Tue 14 Apr 19:43:49.652024 2015
Mon January 19, 2015 06:51:29 pm
సేంద్రీయ ఉత్పత్తులపై ఫెస్ట్ లో అవగాహన
చిరుధాన్యాలతో మేలంటున్న రైతులు
విశాఖపట్నం : మన పూర్వీకులు అంబలి, రాగి జావ, తోప.. ఇలాంటి బలవర్ధకమైన పిండి పదార్థాలు తిని ఎంత దృఢంగా ఉండేవారో.. ఇప్పటికీ మన తాతయ్యలు, బామ్మలు సందర్భానుసారంగా వివరిస్తూనే ఉంటారు. అయితే కాలానుమార్పులకు అనుగుణంగా ప్రకృతిపరమైన పంటల్లోనూ అనేక మార్పులొచ్చాయి. సీడ్స్ విత్తనాలు, కృత్రిమ పంటలు పెరిగిపోయాయి. దీంతో సగటు మానవుని ఆయుష్షు పరిణామం గతంలో కంటే తగ్గిందని వైద్య నిపుణులు అనేక సర్వేల్లో వెల్లడించారు. ఈ నేపథ్యంలో కృత్రిమ పంటల వల్ల నష్టాలపై, ప్రకృతిపరమైన చిరుధాన్యాలపై ఎన్జిఓ సంస్థలు రైతులను చైతన్యపరిచేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. అలాంటి ప్రయత్నమే వైజాగ్ ఫెస్ట్ లో ఏర్పాటైన ఎస్వీడిఎస్-సబల ఎన్జిఓ సంస్థలు చేస్తున్నాయి. రైతులను చైతన్యపరచడమేగాకుండా ప్రజల్లోనూ మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ స్టాల్లో వర్లు, ఊదలు, సామలు, ఘంట్లు, స్కూళ్లు, తెల్లజొన్నలు, గోధుమలు, అమిసలు, పచ్చజొన్నలు, తెల్ల,ఎర్ర కొర్రలు లాంటి 20 రకాల చిరుధాన్యాల ప్రాధాన్యతను, వాటి వల్ల కలిగే శారీరక దృఢత్వాన్ని తెలియజేస్తున్నారు. ఆ సంస్థల సభ్యురాలు, మహిళా రైతు చల్లయమ్మ మాట్లాడుతూ.. రైతులను చైతన్యపరిచి నేరుగా వారే విత్తనాలు తయారు చేసుకునేలా కృషి చేస్తున్నామని చెప్పారు. సేంద్రీయ ఉత్పత్తులే ఆరోగ్యానికి మేలు చేస్తాయని, వీటిని పూర్వకాలంలో ఎక్కువగా ఉపయోగించేవారని తెలిపారు. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసిన ఈ చిరుధాన్యాలను, ప్రకృతిపరమైన రాగి సేమియాలు, జొన్న సేమియాలు తమ స్టాల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.