్రకటించారు. అనంతరం నా కలం ప్రజాగళం అనే పుస్తకాన్ని రాఘవులు, అజయ్‌శర్మ తదితరులు ఆవిష్కరించారు.
కార్టూన్ చిత్రాల విజేతలు : మొదటిప్రైజ్ స్రానజెరి (చెక్ రిపబ్లిక్), సెకండ్ ప్రైజ్ లస్డచిమేకర్ (బెల్జియం), మూడో ప్రైజ్ థక్కర్ వివేక్ (ముంబై) దక్కించుకున్నారు. కన్సొలేషన్ ప్రైజ్‌ను ఇరాన్, బెంగళూరు, తిరువనంతపురం వారు దక్కించుకున్నారు. మొదటిప్రైజ్ రూ.25 వేలు, రెండోప్రైజ్ 15 వేలు, మూడో ప్రైజ్ 10 వేల నగదు బహుమతిని అందుకున్నారు.